April 20, 2024

మాయానగరం – 18

రచన: భువనచంద్ర

“మీరు రేపు తప్పకుండా రావాలి, మీరే కాదు.. సౌందర్యక్క, సులోచనక్క, వసుమతి అక్క, మేరీ టీచర్ అందరూ రావాలి. వారందరినీ కూడా నేను పిలిచాను. అన్నట్లు మాధవిగారు కూడా. ” చేతులు జోడించి అన్నాడు బోసుబాబు శోభారాణితో.
“ఎలా రాగలం? రేపు స్కూల్ ఉంది. మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్. ఆదివారం అయితే అందరం వస్తాము. ” ఇబ్బందిగా అంది శోభ.
“హ..హ..ఆదా? ఆల్రెడీ శ్యామ్యూల్ రెడ్డిగారిని ఒప్పించాను. అద్యక్షత వహించేది అతనే. ” నవ్వాడు బోసు.
‘గురువు ‘ గారు చెప్పిన బోధ అర్జంటుగా అమలు చేద్దామని నిర్ణయించుకొన్న మరుక్షణమే శోభ అతని మదిలో మెదిలింది.
“అవసరం అయితే పెళ్ళి చేసుకో, కానీ… ” అన్న ఆయన డైలాగ్ 3 డి. సినిమాలో లాగా మరీ మరీ డి.టి.ఎస్. ఎఫక్టులో వినిపించడం మొదలుపెట్టింది.
మొదట ఆడవాళ్ళకి చీర, జాకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు పంపణీ మొదలెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ సభకి టీచర్లందరినీ పిలిపించి , వాళ్ళ చేత నాలుగు మాటలు మాట్లాడిస్తే చాలా బాగుంటుందనిపించింది. అదీకాక అసలు ‘టీచర్స్ ‘ డే నే మొదలెడితే అద్భుతంగా వుంటుంది అని మరీ మరీ అనిపించింది. బోస్ బాబు మంచి కార్యకర్త. చాలామంది కార్యకర్తల పార్టీల్లో కార్యకర్తలుగానే మిగిలిపోతుంటారు. పదవులు దక్కాలన్నా, పైకి ఇంకా ఇంకా ఎదగాలన్నా బాగా రాటు తేలాలి. రాటు తేలడం అంటే కత్తికీ మెదడుకీ కూడా పదును పెట్టగలగడం.
‘టీచర్స్ డే ‘ రోజున లేడీ టీచర్లకి మాంఛి పట్టు చీరా జాకెట్టు, పసుపు కుంకుమలు, జంట్స్ కి సఫారీ క్లాత్, రిస్టు వాచీ, శామ్యూల్ కి వెండి మొమెంటో + గిఫ్ట్ పాక్. ఆ గిఫ్ట్ పాక్ లో శామ్యూల్ కి అత్యంత ప్రియమైన విదేశీమద్యం బాటిల్లు రెండు ఉంటాయి. వాటి ఖరీదు ఆయన స్కూల్ టీచర్లకి ఇచ్చే రెండున్నర నెలల జీతం అంత.
ప్రెస్ వాళ్ళకి కవర్లో, పత్రికల లావూ + సైజు (అంటే సర్కులేషన్ ని బట్టి ఇచ్చేస్తే పొద్దునకల్లా అన్నీ పేపర్లోనూ హాట్ న్యూస్ జాయ్ జాయ్ గా కవరైపోతుంది. ఇక టి.వి. చానల్స్ వాళ్ళ సంగతి .వీళ్ళని చాలా జాగ్రత్తగా హాండిల్ చెయ్యాలి. పాడి ఆవుల్ని మేపినంత జాగ్రత్తగా మేపితే… కావల్సినంత పబ్లిసిటీ పిండుకోవచ్చు. ఏదీ ఏమైనా ఆహుతులకీ, ప్రెస్ వారికి ప్రేక్షకులకు కూడా అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ ఎరేంజ్ చెయ్యాల్సిన పని ఉంది. ఆ పని ప్రత్యేకంగా చెయ్యాలి.
పవిత్ర భారతదేశంలో ఒక వెలుసుబాటు వుంది.. రాజకీయపార్టీకి. ఏ పార్టీ వాడైనా జబర్దస్తిగా రోడ్డుని ఆక్రమించుకొని ‘వేదిక ‘ కట్టవచ్చు. నియరెస్ట్ కరెంటు స్థంభంనించి కానీ ఖర్చు , పైవాడి అనుమతి లేకుండా కరంటు లాగెయ్యవచ్చు. 90 పిసిబుల్స్ కి ‘సౌండ్ ‘ మించకూడదని రూల్స్ వున్నా వాటినన్నింటినీ పట్టి పక్కననెట్టి ‘ మహా స్పీకర్లు ‘ పెట్టి జనాల చెవుల్ని పేల్చేయవచ్చు. (అఫ్ కోర్స్ యీ సౌండ్ సౌలభ్యం యీ మధ్య ‘భక్త జనావళికి ‘ అందుబాటులో వుందనుకోండి. పక్కింట్లో పిల్లలు పరీక్షలకు చదువుకుంటున్నా ఎవడికి ఏదీ పట్టదు. మన భక్తి మాత్రం స్పీకర్లలో ఉవ్వెత్తున ప్రవహించాలి! అయ్యా నిజం చెబుతున్నా పుణ్యం సంగతి దేముడికి ఎరుక. శబ్ధ కాలుష్యం భరించలేక జనాలు తిట్టుకునే బూతులు, పెట్టే శాపాలు మాత్రం ఖచ్చితంగా దక్కుతాయి.)
ఎంత సౌండ్ వుంటే అంత సక్సస్ అయ్యినటన్నమాట. నాలుగు రోడ్ల కలయిక దగ్గర బ్రహ్మాండమైన ‘వేదిక ‘ నిర్మించబడింది. నాలుగు వీధులు బోసుబాబు కటౌట్లతో నిండిపోయాయి. బోసుబాబు + పార్టీ అధ్యక్షుడు, బోసు బాబు + సెక్రటరీ , బోసు బాబు + మంత్రులు, బోసు బాబు + ముక్కి ములిగే వృద్ధులు, బోసు బాబు + స్కూలు పిల్లలు… ఇలా అనేకానేక కటౌట్లు. వేదికని అలంకరించే వారి ఫ్లెక్సీలు, బేనర్లు… అట్టహాసంగా వుంది. గా. మో. కా వీధిలో ‘ఫ్రీ సారా ‘ స్టాల్స్ వెలిశాయి. వాటి పక్కనే రకరకాల ‘ మంచింగ్ ‘ స్టాల్సు అర్జంటుగా వెలిశాయి. ‘న్యూ విడో ‘ ప్రస్తుతం ఉల్లిపాయ పకోడీలు, మిర్చీబజ్జీలు వాయి తరవాత వాయి వేస్తూ యమా బిజీగా వుంది. అంతే కాదు. “అబ్బా .. రోజూ ఇలాగుంటే ఎలా గుంటుందో ” అని కల కూడా కనేస్తోంది. లోపలలోపలే లెక్కలు కడుతోంది. “గురువుల పండుగ ” రేపు. ఇయ్యాళే ఇప్పటికి వెయ్యి రూపాయల బిజినెస్సయితే రేపటికీ? కిరసనాయిలు, శనగపిండి, ఉప్పుకారం మిర్చీలు, ఉల్లిపాయలు, వాము, అన్నీ కొన్నది ఐదొందలకి. నైటు పదిదాకా కూర్చుంటే ఇంకో వెయ్యైనా కళ్ళజూడచ్చు. ” అని లోలోపల మురిసిపోతోంది.
పదిరూపాయలు ఆటోకి పెట్టలేనివాళ్ళు ఆలస్యం అవుతుందని తెలిసినా, అయిదు రూపాయలిచ్చి రిక్షా ఎక్కుతారు. శ్రమను నమ్ముకొన్న రిక్షావాడు ‘అదును’ దొరికితే చాలు అనంతాన్ని ఆక్రమించిన వామనుడౌతాడు. ఆ ‘అదును’ దొరకనప్పుడు చాలా బుద్ధిమంతుడుగానే వుంటాడు. ‘గా.మో.క ‘ వీధి నుంచి మెయిన్ రోడ్లకి వెళ్ళాలంటే టాక్సీలు ఆటోల కంటే రిక్షాలే బెస్టు. కానీ ఇవ్వాళ నుంచి రేపు రాత్రి వరకు ఫ్రీ సారా, స్టాల్స్ ఆపరేషన్ లో వుండటంతో రిక్షావారంతా ‘ విశ్రాంతి’ దినంగా సెలబ్రేషన్ లో వున్నారు. మందు అలవాటు కానీ కొందరు బుద్ధిమంతులు మాత్రం ‘రేట్లు ‘ భీకరంగా పెంచేశారు. మామూలుగా ఐదు రూపాయలకు వచ్చేవాడు, ఇవ్వాళ కనీసం ‘పాతిక’ అంటున్నాడు.
ఓ అల్లా, ఓ ఏసు, ఓ యహోవా, ఓ జారాస్టర్, ఓ రామా, కృష్ణా, రాధేశ్యామా… మీరంతా ఎంత గొప్పవారండి. ‘పై ‘ తరగతిని సృష్టించారు. క్రింది తరగతిని సృష్టించారు. ఆ రెండు తరగతుల సృష్టి గొప్పగా చేశారు. కానీ మీరు సృష్టించిన యీ మధ్యతరగతి వుంది చూశారూ, అది గొప్పదే కాదు బహు దొడ్డది. పైవాడు క్రిందివాడు మిమల్ని మరచిపోయినా, అసలు దేముడే లేడని విదిల్చిపారేసినా, మధ్యతరగతి వాడు మాత్రం ఏనాటికీ మిమల్ని మరువడు. సరిగదా, మరింత మరింత ఎక్కువగా సరి కొత్త పూజల్ని, సరికొత్త వ్రతాలని మొదలెడతాడు. ఈ మధ్య తరగతి మహానుభావుల్ని వెర్రివాళ్ళను చేయగల పండితప్రకాండులు, ప్రవచన సామ్రాట్టులూ, వాస్తు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు , ప్రత్యేక, మహా ప్రత్యేక భజన , ఓదార్పు, దైవిక కూటములు, వాళ్ళు ఎక్కడబడితే అక్కడ ( OMNI present ) ఉంటూ, వారి శక్తియుక్తుల్ని పాండిత్యాన్ని ప్రజల్ని భయపెట్టడానికి సర్వదా వినియోగిస్తూనే వుంటారు. వారి వైఖరి ఎంత గొప్పదంటే ‘పైవాళ్ళ’ కి వీళ్ళు అన్నీ ‘అనుమతులూ’ ఇస్తారు. లేనివాళ్ళకి వీళ్ళసలు దర్శనమే ఇవ్వరు. ఉండీలేనీ మధ్యతరగతి వాళ్ళని మాత్రం ‘పుణ్య పాపాల’ చిట్టాలతో వీళ్ళు సదా అరచేతుల్లోనే ఉంచి కంట్రోల్ చేస్తుంటారు.
నరకాన్ని వర్ణిస్తారు…. ఎన్ని రకాలు ఉన్నాయో , ఏఏ నరకాలో ఏ శిక్షలు అమలవుతాయో, అలాగే స్వర్గంలో రంభాది అప్సరసల అవయవాల కొలతలు ఎంతో, వారితో ఏ పుణ్యం చేస్తే ఎన్నిసార్లు సుఖించే అవకాశం దొరుకుతుందో మొదలైన భోగట్టా అంతా అలవోకగా వప్పజెబుతారు. ప్రతి మతమూ దానిదాని సౌకర్యాలని బట్టి స్వర్గ నరకాల్ని సృష్టిస్తుంది. నీళ్ళు దొరకని ఏరియా వాళ్ళ స్వర్గం నీటికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తే, స్త్రీలు విరివిగా లభించని ఏరియా వాళ్ళ స్వర్గం స్త్రీలకి ప్రాధాన్యత కల్పిస్తుంది. వారి సౌందర్యాన్ని, ఆ సౌందర్యం సొంతం (పుణ్యం అకౌంట్ ప్రకారమే అనుకోండి) చేసుకొనే పుణ్య రహస్యాల్ని వివరిస్తుంది.
గా.మో.క. నగరంలో ఓ పక్క ఓక దేవుడి ప్రార్ధన అయితే, మరో పక్క మరో దేవుడి కూటమి. స్పీకర్లో ప్రార్ధనలతో, రికార్డింగ్ డాన్స్ లతో , తాగుబోతుల ప్రేలాపనలతో జనాలు చెవులు చిల్లులు పడుతున్నాయి. ముసలి మూక చెవులో దూది పెట్టుకొని గుణుగుతున్నా, పిల్లలు మాత్రం యీ హడావిడిని ఆనందిస్తున్నారు.
బోసు బాబు శామ్యూల్ ని ‘వంచ’ డానికి వేసిన ప్లాన్ ప్రకారం శామ్యూల్ రెడ్డి ఫ్లెక్సీ, బానర్లు కూడా మెరిసిపోతున్నాయి. అంత హడావిడి పనిలోనూ బోసు బాబు ప్రత్యేకంగా శామ్యూల్ రెడ్డి ని తీసుకొచ్చి ” సార్.. అదిగో మీ ఫ్లెక్సీలు. బేనర్లు. చూసి మార్పులు చేర్పులు ఏవైనా వుంటే చెప్పండి. ” అని అత్యంత వినయంగా చేతులు కట్టుకొని అన్నాడు.
ఇంత పెద్ద ఎత్తున గౌరవింపబడటం శామ్యూల్ రెడ్డికి ఇదే మొదటసారి. “విద్యాదాత – మహా నేత శ్రీ శామ్యూల్ రెడ్డిగారు వెయ్యేళ్లు వర్ధిల్లాలి ”
“ఆయ మాట మెత్తన .. మనసు తెల్లన … హృదయం వెన్న .. సద్గురువుల్లో ఆయనే మిన్నాతిమిన్న ”
“శామ్యూల్ వంటి గురువుని గురుదినోత్సవం నాడు గౌరవించడం అంటే మనం మన జాతిని గౌరవించుకోవడమే ”
ఇలా అందంగా వ్రాయబడ్డ బేనర్లు రెపరెపలాడుతున్నాయి. ఇంకేమంటాడు?
“డియర్ బోస్ ! ఇంత మంచి వ్యక్తిని ఇప్పటిదాకా కలుసుకొనలేకపోయినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను. ”
సిన్సియర్ గా అన్నాడు శామ్యూల్ రెడ్డి.
బోసుబాబుకి తెలుసు ‘ రాజబాట ‘ ఏర్పడిందనీ, ఇక తిరుగులేదనీ!
******
శోభారాణిని అతి భయంకరంగా , అంటే అతి గాఢంగా కాంక్షిస్తున్న వాళ్ళు ఇద్దరు. పెళ్ళై పిల్లలున్న శామ్యూల్ రెడ్డి ఒకరైతే, అప్పటి వరకు ఆడవాళ్ళతో సంబంధం వున్నా ‘తొలి చూపు’ లోనే వలపుసుడిలో పడ్డ బోసుబాబు రెండో వాడు. శామ్యూల్ రెడ్డికి శరీరం చాలు. బోసుబాబుకి శరీరమూ, దానికంటే అతీతమైనది ఏదో కూడా కావాలి.
నందినిని తీవ్రంగా కాంక్షిస్తున్నది ఇద్దరు. ఒకటి వెంకటస్వామి. అతనికి నందిని కన్నా నందిని తెచ్చే ఆస్తి అంటే ప్రాణం. నందిని అనేది అతని దృష్టిలో ఒక నిచ్చెన. రెండోవాడు పరమశివం. అతనికి నందిని మీద ప్రేమ కన్నా నందినిని ప్రేమించే వెంకటస్వామి మీద పగ ఎక్కువ. అతి మామూలుగా కనపడే అతి క్రూర శాడిష్టు పరమశివం. ‘వెంటాడి.. వేదిస్తే ‘ కానీ అతనికి తృప్తి కలగదు.
ఆనందరావుని తీవ్రంగా కాంక్షిస్తున్నది సుందరీబాయి. శారీరరకమైన కాంక్ష ఇప్పుడామెలో ‘పగ’ గా రూపుదిద్దుకుంది.
మాధవిరావుని అమితంగా ప్రేమిస్తున్నది ఆనందరావు. కానీ ఆ విషయాన్ని మాధవి ముందు బయటపెట్టే ధైర్యం అతనికి లేదు.
చెడాలని ప్రయత్నించి కుదరక , మనసుని అదుపులోకి తెచ్చుకొని , ఆనందరావు ‘నీరజ’ ను కనికరిస్తే చాలనుకుంటున్న మదాలస.
‘పైసా’ కోసం తప్పక పెళ్ళి చేసుకొన్నా, ప్రాణం పోయినా ఫర్వాలేదనుకొని పనిమనిషి ప్రేమలో పడ్డిన సేఠ్ కిషన్ చంద్ జరీవాల.
పాము పడగ కింద వున్నానని తెలిసినా ప్రేమించినవాడి కోసం నిబ్బరంగా నిలచి వున్న శీతల్.
ఇంతమందీ ఆనాటి రాత్రి ఒకే చోటకి చేరారు. గా.మో.క. వీధిలోని ‘వేదిక’ ముందుకి. కొందరికి ఒకరితో ఒకరికి పరిచయం వుంది, కొందరికి లేదు. వీళ్ళే కాక శోభ పని చేసే స్కూల్ టీచర్లు పిల్లలూ, గుడిసెల సిటీ స్కూల్ పిల్లలు , రాజకీయ నాయకులు వారి వందిమాగధులూ , జనాన్ని రంజింపజేయడానికి హైదరాబాద్ , చెన్నై నుంచి ప్రత్యేకంగా పిలిపించబడ్డ సినీ హీరోయిన్లు , డాన్సర్లు… ఊరు ఊరంతా ఒక్క చోటకు చేరింది… ఊరు ఊగిపోతోంది. ప్రీ స్టాల్స్ లో మందు మంచి నీళ్ళలాగా ప్రవహిస్తోంది. అలాగే జనాలకు మంచి నీళ్ళ పాకెట్లు, పులిహోర, పెరుగన్నం పొట్లాలు కూడా అడిగినన్ని అందుతున్నాయి. మాధవీరావుకి ఇదంతా చిత్రంగా వుంది. ‘”గురువుల దినోత్సవం జరగాల్సింది పాఠశాలలలో, కాలేజీలలో నడిబజార్ జంక్షన్ లో కాదుగా ” అని. శోభ మాత్రం కొత్త చీరలో వెలిగిపోతోంది. వర్షా కాలపు మెరుపుల్లా వున్నాయి ఆమె నవ్వులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *