April 20, 2024

సాంప్రదాయం తెరలో ఆధునికం ( తరాలు-అంతరాలు)

రచన: లక్ష్మీ రాఘవ

“హలో ”
” హలో ”
“నిత్య వాళ్ళ అమ్మగారేనా” మర్యాదగా వినిపించింది గొంతు…
“అవునండీ”
“అమ్మా మీ అమ్మాయి నిత్యను బెంగళూరు పంపారు ఉద్యోగం కోసం …” అతని మాటలు మధ్య లోనే త్రుంచి వేస్తూ
“అవునండీ ”
“మీ అమ్మాయి ఇంకొక అబ్బాయితో కలిసి వుంటోంది. విచారించుకోండి.”
“మీరెవరు? ఏం పేరు?” అంటూన్న అరుణకు ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది.
ఒక క్షణం విపరీతమైన భయంతో వణుకు వచ్చింది.. సోఫాలో కూలబడింది. కొంచం తేరుకుని వచ్చిన నంబరుకు ఫోన్ చేసింది. చాలా సేపు రింగు అయింది. చివరకు ఎవరో ఎత్తారు.
“మీ ఫోను నుండి నాకు ఫోను వచ్చింది…” అని చెప్పబోయింది.
“ఇది పబ్లిక్ ఫోను తల్లీ” అని పెట్టేసాడు
జరిగిందంతా గుర్తుచేసుకోవడానికి ఐదు నిముషాలు పట్టింది….నిత్య బెంగళూరు లో పి.జి.లో కాకుండా ఎవరితోనో కలిసి వుంది. ఇది తెలపడానికి ఫోను చేసాడతను….అంటే ఈ విషయం ఎంతమందికి తెలిసి వుండాలి ? తనకు తెలియకుండా నిత్య ఇంత సాహసం ఎందుకు చేసింది? ముఖ్యంగా సత్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు తను ఎంత బాధపడిందీ తెలిసి కూడా ఇలా చేస్తుందా? ఏడుపు వచ్చింది అరుణకు …దేవుడు తనకు ఇంకా ఎన్ని పరీక్షలు పెడతాడు? స్వామీ నాకే ఎందుకిలా??
తక్షణ కర్తవ్యమ్? ఆలోచించింది…ముఖ్యంగా ముందు నిత్యతో మాట్లాడాలి అని తోచి, నిత్యకు ఫోను చేసింది…
“ఆఫీసులో వున్నా, సాయంకాలం మాట్లాడుతా” అంటూన్న నిత్యతో
“ఆఫీసుకు సెలవుపెట్టి సాయంకాలం లోపల వూరికి రా”
“ఏమిటి సంగతి ? అంత అర్జంటా? ”
“అవును”
“అమ్మా , పెళ్లి చూపులు అయితే నేను రాను..నా అభిప్రాయం నీకు తెలుసు”
“పెళ్లి చూపులు కాదు..” సాధ్యమైనంత నెమ్మదిగా చెప్పింది..ఇప్పుడు నిత్య వూరికి రావడం ముఖ్యం. ఎదురుగా మాట్లాడితే తప్ప తేలని విషయం ఇది…
“సరే వస్తాను”
బెంగళూరు నుండీ. రెండు గంటల ప్రయాణమే గనుక సాయంకాలం లోపల నిత్య వచ్చేస్తుందని నమ్మకం కలిగింది అరుణకు.
“బెంగళూరు లో పి.జి.లోనే ఉంటున్నావా? ” అరుణ అడిగిన మొదటి ప్రశ్న కె అమ్మ తనను ఎందుకు రమ్మందో తెలిసిపోయింది నిత్యకు
“అమ్మా నీకు తెలిసాక దాచిపెట్టడం ఎందుకు? నేను పి. జి.లో లేను శ్రీధర్ అన్న అబ్బాయితో ఉంటున్నాను.” నిత్య మాటలకు కోపం నషాళానికి ఎక్కిన్నట్టు అయ్యింది అరుణకు.
” ఏమనుకుంటున్నావే…ఉంపుడు గత్తెవా ? ” గట్టిగా అరిచింది
“మాటలు జాగ్రత్తగా వాడు…సహజీవనం చేస్తున్నా”
“ఎందుకంత ఖర్మ ? లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చెయ్యక? ”
“పెళ్లి చేసుకున్న మీరందరూ ఏవిధంగా లక్షణంగా వున్నారు ? ఇద్ద్దరు పిల్లలు పుట్టాక నాన్న నిన్ను వదిలేసినాడు ఎప్పుడూ అనుమానం తో చూసే బావను భరించలేక అక్క సత్య ఆత్మహత్య చేసుకుంది…నీ చెల్లెలు రమా పిన్ని సంగతి చూడు ఉద్యోగం సద్యోగం చెయ్యకుండా జల్సా చేసే చిన్నాన్నకు డబ్బులు సంపాదించే భార్యగా పిన్ని ఏమి సుఖపడుతూంది?..” నిత్యను ఆపుతూ
“అవన్నీ ఖర్మలు…వదిలిపెట్టు..నీకేమైంది? చదువుకున్నావు.ఉద్యోగం చేస్తున్నావు. నీ జీవితం బాగుండవచ్చు.ఈ వేషాలు వేస్తే పరువేమైనట్టు? రేప్పొద్దున పెళ్లి జరిగే అవకాసం ఉంటుందా? ” అంది అరుణ.
“నాకు పెళ్ళిమీద నమ్మకం పోయింది అమ్మా, చదువుకున్నాను.సంపాదిస్తున్నాను..పెళ్ళితో కట్టుబడి వుండడం కంటే నచ్చిన వ్యక్తితో వుండడం మేలు అనిపించింది.సరిపడక పోయిన నాడు వేరు పడతాను…ఆ స్వేచ్చ వుంటుంది..” అంటూన్న నిత్యను నిస్సహాయంగా చూసింది అరుణ. ఏంతో పవిత్రంగా భావించే వివాహ వ్యవస్థ మీద కేవలం కొంతమంది జీవితాలతో పోల్చుకుని కూతురు ఎంత పొరబాటు చేస్తూవుందో ….
“అట్లా అనకే నిత్యా! నీవు సరేనంటే అతని తల్లిదండ్రులతో మాట్లాడుతాను. పెళ్లి చేసుకుని పిల్లలతో ఒక మర్యాద పూర్వకమైన జీవితాన్ని గడపవచ్చు…”
“వద్దు.. పెళ్ళీ, పిల్లలూ సంసారమూ వద్దు అమ్మా నాకు ”
“అదేమిటే, పిల్లలు వద్దనుకుంటే జీవితానికి అర్థం ఏమిటీ? ”
“పెళ్ళి చేసుకునీ, పిల్లలని కనీ, మీ జీవితాలకి ఎంత అర్థం దొరికింది చెప్పు? ”
“ప్రతిదానికీ పోల్చకు …ఎప్పటికీ ఇలాగ జీవించలేవు..నామాట విను” అంటూంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అరుణకు .

*****

మొండిగా వాదిస్తూ అమ్మ మాటను వినకుండానే బెంగళూరు వెళ్ళిపోయింది నిత్య. ఆ రోజు అమ్మ తులసమ్మ ఫోటో ముందు చాలా ఏడిచింది అరుణ. తులసమ్మ చనిపోయి ఏడాది అయ్యింది. ఆమె లేని కొరత చాలా అనిపించింది. నిత్య విషయంలో ముఖ్యంగా. ఎందుకంటే భర్త వదిలేశాక తల్లి ఏంతో అండగా నిలిచింది అరుణకు.
రాత్రి పడుకున్నా కలతగా అనిపించింది. నిత్య పెళ్లికని అమ్మ ఇచ్చిన ఎర్రరాళ్ళ జడబిళ్ళ గుర్తుకు వచ్చింది.జాగ్రత్తగా బీరువాలో దాచింది. ఇక దాని అవసరం ఏముంది? అనుకుంటూ ఒకసారి చూద్దామనిపించి దాన్ని బయటకు తీసింది. దానితో పాటు ‘ఎప్పుడైనా దీన్ని చదువు ‘ అని అమ్మ ఇచ్చిన చిన్న నోటు పుస్తకం కనిపించింది….అరె దీని సంగతే మరచి పోయానని తెరిచింది.
మొదటి పేజీ లోనే ” కాపురానికి వచ్చినప్పుడు నాన్న రాసి ఇచ్చినది” అని రాసి వుంది.
ఏమి రాసి ఇచ్చాడు తాతయ్య అనుకుంటూ చూసింది..పాత బడిపోయిన పేపర్లలో అస్పష్టంగా కనబడుతున్న అక్షరాలను కూడ బలుక్కుని ఈ విధంగా చదవసాగింది అరుణ.
“ధవుని కనుకూలవతివయి తనరుమమ్మ !
మగని కెదురాడు బుద్దులు దగనిదమ్మ!
భర్త కింపగు వాక్యముల్ బలుకుమమ్మ !
సక్రమంబుగ నీ విధుల్ జరుపుమమ్మ !
అత్త మామ లతో వినయంబున మెలగుమమ్మ !
నత్తవారింట నీ పుట్టింటి ఘనత పొగడకమ్మ!
పుట్టింటికి మరియు మెట్టినింటికి యశం గూర్చు లాగున నడవవమ్మ !
“భవ్య దీర్ఘ సుమంగలీభవ! ” యటంచు వరముగా మేమొసంగు దీవేనలంది
పుత్రా పౌత్రాభి వృద్దిని , పరిపూర్ణ సౌఖ్య
సంపదల తోడ తులతూగి పెంపుగనుమ !
పోయి రావమ్మ ! శుభముల పొందు మమ్మ !”
పూర్తి కాగానే కళ్ళు చెమ్మగిల్లాయి అరుణకు.ఎంత బాగా రాసాడు తాతయ్య! ఎంత జాగ్రత్తగా దాచింది అమ్మ? అత్తారింట్లో ఎలా మెసగాలో తెలియచెప్పే ఆచారమున్న సంస్కృతీలో పుట్టిన మనం ఈ తరానికి ఏమి అందిస్తున్నాం?
నిత్య మాటలు గుర్తుచేసుకుంటే ….నిజమే …భర్తను అనుసరించి భార్య నడవాలన్నదే మన సాంప్రదాయం. ఇది ‘స్త్రీ స్వేచ్చ’ హరించేదే కావచ్చు కానీ అలా అనుసరించే భార్య వలన కుటుంబానికో గుర్తింపు. సమాజంలో గౌరవ జీవితం .ఇటువంటి వాతావరణంలో పెరిగి, ఆధునిక పోకడలతో పెళ్లి లేకుండా సహజీవనం అంటే విచ్చలవిడిగా బతుకుతూ వుందన్న అపవాదు తప్పదు కదా. నిత్య ఇది ఎందుకు ఆలోచించడం లేదు? ఎలా నచ్చ చెప్పాలి?
ఇదే సంగతి ఫోనులో చెప్పింది నిత్యతో.
“కాలం మారింది అమ్మా, మార్పు అవసరం. ఆ కాలం లో భార్య ఇంట్లోనే వుండేది, ఇప్పుడు భర్తతో సమానంగా భార్య ఉద్యోగం చేస్తూ వున్నా ఇంట్లో పనులకు ఎంతమంది భర్తలు సహాయ పడుతూ వున్నారు? ఇంకా ఎన్నో విషయాలు వున్నాయిలే. నేను ఆ బంధంలో ఇరుక్కో కుండా కలిసి ఉండాలనుకున్నా. నీకేలాగా అనిపించినా నేనింతే.. ”
నిత్య మాటల్లో కొంచం నిజం వున్నా సమాజం వేలెత్తి చూపే పరిస్థితిలో ఉండకూడదనే దానికే అరుణ ఓటు పడింది.పర్యావసానం నిత్యకూ అరుణకూ దూరం పెరిగింది. నిత్య మాట ఎత్తడం మానుకుంది అరుణ లోపల ఏంతో బాధపడుతున్నా…..
………………..

ఆశ్చరకరంగా సంవత్చరం తరువాత నిత్య శ్రీధర్ ని రిజిస్టర్ మ్యారేజి చేసుకుని వచ్చింది. వారి సహజీవనం అమెరికాలో డేటింగ్ లా సహాయ పడింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత ప్రకృతి సహజంగా పిల్లలు కావాలనుకున్నారు. స్త్రీ పురుష సంబంధం పెళ్ళికి పరిమితం చేస్తేనే మన సమాజంలో ఒక గుర్తింపు అని గుర్తించడమే కాదు.. పెళ్ళితో ఒక కట్టుబాటు, సమాజంలో క్రమశిక్షణ . పిల్లల పుట్టాక అది ఎంత అవసరమో అని కూడా తెలిసి వచ్చినట్టు అయ్యింది.
సహజీవనం ఎన్నుకున్న వాళ్ళు అంతా ఇలా మారుతారో లేదో కానీ . నిత్య జీవితంలో ఈ మార్పు అరుణకు ఏంతో సంతోషాన్ని ఇచ్చింది. వివాహబంధం శాశ్వతం అనీ , సాంప్రదాయం చాల బలమైనదనీ కొత్తతరానికి తెలియాలని కోరుకుంది అరుణ మనస్పూర్తిగా …..
………………………..

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద
సంప్రదాయం తెరలో …………….
లక్ష్మీ కామకోటి
సహజీవనం , వివాహాల మధ్య క్లాష్ చక్కగా రాసారు రచయిత్రి.
ఫోన్ సంభాషణగా ఆరంభమై అమ్మా కూతుళ్ళ అభిప్రాయ బేధం, చివరాకు సుఖాంతంగా ముగిసిన కధ ఇది. సమాజం సమాజం అ౦టూ సమాజం కోసం బ్రతికే వారు కష్టాలపాలైనా సంప్రదాయం ముఖ్యమనుకునే వారు , ముఖ్యంగా అప్పగింతల హితోక్తులు పాతతరానికి తీసుకు వెళ్ళాయి.
పాతకధే కొ౦చం కొత్తగా రాసారు

9 thoughts on “సాంప్రదాయం తెరలో ఆధునికం ( తరాలు-అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *