April 19, 2024

ఋణానుబంధం

రచన: నాగజ్యోతి సుసర్ల

జ్యోతమ్మా బండొచ్చింది …..అంటూ రిక్షా లక్ష్మయ్య కేక వినిపించటం ఆలస్యం ….అమ్మ గబ గబ పుస్తకాల బాగ్ చేతికిచ్చి బైటకు తీసుకొచ్చేది ….అయినా నా కళ్ళు రిక్షా వెనక్కే చూస్తూ ఉండేవి…. మరి నాన్న పొద్దున్నే బజారు కి వెళ్ళి ఫ్రెష్ గా అమ్ముతున్న జామపళ్ళు తీసుకువస్తారు….సరిగ్గా తను రిక్షా లో కూర్చోంగానే …మంచి పండు జామ పండు చేతికిస్తారు….అందుకే ముందున్న రిక్షా వెనకాల నాన్న ఉన్నారా లేరా అని నా కళ్ళు ఆరాగా వెతికేవి…. నేను రిక్షా ఎక్కటమూ …నాన్న నా చేతిలో జాంపండు పెట్టి వెళ్ళిరా చిన్నమ్మా అంటమూ ఒకేసారి జరిగేవి .

ఇంక నా పుట్టిన రోజు వస్తే …పొద్దున్నే నిద్రలేపి నాన్న పెద్ద చాక్లేట్ల పాకెట్ చేతిలో పెట్టేవారు …..చిన్నమ్మా హాపీ బర్త్ డే అంటూ …. ఆ తరువాత చుట్టూ ఉన్న గుళ్ళకన్నింటికీ తీసుకెళ్ళి నా పేరు మీద పూజ చేయించేవారు.

కొన్ని సంవత్సరాలు నాన్న ఉద్యోగం ఒక ఊరిలో….మేమంతా తెనాలి లో …. మధ్య మధ్యలో నాన్నగారు వచ్చిపోతుండేవారు…. నాన్న వచ్చేసరికి మేమంతా నిద్రపోతూ ఉండేవాళ్ళం…. నిద్ర లేపి మరీ పేరు పేరునా ముద్దు చేసేవాళ్ళు …ఆ తరువాత తను తెచ్చిన కొత్త బట్టలూ, మిఠాయిలూ అందరికీ ఇచ్చేవారు…తరువాతే తను భోజనము చేసేవారు …. పెళ్ళి అయీ , ఉద్యోగాలొచ్చీ కొంతమంది అక్కయ్యలూ,అన్నయ్యలూ వెళ్ళిపోగా, ఇంకా నాన్న చుట్టూతా 7 లేక 8 మందిమి ఉండేవాళ్ళం….. అందుట్లో కనీసం ముగ్గురు నలుగురం అయినా నాన్న గారు భోజనం చేస్తుంటే ముద్దలకు చేయి చాచేవాళ్ళం . నాన్న సంతోషంగా ముద్దలు పెట్టేవారు …..ఊరుమెరపకాయలు కారం గా ఉంటాయని ….నాన్న తినేటప్పుడు ఆ మెరపకాయల తొడిమలు నేను అడిగి తినేదాన్ని …..

1977 లో అప్పటికి నా వయసు మూడున్నర ఏళ్ళు ఉంటాయేమో పెద్ద తుఫాన్ ….అప్పుడు దాదాపు 10 కుటుంబాలు ,మా రామలింగేశ్వర పేటలో ఉండే రిక్షా వాళ్ళూ ,పని చేసుకుని బ్రతికే వాళ్ళూ అందరికీ మా ఇంట్లోనే రక్షణ కల్పించారు నాన్న …ముందరే పాలపిండి డబ్బాలు తెచ్చి …వాళ్ళందరికీ భోజనమూ,కాఫీలూ, 3 రోజుల పాటు మాఇంట్లోనే…. అమ్మకు మడిపట్టింపులు ఉన్నాకూడా , నాన్న దేవుడు మనుషుల రూపం లోనే ఉంటాడే అంటూ మా నాలుగు గదుల ఇల్లు నింపేశారు తరువాత వాళ్ళకు బాంక్ నుండి అప్పులిప్పించి మళ్ళీ వాళ్ళ రిక్షాలు వాళ్ళు కొనుక్కునేలా చేసారు …. అప్పుడు నాకు బాగా గుర్తు మా ఇంట్లో వాళ్ళము కూడా పడుకోడానికి చోటు లేక కూర్చునే వున్నాము ….

నేను అందరికన్నా చివరపుట్టాను …దాదాపు నాన్నగారికి 47 ఏళ్ళు వచ్చాక నేను పుట్టాను … నేను 7త్ కి వచ్చేసరికి నాన్న రిటైర్ అయిపొయ్యారు … నా పైన 10 మందిని చదివించటమూ, పెళ్ళిళ్ళు ,పేరంటాలూ చెయ్యటానికే సరిపోయింది నాన్న జీతమూ, జీవితమూనూ….. అమ్మ అప్పుడపుడూ బాధ పడేది …పెక్కు సంతానము దుఃఖ కారణం అని చెప్తే మీరు ఒప్పుకున్నారు కాదని … నాన్న మాత్రం పిచ్చిదానా మన పిల్లలే మన ఆస్తి అనేవారు ….. ఆయన అన్నట్టు గానే అన్నయ్యలు నాపై ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళకూ ఆసరాగా నిలిచారు ….వాళ్ళదగ్గిరకు వచ్చి ఉండమని తీసుకెళ్ళినా ఆయనకు ఏ వూరు నచ్చలేదు అంటూ తెనాలికే వచ్చేశారు …. నాన్న ఖాళీగా కూర్చున్నప్పుడు జ్యోతమ్మా ఇట్రా అంటూ భాగవతమూ,భారతంలో పద్యాలు పాడి అర్ధాలు చెప్తూ ఉండేవారు…

నాన్న వంశ వృక్షము వ్రాస్తూ నా పేరుకింద గర్వముగా “మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్” అంటూ వ్రాసుకున్నారు …అలాగే ఎన్ని పెళ్ళి సంబంధాలు వచ్చినా ,నాన్నగారికి నచ్చేవి కావు….నేను పెట్టే వంకలకు వంత పాడేవారు …. అమ్మ కోప్పడేది బావుంది మీ తండ్రీ కూతుళ్ళకు వెనకాల ఏముందని వచ్చిన ప్రతిదానికీ వంకలు పెడతారూ అనేది…మా జ్యోతమ్మకు మంచి ఆఫీసర్ వస్తాడు అనేవారు ….

నాన్నకు 72 ఏళ్ళు వచ్చేసరికి ,బాగా ఆయాసం తోడయ్యింది…. పిల్లల మీద ఆధారపడ్డామనే భావన ,కోఆపరేటివ్ బాంక్ లో మేనేజర్ అయినా ఉద్యోగం లో ఎదుర్కొన్న ఒడిదుడుకులూ, అందుకోసం తను నడిపిన కోర్ట్ కేసులూ, గెలిచినా కూడా పూర్తిగా రాని గ్రాట్యుటీ డబ్బులూ, పెన్షన్ లేని ఉద్యోగం అవటం వల్ల బాధా …ఇవన్నీ ఆయనకు 72 ఏళ్ళకే 90 ఏళ్ళ వయోభారాన్ని ఇచ్చేశాయి.

అన్నయ్యలు మంచి వైద్యమే అందించారు …..అయినా తను ఎవరింట్లోనూ ఉండలేక తెనాలికే ఓటేశారు…. దాదాపు మూడు నెలలు విపరీతమయిన ఆయాసం….తిండి ఎక్కదు… మా అందరిచేతుల్లో అడిగినన్ని ముద్దలు పెట్టిన నాన్నగారి భోజనం కేవలం ఒకటీ రెండు ముద్దల్లోకి వచ్చేసింది ……ఎన్ని మెతుకులు తిన్నారో అన్ని మందులు వాడాల్సి వచ్చేది …అందుకే ప్రతి రెండు గంటలకూ హార్లిక్సో, మజ్జిగ రసమో , రాగి జావో ఇచ్చేవాళ్ళం నేనూ ,అమ్మా …అదికూడా అరకప్పు కూడా త్రాగలేకపొయ్యేవారు. అమ్మకు అప్పటికే పెరాల్సిస్ వచ్చి తగ్గటం తో ….రాత్రి పూట బాధ్యత అంతా నేను తీసుకున్నా…. ప్రతి రెండుగంటలకూ లేచి నాన్న గారి చేత ఏదో విధముగా జావ,మజ్జిగ రసం త్రాగించటం నేను చేసేదాన్ని …..

నాకు బాగా గుర్తు ,ఆ రోజు గురువారం….. నాన్న గారు పళ్ళు తోముకోవటానికి కూడా లేవలేకపొయ్యారు ….అమ్మ మంచం మీదే నాన్నగారికి పళ్ళు తోమింది…. నేను నాన్న గారు ఉమ్మిన నీళ్ళన్నీ మగ్గులోకి పట్టి పారబోశాను……అది చూస్తున్న నాన్నగారి కళ్ళు నీళ్ళతో నిండాయి …జ్యోతమ్మా నువ్వు నా ఉమ్మి నీళ్ళు పారబోశావా తల్లీ అంటూ బాధ గా అడిగారు…ఏమౌతుంది నాన్నగారు నేను చేస్తే అన్నాను….? ఆయనేమీ మాట్లాడలేదు …. ఆ రాత్రి 11 గంటలకు మజ్జిగ రసం పడుతుంటే నాన్న గారి చెయ్యితగిలి మొత్తం కింద పోయింది ….. ఇదుగో కిందంతా కడిగెయ్యి రాత్రికి అక్కడ నేను పడుకోవాలి అన్నారు…. మంచం మీద పడుకుండే నాన్నగారు కిందెందుకు పడుకుంటారు అనుకున్నాం నేనూ అమ్మా…. అక్కడంతా బాగుచెయ్యటం అయ్యాక మళ్ళీ కాస్త హార్లిక్స్ ఇచ్చి, నేనూ అమ్మా పడుకున్నామో లేదో…అరగంటలో తలుపు చప్పుడయ్యింది…. తీయటానికని లేస్తే నాన్న కింద పడుకుని ఉన్నారు …మా మూడవ అన్నయ్య వచ్చాడు….ఇదేమిటండీ ఇక్కడ ఎప్పుడు పడుకున్నారు అంటూ అమ్మ నాన్నని కదిపింది…మనిషి చాలా నీరసంగా ఉన్నారు…అందుకే ఆయన తల ఒడిలో ఉంచుకుని …ఒరేయ్ నాన్నగారిని మంచం మీద పడుకోబెడదాము రా అంటోంది మా అన్నయ్యతో …నాన్న వద్దంటూ చెయ్యి ఉపారు .ఆ ఊపులో అమ్మ చేతి గాజులు పగలగొట్టేశారు. వేళ్లు లెక్కపెడుతూ ఏదో పెదిమలు కదుపుతున్నారు .అలా విష్ణు సహస్ర నామాలు చదివే అలవాటు నాన్నకు ఉండేది …..నాకు ఏడుపొచ్చేసింది ….నాన్న చెవిలో పెద్దగా రామ రక్షా స్తోత్రం చదివాను …నాన్నకు ఎప్పుడు వంట్లో బాగోకపోయినా నేను ఆ స్తోత్రం చదివేదాన్ని…తొందరగా తగ్గేది….ఆ రోజు నాన్నగారు అది వింటూ దణ్ణం పెట్టారు పైకి చూస్తూ …అంతే ఆయన రాముని పాదాలు చేరిపొయ్యారని మాకు అర్ధమవటానికి ఎక్కువ సేపు పట్టలేదు….అమ్మ నిశ్చేష్టురాలయిపోయింది 58 ఏళ్ళు కలిసి బ్రతికిన జంట మరి ……..మర్నాడు చాలా మంది రిక్షా వాళ్ళు వచ్చారు ..నాన్నగారు పోయారుట గదమ్మా ….మాకేమైనా పని చెప్పుతల్లీ సహాయము చేస్తాము ….ఆ అయ్యకు ఋణం తీర్చుకుంటామంటూ … ..

ఎన్నో పద్యాలూ, నీతులూ, నడవడీ నేర్పిన నాన్నకు చివరిక్షణంలో రామనామం చెప్పి ఋణం తీర్చుకున్నావన్నారు అందరూ…. నిజమేనేమో 11 మంది పిల్లలకు పుట్టగతులిచ్చిన తండ్రికి చివరి ఋణం ….. మా ముగ్గురికేనేమో ….. అందుకే పెద్దలు అన్నారు “ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయా” అని.

నాన్నగారు శ్రీ ఈమని రాధాకృష్ణ మూర్తిగారికి ….. అంకితమిస్తూ …..

19 thoughts on “ఋణానుబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *