April 24, 2024

ఏవగింపు

రచన: పుక్కళ్ళ రామకృష్ణ

నిన్న రాత్రి నాన్న చెప్పిన, “అదిగో పులి” కథ నచ్చింది. అసత్యం పలికితే ఎదురయ్యే విపత్తులేమిటో తెలిపే కథ.

నాన్న ప్రారంభించిన రెండో కథ సంపూర్ణం కాకముందే నిద్రలోకి జారుకున్నాను. ఉదయం మెళకువ వచ్చే సమయానికి బాగా పొద్దెక్కింది. కిటికీ నుండి వేప చెట్టు క్రింద స్టాండ్ వేసిన నాన్న సైకిల్ కోసం చూశాను. అది అక్కడ లేదు. సైకిల్ లేకపోతే నాన్న ఆఫీసుకు వెళ్ళినట్లు అర్థం.

బడులకు వేసవి శెలవులొచ్చాయి. శెలవులన్నీ ఇంటి బయట ఆటలతోనే గడిచిపోతున్నాయి. సాయంత్రం మాత్రం పెందరాళే నాన్న ఇంటికి వచ్చిన సమయానికి ఇల్లు చేరుకుంటున్నాను. నాన్నఆఫీసు నుండి ఇంటికొస్తూ నాకోసం వెదుకుతాడు. మధ్యాహ్నం భోజనం చేసి, కాస్తా ఎండ తగ్గాక. రాంబాబు, తాతారావు, ఆదిలక్ష్మిలతో కలసి ఇంటికి దూరంగా ఉన్న మామిడి చెట్ల క్రింద ఆడుకోవడానికి వెళ్లాను. ఆటల్లో పడి సమయం తెలియలేదు. ఇంటికి చేరుకునే సరికి బాగా చీకటి పడింది. అప్పటికే నాన్న ఇంటికొచ్చేశాడు.

“నువ్వు కూర్చోవడానికి సైకిల్ కి సీట్ పిట్ చేయించాను. నిన్ను కూర్చోబెట్టి వీధంతా తిప్పాలనుకున్నాను, కానీ నీవు ఇంత చీకటిపడ్డాక వచ్చావు. రేపు నేను ఇంటికొచ్చే వేళకు ఇంట్లోనే ఉండు, సైకిల్ షికారు చేద్దాం” అన్నాడు నాన్న నన్ను దగ్గరకు తీసుకుంటూ.

“ఆటల్లో పడి సమయం తెలియలేదు నాన్న, రేపు సాయంత్రం ఇంట్లోనే ఉంటాను” అన్నాను నేను.

“ఓహో! సమయం తెలియకపోవడం కూడా తెలిసిందన్నమాటా? సరే, రేపు నీకు చేతి గడియారం కొని తెస్తాను. అది చేతికి తగిలించుకుంటే సమయం తెలుస్తుంది” అన్నాడు నాన్న నవ్వి, తల నిమురుతూ.

నాన్న మాటంటే మాటే !. ఫలానాది కావాలని ప్రత్యేకంగా అడక్కపోయినా నా అవసరాలు కనిపెట్టి వాటిని సమకూర్చేవాడు. మరుసటి రోజు ఆఫీసు నుండి వస్తూ చేతి గడియారంతో పాటే, బొమ్మల కథల పుస్తకం కూడా తెచ్చాడు నాన్న.
నన్ను సైకిల్ ముందు సీట్ మీద కూర్చోబెట్టి, “గడియారం, బొమ్మల కథల పుస్తకం సంచిలో ఉన్నాయి. షికారు చేయడమయ్యాక చూద్దువుగానీ” అన్నాడు నాన్న. సీట్ మెత్తగా ఉండడం వలన ఈసారి పిరుదులు నొప్పి పెట్టలేదు. మనసు సైకిల్ షికారు మీద కాకుండా నాన్న తెచ్చిన వస్తువుల పైనే వుంది.

12, 3, 6 మరియు 9 సంఖ్యలు ఉన్న గడియారంలో సమయం ఎలా చూడాలో నాకు తెలిసేది కాదు. ఆదిలక్ష్మి దగ్గర ఉన్న చేతి గడియారం నాలుగు సంఖ్యలది. దాన్ని చేతికి కట్టుకునేది కాదు. ఫ్రాక్కున్న కుడి జేబులో వేసుకునేది.

వాళ్ళ నాన్న బస్సు డ్రైవర్. వైజాగ్ నుండి విజయనగరం వైపు వెళ్ళే బస్సును నడిపేవాడు. ఆ బస్సు మా ఊరు చేరుకునే సమయానికి భోజనం తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నకు అందిస్తుంటుంది ఆదిలక్ష్మి. అందుకే చీటిమాటికీ జేబులో నుండి గడియారం తీసి, సమయం చూస్తూ మాతో ఆడుకునేది. మా ఇంట్లో ఉన్న గడియారం ఒకటి నుండి పన్నెండు వరకూ సంఖ్యలు ఉన్నది. అది గంటగంటకూ సమయం ఎంతైతే అన్ని గంటలు కొడుతుంది. చిన్న ముల్లు, పెద్ద ముల్లు ఉన్న స్థానాలను బట్టి సమయం ఎంతైందో నాకు ఇట్టే తెలిసిపోయేది. అలవాటు పడటం మూలంగా, రాత్రుళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా గంటలు వినిపించినా మాకు నిద్రాభంగం అయ్యేది కాదు.

నాలుగు సంఖ్యలున్న గడియారంలో సమయం చూడటం నేర్చుకోవాలని సరదా పడి, ఆదిలక్ష్మిని నేర్పమని అడిగితే అది బెట్టు చేసింది. కోపమొచ్చి దాన్ని అడగడం మానేశాను. నాన్న తెచ్చిన చేతి గడియారంలో కూడా నాలుగు సంఖ్యలే ఉన్నాయి.
“ఇందులో నాకు టైమ్ చూడటం రాదు నాన్న” అన్నాను సిగ్గుతో తలవంచుకుని. మనసు మాత్రం నాన్న తెచ్చిన బొమ్మల కథల పుస్తకంపైనే వుంది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని, నెంబర్లు లేని చోట చిన్న ముల్లు, పెద్ద ముల్లు ఉన్న స్థానాల్ని బట్టి సమయాన్ని ఎలా లెక్క పెట్టాలో ఓపిగ్గా చెప్పాడు. నాన్న ఏ విషయాన్నైనా అర్థమయ్యేలా చెప్పేవాడు.

నాలుగు సంఖ్యలున్న చేతి గడియారంలో సమయం ఎలా చూడాలో నేర్చుకున్నాక, ఆదిలక్ష్మి గుర్తుకు వచ్చింది. ఆదిలక్ష్మికి గడియారం చూపించి, నాక్కూడా సమయం చూడటం తెలుసనీ చెప్పాలనిపించింది. కానీ అప్పటికే చాలా పొద్దుబోయింది.
“రేపు గడియారానికి పసుపు రాసి తగిలించుకో, నీళ్ళు పడకూడదు సుమా…” జాగ్రత్తలు చెప్పాడు నాన్న. కొత్తబట్టలు, వస్తువులూ వాడబోయే ముందు వాటికి పసుపు వ్రాస్తుంది అమ్మ. నాన్న బయటకు వెళ్ళిపోయాక చాప మీద కూర్చుని బొమ్మల కథల పుస్తకం తెరిచాను. మొదటి కథే, “అదిగో పులి !”. నా ముఖం విప్పారింది. పుస్తకంలో అక్షరాల కంటే బొమ్మలే ఎక్కువున్నాయి. ప్రతి కథకు నాలుగు కంటే ఎక్కువ బొమ్మలు ఉన్నాయి. అదిగో పులి కథకు వేసిన బొమ్మలు నాన్న వర్ణించినట్లే ఉన్నాయి.

బొమ్మల్ని పరికించి చూస్తుంటే “అవసరం లేనప్పుడు అబద్దం చెప్పకూడదనే నీతి ఉన్న కథ” అంది అమ్మ వెనుక నుండి పుస్తకంలోకి తొంగి చూస్తూ. నేను ఒకసారి వెనక్కి తిరిగి అమ్మకేసి చూసి, మళ్ళీ పుస్తకంలో తలపెట్టి అవునన్నట్లు తలూపాను. పుస్తకంలో మిగిలిన కథలు అమ్మతో చెప్పించుకోవాలనిపించ లేదు. కథ చెబితే నాన్ననే చెప్పాలి.

అక్షరాలను కూడబలుక్కుని చదవడం శ్రమనిపించి, పుస్తకంలో బొమ్మలన్నీ చూడటం పూర్తి చేసి, మధ్య పేజీ తెరిచి పుస్తకాన్ని ముక్కు దగ్గర పెట్టి వాసన చూశాను. క్లాసు పుస్తకాలలో వచ్చే వాసనలానే అనిపించి నవ్వుకున్నాను. ఆ వాసన ఎందుకో నచ్చేది నాకు.

రోజు సాయంత్రం స్నానమయ్యాక సారా దుకాణానికి వెళ్ళేవాడు నాన్న. ఎప్పుడో గానీ ఎక్కువ తాగేవాడు కాదు. ఎక్కువ తాగిన రోజు మాత్రం అమ్మను తిట్టేవాడు. కానీ ఎప్పుడూ అమ్మ మీద చేయి చేసుకునేవాడు కాదు. ఆదిలక్ష్మి నాన్న తాగితే వాళ్ళ అమ్మను అకారణంగా కొట్టేవాడు. ఊర్లో ఎవరైనా తాగి భార్యలను హింసిస్తే నాకు నచ్చేది కాదు. అలా హింసించే మగాళ్ళ మీద రాయి విసిరి పారిపోవాలనిపించేది.

అమ్మ చిరాకు కలిగించే పనులు చేస్తేనే తిట్టేవాడు నాన్న. అలా అమ్మను తిట్టడం సబబే అనిపించేది నాకు. అమ్మకు ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యం ఎక్కువగా ఉండేది. వర్షం పడుతున్నా బయట ఆరేసిన బట్టలు సమయానికి ఇంట్లోకి తీసుకువచ్చేది కాదు. బట్టలు ఈదురు గాలికి ఎక్కడెక్కడికో ఎగిరిపోతుండేవి. ఎగరకుండా ఉన్న బట్టలు తడిసి ముద్దైపోయినా అమ్మకు చీమ కుట్టినట్లయినా అనిపించేది కాదు. బొగ్గులు పొయ్యి మీద తపేళాలో పెట్టిన పాలు పొంగి పొర్లి మండుతున్న బొగ్గుల్ని ఆర్పేసినా ఖాతరు చేసేది కాదు. రోజూ అదే తంతు. ఒక్కోసారి పొయ్యి మీద పెట్టిన బియ్యం బాగా ఉడికిపోయి అన్నం మెత్తబడిపోయేది. మెత్తని అన్నం నాన్నకు నచ్చేది కాదు. ఐనా ఆ అన్నమే నాన్నకు పెట్టేది.

రాత్రి తాగి నాన్న ఇంటికొస్తే ముద్దైపోయిన అన్నం పెట్టింది అమ్మ. “పొయ్యి మీద బియ్యం గానీ, పాలు గానీ పెడితే వాటి పనయ్యే వరకూ నువ్వు పొయ్యి ముందే కూర్చోవే రాజ్యం ! నీకు ఈ నిర్లక్ష్యం ఎప్పుడు తగ్గుతుంది?” అంటూ అర్ధాకలితో కంచం ముందు లేచి చేతులు కడిగేసుకున్నాడు నాన్న. మళ్ళీ అన్నం వండి భోజనం పెట్టే ప్రయత్నం చేయలేదు అమ్మ. నాన్నంటే అమ్మకు ప్రేమే, కాని నాన్న తాగి ఇంటికి రావడం మాత్రం అమ్మకు ఇష్టం ఉండేది కాదు. ఆదివారాలలో పగలు నాన్న తాగకుండా ఇంట్లోనే ఉంటే అమ్మ ఎంతో ప్రేమగా నాన్నకు సేవలు చేసేది. తాగి ఇంటికి వస్తే మాత్రం అమ్మ ప్రవర్తన మారిపోతుండేది.

నాన్న తాగటం తప్పనిపించేది కాదు నాకు. అమ్మ కోరినవన్నీ నాన్న కాదనకుండా సమకూర్చేవాడు. అమ్మను ఎప్పుడైనా చెడామడా తిట్టినా నాకు బాధనిపించేది కాదు. మాకంటే తక్కువ స్థాయిలో ఉన్న వీధి పిల్లలతో నేను ఆడుకుంటే అమ్మ బెత్తం పుచ్చుకుని వచ్చి, ఆ పిల్లల ముందే నన్ను కొట్టేది. నాతో ఆడుకునే కొంతమంది స్నేహితుల తల్లిదండ్రులు చిరు వ్యాపారస్తులు. రాంబాబు వాళ్ళ అమ్మ బజార్లో చేపలు అమ్ముతుంది. తాతారావు వాళ్ళ నాన్న సైకిల్ రిఫేర్ షాపు నడుపుతుంటాడు. తాతారావు తల్లి అదనపు ఆదాయం కోసం నాలుగిళ్ళల్లో పని చేస్తుంది. ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మ ఊర్లో వాళ్ళ బట్టల్ని ఇస్త్రీ చేస్తుంది. మోహన్ వాళ్ళ నాన్న రైల్వేలో గూడ్స్ ట్రైన్ గార్డ్. నా స్నేహితుల్లో ఒక్క మోహన్ని తప్పితే, మరెవరూ నచ్చేవారు కాదు అమ్మకు. నన్ను వెతుక్కుంటూ అమ్మ వస్తే, ఒక్క మోహన్ తప్ప, మిగతా స్నేహితులంతా అమ్మ కంట పడకుండా దాక్కునేవారు.

ఉదయం నేను ఆడుకోవడానికి బయటకు వెళ్తుంటే “నువ్వు ఆ ముగ్గురితో ఆటలాడటం మానేయ్, చింటూ!, మాట వినకపోతే తన్నులు తింటావు” అంది అమ్మ.

“వీధిలో ఆడుకోవడానికి వాళ్ళే ఉన్నారు, వారితో కాక ఇంకెవరితో ఆడుకునేది?”ప్రశ్నించాను అమ్మను. నాన్నకు నేను ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పెరుగను. నాన్న నా ఇష్టాలను ఎప్పుడూ కాదనలేదు.

“మోహన్ ఉన్నాడు కదా, మంచి పిల్లలతో ఆడుకుంటే మంచి బుద్దులు అబ్బుతాయి” అంది అమ్మ.

“మోహన్ గాడు గర్విష్టి, కాలువలో బంతి పడితే వాడెప్పుడూ దాన్ని ముట్టుకోడు మా చేత తీయించి కడిగిస్తాడు. మోహన్ కంటే మిగతా పిల్లలే మంచోళ్ళు” అమ్మకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను.

“ఆటైనా పాటైనా సమఉజ్జీలతో సాగితేనే బాగుపడతావు. ఈ మధ్య నీకు మాటకు మాట సమాధానం చెప్పడం ఎక్కువైంది. మళ్ళీ నీవు వాళ్ళతో ఆడటం నా కంట పడితే తోలు తీస్తాను, జాగ్రత్త !” అంది అమ్మ కళ్ళెర్ర చేసి.

“నేను వాళ్ళతో ఆడుతాననీ నాన్నకు కూడా తెలుసు. డ్యూటీ నుండి వచ్చినప్పుడు సైకిల్ ఆపి, మా అందరికీ నాన్న బిస్కెట్లు కూడా ఇస్తాడు. వాళ్ళ మీద నాన్నకు లేని ఏవగింపు నీకెందుకూ?” అన్నాను.

“మీ నాన్నకు ఉద్యోగం, ఆ సారా దుకాణంతోనే జీవితం గడిచిపోతోంది, ఊళ్ళో ఎవరెటువంటి వారో మీ నాన్నకేం తెలుసు? ఎప్పుడూ మీ నాన్న మాటేనా?… నా మాటకు విలువియ్యవా?” అంది అమ్మ, కొంచెం తగ్గు స్వరంతో.

ఆ మరుసటి రోజు ఎవరితోనూ ఆడుకోవాలనిపించలేదు. ఆఫీసు పని మీద నాన్న ఒరిస్సా వెళ్ళడం వలన ఇల్లంతా బోసిపోయినట్లుంది. నాన్న ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు.

ఆదిలక్ష్మి, రాంబాబు, తాతారావు దుంపల బడిలో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళను దుంపల బడనో… జంతికల బడనో పిలిచేవారం. కొన్ని గవర్నమెంట్ బడులు ముందు దుంపలు ఎక్కువుగా అమ్మితే, మరి కొన్ని వాటి ముందు జంతికలు ఎక్కువుగా అమ్మేవారు. అందుకే ఆయా పేర్లతో ఆ స్కూళ్ళను పిలవడం పరిపాటైంది మాకు. నేను రైల్వే స్కూల్లో , మోహన్ ఇంటికి దగ్గరలో ఉన్న ఇంగ్లీష్ కాన్వెంట్లో చదువుతున్నాం.

నాన్న ఇంట్లో లేనప్పుడు అమ్మకు కోపం కలిగించే పనులు చేయకూడదని ఓ రెండు రోజులు ఆటలకు వెళ్ళకుండా, ఇంట్లోనే కూర్చుని నాన్న తెచ్చిన కథల పుస్తకం మొత్తం ఏదోలా కూడబలుక్కుని చదవడం పూర్తి చేసి, పుస్తకంలో బొమ్మల్ని చూసి కాగితం మీద గీస్తున్న సమయంలో, నన్ను వెదుక్కుంటూ మోహన్ ఇంటికి వచ్చాడు.

“రా, బాబు!” అంటూ అమ్మ వాడిని ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించింది.

“ఏం చేస్తున్నావురా?…ఆడుకోవడానికి రావటం లేదు?! డ్రాయింగ్ వేస్తున్నావా??” అన్నాడు మోహన్, నా ఎదురుగా చాప మీద కూర్చుంటూ.

“ఆదిలక్ష్మి, రాంబాబు, తాతారావులతో ఆడోద్దంది మా అమ్మ, అందుకే ఆడుకోవడానికి వెళ్ళడం లేదు” అన్నాను ముభావంగా, మోహన్ నన్ను వెదుక్కుంటూ అలా ఇంటికి రావడం నాకు నచ్చలేదు.

“మరి నాతో ఆడుకోవడానికి రావచ్చు కదరా?, నీకు ఆ చేపలు అమ్ముకునే వాళ్ళతో, బట్టలుతుక్కునే వాళ్ళతో ఆడటమంటేనే ఇష్టంలా ఉంది” అన్నాడు మోహన్ వేళాకోళంగా.

గీస్తున్న బొమ్మను ఆపి కోపంగా మోహన్ వైపు చూశాను. వాడికి భయమేసిందేమో?… నా ముందు నుండి లేచి, “ఆంటీ, ఆ రాంబాబు, తాతారావు వారానికొకసారి స్నానం చేస్తారు. ఆ ఆదిలక్ష్మి ముక్కు ఎప్పుడూ కారుతూనే వుంటుంది. అలాంటి వాళ్ళతో ఆడుతాడు వీడు” అంటూ వంటింటిలో ఉన్న అమ్మ ముందు పిర్యాధు చేశాడు మోహన్.

“నేనూ అదే చెబుతున్నాను వాడికి, మోహన్ !. నా మాట పెడచెవిన పెడుతున్నాడు. మీ అంకుల్ వాణ్ని నెత్తిన ఎక్కించుకున్నాడు” అంది అమ్మ.

మోహన్ అభిప్రాయంతో అమ్మ అలా ఏకీభవించడంతో అమ్మ మనుసులో ఏముందో నాకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళతో ఆడొద్దని అమ్మ నన్ను అలా నిరోధించడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న వృత్తులేనని స్పష్టమై బాధనిపించింది. ఆదిలక్ష్మి వాళ్ళ తల్లి బట్టలు ఇస్త్రీ చేస్తుంది, రాంబాబు వాళ్ళ అమ్మ బజార్లో చేపలు అమ్ముతుంది, తాతారావు తండ్రిది సైకిల్స్ రిఫేర్ దుకాణం, మోహన్ వాళ్ళ నాన్న రైల్వేలో గూడ్స్ గార్డ్. కొంచెం మనసులో విశ్లేషించుకున్నాకా అమ్మ, మోహన్ తోనే ఎందుకు ఆడుకోమంటుందో అర్థం అయ్యింది. మోహన్ గాడ్ని నాకంటే మంచి బాలుడిగా అమ్మ భావించడం కూడా నాకు నచ్చలేదు.
ఆ మరుసటి రోజు నాన్న తెచ్చిన చేతి గడియారం కుడి చేతికి కట్టుకుని, “అమ్మ, ఆదిలక్ష్మికి నా చేతి గడియారం చూపించి వస్తాను. వాళ్ళ నాన్న లారీ డ్రైవరే కావొచ్చు… వాళ్ళ అమ్మ బట్టలు ఇస్త్రీ చేసుకునేదే అయినా నా కంటే ముందు గడియారం కొనుక్కుని సమయం చూడటం నేర్చుకుంది. నా దగ్గర కూడా గడియారం ఉందనీ, నాక్కూడా సమయం చూడటం వచ్చని దానికి చెప్పి వస్తాను” అంటూ అమ్మ సమాధానం కోసం కూడా చూడకుండా ఇంటి నుండి బయటకు పరుగెత్తాను. నా మాటలు అమ్మకు చిత్రంగా అనిపించుండొచ్చు. ముందురోజున మోహన్ ఇంటికి వచ్చి వెళ్ళడం ఒకందుకు మంచిదే అయ్యింది. నాలో ఓ సందేహం నివృత్తయ్యింది.

దార్లో రాంబాబు, తాతారావు తారసపడ్డారు.

“చింటూ ఊర్నుండి ఎప్పుడు వచ్చావురా?” అడిగాడు రాంబాబు.

“ఊరెళ్ళలేదురా, ఇంట్లోనే ఉండి కథల పుస్తకం చదువుతున్నాను. నేను చదివిన కథలు ఈ రోజు మీకు చెబుతాను”
అన్నాను, చేతి గడియారం బెల్ట్ తడుముకుంటూ.

“అదేంట్రా… నిన్న సాయంత్రం మీ ఇంటికొస్తే, నువ్వు మీ నాన్నతో కలసి ఊరెళ్ళావని చెప్పి, మీ అమ్మ మమ్మల్ని గేట్ దగ్గర్నుండే వెనక్కి పంపించేసింది” అన్నాడు తాతారావు. నాకు ఆశ్చర్యమనిపించలేదు. వాళ్ళతో నేను ఆడుకోవడం ఇష్టం లేదు కనుక అమ్మ వాళ్లకి అబద్దం చెప్పి వెనక్కి పంపించేసి వుంటుందని అనుకున్నాను.

“నాన్న ఊరెళ్ళిన మాటైతే వాస్తవం, మీతో నేను ఆడుకోవడం అమ్మకు ఇష్టం లేదు. అందుకే నేను కూడా ఊరెళ్ళానని మీకు అబద్దం చెప్పింది” అన్నాను మామూలుగా. ఈలోగా ఆదిలక్ష్మి వచ్చింది.

“ఆదిలక్ష్మి, ఇదిగో నా కొత్త గడియారం. సమయం చూడటం నేర్పించమంటే బెట్టు చేశావు కదూ? నాక్కూడా ఇప్పుడు సమయం చూడటం వచ్చు” అన్నాను. ఆదిలక్ష్మి అసూయగా నవ్వి, నా చేయి పట్టుకుని పైకి లేపి, గడియారం వైపు పరికించి చూసి చేయి వదిలేసింది. రాంబాబూ, తాతారావు గడియారం వైపు సంభ్రంగా చూసి ముచ్చట పడ్డారు. నాలుగంకెలు ఉన్న గడియారంలో సమయం ఎలా చూడాలో ఎప్పుడైనా తీరికగా నేర్పిస్తానని చెప్పాను వాళ్లకు.

రచ్చబండ దగ్గర ముగ్గుర్ని కూర్చోబెట్టి వాళ్ళకు నేను చదివిన కథలలో ఓ మూడు కథలు చెప్పాను. తన తల్లికి ఒంట్లో బాగోలేదని చెప్పి, రెండు కథలు విని ఆదిలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయింది. మోహన్ మధ్యలో వచ్చి మమ్మల్ని చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయాడు.

నేను ఇంటికి వెళ్ళే సమయానికి మోహన్ ఇంటి నుండి బయటకు వస్తూ కనిపించాడు. అమ్మకు ఇష్టం లేని పిల్లలతో నేను మళ్ళీ ఆడుకోవడం గురించి మోహన్ అమ్మతో పిర్యాధు చేయడానికి వచ్చాడని అర్థం చేసుకున్నాను.

అమ్మ బెత్తం పుచ్చుకుని నిల్చుంది. ఇంట్లో నేను అడుగు పెట్టగానే మరో మాట లేకుండా నా రెక్క పుచ్చుకుని, వీపు వాచేలా బెత్తంతో విచక్షణా రహితంగా బాదింది. నేను ఎడ్వలేదు. అమ్మ బాదిబాది అలసిపోయాకా నేను పెదవి విప్పాను.

“నిన్న రాంబాబు వాళ్ళు ఇంటికి వస్తే నేను నాన్నతో ఊరెళ్ళానని వాళ్లకు అబద్దం ఎందుకు చెప్పావమ్మా?” అడిగాను.
“నీవు వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం లేకా, నిన్ను ఇప్పుడు దండించినది కూడా అందుకోసమే!” అంది అమ్మ, కళ్ళు అగ్ని గోళాలు చేసి.

“అదిగో పులి కథలో అవసరం లేనప్పుడు అబద్దం చెప్పకూడదనే నీతుందని నాకు బోధించి, అవసరం లేకపోయినా మరి నీవు ఎందుకు అబద్దం ఎందుకు చెప్పావు?” అడిగాను.

“నాకు అవసరం పడింది కనుకా, వాళ్లకు అబద్దం చెప్పాను” అంది అమ్మ.

ఆ రాత్రి అమ్మ మీద కోపంతో, మంచం మీద అమ్మ పక్క నుండి లేచి క్రింద చాప పరుచుకుని పడుకున్నాను. ఓ వారం రోజులు రాత్రుళ్ళు అమ్మకు దూరంగానే నిద్రపోయాను.

నాన్న ఒరిస్సా వెళ్లి పదిరోజులు గడిచాకా, ఇంటికి నాన్న వయసున్న ఒకాయన వచ్చి, “మీ వారు ఒరిస్సా తీసుకువెళ్ళిన స్టీమర్ ఇంజన్ పాడైపోయింది, అది రిఫేరై రావడానికి మరో వారం రోజులు పడుతుంది, ఆందోళనపడొద్దని కంపెనీ వాళ్ళు మీకు చెప్పమన్నారు” అని అమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు.

రేపోమాపో నాన్న ఇంటికి తిరిగొచ్చేస్తాడేమోనని ఆశగా ఎదురు చూస్తున్న నాకు నిరాశ ఎదురైంది. మరో వారం నాన్న ఇంట్లో లేకుండా గడపడం నరకమనిపించింది.

ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం క్షీణించడం వలన బట్టలు ఇస్త్రీ చేయడం మానేసింది. ఊర్లో ఇస్త్రీ చేసే వాళ్ళు మరెవరూ లేకపోవడంతో అమ్మే బొగ్గు ఇస్త్రీ పెట్టెతో తంటాలు పడి ఉతికిన బట్టలను ఇస్త్రీ చేయడం మొదలు పెట్టింది. నాన్న లేకపోవడం వలన ఇంట్లో నిత్యావసర వస్తువులు నిండుకున్నాయి.

రేడియోలో, మరో ఇరవైనాలుగు గంటలలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నిర్విరామంగా కుండపోత వర్షాలు పడొచ్చనే వాతావరణ సూచన విని అమ్మ, “చింటూ, మోహన్ కి సైకిల్ నడిపించడం వచ్చు కదా? మోహన్ని తోడు తీసుకుని, మనం సరుకులు తీసుకునే నాయుడు కిరాణా దుకాణం నుండి ఓ పాతిక కిలోల బియ్యం. కొన్ని పప్పు దినుసులు సైకిల్ వెనుకన పెట్టి, సైకిల్ని ఇద్దరు అటూ ఇటూ పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని రండి” అంది ఆందోళన పడుతూ.

మోహన్ పేరు వింటూనే కోపం వచ్చింది నాకు. అయినా తమాయించుకుని మోహన్ ఇంటికి బయల్దేరాను. ఒరిస్సా బయల్దేరే ముందు నాన్న సైకిల్ ఇంటి దగ్గర్నే వదిలి వెళ్ళారు. చాలా రోజుల నుండి వాడకపోవడం వలన రెండు చక్రాలలో గాలి కూడా పోయింది.

నన్ను చూస్తూనే మోహన్ వాళ్ళ అమ్మ ముఖం చీదరించుకుని, “మోహన్, ఎవరో వచ్చారు చూడు” అంటూ గట్టిగా అరిచింది. మోహన్ ఎవరో మా అమ్మకు తెలిసినా, నేనెవర్నో మోహన్ అమ్మకు తెలియదు. మోహన్ చదువుతున్న క్లాస్ పుస్తకం చేత్తో పట్టుకుని… డోర్ దగ్గర నిల్చున్న నా దగ్గరకు వచ్చాడు. సంగతేమిటో మోహన్ కు చెప్పాను. వాడికి ఎండాకాలం శెలవుల తరువాత క్లాస్ టెస్ట్ వుంది, రాలేడని తెగేసి చెప్పింది వాడి వెనకనే నిల్చుని నా మాటలు విన్న వాళ్ళమ్మ. నేను బాధ పడలేదు, వాడు రాకపోవడమే మంచిదనుకున్నాను. అమ్మ మాట కొట్టేయలేక వాడి సహాయం కోసం వెళ్లాను. రాంబాబు, తాతారావు సహాయం కోరితే కొండలు పిండి కొట్టి తెమన్నా తెచ్చేస్తారు నా కోసం. వాళ్ళంటే అమ్మకు ఇష్టం లేదు. అది వేరే సంగతి.

మోహన్ రాలేడని నిర్దారణ అయ్యాక తాతారావు ఇంటికి వెళ్లాను. ఎండిన కొబ్బరి ఆకులను చించి, కొబ్బరి పుల్లలతో చీపుర్లు కడుతున్న తాతారావు నన్ను చూసి సంతోషంగా నవ్వాడు. సంగతి చెప్పగానే చేస్తున్న పని ఆపి చొక్కా తొడుక్కుని నా వెంట ఇంటికి నడిచాడు. సైకిల్ రెండు చక్రాలకు గాలి కొట్టించి తీసుకువస్తానని చెప్పి వాళ్ళ నాన్న సైకిల్ రిఫేర్ దుకాణానికి సైకిల్ తీసుకుపోయాడు తాతారావు.

మోహన్ ఇంటి దగ్గర జరిగినది అమ్మకు వివరించాను. అమ్మ పెదవి విరిచింది. తాతారావు సహాయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో చెప్పాను అమ్మకు. భావరహితంగా వింది.

“మీ నాన్న ఈ సైకిల్ ఎలా తొక్కుతున్నాడురా చింటూ? రెండు బ్రేకులు లూజే! గాలి కొట్టించి కొత్త బ్రేకులు వేయించాను. ఇప్పుడు సైకిల్ సూపర్” అన్నాడు తాతారావు సైకిల్ స్టేండేసి వచ్చి.

“ఎంత ఖర్చయ్యింది బాబు?” తాతారావుని అడిగింది అమ్మ.

“నా స్నేహితుల సైకిల్స్ రీఫేర్ చేస్తే, నాన్న డబ్బులు తీసుకోడు ఆంటీ” అన్నాడు తాతారావు నవ్వుతూ. అమ్మ మరింకేమీ మాట్లాడలేదు.

నాయుడు కిరాణా షాపులో నాన్నకు ఖాతా వుంది. అమ్మా నేనూ ఎప్పుడైనా ఏవైనా సరుకులు తీసుకుంటే డబ్బులు తీసుకోకుండా నాన్న ఖాతాలో వ్రాసుకుంటాడు. అమ్మ చెప్పిన చిల్లర సరుకులుతో సైకిల్ వెనుకా ముందు భాగాలు ఆక్రమించుకున్నాయి. రాంబాబు కూడా మా వెంటే ఉండడంవలన ఇరవై కేజీల బియ్యం సంచిని భుజాల మీదకు ఎత్తుకుని మాతో పాటే ఇంటికి నడిచాడు.

అమ్మంటే రాంబాబుకి భయం. ఎప్పుడైనా అమ్మ వీధిలో ఎక్కడైనా కనిపిస్తే దాక్కునే వాడు. భుజాల మీద బియ్యం సంచితో మాత్రం ధైర్యంగా అమ్మకు ఎదుట పడి ఇంట్లో దూరి బియ్యం సంచిని గోడకు చేరవేసి బయటకు వచ్చేశాడు.
అమ్మ ఇద్దరికీ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. మౌనంగా చూస్తూ నిల్చుండిపోయింది.

వాతావరణ సూచన ప్రకారం ఇరవై నాలుగు గంటల తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వలన వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్నగా ప్రారంభమైన వర్షంలో తడుస్తూ, రాంబాబు చేతి సంచితో ఇంటికి వచ్చాడు.

“పిన్నీ, వాయుగుండం తగ్గే వరకూ బోట్లు సముద్రంలోకి వేటకు వెళ్ళవు. ఇదిగో అమ్మ వంజిరం చేప ఇచ్చింది. ఆవిరి పడితే పాడవకుండా మూడు రోజులు నిల్వ వుంటుంది” అంటూ ఓ ఐదు కిలోల బరువున్న వంజిరం చేప ఉన్న సంచి అమ్మ చేతికి అందించాడు రాంబాబు. రాంబాబు పిన్నీ అని వరస కలిపి పిలవడం అమ్మకు నచ్చలేదు. అమ్మకు వంజిరం చేపంటే ఇష్టం. కాదనకుండా తీసుకుంది. నన్ను పక్కకు పిలిచి, “చాలా పెద్ద చేప, ధరుంటుంది. ఎంతో అడిగి డబ్బులిచ్చేయ్” అంది అమ్మ.
“డబ్బులొద్దు పిన్నీ, మంచి వంజిరం చేప వలలో పడినప్పుడు ఇంటికి పంపించమని చిన్నాన్న మా నాన్నతో చెప్పాడటా. మళ్ళీ బోట్లు వేటకు ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు” అన్నాడు రాంబాబు.

చేపలు పట్టే వాళ్ళకు అలా వరసలు కలిపి ఆప్యాయంగా మాట్లాడటం అలవాటు. అలా ఎవరైనా వరసలు కలిపి పిలిస్తే అమ్మకు ఒంటి మీద తేళ్ళూ జెర్రెలు పాకినట్లు అనిపిస్తుంది. రాంబాబు వాళ్ళ నాన్నకు ఎప్పటికప్పుడు సారా దుకాణంలో నాన్న సారా తాగిపిస్తుంటాడు. ఎప్పుడైనా ఇలా మంచి చేపలు వలలో పడితే వాటిని ఇంటికి పంపి నాన్న పట్ల తన విశ్వాసాన్ని ప్రదర్శించుకుంటాడు.

వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వలన అమ్మకు స్వల్పంగా జ్వరం ప్రారంభమైంది. అమ్మ నీరసంగా కనిపించే సరికి అమ్మ మీద నాకున్న కోపం చల్లారిపోయింది. చిన్న చిన్న దగ్గూ జ్వరాలకు వీధి చివరనున్న మందుల దుకాణం వాడికి రోగలక్షణాలు చెప్పి మందులు కొని తెచ్చి మాకు వేసేవాడు నాన్న. ఆరోగ్యం మరీ క్షీణిస్తే తప్ప డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం పడేది కాదు.

మెడికల్ షాపు కు వెళ్లి జ్వరానికి ఓ మూడు డోసులు తెచ్చి, ఒక డోసు అమ్మకు వేశాకా సాయంత్రానికి కాస్తా జ్వరం తగ్గింది. నీరసం మాత్రం అలానేవుంది. ప్రస్తుతం రాంబాబుకీ, తాతరావుకీ అమ్మంటే భయం తగ్గింది. ఇంటికి తరుచూ వచ్చి నాతో ఆడుకుని వెళ్ళిపోతున్నారు. రెండో రోజు కుండపోత వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. వాయుగుండం బలహీనపడుతున్న సూచనలు వాతావరణంలో తెలుస్తోంది.

సాయంత్రం తాతారావు ఇంటికి వచ్చి అమ్మకు జ్వరంగా వుందని తెలుసుకుని వెళ్లి, వాళ్ళ అమ్మ కాసులమ్మను ఇంటికి పంపాడు. కాసులమ్మ ఇంట్లోకి వస్తూనే అమ్మ నుదుట మీద చేయివేసి, “ఇంకా సిన్న వేడుందమ్మా, మాత్రేసుకుంటే రేపు దాకా తగ్గిపోతాది” అని అమ్మకు ధైర్యం చెప్పి, వంటగదిలో ఉన్న గిన్నెలు కడిగి అమ్మకు జావ కాచి ఇచ్చింది. నా కోసం కాసులమ్మ చింతపండుతో పలుచని చారు చేసి, అమ్మ ఆవిరి పట్టి ఉంచిన వంజిరం చేప ముక్కలలో ఓ రెండు ముక్కలు వేపి, వేడి వేడి అన్నంతో భోజనం వడ్డించింది.

నా భోజనం పూర్తయ్యాక ఎంగిలి కంచాలు తీసి కడిగేసి, “అమ్మకు సత్తువ రాకపోతే తాతగాడితో కబురెట్టు. వచ్చి వండుతాను” అని చెప్పేసి వెళ్ళిపోయింది కాసులమ్మ.

మూడు రోజులుగా కురిసిన వర్షాలు తగ్గి, మూడో రోజున ఎండ కాసింది. అమ్మ పూర్తిగా కోలుకుని పనులు చేసుకోగలుగుతోంది.
“నాన్న ఇంట్లో లేనప్పుడే నాకు జ్వరం రావాలా? నిన్ను బాగా ఇబ్బంది పెట్టేశానురా చింటు. ఇక నేను పనులు చేసుకోగలను. పోయి ఆడుకో!” అంది అమ్మ. అమ్మ గొంతులో ఏదో తెలియని జీర వినిపించింది.

ఇంటినుండి బయట పడి సాయిబాబా గుడి చేరుకునే లోపు కంగారుగా పరుగులాంటి నడకతో వస్తున్న రాంబాబు ఎదురయ్యాడు. “ఒరే చింటూ, పాపం ఆదిలక్ష్మి వాళ్ళమ్మ సాయమ్మ వేకువ ఝామునే పచ్చకామెర్లతో చనిపోయిందట్రా” చెప్పాడు రాంబాబు ఆయాసపడుతూ. ఆ వార్త విన్నాక నాకు చేష్టలు ఉడిగిపోయాయి. తాతారావు ఇంటికి వెళ్లి, వాడిని కూడా వెంట పెట్టుకుని ఆదిలక్ష్మి ఇంటికి బయల్దేరాం.

ఆదిలక్ష్మి తల్లి సాయమ్మ చనిపోయిన వార్త ఊరంతా ప్రాకింది. సాయమ్మ అంటే ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఆదిలక్షి ఇంటికి వెళ్ళిన దార్లోనే మోహన్ ఇల్లు కూడా ఉంటుంది. మోహన్ గేట్ దగ్గర వాళ్ళ అమ్మ పక్కన నిలబడి సాయమ్మ ఇంటికి సంతాపం తెలియజేయడానికి వెళ్తున్న జనాల్ని తల్లితో కలసి చూస్తున్నాడు. తాతారావు తల్లి కాసులమ్మ మోహన్ ఇంట్లోనూ గిన్నెలు తోముతుంటుంది కనుక తాతారావును గుర్తు పట్టి, “ఏయ్ పిల్లలూ, చావింటి దగ్గర మీకేం పన్రా, పరుగులెడుతున్నారు?. ఇంటికి పొండి” అంటూ గదమాయించింది మోహన్ తల్లి మా ముగ్గుర్నీ.

“అమ్మా, నేను వెళ్తానే….” అన్నాడు మోహన్ తల్లితో.

“పిల్లలు వెళ్ళకూడదు. పద, ఇంట్లోకి” అంది మోహన్ తల్లి.

“ఆదిలక్ష్మి కూడా చిన్నపిల్లే ఆంటీ, మరి తల్లి శవం దగ్గర ఉండకూడదా? మోహన్ని పంపించండి” అన్నాడు తాతారావు అమాయకంగా. సమాధానం చెప్పకుండా మోహాన్ ని ఇంట్లోకి లాక్కుపోయింది మోహన్ తల్లి.

మేము ముగ్గురం వెళ్లేసరికి ఆదిలక్ష్మి తన తల్లి మృతదేహం మీద తల పెట్టి వెక్కివెక్కి ఏడుస్తోంది. సాయమ్మ మృత దేహం మీద బంధువులు తెచ్చిన పూలదండలు వేస్తున్నాడు ఆదిలక్ష్మి తండ్రి. నిర్జీవంగా పడున్న సాయమ్మను చూసి నా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. ఇంటికి పారిపోయి అమ్మను గట్టిగా కౌగలించుకుని భోరున ఏడ్వాలపించింది. అలిగి ఓ వారం రోజులు అమ్మకు దూరంగా పడుకోవడం గుర్తొచ్చి పశ్చాత్తాపంతో క్రుంగిపోయాను.

చొక్కా పైకెత్తి కన్నీళ్లు తుడుచుకుంటుంటే ఎదురుగా అమ్మ నిల్చుని కనిపించింది. తనని గట్టిగా వాటేసుకుని బావురుమంటున్న ఆదిలక్ష్మిని ఓదార్చుతోంది అమ్మ. ఆ దృశ్యం చూసి నా దుఖం మరింత ఎక్కువైంది. పరుగున వెళ్లి నేను కూడా అమ్మను వాటేసుకుని, “అమ్మా..” అంటూ బావురమన్నాను. నా వెనుకే రాంబాబు, తాతారావు కూడా వచ్చి అమ్మను వాటేసుకున్నారు.
నాతో పాటే రాంబాబు, తాతారావు తలలను కూడా ఆప్యాయతతో నిమిరింది అమ్మ.

సాయమ్మ మరణం, అమ్మలో నా స్నేహితుల పట్ల ఉన్న ఏవగింపు సమసిపోయేలా చేసింది.

18 thoughts on “ఏవగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *