April 23, 2024

నాన్నగారికో కన్నీటి లేఖ ….

రచన: సిరి వడ్డే

siri

 

ఆదిదేవత అమ్మయని, అమ్మను మించిన ప్రత్యక్షదైవం లేదని అంటారేమిటి నాన్న? మరి ఆ ఆదిదేవత అపురూపంగా కొలిచే దైవమే మీరు కదా ! అమ్మ బేల కదూ? అందుకేనేమో సంతోషం, దుఖం దేన్నైనా దాచుకునే చీర కొంగును తన ప్రియనేస్తంగా చేసుకుంది. కాని మీ కంటి చెమరింతలు ఎక్కడ దాస్తారు నాన్న గుండె నిబ్బరంలోనా? ఎద లోతుల్లోనా? మది సంద్రంలోనా? ఎప్పుడూ నా కంట పడలేదే ఇన్నేళ్ళ జీవితంలో.

 

నాకు ఊహ తెలిసినప్పటి నుండి వైద్య వృత్తిలో మీరు ఎంత అంకితభావంతో ఉన్నారో నాకు తెలుసు. ఇప్పటికీ మార్పేమీ లేదు వైద్యసేవలను అందించడంలో. నా చిన్నతనంలో పండుగ వచ్చింది అంటే ఎంత సంబరమో, క్రొత్త బట్టలు ఒక నెల ముందే కుట్టించేవారు మీరు. అమ్మ బోల్డన్ని పిండివంటలను చేసి, నాన్నగారు రానీయండి అంటూ మీకు ముందుగా దాచిపెడితే, ఎందుకో తెలియని అల్లరితనంతో యాగీ చేసేదాన్ని. బడిలో మార్కులు తక్కువ వస్తే హెడ్ మాష్టారును కలిసి మాట్లాడి నన్ను తిట్టించారని ఉక్రోశపడే దాన్ని, కాలేజీలో ఎక్ష్త్రా క్లాసులు ఉండి రావడం లేట్ అయితే అన్ననో, తమ్ముడినో బస్సు స్టాప్ దగ్గర నించోబెట్టి వాళ్ళు లేట్ ఎందుకని గదిమినప్పుడు, చాలా కోపంతో నాలో నేనే రగిలిపోయేదాన్ని. నా ఫ్రెండ్స్ కు ఇన్ని ఆంక్షలు లేవు , నాన్నగారు ఎందుకు జేమ్స్ బాండ్ లా , ఒక హిట్లర్ లా ఇంత స్ట్రిక్ట్ అని అమ్మతో అని తిట్టించుకునేదాన్ని. అపుడు ఎందుకో అర్ధం కాలేదు నాన్న ఆ కళ్ళ వెనుక అంత కాఠిన్యం దేనికో, ఆ హృదయంలో అంత గాంభీర్యం దేనికో ?.. ఎందుకు నాన్న అపుడంత మీ మౌనంతో నా మదిలో ద్వేషాన్ని, మీకు నాకు దూరాన్ని పెంచారు? మెట్టినింటికిపోయే బిడ్డపై పిచ్చి మమకారం కూడదనే సత్యం మీకు తెలిసే కదూ ! అమాయకురాలిని నాన్న మీ మనస్సును అర్ధం చేసుకునే అంత తెలివి లేకపోయింది.

చూసిన ప్రతీది కావాలని పేచీ పెడితే, ఎందుకు డబ్బులు ఇచ్చేవారు కాదో ఇప్పుడు అర్ధం అవుతోంది. ప్రతి చెమట బిందువును పైసగా మార్చి, ఒక మంచి అయ్యచేతిలో పెడితే మీ బిడ్డ సంతోషంగా ఉంటుందని ఎంత బాధ్యతతో కూడిన ముందు చూపు మీది. కాని నాకు ఇంత సత్యం అర్ధం చేసుకునే వయస్సు లేక మిమ్మల్ని అపార్ధం చేసుకున్న అపరాధానికి ప్రతి క్షణం కుమిలి కుమిలి ఏడ్చే భయంకరమైన శిక్షను నాకు నేనే విధించుకున్నాను. ఎందుకు నాన్న నా సంతోషం కోసం అప్పులు చేసి మరీ ఇంత త్యాగం చేయాలా? ప్రావిడెంటు ఫండ్, పెన్షన్ డబ్బులు అన్నీకూడా లాంచనాల పేరుతో మాకే ముడుపులు కట్టాలా ? బిడ్దల పెళ్లి పేరుతో అప్పుల పాలైపోయినా, గుండెల్లో కంటకాలెన్నో గిచ్చేసి రుధిరాన్ని ద్రవిస్తున్నా కనీసం పెదవి విప్పి చిన్న మాట కూడా చెప్పలేదే నాన్నా ?

నాన్నా మిమ్మల్ని ఒక్కసారి మనస్పూర్తిగా గుండెలకు హత్తుకోవాలని ఉంది, ఎగసిపడే సంద్రంతో, ఒకే ఒక్కసారి మీ ఒడిలో పసిపాపలా ఒదిగి తనివితీరా ఏడవాలని ఉంది, గుండెల్లో గడ్డకట్టుకుపోయిన దుఖం మొత్తాన్ని కరిగి కరిగి ప్రవహించే వరకు వెక్కి వెక్కి ఏడవాలని ఉంది . నా జీవితాన్ని పూల బాటగా తీర్చి దిద్దిన తీర్చుకోలేని మీ రుణానికి, కన్న ప్రేగు బంధానికి, బాధ్యతకు కట్టుబడి నిరంతర మీ శ్రమలోని సత్యాన్ని గుర్తించలేని నా అవివేకాన్ని మీ పాదాల ముందర వదిలి మనస్పూర్తిగా ప్రణమిల్లాలని ఉంది. నా కన్నీటి జల్లులతో మీ పవిత్రమైన పాదాలను అభిషేకించాలని ఉంది. తెలియక చేసిన నా మనస్సు అవిటి తనపు తప్పును పెద్ద మనస్సుతో మన్నించండి నాన్న.
ఏ జన్మలో కోరిన ఫలితమో, ఆ దైవమే తన ప్రతిరూపాన్ని నాకై పంపాడని గుర్తించలేకపోతిని నాన్న. గురువై , స్నేహితుడై , దైవమై నను నడిపించిన ఈ దివ్యమూర్తికి ఏమిచ్చి ఋణం తీర్చుకోను ..ఆ దైవమే వరమందిస్తాను అంటే, మరు జన్మానికి నిను నవమాసాలు కడుపున మోసి, ఒడిలో నింపుకుని లాలించి, నీలా పాలించే బంగారు తండ్రిలా పెంచి మీ ఋణం కొంతైనా తీర్చుకునే భాగ్యాన్నే ఇవ్వమని కోరుకుంటాను నాన్న. మిమ్మల్ని గుండెల్లో గుడికట్టి పూజించుకుంటా. ఆర్తిగా మిమ్మల్ని గుండెలకు హత్తుకోలేని నా ఈ వయస్సునూ, నా ఆడతనాన్ని, అజ్ఞానాన్ని మనస్పూర్తిగా మన్నిస్తారా నాన్నా _/\_.

కన్నీటి భాష్పాలతో మీ పాదాభిషేకం చేస్తూ …..మీ సిరి

4 thoughts on “నాన్నగారికో కన్నీటి లేఖ ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *