April 25, 2024

రమణ స్థితి

రచన: వారణాసి రామబ్రహ్మం

మనసు విరమింపబడిన సమయమున
జీవుడు “మరణించి” భగవంతుడై రమించు;
శాంతము మౌనము ఆనందము విలసిల్లు,
తొలగి ఉండును అహంకార మమకారములు

ఆత్మదశ అది‌; పారలౌకిక అనుభవమది
తత్త్వసారము నిర్మల మానసమై వెలుగొందు
విశాల సుఖవిస్తార వేళ; పరమము; ప్రకృతికి
పరము; ప్రజ్ఞాన ఘనము జ్ఞానమయము

బ్రహ్మమందు మది తాను లీనమైన స్థితి
సత్ భావ స్థితి చిత్ రూప గతి; అస్తి భాతి
ప్రియము; సతత సుఖానుభూతి రసరతి
మనిషి పరమాత్మయై వెలుగు సృష్టి నియతి

ఆత్మానుభవమది; జగత్ జీవేశ్వరులు
ఒకటైన భావాతీత నిర్మల విశ్రాంతదృష్టి
భక్తి యోగ రసైక మోక్ష నిర్వాణ సమ స్థితి
రక్తి విరక్తి సంయమ వ్యక్తి నిజ స్వరూపస్థితి

ఆత్మారామము రామబ్రహ్మము
పరబ్రహ్మము పరమానందము
సాక్షిమాత్ర గమనికా ప్రవాహము
ఈశ్వరము ఐశ్వర్య కారకము

నాదము దివ్యుని నినాదము
ప్రణవము సంగీత గీత మూలము
సామగానము నినదించు శబ్దస్వరూపము
వేదనిలయము సంవేద నాశము

విష్ణు చిద్వివిలాసము లక్ష్మీమయము
శివతాండవము శక్తీ ప్రవాహము
వాణీబ్రహ్మల రసబాణీ యుతము
ఆత్మయే పరమాత్మ అదే మనము

అదే రమణము మిథ్యాహం విరమణము
రమణీయ రసానుభవ సారము వరము
ఇంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తాతీతము
బ్రహ్మము ప్రజ్ఞానము శుద్ధాహము అసలు నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *