April 25, 2024

పెళ్లి మర్యాదలు (తరాలు అంతరాలు)

రచన: ఆచంట హైమవతి
విశ్లేషణ: జ్యోతి వలబోజు

వివాహబంధం

“ఏమండీ వదినగారూ…ఎనిమిది గంటలు దాటిపోయింది! మేమందరం జడల్లో పెట్టుకోవటానికి పులదండలు పంపనే లేదు మీరు?మగ పెళ్లివారంటే మీకు ఎందుకింత అశ్రద్ధ ?” గొంతు పెంచి అడుగుతోంది వరుని పెదతల్లి కూతురు.

“బజారుకి మనిషిని పంపానమ్మా! వచ్చేస్తుంటాడీపాటికి…కొంచెంసేపు ఆగండమ్మా. ప్లీజ్” కంగారు పడుతూ బతిమాలుతోంది పెళ్ళికూతురు తల్లి రత్నమాల.

మగ పెళ్లివారికి సమయానుకూలంగా ‘అన్నీ’ అమర్చలేకపోతున్నామని ఆమె తల్లడిల్లి పోతోంది . ఇంతలో పులదండలొచ్చాయి. పూలు తెచ్చినవారు పెళ్లిలోకీ, పెళ్ళివారికీ వేర్వేరు చేస్తుంటే…హడావిడిగా ముందు వియ్యాలవారికి పంపింది రత్నమాల .

వరుని మేనమామ వచ్చి “మీరొచ్చి టిఫిన్ లకి ఇంకా పిలవలేదేమిటండీ? రాకేం చేస్తారులే…వాళ్ళని పిలిచేదేమిటి- అనుకుంటున్నారా యేం?” అన్నాడు తీక్షణంగా చూస్తూ .

రత్నమాల “అబ్బే…అదేంలేదండీ మా చెల్లెలు పిలవటానికి వెడితే, మా వదినగారు… వంటబ్రాహ్మడి చేత టిఫిన్లు పంపేయండి…ఇక్కడే మా వాళ్ళు తినేస్తారు- అన్నారట. అందుకని బ్రాహ్మడు వెనుకవైపునుంచి టిఫిన్లు పట్టుకెళ్ళాడు . మా చెల్లెలు అందరికీ అందిస్తుంది”అంది వినయంగా!

“అంటే దిగినవాణ్ణి మేడెక్కి వెళ్లి తినాలా?” ఉగ్రుడౌతూ అన్నాడాయన .

“మళ్లీ మీరు పైకెళ్లటం ఎందుకు బాబూ! ఇక్కడే తినండి” అంటూ అక్కడే టిఫిన్ అందించి ఇంకో పనికి పరుగెత్తిందామె.

వ్యంగ్యాలుగా వినిపించే నిష్టురాలతొ , జబర్దస్తీగా అనిపించే హాస్యపు కబుర్లతో – చేతలతో ఆ పూట కార్యక్రమాలు ముగిశాయి . ” అమ్మయ్యా…! ఈ పూట యజ్ఞం ముగిసింది!” అనుకుని నిట్టూర్చారు రత్నమాల , భర్తాను .

*********

ఏ సందర్భంలో ఎవరికి ఎలాంటి బట్టలు పెట్టాలో, ఎందరికి పెట్టాలో మగ పెళ్లివారు ‘అన్నీ’ ముందరే విశదంగా చెప్పేశారు . వరుని బామ్మా- తాతా వధువు తండ్రిని పిలిచి “అనుకోని వాళ్ళొచ్చినప్పుడు-అప్పటికప్పుడు కొన్ని జరిపించాల్సి వస్తుందోయ్” అన్నారు .

“దానికేం పరవాలేదు మామయ్యగారు! సత్రానికి దగ్గరలోనే మంచి బట్టల కొట్టుంది. పావు గంటలో కావలసినవి తెచ్చేద్దాం!” అని మాటిచ్చేశాడు కన్యాదాత పైఖర్చుకి భయపడుతూనే!

” మా అన్నయ్యగారు చురుకైనవారు. ఎలాంటి సమస్యైనా చిటికెలో పరిష్కరించేస్తారు” అని మెచ్చుకుంది వియ్యపురాలుగారు .

“రాబట్టుకోవటంలో మిమ్మల్ని మించిన వారు లేరులే చెల్లెమ్మా! నా చురుకుతనాన్ని పొగడకేం చేస్తావులే! అనుకున్నాడాయన .

స్నాతకం…హోమం, ఎదురు సన్నాహం , భోజనాలూ, తాంబూలాలు సక్రమంగానే ముగిశాయి!

” మగ పెళ్లివారు…భోజన సమయాల్లో మంచి ఆకులు వెయ్యలేదనీ, మంచినీళ్ళు తగినన్ని ఇవ్వలేదనీ, త్రాగాటానికిచ్చిన నీళ్ళలో ‘చెత్త’ ఉందనీ , కొన్ని ఐటమ్స్ బాగా చెయ్యలేదనీ, సుగంధ ద్రవ్యాలు తగినన్ని వెయ్యలేదనీ…తమలపాకుల తొడిమలు సరిగ్గా లేవనీ , వక్కపోడెం వేపు తక్కువైందనీ…ఇలా రకరకాలుగా లేని తప్పులు పడుతున్నారత్తయ్యా !” ఉక్రోషంగా తన అత్తగారికి చెప్పింది రత్నమాల .

“అంటారమ్మా… అంటారు- వాళ్ళు మగ పెళ్ళివారుగదా! అనకుండా ఎలా ఉంటారు?వాళ్ళు ఏమీ అనకపోతే మనం ఆశ్చర్యపడాలిగాని… అంటే ఆశ్చర్య పడకూడదు! “అందావిడ చిరునవ్వుతో .

” కాదత్తయ్యా…వాళ్ళు తప్పులు పడుతున్నవన్నీ – కారణం ఉండికాదు —అన్నీ శుభ్రంగానూ-ఏలోటూ లేకుండానూ…రాకుండానూ మా తమ్ముళ్ళూ- నేనూ పర్యవేక్షిస్తూనే ఉన్నాం గదా! ఐనాకూడా చూడండి” దీనంగా మొహం పెట్టి అంది రత్నమాల.

“అదేనమ్మా మన దేశాచారం…ఈ రెండు రోజులే కదా! వాళ్ళు తప్పు పట్టినా -మనం తలవంచుకుని సంజాయిషీ చెప్పినానూ! రేపు వాళ్ళు వెళ్లి పోతారు . అంతే! ఆ తర్వాత వధువు- వరుడు ఇళ్ళవాళ్లకి మాత్రమే లావా దేవీలు , రాకపోకలూనూ!…అందుకని వాళ్ళ సరదాలు ‘పెళ్లి’ లోనే తీర్చుకుంటారు . కొన్ని అగ్గగ్గలాడుతూ తీర్చాలి, కొన్ని వినీవిననట్లు ఊరుకోవాలి. కొన్నిట్లకి ‘క్షమించాలి మీరు మమ్మల్ని’అనాలి. ఓర్పుగా దాటుకు పోవాలి … అంతేనమ్మా!” కోడలికి కిటుకు చెప్పి పంపించి , పక్కనున్న చుట్టంతో మాటలు పెంచింది బామ్మగారు .

” అత్తింటా- పుట్టింటా ఎన్ని పెళ్ళిళ్ళు చేయించలేదూ?! ఏ నిష్ఠూరాలొచ్చినా మా ‘సుకన్యను’ పంపిస్తాను . మీక్కావలసినవి దానితో చెప్పండి . మీ అవసరం క్షణంలో తీర్చేస్తుంది” అని మా అత్తగారు వాళ్ళతో చెప్పి . నాతో

“నీకైతే అణకువ, ఓర్పు, సమయస్పూర్తి ఎక్కవే! అందుకనే సమస్య ఎదురైనప్పుడు నిన్ను పంపుతాను . అదే నీ తోటికోడల్ని పంపాననుకో తాడు కాస్తా పేడు చేసేసి రామ రావణ ‘యుద్ధం’ సృష్టించేస్తుంది . దాన్ని పంపినందుకు నేను చెంపలు వాయించుకుని దాని కాళ్ళకు ‘దండం’ పెట్టాల్సోస్తుంది “అనేది మా అత్తగారు .

“అత్తయ్యా…మరేమో…వాళ్ళు మన పిల్లకి వజ్రాల గాజులు పెడతామని ఒప్పుకున్నారు గదా? అవి పెళ్లిలోనూ పెట్టలేదు. అగ్నిహోత్రం దగ్గిరా పెట్టలేదు . ఇంకెప్పుడు పెడతారు? తప్పుల్లేకపోయినా ప్రతి చిన్నదానికీ నిష్ఠూరాలాడుతున్నారు. మనం ఈ సంగతి అడిగితే తప్పేమిటి?” అత్తగారితో అంది రత్నమాల అసహనంగా మొహం పెట్టి.

ముసలావిడ కోడలి మొహంలోకి దీక్షగా చూసి ” ఈ విషయం నీకే తోచిందా…? లేక ఇంకెవరైనా ప్రత్యేకంగా నీతో అంటే నువ్వు నన్నడుగుతున్నావా??” అని అడిగేసరికి రత్నమాల తలోంచుకుంది.

కొంచెం సేపు మిన్నకుండి…” మా దుర్గక్క…” అంటూ నసిగింది .

” అదీ.. అలా చెప్పు! ఎందుకంత కంగారు?వాళ్ళ కోడలికి నగలెట్టుకోవటం వాళ్ళకే గౌరవం గదా!ఎవరెవరో ఎన్నో అనుకుంటారు . ఆ అన్నింటినీ పట్టించుకుని మీ వియ్యాలవారొచ్చి మిమ్మల్ని నిగ్గతీశారా…? లేదుగదా-? గంభీరంగా ఊరుకున్నారు వాళ్ళు . అలాగే నువ్వు కూడా ప్రవర్తించాలి …. వెళ్ళు !మనం జరపవలసినవన్నీ సక్రమంగా జరిగేలా చూడు. అది మన కర్తవ్యం!” కోడల్ని పంపించి—–

“మా రత్నం నిజంగా రత్నమేనమ్మా! పనిమంతురాలూ, నెమ్మదస్తురాలేగాని …చాలా అమాయకురాలమ్మా! ఎవరేది చెప్తే ‘అదే’ నిజమనుకుంటుంది . దాని మనస్సు నాకు తెలుసుగా!” అందావిడ చుట్టాలామెతో . వింటున్నావిడ”ఎంతైనా పెద్దావిడ అనుభవజ్ఞురాలు” గౌరవంగా అనుకుంది.

బామ్మ దగ్గర కొచ్చి కూచుంటూ ” మీ అక్క మనుమరాలు…ఏదో కొత్త పేరు –ఆ పిల్లది…యామిని… ఆ పిల్ల సంసారం బాగా లేదన్నారమ్మా….నేను విని చాలా రోజులైంధనుకో…ఇప్పుడు వాళ్ళ కాపురం సరిపడిందా? వాళ్ళది చూడచక్కని జంట! వాళ్ళలో గొడవలంటే నాకు చాలా బాధనిపించింధనుకో!” అంది .

ఆవిడ అలా అడిగేసరికి బామ్మ కొంచెం చిన్నబుచ్చుకుని వెంటనే తేరుకుంది . ” ఏదో లెస్తూ… వడ్లగింజలో బియ్యపుగింజ – జరిగినది తమ పొరపాటే ఐనా పెద్దవాళ్ళు మందలిస్తే సహించటం లేదమ్మా ఇప్పటి కాలప్పిల్లలు! వాళ్ళు కొంచెం ఘాటుగా మందలించేసరికి ‘అలిగి’ పుట్టింటికి వచ్చేసింది! తీరా వచ్చేసిన తర్వాత వాళ్ళాయన కోసం ఒకటే…బెంగ! నేనూ , మా అక్కా, కొడుకు , కోడలు ‘యామిని’కి మంచిమాటలు చెప్పి , అనునయించి తీసుకెళ్ళి ఆ పిల్లని అత్తవారింట్లో దించి వచ్చాము . వాళ్ళూ మర్యాదస్తులే! ఈ పిల్ల అలా చేస్తుందనుకోలేదని సిగ్గుపడ్తూ నొచ్చుకున్నారు పాపం! ఇప్పుడు ‘యామిని’ గర్భిణి…ఇంకో నెల్లాళ్ళలో సూడిదలిస్తారట! ‘నేను పురిటికి పుట్టింటికి వెళ్ళనని భీష్మించుక్కూర్చుందిట . ఈ కాలప్పిల్లలకి ఆగ్రహమొచ్చినా కష్టమే, అనుగ్రహమొచ్చినా కష్టమేనమ్మా! ఏం చేస్తాం ? కాలం మహిమ” అంటూ తన అక్క మనుమరాలి కధ పూర్తి చేసిందావిడ .

” ఈ పెళ్ళికి రాలేదేం వాళ్ళు?” అడిగిందావిడ ఆశ్చర్యపోతూను .

” ఇదే సుముహూర్తానికి యామిని ఆడపడుచు పెళ్లి! అందుకే అందరూ అక్కడికెళ్ళారు . అందుకే ఇక్కడికి రావటం కుదరలేదు వాళ్లకి!” అంది బామ్మ.

***********

పెళ్లి ముగిసి భోజనాల తతంగం పూర్తైoది . వివాహానికి వచ్చిన చాలా మంది తిరిగి వెళ్లడం మొదలుపెట్టారు . సాదర సత్కారాలు జరిగాయి . సూక్ష్మంగా సత్కరించవలసిన వారిని- ముందు గౌరవించి విడ్కోలిచ్చి పంపారు . ఘనంగా సత్కరించవలసినవారిని…పూర్వపు రోజుల్ని జ్ఞప్తికి తెచ్చి , ఆప్యాయంగా- వారు తమను సన్మానించిన ‘తీరుని’ మెచ్చుకుంటూ వారికి తృప్తి కలిగించారు . ప్రస్తుతం రెండిళ్ళ వాళ్ళు మాత్రం మిగిలారు . అందరూ హాల్లో గుమి గూడారు .

వరుడు తాము ఇచ్చిన వజ్రపు గాజులతో తన భార్య చేతులెంత మెరిసిపోతున్నాయో చూసుకుంటూ

మురిసిపోతున్నాడు .

తనవారు ఇచ్చిన ‘ బ్రాస్ లెట్ ‘ భర్త చేతికి ఎంత నిండుతనాన్ని ఇచ్చిందోనని ఆనందపడుతోంది వధువు .

వరుని తల్లిదండ్రులు కన్యాదాతలను పట్టువస్త్రాలతో- వివిధ బహుమతులతో సత్కరించారు . వారు బిడియంగా అందుకుంటుంటే “శ్రమకోర్చి నిర్విఘ్నంగా పెళ్లి జరిపించినందుకు” చాలా మెచ్చుకున్నారు. వియ్యపురాలు రత్నమాల దగ్గరగా వచ్చి – ఆమె రెండు చేతులూ పట్టుకుంది .

“మా బంధువులూ, మితృలూ -ఏవేవో తప్పులెన్ని, హేళనచేసీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిఉంటారు . అలాగే మీ వైపు వాళ్ళు కూడా…వేడి -వేడి పదార్ధాలు చేతులపై వడ్డించి ‘కసి’ తీర్చుకునీ ఉండచ్చు!

ఇలాంటివి ప్రతీ పెళ్లిలోనూ జరుగుతూనే ఉంటాయి . ఎవరెన్ని విధాల బోధించినా అవి జరక్కుండా మనం ఆపలేం!” వియ్యపురాలు అలా వివరిస్తుంటే…ఆమె సుహృద్భావానికి రత్నమాల కళ్ళు చెమర్చాయి . ఆత్మీయంగా అన్పించి “అయ్యో..ఈమెకా నేను గర్వం- అహంకారం అనుకున్నాను” అనుకుంది రత్నమాల పశ్చాత్తాపంతో .

” మగపెళ్లివారూ-ఆడపెళ్లివారూ ఇద్దరూ ఒక చోట ఎందుకు చేరతారు? చిరంజీవుల్ని ఒకింటివాళ్ళని చేయటానికే గదా! మన పిల్లల క్షేమం , సంతోషం కోసమేగా మన తాపత్రయం? ఇచ్చి పుచ్చుకోవటాల్లోనూ- మర్యాదల వ్యవహారాల్లోనూ … ‘ఇరువైపులవారూ రెండు పార్టీలు’ అనుకోకూడదు. కాని….అలాగే అనుకుంటారు చాలామంది . ఆ భావం ‘తప్పు’అంటాన్నేను . అలా అనుకోవటం వల్లనే పక్కనున్న వాళ్ళు రెండు కుటుంబాల మధ్య ‘చిక్కులు’ పెట్టి తమాషా చూస్తుంటారు. ‘పాలకవర్గం- ప్రతిపక్షాల’ వాదనల్లా ఒకరిని ఒకరు తప్పు పట్టుకుంటూ స్పర్ధలు పెంచుకోకూడదు .

‘మనం- మనం ఒకటే’ అనే భావం రెండు కుటుంబాల్లోనూ ఉండాలి . ఇంక మనం ఒకింటి వాళ్ళమే! స్నేహితులం కూడాను. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళం పంచుకుందాం” అంటూ ఆమె రత్నమాలను కౌగలించుకుంది

ఈ ఘటన చుసిన పెద్దవాళ్లందరూ తృప్తిగా తలలూచారు . వధూవరులు కూడా సంతోషంగా నిశ్వసించారు . తర్వాత జరుపబోయే ‘కార్యక్రమానికి’ సిధ్ధతకోసం వియ్యపురాళ్లిద్దరూ ఒకచోట చేరి సంప్రదింపుల్లో మునిగి పోయారు .

***********

విశ్లేషణ:

పెళ్లి రెండు కుటుంబాలు, రెండు ఆచారాలు మరెందరో చుట్టాలు, మర్యాదలు మన్ననలతో కూడుకున్నది. అందరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుంది. తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పిదాలు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా పెళ్లినాడు మగపెళ్లివారు వారి తరఫు బంధువులు తమకు మర్యాదలు సరిగా జరగలేదని, ఎక్కడైనా తప్పు పట్టుకుని నిలదీయాలని కూడా చూస్తుంటారు. వారిని మగపెళ్లివారు కూడా కఠినంగా మందలించలేరు. ఆడపెళ్లివాళ్లు ఎదురు మాట్లాడక, నిలదీయక సర్ధుకుపోవాల్సి ఉంటుంది. మాటలు పడాల్సి ఉంటుంది. పెళ్లికొడుకు తల్లిదండ్రులు మంచివారైతే ఇవన్నీ గమనించి గొడవను పెద్దది చేయకుండా ఉంటారు. లేదంటే అగ్గిమీద గుగ్గిలమై పెళ్లికూతురు తల్లిదండ్రులను నిందిస్తారు. ఈ కథలో జరిగింది ఇదే. మగపెళ్లివారి తరఫు బంధువులు ఎన్నోవిధాల ఆడపెళ్లివారిమీద నిందలు వేసారు. వారు కూడా ఎదురు చెప్పకుండా సర్ధుకుపోయారు. కాని చివరగా పెళ్లికొడుకు తల్లి తన బంధువులు తరఫున పెళ్లికూతురు తల్లిదండ్రులకు క్షమాఫణ చెప్పడం సముచితంగా ఉంది. జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధంలో ఆదిలోనే అపార్ధాలు ఉండడం ఎవరికైనా మంచిది కాదు అని ఈ కథ ద్వారా ఆచంట హైమవతిగారు ఎంతో సున్నితంగా చెప్పారు.

3 thoughts on “పెళ్లి మర్యాదలు (తరాలు అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *