April 18, 2024

మా మంచి నాన్న

రచన: భారతి ప్రకాష్

gs lakshmi

చిన్నతనం నుండీ కూడా నాన్నతోనే ఏన్నో విషయాలు చెప్పుకునేదాన్ని నేను. నా తోబుట్టువులందరిలోకీ కూడా నేనే ఎక్కువుగా మా నాన్నగారి పోలికలతో వుంటానని అందరూ చెప్పడమో లేక మా అమ్మతో ఎఫ్ఫుడూ, ఎక్కడకి కలిసి వెళ్ళినా అందరూ మా అమ్మని ఎవరో ఒకళ్ళు,” ఈ అమ్మాయి ఎవరే ” అని అడగడం, మా అమ్మ నా కూతురనగానే ” వూరుకోవే అంతా తమాషా.” అంటూ నవ్వడం వలనో తెలీదు. మా అమ్మ చాలా తెల్లగా, చాలా అందంగా వుండేది. మరి నేనేమో మా నాన్నలాగా నల్లగా వుండడం తో ఎవ్వరూ నన్ను మా అమ్మకూతుర్నంటే నమ్మేవాళ్ళు కాదు. అది ఒక్కటే కాకుండా మా అమ్మ ఎప్పుడూ పనిలో తలమునకలుగా వుండేది. నాకా అన్నీ సందేహాలే, అన్నీ కంప్లైంట్సే. నాన్న ఆఫీసు నుండి వచ్చేసరికి ఇంట్లో ఒక కోర్టు సీన్‌ వుండేది. చెల్లి గిల్లిందనో, చిన్నన్నయ్య ఏడిపించాడనో, అమ్మ తిట్టిందనో, ఏదో ఒకటి వుండేది. అమ్మని తప్ప, మిగిలిన ఎవరినైనా నాన్న పిలిచి కేకలేసేవారు. గట్టిగాకాదు. తరువాత నాకు నచ్చచెప్పేవారు. నేను బాగా పేచీ పెట్టేదాన్ని. “ నాన్నా! వాళ్ళని గట్టిగా తిట్టు. “ అనేదాన్ని. నే చెప్పింది నిజమంటూనే, వాళ్ళు చేసింది తప్పంటూనే, నాకు నచ్చజెప్పి నన్ను శాంతింపజేసేవారు. “ అమ్మని ఏమీ అనకమ్మా! ఈ ప్రపంచం లో అమ్మే నీకు అందరికన్న ఎక్కువ. అమ్మ వుండడం నీ అదృష్టం. అమ్మే నీకు అంతా.” అంటూ నాకు నచ్చచెప్పేవారు. ఆ విధం గా నా కోపాన్ని అదుపులోకి తెచ్చేవారు. ఏరోజూ నన్ను పల్లెత్తు మాట అనలేదు. “చాలా కోపమొస్తుంది, నాన్నా! ” అంటే, ” అంతే నమ్మా! అందరకీ వస్తుంది. అలాగే నీకూ. అలా ఎక్కువ కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టు. ” అనేవారు. ” తన కోపమే తన శత్రువు ” అనే పద్యం రోజూ చెప్పించేవారు.

రోజూ తెల్లవారుఝామున నాకూ మాచెల్లి, ఉమకీ తెలుగు పద్యాలు, వేమన శతకం, సుమతీ శతకం, గజేంద్రమోక్షం లోంచి ఎన్నో చెప్పేవారు. ఆయన స్వయంగా పాటలు రాసి, ఆయనే ట్యూన్‌ చేసి నా చేత స్కూల్లో పాడించేవారు. ప్రతీ విషయం లోనూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నాకు షటిల్ ఆడడం కాని, పేకాట ఆడడం కాని నేర్పించింది కూడా ఆయనే అంటే నమ్ముతారా? అలా చిన్నఫ్ఫుడు ఆటలైనా, పాటలైనా అన్నీ ఆయన నేర్పించినవే. నా స్కూల్ మేగజైన్‌, కాలేజ్ మేగజైన్‌ లలో నేను రాసిన కధలని మెచ్చుకుని, నన్ను ప్రోత్సహించారు.

నాకున్న సభాపిరికి తనాన్ని పోగొట్టడానికి నన్ను బి. ఎ. మ్యూజిక్ చేయడానికి ఉత్సాహపరచారు. నాప్రతీ అడుగుకీ ఆయన సలహా సహకారాలు వుండేవి.
పెళ్ళైక కూడా ఎన్నో విషయాల్లో నాకు ఎన్నో సలహాలు ఇచ్చి నన్ను సరైన బాటలో నడిపించిన మా నాన్నగారిని గురించి ఎంత రాసినా తక్కువే. ఆయన రాసిన ఉత్తరాలలో కూడా రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, త్యాగరాజు లాంటి పెద్దపెద్దవాళ్ళ మాటలెన్నో ఉదహరిస్తుండేవారు. నేను మానసికంగా ఎప్పుడు ఉదాసీనంగా ఉన్నాకూడా ఇప్పటికీ ఆఉత్తరాలే నన్ను ఎంతో ఊరట కలిగిస్తూవుంటాయి.

ఆయన గురించి రాయమన్నా, చెప్పమన్నా ముందు నాకు నా కళ్ళు చెమరిస్తాయి. ఆయన గురించి ఎంత రాసినా తక్కువే. నేను ఇంకా ఆయన వ్యక్తిత్వం గురించిగాని, ఆయన పాండిత్యం గురించిగాని, ఆయన స్వభావం గురించిగాని ఏమీ రాయనేలేదు. ఆయన నాతో ఎలా వుండేవారో రాసాను. ఇంకా చాలా చాలా రాయలేదు.
ఈరోజు కూర్చుని, ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆయన నాతో అలా ఉండకపోతే నేను మా అమ్మనికాని, నా తోబుట్టువులని కాని సరిగా అర్ధం చేసుకోలేకపోయి వుండేదాన్నేమోనని అనిపిస్తుంది. నేను ఈరోజు ఒక మంచి టీచర్ గా, మంచి గృహిణిగా, మంచి తల్లిగా, మంచి మనిషిగా అనిపించుకుంటున్నానంటే అది ఆయన వలనే అని గట్టిగా చెప్పగలను.

11 thoughts on “మా మంచి నాన్న

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *