April 18, 2024

మండా సుధారాణి

రచన, ఇంటర్వ్యూ: విశాలి పెరి

sudha

శ్రీమతి మండా సుధా రాణి గారు..  ఇప్పటి సంగీత విదుషీమణులలో అగ్రగణ్యురాలు. పల్లవి పాడటంలో ప్రవీణురాలు.  ప్రస్తుతం విశాఖలో ఎందరో సంగీత అభ్యాసకులకు మార్గదర్శిగా ఉంటున్నారు.

ఈవిడ 1964 లో విజయనగరం లో శ్రీమతి కల్యాణి, రమణ మూర్తి గార్ల దంపతులకు ఆ వీణాపాణి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడుతొన్న వసంత పంచమి నాడు జన్మించారు. విజయనగరం మహరాజా కాలేజి నుండి బి.ఎస్.సి. పట్టభద్రులైనారు. ఆ తరువాత  ఆంధ్ర యూనివర్సిటిలో సంగీత డిప్లమా చేసి డీస్టిన్షన్ లో పాస్ అయ్యారు. 1993 లో  ఎం.ఏ మ్యూజిక్ లో ఆంధ్ర యూనివర్సిటి ఫస్ట్ వచ్చారు.  వీరు ప్రాధమిక స్థాయిలో శ్రీమాన్ కె.రంగాచార్యులు, శ్రీమతి శేషుమణిగార్ల వద్ద సంగీత అభ్యాసము చేశారు. అటు పిమ్మట శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు గారి వద్ద శిష్యరికము చేశారు. 1989 లో డాక్టర్. రామ్ ప్రసాద్ గారితో వివాహమైనది. వారికి ఒక అమ్మాయి పేరు ప్రత్యూష శృతి రవళి.   వారి అమ్మాయి తల్లికి తగిన తనయ. సంగీతములోనూ ఆవిడనే అనుసరిస్తోంది.

ఒకే సమయములో ఖండగతిలో ఘాతలు వేస్తూ చతురస్ర క్రియలతో తాన వర్ణాన్ని రెండు కాలాలలో పాడటములో ఆవిడ నిపుణురాలు. ఇలాంటి ప్రక్రియలు చేయాలంటే మనసుకు, మెదడుకు మద్య చాలా వతిరేకత ఉంటుంది. దాన్ని అధికమించి ఇటు మనసును, మెదడును ఆధీనములో ఉంచి ఇలాంటి ప్రయోగము చేసిన సవ్యసాచి సుధారాణి గారు.

 

గతి, తాళాలమీద వీరికి ఈ మహాధికారం ఉండడంవల్లే, పద్దెనిమిదేళ్ళ పినవయసులోనే   మద్రాసు సంగీత అకాడమీ నుంచి పల్లవి పాడడంలో అవార్డు పొందారు. పందొమ్మిదేళ్ళ వయసులో చెన్నైలోని శ్రీ కృష్ణ గాన సభవారు  వీరి పల్లవి గానానికి అవార్డుని ప్రదానం చేశారు. 1987, 1992లలో కనె్సర్ట్ అవార్డులను మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి పొందారు.

అందరికీ తెలిసిన ప్రఖ్యాతి గాంచిన రాగాలలోనే కాకుండా చాలా తక్కువ మందికి తెలిసిన అపురూపమైన రాగాలలో ఎన్నో కృతులు పాడి వీరికి వీరే సాటి అని నిరూపించుకున్నారు. ఇటువంటి ప్రయోగాలతో ఆవిడ కచేరీలకు  ఒక ప్రత్యేకత ఏర్పడింది.


కర్ణాటక సంగీతంలో రెండు ముఖ్యభాగాలు. మొదటిది సాహిత్యంతో కూడిన రచనలను గానం చేయడం (అప్లైడ్ మ్యూజిక్), రెండవది సాహిత్యం లేకుండానే చేసే రాగాలస్వరాలు ప్రస్తారం (ప్యూర్ మ్యూజిక్). ఈ రెండింటిలోనూ కళాకారుని మనోధర్మం, వ్యక్తిత్వం ప్రకటిత మౌతుంటాయి. చిన్న చిన్న గమకాలతో, ఆలాపనలతో మేళకర్త రాగాల నుండి మరెన్నో రాగాలు పుట్టించవచ్చు అని వారి అభిప్రాయము. ఇలా కొత్త రాగాలు కనిపెట్టాలంటే మాత్రం ఎల్లప్పుడు సంగీత సాధన చేస్తూ ఉండాలని ఆవిడ స్వయం గా చిన్నారులతో చెప్పారు.

‘మనోధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం’ అన్న విషయంపై సమగ్రమైన రచన చేసి దాన్ని భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ మరియు సాంస్కృతిక శాఖలకు సమర్పించి దానికి గాను ఫెలోషిప్ని సంపాదించారు.

 

1980 లో వీరు ఆకాశ వాణి కళాకారిణిగా ఎంపికైనారు. 2009 లో టాప్ ఏ గ్రేడ్ గాయని గా గుర్తించబడ్డారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో సార్లు ” సంగీత శిక్షణ ” కార్యక్రమాలు నిర్వర్తించారు. మరెన్నో సార్లు “భక్తి రంజని” లో పాడారు. టి.టి.డి వారి నాద నీరాజనము లో కూడా శిష్యులతో కలిసి ఆ దేవదేవుడికి స్వరాభిషేకము చేశారు.  సుధా రాణి మన దేశములోనే కాక  కాక అమెరికాలోని క్లీవ్ల్యాండ్, క్యాలిఫోర్నియా (సిలికాన్ ఆంధ్ర), సియాటిల్, షికాగో, డెట్రాయిట్, ర్యాలీ, కాన్సాస్ సిటీ, కొలంబస్ లలో  కచ్చేరీలు చేశారు.

 

కచేరీలు ఇవ్వడమే కాదు సుధరాణి గారు  ఎన్నో సెమినార్ లు కూడా ఇచ్చారు. తెలుగు యూనివర్సిటి వారిచే నిర్వహింప బడిన సెమినార్ లో ” షట్ కళా పల్లవి” అనే అంశము పై సెమినార్ ఇచ్చారు.

 

‘ శ్యామ శాస్త్రి గారి స్వరజతుల ‘  మీద ఒక సెమినార్  ఆంధ్రా యూనివర్సిటిలో  నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మూజిక్ లో ఇచ్చారు. త్యాగరాజ ఆరాధనోత్సవాలలో “ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి సంగీతం ‘ గురించి గోష్ఠి  ఇచ్చారు.

 

 

అవార్డులు బిరుదులు :

 

‘ గాన కళా భారతి ‘ — శ్రీ భారతి గాన సభ ( అమాపురం 2000)

‘ సునంద సుధా నిధి ‘—  గాయక సార్వభౌమ సంగీతం పరిషత్ (విజయవాడ 2008)

‘ సంగీత సుధా నిధి ‘ — విజయ త్యాగరాజ సభ (విశాఖ పట్టణం 2009)

‘ విజయ సంగీత రత్న ‘—  విజయ నగర్ ఫైన్ ఆర్ట్స్ (హైదరాబాద్ 2006)

 

 

సంగీత కల్పవల్లిగా ఉంటూ ఎందరికో సంగీత శిక్షణ ఇస్తూ గొప్ప విద్వాంసులు గా తీర్చి దిద్దుతున్నారు. “మీ అమ్మాయి మీ సంగీత వారసురాలా? ” అని అడిగితే ” సంగీతం నేర్చుకొంటున్న వారంతా సంగీతానికి వారసులే, నా కూతురే కాదు ఇక్కడ ఉన్న పిల్లలంతా (శిష్యులంతా) నా వారసులే ” అని జావాబిచ్చిన గొప్ప వ్యక్తిత్వము గల మహోన్నత   వ్యక్తి ఆవిడ.


ఆవిడ చేస్తోన్న కృషి ఎంతో శ్లాఘనీయమైనది. అందుకు భగవంతుడు ఆవిడకు శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాము.

 

మండా సుధారాణి మహిత సంగీతజ్ఞ

షట్కాల పల్లవీ విద్యలో సర్వజ్ఞ

తన వంటి శిష్యులను  సంగీత లోకాన

కందించు ఆమె కిదె నిత్యాభివందనము.

 

 

5 thoughts on “మండా సుధారాణి

  1. blessed to have a MENTOR (only suits to personalities like mam ) for my entire family…comprising of sushira…gaatra…tantri…charma vaidyam disciples…all guided by our beloved guru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *