March 29, 2024

అత్తారిల్లు (తరాలు-అంతరాలు)

మంథా భానుమతి.

“అంత భయవెందుకే అత్తారిల్లంటే! మా కాలంలో లాగానా ఏవన్నానా?” ఇంకా పూర్తిగా తెల్లారలేదు.. అప్పుడే మా అమ్మాయి గదిలోంచి నెమ్మదిగా మాటలు, వంటింట్లోంచి ఢమఢమా చప్పుళ్లు..
ఆదివారమైనా ఒకరగంటసేపు ఎక్కువ పడుక్కుందామంటే కుదరదు. బద్ధకంగా మంచం మీద అటూ ఇటూ కదిలాను.
దుప్పటి చెవుల మీదుగా బిగించి కళ్ళు మూసుకున్నా.. ఊహూ! ఒక సారి టాటా చెప్పి వెళ్ళిపోయిన నిద్రాదేవి మళ్లీ వస్తుందా నా పిచ్చిగానీ.. కళ్లు మండి పోతున్నాయి. రాత్రి చాలా పొద్దు పోయింది. శనివారం అంటే, అర్ధరాత్రి వరకూ ఏదో పుస్తకం పట్టుకుని పూర్తి చేసేవరకు వదలక పోవడం మా చెడ్డ అలవాటు నాకు.
ఒక్క ఉదుట్న కాళ్ళతో దుప్పటి తన్ని మంచం మీదినుంచి కిందికి దిగాను. చల్లని నీళ్ళతో కళ్ళని శాంత పరచి, జెల్ పేస్ట్ తో పళ్ళని శుభ్రపరచి వంటింట్లోకి ప్రవేశించాను.
వంటిల్లంతా అప్పుడే రైలు వెళ్ళిన ప్లాట్ ఫారంలా ఉంది.
పాలు కాచుకుని తాగినట్లుగా స్టౌ మీద మూత పెట్టని పాలగిన్నె. పక్కన అట్టకడుతున్న పాల గ్లాసు. గదిలో ఒక మూల వాడేసిన పాల పాకెట్లు. గట్టు మీద అరటి పళ్ల తొక్కలు.
పాల గిన్నె.. మా దొరగారు చెయ్యి పెట్టిన వెంటనే దొరికినట్టు లేదు.. గిన్నెలన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి.
ఫ్రిజ్ లోంచి పాల పాకెట్ తీసినప్పుడు పెరుగు గిన్నె ఒలికినట్లుంది.. హడావుడిగా కనిపించిన బట్ట పెట్టి తుడిచేసి, మూలకి గిరాటేసినట్టున్నారు.. నేలంతా తెల్లగా ఒక పొర. దానికి తోడు కోడిగుడ్డు కూడా కింద పడి పగిలినట్లుంది.. కడుపులోంచి తిప్పేస్తోంది.
అనిల్.. అదే నా జీవిత నేస్తం.. బ్రహ్మానందరెడ్డి పార్క్ లో జాగింగ్ కి వెళ్లిపోయినట్లున్నారు. వారానికి ఏడురోజులూ, హోరున వాన పడుతుంటే తప్ప వెళ్లి తీరాల్సిందే. కదలకుండా కూర్చుని పనిచేసే బాంక్ ఉద్యోగం మరి..
“ఆ మాత్రం వెళ్లకపోతే హార్టు కూడా కొట్టుకోడం మర్చిపోతుంది కొన్నాళ్టికి..” అనిల్ ఉటంకిస్తాడు.
నిజమే కదా అనుకుంటా! కానీ ఈ వంటింటి భీభత్సం భరించడమే కష్టంగా ఉంది.. నేనెప్పుడైనా కాస్త బద్ధకిస్తే ఆ తరువాత సామెత చెప్పినట్టే. ఏ మాటకామాటే.. అనిల్ ఆరు మైళ్లు ఆగకుండా పరుగెత్తగలడు.
ఏ పని ముందు చెయ్యాలి? హఠాత్తుగా నీరసం వచ్చింది.. ముందు కాఫీ తాగుతే కానీ..
కాఫీ కప్పు తీసుకుని బాల్కనీలోకి వెళ్లాను. మాది మూడు గదుల అపార్ట్ మెంటు.. అందులోఎనిమిదీ బై ఆరు అడుగుల బాల్కనీ.. మా అమ్మాయి ప్రత్యూషకి మొక్కలంటే ఇష్టం.. చిన్న తోటలా చేసింది. చేసింది అనకూడదు.. ప్లాన్ చేసింది అనాలి. మొక్కలు, కుండీలు తేవడం.. ఏది ఎక్కడ పెట్టాలో చెప్పడం వరకే అమ్మాయిగారి పని. ఆ తరువాత పనంతా నాదే.. పనమ్మాయి సహాయంతో.
నాలుగు ప్లాస్టిక్ కుర్చీలు, ఒక చిన్న టీపాయ్. అక్కడే కుటుంబ సభ్యులం నలుగురం శిఖరాగ్ర సమావేశాలు జరుపుతుంటాం. కుండీలో వేసిన పారిజాతం.. నాలుగు పూలని కిందికి విదిల్చింది. నాలుగే అయితేనేం.. ఆహ్లాదమైన పరిమళం మనసుకి హాయి కలిగిస్తోంది. నిజమే..
“మనసుకి నచ్చిన మాటలు, చెవులకింపైన పాటలు, ఇతరులకుపయోగించే చేతలు, వాసనగల పూలు నాలుగైనా చాలు కదా!” నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. పొద్దున్నే వేదాంతం వల్లించుకుంటూ కూర్చుంటే నాకున్న నలభై నాలుగు పనులూ ఎవరు చేస్తారు?
మా ఇంట్లో ఉన్నది నలుగురమే ఐనా.. సరిగ్గా పని చేసేది నేనొక్కదాన్నే. మిగిలిన ముగ్గురూ అదోరకం మాలోకాలు. ఒక పని చేశారంటే నాకు నాలుగు పనులు కలుస్తాయి. అనిల్ మహాశయుడి గురించి ఇందాకే చెప్పా కదా!
అంతలో.. నా ఏకాంతాన్ని భంగం చేస్తూ వచ్చేశారు మా అమ్మాయి ప్రత్యూష, వాళ్ళ బామ్మ.. చెరో స్టీలు గ్లాసుతో, ఎత్తుగా నురుగు కనిపిస్తున్న కాఫీతో.
“ఏమిటో పొద్దున్నే మనవరాలితో మంతనాలు?”
“ఏం లేదే సుగుణా! ఏదో.. దాని డౌట్స్.. తీర్చడానికి తాపత్రయ పడుతున్నా.” మా అత్తగారు తడబడుతున్నట్టుగా అన్నారు.
అప్పుడే నాకు అనుమానం వచ్చింది.. నాకు తెలియకుండా ఏదో జరుగుతోందని.
మా ఇంట్లో ఎప్పుడూ రెండు పార్టీలుంటాయి. సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి అందులో సభ్యులు మారుతుంటారు. మీరు ఆలోచిస్తున్నది కరెక్టే.. అచ్చు మన రాజకీయ పార్టీల్లానే.
ఇప్పుడు మా అమ్మాయి, అత్తగారు ఒక పార్టీ అయినట్లున్నారు. కనుబొమ్మలు ముడిచి ఏమిటన్నట్లు చూశాను. ప్రత్యూష పారిజాతం మొక్కని పరీక్షిస్తోంది, తీక్షణంగా.
“అబ్బాయిని రానీ మాట్లాడు కుందాం. ఇవేళ ఆదివారమే కదా! వంటేమిటో ఆలోచించావా?” మాట మార్చడంలో మా మాయావతమ్మగారికి ఎవరూ సాటి రారు. మా అత్తగారి అసలు పేరు సత్యవతి. ఆవిడ వేసే పాత్రని బట్టి పేరు పెడుతుంటాను. మహా హడావుడి మనిషి.
“హూ..” గట్టిగా నిట్టూర్చాను.
“కూరలేంటో తీసి పెడ్తే తరిగేస్తా. పాపం అబ్బాయి అంతా ఆగవాగం చేసెళ్తే సర్దేప్పటికి నీ పనైపోయుంటుంది.” సానుభూతి కురిపిస్తూ, మోకాళ్ళు రెండు చేతుల్తో పట్టుకుని లేవబోయారు.
“వద్దొద్దు అత్తయ్యా! ఎంతసేపు.. నే చేసుకుంటా..” హడావుడిగా అక్కడ నుంచి లేచి వెళ్ళి పోయాను.

మా అత్తగారు నలుగురన్నదమ్ములున్న ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలిగా చాలా బరువు బాధ్యతలు భరించారు. అందులో.. వీళ్ళనీ వాళ్ళనీ లేదు.. అందరూ అందరితో మెచ్చుకోవడాలూ, నొచ్చుకోవడాలూ, అలకలూ, సాధింపులూ.. అసూయలూ! ఒక్కడే కొడుకైనా అనిల్ పదిమందితో కలిసి పెరిగారు. గారాబం లేదు సరి కదా ఆలశ్యంగా పుట్టడం వల్ల, పెద్దవాళ్లైన బాబాయిల పిల్లల పెత్తనాలు.. అమ్మ ఎప్పుడూ వంటింట్లో.. ఒక రకంగా వంటరితనంతో బాధపడినట్లే!
మా పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంలోంచి బైటికొచ్చేశారు అత్తగారు, మామగారు.. రావలసి వచ్చింది. అదీ మా సత్యభామమ్మగారి పట్టుదల వల్లే!
చిన్నప్పటి నుంచీ శక్తికి మించిన పని చేసి చేసి మా అత్తగారి చేతులు, కాళ్ళు అరవై ఏళ్ళు నిండగానే ఇంక మాట వినమని మొరాయించేశాయి. మూడేళ్లక్రితం మామగారు పోయినప్పట్నుంచీ నరాల బలహీనత.. ఏది ముట్టుకున్నా వేళ్ళు వణుకుతుంటాయి. నాకు సాయం చెయ్యాలనే ఉంటుంది పాపం. అందులో కత్తిపీట.. ఇంకేవైనా ఉందా! స్టౌ దగ్గరికి కూడా రానియ్యకూడదని ఎప్పుడో డిసైడయ్యాం. అయినా ప్రతీ విషయం ఆవిడతో చర్చిస్తూ ఉంటాం. ఆవిడ కూడా తన అనుభవాన్ని రంగరించి మంచి సలహాలిస్తుంటారు.
ఇంక మా అమ్మాయి ప్రత్యూష అచ్చు వాళ్ల నాన్న పోలికే. పాతికేళ్ళు దగ్గర పడుతున్నా, చిన్నపిల్లలా ఎగురుతూ ఉంటుంది ఎప్పుడూ! ఏదో యమ్మెన్సీ కంపనీట, నాకు నోరు తిరగదు.. అందులో హెచార్ లో ఏదో పని! నన్నెవరడిగినా ఇలాగే చెప్తుంటే అందరూ నవ్వుతుంటారు.
“మా కంపెనీ పేరు, నా పనీ.. అన్నీ కాగితం మీద రాసిస్తా ఇంపోజిషన్ రాసి బట్టీ కొట్టకూడదూ?” వంట గట్టు శుభ్రం చేస్తున్న దాన్ని కొరాకొరా చూస్తుండగానే, పళ్ళాలు సర్దుతూ బల్ల మీదున్న మంచినీళ్ల సీసా ధడేల్ మని దొర్లించేసింది మా పెచ్చూ. ఒకే సారి పది ఆలోచనలు తిరుగుతుంటాయి దాని బుర్రలో.
కుర్చీలోంచి లేవబోతున్న అత్తగారిని వద్దని వారించాను. ఆవిడకి గాని కాలు జారిందంటే లేనిపోని అవస్థలు.
“ఉండమ్మా, ఒక్క నిముషం..” నాలుగంగల్లో గదిలోకి వెళ్ళి తెల్లగా ఉతికిన టర్కిష్ తువ్వాలుతో చక్కగా పొడిగా తుడిచేసింది, నేను నోరు తెరుచుకుని చూస్తుండగానే.
“పదండి.. ఆదివారం కదా! మంచి సినిమా వస్తోందేమో చూద్దాం..” నా రియాక్షన్ బైటికొచ్చే లోపే అనిల్ అందర్నీ హాల్లోకి నడిపించాడు.

“ఏవంటున్నావే? తెలుస్తోందా ఏం మాట్లాడుతున్నావో?” కొంచెం గట్టిగానే అరిచాను. ప్రత్యూష నదురూ బెదురూ లేకుండా చూసింది.
“ఇప్పుడేమయిందనమ్మా! అంతగా అప్ సెట్ అవుతున్నావూ? పిల్లకి ఇరవైనాలుగు నిండాయి. పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్దామనుకుంటోంది. ఇందులో వింతేముంది?” బామ్మగారు వత్తాసు కొచ్చేసింది.
“అయితే ఇదన్నమాట.. ఇద్దరూ కూడబలుక్కుంటున్నారు పొద్దుట్నుంచీ! నాకెందుకు చెప్పదుట మీ మనవరాలు? ఇంతకీ పెళ్ళికొడుకెవరుట?”
“ఇలా అరుస్తావనే నీకు ముందుగా చెప్పలేదు. కూచుని కూల్ గా ఆలోచించు. నాకు నచ్చిన వాడిని ఎంచుకోవడంలో తప్పేముంది? సంతోష్ నీకు బాగా తెలిసిన వాడే.. తన చెల్లెలి పెళ్లిలో వాళ్ల ఫామిలీని చూశావు. పెళ్లికూతుర్ని చేసినప్పుడు ఇంటికి కూడా వెళ్ళాము. అప్పుడు మెచ్చుకున్నావు కూడా! మేమిద్దరం ఏడాది నుంచీ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ కలిసి లైఫ్ లాంగ్ ఉండగలమని నిర్ణయానికి వచ్చాము. మంచి ఫామిలీ. చదువు, ఉద్యోగం కూడా మంచివే! ఇవేళే ఇద్దరం ఇంట్లో చెప్పాలని అనుకున్నాం.” ప్రత్యూష నెమ్మదిగా ఐనా స్థిరంగా అంది.
“మరి రెండు నెలలనుంచీ మారేజ్ బ్యూరోల చుట్టూ తిరుగుతుంటే ఒక మాట చెప్పచ్చు కదా! నా ఫ్రెండ్స్ అందరితో కూడా చెప్పాను. అసలు పేరెంట్స్ అంటే లెక్కుందా? మీరేం మాట్లాడరేం?” నా కోపాన్ని అనిల్ వైపు మళ్ళించాను. అనిల్ నిమ్మకి నీరెత్తినట్టు సోఫాలో కూర్చుని సినిమా చూసినట్లు చూస్తున్నాడు జరుగుతున్నదంతా.
“ఇంతకీ అమ్మాయ్! నీ బాధ అది అబ్బాయిని ఎంచుకుందని కాదు.. నీకు ముందు చెప్పలేదని. అంతే కదూ?” సత్యవతమ్మగారికి లౌక్యం తెలీదు. మెదడుకి తట్టింది బైటికి కక్కడమే!
మా అమ్మాయి, వాళ్ళ నాన్నల ముసి ముసి నవ్వులు చూస్తుంటే నాకు ఒళ్లు మండిపోయింది.
“ఇంకేం.. ముగ్గురూ ఒక పార్టీ అయ్యారు కదా! రిజిస్ట్ట్రార్ ఆఫీస్ లో అప్లికేషన్ ఇచ్చి రండి.”
ఆ తరువాత ప్రత్యూష చెప్పిందానికి నాకు కోపం నషాలానికంటింది. లేచి చరచరా వెళ్లి గది తలుపు ధడేల్ మని వేసి ముసుగు తన్ని పడుకున్నాను.
అలా కలత నిద్రలో ఎంత సేపుండిపోయానో!
నా నుదుటి మీద ఎవరిదో స్పర్శ.. మెత్తగా, చల్లగా! సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే స్పర్శ.. ఓదార్పుగా, నేనున్నా నీకంటూ అభయమిస్తూ ఊరడించింది.
“ఎందుకురా అమ్మడూ! అంత మధన పడుతున్నావు? ఏం భయం లేదు. సవ్యంగా జరిగి పోతుంది. అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉంటుంది. మన అండ దానికెప్పుడూ ఉంటుంది.”
“అమ్మా.. అమ్మా!” పక్కనే కూర్చుని సాంత్వన పరుస్తున్న ఆ చల్లని ఒడిలో దూరి భోరుమన్నాను.
“ఏం ఫరవాలేదు. నేనున్నాను కాదా!”
తలెత్తి, నీళ్లు నిండిన కళ్లతో మా అత్తగారి.. కాదు కాదు.. అమ్మ మొహం చూశాను. అదే ధృఢ నిశ్చయం కళ్లల్లో! వయసు మీద పడడంతో కాసింత సడలిందంతే.
మా ఇద్దరికీ గతం గుర్తుకొచ్చింది ఒక్క సారిగా!
“నే వెళ్తున్నా!”
హాలు నిండా కూర్చునున్న జనంలో ఏ స్పందనా లేదు. నాన్నగారైతే సోఫాలోంచి విసురుగా లేచి లోపలికెళ్లి పోయారు. అమ్మ కన్నీళ్లు కనిపించకుండా మొహం తిప్పుకుంది. బాబాయ్, పిన్ని, అత్త, మామయ్య.. నాకంటే రెండు మూడేళ్లు పెద్దో చిన్నో అయిన, వాళ్ల పిల్లలు.. అందరూ శిల్పాల్లా ఉండిపోయారు.
నాలో ఏదో మొండితనం. నన్ను ఎందుకు అర్ధం చేసుకోరు? అనిల్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో.. నా మంచి కోసమే అన్నట్లు నీతి బోధలు రాత్రంతా.. ఒకరి తర్వాత ఒకరు.
“కష్టపడతావే! మన కంటే పెద్ద కులం అనే గర్వం నిన్ను వాళ్లతో సమంగా చూడనివ్వదు. అందులో జాయింట్ ఫామిలీ అంటున్నావు. అసలు పెళ్లిలో మనల్ని మనుషుల్లా చూస్తారా వాళ్లు? మన ఆస్థులూ, మన లైఫ్ స్టైల్ పూర్తిగా వేరుగా ఉంటాయి. పప్పన్నం తప్ప ఇంకేం దొరకదు. నీకేవో ముక్క లేందే ముద్ద దిగదు.” అందరు చెప్పేది ఒకటే.
“సరే.. అతడే కావాలనుకుంటే ఇంక నీకూ మాకూ సంబంధం లేదు.. నేనైతే పెళ్లి చెయ్యను.” నేను బండరాయిలా ఉలుకూ పలుకూ లేకుండా నిల్చుంటే, నాన్న వేసిన చివరి అస్త్రం..
అంతా నేను, అనిల్ ఊహించినట్లే జరుగుతోంది. మా ఇంట్లోనే ఒప్పుకోపోతే అనిల్ వాళ్లింట్లో ఏమనుంటారో ఊహించడం కష్టం కాదు. మాది చాలా ఆధునిక భావాలు కల కుటుంబం అనుకుంటుండేదాన్ని. కానీ అన్నీ ఆర్ధిక భావాలే అనుకోలేదు.
మర్నాడే రిజిస్ట్రార్ ఆఫీస్ లో అప్లికేషన్ ఇచ్చాం. నెలయ్యాక పదిమంది ఫ్రెండ్స్ మధ్య రెండు దండల మార్పిడితో మా పెళ్లైపోయింది. తర్వాత మినర్వాలో భోజనాలు చేశాం. వెయ్యిరూపాయల ఖర్చు.
అనిల్ వాళ్లింట్లో అడుగు పెడుతుంటే నా గుండె డ్రమ్స్ వాయిస్తున్నట్లు కొట్టుకోడం మొదలెట్టింది. గుమ్మం దగ్గరే ఎదురైన పిన్ని నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. వెంటనే బిలబిల్లాడుతూ పది మంది వచ్చేశారు. ఏముందింక.. షరా మామూలే.
అనిల్ తాతగారు ఉగ్రనరసింహావతారం ఎత్తారు.
ఎవరూ నోరెత్తలేదు. కాళ్ళల్లోంచి వణుకొచ్చి కళ్లు తిరిగి కింద పడబోయాను. అనిల్ నడుం చుట్టూ చెయ్యేసి ఆపారు. ఇద్దరం వెనక్కి తిరిగి వచ్చేశాం. నాలుగు రోజులు హోటల్లో ఉండి స్నేహితుల సాయంతో అనిల్ బాంక్ దగ్గరగా ఇల్లు తీసుకుని, పాలు పొంగించుకోడానికి ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ రోజు శనివారం.. సరిగ్గా, ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా ఇంటి ముందు ఆటో ఆగింది. అందులోంచి దిగారు అత్తగారు, మామగారూ!
అప్పటినుంచీ అనిల్ కీ నాకూ కూడా అమ్మా నాన్నా అయ్యారు. కొడుకుని వదులుకోనని ఖచ్చితంగా చెప్పి మా అత్తమ్మ, మామగారిని మా దగ్గరికి తీసుకొచ్చేసింది..

“నాకు ప్రత్యూష కోరిక ఎలా తీర్చాలో తెలీడం లేదు.. మా అమ్మా వాళ్లూ ఇప్పటికీ నన్ను దగ్గరికి రానియ్యడం లేదు. ఐనా పెళ్లికి అంత ఖర్చు, హడావుడి అవసరమా? పైగా ముందుగా ఎంగేజ్ మెంటోటిట! ఐదు చీరలు.. ఒక్కోటి పదిహేను వేలు పెట్టాలిట. ఆ తర్వాత ఆ చీరలన్నీ ఏం చేస్తుందో!” సింకు దగ్గర గిన్నెలు కడుగుతూ సణుగుతున్నాను.
సరిగ్గా అప్పుడే వచ్చింది పెళ్లి కూతురు, స్కర్టు బ్లౌజు వేసుకుని, ఎగురుతూ. వెనుకే బామ్మగారూ!
నాలుగు రోజులయింది.. సంతోష్ వాళ్లింటికి వెళ్లి వాళ్లతో మాట్లాడి.కాబోయే వియ్యాలవారు మంచివాళ్లే కానీ పెద్ద లిస్ట్ ఇచ్చారు. కట్నం ఏం వద్దుట. కానీ ఆ లిస్టు, వాళ్లు చెప్పిన కళ్యాణ మండపం.. అవన్నీ కలుపుతే పది, పదిహేను లక్షలు పైన అయేట్లుంది. మాకున్న సేవింగ్స్ అన్నీ ఈ అపార్ట్ మెంట్ కొనడానికి, వుడ్ వర్క్ కి ఐపోయాయి. మా అమ్మ వాళ్లు పెళ్లికి ముందు హెచ్చరించిన ఇబ్బందులన్నీ వచ్చాయి. కానీ.. అనిల్, అత్త మామలు చూపించిన ప్రేమతో సర్దుకు పోయాను.
“నో వర్రీస్ మా! మై హూనా..” వెనకనుంచి మెడమీద చేతులు వేసి తన వైపుకి తిప్పుకుంది నా కూతురు.
“సంతోష్ వాళ్లు మన దూరపు బంధువులు సుగుణా! కోడల్ని బాగా చూసుకుంటారు. ఒక్కడే కొడుకు కదా.. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని అనుకోడంలో తప్పు లేదు.” అత్తగారు చటుక్కున నాలిక్కొరుక్కున్నారు.. చురుగ్గా చూస్తున్న నన్ను చూసి.
కడిగిన గిన్నెలు బోర్లించి, చేతులు విదిలించి, కొంగుకు తుడిచి, భోజనాల బల్ల దగ్గరికెళ్లి, కుర్చీలో కూర్చున్నా. నాలో ఒకేసారి అనేక రకాల భావాలు.. భయాలు. పుట్టింటి అండ లేకపోవడంతో.. ఒక రకమైన ఆత్మన్యూనతా భావం ఉందనుకుంటా నాలో అంతర్లీనంగా! అత్తగారు వచ్చి నాపక్కన కూర్చుని భుజం మీద చెయ్యేశారు.
“నిన్ను నొప్పించడం నా ఉద్దేశం కాదు తల్లీ! అప్పటి పరిస్థితుల్లో మీకు వేరే దారి లేదు. నేను అర్ధం చేసుకోగలను. ఇప్పుడు పెళ్లి చెయ్యడం అంత బరువేం కాదు.. అన్నీ గుత్త కిచ్చెయ్యడవే కదా! మన బంధువులు కూడా ఇప్పుడు మనతో బానే ఉంటున్నారు. మీ అమ్మా వాళ్లనీ కూడా పిలుద్దాం. ఇంక డబ్బు సంగతి..”
“అమ్మా! నాలుగేళ్లనించీ సంపాదిస్తున్నాను.. నాన్నగారు నాదగ్గర పైసా తీసుకోవడం లేదు. నా సేవింగ్స్ అన్నీ నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశా.. చూడు. నాన్నగారికీ సంగతి తెలుసు.”
ప్రత్యూష చూపించిన పాస్ బుక్ లో సంఖ్య చూడగానే ఒక్కసారి నా నోరు తెరుచుకుంది. పదిహేను లక్షలు..
“ఇంత జీతమా నీకు.. కానీ మీ అత్తగారు..”
“ఏమీ అనరు. అసలు నేను జాబ్ చెయ్యకపోయినా ఏమనరు. వాళ్లతో కలిసిపోతే చాలు. నాకు వాళ్లూ, వాళ్లకి నేనూ బాగా నచ్చాం. ఓ.కే! ఇంక నవ్వుతూ, చకచకా ప్రతీ దానికీ నన్ను తిడుతూ, సరదాగా హాయిగా ఉండాలి. డీల్..” బొటనవేలు పైకెత్తి చూపించి నా బుగ్గ మీద ఒక ముద్దిచ్చి వెళ్లింది నా పాపాయి.. ఈనాటి ఆదునిక యువతి.

*—————————————*

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద

మ౦థా భానుమతి
అత్తారిల్లు
పాతకొత్తల మేలు కలయికలా చక్కని కధ అ౦ది౦చారు భానుమతి గారు. కనుమరుగైపోతున్న బామా మనవరాళ్ళ అనుబంధ౦, మూడుతరాల అవగాహన, చదువుకునే అలవాటు తేనెలో ము౦చిన చెరుకుముక్కలు ఇష్టంగా తిన్న భావన. చదివేకోద్ది చక్కని దృశ్యం ఒకటి కళ్ళము౦దు కదులుతున్నట్టే అనిపిస్తు౦ది. పరిచయ వాతావరణం, సుపరిచిత వ్యక్తిత్వాలు కధకు మంచి నేటివిటీ ని అందించాయి. ప్రత్యూష లోని ఆత్మస్థైర్యం దానికి బామ్మ వత్తాసు ఆధునికతనిచ్చాయి.
చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా పిల్లదగ్గరకు వచ్చేసరికి వారి మ౦చి చెడులు తమకే తెలుసనే తలిదండ్రుల భావన. కొంతలో కొంత ఒక తరం వెనక వారైనా సత్యవతమ్మ గారి సమర్ధి౦పు బాగు౦ది.
స్వయంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆదరించిన అత్తగారు తల్లిలా ఆదుకున్న భయాలు సహజమే. పెళ్ళితో పుట్టిల్లు లేకు౦డా పోయిన తల్లి భయాలూ సహజమే. పెళ్లి ఖర్చుల విషయం ఆలోచి౦పజేసేదిగా ఉంది. నిజమే ఈ భేషజాలను౦డి ఎప్పుడు బయట పడుతు౦దో సమాజం.
డబ్బు ఎవరిదైనా అనవసరపు ఖర్చు ఆలొచి౦చాల్సిన విషయమే. సుతిమెత్తగా పరిస్థితులు విప్పి చెప్పి చక్కని కధ అందించారు భానుమతి గారు.

7 thoughts on “అత్తారిల్లు (తరాలు-అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *