April 20, 2024

మా నాన్న

రచన: పి.యస్.యమ్. లక్ష్మి

???????????????????????????????

మా నాన్న పేరు శ్రీ పులిగడ్డ జనార్దనరావు గారు. ఆయనకి మేము ఏడుగురం సంతానం. అందరం ఆడపిల్లలమే. అయ్యో పాపం అనకండి. ఎందుకంటే మా నాన్న, అమ్మ, అమ్మమ్మ .. వీళ్ళు ముగ్గురూ మా అక్క చెల్లెళ్ళ జీవితాల్లో అతి ముఖ్యలు .. వీళ్ళెవరూ అందరూ ఆడపిల్లలే అని ఏనాడూ అనుకోలేదు. ఏ ఒక్కరినీ తక్కువగా చూడలేదు.
జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారు మా నాన్న. వారాలు చేసి చదువుకున్నారు. ఒక రంగుల కంపెనీలో డబ్బాలు కడగటానికి నెలకు 5 రూ. జీతానికి ఉద్యోగంలో చేరి రంగులు తయారు చెయ్యటంలో నిష్ణాతులై, రంగుల కంపెనీ మేనేజరుగా పని చేశారు. శోధన్ పెయింట్స్, తర్వాత తెనాలిలో అన్వేష్ పెయింట్స్, ఆ తర్వాత విజయవాడలో మురళీ కృష్ణ ఇండస్ట్రీస్ ఆయన పని చేసిన కంపెనీలు.
మాకు పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేవు. మరి ఇంతమంది ఆడపిల్లలతో అప్పులుచేయటం తప్పదుకదా. కంపెనీవారు నాన్న మంచితనానికి, పనితనానికి, పెద్దరికానికి చాలా విలువ ఇవ్వటమేకాకుండా, అవసరాలు తెలుసుకుని అప్పులుకూడా ఇచ్చేవారు. నాన్న తయారు చేయించిన రంగులు బాగా పేరుపొంది, వ్యాపారం బాగా అభివృధ్ది అయింది మరి. ఆయన రిటైరు అయ్యేసమయానికి అప్పుకూడా పెద్ద మొత్తమే అయింది. నాన్న రాసుకున్న రంగుల తయారీ ఫార్ములాలు ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని వేరే రంగుల కంపెనీవారొచ్చినా, నాన్న తన కంపెనీ యాజమాన్యం తనపట్ల చూపించిన అభిమానానికి ఆ ఫార్ములాలు వారికే ఇచ్చారు. అంతకాలం నాన్నను తమ తండ్రిగా చూసినవారు పని మానే సమయంలో ఆయనని బాధ పడనివ్వలేదు. ఆ ఫార్ములాలు తీసుకుని తమ అప్పు పూర్తిగా తీరిపోయిందని చెప్పారు. ఆ ఫార్ములా వేరే కంపెనీకి ఇస్తే ఈయన అప్పు తీరిపోయి కొంత డబ్బు మిగిలేదేమో. కానీ ఆయన చేసిన పనివల్ల ఆయనకి ఎంతో ఆత్మి సంతృప్తి మిగిలింది అన్నం పెట్టిన కంపెనీకి అన్యాయం చేయలేదని.
నీతి, నిజాయితీలకి మారు పేరయిన మా నాన్న మమ్మల్నందర్నీ గారాబంగానే పెంచారు. పైగా మా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయారు. మా నాన్నకి అప్పుడు 36 ఏళ్ళేమో. బంధువులు చాలామంది మా నాన్నని మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మన్నారు. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. మమ్మల్ని సరిగ్గా చూసుకుంటే చాలనుకున్నారు. మా అమ్మమ్మ (నాన్నకి వరుసకి అక్క అవుతుంది, చుట్టాలే) మా నాన్నకి తోడుగా నిల్చి మా బాధ్యత స్వీకరించటంతో ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.
మా మేనమామ భార్య కూడా అదే సమయంలో పోవటంతో వాళ్ళు సెటిల్ అయ్యేదాకా అమ్మమ్మ ఎవర్ని విడిచి పెట్టాలో తెలియక అక్కడికీ ఇక్కడికీ తిరిగేది. ఆ సమయంలో నాన్న పిల్లలకి ఏ లోటూ లేకుండా చక్కగా వండి పెట్టేవారు. పండగలు వస్తే అమ్మ లేదని మేము బాధ పడకుండా పిండివంటలతోసహా చేసేవారు. మమ్మల్ని ఏమంటే అమ్మకోసం బెంగ పెట్టుకుంటామోనని అతి జాగ్రత్తగా చూసేవారు. అంత ప్రేమ మూర్తి మా నాన్న. ఏడుగురిలో ఒక్కరి పెళ్ళికూడా మా అమ్మ వుండగా కాలేదు. ఆడ తోడు లేకుండా మమ్మల్ని సరిగ్గా పెంచటమేకాక, ఇంతమంది పెళ్ళిళ్ళూ చేశారు. పిల్లల పెంపకంలో అమ్మమ్మ సహకారంవున్నా, భార్య సలహాలు, సంప్రదింపులు లేకుండా అన్ని కార్యక్రమాలు ఎలా చేశారా అని మేము ఇప్పుడు ఆశ్చర్యపోతాము. అప్పుడు వాటి విలువ తెలియదుగా మరి.
మా నాన్నకి పిల్లలందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు చెయ్యాలని కోరిక. అలాగే నేను ఏ.జీ. ఆఫీసులో చేరటంతో చాలా సంతోషించారు. వాళ్ళ కంపెనీకీ మా ఆఫీసువాళ్ళు ఆడిటింగుకు వెళ్ళేవారు. వాళ్ళకి నేను తెలుసో, లేదో కనుక్కుని, వాళ్ళు నా గురించి చెప్పే మంచి మాటలు విని చాలా సంతోషించేవారు.
నేను చాలాకాలం పెన్షన్ వింగ్ లో పని చేశాను. నాన్న స్నేహితులెవరైనా మా ఆఫీసులో పని వున్నదని చెబితో మా అమ్మాయి వుంది, మీకు సహాయం చేస్తుందని గొప్పగా చెప్పుకునేవారు. ఒకసారేమయిందంటే నా వ్యక్తిత్వం గురించి మా పెదనాన్న కుటుంబానికీ మా నాన్నకీ చిన్న అభిప్రాయ బేధం వచ్చింది.

మా పెదనాన్నగారు శ్రీ పులిగడ్డ సుబ్బారావుగారు తెనాలిలో తాలూకా హైస్కూలులో తెలుగు పండితులుగా రిటైర్ అయ్యారు. ఆయన పెన్షన్ కేసు పని మా ఆఫీసులో తొందరగా పూర్తయింది. దానికి వాళ్ళు చాలా సంతోషించి నాకేదైనా బహుమతి ఇవ్వాలనుకున్నారు. మా నాన్న అభిమానం దెబ్బతిన్నది. తెలియని వాళ్ళడిగినా సహాయం చేస్తుంది అది, అలాంటిది పెదనాన్నకి చెయ్యదా దానికి బహుమతి ఏమిటి!? అదేం తీసుకోదు అని చెప్పారుట. మావాళ్ళు పోనీ మేము ఇచ్చి చూస్తాము, తీసుకుంటే తీసుకుంటుంది లేకపోతే లేదు… నువ్వు ముందు దానికేం చెప్పకు. అదొచ్చినపప్పుడు భోజనానికి పిలుస్తాం పంపించు, అన్నారుట.
నేను విజయవాడ వెళ్ళినిప్పుడు మా పెదనాన్నగారువాళ్ళు నన్ను భోజనానికి పిల్చారు. ముందు అందర్నీ పిలిచారనుకున్నాను ప్రతి కార్యక్రమానికీ ఒకళ్ళ ఇంటికొకళ్ళం వెళ్లే అలవాటు వుండటంవల్ల. తర్వాత తెలిసింది ఆ ఆహ్వానం నా ఒక్కదానికేనని. నేను కొత్తగా ఉద్యోగంలో చేరానుకదా, దానికనుకన్నాను. వాళ్ళిల్లు నాకు అలవాటే, పైగా మాకు దగ్గరే. వెళ్ళాను. పెద్ద పీట వేసి వాళ్ళ పిల్లలందరితో కలిపి భోజనం పెట్టారు. ఉద్యోగం వచ్చిందని పెద్ద పీట మర్యాదేమోనని నాలో నేనే నవ్వుకున్నాను. భోజనం అయ్యాక మా పెద్దమ్మ బొట్టుపెట్టి ఒక కవరు చేతిలో పెట్టి దీనితో నీకు నచ్చిన చీరె కొనుక్కోమ్మా అన్నారు. నాకు విచిత్రంగా అనిపించింది. అన్నదమ్ముల కుటుంబాలుగనుక ఒకళ్ళింట్లో ఒకళ్ళం భోజనం చెయ్యటం అలవాటే అయినా, అకారణంగా బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటం మధ్య తరగతి కుటుంబాలలో వుండవుకదా. నేను ఆ కవరు మాత్రం తీసుకోలేదు. వద్దంటే వద్దన్నాను. మీ పెదనాన్న పెన్షన్ అంత తొందరగా వచ్చిందంటే నీమూలంగానే అందుకే సరదాగా ఇస్తున్నాం, తీసుకో అన్నది పెద్దమ్మ. అసలుతీసుకోనన్నాను. వచ్చేశాను.
ఇంటికొచ్చేసరికి నాన్న వాకిట్లో పచార్లు చేస్తున్నారు. చాలాసేపటినుంచీ చేస్తున్నట్లున్నారు, నన్ను చూడగానే ఆపి ఆత్రంగా ఏమైంది భోజనం చేశావా అన్నారు. చేశానన్నాను. ఏమైనా అన్నారా అన్నారు. ఏమంటారు ఉద్యోగంలో చేరానని సంతోషించారు అన్నాను. ఏమైనా ఇచ్చారా అని మళ్ళీ ప్రశ్న. ఏదో కవరిచ్చారు..బహుశా డబ్బులనుకుంటా చీరె కొనుక్కోమన్నారు అని చెప్పాను. అసలు ప్రశ్న అప్పుడు వచ్చింది … తీసుకున్నావా .. నాన్న ముఖం చూడాలప్పుడు .. ఏదో అనుమానం .. భయం ..మళ్ళీ ధైర్యం. లేదు అన్నాను. అప్పుడు నాన్న ముఖంలో కనిపించిన రిలీఫ్ నేనెన్నటికీ మర్చిపోలేను. నా మీద తను పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు అని సంతోషం, తన పెంపకం దారి తప్పలేదని సంతృప్తి.
అప్పుడు తెలిసింది .. చిన్న పిల్లయినా సహాయం చేసింది, దానికేదన్నా కొని పెడతామని వాళ్ళనటం, నేను తీసుకోనని నాన్న నా తరఫున వాదించటం, ఉద్యోగంలో చేరితే అందరిలో మార్పొస్తుందిలే, ఒకవేళ రాకపోతే మంచిదేకదా అని వాళ్ళనటం .. నాన్న ఒక విధంగా అది తన పెంపకానికి సవాలుగా తీసుకోవటం, మళ్ళీ పట్నం వెళ్ళి, ఉద్యోగంలో చేరి నేనేమన్నా మారేనేమోనని గాబరా పడటం… నువ్వెక్కడ అది తీసుకుంటావోనని భయపడ్డాను. చాలా మంచిపని చేశావు అన్నారు.
అంత మంచి నాన్న, కష్టాలు పంచుకునే తోడులేకపోయినా తనే దిగమింగి తన బాధలు ఎప్పుడూ పైకి కనబడనివ్వని నాన్న నమ్మకాన్ని మొహమాటానికి లొంగిపోయి వమ్ము చెయ్యలేదని చాలా సంతోషించాను. ఆ అభిమానం, ఆత్మ గౌరవం నాన్న పెంపకంలో వచ్చినవే.
మా నాన్న ఎప్పుడూ ఖద్దరు ధోవతి, కొంచెం పొడుగైన చేతులుండే ఖద్దరు లాల్చీనే వేసుకునేవారు. ధర తక్కువలో వస్తాయని కొంచెం ముతకవే తీసుకునేవారు. నేను ఉద్యోగంలో చేరాక పొందూరు ఖద్దరు ధోవతి కొని పెడితే ఇంత ఖరీదెందుకు పెట్టావు దాని బదులు మామూలువి నాలుగొచ్చేవి అన్నారు. మాకోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు.
నాన్న శ్రీ విద్యోపాసకులు. మా పెదనాన్నగారు సన్యాసాశ్రమం తీసుకుని గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులయ్యారు. నాన్నకి కూడా సన్యాసాశ్రమం తీసుకోవాలని చాలా కోరిక. కానీ దానికీ నేనే అడ్డుపడ్డాను. రిటైరయి హైదరాబాదు వచ్చాక అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాక నాన్న మా పెద్ద చెల్లెలు సరోజా వాళ్ళింట్లో వుండేవారు. మేము దాదాపు ప్రతి వారం వెళ్ళేవాళ్ళం. నాన్న ఒళ్ళో కాసేపు తల పెట్టుకుని కూర్చునేదాన్ని. అదో ఊరట. అందుకే నాన్న సన్యాసాశ్రమ కోరికకి బలంగా అడ్డు తగిలాను. అమ్మ ఎటూ లేదు, ఎప్పుడన్నా నాన్నా అని వచ్చి నీ ఒళ్ళో తల పెట్టుకుని కాసేపు కూర్చుంటాను. అది కూడా మాకు దూరం చేస్తావా స్వామీ అంటూ నీకు దూరంగా కూర్చుని మాట్లాడటం మాకు చేతకాదు. నేనొచ్చినప్పుడల్లా నీ ఒళ్ళో తల పెట్టకుని కూర్చోవాల్సిందే అనేదాన్ని. దానికి నాకేమన్నా పాపం వచ్చినా పర్వాలేదు మానాన్న మాకు కావాలి అనుకున్నా. చివరి సమయంలో తీసుకునే ఆశ్రమం ఏదో వున్నదట. ఆ మంత్రం ఎప్పుడూ దగ్గరే వుండేది. కానీ పాపం ఆయన కోరిక తీరలేదు. అర్ధరాత్రి లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళినవారు అక్కడే అయిపోయారు.

మా నాన్న బతికున్నంతకాలం బాధ్యతలు, బాధలు, బరువులే అనుభవించినా పిల్లందర్నీ మాత్రం చక్కగా పెంచి జీవితాలలో స్ధిర పడేటట్లు చేశారు. ఆస్తులివ్వలేక పోయినా వెలకట్టలేని ఆప్యాయానురాగాలిచ్చారు. అవే ఈనాటికీ మా అక్క చెల్లెళ్ళమందరం పంచుకుంటున్నాం. మేమంతా వున్నంతకాలం ఆ ప్రేమానురాగాలకి మా మధ్య లోటు రానివ్వకూడదని అనుకుంటాము.
నాన్నా, ఒక్క ఫాదర్స్ డేనే ఏమిటి .. మిమ్మల్ని తలుచుకోందే మాకు ఏ రోజూ గడవదు. జన్మ జన్మలకీ మీ కూతుళ్ళుగానే పుట్టాలనుకుంటున్నాము.

7 thoughts on “మా నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *