April 17, 2024

వైశ్విక స్పృహ

రచన: లక్ష్మీదేవి

మనసుకు మనసుకు మధ్య అనుకోకుండా కలిగే భావప్రకంపనలు ఎంతో బలమైనవి. చరము, అచరము అయిన ప్రకృతి అంటే చలించే ప్రాణులను చూసినపుడో, చలించకుండానే పలుకరించే (అ)ప్రాణులను చూసినపుడో చెట్టు గాలికి ఊగగా రాలే ఆకుల్లా , పువ్వుల్లా, పిందెల్లా రాలినపుడు జాగ్రత్తగా పారిజాతాలకు మల్లే ఏరుకొని వాడిపోకుండా చల్లపెట్టెలో పెట్టినట్టు చెడిపోకుండా జాగ్రత్త చేసినపుడు దానినే మనం పుస్తకం అంటాము.
కాబట్టే పుస్తకాలకు అంతటి విలువ, అందరు అభిమానులు, అందరు దాసులు.
మరి వీటిలో ఏముందో, ఏముండాలో ? ప్రాచీన భావజాలాలా? ఆధునిక భావస్పందనలా? ఏవి మంచివి, ఏదికాదు?
ప్రాచీన కవిత్వమూ, ఆధునిక కవిత్వమూ( అది కవిత, వచనం, పద్యం ఏరూపంలో ఉన్నా) ఒకదానికొకటి శత్రువు కాదు. లేక పాతదంతా పనికిమాలినది, బూజు పట్టినదీ, కొత్తదంతా నవనవలాడేదీ అనే వ్యత్యాసాలూ లేవిక్కడ. అది ఒక కోణం అయితే ఇది ఒక కోణం.
ప్రాకృతిక స్పృహ ఉండడం కానీ, సామాజిక స్పృహ అనేది నేడు ఆధునికులు అంటున్నదాన్ని గానీ సంకుచిత దృష్టి అనడానికి సాహసించను.
అయితే సామాజిక స్పృహ ఎంతటిదో ప్రాకృతిక స్పృహ కూడా అంతే గొప్పది.
నిజానికి ఈ రెండూ కలిస్తే వైశ్విక స్పృహ అవుతుంది. రెండూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాకుండా పూరకాలు కావాలి. అప్పుడే విశ్వకల్యాణానికి బుద్ధిజీవులన్న బిరుదుకు మానవజాతి అర్హత సంపాదించుకొంటుంది.
ప్రాకృతిక స్ఫృహలో ఉండవలసినది కర్తవ్యబోధ. మన కొఱకే ప్రకృతి అనే దృష్టి కోణం కాక ప్రకృతికై మనము, ప్రకృతిలో మనము అనే భావన.
ఈ కర్తవ్యబోధ లోపించిన రచనలు కాలానికి నిలువడం లేదు.
సామాజిక స్ప్రహలో ఉండవలసినది ఆశాభావము. భీభత్స రసమొలుకుతూ నిరాశ, నిర్వేదము, పరస్పరద్వేషము పెంచుతూ పోతున్న రచనలు కాలానికి నిలువవు. బలమైన సంకల్పంతో నిండి ఉండే ఆశావహ దృక్పథం చేయి పట్టుకొని దారి చూపించి, సమాజాన్ని తద్వారా విశ్వాన్ని సంక్షేమం కలిగిస్తుంది. ప్రగతికి బాటలు వేస్తుంది.

వేలూ లక్షలూ ఉన్న ప్రాచీన కావ్యాల పరంపరలో కర్తవ్యనిష్ఠ ను బోధించి మంచిచెడులు చీకటి వెలుగుల వలె నిరంతరం సంచారం చేసే లోకంలో మనవంతు దీపం వెలిగించగలగడం చూపించడం వల్లనే రామాయణాది గ్రంథాలు ప్రపంచదృష్టిని నేటికీ అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి.
కోట్లకొలది కాగితపు పుస్తకాలు, కాగితం లేని పుస్తకాలు నేడు తయారయినా ఈ శతాబ్ది అంతటిలోకీ స్వాతంత్ర్య సంగ్రామం నాటి స్ఫూర్తి దాయకమైన రచనలు నేటికీ ఉద్వేగాన్ని , అంతే స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. బయటికి వస్తామో లేదో తెలియని ఆనాటి స్థితి అయిన ఒక చీకటి గుహలో ప్రయాణించిన నాటి భారతజాతికి దారిదీపాలై వెలగడమే దీనికి కారణం. నిరాశ నిర్వేద స్థితికి తోయడం కాక ఆశ అనే వెలుగు వైపు ప్రయాణిస్తున్నామన్న నమ్మకం కలిగి ఉండడమే
ఆ ప్రకాశానికి అసలైన కారణం.
కేవలం ప్రకృతితో మాత్రమే తాదాత్మ్యం చెందడం గానీ కేవలం మనుష్య సమాజంతో మాత్రమే తాదాత్మ్యం చెందడం గానీ కాకుండా వైశ్విక స్ఫృహతో కూడిన కవిత్వం నిండిన పుస్తకాలు జగతి నిండితే మనసుల్లో నిండిపోతాయి. ఉండిపోతాయి. వాటికే తరాలు మారినా విలువలు తగ్గవు. పెరుగుతూనే ఉంటాయి. ఆదర్శంగా నిలుస్తూనే ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *