April 24, 2024

చిగురాకు రెప రెపలు – 4

రచన: మన్నెం శారద

నాకు స్పృహ వచ్చేసరికి మంచమ్మీద పడుకుని వున్నాను. ఎదురుగా హరి డాక్టరు గారు. ఆయన భలే వుండేవారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. తెల్లగా పొట్టిగా గుండెల మీదకి టై చేసుకుని, తెల్లగా ఎగురుతున్న జుట్టుతో…ముఖ్యంగా ఎన్నడూ వీడని చిరునవ్వుతో.. నీరసంగా తేల్చినట్లు మాట్లాడుతూ…! మా దొడ్డమ్మ కి తరచూ కడుపు నొప్పి వచ్చేది.
ఆయన మా ఫామిలీ డాక్టరు!
వెంటనే మా మామయ్య లేకపోతే.. జగన్నాధపురం శివాలయానికి ఎదురుగా వున్న ఆయన డిస్పెన్సరీకి రివ్వున పరిగెత్తుకెళ్ళి “డాక్టరుగారూ, మా దొడ్డమ్మ కి బాగా లేదు” అనే దాన్ని”.
“మళ్ళీ ఏవయిందే?” అనే వారు మెడికల్ కిట్టు సర్దుకుంటూ.
వెంటనే ఆయన ఆలస్యం చేయకుండా బయల్దేరేవారు. నాకు ఆయన వస్తుంటే చాల సరదా. ఎందుకంటే ఇప్పుడు నేనాయన కారులో వెళ్ళొచ్చు. అది కన్ వర్టబుల్. ఎండలేకపోతే హాయిగా ఓపెన్ టాప్ లో రావొచ్చు.
పెదనాన్న వుంటే కూడా సరదా. ఆయనకీ కారుండేది. అప్పుడిలా ఎవరికిబడితే వాళ్ళకి కార్లుండేవి కాదు. చాల అర కొరా కనిపించేవి.
ఇప్పుడు హరి డాక్టరుగారు నా కోసం వచ్చేరు.
ఏం చేసుకున్నావే… చిలకెందుకు? పిచ్చి మొహమా!” అంటూ ఇంజక్షన్ చేసేరు. దెబ్బలకి డ్రెస్సింగ్ చేసి చారన్నం పెట్టండి దీనికి. దెబ్బల వల్లన వచ్చిన జ్వరమే, ఫర్వాలేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.
మా మామయ్య డాక్టర్ని సాగనంపడానికి వెళ్ళాడు.
మా అమ్మ సహనంగా కోపాన్ని అణచుకుంటూ నా వైపు చూస్తోంది.
నేను ఠక్కున కళ్ళు మూసుకున్నాను.
నొప్పి ఎక్కువగానే వుంది… ఇక ఆవిడ తిట్లకి నేను సిద్ధపడుతూ.
“అన్నీ పిచ్చి పనులే దీనివి! సరే, దాన్ని పడుకోనివ్వండి. పదండి, పదండి” అంది మా అమ్మమ్మ అందర్నీ.
మా అమ్మ సణుక్కుంటూ వెళ్ళిపోయింది.
“ఇప్పుడు అమ్మమ్మ-నేను!:
ఒక కన్ను తెరచి వాతావరణం చూసి అమ్మమ్మా!” అన్నాను మెల్లిగా.
“మాట్లాడకు, చంపేస్తాను. అదింకా నయం వళ్ళంతా చీరేసింది. ఏ కళ్ళల్లో అన్నా పొడిస్తే గుడ్డి బతుకయ్యేది. నిన్ను చూస్తే నాకే తన్న బుద్దవుతుంది. అయినా ఏది తోస్తే అది చెప్పేసావా?” అంది కోపంగా.
ఇంతలో మావయ్య వచ్చేడు డాకటుగారిచ్చిన మందుకు తీసుకుని.
“లే”! మందులేసుకో. ఘనకార్యం చేసేవుకాని” అంటూ తిడుతూ మందులేసారు.
“నారాయణా! ఇక దాన్నే మనకు!” అంది అమ్మమ్మ. మావయ్య వెళ్ళిపోయాడు.
వారం రోజులు మంచమ్మీద పడుకోవడం ప్రాణాంతకమయింది నాకు. అప్పటికీ ఇప్పటికీ అంతే!
గాయాలు మానేయి కాని.. మచ్చలు మిగిలేయి.
మా అక్క చేతే మా అమ్మ హార్లిక్సు, సగ్గుజావ… ఇత్యాది పంపించింది గాని… నా గదిలోకి రాలేదు.
మా హేమక్క, ఇందిర, లలిత నన్నో అపరాధిలా చూసి వెళ్తుండే వారు.
అలా ఆ ప్రహసనం ముగిసింది.
**********
పెదనాన్నకి అమలాపురం ట్రాన్స్ ఫరయింది. మేమంతా అమలాపురం వెళ్ళాం. నన్ను, హేమక్కని తీసుకెళ్ళేరు పెదనాన్న. హేమక్క మా దొడ్డమ్మ కి పెట్. ఇద్దరూ కలిసి (తెగ) చదివేసేరు. ఎప్పుడూ చాల ఫేషన్ గా తయారయి ఆకాశం నుండి ఊడిపడ్డ దేవ కన్యలా భావించుకునే వారు. ప్రతి సంవత్సరం పాస్ అవ్వడమే గగనం.
అంచేత హేమక్క ఎప్పుడూ అమ్మాయి లాగే భావించుకునేది. పోలీసు ఆఫీసరు ఇంటి మర్యాదలకి బాగా అలవాటు పడింది. తన హైస్కూలు స్టడీస్ వరకు వాళ్ళింట్లోనే పెరిగింది.
అంతవరకయితే ఫర్వాలేదు గాని.. మమ్మల్ని చాలా తక్కువ గా చూడటానికి ప్రయత్నించేది. ప్రస్థుతం చాల చిన్నవాళ్ళం కాబట్టి… ఆ అరమరికలు అర్ధం కాని స్థితి!.
అమలాపురం లో ఇంటికెదురుగా గోదావరి కాలవ వుండేది. కాలవ అవతల సి.వి గారిల్లు. ఇవతల పెదనాన్నగారిది.
మధ్యలో అటూ ఇటూ వెళ్ళడానికి వీళ్ళకి మాత్రమే ప్రత్యేకించి ఒక గూటి పడవ వుండేది. గూడంటే… చెక్కతో చేసిన గది. లోపల సోఫాలుండేవి. పడవ నడిపే ఒకబ్బాయి, కానిస్టేబుల్ సర్వదా అందులో వుండేవారు!.
ఇక మా కాలక్షేపానికి కొదవలేదు.
అందులో ఎక్కడం అవతలి ఒడ్డుకు వెళ్ళడం… మళ్ళీ ఇటు రావడం!
కొంతసేపు కాలవలో ఇష్టమైనంత దూరాలు వెళ్ళడం! అప్పుడే కోనసీమ అందాలు నా మనసులో చిత్రించుకు పోయేయి. పెదనాన్న వుంటే.. ఎక్కడికో చోటకి తీసుకు వెళ్ళేవారు.
కాకినాడ నుండి కోటిపల్లి రేవుకి కారులో వెళ్ళడం…. అక్కడ రెండు నాటు పడవల్ని కలిపి తాళ్ళతో బిగించి కట్టడం… చెక్కలు వేసి డైరక్టుగా కారుని ఆ పడవల మీదకి ఎక్కించడం ఆ కారులు బిల బిల లాడుతూ… కేరింతలతో మేము!
ఆ పడవలు కాని.. ఖర్మ కాలి తాళ్ళు తెగి విడిపోతే… అంతే సంగతులు! కాని… మాకా భయం తెలీదు.
పెదనాన్న కొన్ని లంకల్లో పడవ ఆపించేవారు!
అక్కడ టెంట్ లో కొన్ని గంటలు మకాం!
బారులు బారులు చేపలకు అలల్ని పరిగెత్తే కొంగలు! ఇంకా పేర్లు తెలీని పక్షులు!
ఇప్పటి తరానికి తెలీని ఎన్నో అందమైన అనుభూతులు!
పెదనాన్న దిగి కాసేపు ఈత కొట్టేవారు!
నాకు నీళ్ళంటే చిన్నప్పుడు చాల పిచ్చి!
నదుల్లో దిగాలని… ఈత కొటాలని చాల కోరికగా వుండేది. పెదనాన్న నా చేయి పట్టుకుని కొంతవరకూ తీసుకెళ్ళేవారు గాని… అంతసేపూ మా హేమక్క చచ్చిపోతుంది పెదనాన్నా, సుడిగుండాలుంటాయి అని ఏడ్చి రాగాలు తీసేది.
‘చీ! పిరికి మొహమా! అని పెదనాన్న ఒడ్డుకి తీసుకొచ్చే వారూ.
అలా జరిగేది మా అమలాపురం ప్రయాణం!
అమలాపురం లో మా పెద్దక్కకి (కృష్ణక్క) కి సంగీతం మాస్టారిని పెట్టేరు.
ఆయన చాల బాగా పాడేవారు. మంచి విద్వాంసుడు! పేరు గుర్తులేదు.
మా కృష్ణక్క పాట చాల తియ్యగా పాడేది!
కాని ఏ విద్య మీద ఆశక్తి లేదు!
‘మా పెదనాన్న గారి గుణం, ఆలోచనలు ఏవీ తనకి రాలేదు.
నేను బాగా చిన్నదాన్ని కావడంతో ఆమె చేసే అల్లర్లని ఎంజాయ్ చేసి ఫాలో అయ్యేదాన్ని.
ఒకరోజు మాస్టారు వచ్చే టైముకి నాకో పని చెయ్యమని చెప్పింది.
“అమ్మో!” అన్నాన్నేను.
“ఏం ఫర్వాలేదు. అమ్మా నాన్న లేదు కదా!” అంది.
పెదనాన్న, దొడ్డమ్మ కేంప్ వెళ్ళేరు. ఇద్దరో ముగ్గురో ఆర్డర్లీలు వున్నారింట్లో.
పెద్దక్క సలహా విని నాకు నవ్వు తన్నుకొచ్చింది.
ఒక పక్క భయంగా వున్నా… సరదాగా కూడా వుంది అలా చేయాలని.
మాస్టారు రాగానే కిటికీ దగ్గరగా చాప వేసాం. మాస్టారు కిటికీ కి వీపు పెట్టి కూర్చున్నారు. ఎదురుగా కృష్ణక్క, మణక్క..!
పాఠం మొదలైంది.
“కొంచెం మంచి నీళ్ళు తే చిట్టితల్లీ!” అన్నాడాయన.
నేను కృష్ణక్క వైపు చూశాను.
క్రిష్ణక్క ఇవ్వమన్నట్లుగా సైగ చేసింది.
నేను వెళ్ళి గ్లాసు శుభ్ర్రం గా కడిగి మంచి నీళ్ళు తెచ్చిచ్చేను. ఆయన ఒక్క గుక్క తాగబోయి గబుక్కున లేచి కిటికీలోంచి ఊసి… ఉప్పగా వున్నాయేంటమ్మా!” అన్నారు నా వైపదోలా చూస్తూ.
వెంటనే క్రిష్ణక్క “మా బావి నీళ్ళంతే… అండీ!” అంది.
“ఓహో!” అన్నారు మాస్టారు.
ఆయన చాలా సాత్వికుడు. నేను ఉప్పు కలిపానన్న విషయం ఆయన గ్రహించేసారేమో కూడ.
ఇక రెండో కార్యక్రమం!
మా అక్కలిద్దరూ అతనితో పాడుతూనే వున్నారు.
నేను ఒక దారం తీసుకొని మెల్లిగా కిటికీ వైపు చేరేను. మాస్టారు పాడుతూ పాడుతూ తల వూపుతున్నారు.
నేను అదను కోసం చూస్తూ నిలబడ్డాను.
చేయబోయే పాడుపనికి నవ్వు తన్నుకొస్తున్నది. పెద్దక్క నవ్వొద్దని కళ్ళెర్రజేస్తున్నది.
“తలూపుతున్నారు ఎలా?” అన్నట్లు సైగ చేసారు. వెంటనే క్రిష్ణక్క “ మాస్టారూ, మీరు ఆపి మా పాట వినండొక సారి!” అంది.
ఆయన సరేనన్నారు.
అక్కలిద్దరూ పాడుతున్నారు.
మాస్టారు రిలాక్సయి కిటికీ కి తలాడించి కళ్ళు మూసుకుని వింటున్నారు.
అదే అదనుగా అంతకు ముందే కిటికీ కి కట్టి వుంచిన దారాన్ని మాస్టారి పిలకకి కట్టేసి పెరట్లోకి పారిపోయి చక్కలింతలు పెట్టినట్లు కిలకిలా నవ్వుకుంటున్నాను.
“ఇంతలో ఏవిటది? ఏవిటది?” అని మాస్టారు గొంతు వినిపించింది. నా నవ్వెగిరిపోయింది. భయంతో సందులోకి తొంగి తొంగి చూశాను.
ఆర్డర్లీ నరసింహారావు కిటికీ ఊచకి కట్టిన దారం తెంచేయడం కనిపించింది.
“నమస్కారమమ్మా, వస్తాను” ఎర్రబడ్డ కళ్ళతో మాస్టారు వెళ్ళిపోవడం కనిపించింది.
నేను గదిలోకి రాగానే ఏ మాత్రం పశ్చాత్తాపం లేని మా పెద్దక్క ఫక్కున నవ్వుతూ ” ఇక సంగీతం పీడ వదిలింది” అంది.
మణక్క ‘ నా వైపు చూసి ఈ పని నువ్వేనా చేసింది?” అనడిగింది కోపంగా.
నేను భయంగా చూశాను.
అప్పటికే నేను తప్పు చేసానన్న భావం నా కొచ్చేసింది. తలూపేను.
వెంటనే సాచి నా చెంప మీద కొట్టింది మణక్క. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
“ఆయనెంత పెద్దమనిషి! ఇలాంటి పని చేస్తావా? చదువొస్తుందా నీకు!” అంది కోపంగా
“నేను తప్పు చేసానక్కా!” అని ఏడ్చాను.
“ఊరుకో. నీకేం తెలియదులే. ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలుసు నాకు. నువ్వెంత అల్లరి చేసినా ఫర్వాలేదే! కాని గురువుల్ని ఎప్పుడూ క్షోభ పెట్టకూడదు” అంది నన్ను దగ్గరగా తీసుకుంటూ.
“ఇంకెప్పుడూ చెయ్యనక్కా” అన్నాను ఏడుస్తూ.
ఆ రోజునుండి ఈ రోజు వరకూ నేను గురువుల్నే కాదు. పెద్దవాళ్ళనెవర్నీ అపహాస్యం చేసి ఎరుగను.
బాధించే హాస్యం కూడ ఎప్పుడూ చేయలేదు.
అందర్నీ అంతో యింతో సంతోష పెట్టేట్లు మాట్లాడడానికే ప్రయత్నించేను.
ఆ మాస్టారికి ఎన్నిసార్లు మనసులో క్షమాపణలు చెప్పానో నాకే తెలియదు. ఇప్పుడు మాలిక ముఖతఃగా కూడా ఏ లోకంలో వున్నా వారికి నా హృదయ పూర్వక క్షమాపణలు!
************
ఆ రోజు కూడా దొడ్డమ్మ పెదనాన్న తో కేంప్ వెళ్ళింది.
నేను దొడ్లోవున్న ఆవు దూడకి గంగిరెద్దు వేషమేసి కొబ్బరి బూర తయారు చేసుకుని ఊదుతూ దొడ్డంతా తిరుగుతున్నాను.
మా కాకినాడ నుండి మణక్క ఫ్రెండ్ సత్యవతి కూడా వచ్చింది.
వాళ్ళంతా ఏం చేద్దామంటే ఏం చేద్దాం అనుకున్నారు.
పెరట్లో చిన్న పొయ్యిపెట్టి చిట్టి చిట్టి దోసెలు వేస్తుంటే వంట మనిషి అలివేలు, ఆర్డర్లీ నరసింహారావు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు..
అంతా అయ్యేక వీటిని “ఏం చేద్దాం?” అనుకున్నారంతా.
“స్టేషన్లో ఖైదీలుంటారు కదా! వాళ్ళకి పెడదాం. పాపం వాళ్ళకి దోసెలెవరూ పెట్టరు కదా!” అన్నాన్నేను.
“దొంగలకా?” భయపడుతూ అంది సత్యవతి.
“వద్దమ్మా, సార్ కి తెలిస్తే మా ఉద్యోగాలూడతాయి” అన్నాడు నరసింహారావు.
“ఏం ఫర్వాలేదు మేం చెప్పం లే!” అంది మణక్క. అన్నీ తీసుకుని పరమ సంతోషంగా నేను ముందు గంగిరెద్దుని తీసుకుని బూర వూదుతుంటే మా అక్కలంతా నరసింహారావుతో పాటు పోలీస్ స్టేషన్ కి బయల్దేరేం.
సీతాకోక చిలుక సినిమా చూస్తున్నప్పుడు ఆలీగ్రూప్ శరత్ బాబు ఇంటికి పెద్దలుగా వెళ్ళిన సన్నివేశం చూసినప్పుడెందుకో – నాకు మేం స్టేషన్ కి వెళ్ళిన సంఘటన గుర్తొచ్చింది.
మనల్నందరినీ చూసి ఎస్.ఐ. సి.ఐ. “అందరూ ఏంటమ్మా ఇలా వచ్చారు?” అన్నారు నవ్వుతూ. వెంటనే కూల్ డ్రింక్స్ వచ్చాయి.
అందర్నీ కూర్చోండన్నారు.
మేం వచ్చిన సంగతి చెప్పాం.
వాళ్ళు తెగ నవ్వేరు.
“ఈ వెధవలకా?” అన్నారు.
“అవును”
“ఎందుకమ్మా వీళ్ళకి! సార్, కోప్పడతారు. వద్దు, ఇంటికెళ్ళిపోండమ్మా” అన్నారు సి.ఐ.
“ఫర్వాలేదండీ! ఎలాగూ తెచ్చేం, ఇచ్చేసి వెళ్దాం” అన్నది మణక్క బ్రతిమిలాడినట్టు.
“సరే! జాగ్రత్త నరసింహం” అన్నారు సి.ఐ.
వెంటనే మరో కానిస్టేబుల్ మా కూడా వచ్చాడు.
తీరా దొంగల్ని చూస్తే చెడ్డ భయమేసింది నాకు.
కొందరు సరదాగానే వచ్చి తీసుకుని నోట్లో వేసుకున్నారు. మాక్కాస్త ధైర్యం వచ్చింది.
నేను కాస్త ముందుగా ఇంకో జైలు గది వైపు వెళ్ళేను. అక్కడొకతను మౌనంగా మూలకి కూర్చుని వున్నాడు.
“ఇదిగో అబ్బాయీ, దోసెలు తీసుకో” అని పిలిచేను. అతను మౌనంగా చూస్తూ కూర్చున్నాడు.
“నిన్నే!”
నరసింహం ‘ఏంటమ్మా! అని హడావిడిగా నా దగ్గరకి రాబోతుండగానే జరిగిందా సంఘటన!
అతను ఒక్క వుదుట్న లేచి వచ్చి నా గౌను గుంజి పట్టుకున్నాడు.
ఈ హఠాత్పరిణామానికి నేను నిలువెల్లా వణికిపోయేను.
నరసింహం గబుక్కున వచ్చి నా గౌను గట్టిగా లాగేడు. అయినా వాడు వదలడం లేదు.
వెంటనే మరో ఇద్దరు కానిస్టేబుల్స్ పరుగున వచ్చి తాళం తీసి అతన్ని లాగి గోడకి పెట్టి వాయగొట్టేరు.
అలా కొట్టడం కూడ నేనెప్పుడూ చూడలేదు.
ఏడుపు లంఘించుకున్నాను.
ఇంతలో మా అక్కలందరూ పరిగెత్తుకొచ్చారు.
ఎస్.ఐ కూడా వచ్చేసారు.
ఫెళ్ళు ఫెళ్ళున దెబ్బలు.
పోలీసు తిట్లు.
గబ గబా మమ్మల్నందరినీ లాక్కెళ్ళి జీప్ ఎక్కించేశారు. నరసింహం మాతో పాటు ఎక్కి నన్ను ఒళ్ళో కూర్చో పెట్టుకున్నారు.
“నా గంగిరెద్దు…” అన్నాడు ఏడుస్తూనే.
“దాన్ని తెస్తాం లెండి” అన్నాడు నరసింహం నా కళ్ళు తుడిచి బుజ్జగిస్తూ.
అందరి మొహాల్లో కత్తివేటుకి నెత్తురు చూక్కలేదు.
“అందుకే వద్దన్నాను. ఇప్పుడు సార్ కి తెలిస్తే…” అన్నాడు నరసింహం.
“మేం చెప్పం. నువ్వు చెప్పకు” అంది మణక్క బ్రతిమిలాడుతున్నట్టుగా.
“ఇప్పుడు నా చేతిలో ఏముంది? ఎస్.ఐ సార్, సి.ఐ. సార్ ఏమి చెబుతారో మరి!
“అతనెవరు? హత్యలు చేసేడా?” అని అడిగింది సౌదామిని.
“ఆ! ముగ్గుర్ని”
“అమ్మో” మళ్ళీ అందరం కోరస్ గా వణికి పోయాం.
ఇంకెప్పుడూ స్టేషన్ చాయలకి పోకూడదని ఒట్టు పెట్టుకున్నాం.
ఆ సాయంత్రమే పెదనాన్న, దొడ్డమ్మ వచ్చారు.
పెదనాన్నకి కొత్త గూడేం ట్రాన్సఫర్ ఆర్డర్స్ కూడ.
అంతా హడావుడి.
పెదనాన్నకి ఫొటోలు! పార్టీలు! అంతా చక చకా జరిగి పోతుంటే ఈ విషయం మరుగున పడిపోయింది.
ముందు మమ్మల్నందరినీ కాకినాడ లో వదిలేసి పెదనాన్న కొత్త గూడెం వెళ్ళిపోయారు జాయిన్ కావడానికి.
దొడ్డమ్మ మాత్రం ఏడుస్తూనే వుంది. అదంతా కమ్యూనిస్టు ఏరియా అని.
అదంతా నా కర్ధం కాలేదు కాని మా అమ్మ మమ్మల్ని తీసుకుని ఒంగోలు బయల్దేరింది మర్నాడు.
మా నాన్నగారి వూరు, అప్పుడు మా నాన్నగారు పని చేస్తున్న వూరూ ఒంగోలే!

ఇంకా ఉంది…

3 thoughts on “చిగురాకు రెప రెపలు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *