March 28, 2024

సప్త(వర్ణ)స్వరాలు

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

FreeGreatPicture.com-50491-multicolored-cloth

ఉదయించే సూర్యబింబం ఎఱ్ఱని వర్ణం… గాలికి తలలూపే పంట చేలు ఆకుపచ్చని రంగు… పసుపు పూసిన గడపమీద ఎరుపు రంగు కుంకుమ బొట్లు…పచ్చని చెట్ల మధ్య పూచిన రంగురంగుల పూవులు… ఉభయ సంధ్యలలో నింగి వాకిలిలో రంగు రంగుల కెంజాయ ముగ్గులు… ఆకాశం నీలాల నింగి వన్నెలలో ఆవిష్కృతమైతే, వాన విల్లు ఏడు రంగుల చాపమై కనులకు ఎంతో ఆహ్లాదాన్ని, పరవశాన్ని కలిగిస్తుంది…ఆకుపచ్చని చిలుకకు ఎర్రని ముక్కు ఒక చక్కని అందం… కరి మబ్బును చూసిన నెమలి మైమరచి ఆడేటప్పుడు విప్పిన పురిలో ఎన్ని రంగులో… సృష్టి మొత్తం కేవలం నలుపు తెలుపుల్లో కాకుండా రంగులమయం చేసినందుకు ముందుగా మనం ఆ సృష్టికర్తకు ఎన్నెన్నో ధన్యవాదాలు తెలుపుకోవాలి…
ఈ శుభ సమయంలో మన మనసును ఆహ్లాదపరచే చక్కని రంగుల గురించి, ఆ రంగులపై రచింపబడిన చక్కని చిత్ర గీతాల గురించి చర్చించుకుందామా?
ముందుగా నీలం రంగు గురించి… నీలి మబ్బు, నీలాకాశం, నీలి కలువలు, నీలి గులాబీలు, నవరత్నాలలో నీలాలు… ఎన్ని అందాలు నీలి రంగులో…
ఈ యుగళగీతంలో నాయికానాయకులు ప్రకృతిలో మమైకమై ఒకరిలో ఒకరు లీనమై కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటున్నారు… ‘నీలాల నింగిలో… మేఘాల తేరులో… ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో… నిలువెల్లా కరిగిపోనా? నీలోన కలిసిపోనా?’ (జేబుదొంగ-1975). ఆత్రేయ గీతానికి శోభన్ బాబు, మంజుల అభినయించగా, చక్రవర్తి సంగీత సారథ్యంలో యస్పీ బాలు, సుశీలలు గానం చేసారు. ఈ ప్రేమగీతంలోని అందంగా కూర్చబడిన పదాలన్నీ ఎంతో భావయుక్తంగా ఉంటాయి…విడదీయలేని ప్రేమబంధానికి ఈ గీతం ఒక ప్రతీక.
తనను చెలికానికి దగ్గర చేయమని ఎంతో బుజ్జగించి అడుగుతున్నది ఆ చెలి నీలి మేఘాన్ని… ‘నీలి మేఘమా, జాలి చూపుమా… ఒక్క నిముషమాగుమా… నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా…’ అంటే అతడేమో ‘కన్నె అందమా, కలత మానుమా… ఒక్క నిముషమాగుమా… నీ దైవము నీకోసము ఎదుట నిలిచె చూడుమా…’ అంటాడు. (అమ్మాయిల శపథం-1975). ఆచార్య ఆత్రేయ రచించిన ఈ అందమైన గీతాన్ని అప్పుడప్పుడే సినీ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన గాయని వాణీజయరామ్ యస్పీ బాల సుబ్రహ్మణ్యం గారితో కలిసి గానం చేసారు. ఈ అందమైన యుగళగీతానికి సంగీతాన్ని విజయభాస్కర్ గారు సమకూర్చారు. తెరపై చంద్రమోహన్, లక్ష్మి ఈ గీతానికి అభినయించారు.
విధివశాత్తూ దూరమైన తన నేస్తాన్ని తలచుకుంటూ, (అ)తను తనకు అందుకోజాలని ఆనందమే అయినా, ఎందుకో చేరువై దూరమైపోతున్నా, ఆ గానం ‘నీలి మేఘాలలో, గాలి కెరటాలలో… నీవు పాడే పాట… వినిపించునేవేళా…’ అంటూ ఎంతో ఆనందంగా తనను స్మరించుకునే చెలి పాట…(బావా మరదళ్ళు-1961)… ఆరుద్ర గారి మధుర గీతానికి అంతకన్నా మధురమైన బాణీ పెండ్యాల గారిది… ఇప్పటికీ మనను పరవశింపజేస్తూనే ఉంది.
ఆకాశంలో నీలి మబ్బులను చూస్తూ, ‘దూరానా నీలి మేఘాలు… నాలోన కొత్త భావాలు…’ అని మురిసిపోయే కన్నెపిల్ల (గుడిగంటలు)…ఈ గీతాన్ని ఆరుద్ర గారు రచించగా, ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో నటి కృష్ణకుమారిపై చిత్రీకరించారు.
తన ప్రియుని విభునిగా చేకొని తాము గడపబోయే తీయని దాంపత్య జీవితాన్ని నవరత్నాల కాంతులతో పోల్చుకుంటూ అమ్మాయి వేసే ఊహల పందిరి… ‘నీలాల నింగిలోన, పగడాల పందిరి వేసి, రతనాల రంగులతో, ముత్యాల ముగ్గులు వేద్దామా…’ అనే పాట… (దానధర్మాలు). ఈ గీతాన్ని శ్రీ కొండిశెట్టి శ్రీ రామారావు గారు వ్రాయగా మాస్టర్ వేణు స్వరాలు సమకూర్చారు.
తానొక చోట, తన బావ ఒక చోట… ఎలా కలిసేది? అందుకే ఆ మరదలు మాణిక్యం మేఘరాజునే దూతగా మార్చుకుంది… ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు… దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు… ఏడ తానున్నాడో బావా… జాడ తెలిసిన పోయి రావా… ఆ… నీలాల ఓ మేఘమాల!’ (మల్లీశ్వరి). బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి భానుమతీ రామకృష్ణ, మరియు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, నట రత్న శ్రీ యన్.టి. రామారావు గార్ల మీద చిత్రీకరించబడిన ఈ మనోజ్ఞమైన గీత రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం ర’సాలూరు’ రాజేశ్వరరావుగారు.
ఆ ఆకాశమే వంగి తన చెక్కిలి చుంబించినట్టు, తన హీరో తనని వలచిన వైనాన్ని చక్కగా అభివర్ణిస్తూ సాగుతుంది ఈ గీతం – ‘నీలాల నింగి ఒకసారి వంగి, అద్దాల చెక్కిలి ముద్దాడి పోతే అదే అచ్చట అదే ముచ్చట…ఈ జన్మ కంతా… (యువరాజు). ఈ పాటను దాసరి నారాయణరావు గారు వ్రాయగా చక్రవర్తిగారు బాణీలు కట్టారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సుజాతల పై ఈ గీతం చిత్రీకరించబడింది.
ఏ ప్రియునికైనా ఈ సృష్టిలో అత్యంత అందమైన స్త్రీ తన సఖి మాత్రమే. ఈ పాటలో కథా నాయకుడు తన నాయికను ఇలా వర్ణిస్తున్నాడు… ‘నీలి మేఘ మాలవో… నీలాల తారవో…నీ సోయగాలతో మదిని దోచిపోదువో…’ (మదనకామరాజు కథ). గాయకుడు పీబీ శ్రీనివాస్ ఎంతో మెత్తగా ఆలపించిన ఈ గీతానికి ఆధారం ప్రముఖ హిందీ గీతం ‘చౌదవీ కా చాంద్ హో…’. శ్రీ జి.కృష్ణమూర్తి రచనకు రాజన్-నాగేంద్ర స్వరరచన చేయగా హరనాథ్, అనూరాధ అభినయించారు.
నల్లని కనులను ‘నీలి కనులుగా’ ‘నీలాల కనులుగా’ వర్ణించటం కవులకు పరిపాటి… అదే క్రమంలో ఈ కథా నాయకుడు తమ ప్రణయ విహారానికై తన ప్రియురాలిని ఇలా ఆహ్వానిస్తున్నాడు…’నీలి కన్నుల నీడలలోన, దోర వలపుల దారులలోన, కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో…’ (గుడిగంటలు). పి.బి.శ్రీనివాస్, సుశీల పాడిన ఈ పాటకు సంగీతం ఘంటసాల మాష్టారు సమకూర్చగా సి.నారాయణ రెడ్డి గారు గీతరచన చేసారు. జగ్గయ్య, కృష్ణకుమారిలపై ఈ గీతం చిత్రీకరించబడింది.
తానెంతో ప్రాణంగా చూసుకునే తన చిన్నారి కుమార్తె కళ్ళలో నీళ్ళను చూడలేని ఈ తండ్రి వాత్సల్యం చూసారా, ఎలా మధుర గీతంగా మారిపోయిందో… ‘నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు! నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు? ఎవరు కొట్టారూ? ఎవరు కొట్టారు?’ (నాయకుడు). రాజశ్రీ గారి గీతానికి సంగీత రాజు ఇళయరాజా సంగీతాన్ని కూర్చగా, నటుడు కమలహాసన్ అభినయించారు.
అలసిపోయి, మానసికంగా దెబ్బ తిని ఉన్న అన్నగారిని నిద్రపుచ్చుతూ ఒక అనురాగవల్లి అయిన చెల్లి పాడే ఈ జోలపాట ఎంత హృద్యంగా ఉంటుందో అందరికీ తెలుసు కదా… ‘నీలాల కన్నుల్లో మెలమెల్లగా… నిదురా రావమ్మా రావే… నిండారా రావే…’ (నాటకాలరాయుడు). ఆత్రేయ గారి గీతానికి జి.కె వెంకటేష్ సంగీతం సమకూర్చగా నటి అనిత, నటుడు నాగభూషణం ల మీద ఈ పాట చిత్రీకరించబడింది.
తాను నమ్ముకున్న సముద్రపు అందాన్ని ఇలా అభివర్ణిస్తున్నాడు, ఈ చేపలు పట్టే వృత్తి గల నాయకుడు…‘నీలాల కన్నుల్లో సంద్రమే… హైలెస్సో… హైలెస్స… నింగి నీలమంతా సంద్రమే… నేల కరిగిపోతే సంద్రమే… నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే…’ (శుభసంకల్పం). సాగరతీరపు సౌందర్యాన్ని, పల్లెల్లోని పంటకాలవల సోయగాన్ని సెల్యులాయిడ్ పై బంధించిన ఈ గీతం శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాయగా, శ్రీ యం యం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. కమలహాసన్, ప్రియారామన్ తెరమీద, యస్.పి బాలు, చిత్ర, యస్.పీ.పల్లవి తెర వెనుక ప్రాణం పోశారు.
తనను వలచి పరిణయమాడిన శ్రీమంతుడైన ప్రియుని పేదరికపు బాధలను తలచుకుని కన్నీరు కారుస్తున్న భార్యను ఓదారుస్తూ ఆ భర్త పాడిన లాలిపాట… ‘నీలాలు కారేనా, కాలాలు మారేనా… నీ జాలినే పంచుకోనా… నీ లాలి నే పాడలేనా? జాజి పూసే వేళా, జాబిల్లి వేళా… పూల డోల నేను కానా?’ ఆర్ధిక పరమైన లేమి కన్నా, హార్థిక పరమైన కలిమి (ప్రేమ) ఎంతో మిన్న యని తెలుపుతూ మనలను ఎంతగానో అలరిస్తుంది… (ముద్దమందారం). నటుడు ప్రదీప్, నటి పూర్ణిమ ఎంతో హృద్యంగా అభినయించిన ఈ చిత్రగీతం రచన మాటల మాంత్రికుడు వేటూరి సుందర రామమూర్తి గారైతే సంగీతం స్వర బ్రహ్మ శ్రీ రమేష్ నాయుడు. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈ పాటను ఆర్ద్రంగా పాడిన వారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం.
తరువాత అభివృద్ధిని, పెరుగుదలను సూచించే ఆకుపచ్చని రంగు… కంటికి ఎంతో ఇంపుగా ఉండే ఈ రంగు ఎంతో హాయిని, ఆనందాన్ని కలిగిస్తుందనటం అతిశయోక్తి కానే కాదు.
పచ్చగా ఉండటం అంటే కళకళ లాడటం కదా… అందుకే ఈ ఇల్లాలు తమ కాపురాన్ని ఇలా అభివర్ణిస్తూ, భర్తతో ఇలా అంటోంది… ‘పచ్చని మన కాపురం… పాల వెలుగై… మణి దీపాల వెలుగై… కలకాలం నిలవాలీ… కళకళలాడాలి…’ (మానవుడు-దానవుడు). సుశీల పాడగా శ్రీమతి శారద, శ్రీ శోభన్ బాబు అభినయించిన ఈ గీతానికి రచన సినారె, సంగీతం అశ్వత్థామ.
పచ్చని రంగులో ఉండే చిలుక పాటలు ఎన్నెన్నో… పనీపాటల్లోనే ఆటపాటలు… పంట చేలో పని చేసుకుంటూ చిలుకను పిలిచినట్టు తన చెలిని ఇలా రమ్మని పిలుస్తున్నాడు ఆ చెలికాడు… ‘పచ్చా పచ్చని చిలక, ఓ చిలక… పంచా వన్నెల చిలకా… ఓ చిలకా… చల్లా చల్లని వేళ, మెల్ల మెల్లగా చేర రావేమే నా రామచిలకా….’ (కలిసొచ్చిన అదృష్టం) ఘంటసాల, సుశీల పాడిన ఈ పాట ఈ చక్కని ప్రేమగీతం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది వింటూ ఉంటే…
అందమైన పొదరిల్లు లాంటి కుటుంబం… ఒక అమ్మా, ఒక నాన్నా, ఒక అన్నా, ఒక చెల్లీ… ఆ ఇంటి వాతావరణం, ఆత్మీయతకు నెలవు… ‘పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే…భూలోకమే ఆనందానికి ఇల్లూ… ఈ లోకంలో కన్నీరింక చెల్లూ…చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే…అరె, చిన్నీ చిన్నీ గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే…సీతాకోక చిలకకు చీరలద్దుకు… ప్రేమ ఉంటే చాలునింక, డబ్బు గిబ్బూ ఎందుకింక…’ మనసు తీరా ప్రేమానుభూతులు ఉంటే చాలునంటూ అభివర్ణించే ఈ గీతం వింటూ ఉంటే, సంతోషంతో గుండె నిండిపోతుంది… (భారతీయుడు). శ్రీ భువనచంద్ర గారు రచించిన ఈ గీతాన్ని రహమాన్ స్వరపరచగా కమలహాసన్ మీద చిత్రీకరించారు, స్వరమాంత్రికుడు జేసుదాస్ గారు గానం చేసారు.
మళ్ళీ అందమైన ఒక చిన్ని కుటుంబం… చక్కని కాపురం… ఒక అందమైన పచ్చని చెట్టు… అందులో కాపురమున్న రెండు చిలకలు… ‘పచ్చని చెట్టూ ఒకటీ, వెచ్చని చిలుకలు రెండూ… పాటలు పాడీ జోకొట్టాలి జో..జో..జో..’ (రాము). దాశరథి గారి గీతానికి శ్రీ ఆర్.గోవర్థనం సంగీతం ఇచ్చారు. సుశీలమ్మ గానం చేసారు. యన్టీఆర్, జమున, మాస్టర్ రాజ్ కుమార్ అభినయించారు.
ఆకులో ఆకుగా మారి, పువ్వులో పువ్వుగా మారి ఈ పల్లె పడుచు ప్రకృతిలో మమేకమై మనసారా పాడుకుంటోంది ఇలా… ‘ఆకూ పచ్చని కొమ్మల నడుమ, రేకూ విచ్చిన పువ్వుల నడుమ… కిలా కిలా నవ్వేది ఎవరమ్మా…?’ (మా బంగారక్క). ఈ పాట సుశీలమ్మ గానం చేయగా అందాల నటి శ్రీదేవి పై చిత్రీకరించబడింది. సినారె రచన చేయగా మామ మహదేవన్ స్వరపరచారు.
మరో అందమైన పచ్చని జ్ఞాపకం పచ్చబొట్టు… తమ ప్రియమైన వారి పేరునో, వారి గుర్తుగానో మన చర్మంపై పొడిపించుకునే అందమైన గుర్తు ఈ పచ్చబొట్టు… ఈ బొట్టు గురించి ఈ అందమైన వర్ణన… ‘పచ్చ బొట్ట్టూ చెరిగీ పోదూలే… నా రాజా… పడుచు గుండె సడలి పోదూలే నా రాజా…’ (పవిత్ర బంధం). అక్కినేని, వాణిశ్రీల మీద చిత్రీకరించిన ఈ గీత రచయిత ఆరుద్ర, సంగీతం రాజేశ్వరరావు, గానం ఘంటసాల, సుశీల. ఈ పాటలోనే రకరకాల పచ్చరంగుల గురించి అందమైన వర్ణన… ‘పండిన చేలూ పసుపు పచ్చ… నా నిండు మమతలు, మెండు సొగసులు లేత పచ్చా… నీ మేడలో పతకం చిలకపచ్చా.. మన మేలిమి గురుతీ వలపుల పచ్చా…’
ఇక పచ్చల్లో అద్భుతమైన చిలకపచ్చ రంగు మీద వ్రాయబడిన పాటలూ అద్భుతమే మరి… ‘చిలక పచ్చనీ చీరలోన చిగురు మెత్తనీ పడుచుదనం…’ అంటూ సాగే ఈ వలపు గీతం మనసును మైమరపిస్తుంది… (జీవితనౌక). సినారె గీతానికి కేవీ మహదేవన్ సంగీతం. శోభన్ బాబు, జయప్రదల మీద చిత్రీకరించబడింది. గానం బాలూ, సుశీల.
‘చిలుక పచ్చ చీర కట్టి చేమంతి పూలు పెట్టి, సోకు చేసుకొచ్చానురో, ఓ పిల్లవాడ…’ (మా ఇద్దరి కథ) అంటూ సాగే ఈ శృంగార గీతం మంజుల, యన్టీఆర్ లు అభినయించగా, కొసరాజు రాఘవేంద్ర చౌదరి రచించారు, చక్రవర్తి సంగీతం చేసారు.
తెలుగు దనం ఉట్టిపడే ఈ గీతం ఎంత బాగుంటుందో… ‘చిలుక పచ్చ తోటలో చిలిపి కోయిలా… తెలుగు పాట పాడవే తీయగా, హాయిగా…కుక్కూ కుక్కూ కుక్కూ..’(జానకిరాముడు). ఈ పాటను బాలూ చిత్ర పాడగా వేటూరి రాయగా మహదేవన్ బాణీ కట్టగా తెర మీద నాగార్జున, విజయశాంతి అభినయించారు.
లేత ఎరుపు నారింజ రంగును స్ఫురింపజేసే చెంగావి రంగు మీద ఈ పాటలు … ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది…’ (బంగారుబాబు), అక్కినేని, వాణిశ్రీ అభినయం, ఆత్రేయ, మహదేవన్, ఘంటసాల, సుశీలల గానం. ‘చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా…’ (తూర్పు వెళ్ళే రైలు) స్వీయ సంగీత దర్శకత్వంలో బాలూ పాడిన ఆరుద్ర పాట నటుడు మోహన్ పై చిత్రీకరించబడింది – ఇవి ఎంతో మధురమైన గీతాలు.
రంగులలో రారాజు వంటి అరుణవర్ణం గురించిన గీతాలు ఎన్నెన్నో…
‘ఎర్ర కోక కట్టినావే పిట్టా… ఆపై ఎత్తు మడాలెక్కినావే పిట్టా…’ (బుచ్చిబాబు) అని హీరో నాగేశ్వరరావు గారు కోయదొర వేషం ధరించి కథానాయిక జయప్రదను ఆటపట్టించే గీతం సరదాగా సాగిపోతుంది. దాసరి నారాయణరావు గారు రచించగా చక్రవర్తి గారి సంగీతదర్శకత్వం లో బాలూ పాడిన పాట ఇది.
‘కట్టింది ఎర్ర కోక, పోయేది ఏడ దాకా?’ (అందరూ మంచివారే) అని కథానాయకుడు శోభన్ బాబు, మంజులను ఆరాలు తీసే ఈ పాట కూడా చక్కని యుగళగీతం…బాలూ సుశీల పాడారు.
సంజవెలుగులలో ఆకాశాన్ని వర్ణించే ఈ గీతం ‘ఆకాశం ఎందుకో పచ్చబడ్డది… ఆ నడుమ బొట్టేదో ఎర్రబడ్డది…’ (స్వయంవరం) శోభన్ బాబు, జయప్రదల అభినయంలో, సత్యం సంగీతం లో, దాసరి నారాయణరావు గారి రచనలో బాలూ, సుశీల గానం చేసారు.
గోరింటాకు పెట్టుకున్న తన కూతురి చేతుల ఎర్రదనాన్ని వర్ణిస్తూ ఒక మాతృమూర్తి పాడే గీతంలో ‘మామిడీ చిగురెరుపు, మంకెన పువ్వెరుపు… మణులన్నిటిలోనా మాణిక్యం ఎరుపు… సందె వన్నెలలోన సాగే మబ్బెరుపు, తానెరుపు అమ్మాయి తనవారిలోన…’ (గోరింటా పూచింది… గోరింటాకు) అంటూ తీయగా సాగిపోతుంది. అభినేత్రి సావిత్రి తల్లిగా అభినయించగా, దేవులపల్లి వారి ఈ గీతాన్ని కేవీ మహదేవన్ స్వరపరచారు, సుశీల గారు గానం చేసారు.
‘చింత పువ్వు ఎరుపు, చిలక ముక్కు ఎరుపు – చేయీ చేయీ కలుపు లేత వలపు తెలుపు… రాణీ రాణీ…’(ఇంటి గౌరవం) ఈ పాటలో మధురిమ మనలను ఏవో లోకాలలోకి తీసుకుని వెళ్ళదూ?
ఆకాశం హోలీ ఆడుకుంటే పుట్టిన ఎరుపు రంగులు ఇరు సంధ్యలలో… ఈ వర్ణన చూడండి మరి… ‘తొలి సంజకు తూరుపు ఎరుపు… మలి సంజకు పడమర ఎరుపు… తెలియవు నాకూ పడమర తూరుపు… తెలిసిందొకటే పెదవి ఎరుపు… నా చెలియ పెదవి ఎరుపు…’ (కన్య-కుమారి). సంగీత దర్శకుడుగా బాలూగారి చిత్రమిది. వేటూరి గారి గీతానికి గాయకుడిగా కూడా పూర్తి న్యాయాన్ని కలిగించారు బాలూ.
తనను గుర్తుపట్టని చిన్ననాటి స్నేహితురాలిని ఏడిపిస్తూ, ‘బులి బులి ఎర్రని బుగ్గలదానా, చెంపకు చారెడు కన్నులదానా… మరచిపోయావా, నువ్వే మారిపోయావా?’ (శ్రీమంతుడు) అంటూ ఈ గీతం చిలిపిగా సాగిపోతుంది. అక్కినేని, జమున నటించగా ఘంటసాల పాడారు ఈ పాట కొసరాజు వ్రాయగా టి.చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించారు.
పాపకు అమ్మ కథ చెబుతున్నది… అందులోని పంక్తులివి… ‘పేదరాసి పెద్దమ్మ కుంకుమెండబోసే – సాయంత్రం ఆకాశం ఎర్ర ఎర్రనా…’ (పువ్వూ పువ్వూ ఏమి పువ్వూ? – స్నేహం)
‘ఎర్రా బుగ్గల మీద మనసైతే నువ్వేం చేస్తావోయ్ సోగ్గాడా…’ (గూఢచారి116) అని నాయకుడిని కవ్వించే నాయిక… ‘ఎర్రా బుగ్గల మీద మనసుంది, కాని ఇందరిలో ఏం బాగుంటుంది?’ అని గడుసుగా జవాబు చెప్పే నాయకుడు… ఇలాంటిదే మరొక గీతం… ‘ఆకులు పోకలు ఇవ్వద్దు, నోరు ఎర్రగా చేయొద్దు… ఆశలు నాలో రేపద్దు, నా వయసుకు అల్లరి నేర్పద్దు… పాపా… పాపా…’ (భార్యాబిడ్డలు) అంటూ నెపమంతా నాయిక మీదకి నెట్టేసే గడుసు నాయకుడు…యల్లారీశ్వరి, ఘంటసాల గానం చేసిన ఈ చిలిపి గీతానికి ఆత్రేయ అక్షరాలూ, మహదేవన్ స్వరాలూ ఇచ్చారు. అభినయం అక్కినేని, జయలలిత.
సప్తవర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగు మనసుకు ఎంతో శాంతిని, ప్రశాంతతను కలిగిస్తుంది. ఈ రంగును గురించిన పాటలూ ఎన్నెన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలుపు రంగును గురించి అనుకోగానే ‘తెల్లచీర’ గుర్తు వస్తుంది కదూ? ‘తెల్ల చీర కట్టుకున్నది ఎవరికోసమో…మల్లెపూలు పెట్టుకున్నది ఎవరికోసమో…’ (అంతస్తులు), ‘ఇదిగో తెల్లచీరా, ఇవిగో మల్లెపూలూ…’ (ఊరికి మొనగాడు) ఈ గీతాల గురించి మనం ‘మల్లెలవానా-మల్లెల వానా’ మకుటం తో లోగడ వచ్చిన వ్యాసంలో చెప్పుకున్నాము కదా…’తెల్లా తెల్లాని చీర… జారుతున్నాది సందె వేళా’ (దేవీపుత్ర్రుడు) అనేది చక్కని ప్రణయగీతం. ‘తెల్ల చీర, కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకొని వచ్చిందీ కృష్ణమ్మా…’ (సర్దార్ పాపారాయుడు) ‘తెల్ల చీరలో…ఎన్ని సిగ్గులో… మల్లె పూలలో ఎన్ని పిలుపులో…పిలుపు పిలుపులో ఎన్ని వలపులో… వలపు తలపులో ఎన్ని మలుపులో… తెల్లా తెల్లని చీరలోన చందామామా, పట్టా పగలూ వచ్చీనావే చందామామా…(బొబ్బిలిపులి) పాటలలో సీనియర్ యన్టీఆర్, శ్రీదేవిల ప్రణాయాభినయాన్ని తిలకించవచ్చు.
‘తెల్ల చీరకు తడిపొడి తపనలు రేగేనమ్మ సందె పొద్దుల్లో…’ (ఆఖరి పోరాటం) అనే గీతంలో శ్రీదేవి అభినయానికి భారత కోకిల లతా మంగేష్కర్ గారి గాత్ర మాధురి తోడై, ఒక మధుర గీతంగా నిలిచిపోయింది. ఆ పాట చిత్రీకరణ ఆద్యంతమూ తెల్లని వస్త్ర ధారణ కనబడుతుంది, కనులకు విందుగా, ఆహ్లాదంగా…
‘నా మనసే ఒక తెల్లని కాగితం, నీ వలపే తొలి వెన్నెల సంతకం…అది ఈనాడైనా ఏనాడైనా నీకే నీకే అంకితం…’ (అర్థాంగి) కల్మషం లేని ప్రేమకు ప్రతిరూపమైన నాయిక హృదయాన్ని ఆవిష్కృతం చేసారు కవిగారు ఈ గీతంలో. ‘తెల్ల కాగితం, మనిషి జీవితం… ఒకో అక్షరం… ప్రతీ హృదయం…చెయ్యి మారితే రాత మారుతుంది – చెయ్యి జారితే మచ్చ మిగులుతుంది…’ (దీపారాధన) అనే గీతంలో చిక్కని వేదాంతం వినబడుతుంది మనకు. ‘నా హృదయం తెల్లకాగితం, అది ఏనాడో నీకు అంకితం… బేషరతుగ ఇచ్చేసా ప్రేమపత్రము… ఏమైనా రాసుకో నీ ఇష్టము…’ (ప్రేమతరంగాలు) గీతంలో అనిర్వచనీయమైన ఆరాధన కనబడుతుంది.
ఇక నలుపు రంగు… తెల్లని రంగు ఒక అందమైతే నలుపు రంగూ అందమైనదే… నక్షత్రాలతో కూడిన నల్లని రాత్రి, నల్లని కలువల వంటి కళ్ళూ, నల్లని కేశపాశం…
తన పిల్ల నల్ల నల్లని మబ్బుల్లో తెల్ల తెల్లని చందమామట! ‘నల్లా నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా తెల్లా తెల్లని చందామామ లగ్గోపిల్లా… కొప్పూలోనీ మల్లేపూలు ఘుమ ఘుమ లాడుతుంటే… సేతీ నున్నా సిట్టీ గాజులు గల్లూ గల్లూ మంటుంటే…అబ్బబ్బ నా గుండె జల్లు జల్లు మన్నాదే…’ (మన ఊరి పాండవులు) అంటాడు ఆ మావ… తనకి ఇష్టమైన నల్లనల్లని కళ్ళ పిల్లకి ఎలాంటి జోడు కావాలో అడుగుతాడా ప్రియుడు ఇలా… ‘నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా… తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెదికి వాణ్ణి ఎల్లాగో లాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా…’ (సై). ఒక వర్షాకాలపు సాయంత్రపు హర్షాన్ని తెలియజేసే పాట ‘వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా… గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా… కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్… గుండెలోన దాచుకున్న బాధలెన్నో మాకున్నాయ్… తీరుస్తారా బాధ తీరుస్తారా? గాలివానా లాలి పాడేస్తారా?’ (ఆనంద్)
కృష్ణుడికీ నలుపు రంగుకీ అవినాభావ సంబంధమే కదా… అందుకే తన నల్లని రంగును చూసి అందరూ అపహాస్యం చేస్తూ ఉంటే ఈ నాయిక కన్నయ్యతోనే మొర పెట్టుకుంటోంది… ‘కన్నయ్యా… నల్లని కన్నయ్యా… నిను కనలేని కనులుండునా? నిన్ను సేవింతురే, నిన్ను ప్రేమింతురే… నన్ను గనినంత నిందింతురే….’ (నాదీ ఆడజన్మే). నీవెవరు? అని అడిగిన కన్నయ్యతో ఇలా అంటోంది మీరాబాయి. ‘నల్లనయ్యా… ఎవరని అడిగావా నన్నూ… మురళిని కాలేను, పింఛమైనా కాను… ఎవరని చెప్పాలి నేనూ… ఏమని చెప్పాలీ నేను…’ (మా ఇద్దరి కథ). దసరా వేషాల్లో కృష్ణుడి వేషం కట్టిన బావను ఏడిపిస్తారు మరదళ్ళు ఇలా… ‘నల్లవాడే… అమ్మమ్మ అల్లరి పిల్లవాడే… చిన్నవాడే… ఓయమ్మా రాధకే చిక్కినాడే…’ (దసరా బుల్లోడు). నల్లని కళ్ళను వర్ణిస్తూ, ‘నల్లా నల్లని కళ్ళు… నవ్వీ నవ్వని కళ్ళు…’ అంటాడు ఓ భావుకుడు…(కలియుగ రావణాసురుడు). ఇక హీరోయిన్ కట్టిన (కట్టని) చీరను వర్ణిస్తూ, ‘నల్లంచు తెల్లచీర, జళ్ళోన మల్లెమాల…’ (దొంగమొగుడు) అని పాడతాడు మరో నాయకుడు…
ఇన్ని రంగులు అయ్యాక అన్నిరంగులు కలిసిన పాటల గురించి కూడా చెప్పుకోవాలి కదా…
అల్లిబిల్లిగా కవితలు అల్లే ఓ యువకవి పల్లెలోని ప్రకృతి అందచందాలను చూసి మురిసి పాడుతున్నాడు ఇలా… ‘వేవేలా… వర్ణాలా… ఈ నేలా కావ్యాన… అలలూ శిలలూ తెలిపే కథలు పలికే నాలో గీతాలై…(సంకీర్తన).
తన ప్రియురాలిని వర్ణిస్తున్నాడు ఒక ప్రియుడు… ‘రంగులలో కలవో…ఎద పొంగులలో కళ వో… నవ శిల్పానివో, రతి రూపానివో… తొలి ఊహల ఊయలవో…’ (అభినందన). ‘రంగు రంగుల పూలు, నింగిలో మేఘాలు… చల్లని బంగరు కిరణాలు మా చెల్లాయికి ఆభరణాలు…’ (విచిత్ర కుటుంబం ‘ఏడు రంగుల ఇంద్ర ధనుసు, ఈడు వచ్చిన నా వయసు… ఆ ఏడు రంగులు ఏకమైన మల్లె రంగూ నా మనసు…’ (ఇంద్ర ధనుస్సు), గోవుల్లు తెల్లన గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందు వల్లనా? (సప్తపది), ‘అరుణం అరుణం ఒక చీరా… అంబర నీలం ఒక చీరా… మందారంలో మల్లికలా… ఆకాశంలో చంద్రికలా…’, ‘హరితం హరితం ఒక చీరా, హంసల వర్ణం ఒక చీరా…’ (సరిగమపదనీ స్వర ధారా… – శ్రీవారికి ప్రేమలేఖ), ; ‘తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా… నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా…ఎర్ర చీర కట్టుకుంటే సందెపొద్దు నీవమ్మా, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా…’; ‘నేరేడు పండు రంగూ జీరాడే కుచ్చిళ్ళూ, ఊరించే ఊహల్లో దోరాడే పరవళ్ళు… వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు, వన్నె వన్నె చీరల్లోన నీ ఒళ్ళే హరివిల్లూ…’ (చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా… – తూర్పు వెళ్ళే రైలు)
ఇవండీ రంగులతో కూడిన వన్నె వన్నెల పాటలు!
***

4 thoughts on “సప్త(వర్ణ)స్వరాలు

  1. వరుసగా – అన్ని రంగుల మీద సినీ గీత సేకరణలు – ఇవ్వండి, శ్రీమతి నండూరి సుందరీ నాగమణిగారూ – ఇంద్రధనుసులా మీ ESSAYS నిండుగా విరబూయాలి.

Leave a Reply to Sujatha Thimmana Cancel reply

Your email address will not be published. Required fields are marked *