April 20, 2024

నాన్నా…!! నీకు జ్వరమొస్తే..

రచన: హైమారెడ్డి

“నాన్నా…!” ఓ బక్కపలుచని పదేళ్ళ పిల్ల మనసు పలవరిస్తున్న ఆ పిలుపు ఆమెకు తప్ప ఎవ్వరికీ వినిపించడం లేదు. అమ్మ సాయంత్రం మేనత్తతో అన్న మాటలే ఆ పిల్లదాని మనసును తొలుస్తున్నాయి. “మీ తమ్ముడు టైంకి నిద్రపోవడం లేదు ఒదినా..! ఎప్పుడు చూసినా పని.. పని.. పని..! ఇలా అయితే ఆరోగ్యం పాడవుతుందని చెప్పినా పట్టించుకోరు” అమ్మనోటి నుండి వచ్చిన అవే మాటలు మళ్లీ మళ్ళీ చెవిలో నుండి లోలోపలికి దిగుతూ గుండెకు కన్నీళ్లు పుట్టిస్తున్నాయి ఆ చిట్టితల్లికి.

“నాన్నకి ఆరోగ్యం పాడవటం ఏంటి? తను చచ్చిపోదూ…!? నాన్న నవ్వకపోతే తనకు కూడా నవ్వడమే రాదు కదా! మరి అంత అద్భుతమైన నా నాన్నకు ఆరోగ్యం పాడవుతుందా…!! నాన్న కాలివేళ్ళలో నా చేతివేళ్ళు పెడితే నేను లాక్కోలేనంతగా నాన్న నొక్కిపడతారుగా.. అలాంటి నా స్ట్రాంగ్ నాన్నకు ఆరోగ్యం ఎలా పాడవుతుంది…?!! చిరంజీవి,బాలకృష్ణ ఇలా అందరూ నా నాన్న ముందు బలాదూర్ కదా.. అలాంటి నా హీరో నాన్నకు కూడా ఆరోగ్యం పాడవుతుందా…!!? నాన్న సూపర్‌మేన్ కదా.. సూపర్‌మేన్ ఎప్పుడూ డల్ అవ్వడని కార్టూన్ నెట్‌వర్క్ మూవీలో చూశాను కదా.. మరి నా నాన్న డల్‌గా ఉంటే ఎలా…? అసలు నాన్న డల్‌గా ఉండడం ఏమిటీ…?

నేను అచ్చు నాన్నలాగానే ఉంటానని అమ్మ ఎప్పుడూ అంటుంది కదా.. అందుకేగా ఎన్ని చేసాను నాన్నైపోడానికి నేనే…!! ఏం! నాన్న నల్లగా ఉన్నారని నేను ఎండలో కూర్చోలేదూ.. నల్లబడిపోవడానికి. ఏం!! నాన్న పళ్ల మధ్య రూపాయి కాసు పట్టేంత దూరముందని రక్తం వస్తున్నా సరే.. నేను నా పళ్లకు మధ్య రూపాయి బిళ్లతో దూరం తెచ్చుకోలేదూ..!! అసలు నాన్నలా మారిపోవాలని నాన్నలా పక్కకు ఒత్తిగిల్లి బజ్జోడం, నాన్నలా నవ్వడం, నాన్నలా మాటాడడం, నాన్నలా స్వచ్చంగా ఉండడం (నాయనమ్మ అలానే చెప్పేది నా నాన్న గురించి) ఇలా నాన్నవి అన్నీ.. నేను నేర్చేసుకున్నా కదా…!!

నాన్న మజ్జిగ తాగినాక ఆ చల్లని బొజ్జ మీద బజ్జొనేది నేనే కదా…! నాన్న తన కాళ్లమీద నెక్కించించుకుని ఉయ్యాలలూపేది నన్నే కదా…!! నాన్న కంచంలోని అరగుడ్డు ముక్క నాదే కదా…!! నాన్న హేపీ బర్త్‌డే కేకు మీద నా పేరు కూడా ఉందేదిగా..!!

అయినా నేను నాన్నొచ్చేదాకా దుప్పటిలోనుండి తొంగి చూస్తూ నిద్రపోను కదా…? ఐనా నేను బాగానే ఉన్నాను కదా.. మరి నా నాన్నకే ఆరోగ్యం పాడైపోవడం ఏంటి..? అంటే నేనునాన్న ( నా నాన్నతో నన్ను విడగొట్టొద్దు..) ఒక్కటే కదా.. మరి నాన్నకు ఆరోగ్యం పాడయితే నాకు పాడవ్వాలి కదా..?

అయినా నాన్న నాకెందుకు చెప్పలేదు..? మా అరోగ్యాలు పాడైపోతాయని…!! అన్నీ చెప్పేసుకుంటాం కదా.. నాన్నానేను…!! మరిచిపోయారా…? ఇంకా నాన్న రాలేదేమిటీ..? ఈసారి నుండి నాన్నని నేనే తొందరగా బజ్జోబెట్టేయాలి..! లేదంటే…

నాన్నా… నాన్నా..” నిశ్శబ్ధంగా ఏడుస్తున్న ఆ పిల్ల ఏడుపుకి సాక్ష్యంగా తలగడ తడిసి ముద్దౌతోంది. ముఖం కందగడ్డలా మారి దుప్పటి కింద దాకుంటోంది. ఒణుకుతున్న ఒళ్ళు వెచ్చబడి చలితో జత కలిసాక మగతగా మూలుగుతూ ఉంది ఆ చంటిది..!

“నాన్నా.. నాన్నా…!” అంటున్న కూతురి కలవరింతలకు మెలకువ వచ్చిన అమ్మ చేయి కంగారుగా బిడ్డ నుదుటిని తాకింది. జ్వరంతో కాలిపోతున్న కూతురిని చూసుకుని మెడిసన్ తీసుకొచ్చి వేస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగడం, పిల్లదాని కళ్లు ఆనందంగా విచ్చుకోవడం ఒకేసారి జరిగాయి.

దగ్గరకు వెళ్లగానే తనను హత్తుకుపోయి గట్టిగా ఏడుస్తున్న తన గారాలపట్టితో ” బంగారూ… జ్వరం తగ్గిపోతుందిలేరా..నీ నాన్న వచ్చేసాడుగా..!!” అంటూ బుజ్జగిస్తుంటే నాన్నని గట్టిగా హత్తుకుపోయింది ఆ చిన్నారి. వెక్కుతూ “అది కాదు నాన్నా…! నిద్ర సరిగ్గా లేకపొవడం వల్ల ఈ జ్వరం వచ్చిందేమో నాకు..! ఇలా అయితే నీకు కూడా జ్వరం వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది నాన్నా…!: అని తనను మరింత దగ్గరగా పట్టుకుంటున్న తన చిన్నితల్లి ప్రేమకు కదిలిపోయిన ఆ తండ్రి కళ్ల వెంబడి రాలిన రెండు నీటి చుక్కలు పాపాయి తలను తాకి ” నా తల్లి ప్రేమను మళ్లీ నాకందిస్తున్న నీకు నేనెప్పుడూ ఋణపడి ఉంటానురా తల్లీ..” అన్నట్టుగా నిమిరాయి.

*****

6 thoughts on “నాన్నా…!! నీకు జ్వరమొస్తే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *