April 20, 2024

చిగురాకు రెపరెపలు – 7

రచన: శారద మన్నెం

మా చుట్టాల్లో ఎవరిదో పెళ్ళి. ఎవరో అంటే ఏమో కాదు. మా పెద మామయ్య మరదలి కొడుకు. మా పెద్ద మామయ్య తహశిల్దార్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడల్. చాలా స్టయిల్ చేసేవాడు. అతని కేప్స్ కి, స్టిక్స్ కి స్టాండ్సుండేవి. హంటింగ్ కి వెళ్ళేవాడు. గుర్రం స్వారీ చేసేవాడు. కాని పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు. మా అమ్మమ్మకే ఏమీ ఇచ్చేవాడు కాదు.
ఎప్పుడన్నా యింట్లో వుంటే నేను కనిపిస్తే “ఏవే శారదా, కాస్త కాళ్ళు పట్టవే!” అనడిగేవాడు.
“నేను పట్టను. నేనేమన్నా కాళ్ళు పట్టేదాన్లా కనిపిస్తున్నానా?” అనేదాన్ని…
“అయ్యో! అసలు పెద్దా చిన్నా లేదే నీకు, ఏం మీ పెదనాన్నకి పడ్తావుగా. అప్పుడేమయింది నీ పౌరుషం?” అనేది మా అత్త జోక్యం చేసుకుని.
“మామయ్య పెదనాన్నలా చూస్తారా? పెదనాన్న ఎన్ని డబ్బులిస్తారో తెలుసా? ఎన్ని స్వీట్లు కొని పెడతారో. మావయ్య అర్ధరూపాయిస్తానని అరవైసార్లు కాళ్ళు పట్టించుకుంటాడు. నేనేం నమ్మను” అని ఇంటికి పరిగెత్తుకొచ్చేదాన్ని.
ఆ మామయ్య దగ్గరకీ పెళ్ళికొడుకు వస్తుండే వాడు. ఐ.పి.ఎస్ సెలక్టయ్యాడని చెప్పుకుంటుండేవారు. తర్వాత కాలంలో సెంటృఅల్ మునిస్టరు చేసాడాయన.
పెళ్ళికూతురు కూడా మాకు చుట్టాలే. చర్చి స్క్వేర్ ఎదుటే ఇల్లు.
పెళ్ళి పిలుపులే చాలా ఆర్భాటం చేసేరు.
అప్పట్లో మగవాళ్ళు మగవాళ్ళని, ఆడవాళ్ళు రాత్రులు పెట్రొమాక్స్ లైట్లతో కార్లలో వచ్చి మరో గుమ్మం ద్వారా ఇంట్లో కొచ్చి ఆడవాళ్ళని పిలిచేవారు.
అప్పుడు విన్నాను ఆ పెళ్ళికి మద్రాసు నుండి ప్లేబాక్ సింగర్స్ వస్తున్నారట. ఇంకేముంది- నేనూ వస్తానని అడిగేను. వద్దు ఇంతమంది వెళ్ళకూడదు. మణిమాలని తీసుకెళ్తున్నా. దానికి పాటల పిచ్చి” అన్నారు పెదనాన్న.
పెదనాన్నే అంటే ఇక అపీల్ చేసుకోడానికి ఇంకేం లేదు. కాస్త దిగులుగా పెదనాన్నకి కనబడేలా అటు యిటూ తిరిగేను గాని ప్రయోజనం లేకపోయింది.
అందరూ గ్రాండ్ గా తయారవుతున్నారు.
మణక్క పెదనాన్న బాంబే నుండి తెచ్చిన కాపర్ సల్ఫేట్ షిఫాన్ చీర కట్టుకుని నల్లని వెల్వెట్ బ్లౌజ్ వేసుకుంది. చేతులకి చాల శ్రద్ధ తీసుకునేది. చాల పెద్ద జడ. మెరిసే కళ్ళు. మంచి స్వభావం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తను ఇరవై ఎనిమిదేళ్ళకే హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది.
నా వైపు జాలిగా చూసి ” నీకు పెళ్ళిలో కిళ్ళీ తెచ్చిపెడతానే! బాధపడకు” అంది ప్రేమగా నవ్వుతూ.
అలాగే అన్నట్లు తలూపేను గాని నాకా ప్లేబాక్ సింగర్స్ మీదే వుంది దృష్టి.
మా అమ్మతో సహా అందరూ బయల్దేరి వెళ్ళి పోయారు.
‘ఆడుకుందాం రా’ అంటూ చిన్న సూర్రత్నం పిలిచింది కాని నాకు ఆడాలని లేదు.
కాస్సేపటికి పాటలు వినిపిస్తున్నాయి. నా మతి చెడిపోయింది. ఇక ఆగలేక పెళ్ళివారింటికి పరిగెత్తుకెళ్ళేను.
బయట కొందరు పల్లీల పిల్లలు నిలబడ్డారు. ఎవర్నీ లోపలికి రానివ్వడం లేదు.
ఆర్భాటంగా వీధంతా లైట్లతో మెరిసి పోతోంది. క్రాకర్స్ ఆకాశంలో హల్ చల్ చేస్తున్నాయి.
నేను చిన్నగా దూరాలని ప్రయత్నించాను. వెళ్ళనివ్వలేదు. చివరికి పిల్లలందరం గోడెక్కి కూర్చున్నాం.
పాటలు వుంటుంటే లోకమే తిలియలేదు. చెప్పలేని సంతోషమేసింది. ఆ వచ్చినవారు మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వర్రావు, స్వర్ణలత… ఇంకెవరెవరో… తర్వాత చెప్పుకుంటుంటే తెలిసింది.
నాకు లోకాన్ని జయించినంత సంతోషం వేసింది. పాటలు నన్ను మరో లోకానికి తీసుకుపోయేయి. ఆనందంతో కాళ్ళూపుతూ కేరింతలు కొట్టేను. భోజనాలయ్యాయి. అందరూ వీడ్కోలు తీసుకుంటున్నారు. పాటల ప్రోగ్రాం సాగుతూనే వుంది. నేను మావాళ్ళ సంగతి మరచే పోయాను. అప్పుడు తిరిగొస్తూ మా పెదనాన్న నా వైపు చూశారు.
“పెదనాన్నా నేనూ వచ్చా” అని నవ్వుతూ గట్టిగా అరిచాను.
అప్పుడు చూశారు మిగితా అందరూ… అందరి కళ్ళల్లో కోపం.
మా అమ్మయితే సరేసరి! కళ్ళెర్ర బడి పోయాయి అవమానంతో.
నేను ఏదో జయించిన ఆనందంతో వున్నావేమో వాళ్ళ చూపుల్ని లెక్కపెట్టలేదు. గోడ మీద నిలబడి విజయగర్వంతో గంతులేశాను.
అందరూ నేనెవరో తెలీనట్లుగా వెళ్ళిపోయారు.
ఆఖరి పాట వరకూ విని…. అప్పుడొచ్చేనింటికి.
పెదనాన్న హాలో కూర్చున్నారు. నేను ఆయన్ని చూసి నవ్వేను. నన్ను చూసి “ఇలా రావే” అన్నారు.
వెళ్ళాను.
“పాటలు బాగున్నాయా?”
“బాగున్నాయి పెదనాన్నా. మన గ్రామఫోన్లో లాగే పాడారు” అన్నాను సంబరంగా.
“మరిప్పుడు మీ అమ్మ తన్నులు కూడా బాగుంటాయి. వెళ్ళు నీ కోసం కర్ర పట్టుకుని రెడీగా వుంది” అన్నారు.
నేను చలించలేదు.
“ఇప్పుడు పాటలు వినేసి వాళ్ళని చూశాను కదా పెదనాన్నా! అమ్మ ఏదో కారణంతో రోజూ తంతూనే వుంటుంది. తన్ననీ!” అన్నాను నిర్లక్ష్యంగా.
“రోజూ తంతుందా?”
“అవును. పిలవగానే పలకకపోతే కూడా తంతుంది. అసలు నన్ను చూడగానే అమ్మకి తన్నాలనే వుంటుంది”.
“ఒరేయ్ రత్నం!” అంటూ మా దొడ్డమ్మని పిలిచేరు. మా దొడ్డమ్మ వచ్చింది.
“అదేం చెబుతుందో విన్నావా?”
” ఏవంటుంది, దాంతో మాట్లాడను. అది ఆ లేబర్ పిల్లలతో కలిసి ఎలా గోడ మీద కూర్చుందో చూశారా, దీనికన్నీ లేబర్ బుద్దులే!” అంది కోపంగా.
“ఏం లేబర్ పిల్లలు మనుష్యులు కారా? ఈ వయసులో దానికా తేడాలేం తెలుస్తాయి? మీ చెల్లెలెంత తప్పు చేస్తుందో తెలుసా? దానికిప్పుడు తన్నులంటే భయమే పోయింది. ఎందుకలా… దాన్ని మాట్లాడితే కొడుతుంది. కొట్టొద్దని చెప్పు!” అన్నారు సీరియస్ గా.
“ఆ! ఇది చేసే పనులకి తన్నకేం చేస్తుంది” అంది దొడ్డమ్మ కోపంగా.
నాక్కూడా బాగా కోపం వచ్చింది. బాధ కూడా వేసింది. కళ్ళలో నీళ్ళొస్తున్నాయి.
“ఏం! మణక్కకి పాటలిష్టమని మీరు బాగా తయారుచేసి తీసుకెళ్ళేరు. నన్ను మాత్రం వద్దన్నారు. నాకు పాటలిష్టమే. మణక్క అందం గావుందని తీసుకెళ్ళేరు. నేను నల్లగా వుంటానని… మంచి బట్టలేసుకోలేదనేగా వద్దన్నారు!” అన్నాను ఉక్రోషంగా.
నా మాటలకి పెదనాన్న ఏమనుకున్నారో గాని..” అలా రావే!” అన్నారు.
“వద్దులే. నన్ను ముట్టుకుంటే నువ్వూ నల్లగా అయిపోతావు” అన్నాను దగ్గర కెళ్ళకుండా.
పెదనాన్న లేచి వచ్చి నన్నెత్తుకున్నారు.
“నీకు చాలా తెలుసునే! ఏమో అనుకున్నాను” అన్నారు నా తల నిమురుతూ.
“రోజూ అందరూ అదే మాటంటుంటే తెలియదా?” అన్నాను ఏడుస్తూ.
“ఛ! ఏడవకూడదు. నీకోసమేం.. అందరికన్నా నువే బాగుంటావు! అలా మాసిన బట్టలు, తల దువ్వుకోకుండా… రాకూడదు కదా!” అన్నారు అనునయం గా.
“అసలు బట్టలేసుకోవడానికెళ్తానే… ఏదో కారణంతో కొడుతుంది. తల దువ్విందంటే చంపేస్తుంది. అందుకే అమ్మకి దొరక్కుండా తిరుగుతాను పెదనాన్నా!” అన్నాను.
పెదనాన్న ఏమనుకున్నారో ఏమో “పదవే” అంటూ నన్ను అలానే కారెక్కించుకుని మెయిన్ రోడ్డులో జైన్ సిల్కు పాలెస్ కి తీసుకెళ్ళి బోల్డు ఫ్రాకు మెటీరియల్స్ కొన్నారు. ఆ తర్వాత కాజాలు కొని …. వెంటనే టైలర్ కి కూడ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చేరు. “ఆ గౌన్లని మీ దొడ్డమ్మ దగ్గర దాచుకో ఇక్కడే స్నానం చేసి వేసుకో” అని చెప్పేరు దార్లో.
ఇదంతా మా సౌదా గుర్రుగా చూస్తోంది.
“దాన్నొక్కర్తినే ఎందుకు తీసుకెళ్ళేవ్” అని పెదనాన్నని నిలేసింది.
“ఊరికే లేవే! పాపం వాళ్ళమ్మ కొడ్తుందని” అన్నాడు పెదనాన్న.
“కాదు. దానికేదో కొనిపెట్టేవ్!” అంది సి.ఐ.డి. లా చూస్తూ.
“ఇవిగో స్వీట్లు కొన్నాను. అందరూ తినండి” లోపలి కెళ్ళిపోయారు పెదనాన్న.
మర్నాడు కొత్తగూడెం వెళ్ళిపోయారు.
మేము ఒంగోలు వెళ్ళలేదు. మా నాన్నగారికి మాచర్ల ట్రాన్స్పరయ్యింది.
అందరం కాకినాడ నుండే మాచర్ల బయల్దేరేం.
ఇప్పటికీ తలుచుకుంటే ఆ వూరెళ్ళడం… అదోలా వుంటుంది. కాని… నేనెక్కువ ఎంజాయ్ చేసింది కూడ ఆ వూరే!
కాని… ఆ ప్రయాణం హారిబుల్!
కాకినాడ నుండి సామర్లకోట, అక్కడ రైలు మారి విజయవాడ… ఆ రాత్రి అక్కడ వెయిటింగ్ రూంలో వుండి మర్నాడు ప్రొద్దుట గుంటూరు… అక్కడ నుండి రైలు మారి మీటర్ గేజ్ ట్రైన్ లో మాచర్లకి ప్రయాణం. గుంటూరు వరకూ బాగానే వుంటుంది. ఆ తర్వాత దాన్ని ప్రయాణం అనడానికే లేదు. పలుగులూ, గడ్డపారలూ, తట్టలూ… ఒకటేమిటి… అన్నీ మన ఒళ్ళో పెట్టి కూర్చునేవారు. అక్కడనుండి పల్నాడు ప్రారంభం!
నాగరికతలోనూ, ప్రదేశంలోనూ… ఎంతో వ్యత్యాసం! అంతవరకూ టౌన్ జీవితమే తప్ప పెల్లెల గురించి, పేదరికం గురించి పెట్ట ప్రాంతాల గురించి అంత తెలియదు. భాష వేరు. పలకరించే విధానం వేరు.
రైల్లో నేను, మా అక్క తెగ ఏడ్చేం.
ప్రతి స్టేషన్ ని… మట్టి మిద్దెల్ని, నెర్రెలిచ్చిన భూముల్ని వింతగా చూశాం.
చివరికి మాచర్ల చేరేం.
నాన్న స్టేషన్ కి వచ్చారు.
ఒంటెద్దు బండిలో వెళ్తుంటే నాకు మాచర్ల నచ్చింది. కొంచెం పచ్చగానే వుంది. రోడ్డుకి అటూ యిటూ పెద్ద పెద్ద చెట్లు, చంద్రవంక నది…. బాగున్నాయి.
మా ఇల్లు కూడ పెద్దది. పక్కనే పోస్టాఫీసు… ఎదురుగా మండాది వెళ్ళే రోడ్డు. బోల్డంత స్థలం. ఇంటి పక్కన టూరింగ్ టాకీసు.
లోపలికి వెళ్తుంటే ఒక నల్లటి మనిషి తలపాగాతో వచ్చి “అట్టా ఎట్టాబడితే అట్ట పోకూడదు. పాములుంటాయి” అన్నాడు.
మేము తెల్లబోయేం.
“అవును. ఇక్కడ పాములూ, తేళ్ళూ, జెర్రెలు ఎక్కువ. ఒక్క అయిదు నిముషాలు చెప్పులు వదిలి వెళ్తే దాని క్రింద తేలో, మండ్ర కప్పో వుంటుంది. జాగ్రత్తగా వుండాలి” అన్నారు నాన్న.
మేం బిర్ర బిగుసుకుపోయాం.
“ఇంత కన్నా ముదనష్టపు వూరు దొరకలేదా? చిన్న పిల్లలతో ఎలా వుండాలిక్కడ. నేను పిల్లల్ని తీసుకుని కాకినాడ వెళ్ళిపోతాను” అంది అమ్మకోపంగా.
“కంగారు పడకు. చాలావరకు శుభ్రం చేయించేను” అన్నారు నాన్న. ఇల్లు పెద్దదే. మాచర్లంతటికీ అదే పెద్ద ఇల్లట.
అమ్మ అర్జెంటుగా సిమెంట్ తెప్పించి ఎక్కడా గోడలకి, నేలకి కన్నాలు లేకుండా పూడ్పించింది.
ఆ వూళ్ళో మూడు సంవత్సరాలున్నాం, కాని… ఎన్ని వందలకి తేళ్ళని, పాముల్ని రోజూ చంపినా ఏ ఒక్కటి మమ్మల్ని ఏమీ చేయకుండా చాల జాగ్రత్తలు తీసుకున్నారు అమ్మా నాన్నా.
అప్పుడు నాకు ఆరో సంవత్సరం.
తమ్ముడు నెలల పిల్లవాడు.
ఇంకా ఎవరం స్కూలు జోలికే పోలేదు.
మాకు చక్రపాణి గారనే మాస్టారు ట్యూషన్ చెప్పేవారు. తెలుగు చాలా బాగా చెప్పేవారు.
శ్రీనాధుడ్ని చాల తిట్టే వారు…. ఆయన పల్నాడు ని గేలి చేతూ నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు, జొన్న సజ్జ కూళ్ళు…. అంటూ వెక్కిరిస్తూ పద్యాలు రాసేరని.
భర్తృహరి సుభాషితాలు చెబుతుంటే ధర ఖర్వాటుడొకడన్న పద్యానికి నేను తెగ నవ్వేదాన్ని. ఆయన బెత్తం నేలకి కొట్టె “పళ్ళికిలిస్తే పళ్ళు పీకేస్తాను” అనేవారు అయినా నవ్వేదాన్ని.
ఆయన వెళ్ళిపోయేక నాన్నకి చెప్పేదాన్ని “నాన్నా అసలే బట్టతల, తాడి చెట్టు క్రింద నీడే మొస్తుందని…. దాని క్రింద నిలబడటం, తాటి కాయ పడి పాపం— అంటూ పక పకా నవ్వేదాన్ని.

నాన్నకి కూడా నవ్వొచ్చేది.
“నీకేం తెలుసురా జీవితమంటే! దైవోపహతుడు. అంతే… ఎక్కడ తలదాచుకున్నా తప్పించుకోలేరు. అంతే!” అనే వారు. నేను మాత్రం నవ్వుతూనే వుండేదాన్ని. కాని కాలగతిలో అది నాకు చాల అర్ధమైంది. మాకు చుట్టూ మాచర్లలోని ఆఫీసర్సంతా పరిచయమయ్యేరు. అందులో డాక్టరు గారి భార్య… మా దొడ్డమ్మలా వుండేది. ఆమెని దొడ్డమ్మనే పిలిచే వాళ్ళం. హెల్త్ ఇన్స్పెక్టర్ గారి భార్య సుశీలత్త క్వెరేటర్ భార్య మంగతాయరత్త… ఇలా చాల మంది.
మాచర్ల లో చెన్నకేశవ స్వామి గుడి లో ప్రతి వారం భోగం చేయించేవారు అందులో ఎవరో ఒకరు. అందరం వెళ్ళే వాళ్ళం. సన్నాయి మేళం తో చాల వైభవం గా చేసేవారు. అందరూ చాల కొద్దికాలం లోనే సన్నిహితం గా మారి పోయారు.
మేం డాక్టరు దొడ్డమ్మ వాళ్ళింటికి వెళ్ళేం. ఆ యింట్లోనే సుశీలత్త వాళ్ళూ వుండేవారు. చుట్టూ చ్హల పెద్ద తోట పెంచేరు. ఆ ప్రాంతపు మొక్కలే. సీతమ్మవారి జడబంతి, నిత్యమల్లి, చంద్రకాంతలూ, గన్న్రేరు, నంది వర్ధనం, బంతులు, బంగళా బంతులూ…. చాల అందంగా వుందా తోట.
మాకూ బోల్డంత ఖాళీ స్థలం వుంది. ప్రక్కన పోస్టాఫీసులో కూడ మొక్కలే లేవు.
మా అక్కకి మొక్కల పిచ్చి. నాకూ అంతే!
“మనం కూడ మొక్కలు వేద్దామా?” అంది హేమక్క.
“వేద్దాం” అన్నాను.
“మరి మొక్కల్లేవు కదా!”
“డాక్టరు పెద్దమ్మ ఇంట్లో చాల నారు పోసింది. అడుగుదాం” అన్నాను.
మా అక్క సంతోషపడిపోయింది.
నేను వెంటనే రివ్వున పెద్దమ్మ ఇంటికెళ్ళి “దొడ్డమ్మా, మేం కూడ మొక్కలు వేసుకుంటాం. కొంచెం నారిస్తావా?” అనడిగేను.
“అబ్బా, ఆశ, దోసె, అప్పడం, వడ. నేనేం ఇవ్వను పో!” అంది.

పేజ్-8

నేను మొహం వేలాడేసుకుని ఇంటికి వచ్చాను.
“ఏంటి, ఇవ్వనందా పెద్దమా?” అనడిగింది.
“ఇవ్వదంట. పో! అని కసిరింది. ఏం చేకుంటుందో అంత నారు!” అన్నాను కోపంగా.
” ఏం చేద్దా, మరి?”
“నువ్వయితే మడులు తవ్వించు. ఎవరో ఒకరు ఇస్తారు లే” అన్నాను.
మాచర్ల చుట్టు పక్కల ఇరవై దాక ప్ల్లెటూళ్ళున్నాయి. వాటికి ప్రతి రోజూ రన్నర్స్ టపాలు తీసుకెళ్ళేవారు. బాణం లా వున్న పొడుగాటి కర్రకి కొన్ని గజ్జెలు కట్టె వుండేవి. పోస్టల్ బాగ్స్ దానికి కట్టుకుని దగ్గరగా వున్న పల్లెటూళ్ళకి చిన్నగా జాగింగ్ చెసినట్లుగా వెళ్ళి తిరిగి అక్కడి తపాలు పట్టుకుని ప్రొద్దుట తొమ్మిదింటి క్లూ తిరిగి వచ్చేవారు. అవన్నీ పార్టు చేసి మళ్ళీ బాగ్స్ కట్టి మధ్యాహ్నం ప్న్నెండు గంటలకి వచ్చే రైలు కి ఒక చిన్న ట్రాలీ తీసుకెళ్ళి అందజేసేవారు.
తిరిగొచ్చిన రన్నర్స్ కాసేపు తోట పని చేసి మొక్కలకి నీళ్ళు పోసేవారు. అందులో సైదులు కోటప్ప మా యింటిని వదిలే వారు కాదు. సైదులెప్పుడూ మా తమ్ముణ్ణి ఎత్తుకు తిప్పేవాడు.
వాళ్ళందరూ కలిసి మా యింట్లో పొస్టాఫీసు లో నేలంతా తవ్వి చదును చేసేసేరు.
“మరి మొక్కలో?” అంది మా అక్క.ఆ
“వస్తాయిలె” అన్నాను వరాలిచ్చే దేవతలా.
ఆ మధ్యాహ్నం చిన్నగా గేటు తీసుకుని పెద్దమ్మ ఇంటికి వెళ్ళేను. పెద్దమ్మకి పిల్లలు లేరు. ఆయన ఆరెంపీ డాక్టర్. ఇద్దరూ పడుకున్నారు. సుశీలత్తా వాళ్ళుకూడ కనిపించలేదు. మెల్లిగా నారు మళ్ళ దగ్గర కెళ్ళేను.
అటూ ఇటూ చూసి ఆనవాలు తెలియకుండా నారు మెల్లిగా వేళ్ళు పోనివ్వకుండా గుత్తలు గా లాగేను. భయం వేస్తోంది. కాని మొక్కలు కావాలి. పెగా ‘పో’ అంటుందా అన్న కోపం. తీసిన నారంతా గౌను ఎత్తి చెడ్డీ చుట్టూ పెట్టేసేను (నవ్వకండి). అప్పుడు నాకు ఆరేళ్ళే. గౌను కుచ్చులు గుండెల మీదుగా వున్నందు వల్ల ఎత్తుగా కనబడలేదు. అలా చెడ్డీ చుట్టూ రకరకాల నారు గుచ్చేసి ఎరగనట్లుగా వచ్చేస్తుంటే సుశీలత్త కిటికీలోంచి చూసి నవ్వింది. నా గుండె దడ దడ లాడింది. ఏడుపు మొహం తో చూశాను. అత్త గబ గబా గేటుదాటాక వచ్చి “భలే చేసావే, పిల్లికి బిచ్చం పెట్టదు. ఆన్ని పూలు పూస్తాయా, అద్దెకున్న మమ్మల్నే ఒక్క పువ్వు కోసుకో నివ్వదు పో! లేచిందంటే ఆనవాలు పడుతుంది” అంది మెల్లిగా.
అంతే!
రివ్వున పరిగెత్తి ఇల్లు చేరేను.
మా అక్క నా వంక దీనం గా చూసింది.
“మళ్ళీ ఇవ్వనందా?”
నేను అమాంతం గౌను పైకెత్తేను.
చుట్టూ ఆటవిక జాతిలా వున్న నారుతో నన్ను చూసి నోరు వెళ్ళబెట్టింది.
“ఏంటీ, దొంగతనం చేసేవా?”
“దీన్ని దొంగతనం అనరు. మర్యాదగా అడిగితే ఇవ్వక పోతే, అంతే” అన్నాను.
“అయినా తప్పు కదా!” అంటూ నీతులు చెప్పబోయింది. “అయితే అక్కడే పడేసొస్తాను” అన్నాను.
“వద్దులే” అంది రాజీ పడిపోతూ.
వెంటనే సైదులు, కోటప్ప పనిలో దిగేరు.
వారం రోజుల్లో మొక్కలు ఏపుగా పెరిగి మొగ్గలు తొడిగేయి. మాచర్ల నేల నల్లరేగడి సారం తో మా తోట కళ కళ లాడి పోయింది. దీనికి తోడు రన్నర్స్ తిరిగి వచ్చేటప్పౌడు వంగ, రామ్ములగ (టమాటా), దొండ, బీర, సొర్ర… ఇత్యాదివి తెచ్చి వెనుక వేఇపు వేసారు.
ఇకతోట అందమే అంతమూ!
నాగార్జున సాగర్ పనులు సాగుతున్నాయి. మాచర్లంతా హడావుడి. నెహ్రూ వచ్చాడని రైల్వేస్టేషన్ కి చూడ్డాంకి వెళ్ళేం.
ఒకరోజు మా పెద్దమ్మ, సుశీలత్త మా యింటికి వచ్చారు. పూలతో కల కళ లాడుతూన్న తోటని చూసి పెద్దామ్మ ఆశచర్య పోయింది.

పేజ్-9

“ఎక్కడివే ఇన్ని మొక్కలు?” అనడిగింది.
“నువ్వికపోతే…. ఇంకెవరూ ఇవ్వరా పెద్దమ్మా” అన్నాను వెంటనే.
సుశీలత్త కుసుక్కున నవ్వింది. పెద్దమ్మ కొంచెం మొహం మాడ్చుకుంది.
అలా మా ఇంట్లో ఒక తోట… పక్కనే టూరింగ్ టాకీసు నుండి వినిపించే పాట నాలోని భావుకతని, బొమ్మలు వేయాలన్న ఆకాంక్షని తట్టి లేపేయి.
అక్కడే ప్రాత్:కాలపు చిరుగాలుల్లో పోస్టాఫీఅసులోని పుస్తకం ఒకటి తీసుకుని ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టేను.
అందులో ఎక్కువభాగం అమ్మ గురించే!
అమ్మ అమ్మలా వుంటే ఎంత బాగుండును?
నన్ను దగ్గిరకి తీసుకుని ప్రేమ గా ముద్దు పెట్టుకుంటే…. ఎంత ఆనందం గా వుంటుంది.
అంత కోపమెండుకు అమ్మకి….
ఇలా సాగి పోతుండేవి నా భావనలు?
పోస్టాఫీసులో ఒక పున్నాగ చెట్టుండేది.
గాలి విసురుకి…. ఒక్కో పువ్వు వాసనలు వెదజల్లుతూ అరుగు మీద కూర్చుఇ రాస్తున్న నా వళ్ళో పడుతుండేవి.
అస్పష్టమైన భావనలని ఆ పూలి మోసుకొచ్చిన నాకి అందజేస్తుండేవి.
మనసుకి ఏదో వెలితి… ఏదో కావాలన్న ఆకాంక్ష… ఏదో లేదన్న బాధ… అంతా అమ్మే!
చెట్లని చూస్తూ ఆలోచిస్తుండేదాన్ని. ప్రతి మొగ్గని ప్రతి పువ్వుని, ఆకుని… దాని మారే రంగుల్ని, వినీల ఆకాశాన్ని, గాలిని…. వూగి తూగల్ని… ఒకటేమిటి ప్రకృతి నంతా విప్పార్చి చూడటం అక్కడే మొదలయ్యింది.
అల్లరి దారి అల్లరిదే!
అందుకే …. నా గురించిఎవరికీ అంత పట్టేది కాదు. అల్లరిది! మగరాయుడు! ఇవే నా టైటిల్స్!

2 thoughts on “చిగురాకు రెపరెపలు – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *