‘మల్లెల వానా మల్లెల వానా!’

రచన: నండూరి సుందరీ నాగమణి

????????????????????????????????????????????????????????????????????

మండుటెండలు దాడి చేసి, మనల్ని మాడ్చి వేసే వేసవికాలం… అయినా అది ఋతు ధర్మం… ఆ ఎండల వేడిని తట్టుకొని, గ్రీష్మాన్ని సైతం మనం ఆస్వాదించాలని, దేవుడు మల్లెలను, మామిడిపళ్ళనూ సృష్టించాడు. మల్లెల సుగంధ పరిమళాలను ఆఘ్రాణించి గుండెల నిండా నింపుకోవాలని, మామిడిపళ్ళ తీయని రుచిని ఆస్వాదించి, మనసంతా తీయదనం పెంచుకోవాలని అనుకోని మనిషి  ఉంటాడా? అందుకే మన కవులు మల్లెపూల పరిమళాలను ఇలా మాలలు కట్టి చిత్ర సీమలో అందించారు…

మల్లెలు తెల్లదనానికి ప్రతీక, తెల్లదనం స్వచ్చతకు చిహ్నం… ‘మల్లెకన్న తెల్లన, మా సీత సొగసు… తేనె కన్నా తీయనా, మా సీత మనసు...’ అని మరదలిని తలచుకొని మురిసిపోతాడు ఆ బావ (ఓ సీత కథ).

తనను వలచిన ప్రియునికి కానుకగా ఇవ్వటానికి, మల్లెపువ్వులు, తన నవ్వులూ తప్ప మరేమీ సరి రావని అంటోంది ఆ ప్రియురాలు… ‘మల్లె పువ్వులు, పిల్లనవ్వులూ … నీ కోసమే నీ కోసమే… ఇటు రావోయి రావోయి రాజా…’ అంటూ… (అత్తను దిద్దిన కోడలు), ‘మల్లెపూలు, మొల్లాపూలు…’  (రాజీ నా ప్రాణం) లో రావు బాలసరస్వతీ దేవి గారి గాత్ర మధురిమను మరచిపోగలమా? ‘గుబులు పుట్టిస్తావే ఓ మల్లికా… గుండెలే దోస్తావే ఓ మల్లికా… పూవుల్లో మేనకవే నవమల్లికా… పూబోణి కానుకవే సిరిమల్లికా….’ పాటలో (కళ్యాణి) దాసం గోపాలకృష్ణ గారు మల్లెపూవు గురించి, దాని విలాసం గురించి ఎంత బాగా వర్ణిస్తారో…

మల్లెపూవు ఎంత సుగంధ భరితమో, అంత సోయగాల సొగసుల సమ్మేళనం కూడా… అందుకే ప్రేయసి నవ్వులను, ప్రియురాలి లావణ్యాన్ని, మల్లెపూలతోనే పోలుస్తాడు ప్రియుడు… ఇలా…

సిరిమల్లె పువ్వల్లే నవ్వు…’ (జ్యోతి), ‘సిరిమల్లె నీవే… విరిజల్లు కావే...’ (పంతులమ్మ), ‘సిరిమల్లె సొగసూ, జాబిల్లి వెలుగూ నీలోనే చూసానులే…’ (పుట్టినిల్లు – మెట్టినిల్లు).

ఆమె కూడా అంతే… తన వాడెవడో చెప్పమని, మల్లెపువ్వునే అడుగుతోంది… ‘సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా… చిన్నారీ చిలకమ్మా… నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే?’ (పదహారేళ్ళ వయసు). వర్షంలో తడవటం అంటే అమ్మాయిలకి ఇష్టం కదా… అదే పూల వాన అయితే? అందులోనూ మల్లెపూల వాన అయితే? ‘మల్లెపూల వానా, మల్లె పూల వానా జల్లుల్లోనా, తడిసిన ఆనందాన…’ (వినోదం), ‘మల్లెల వానా, మల్లెల వానా నాలోనా… మనసంతా మధుమాసం లా విరబూసేనా?’ (రాజా) ప్రేమలో పడిన అమ్మాయిలకు, ఆ తలపులు మల్లెపూల వానే కదా…

మన సినిమాలలో తొలిరేయి సన్నివేశాలు, వాటిలో మల్లెపూల మీద పాటలు… శృంగార అభినివేశానికి ఉద్దీపన కలిగించే మల్లెపూల పాటలు ఎన్నో కదా… ‘తెల్లచీర కట్టుకున్నది ఎవరికోసమో… మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసమో…’ (అంతస్తులు), ‘ఇదిగో తెల్లచీరా, ఇవిగో మల్లెపూలు…’ (ఊరికి మొనగాడు), ‘మల్లెలు పూచే, వెన్నెల కాచే… ఈ రేయి హాయిగా… మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా… (ఇంటింటి రామాయణం), ‘మల్లె పందిరి నీడలోన జాబిల్లీ, మంచమేసి ఉంచినాను జాబిల్లీ…’ (మాయదారి మల్లిగాడు), మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన (అనుబంధం) వీటిల్లో కొన్ని మాత్రమే…

ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఇలా చెబుతున్నాడీ ప్రేమికుడు… ‘మల్లెపూల మారాణికి, బంతి పూల పారాణి… గున్నమావి పందిళ్ళ లోనా, కన్నె జాజి సందిళ్ళలోనా, కోకిలమ్మ పాట కచేరీ… హాపీ బర్త్ డే టూ యూ…’ (అమరజీవి). ప్రేమలో పడితే, ప్రియుడి సన్నిధి లో తానుంటే ఇలాగే ఉంటుంది… ‘మనసున మల్లెల మాలలూగెనే… కన్నుల వెన్నెల డోలలూగెనే…’ (మల్లీశ్వరి).

ప్రియురాలు తనను విడచి వెళ్ళిపోయింది… ప్రియుడు బాధతో, విరహంతో ఇలా పాడుకుంటున్నాడు. ‘ఓ ప్రియా… మరుమల్లెల కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది… మన ప్రణయం అనుకొని మురిసితిని, అది విషమని చివరికి తెలిసినది…’ (మల్లెపూవు), ‘మల్లె తీగ వాడిపోగా, మరల పూలు పూయునా?’ (పూజ), ‘మల్లియలారా, మాలికలారా… మౌనముగా ఉన్నారా? మా కథయే విన్నారా? (నిర్దోషి), ‘మధుమాస వేళలో… మరుమల్లె తోటలో… మనసైన చిన్నదీ, లేదేలనో…’ (అందమే ఆనందం)…

దగాపడిన చెల్లెలు నమ్మి ఎలా మోసపోయిందో, ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ... తొందర పడి ఒక కోయిల, ముందే కూసిందీ, విందులు చేసిందీ…’ (సుఖ దుఃఖాలు) పాటలో చక్కగా చెప్పారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. ‘మల్లెతీగ వంటిదీ మగువ జీవితం’ (మీనా) అని స్త్రీ జీవితంలోని వివిధ దశలను వర్ణించారు కవి. ఎన్ని కష్టాలు వచ్చినా, ‘నవ్వవే నవ మల్లికా… ఆశలే అందాలుగా…’ (సుందర కాండ) అన్నట్టే ఆడపిల్లలుండాలి.

సన్నజాజులోయ్… కన్నె మోజులోయ్...’ (సింహబలుడు) అని అతనికి కావలసినది ఇవ్వటానికి ‘మసక మసక చీకటిలో, మల్లె తోట ఎనకాల, మాపటేల కలుసుకో…’ (దేవుడు చేసిన మనుషులు) అని ప్రియుడిని కవ్విస్తూ పిలిచినా, అవి ప్రియురాలి మనసులోని పూల పరిమళాలే కావటం ఎంత మనోహరమైన భావన!

నవ్విందీ మల్లెచెండూ…’ (అభిలాష), అని తన గర్ల్ ఫ్రెండుని చూసి మురిసిపోయినా, ‘మల్లికా నవమల్లికా… మదనోత్సవ సంగీత సంచికా…’ (బంగారు బావ) అని మల్లెతో పోలుస్తూ ప్రియురాలిని వర్ణించినా, మన తెలుగు సినీ ప్రియునికే దక్కిన అదృష్టం అది…

ఇంత చక్కని పరిమళాలు (పాటలు) అందించిన మన కవులకు ఎలా తెలుపుకోగలము మన కృతజ్ఞతలను, ‘దోసిట సిరి మల్లెలు నించి’ నీరాజనాలు ఇవ్వటం తప్ప!

***

 

 

 

 

8 thoughts on “‘మల్లెల వానా మల్లెల వానా!’

  1. Meeru Mallepoola meeda vrasina Adbhuthamaina Cine Geethala tho kudina Write up ki nenu FIDA. Anthakanna matallev Nagamani Chellemma

Leave a Comment