April 25, 2024

ఆరాధ్య 8

రచన: అంగులూరి అంజనీదేవి

          వెంటనే ఆరాధ్యకు రాకేష్‌ గుర్తొచ్చాడు ”వద్దు. నాకు అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యటం ఇష్టం లేదు” అంది ఆరాధ్య.

          ”కాళ్లు తడవకుండా సముద్రాన్నైనా దాటగలం కాని అబ్బాయిలతో ఫ్రెండ్‌షిప్‌ చెయ్యకుండా జీవితాన్ని దాటగలమా!” చాలా కూల్‌గా అడిగింది సరయు.

          ”అది మనం ఫాలో అయ్యేదాన్నిబట్టి వుంటుంది”

          ”మనం దేన్ని ఫాలో కాము. అవే మనల్ని ఫాలో అవుతాయి. దేన్ని దాటాలన్నా డబ్బు కావాలి. ఒక్కసారి మన అకౌంట్లో డబ్బు లేకపోతే దాని ప్రభావం జీవితంపై గంట గంటకి వుంటుంది. కావలసిన వాళ్లతో స్పర్ధలొస్తాయి. సమస్యలు వస్తాయి. మనవి అనుకున్నవన్నీ దూరమవుతాయి. ఇవన్నీ నేను నా లైఫ్‌లో ఫేస్‌ చేశాను” అంటూ తన స్టోరీ చెప్పబోయింది.

          ”వద్దు. చెప్పకు. నువ్వేం చెప్పినా నాకు రిలేటెడ్‌గా అన్పించి జరిగిపోయినవన్నీ గుర్తొస్తాయి”

          ”చెప్పకపోతే నువ్వు రాంగ్‌గా థింక్‌ చేస్తున్నావు కదా?” అంది సరయు.

          ఆరాధ్య లేచి ఆలోచిస్తూ అటు ఇటూ తిరగడం ప్రారంభించింది. ఆమె త్రిబైఫోర్త్‌ నైటీలో ఐదున్నర అడుగుల హనీకేక్‌లా వుంది. సరయు కూడా అలాంటి నైటీనే వేసుకుంది. కలర్‌ మాత్రం వేరు. ఈమధ్యన డ్రెస్‌లు కూడా ఇద్దరూ ఒకే మోడల్‌లో తీసుకుంటున్నారు.

          తిరుగుతున్న ఆరాధ్యవైపు చూసి ”నీకో విషయం చెప్పనా?” అంది సరయు.

          ఆరాధ్య ఆగి ఏమిటన్నట్లు చూసింది.

          ”నువ్వు ఇలా ఒంటరిగా వుంటే ఎన్ని ప్రాబ్లమ్స్‌నైనా ఎదుర్కొనవచ్చు. ఎక్కడైనా వుండొచ్చు. అదే నీకో బిడ్డ వుంటే నిన్నెవరు రానిస్తారు? ఎవరు షెల్టరిస్తారు? ఫ్యూచర్లో ఏ చిన్న గొడవ వచ్చినా ఆత్మాభిమానం చంపుకుంటూ హేమంత్‌ దగ్గరే వుండిపోవలసి వస్తుంది. అందుకే మీ మమ్మీ చెప్పినట్లు అబార్షన్‌ చేయించుకో! ఇప్పుడు సెకెండ్‌ మంతే కాబట్టి హాస్పిటల్లో హేమంత్‌ పర్మిషన్‌ అవసరం వుండదు. అదే ధర్డ్‌ మంత్‌ వచ్చిందనుకో! హేమంత్‌ పర్మిషన్‌ ఇచ్చినా అబార్షన్‌ చెయ్యరు. ఇప్పుడు రూల్స్‌ అలా వున్నాయి. ఏ డెసిషన్‌ అయినా నువ్వు స్పీడ్‌గా తీసుకోవాలి. మీ పేరెంట్స్‌ని రమ్మని చెప్పు! కావాలంటే నీకు నేను హాస్పిటల్లో హెల్ప్‌గా వుంటాను” అంది.

          ”మరి హేమంత్‌?”

          ”హేమంత్‌దేముంది ఆరాధ్యా! అతనేమైనా నీతోపాటుగా నీ ఇంట్లో పుట్టాడా? మహా అయితే కొద్దిరోజుల పరిచయం. అంత మాత్రాన అతనికోసం మమ్మీని హర్ట్‌ చేస్తావా?” అంది సరయు.

          ఆ మాటలతో మెత్తబడింది ఆరాధ్య.

          ”నువ్వెలా చెబితే అలా చేస్తాను సరయు!” అంది.

          ఆరాధ్య నోటినుండి ఇంత మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆమె వూహించలేదు.

          ”నాకు తెలుసు సరయు! నువ్వు నన్నెంత ఆత్మీయంగా చూసుకుంటున్నావో! నా గురించి ఎంత ఓపిగ్గా ఆలోచిస్తున్నావో! అందుకే నేను నీ మాటను కాదనలేకపోతున్నాను” అంది ఆరాధ్య.

          ”ఓ.కే. ఆరాధ్యా! థాంక్యూ!” అంది సరయు.

          ఆరాధ్య ఏదో అనే లోపల వాత్సల్య వచ్చింది. ఆమెను చూడగానే వాళ్ల మాటలు ఆఫీసు వర్క్‌ మీదకి మళ్లాయి.

                                              *****

మొన్న శార్వాణి అనంతపూర్‌ వెళ్తున్నప్పుడు ట్రైన్‌ దగ్గరకి వెళ్లిన హేమంత్‌తో ”నాన్నా! హేమంత్‌! జీవితంలో గెలవాలీ అంటే సంతోషంగా వున్నప్పుడు వాగ్దానాలు చెయ్యకూడదు. కోపంగా వున్నప్పుడు సమాధానాలు చెప్పకూడదు. నిరాశలో వున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. నేను వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త!” అంటూ వెళ్లి ట్రైన్లో కూర్చుంది. ట్రైన్‌ కదిలేంత వరకు కొడుకుతో మాట్లాడింది.

          ఆ సన్నివేశాన్ని హేమంత్‌ మరచిపోలేదు. ఆమె చెప్పిన మాటలు మరచిపోలేదు. అందుకేనేమో మనసులో ఎంత కోపంగా వున్నా ఆరాధ్య గురించి పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నాడు.

          దానికి తోడుగా కాశిరెడ్డి ఎప్పుడు చూసినా గర్భిణీస్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఎక్సర్‌సైజులు చెయ్యాలి? అన్న లిస్ట్‌ను ఆన్‌లైన్లో చూసి చెబుతుంటాడు. అంటే ఆరాధ్యను త్వరగా తీసుకొచ్చుకో. అక్కడ వుంచొద్దు అని దాని అర్థం… కళ్యాణమ్మ కూడా ఫోన్లో అలాగే చెబుతుంటుంది.

          సాయంత్రం ఆరుగంటల సమయంలో…

          ”నిన్న నాకు ఆరాధ్య కన్పించి ‘హాయ్‌’ చెప్పిందిరా!” అన్నాడు సంతోషంగా కాశిరెడ్డి. తన క్యూబికల్‌ వైపు వెళ్తూ… ”అంతేకాదురా! ఆరాధ్యను చూస్తుంటే పుట్టబోయే నా మేనల్లుడిని చూసినంత ఆనందంగా వుంది అని కూడా అన్నాడు.

          దానికి జవాబుగా నవ్వాడే తప్ప హేమంత్‌ మాట్లాడలేదు.

          ”ఎంతయినా ఈమధ్యన నవ్వడం ఎక్కువైందిరా నీకు. తండ్రివి కాబోతున్నానన్న శాటిస్‌ఫాక్షన్‌ కూడా ఒంటినిండా పాకిపోయి కన్పిస్తోంది” అంటూ తన జోక్‌కి తనే నవ్వుకుంటూ లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఆన్‌లైన్లోకి వెళ్లాడు. అందులో అనుకోకుండానే ఓ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసి సర్చ్‌చేస్తూ ”రే! హేం! ఇలారా!” అంటూ కేకేశాడు.

          ”వీడికేం కన్పించిందో. కేక చాలా గట్టిగా విన్పిస్తోంది” అని తనలో తను నవ్వుకుంటూ లేచి కాశిరెడ్డి కూర్చునివున్న క్యూబికల్‌ వైపు వెళ్లాడు హేమంత్‌.

          ”ఏంటి కాశీ! ఎందుకలా అరుస్తున్నావ్‌?” మామూలుగానే అడిగాడు.

          ”చూడరా! ఇక్కడేముందో!”

          ”ఏముందిరా?” అంటూ లాప్‌టాప్‌ స్క్రీన్‌ వైపు చురుగ్గా చూశాడు హేమంత్‌.

          ”ఏముందంటే! గర్భరక్షాంబిగై టెంపుల్లో పూజ చేయిస్తే పుట్టబోయే బిడ్డ తల్లిగర్భంలో తొమ్మిది నెలలు సురక్షితంగా వుండి, హెల్దీగా పుడుతుందట. గర్భరక్షాంబిక అంటే పార్వతిదేవి రూపం. ఆమె భర్త ముల్లైవన నాథర్‌ అంటే శివుని రూపం… పూజ చేశాక పార్వతి దేవి పాదాల దగ్గర పెట్టిన బ్లెస్ట్‌ ఆయిల్‌, ఘీ ప్రసాదం, శ్లోకం, చీరె పోస్ట్‌లో మనకు పంపిస్తారు. ఆ పూజను మనం ఆన్‌లైన్లో ఆర్డర్‌ చేస్తే చేస్తారట. ఈ పూజ చేయిస్తే ఫ్రీ డెలివరీ అవుతుందట. ఈ టెంపుల్‌ తమిళనాడులో వుంది. వెంటనే నువ్వు దీనికి డబ్బులు పంపు” అన్నాడు కాశిరెడ్డి.

          హేమంత్‌ కాశిరెడ్డి చెప్పినట్లే ఆ పూజ వివరాలను చూసి సంతోషపడ్తూ ఆన్‌లైన్లో ఆర్డర్‌ చెయ్యబోతుండగా వాత్సల్య దగ్గర నుండి కాల్‌ వచ్చింది.

          కాల్‌ లిఫ్ట్‌ చేసి ”చెప్పు వాత్సల్యా!” అన్నాడు హేమంత్‌.

          ”హేమంత్‌! నేను సరయుతో వుండట్లేదు” అంది.

          ”ఎందుకు? ఏమైంది? ఏమైనా అన్నదా?” అడిగాడు కూల్‌గా.

          ”అలాంటిదేం లేదు. ఇప్పుడు ముగ్గురమే కదా ఆ ఇంట్లో వుండేది. ఖర్చులు ఎక్కువయ్యాయి. షేరింగ్‌ తగ్గింది. నా మనీ ప్రాబ్లమ్స్‌ నీకు తెలుసుకదా! అందుకే ఎక్కువమంది వుండే ఇంటికి షిఫ్ట్‌ అవుతున్నాను. ఆల్‌రెడీ అయ్యాను. ఇది నీకు చెప్పాలని చేశాను” అంది ఆమెకూడా కూల్‌గానే.

          ”ఇది నాకు చెప్పటం దేనికి? లోగడ చెప్పాల్సినవేమీ చెప్పకుండా దాచావుగా!” అన్నాడు వస్తున్న కోపాన్ని అణచుకుంటూ

          ”ఇంక నేనేం దాచను హేం! అందుకే నీకీ కాల్‌ చేశాను”

          ”అంటే!” అర్థం కాలేదు హేమంత్‌కి…

          ”అంటే! ఆరాధ్యకి అబార్షన్‌ చేయించాలని ప్లాన్‌ చేస్తున్నారు హేం! ఇప్పుడు వాళ్ల పేరెంట్స్‌ వచ్చినట్లు సరయు కాల్‌ చేసింది. నువ్వు వెంటనే వెళ్లకపోతే జరగరానిది జరిగిపోవచ్చు” అంటూ కాల్‌ కట్‌ చేసింది.

          ”ఓ మైగాడ్‌!” అంటూ తల పట్టుకున్నాడు హేమంత్‌.

          కాశిరెడ్డి ”ఏమైందిరా హేం?” అని అడిగే లోపలే హేమంత్‌ ఆఫీసులోంచి బయటకొచ్చేశాడు.

          పార్క్‌ చేసివున్న బైక్‌ను వేగంగా నడుపుకుంటూ ఆరాధ్య వుంటున్న ఇంటికెళ్లాడు.

          వాత్సల్య చెప్పింది నిజమే! అక్కడి వాతావరణం అలాగే వుంది. శాంతారాం, రమాదేవి క్యారీబ్యాగ్‌ పట్టుకొని హాస్పిటల్‌కి వెళ్లాలని గేటు దగ్గర ఆటోకోసం నిలబడి వున్నారు. సరయు, ఆరాధ్య స్కూటీని బయటికి తీస్తున్నారు.

          అందరూ ఒక్కసారే హేమంత్‌ని చూసి షాకై ఎక్కడివాళ్లక్కడే స్టాట్యూల్లా నిలబడిపోయారు. తాము హాస్పిటల్‌కి వెళ్తున్నట్లు హేమంత్‌కి ఎలా తెలిసింది అన్న ప్రశ్న అందరి ముఖాల్లో స్పష్టంగా కన్పిస్తోంది.

          రమాదేవి అల్లుడిని చూడగానే ఏం గొడవ పెట్టుకుంటుందో ఏమోనన్న అనుమానంతో ”మనం లోపలకి వెళ్దాం!” అంటూ భార్యను లోపలకి తీసికెళ్లాడు శాంతారాం. ఆయనకు భార్య చేస్తున్న పని నచ్చడం లేదు. వద్దని గొడవ కూడా పడ్డాడు. ఆమె వినలేదు.

          సరయు, ఆరాధ్య లోపలకెళ్లకుండా, బయటకెళ్లకుండా స్కూటీ దగ్గరే నిలబడి చూస్తున్నారు.

          బైక్‌ను తీసికెళ్లి వాళ్లకి అడ్డంగా పెట్టి ”మీ ఇద్దరే వెళ్తారా హాస్పిటల్‌కి?” అన్నాడు హేమంత్‌. అతను ఎప్పుడూ లేనంత కోపంగా వున్నాడు. ఆగ్రహావేశాలతో బుసకొడుతున్నాడు.

          సరయు మాట్లాడలేదు. అసలు హేమంత్‌వైపే చూడటం లేదు. స్కూటీ వెనకాల ఏదో వున్నట్లు అదే పనిగా వంగి పట్టిపట్టి చూస్తోంది.

          హేమంత్‌కి సరయుతో అవసరం లేదు. అందుకే ఆరాధ్య రెక్క పుచ్చుకొని ”పద లోపలకి…” అన్నాడు.

          ఆరాధ్య అతనికన్నా ముందే లోపలకి వెళ్లి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది. హేమంత్‌ ఆమె వెంటే లోపలకి నడిచి వాళ్లకి ఎదురుగా నిలబడ్డాడు.

          సరయు బయటకెళ్లినట్లు స్కూటీ శబ్దం విన్పించింది. కానీ ఆమె వెళ్లలేదు. వెంటనే లోపలికి వచ్చి తన గదిలోకి వెళ్లిపోయింది.

          ”మీకు నేనేం ద్రోహం చేశానని నా బిడ్డను కడుపులోనే చంపాలనుకుంటున్నారు?” సూటిగా చూస్తూ అడిగాడు హేమంత్‌ శాంతారాంని… శాంతారాం నాకేం తెలియదన్నట్లు తలవంచుకున్నాడు.

          హేమంత్‌ మరింత కోపంగా కళ్లెర్ర చేసి చూస్తూ ”ఆరాధ్యకి మీ అంత అనుభవం లేదు. మీరెలా చెబితే అలా వింటుంది. కానీ మీ వయసేమైంది” అన్నాడు.

          బిత్తరపోయింది ఆరాధ్య భర్త గొంతులో కన్పిస్తున్న కాఠిన్యానికి.

          రమాదేవి నిర్లక్ష్యంగా చూస్తోంది.

          వెంటనే ఆరాధ్యవైపు తిరిగాడు హేమంత్‌. ”వీళ్లు వయసున్న యానిమల్స్‌. నీ తెలివి ఏమైంది?” అన్నాడు ఆవేశంగా.

          ఆరాధ్య వూరుకోలేదు. అంతే ఆవేశంగా ఉరిమి చూస్తూ ”నా పేరెంట్స్‌ని పట్టుకొని నా ముందే యానిమల్స్‌ అంటారా? వాళ్లు మీకేం చేశారు?” అంది.

          రమాదేవికి యానిమల్స్‌ అంటే అర్థంకాక ”అంటే ఏంటండీ! అమ్మాయి అంత కోపంగా అడుగుతోంది. అదేమైనా అనకూడని మాటనా?” గొంతు తగ్గించి భర్తను అడిగింది.

          తల్లి అడిగేది విని ”మా వాళ్లకి మీరు యూజ్‌ చేసే పదాలకు అర్థాలు కూడా తెలియవు. ఎందుకంత గొంతు చేసి అరుస్తారు. ఇందులో వాళ్ల ప్రమేయం ఏమీ లేదు”

          ”ఏమీ లేకుంటే వాళ్లెందుకొచ్చారిప్పుడు?”

          ”కూతురు బాధల్లో వుంటే రారా?”

          ”ఏం బాధలొచ్చాయి నీకు?”

          ”ప్రెగ్నెన్సీ వచ్చి నోట్లో వాటర్‌ పోసుకోవాలన్నా వాంతులవుతూ నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసా? కడుపు నిండా నీళ్లు తాగలేక, తిండి తినలేక చచ్చిపోతున్నాను. ఇంత చిన్న వయసులోనే నాకీ కర్మేంటి? అందుకే నేనీ ప్రెగ్నెన్సీ వద్దనుకుంటున్నాను” అంది.

          హేమంత్‌ వెంటనే రమాదేవి వేపు చూసి ”ఏమ్మా! నువ్వు వాంతులు లేకుండానే ఇద్దరు బిడ్డల్ని కన్నావా? కన్నకూతురు తల్లి కాబోతుంటే ఆనందపడాల్సింది పోయి వాంతులకి భయపడి బిడ్డనే కనొద్దని చెబుతున్నావా? ఒక కన్నతల్లి కూతురితో చెప్పాల్సిన మాటలేనా ఇవి? నీకు మాత్రం పిల్లలు కావాలి. నువ్వు ‘అమ్మా’ అని పిలిపించుకోవాలి. మరి నీ కూతురో? కంప్యూటరా? మనిషి కాదా? తనకి పిల్లలు వద్దా?” అన్నాడు ఘాటుగా.

          అల్లుడి కోపానికి తొలిసారిగా వణికింది రమాదేవి.

          ”దాన్నేమీ అనకు బాబూ! దానికి అసలే లోబి.పి. మొన్ననే చావబోయి బ్రతికింది. ఏమైనా అనదలచుకుంటే నన్ను అను” అన్నాడు శాంతారాం.

          ”ఎవరినీ అనాల్సిన అవసరం నాకు లేదు మామగారూ! ఈ వయసులో మీకే మీ భార్యపట్ల అంత ప్రేమ వుంటే నాకీ వయసులో నా భార్య అంటే ఇంకెంత ప్రేమ వుండాలి? నాకేమైనా పెళ్లయి పదేళ్లయిందా? మీ కుళ్లు రాజకీయాల వల్ల పెళ్లయ్యాక గట్టిగా పదిరోజులు కూడా మేము ఆనందంగా లేము. ఇప్పుడు నా భార్య నాకు దూరంగా వుందని తెలిసి మీరేం చేశారు? ఆరాధ్య తల్లిదండ్రులుగా మీరు చెయ్యాల్సింది ఏమీ లేదా? అబార్షన్‌ తప్ప! మీరేం తల్లిదండ్రులండీ! అసలు ఈ సమాజంలో మీలాంటి తల్లిదండ్రులు వుంటారా? వుంటే కొట్టి చంపాలి” అన్నాడు.

          ”హేమంత్‌! వాళ్లనేమీ అనకు…” అరిచింది ఆరాధ్య.

          ”ఏమీ అనను. వాళ్లిప్పుడు నా బిడ్డను కడుపులోనే చంపెయ్యాలని వచ్చారు. ముందు మద్రాసు వెళ్లి వాళ్ల కొడుకు సునీల్‌ని చంపేశాకనే నా బిడ్డను చంపమని చెప్పు! వాళ్లకేమో కొడుకు కావాలి… కూతురు కావాలి… నాకసలు పిల్లలే వద్దా?” అన్నాడు.

          ముగ్గురు అవాక్కయి నోరెళ్లబెట్టారు.

          గదిలో ఉన్న సరయు పరిస్థితి కూడా అలాగే వుంది. ఆమెకు హేమంత్‌ మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి.

          ”అవునూ! నాకు బిడ్డ పుడితే మీకేంటి బాధ? పెళ్లప్పుడు ఆరాధ్యకు బంగారం పెడతామని నా డబ్బులు కాజేశారు. ఇప్పుడు బిడ్డను కూడా కాజేస్తారా?”

          ”నా కసలు గోల్డ్‌ పెట్టుకోవడం ఇష్టంలేదు. ఇంకెప్పుడూ గోల్డ్‌ గురించి మాట్లాడకండి!” అంది వెంటనే ఆరాధ్య అతని మాటల్ని ఖండిస్తూ.

          ”ఫోటోల కోసం తప్ప నువ్వు గోల్డ్‌ పెట్టుకోవని, చీరలు కట్టుకోవని నాకు తెలుసు. నిన్నలా తయారుచేశారు వీళ్లు. పెళ్లికి ముందు హైదరాబాదు వచ్చి నీ తమ్ముడు చాలా తెలివిగా నీకు ఒంటి నిండా పెట్టుకోమని ఒన్‌గ్రాం గోల్డ్‌ నగలు కొనిచ్చి వెళ్లాడు. అవి పెట్టుకొని చూసుకున్నాక నీకు గోల్డ్‌ మీద మోజు పోయింది. వాళ్లకేమో స్వచ్ఛమైన నగలు, నీకేమో పిచ్చినగలు… వాళ్లు మనుషులు కాదని నాకెప్పుడో తెలిసిపోయింది. ఇంకా ఎందుకిక్కడ? పద ఇంటికెళ్దాం!” అన్నాడు హేమంత్‌.

          ”నేను రాను. మావాళ్లను అన్ని తిట్లు తిట్టాక కూడా నేను నీ దగ్గరకి వచ్చి వుంటాననుకుంటున్నావా? నేను రాను” అంది మొండిగా.

          ”నువ్వు రాకుంటే నేనెలాంటివాడినో చూస్తావ్‌! నా భార్యకు అబార్షన్‌ చేయించాలని చూస్తున్నారని మీ మమ్మీ, డాడీల మీద ఇప్పుడే కేస్‌ బుక్‌చేస్తాను! నా బిడ్డను కడుపులోనే అంతం చెయ్యాలని చూసిన వీళ్లు అసలు నా అత్త, మామలే కాదనుకుంటాను. వీళ్లెవరో! నేనెవరో!” అన్నాడు.

          ఖంగుతిన్నది ఆరాధ్య.

          శాంతారాంకి, రమాదేవికి ఊపిరాడడం లేదు.

          ఆరాధ్య ఏమనుకుందో ఏమో అప్పటికప్పుడే మారిపోయింది. ”పదండి! వెళ్దాం! మమ్మీ మీరు ఈ రాత్రికే ఊరెళ్లండి! సరయు వచ్చి మిమ్మల్ని ట్రైనెక్కిస్తుంది” అంటూ లోపలకెళ్లి తనకి సంబంధించినవి సర్దుకొని సరయుతో చెప్పి హేమంత్‌తో బయటకు నడిచింది.

          ఆరాధ్య వెళ్తుంటే అచేతనంగా చూస్తున్నారే కాని ఆమె తల్లిదండ్రులు చిన్న మాటకూడా మాట్లాడలేదు.

                                                                               ********

          హేమంత్‌ బైక్‌ మీద కూర్చుంది ఆరాధ్య.

          ఆమెకు హేమంత్‌ అంటే పట్టరాని కోపంగా వుంది.

          ఆ కోపంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదు. అతన్ని వెనక నుండి గట్టిగా నెట్టెయ్యాలని వుంది. బైక్‌ మీద నుండి పడెయ్యాలని వుంది. అతన్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని వుంది. కానీ ఎలా బాధపెట్టాలో తెలియడం లేదు. అటు, ఇటు కదులుతూ కూర్చుంది. అక్కడెవరూ లేకపోయినా ఎవరో వున్నట్లు ‘హాయ్‌’ చెబుతోంది. ఇది మరీ ఇబ్బందిగా వుంది హేమంత్‌కి… ఆరాధ్య ఎందుకలా చేస్తుందో అతనికి అర్థం కాలేదు.

          జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలనుకున్నప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం, కలిసి జీవించాలన్న తపన, ఆసక్తి, ఆరాటం వుంటేనే అది సాధ్యమవుతుంది. లేకుంటే అది ఎంత కష్టమో!!! హేమంత్‌ బైక్‌ను కంట్రోల్‌ చెయ్యలేక ”కుదురుగా కూర్చోలేవా? ఎందుకలా కదులుతావ్‌?” అంటూ వెనక్కి చూడకుండానే అడిగాడు.

          ఆమెకు మండింది. అంతవరకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటం వల్లనో ఏమో ఇప్పుడతను మాట్లాడగానే ”లోపల నీ బిడ్డ విపరీతంగా తంతుంటే కదలక ఏంచేస్తాను? చస్తానా?” అంది.

          ఇదేదో తేడా సమాధానంలా వుందే అని మనసులో అనుకొని ”ఇద్దరికీ మధ్యలో ఆ బ్యాగెందుకు? ఇలా ఇవ్వు ముందు పెట్టుకుంటాను” అన్నాడు.

          ”వద్దులే!” అంది పొడిగా.

          ”ఎందుకొద్దు. అది నన్ను గుచ్చుకుంటోంది. ఇన్‌కన్వీనియంట్‌గా వుంది. తియ్యి” అన్నాడు.

          ”గుచ్చుకుంటుందా?” వెటకారంగా, కోపంగా వత్తి పలుకుతూ కసిగా అంది. బ్యాగ్‌ను మాత్రం తియ్యలేదు. అతని భుజాల మీదుగా ఎదురుగా కన్పిస్తున్న రోడ్డును చూస్తోంది. ఆమె చూపులు చాలా నిర్లిప్తంగా వున్నాయి. నిరాశగా వున్నాయి.

          ”తియ్యకుంటే విసిరి అవతల పడేస్తాను. నా సంగతి నీకు తెలుసుగా!”

          ”ఇంతవరకు తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అవతల పడెయ్యటమే మీకు తెలుసని…”

          ”ఏం మాట్లాడుతున్నావే! బ్యాగ్‌ తియ్యకుండా!” అంటూ సడన్‌గా బైక్‌ను పక్కకి తీసి ఆపాడు.

          బైక్‌ ఆగి ఆగగానే టక్కున దిగి నిలబడింది ఆరాధ్య.

          ”బైకెందుకాపారు? నన్ను మళ్లీ సరయు దగ్గరకి తీసికెళ్లి దింపుతారా?” అంది.

          ”సరయు దగ్గరికా! నెవ్వర్‌! నిన్నిక ఫ్రెండ్స్‌ దగ్గర వుంచను. సరయును మరచిపో!” అంటూ ఆమె వైపు చూసింది క్షణమే అయినా చాలా పరిశీలనగా చూశాడు.

          ఆమె భుజానికి తగిలించుకున్న హేండ్‌బ్యాగ్‌ నలుపు, చేతిలో పట్టుకొని వున్న బ్యాగ్‌ నలుపు, చున్నీ నలుపు, ప్యాంట్‌ నలుపు. ఒక్క టాప్‌తప్ప డ్రస్‌ మొత్తం నలుపే!

          ”నిన్ను బ్లాక్‌ వాడొద్దని చెప్పాను. అయినా వాడుతున్నావా?” అడిగాడు హేమంత్‌ ఆశ్చర్యపోతూ.

          ”వాడితే ఏమవుతుంది? నాకు చిన్నప్పటి నుండి మా మమ్మీ ఏ డ్రస్‌ తీసుకున్నా బ్లాక్‌ డిజైన్‌ వుంటేనే తీసుకునేది. నేనేమేనా నలుపా? డ్రస్సేగా! అదేదో పెద్ద నేరమైనట్లు మీరు చెప్పిన ప్రతిదీ నేను వినాలి. నాకంటూ ఓ కలర్‌ వుండొద్దు. ఓ టేస్ట్‌ వుండొద్దు. అసలు మీరిలా ఆలోచిస్తారని పెళ్లికి ముందు కొంచెం కూడా వూహించలేదు తెలుసా?” అంది. ఆమె మామూలుగా మాట్లాడడం లేదు. నడుం మీద చేతులుంచుకొని తీవ్రంగా చూస్తూ మాట్లాడుతోంది.

          ”నీ జాతకం ప్రకారం నువ్వు నలుపు వాడకూడదట. అడిగి తెలుసుకున్నాకనే నేను నీకు చెప్పాను. కొంచెం కూడా సెంటిమెంట్స్‌ లేవా నీకు? కనీసం నీ మంచిని కూడా కోరుకోవా?”

          ”సెంటిమెంట్స్‌తో లైఫ్‌ నడవదని నాకు తెలుసు. నేను ఈ కాలం అమ్మాయిని…. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నదాన్ని… అయినా నా జాతకం ఎవరడిగి తెలుసుకున్నారు? మీ కళ్యాణి ఆంటీయేగా! ఆవిడెందుకండీ అన్నిటిల్లో ఇన్వాల్వ్‌ అవుతుంది? ఆవిడకింకేం పని వుండదా? నాకసలు సెన్సే లేనట్లు ట్రీట్‌ చేస్తోందెందుకు? అందుకే ఎవరి మాట వినాలో ఎవరిమాట వినకూడదో నాకు తెలుసు. చిన్నపిల్లను అనుకుంటున్నారా? బి.టెక్‌ చదివానని చెప్పండి!” అంది ప్రౌడ్‌గా. ఆమె ఒక్కోమాట హేమంత్‌ ముఖంలోకి చూస్తూ గట్టిగా మాట్లాడుతుంటే అటుఇటు వెళ్లేవాళ్లు ఒక్కక్షణం ఆగి నిలబడి చూసి మళ్లీ వెళ్తున్నారు.

          హేమంత్‌కి తల్లి మాటలు గుర్తొచ్చాయి ”హేమంత్‌! నీకు నీ భార్య మీద కోపం వచ్చినా, నీ భార్యకు నీమీద కోపం వచ్చినా అది నాలుగు గోడల మధ్యనే ప్రదర్శించుకోండి! నలుగురూ తిరిగే రహదారిలో మాత్రం నిలబడి మాట్లాడుకోవద్దు. అందరి అభిప్రాయాలు ఒకేలా వుండనట్లే చూసే చూపుకూడా ఒకేలా వుండదు. ఆరాధ్య నీతో వాదిస్తున్నప్పుడు బయట ఎవరు చూసినా ఆమె నీ భార్య అని అనుకోరు. లేపుకొచ్చిన పిల్లతో గొడవ పడుతున్నావనుకుంటారు. ఈ విషయంలో నువ్వు చాలా సంయమనం పాటించాలి. తొందరపడొద్దు” అంది.

          ఆ వాతావరణాన్ని చూస్తుంటే తల్లి మాటలు నిజమే అన్పించాయి.

          అటుఇటు వెళ్లేవాళ్లు చూసేకొద్దీ ఆరాధ్య ఇంకా ఎక్కువ చేసి మాట్లాడుతోంది.

          ”సరే! బైకెక్కు! ఇంటికెళ్లి మాట్లాడుకుందాం!”

          ”ఎక్కుతాను. ఇంటికెళ్లాకనే మాట్లాడుకుందాం! కానీ ఒక్కటి మాత్రం చెప్పండి మీవాళ్లతో…” అంది.

          ”ఏంటా ఒక్కటి! త్వరగా చెప్పు!” అన్నాడు. అతనికి ఎక్కువసేపు అక్కడ నిలబడాలని లేదు. అప్పటికే జనాలు చాలా డర్టీగా చూస్తున్నారు.

          ”చెబుతాను. వినండి! నేను ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని. ఏ విషయంలోనైనా స్ట్రాంగా వుంటాను. స్ట్రాంగ్‌గానే ఆలోచిస్తాను. చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్‌ కాను. అయ్యాను అంటే దాని వెనకాల సవాలక్ష కారణాలు వుంటాయి. అది గమనించకుండా ఏదో అయ్యానని అక్కడ నిలబడు, ఇక్కడ కూర్చో, ఇది తిను, ఇది వద్దు. ఈ డ్రస్‌ వేసుకో ఇది నలుపు కాదు. అంటే మాత్రం ఒప్పుకోను. నాకసలే నా టెన్షన్స్‌ నాకున్నాయి” అంది.

          కంగారుగా అటుఇటు చూసి బైక్‌ స్టార్ట్‌ చేశాడు హేమంత్‌. అతనికి లోకభీతి ఎక్కువ. అది ఆమెకు లేదు. అందుకే ఆమె చాలా మామూలుగా ముఖంపెట్టి చాలా ప్రశాంతంగా బైకెక్కి కూర్చుంది.

                                                      *************

          హేమంత్‌, ఆరాధ్యలు వెళ్లాక శాంతారాం, రమాదేవి నిర్వీణ్ణులై కూర్చుండిపోయారు. శాంతారాం కుర్చీలో వెనక్కి వాలి కళ్లు మూసుకున్నాడు. రమాదేవి భర్తవేపు చూసింది.

          ”ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడు. ఎక్కడికొచ్చినా నిద్రే! దిక్కుమాలిన నిద్ర. పిల్లను వాడు తీసికెళ్లాడన్న స్పృహకూడా లేదు. ఎప్పుడొస్తుందో తెలివి…” అనుకుంటూ, నుదుటి మీద గట్టిగా శబ్దం వచ్చేలా కొట్టుకుని, సరయు వుండే గదిలోకి వెళ్లింది.

          సరయు లాప్‌టాప్‌లోకి చూస్తూ బోర్లా పడుకొని వర్క్‌ చేసుకుంటోంది. రమాదేవి గదిలోకి వచ్చినట్లు ఆమె చూడలేదు. రమాదేవి అది గమనించి ఆ గదిలో ఎక్కడ కూర్చోవాలి అన్నట్లు ఆసనాన్ని వెతుక్కుంటుంటే అప్పుడు చూసింది సరయు.

          అంతవరకు పడుకొని వున్న సరయు లేచి కూర్చుని పక్కకి జరిగి-

          -”ఆంటీ! కూర్చోండి!” అంది.

          ”నువ్వేదో పనిలో వున్నట్లున్నావ్‌?” సందేహంగా చూస్తూ అడిగింది రమాదేవి.

          ”పర్వాలేదాంటీ!”

          ”నీపని ఆగిపోతుందేమో!”

          నవ్వి ”అలా ఏం ఆగదులెండి!” అంది సరయు.

          లాప్‌టాప్‌లో లైట్‌ వెలుగుతూ, ఆ వెలుగులో చిన్నచిన్న ఇంగ్లీష్‌ అక్షరాలు, మధ్య మధ్యలో బాక్స్‌లు కట్టినట్లు గీతలు కన్పిస్తుంటే ఆసక్తిగా చూసి ”ఏంటమ్మా ఆ పని?” అంటూ అడిగింది రమాదేవి. ఆమెకు ఏది కన్పిస్తే అది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ. అది తనకు అవసరం లేకపోయినా అంతే! వున్నా అంతే! అడిగి తెలుసుకుంటే పోయేదేముంది! వచ్చేది తప్ప అనుకుంటుంది. చెప్పేవాళ్లు వుండాలే కాని అడిగిందే అడిగి చంపుకుతింటుంది.

          ”ముందు మీరు కూర్చోండి ఆంటీ చెబుతాను”

          రమాదేవి కూర్చుంది. కూర్చున్నా ఆమె చూపులు లాప్‌టాప్‌ మీదనే వున్నాయి.

          సరయు లాప్‌టాప్‌ వేపు వేలు చూపించి ”అమెరికాలో వుండే మా క్లయింట్‌కి వర్క్‌ ప్రోగ్రెస్‌ మీద డెమో ప్రజెంటేషన్‌ ప్రిపేర్‌ చేస్తున్నానాంటీ!” అంది.

          రమాదేవికి ఒక్కముక్క అర్థం కాకపోయినా, అడిగినా అర్థం కాదనుకుందో ఏమో మౌనంగా చూసింది.

          సరయు మాత్రం ”మేము ఏ రోజుకారోజు మా కంపెనీ ద్వారా ఆమెరికాలో వీక్లీ రిపోర్ట్స్‌ పంపించాలి ఆంటీ! ఇవాళ ఆరాధ్యతో హాస్పిటల్‌కి వెళ్లాలని లీవ్‌ పెట్టాను. ఈరోజు ఫ్రైడే కదా! క్లయింట్‌ వీక్లీ వర్క్‌ ఇంపార్టెంట్‌ పెర్పార్మెన్స్‌ ప్రజెంటేషన్‌ పెండింగ్‌లో వుంది. అందుకే ‘వర్కింగ్‌ ఫ్రం హోం’ చేస్తున్నాను” అంది.

          ”ఇలాంటివి మా ఆరాధ్య కూడా చేస్తుందా?”

          ”తను చెయ్యదు ఆంటీ!”

          ”ఎందుకు చెయ్యదు?”

          ”తను ప్రెషర్‌ కాబట్టి ఇలాంటి వర్క్‌ తనకి వుండదు”

          ”ఆఫీసులో వుంటుందా?”

          ”ఆఫీసులో కూడా తక్కువగానే వుంటుంది”

          ”ఏం తక్కువో ఏమో సరయూ! నా బిడ్డ ఉద్యోగంలో చేరాక చాలా వీకైపోయింది” అంటూ బాధపడింది.

          సరయు మళ్లీ లాప్‌టాప్‌ వేపు తిరిగి ”అలా ఏం లేదాంటి! ఆరాధ్య బాగానే వుంది. మొన్న హాస్పిటల్‌ వెళ్లినప్పుడు బ్లెడ్‌ పర్సెంటేజ్‌ కూడా చూశారు. నోప్రాబ్లమ్‌! ఆరాధ్య హెల్త్‌ ఈజ్‌ పర్‌ఫెక్ట్‌!” అంది.

          ”తల్లిని కదా సరయూ! నా కళ్లకి నా బిడ్డ అలాగే కన్పిస్తుంది?” అంది రమాదేవి.

          తల్లి అయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్లు కన్పించదా? చిత్రంగా వుందే! ఎంత ఆశ్చర్యం! ఎందుకలా కన్పించదు? ఎందుకంటే తల్లి మనసు చాలా గొప్పది, అద్భుతమైనది, అద్వితీయమైనది కాబట్టి. అంతేకాదు. దయా, జాలి, కరుణ ఒక్క తల్లికే వుంటాయంటారు. అది ఊహ కాదు. కల్పనా కాదు, పచ్చి నిజం. సరయుకు తల్లి లేకపోవటం వల్లనో ఏమో లాప్‌టాప్‌ మీద వున్న చూపుల్ని రమాదేవి వైపుకి మళ్లించి శ్రద్ధగా ఆమె మాటల్ని వినసాగింది.

          సరయు పూర్తిగా తన వైపుకి తిరిగాక రమాదేవి చాలా విచారంగా ముఖంపెట్టి ”హేమంత్‌ మాటలు విన్నావుగా సరయూ! మమ్మల్ని అనాల్సిన మాటలేనా అవి? ఆరాధ్య కడుపులో రెండు నెలలు కూడా నిండని నెత్తుటి గుడ్డు ఎక్కడ! బి.టెక్‌ చదువుతున్న నా కొడుకు సునీల్‌ ఎక్కడ? సునీల్‌ని చంపెయ్యమనటం బావుందా? నీకు నచ్చిందా? అంత తప్పు మేమేం చేశాము. మమ్మల్ని హేమంత్‌ సరిగా అర్థం చేసుకోవటం లేదు. ఎలా బడితే అలా మాట్లాడుతున్నాడు” అంటూ కన్నీళ్లు రాకపోయినా వచ్చినట్లే కొంగుతో కళ్లను వత్తుకుంది.

          ”మీరు బాధపడకండి ఆంటీ! అతనేదో ఆవేశంలో అలా అన్నాడు. అబార్షన్‌ అనేది అంత పెద్ద సీరియస్‌ మేటరేం కాదు. నేను చాలాసార్లు చేయించుకున్నాను. లైట్‌” అంది.

          ”లైటా!! చాలాసార్లు చేయించుకున్నావా?” విభ్రమగా చూస్తూ అడిగింది.

          ”అవునాంటీ!” అంది సరయు ఏమాత్రం తడబడకుండా.

          సరయుకి దగ్గరగా జరిగి గొంతు తగ్గించి ”ఒకసారి అబార్షన్‌ చేయించుకుంటే మళ్లీ ప్రెగ్నెన్సీ రాదంటారు నిజమేనా సరయూ?” అడిగింది రమాదేవి.

          ”రాదని కాదాంటీ! వస్తుంది. బై మిస్టేక్‌! రావొచ్చు. రాకపోవచ్చు. కొంచెం కష్టం కూడా కావచ్చు. అందుకే భయపడేవాళ్లు భయపడుతుంటారు. భయపడనివాళ్లు అసలు భయపడరు”

          ”మరి నీకు అలాంటి భయాలేమీ లేవా?”

          ”లేవాంటీ! ఎందుకంటే నన్ను పెళ్లిచేసుకున్న అతని మనసు నిలకడైంది కాదు. అతనితో పిల్లల్ని కంటే కొని బర్డన్‌ తెచ్చుకున్నట్లే! అదీకాక నాకు అతనితో వున్నప్పటికంటే పెళ్లికి ముందే సౌకర్యంగా వున్నట్లనిపించింది. అందుకే నేను అతన్నుండి దూరంగా వుండాలని విడాకులు తీసుకున్నాను. అవి తీసుకోటానికి కూడా నాకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. డబ్బుకన్నా మనశ్శాంతే ముఖ్యమనుకున్నాను… ఒకవేళ పెళ్లి కాకుండా పిల్లల్ని కనే అవకాశమే వుంటే నేను దాన్ని తప్పకుండా ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు నచ్చని భర్తకు భార్యగా వుండాల్సిన అవసరం కాని, ఆ బాధలు కాని నాకు ఏమాత్రం అవసరం లేదు. ఆంటీ! నేనిలా అంటున్నందుకు మీరేమీ అనుకోకండి! ఎందుకంటే నా భర్తలో నేను చాలా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచంలో నేను ఇమడలేకపోయాను. నాకెందుకో అతన్ని నాతో పోల్చుకున్నప్పుడు అతను నాకన్నా తక్కువగా అన్పించాడు. కారణం అతను నాచుట్టూ తన అహంకారపు మానసిక వ్యూహాన్ని పన్నేవాడు. చీప్‌ ట్రిక్స్‌ ప్లే చేసేవాడు. అలాంటి వ్యూహాలు నాకు నచ్చవు” అంది.

          రమాదేవి సరయు మాటల్ని నోరెళ్లబెట్టి విన్నాక

          ”నీకు తోడు వద్దా సరయూ? అతను లేకుండా నువ్వు వుండగలవా?” అంది.

          ”అతని తోడు లేకపోయినా నేను వుండగలను ఆంటీ! ఎందుకంటే నేను జాబ్‌ చేస్తున్నాను కదా! అందుకే అతని అవసరం నాకు అంతగా లేదు. కానీ అతను మాత్రం పెళ్లికి ముందుకన్నా పెళ్లయ్యాకనే సంతోషంగా వున్నాడు. అది తెలిసి కూడా రోజూ నాతో ఘర్షణ పడేవాడు. వేధించేవాడు. మా అభిరుచులు కలవలేదు. అభిప్రాయాలు కూడా కలవలేదు. ఏ రకంగా చూసినా అతనితో నేను తీర్చుకునే అవసరాలు కూడా నాకేం కన్పించలేదు. ఏ రోజూ నన్ను అతను శ్రద్ధగా చూసింది లేదు. ఆలంబన ఇచ్చిందీ లేదు. ఆదుకున్నదీ లేదు. ప్రేమించిందీ లేదు. అందుకే ఇలా ఒంటరిగా వున్నాను. ఇప్పుడు చెప్పండి ఆంటీ! నాలాంటి వాళ్లకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, పిల్లల్ని కనటం అవసరం అంటారా?” అడిగింది సరయు.

          అటు ఇటు కాకుండా తల వూపింది రమాదేవి.

          ”ఆంటీ! మీరోజులు వేరు. ఇప్పటి ఈ రోజులు వేరు. నాలాంటి అమ్మాయిలకు ఉద్యోగంతో వున్నంత అవసరం పిల్లలతో వుండదు. పరిస్థితులు ఎలా మారినా మమ్మల్ని ఉద్యోగాలు ఆదుకుంటాయి కాని పిల్లలు ఆదుకోరు”

          ”చక్కగా మాట్లాడుతున్నావు సరయు!” అప్పుడు నోరు విప్పింది రమాదేవి.

          ”మీరు ఆరాధ్యకు అబార్షన్‌ చేయించాలనుకోవటంలో తప్పులేదాంటీ! ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఓ బిడ్డను మోసి, కని పోషించడమంటే మాటలు కాదు. దానికి పెద్దవాళ్ల సపోర్ట్‌ చాలా కావాలి. అంత ఫ్రీగా మీరు లేరేమో కదా! అంకుల్‌కి వండిపెట్టాలి. మీ బాధ్యతలు మీకున్నాయేమో!!” పెద్దవాళ్లు ఎవరున్నారు?”

          ”ఆ మూర్ఖుడికి అది అర్థం కాక నా కొడుకుని చంపెయ్యమంటున్నాడు. నాకేమైనా పదిమంది కొడుకులున్నారా? వుండేది ఆ ఒక్కడే! నీకు తెలుసో లేదో నా కొడుకును చూస్తే చాలు కళ్లలో నిప్పులు   పోసుకుంటాడు. వాడు లేకుంటే ఆస్తి మొత్తం ఆక్రమించుకోవచ్చనో ఏమో! అప్పటికీ చెప్పాం! ‘నిన్ను మా రెండో కొడుకులా అనుకుంటున్నాం. మాకు సునీల్‌తో పాటు నువ్వుకూడా కొడుకులాంటి వాడివే’ అని… అయినా మమ్మల్ని ద్వేషిస్తూనే వుంటాడు. మా కర్మ కాకుంటే మాకు ఇలాంటి అల్లుడు దొరకటం ఏమిటి?” అంటూ నెత్తీ, నోరూ కొట్టుకుంది.

                సరయు మాట్లాడలేదు.

                ”మా మరుదుల కోడళ్లని, మా అక్కల కోడళ్లని వాళ్ల భర్తలు ఎంత బాగా చూస్తారో తెలుసా? పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు. ఒక్క పైసా కట్నం కూడా తీసుకోలేదు. కాన్పులు కూడా వాళ్ల సొంత ఖర్చులతోనే చేసుకున్నారు. పుట్టింటికి పంపనే లేదు. వాళ్లను చూస్తుంటే నా బిడ్డకు కూడా అలాంటి భర్త దొరకలేదని ఒకటే బాధ నాకు… ఎక్కడైనా భర్తలు అలాగే వుంటారు సరయు! ఇలా ఎక్కడా వుండరు…. ఇలాంటి అల్లుడు మళ్లీ పుట్టడనుకో!” అంది ఏడుపు కళ్లతో… ఆ కళ్లు రెండూ ఎర్రబడి వున్నాయి. దురద పుడితే నలిపినట్లు కొంగుతో ఆ కళ్లను ఒకటే నలుపుతోంది.

                సరయు ఆశ్చర్యపోయి చూస్తోంది. ఈవిడ ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుందా అని… ”హేమంత్‌కి మీరు కట్నం బాగా ఇచ్చారా ఆంటీ! ఇచ్చే వుంటారు. సాఫ్ట్‌వేర్‌ అబ్బాయి కదా! ఎంత ఇచ్చినా ఈ కాలం అబ్బాయిలు తృప్తి పడరు ఆంటీ! హేమంత్‌ కూడా అలాగే మీరు ఇచ్చింది చాలక డిమాండ్‌ చేస్తున్నాడా?” అంది.

                ”చాలానే ఇవ్వాలనుకున్నాం! ఇవ్వక ఏం చేస్తాం! మాకేమైనా పదిమంది కూతుళ్లు వున్నారా? వుండేది ఆ ఒక్కతేగా!” టక్కున ముక్కు తుడుచుకుంది.

                ”అదికాదులెండి ఆంటీ! నాకు తెలిసి చాలాచోట్ల ఇవ్వాలనుకున్నది పెళ్లిలో ఇచ్చేసి సైలెంట్‌గా వుండిపోతారు. మళ్లీ గొడవలు లేకుండా చేసుకుంటారు. అదేం అంటే అల్లుడేమైనా కొడుకా పాకెట్‌మనీ ఇచ్చినట్లు అప్పుడప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోమనటానికి పెళ్లిలో పెద్దమనుషుల ముందు ఏమిస్తామని మాట్లాడుకున్నామో అది ఇచ్చేయాలి అంటుంటారు. మా ఫ్రెండ్స్‌ పెళ్లిళ్లలో చూస్తుంటాం కదా!” అంది.

                ”మేము కూడా ఇస్తాము సరయు. ఎందుకంటే మా ఆరాధ్య అంటే మాకు ప్రాణం. ప్రేమగా పెంచుకున్నాం. ఎంత ప్రేమగా పెంచుకున్నామంటే అది చెప్పినా అర్థం కాదు. ఒక్క కూతురైనందువల్ల మా ప్రాణమంతా దానిమీదనే పెట్టుకొని పెంచుకున్నాము. మాది స్వీట్‌హౌజ్‌ అన్నమాటే కాని దానికెప్పుడు అందులో స్వీట్స్‌ పెట్టలేదు. అల్లూరయ్య నేతి స్వీట్స్‌, పుల్లారెడ్డి నేతి స్వీట్స్‌ తెచ్చిపెట్టి పెంచుకున్నాం. దానికి మేము కోరిన తిండి పెట్టుకొని పెంచుకున్నాం…” అంది.

                అది వినగానే సరయుకి ఓ డౌట్‌ వచ్చింది. ఆరాధ్య ఇన్నిరోజులు తన దగ్గరే వున్నది కదా ఒక్క రోజన్నా అల్లూరయ్య స్వీట్స్‌ గురించి చెప్పలేదు. పుల్లారెడ్డి స్వీట్స్‌ గురించి చెప్పలేదు. అంత ప్రేమగా పెంచుకున్న వాళ్లయితే ఒక్కసారైనా ఆ స్వీట్స్‌ని కొరియర్‌లో పంపి వుండాల్సింది కదా! ఏమోలే అదిప్పుడు అడిగితే బావుండదు. అసలే బాధలో వుంది. బాధలో వున్నవాళ్లను బాధపెడితే వాళ్ల బాధలన్నీ బాధపెట్టినవాళ్లకి ట్రాన్స్‌ఫర్‌ అవుతాయట. ఫ్రెండ్స్‌ అనుకుంటుంటే విన్నది. అప్పటి నుండి ఓవర్‌ ఫ్రాంక్‌నెస్‌ని పూర్తిగా తగ్గించుకుంది.

                అందుకే ”ఆంటీ! మీరేమి వర్రీ కాకండి! హేమంత్‌ కూడా ఆరాధ్యకు కోరిన తిండి తెచ్చిపెడతాడు. చూస్తుంటే అతను మంచివాడిలాగే అన్పిస్తున్నాడు” అంది.

                ”పెళ్లయ్యాక అతనికీ, మాకు గొడవలొచ్చాయి సరయు! ఎంత మంచివాడైనా ఆ కోపం అలాగే వుంటుందిగా! అందుకే దాన్ని అతనికి దూరంగా వుంచితేనే అది మనశ్శాంతిగా వుంటుందని మా కోరిక…ఇప్పుడది హేమంత్‌ దగ్గరకి వెల్లటం మాకు ఇష్టమే లేదు”

                ”తనకేమైనా ఇబ్బందిగా వుంటే మళ్లీ నా దగ్గరకే వస్తుందిలెండి ఆంటీ! నేనుకూడా తనకి కాల్‌ చేస్తూ టచ్‌లో వుంటాను” అంది.

                ”వుండమ్మా! లేకుంటే ఆ మూర్ఖుడు తన బిడ్డను కనేదాకా వదిలేలా లేడు. ఈ లోపల దాన్ని ఎన్ని తిప్పలు పెడతాడో ఏమో! అసలు ఆరాధ్యకు ఆ బిడ్డను కనటమే ఇష్టం లేదు తెలుసా!” అంది.

                ”అయ్యో! ఆంటీ! మీకేం తెలియదు. అది అసలు అలా చెప్పనే లేదు”

                ”దానికి చెప్పటం రాదు. అందుకే నువ్వలా అనుకుంటున్నావ్‌!”

                ”అవునా!! మరి అలాంటప్పుడు ఆరాధ్య ముందుగానే జాగ్రత్తలు తీసుకొని వుండాల్సింది కదా!” అంది.

                ”దానికేం తెలుసు. అది పసిపిల్ల…” అంది.

                ఆరాధ్యను ఆవిడ పసిపిల్ల అనగానే కిసుక్కున నవ్వింది సరయు.

                ఆ నవ్వెందుకో రమాదేవికి నచ్చక ”కొద్దిసేపు పడుకుంటాను సరయు! మా ఇద్దర్ని రాత్రికి ట్రైనెక్కించి పంపించు” అంటూ భర్త దగ్గరకి వెళ్లి అతని పక్కన వున్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్లు మూసుకుంది.

                కళ్లు మూసుకున్న రమాదేవి ఆలోచనలు నఖముఖాలుగా సాగుతున్నాయి. ”తను ఊరెళ్లాక ఆరాధ్యను ఎలాగైనా తన ఊరుకి రప్పించుకొని పక్కింట్లో వుండే నర్సు సాయంతో కడుపు తీయించేయాలి. లేకుంటే బిడ్డ పుట్టాక ‘నేను జాబ్‌కెళ్లాలి. ఈ బిడ్డను కొద్దిరోజులు నీ దగ్గర వుంచుకో మమ్మీ!’ అని ఆరాధ్య అంటే అప్పుడు తనకే కష్టమవుతుంది. తనా బిడ్డను పెంచలేక షాపులో కూర్చోలేక సతమతమవ్వాలి. అసలే తనకి లోబి.పి.” అని మనసులో అనుకుంటూ ఆ నిర్ణయమేదో కాస్త గట్టిగానే తీసుకుంది రమాదేవి.

                                                                     *********

హేమంత్‌ తండ్రి కాబోతున్న సందర్భంగా ఫ్రెండ్సందరికీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడు.

                అది తెలిసి ఆరాధ్య సంతోషించింది. అంతవరకు హేమంత్‌ మీద వున్న కోపం పూర్తిగా తగ్గింది.

                ఒక పదిరోజులు గడిచాక ఆరాధ్యకు కాల్‌ చేసి ”ఎలా వున్నావు ఆరాధ్యా! తింటున్నావా? తినట్లేదు కదూ! ఇంకా తినలేదు కదూ?” అంటూ రమాదేవి బాధతో కూడిన గొంతుతో అడిగింది.

                ”తిన్నాను మమ్మీ!”

                ”నువ్వు తినలేదులే! నాకు తెలుసు”

                తిన్నానని ఎంత చెప్పినా వినకుండా ”నువ్వు తినలేదులే! నాకు తెలుసు. ఎప్పుడు చూసినా పడుకోవాలనిపిస్తోంది కదూ! ఆ బాధ నాకు తెలుసు కాబట్టే నేను నిన్ను ఇక్కడికి రమ్మంటున్నాను. కొద్దిరోజులు సెలవు పెట్టిరా! ఇక్కడయితే నీకేం కావాలో అది నేను వండి పెడతాను”

                హేమంత్‌ అక్కడే వుండటంతో వింటాడని పక్కకెళ్లింది ఆరాధ్య. ఈమధ్యన హేమంత్‌ ముందు తల్లితో మాట్లాడాలంటే భయపడుతోంది.

                ”నేను నీకు ఏది చెప్పినా నీ గురించి బాగా ఆలోచించే చెబుతాను ఆరాధ్యా! తల్లిని కదా! నాకు నీ ఆలోచన తప్ప ఇంకేముంటుంది చెప్పు! పెళ్లి కాగానే బిడ్డను కంటే ఏం సుఖపడతావు? సరదాగా ఊర్లు తిరగగలవా? గుట్టల మీద వుండే గుడులకెళ్లగలవా? ఈ సమయంలో మెట్లు ఎక్కకూడదు. దిగకూడదు అని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా జాగ్రత్తలు పాటించాలంటారు. ఒక్కోసారి బెడ్‌రెస్ట్‌ కూడా అవసరం అవుతుందట… మనుషులు తిన్నట్లు అన్నిరకాల తిండి తినకూడదు. కోరిన తిండి కళ్లముందు కన్పిస్తున్నా గుటకలు మింగుకుంటూ కూర్చోవాలి. కొన్ని తింటే నీకు ఇబ్బంది. కొన్ని తింటే బిడ్డకి ఇబ్బంది. ఇవన్నీ నా మాటలు అనుకుంటున్నావా? కాదు. మన ఇంటిపక్కన వుండే నర్స్‌ని అడిగి తెలుసుకున్నాను. ఆవిడ కూడా ‘ఆరాధ్యకు అప్పుడే పిల్లలెందుకు? మొన్ననేగా జాబ్‌లో చేరింది. ఎంజాయ్‌ చెయ్యనియ్యండి’ అంటోంది.

                అదీకాక నువ్వు జాబ్‌లో చేరాక కొన్న డ్రస్‌లన్నీ నెలలు నిండేకొద్ది కుట్లు విప్పినా సరిపోవు. వేస్టయి పోతాయి. వాటిని నువ్వెంత మోజుపడి కొనుక్కున్నావో నీకు తెలుసు. ఒకవేళ బిడ్డ పుట్టాక ఆ డ్రస్‌లు నువ్వు వేసుకున్నా ఇప్పుడొచ్చిన లుక్‌ అప్పుడు రాదు. ఈ అందం తగ్గితే హేమంత్‌ తప్పకుండా నీ ముఖం చూడడు. ఎందుకంటే అతను నువ్వు అందంగా, ఆకర్షణీయంగా వుండబట్టే ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. బిడ్డ పుట్టాక నీలో ఈ చర్మకాంతి వుండదు. ఈ లేతదనం వుండదు. మార్పు వస్తుంది. ఆ మార్పును అతను అంగీకరించడు” అంటూ భయపెట్టింది రమాదేవి.

                తల్లి మాటల్ని నమ్మింది ఆరాధ్య. వెంటనే కాల్‌ కట్‌చేసి హేమంత్‌ దగ్గరికి వెళ్లింది.

                ”హేమంత్‌! నాకు హెల్త్‌ సపోర్ట్‌ చెయ్యటం లేదు. లీవ్‌పెట్టి మా ఊరు వెళ్దామనుకుంటున్నాను” అంది ఆరాధ్య.

                ”వద్దు. నువ్వు మీ ఊరు వెళ్తే మీవాళ్లు అబార్షన్‌ చేయించేసి పంపుతారు”

                ”అలా ఏం జరగదు”

                ”జరగదన్న గ్యారంటీ లేదు”

                ”నేను గ్యారంటీ ఇస్తాను”

                ”నాకు నమ్మకం లేదు”

                ”ఎందుకలా?”

                ”నీకు తెలిసి కూడా ఆర్గ్యూ చెయ్యకు”

                ”హేమంత్‌! నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు”

                ”నేను ఆఫీసుకెళ్తున్నాను” అంటూ ఆమె మాటకు ఏమాత్రం ఇంపార్టెన్స్‌ ఇవ్వకుండా వెళ్లిపోయాడు.

                ఆమె వెళ్తున్న హేమంత్‌ వేపు చూస్తూ నిలబడింది. అతను పది అడుగులు వెయ్యగానే తిరిగి లోపలకి వచ్చి ”ఏంటీ! నిలబడ్డావ్‌! ఆఫీసుకెళ్లవా?” అని అడిగాడు.

                ఆమె మాట్లాడలేదు. అలా అని అతనివేపు కోపంగా కూడా చూడలేదు.

                అతను వెళ్లిపోయాడు.

                అతను వెళ్లగానే డోర్‌ పెట్టుకుంది.

                ఆమె ఆఫీసుకి వెళ్లలేదు.

                ఒక గంటసేపు బెడ్‌మీద పడుకుంది. ఆ తర్వాత హేమంత్‌కి కాల్‌ చేసింది. అతను వర్క్‌ బిజీలో వుండి ఆమె కాల్‌ని రిసీవ్‌ చేసుకోలేదు. ఉదయం నుండి మూడ్‌ అవుట్‌లో వున్నందువల్లనో ఏమో ఆరోజు హేమంత్‌ వర్క్‌ కంప్లీట్‌ కాలేదు. అదే టెన్షన్‌లో వున్నాడు. లంచ్‌ అవర్‌లో ఒకసారి, ఈవినింగ్‌ టీ టైంలో ఒకసారి ఆరాధ్య కాల్‌ చేసింది. అప్పుడు లిఫ్ట్‌ చేశాడు కాని హాఫ్‌ మినిట్‌కన్నా ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. అతను ఇంటికొచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలయింది.

                హేమంత్‌ వచ్చినట్లు కాలింగ్‌ బెల్‌ విన్పించి నిద్రలేచి వచ్చి డోర్‌ తీసింది ఆరాధ్య.

                ఆరాధ్యను చూడగానే అతను ఎప్పటిలాగే హుషారుగా నవ్వి, ఆమె నడుం మీద చెయ్యేసి లోపలికి నడవబోయాడు. చేతిమీద కొట్టినట్లే చేతిని దులిపేసింది ఆరాధ్య.

                ఆశ్చర్యంతో కాసింత అవమానంతో అతని గుండెలో చిరుకంపన కలిగింది. దాన్ని పైకి ప్రదర్శించ నీయకుండా ”ఏంటిరా! అలా వున్నావ్‌?” ప్రేమగా అడిగాడు.

                ఈసారి మరింత ఏహ్యంగా చూసి విదిలించినట్లు నెట్టేసింది.

                హేమంత్‌ నొచ్చుకున్నాడు. అయినా ”ఎందుకలా వున్నావ్‌ ఆరాధా? ఒంట్లో బావుండలేదా?” అని అడిగాడు. ఆరాధ్య మాట్లాడలేదు. ఈసడింపుగా చూసింది. అలాంటి చూపును ఎంత మొండి గుండెకలవాడైనా భరించలేడు. అయినా భరించాడు హేమంత్‌. నార్మల్‌గా లోపలకి వెళ్లి బ్యాక్‌ప్యాక్‌ను టేబుల్‌ మీద పెట్టి ఆరాధ్య ముఖంలోకి చూడాలనిపించకపోయినా ఓ చూపు చూసి ”నిన్ను నేను మార్నింగ్‌ మీ ఊరు వెళ్లొద్దని చెప్పాను కదా! అది నేను మరిచిపోయాను. అందుకే నీ నడుంమీద చెయ్యేశాను. దగ్గరకు తీసుకోబోయాను. అదంతా వేస్ట్‌ కదా! నువ్వు మూడ్‌ అవుట్‌లో వున్నప్పుడు నేను అలా బిహేవ్‌ చెయ్యొచ్చా! చేస్తే నాకొచ్చేదేమిటి? నేను బాధపడటం తప్ప….” అంటూ వెళ్లి పడుకున్నాడు.

                ఆరాధ్య అతన్ని అలాగే చూస్తూ నిలబడింది.

                రోజూ ఆ టైంలో ఇద్దరు కూర్చుని డిన్నర్‌ చేస్తూ ఆఫీసు కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఆరాధ్య ముందుగా ఇంటికొచ్చినా హేమంత్‌ వచ్చి హెల్ప్‌ చేసేంత వరకు వంట చేసేది కాదు. అదేం అంటే ”మీరు తినేటప్పటికి వేడి తగ్గిపోతుంది. వేడివేడిగా తింటే అదో గొప్ప ఫీల్‌ కదా!” అంటుంది.

                అది నిజమే! తిండి దగ్గర ఇద్దరు కాంప్రమైజ్‌ కారు. రుచిగా, శుచిగా, ఇంట్రెస్ట్‌గా వంట చేసుకుంటారు. వాళ్లు ఇంట్లో వంట చేయకపోయినా ఆఫీస్‌లో ఫుడ్‌ దొరుకుతుంది. ఆ ఫుడ్‌ రేటు కూడా రీజనబుల్‌గానే వుంటుంది. కానీ ఆ ఫుడ్‌ తినటానికి కొంచెం తియ్యగా, చప్పగా వుంటుంది. అది పూర్తిగా మిక్స్‌డ్‌ ఫుడ్‌. ముఖ్యంగా మన స్టైల్లో వుండదు. అందుకే హేమంత్‌ కాని, ఆరాధ్య కాని ‘హోం మేక్‌ ఫుడ్‌’నే ఎక్కువగా ఇష్టపడతారు. మొదట్లో ఆరాధ్యకు వంట వచ్చేది కాదు. అంతో ఇంతో వచ్చినా రమాదేవి హేమంత్‌తో ”మా ఆరాధ్యకు వంట రాదు బాబు! నువ్వు వంట చేయిస్తావేమో! ఒళ్లు కాల్చుకుంటుంది! జాగ్రత్త!” అని చెప్పింది. అలా చెప్పటం వల్లనో లేక ఆరాధ్య అంటే ప్రేమ వల్లనో తెలియదు కాని ఎక్కువ శాతం వంట హేమంత్‌ చేస్తాడు.

                సరయు దగ్గర వున్నప్పుడు చచ్చినట్లు వంటచేసిన ఆరాధ్య హేమంత్‌ దగ్గరకి వచ్చాక చచ్చినా వంట చెయ్యకూడదని ముందే అనుకుంది. ఎందుకంటే అతను తనముందే కాకుండా సరయు వింటుందని కూడా చూడకుండా తన తల్లిదండ్రులను యానిమల్స్‌ అని తిట్టాడు. అలా ఎందుకు తిట్టాడు? ఎంత కోపం వస్తే తిట్టాడు అన్నది కాదు. అసలైతే తిట్టాడు కదా! అందుకే అతనికి నచ్చినట్లు వుండాలనిపించటం లేదు. నచ్చిన పనులు చెయ్యాలనిపించటం లేదు. అతను చేసిన వంట కడుపు నిండా తినకుండా తిట్టాలనిపిస్తోంది. అలా తిట్టినప్పుడు ”ఓ… మైగాడ్‌! ఎందుకలా తిడతావ్‌?” అని హేమంత్‌ అడగడం కూడా జరిగింది. అతనలా అడిగినప్పుడు ఏమాత్రం తడబడకుండా ”వేవిళ్లున్నప్పుడు ఏ అమ్మాయి అయినా తిండివేపు చూడగానే ఇలాగే తిడుతుందట మా మమ్మీ చెప్పింది” అంటుంది. మమ్మీ చెప్పింది అనగానే అతను నిజమే కావొచ్చని నోరెత్తేవాడు కాదు. కడుపునిండా తింటూ కూడా బయట ఫ్రెండ్స్‌కి, ఆఫీసులో ఫ్రెండ్స్‌కి నేనసలు తిండే తినటం లేదు. ఏం క్యారియింగో ఏమో అని చాలాసార్లు చెప్పింది. రమాదేవి కూడా అంతే! కన్పించిన ప్రతివారికి నా బిడ్డకి హైదరాబాదులో తిండే లేదని చెబుతుంది.

                ”అదేంటి రమా! అలా అంటున్నావ్‌! నీ కూతురుకి తినటానికి తిండేలేదా? అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నావ్‌!” అని ఎవరైనా అడిగితే బరువుగా నిట్టూర్చి ”అన్నాను. ఇప్పుడు మాత్రం కాదన్నానా? అక్కడ అదే చేసుకొని అదే తినాలి అంటే ఏం తింటుంది? మొన్నటివరకు దానికి నేను చేసింది తినడమే సరిగా వచ్చేదికాదు. ఎంత బ్రతిమాలినా తినేది కాదు. ఇప్పుడు దాన్ని ఎవరు బ్రతిమాలుతారు? ఎవరు పిలుస్తారు? అతనైనా ఒకసారి, రెండుసార్లు పిలుస్తాడు కాని తర్వాత అతను మాత్రం పిలుస్తాడా? అతనొక్కడే చక్కగా తినేసి పడుకుంటాడు. అనవసరంగా పెళ్లిచేశాం! మా ఆరాధ్యతోటి అమ్మాయిలకు అసలు పెళ్లిళ్లే కాలేదు. పైగా అదిప్పుడు వట్టిమనిషి కూడా కాదు” అని కళ్లు తుడుచుకుంటుంది. ఆరాధ్యతో కూడా ఇలాగే మాట్లాడుతుంది. అందుకేనేమో తల్లి అంటే ప్రాణం ఆరాధ్యకి… తల్లి ఫోన్‌చేసి మాట్లాడినప్పటి నుండి పూర్తిగా మార్పు వచ్చింది ఆరాధ్యలో.

                బెడ్‌మీద నుండి సడన్‌గా లేచాడు హేమంత్‌.

                నేరుగా ఫ్రిజ్‌ దగ్గరకి వెళ్లాడు. డోర్‌ ఓపెన్‌ చేసి వాటర్‌ బాటిల్‌ తీసి, మూతవిప్పి గటగట వాటర్‌ మొత్తం తాగేశాడు. వెళ్లి లాప్‌టాప్‌ ముందు కూర్చున్నాడు.

                అతను వున్నట్టుండి చాలా గంభీరంగా మారిపోయాడు.

                ఆరాధ్య కూడా అంతే గంభీరంగా చూస్తూ ”హేమంత్‌! ఒక్కటి చెప్పు! నువ్వు నా గురించి ఏమను కుంటున్నావ్‌? మార్నింగ్‌ నుండి ఎన్నిసార్లు కాల్‌చేసినా నాకోసం ఓ పది నిముషాలైనా ఎందుకు స్పెండ్‌ చెయ్యలేదు. పెళ్లికి ముందు ఇలాగే వున్నావా? చెప్పు?” అంది.

                ”ప్లీజ్‌! నన్ను కొశ్చన్స్‌ వెయ్యకు. ఆన్సర్స్‌ చెప్పే మూడ్‌లో లేను. ఓపిక కూడా లేదు. పెండింగ్‌ వర్క్‌ చాలా వుంది” అంటూ రిక్వెస్ట్‌గా చూశాడు హేమంత్‌.

                ”నాకు తెలిసి మీకెప్పుడూ పెండింగ్‌ వర్క్‌ వుండదు. అబద్దం చెబుతున్నారు. ఇంటికొచ్చాక కూడా ఆఫీసు వర్కేనా?” అంది.

                హేమంత్‌కి కోపం వస్తోంది. అయినా ఆమెను ఏమీ అనకుండా-

                -”వంట చేశావా? వెళ్లి పెట్టు. ఇద్దరం తిందాం! ఆకలిగా వుంది” అన్నాడు.

                ఆమె మాట్లాడలేదు. అక్కడినుండి కదల్లేదు.

                ”వంట చెయ్యలేదా? అదైనా చెప్పు” అన్నాడు.

                పక్కకి తిరిగి మౌనంగా చూసింది.

                ”ఆరాధ్యా! నువ్వు నన్నెందుకిలా టెన్షన్‌ పెడుతున్నావ్‌. ఆఫీసు నుండి ముందుగా వచ్చిన దానివి వంట చేస్తే తప్పేంటి? చెయ్యడం వచ్చుకదా! ఇక్కడ నువ్వు చేసింది బయటవాళ్లెవరైనా తినిపోతారా? మనిద్దరమేగా!” అన్నాడు. అతని మాటల్లో విసుగు, చిరాకు వుంది.

                ”నేను ఆఫీసుకి వెళ్లలేదు” అంది లోగొంతుతో.

                ”ఎందుకు?”

                ”పడుకోవాలనిపిస్తోంది. కూర్చోలేకపోతున్నాను. నిలబడలేకపోతున్నాను. పని చెయ్యలేకపోతున్నాను. అందుకే ఉదయం మా ఊరు వెళ్తానన్నది”

                అప్పుడామె వైపు పరిశీలనగా చూశాడు.

                ముఖం బాగా పీక్కుపోయి వుంది. ఎన్నో రోజులుగా తిండి తినని మనిషిలా వుంది. అతను రోజూ ఆఫీసుకెళ్లేముందు ఆమెకు కూడా బాక్స్‌ పెట్టి వెళ్తాడు. ఇవాళ కూడా అలాగే పెట్టి వెళ్లాడు. ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే లేచి కిచెన్‌లోకి వెళ్లాడు హేమంత్‌. ఉదయం ఆమెకోసం పెట్టిన బాక్స్‌ను చూశాడు. అది అలాగే వుంది. దాన్ని చూడగానే మండింది హేమంత్‌కి…

                ”తిండి తినకుండా పస్తులుంటే గర్భం పోతుందని ఫోన్లో మీమమ్మీ చెప్పిందా?” అడిగాడు ఆవేశంగా.

                ”ఇందులోకి మా మమ్మీని లాక్కండి! నాకే తినాలనిపించలేదు” అంది.

                ”నాకంతా తెలుసు. ఆవిడ అక్కడ వుండే తను అనుకున్నది చెయ్యగలదు. ప్రెగ్నెన్సీ ఎలా పోవాలో అక్కడ వుండే ట్రిక్సన్నీ నీకు చెప్పింది ఫోన్లో!”

                ”ఎప్పుడు చూసినా అదేనా! ఇంకేం లేవా నువ్వు మాట్లాడటానికి? ఈరోజు బాక్స్‌లో నువ్వు పెట్టిన కర్రీ నాకు నచ్చలేదు. ఒకప్పుడు నాకు తినాలనిపించని ఐటమ్సన్నీ ఇప్పుడు తినాలనిపిస్తున్నాయి. అవన్నీ మా మమ్మీతో చేయించుకొని తిందామనే మా ఊరు వెళ్తానన్నాను. అంతేకాని ఈ బోడి ప్రెగ్నెన్సీ కోసం మాత్రం కాదు. అది నాకు గుర్తేలేదు” అంది. తల్లి ఫోన్లో మాట్లాడినప్పటి నుండి ఆమెకు ప్రతిదీ విసుగ్గానే వుంది.

                ”బోడి ప్రెగ్నెన్సీయా?”

                ”కాక బెస్టా? నా దృష్టిలో అది అంత బెస్టేంకాదు. నన్ను తిండి తిననీయకుండా చంపుతోంది” అంది.

                హేమంత్‌ ఆమెవైపు చూడకుండా పక్కకి తిరిగాడు.

                కొద్దిసేపు ఆగి ”నాకు తెలుసు హేమంత్‌! నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావ్‌! నేను ఎంత సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తే మాత్రం అమ్మాయిని కానా? గర్భంతో వుండే ఆడవాళ్లకి వుండే బాధలు నాకుండవా? ఏ బాధలు లేకుండా వుత్తినే బిడ్డ పుడతాడా? ఇప్పుడు నేను వంట చెయ్యలేదనేగా నువ్వు తిడుతున్నావ్‌!”

                ”ఓ.కె. ఓ.కె. వంట నేను చేస్తాను. నువ్వు టెన్షన్‌ పడకుండా కూర్చో!” అంటూ అతను కిచెన్‌లోకి వెళ్లి క్షణంలో వంట చేసి, పేట్లో పెట్టుకొచ్చి ఆమె చేతికిచ్చాడు. అతను వంట చేస్తున్నంతసేపు ఆమె వంట గదిలోకి వెళ్లలేదు.

                బెడ్‌రూంలోకి వెళ్లి బోర్లాపడుకుంది. ఆమె అలా పడుకోవటం అతనికి నచ్చలేదు.

                ”నువ్వు కావాలనే బోర్లా పడుకున్నావ్‌ కదూ! ఎన్నిసార్లు చెప్పాలి నువ్వలా బోర్లా పడుకుంటే లోపల బిడ్డకి వూపిరాడదని… ఛఛ. ఇలాంటి కేర్‌ నీకే వుండాలి కాని నేను చెప్పటం కాదు. చెప్పినా రాదు” అన్నాడు చిరాగ్గా. ఆమె అప్పటికే అతని చేతిలో వున్న ప్లేటు అందుకొని అతన్నే చూస్తోంది.

                ఆ మాటతో ప్లేటు పక్కన పెట్టి అలిగింది.

                ‘ఓ.కె. ఓ.కె! ముఖం అలా పెట్టకు. తిను” అంటూ అన్నం, కూర కలిపి అతనే ఆరాధ్యకు తినిపించాడు.

                అతను తినిపిస్తున్నంతసేపు నీట్‌గా తిన్నది. అతను తినాలని కూర్చోగానే వాంటింగ్‌ వస్తున్నట్లు పరిగెత్తుకుంటూ వాష్‌బేసిన్‌ దగ్గరకి వెళ్లింది. బేసిన్‌ వైపుకి పూర్తిగా వంగి, ఉక్కిరిబిక్కిరవుతూ తన చెవులు తనే మూసుకుంది.

                హేమంత్‌ కంగారు పడుతూ, ప్లేట్‌ పక్కన పెట్టి అతను కూడా పరిగెత్తుతున్నట్లే వెళ్లి ఆమె చెవులు మూయటానికి ప్రయత్నించాడు. ఆమె అప్పటికే టాప్‌ తిప్పి ముఖం కడుక్కుంది.

                ”ఏంటీ! అప్పుడే అయిపోయిందా?” అన్నట్లుగా ఆమెవైపు చూశాడు

సశేషం:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *