April 16, 2024

మహిళా శాస్త్రవేత్త అన్నా మాణి

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

 annamani

పరిచయము – భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చిన సమయములో, అనగా 1940-60 ప్రాంతాలలో స్త్రీలకు విద్యావకాశములు, ముఖ్యముగా వైజ్ఞానిక రంగములో ఏ విధముగా ఉండినదో అన్నదే ఈ వ్యాసపు ముఖ్యాంశము. అంతెందుకు ఇరవై ముప్పయి సంవత్సరాలకు ముందు కూడ మహిళలు ఎక్కువగా పంతులమ్మల, నర్సుల, ప్రసూతి డాక్టరుల ఉద్యోగాలలో మాత్రమే ఉండేవాళ్లు. దీనికి మినహాయింపులు చాల తక్కువ.  ఐ.టి. రంగము, బ్యాంకులు విస్తరించిన పిదప ఈ స్థితి మారిందనే చెప్పవచ్చును. కాని నేడు కూడ, విజ్ఞాన శాస్త్రము, యంత్రవిద్య, పరిశోధన మున్నగు రంగములలో స్త్రీల సంఖ్య తక్కువే. స్త్రీలకు ఈ గాజుకప్పు (glass ceiling) భారతములో మాత్రమే కాదు, అన్ని దేశాలలో కొంతవఱకు ఉన్నది. నేను 1940 దశకములో విజ్ఞానరంగములో స్త్రీల పరిస్థితినిగుఱించి ఈ వ్యాసములో క్లుప్తముగా చర్చిస్తాను.  అది కూడ అన్నా మాణి అనే ఒక శాస్త్రవేత్తనుగుఱించి మాత్రమే.

 

విజ్ఞానశాస్త్రములో మహిళల పరిస్థితి – నాడు, నేడు సమాజములో స్త్రీని ఒక తల్లి, భార్య రూపములో చూస్తున్నారు, కాని ఆమె తెలివితేటలకు తగ్గట్లు ఆమె కూడ ఒక గొప్ప శాస్త్రవేత్త కాగలదని అందఱు మనస్ఫూర్తిగా ఊహించలేకున్నారు. అలా ఆమె శాస్త్రవేత్తగా మారినా, ఆమెకు ఆ రంగములో ఔన్నత్యము పొందడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆమెకు ధీశక్తికి తగ్గట్లు వేతనాలు కూడ ఇవ్వడము లేదు. దీనిని ప్రపంచమంతటా చూస్తున్నాము. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయములో 1921లో మొట్ట మొదటిసారిగా ఆడవాళ్లకు డిగ్రీలు పొందే అవకాశము లభించినది! శాస్త్ర విజ్ఞానము, ముఖ్యముగా యంత్రవిద్య (ఇంజనీరింగ్) పురుషులకు మాత్రమే అనే అపోహ ఇంకా పూర్తిగా మాయము కాలేదు.

 

భారతదేశములో 1987-2009 కాలంపరిధిలో మహిళా యువశాస్త్రజ్ఞులకు లభించిన పురస్కారములు 17/133 మాత్రమే. సుమారు 10-12 (మొత్తము 443) మందికి మాత్రమే శాంతిస్వరూప్ భట్నగర్ పురస్కారము ఇవ్వబడినది.  సుమారు 40-50 మంది స్త్రీలకు నోబెల్ బహుమతులు (అన్ని విభాగములలో) దొరికినవి.  మేరీ క్యూరీకి కూడ పురుషుల పక్షపాతమును రుచి చూచినదే. ఆమెకు పోలండు విశ్వవిద్యాలయములో స్త్రీగా ఉండిన ఒక్క కారణానికి మాత్రమే ప్రవేశము ఇవ్వలేదు. నోబెల్ బహుమతి లభించినను ఆమెను  ఫ్రాన్సు దేశపు శాస్త్రీయ అకాడెమి సభ్యురాలిగ చేర్చుకోలేదు!

 

ప్రారంభ దశ –  విజ్ఞానశాస్త్రములో (science) మొట్టమొదట PhD పట్టమును పొందిన భారతీయ మహిళ కమలా సొహొనీ (1912-98). ఆమె బాంబే విశ్వవిద్యాలయములో ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణులయినా, 1933లో Indian Institute of Scienceకు దరకాస్తు పెట్టగా, అది నిరాకరించబడినది, కారణము – ఆమె ఒక యువతి!  “నా సంస్థలో నేను ఆడవాళ్లను తీసికోను”, అని అప్పటి సంస్థ డైరెక్టరు, నోబెల్ బహుమాన గ్రహీత  చంద్రశేఖర వెంకట రామన్ చెప్పారు! ఆమె ఈ ఉదంతాన్ని అలాగే వదలలేదు. నేరుగా బెంగళూరుకి వెళ్లి రామన్‌ను సందర్శించి ముఖాముఖి “నాకెందుకు అడ్మిషన్ ఇవ్వలేదు, నాకు అర్హతలు లేవా” అని అడిగారు. మీనమేషాలు లెక్కించి చివరికి ఆమెకు అక్కడ పరిశోధనలను చేయడానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు కూడ ఆమెకు పూర్ణమైన అనుమతి దొరకలేదు. ఒక సంవత్సరము తరువాత ప్రయోగశాలలో పనిచేయడానికి అనుమతి నిచ్చారు రామన్. ఆమె తరువాత ఆడవాళ్లకు అక్కడ ప్రవేశము దొరికింది. కమలా సొహొనీ భారతీయ మహిళలకు విజ్ఞానశాస్త్రములో పరిశోధనలను చేయడానికి దారి చూపిన  గొప్ప మార్గదర్శి.

 

అన్నా మాణి బాల్యము – అన్నా మాణి తిరువనంతపుర రాజ్యములోని పీర్మేడులో ఒక వసతిగల సిరియన్ క్రైస్తవ కుటుంబములో  23 ఆగస్టు 1918లో జన్మించారు. ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరు, అంతేకాక ఏలకికాయల తోటలు కూడ అతనికి ఉండేది. వాళ్ల ఊరిలో ఉండే గ్రంథాలయములోని మలయాళ పుస్తకములను ఎనిమిదవ ఏటికి, ఆంగ్ల పుస్తకములను పన్నెండో ఏటికి చదివి ముగించినదట ఆమె. హరిజనుల దేవాలయ ప్రవేశంకోసం (ఒక జాతి, ఒక మతము, ఒక దేవుడు అనే నినాదముతో) 1925లో వైక్కం సత్యాగ్రహంలో పాల్గొనడానికి వచ్చిన గాంధీజీ దర్శనము ఆమెపై ఆ చిన్న వయస్సులోనే ఎంతో ప్రభావం కలిగించినది. తఱువాతి కాలములో ఆమె ఖద్దరు దుస్తులను ధరించుటకు ఇది కూడ ఒక కారణమై ఉండవచ్చును. ఆమె అక్కలు పెండ్లి చేసికొని స్థిరపడగా, అన్నా తాను ఉన్నత విద్యను అభ్యసిస్తానని  ఆశను వెలిబుచ్చగా కుటుంబ సభ్యులు దానిని ఆమోదించలేదు, వ్యతిరేకించలేదు కూడ.

 

రామన్‌తో పరిశోధనలు – ఆమెకు వైద్యవిద్య చదవాలని ఆశ, అది సంభవించకపోగా ఆమె భౌతిక శాస్త్రమును (Physics) అభ్యసించాలని అనుకొన్నారు . మదరాసులోని రాజధాని కళాశాలలో ఆనర్సు పట్టమును పొందారు .  ఒక సంవత్సరము తఱువాత 1940లో బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థలో (Indian Institute of Science) భౌతిక శాస్త్రములో పరిశోధన (research) చేయడానికి విద్యార్థి వేతనము (scholarship) లభించినది. రామన్ ప్రయోగశాలలో స్ఫటికరూపములైన (crystal) వజ్రము (diamond), కెంపుల (ruby) వర్ణపటములను (spectrum) తీసి అందులోని రహస్యములను అర్థము చేసికొనుటకు ప్రయత్నించారు. అప్పుడు రామన్‌కు, జర్మనీ దేశమునకు చెందిన బార్న్‌ (Max Born), ఇంగ్లండులోని లాన్స్‌డేల్ (Kathleen Lonsdale) మధ్య వజ్రపు వర్ణపటములను గుఱించి వాగ్వాదములు జరుగుతుండేవి. అందువల్ల  ప్రయోగశాలలోని విద్యార్థులు రామన్ సేకరించిన సుమారు 300 వజ్రస్ఫటికములపైన పరిశోధనలు చేసే వాళ్లు. అన్నా మాణి వజ్రము కాంతిని (light) ఎలా ప్రతిదీపనము (floroscence), శోషణము (absorption) చేస్తుందో అనే విషయముపైన, దాని రామన్ వర్ణ పటమును (Raman spectrum) విశ్లేషించారు. వివిధ ఉష్ణోగ్రతలలో ఇవి ఎలాగుంటాయో, తఱువాత ధ్రువణము (polarization) ఎలా మారుతుందో అనే విషయాలను పరిశీలించారు.

 

ఈ వర్ణపటములను తీయడము కష్టతరమైన పని. వాటిని కనిష్ట ఉష్ణోగ్రతలో అనగా ద్రవవాయువు (liquid air) ఉష్ణోగ్రతలో తీయాలి. ఫోటోగ్రఫీ ప్లేటులను గంటలతరబడి (15 – 25 గంటలు) పాదరసపు కాంతిలో ప్రతిఫలించాలి. రాత్రింబవళ్లు కొన్ని సమయాలలో పని చేయవలసి వస్తుంది. దీని ఫలితముగా ఆమె 1942-45ల మధ్య తన ఒక్క పేరుతో మాత్రమే ఉండే ఐదు పత్రములను (five single authored papers) ప్రచురించారు. విద్యార్థిగా పర్యవేక్షకుని పేరు లేకుండ ఏకరచయితగా విజ్ఞాన పత్రములను ప్రచురించడము విజ్ఞానశాస్త్రములో ఒక మహత్తరకరమైన విషయము. ఇది ఒక మహిళగా అన్నా మాణి సాధించారు.

 

రామన్‌కు స్త్రీలపైన వివక్షణ – రామన్ కాలములో స్త్రీపురుషులను ప్రయోగశాలలో విడివిడిగా ఉంచేవారట. శాస్త్రీయపరముగా జరిగే చర్చలలో స్త్రీలకు పాల్గొనే అవకాశమును ఇవ్వలేదట. వ్యక్తి విద్యాపురోగమనమునకు ఇట్టి చర్చలు ఎంతో అవసరము. కాని వాటిని రామన్ లెక్కించలేదు. అలాగుండేది ఆ కాలములో స్రీల విజ్ఞానాభివృద్ధికి అవకాశాలు!  1945లో ఆమె తన PhD సిద్ధాంత గ్రంథమును (PhD thesis) మదరాసు విశ్వవిద్యాలయమునకు సమర్పించారు [తఱువాతి కాలములో IISc ఒక deemed universityగా మారి తానే డిగ్రీలను ఇచ్చే స్థాయిని పొందినది]. ఇక్కడే ఒక విపరీతమైన సంఘటన జరిగినది. మాణికి MSc పట్టా లేదని అందువలన PhD డిగ్రీని ఇవ్వలేదు. ఆమె భౌతిక, రసాయన శాస్త్రములలో ఆనర్సు డిగ్రీని పొంది IISc విద్యార్థివేతనము పొందిన విషయమును పరిగణనలో తీసికొనలేదు. ఆమె సిద్ధాంత గ్రంథము నేడు కూడ రామన్ పరిశోధనా సంస్థ (Raman Research Institute) గ్రంథాలయములో ఉన్నది. అన్నా మాణి గొప్పదనము ఏమంటే ఈ తిరస్కారమును ఆమె మనసులో నుంచుకోలేదు. డిగ్రీ లేమి తన పనిలోని ప్రగతికి ఆటంకము రాలేదని చెప్పుకొన్నారు. అది ఆమె ఉదారస్వభావమును చూపిస్తుంది.

 

వాతావరణశాస్త్రములో పరిశోధనలు – 1945లో అన్నా మాణి ఇంగ్లండుకు వెళ్లడానికి ఒక విద్యార్థి వేతనము దొరికినది. వాతావరణశాస్త్రములో (Meteorlogy) కావలసిన పరికరములపైన పరిశోధనలను సలుపడమే దీని ముఖ్యోద్దేశము. దీనికోసం ఆమె ఇంగ్లండు, స్కాట్లండు దేశములలో వాతావరణ సామాగ్రి ని తయారు చేసే సంస్థలను దర్శించారు. వాతావరణ శాస్త్రమునకు కావలసిన ప్రమాణాలు (standards), వాటిని సాధించు విధానములను అభ్యసించారు.

 

1948లో ఆమె స్వతంత్రభారత దేశానికి మరలివచ్చి పుణేలో ఉద్యోగమును ప్రారంభించినారు. అప్పటి కాలములో థర్మామీటరులను ఉంచే చిన్న రక్షణ గృహాలు కూడ దిగుమతి చేసికొనే వాళ్లట. పరికరాలకు మాదిరులను (model designs) తయారు చేయడము, వాటిని ఉపకరణములుగా తయారు చేయడము (manufacture) , వాటిని క్రమాంకితము చేయడము (calibration), వాటిని స్థాపించడము (installation), వాటిని ఉపయోగించడము (taking observations), ఇత్యాదులను సరిగా చేయడానికి కావలసిన సిబ్బందిని సమకూర్చారు. దీనికి కావలసిన కార్ఖానాలు (workshops), ప్రయోగశాలలను ఏర్పాటు చేసారు. కొన్ని ఏళ్లలో భారతీయ వాతావరణ శాస్త్రములో కావలసిన సామాగ్రిని, ఉపకరణములను దిగుమతి చేసికొనవలసిన అవసరము లేకపోయినది. దీనికి కారకురాలు అన్నా మాణి.

 

తఱువాత అన్నా మాణి సౌరశక్తిని భారతదేశములో ఉపయోగించుకొనే విధానములను గుఱించి పరిశోధనలు సలిపారు. అదే విధముగా ఓజోన్ గాలిని (ozone) కొలిచే పద్ధతులను గుఱించి పరిశోధనలు చేసినారు. విక్రం సారాభాయ్ ఆమెను అడుగగా తుంబా రాకెట్ స్టేషనులో వాతావరణ కేంద్రాన్ని స్థాపించినారు. 1976లో డెప్యూటీ డైరెక్టర్ జెనరల్‌గా పదవిని విరమించారు. ఐనా ఇంకొక 20 ఏళ్లు శాస్త్రజ్ఞురాలిగా పని చేసారు. రామన్ పరిశోధనా సంస్థలో నంది కొండలలో Millimetre Wave Telescopeను స్థాపించుటకు సహాయము చేసినారు. తఱువాత ఎన్నో Reference పుస్తకాలను వ్రాసారు.

 

ఆమెకు 1977లో Indian Academy of Scienceలో సభ్యత్వము లభించినది. ఆమె Indian Meteorological Society, American Meteorological Society, American Geophysical Union, Royal Meteorological Society, Institution of Electronic and Telecommunication Engineers, International Solar Energy Societyలలో సభ్యులుగా ఉండినారు. ఆమెకు 1987లో INSA K R Ramanathan Medalను బహూకరించారు.

 

ముగింపు – శాస్త్ర పరిశోధనలకే తన జీవితాని అంకితము చేసిన ఆమె పెళ్లి చేసికోలేదు. ఆమె అన్ని మతములను సమానముగా పరిగణించేవారు. కుక్కలంటే ఆమెకు ఇష్టము. పక్షులను చూడడము ఆమెకు ఒక వినోదము. 1994 ఆమెకు పక్షవాతము వచ్చి 16 ఆగస్ట్ 2001లో మరణించారు.  భారతీయ మహిళా శాస్త్రజ్ఞులలో ఉత్తమశ్రేణికి చెందినవారిలో ముందువరుసలో అన్నా మాణి స్థానము ఉంటుంది.

 

గ్రంథసూచి –

(1) The Glass ceiling – The Why and the Therefore – Sukanya Datta

(2) Anna Mani – Abha Sur –  Resonance, Nov 2008, 993-95.

(3) Anna Mani – A student remembers – C R Sreedharan, Current Science, October 2001, 81, 1129-31.

 

 

2 thoughts on “మహిళా శాస్త్రవేత్త అన్నా మాణి

  1. అద్భుతమైన వ్యాసము. ఉత్తమ శాస్త్రవేత్త, పరిశోధకురాలు అన్నామణి గారిని పరిచయము చేసారు. తెలుగులో వైజ్ఞానిక పదాలను నైపుణ్యముతో చొప్పించారు. సర్. సి.వి.రామన్ గారి వివక్ష తెలుపుట మీ పారదర్శకత కుదాహరణము. మరి ఆ దినములలో అది సామాన్యము. ఈ దినములలో కూడా వివక్ష లేదని గాని ఉండదని గాని చెప్పలేము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *