April 18, 2024

చెట్టు

 రచననాగులవంచ వసంతరావు,

       BigTree                 

చెట్టు ప్రాణికి ఆయువు పట్టు

మానవ ప్రగతికదే తొలి మెట్టు

 

చెడునంతా సతతం తనలోకి నెట్టు

ప్రాణవాయువును బయటకు వెడలగొట్టు

 

పళ్ళకోసమై రాళ్ళ దెబ్బలకోర్చు

మానవాళి ఆకలిని అనందంగా తీర్చు

 

గ్రీష్మ తాపాన్ని తనలోకి కూర్చు

చల్లని నీడను మనకు సమకూర్చు

 

మనం నిద్రించుటకై అవుతుంది కాట్

పిల్లలు ఆడడానికి అదే ఒక బ్యాట్

 

కర్షకుని పొలములో కాడి

కాష్టాల గడ్డలో పాడె

 

చెక్కితే సుందరమైన బొమ్మవుతుంది
రక్కితే దివ్య రసాలను స్రవిస్తుంది

 

భువిలోంచి ప్రవృద్ధమై మహా వృక్షమౌతుంది

భస్మీపటలమై బొగ్గుగా అవతారమెత్తుతుంది

 

తాను హరిస్తూ దివ్య ఔషధమౌతుంది

రోగాల బారినుండి ప్రజలను రక్షిస్తుంది

 

వన్య ప్రాణులను తన ఒడిలో పొదుగుతుంది

ప్రకృతి సమతుల్యతను సర్వదా కాపాడుతుంది

 

ఆకాశంలోని మబ్బులను అమితంగా ఆకర్శిస్తుంది

వర్షపు జల్లులను వరదలా కురిపిస్తుంది

 

తన్ను నరికిన గొడ్డలికే సుగంధ పరిమళం

సజ్జనుల మాదిరి అపకారికి ఉపకారము

 

త్యాగానికి నీవు మరో పేరు

సహనానికి ఎవరూ నీకు సాటిరారు

 

అక్షరానికి నీవు ఆధారమైతివి

కుక్షి నింపగ గొడ్డలి దెబ్బలే తింటివి

 

బాటసారులకెల్ల బాసటగ నిలుచుండి

భానుని ప్రతాపాన్ని భరియించి నిల్చితివి

 

విరగకాసిన గాని వినయంగ ఒంగుండి

మానవాళికి గొప్ప ఉపదేశమిస్తుంది

 

పళ్ళన్ని మాకాయె పాట్లేమొ నీకాయె

వయసు పైబడినంత వంటశాలకు పోయె

 

ఇంటికొక్క చెట్టు పెంచి ఇలవేల్పుగ కొలువర

చంటిపాప వలెను దాన్ని సంరక్షణ చేయర

 

చెట్టు నరికినంత నీకు పుట్టగతులు లేవుర

చెట్టు చేయలేని మేలు విశ్వంలో లేదుర

 

ఇన్ని సేవలు చేయు నిన్ను నరికినగాని

మౌనంగ భరియించి మేలు చేస్తుంటావు

 

సుగుణాల తల్లివే మా కల్పవల్లివే

జనుల కాపాడేటి మా పాలవెల్లివే

 

ఎంత చెప్పినగాని తరుగనిది నీ లబ్ధి

ఏమి చేసినగాని తీరనిది నీ రుణము

 

మనిషి కాదర్శంబు మానాయె చూడరా

మానువలె మెలగుటే మనిషి జన్మకర్థంబురా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *