April 19, 2024

ఆరాధ్య – 13

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి

“దొంగల భయం. ఈ మధ్యన నేను డబ్బుల గురించి, ఇలాటి పేపర్స్‌ గురించి పట్టించుకోవటం మానేశాను. రిటైరయ్యాను కదా! మీ పేపర్స్‌ మీ దగ్గరే వుంచుకోండి! నేను కాపాడలేను” అంటూ మర్యాదగా తిరస్కరించాడు.
”ఇవి మీ కోడలికి సంబంధించినవే బావగారు! మావి కావు” అని శాంతారాం అంటుండగానే ఆరాధ్య, హేమంత్‌, సృజిత్‌ని తీసుకొని లోపలకి వచ్చారు.
వాళ్లకు శాంతారాం, రమాదేవిలు వచ్చినట్లు ఫోన్లో చెప్పింది శార్వాణి. ఆదివారం కాబట్టి అందరం ఇక్కడే గడుపుదామని చెప్పింది. అందుకే వాళ్లు వెంటనే బయలుదేరి వచ్చారు.
ఆరాధ్య తల్లిదండ్రుల వేపు చూడకుండా పలకరించకుండా కిచెన్‌లోకి వెళ్లింది.
రమాదేవి వెంటనే అర్థం చేసుకొని లేచి కూతురు వెంట వెళ్లింది. కూతురుతో ఏం మాట్లాడుకుందో ఏమో ఆమెను తీసుకొని హాల్లోకి వచ్చింది.
అందరు వినేలా రమాదేవి అంది ”మా తదనంతరం మా ఇల్లు మా ఆరాధ్యకు చెందేలా వీలునామా రాయించుకొని వచ్చాం. తీసుకోండి అల్లుడు గారూ! అది మేము వెళ్లిపోయాక మీ ఇల్లే! ఇందులో ఎవరి ఆక్షేపణలు వుండవు. లాయర్‌ దగ్గర కూర్చుని జాగ్రత్తగా రాయించుకొని వచ్చాం”
”మీరు బాగా ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నారా?” అడిగాడు హేమంత్‌.
”నిర్ణయం తీసుకోవటంలో ఎలాటి లోపం లేదు హేమంత్‌! ఎందుకంటే ఇక ముందు మేము సునీల్‌ దగ్గరకి వెళ్లదలచుకోలేదు. ఇక వెళ్లం కూడా! భవిష్యత్తులో సునీల్‌ మాకు చేసేది కాని, చెయ్యాల్సింది కాని ఏమీ లేదనే అనుకుంటున్నాం. ఒకవేళ మేము అలా అనుకోకపోయినా వాడి నుండి మాకేమీ రాదు. అది మా ప్రారబ్దం… మేము అలా అనుకున్న తర్వాత ఇంకేముంటుంది చెప్పు!”
”నేను సునీల్‌ గురించి అనటం లేదు” అన్నాడు హేమంత్‌.
”ఇంకోరా చెప్పు హేమంత్‌?” అడిగాడు శాంతారాం.
”చెప్పండి! అల్లుడుగారు!” వెంటనే అడిగింది రమాదేవి.
ఆరాధ్య, శార్వాణి, ఉపేంద్ర హేమంత్‌ వైపు చూస్తున్నారు.
”మీ అమ్మాయికి పిల్లలు పుట్టరు కదా! ఇప్పుడు మీరు మీ తదనంతరం మీ అమ్మాయికి చెందేలా రాసి ఇచ్చిన మీ ఇల్లు ఎప్పటికైనా ఈ సృజిత్‌కే అవుతుంది. అది మీకు ఇష్టమేనా? నిర్ణయం తీసుకునే ముందు దీని గురించి ఆలోచించారా? మళ్లీ ఒకసారి ఆలోచించుకోండి!” అన్నాడు హేమంత్‌.
”ఇంక ఆలోచించుకోవలసింది ఏమీ లేదు హేమంత్‌! మాకు మా ఆరాధ్య సంతోషంగా వుండాలి. మాకిప్పుడు కావలసింది అదే! దాని తల్లిదండ్రులుగా ఇన్ని రోజులు మేము వుండి కూడా కొన్ని సందర్భాల్లో లేనట్లే ప్రవర్తించాం. దాని ఫలితాలను బాగానే అనుభవించాం. ‘ఏది నాది. ఏది కాదు’ అన్నదే ఆలోచిస్తుంటే చివరకి ఏదీ మనది కాకుండా పోతుంది. సృజిత్‌ని మా మనవడే అనుకుంటున్నాం. అనుకున్నాం. ఇందులో మార్పు వుండదు. నువ్వు చాలా మంచివాడివి. చాలా విషయాల్లో నీకు మేము ద్రోహం చేశాము. చిన్నవాడివైనా మమ్మల్ని క్షమించు!” అన్నారు.
”అంత పెద్ద మాటలు ఎందుకు లెండి! మీ వీలునామా మీ అమ్మాయికి ఇష్టమైతే నా అభ్యంతరం ఏమీ లేదు” అన్నాడు హేమంత్‌ వాళ్లనెందుకు బాధపెట్టాలి అని… అందుకే అతను నో చెప్పలేదు.
ఆరాధ్య మౌనాన్ని అంగీకారంగా స్వీకరించి లేచి ఆరాధ్య దగ్గరకి వెళ్లింది రమాదేవి. వీలునామా పేపర్స్‌తో పాటు ఆమె పాత నగలు కొన్ని ఆరాధ్య చేతిలో పెట్టి ”వీటిని కరిగించి కొత్త మోడల్లో నగలు చేయించుకో ఆరాధ్యా! నీ విషయంలో ఇన్ని రోజులు ఏదో తప్పు చేస్తున్నానన్న భావన నాలో వున్నా మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ ప్రవర్తన నన్నో పక్కన పొడుస్తూనే వుండేది. ఇప్పుడు అలాటి బాధేమీ లేదు. హాయిగా వుంది” అంది రమాదేవి.
శార్వాణి, ఉపేంద్ర చూస్తున్నారే కాని ఏమీ మాట్లాడలేదు. అక్కడ మాట్లాడవలసింది కూడా ఏమీ లేదు. మానవ సంబంధాలు బలంగా వుండాలనుకున్నప్పుడు కొన్ని సాంప్రదాయాలు, కొన్ని త్యాగాలు అవసరం మనుషులకి… ఏ త్యాగం లేకుండా ఆయాచితంగా ఏదీ రాదు. అందుకే వాళ్లు మౌనంగా వుండిపోయారు.
ఆ సంఘటనతో అందరి మనసులు ఆనందంగానే వున్నాయి.
*****
ఆరాధ్య ఆఫీసు నుండి ఇంటికొచ్చేటప్పటికే ఆగన్న వంట చేసి, సృజిత్‌కి స్నానం చేయించి, అన్నం తినిపించి వున్నాడు.
ఆరాధ్య ఫ్రష్షప్పయి సృజిత్‌కి ఎ,బి,సి,డిలు నేర్పిస్తూ హేమంత్‌ కోసం ఎదురు చూస్తోంది. ఆమెకు సరయు దగ్గరకన్నా ఇక్కడే హాయిగా వుంది. తల్లీదండ్రి హేమంత్‌కి ఇవ్వాల్సిన గౌరవాన్ని, విలువను ఇచ్చి తనకి ఇవ్వాల్సినవి ఇచ్చాక ఇది నా ఇల్లు, హేమంత్‌ నా మనిషి అన్న భావన కలుగుతోంది. అంతేకాదు ఆమెకు తన తల్లిలో వచ్చిన మార్పు చాలా సంతోషాన్నిస్తోంది.
ఎందుకంటే తల్లి ఎలా వుండాలీ అన్నది ముందుగా ఏ బిడ్డా వూహించలేదు. అసలు బిడ్డ వూహల్లో తన తల్లి ఇలా వుండాలి అన్న చిత్రణే వుండదు. బిడ్డ జీవితం మాత్రం తల్లి చిత్రించుకునే వూహా చిత్రం… తల్లి ఎలా వూహిస్తే అలా వుంటుంది ఏ బిడ్డ జీవితమైనా! ఆ ఊహ అనేది బిడ్డ పుట్టినప్పటినుండే అంటే కాళ్లకు ప్టీలు, చేతులకి గాజులు వేసుకొని మురిసిపోతున్నప్పటి నుండే మొదలవుతుంది. తల్లే కదా ఏ బిడ్డకైనా ఫ్యాషన్‌ డిజైనర్‌! అంతేకాదు బిడ్డకి నడక, పడక తల్లి నేర్పిన క్రమశిక్షణే! ఆ శిక్షణే సరిగా లేకుంటే ఆ నేరం తల్లిదా? బిడ్డదా?
ప్రేమ, త్యాగం, సహనం, బాధ్యతలనే నాలుగు స్తంభాలతో నిర్మించిన దేవాలయం లాటి అమ్మే కుటుంబ సభ్యులతో చేయి కలిపి కక్కుర్తిపడి కూతురుకి పెళ్లిలో పెట్టే మంగళసూత్రాలను కూడా గిల్ట్‌వి పెడితే ఆ కూతురి జీవితం ఎలా వుంటుంది? కూతురికి పెళ్లిలో ఏం పెట్టాలన్నా వ్యాపారపు ఆలోచనలు చేస్తే ఆ కూతురు అత్తగారింట్లో మొండిగా తిరగాలనుకున్నా అక్కడ ఆమెకు విలువ ఇస్తారా? మర్యాదగా చూస్తారా? అలాంటప్పుడు ఉద్యోగం చేసే ఏ ఆడపిల్ల అయినా రెక్కలు విప్పుకుని ఎగిరిపోకుండా వుంటుందా? అలా ఎగిరిపొమ్మని తల్లే సలహా ఇస్తే ఆ తల్లిని ఏమనాలి? అలాటి తల్లులు ఎక్కడైనా వుంటారా? వుంటారని చెప్పడానికే దేవుడు తన తల్లిని సృష్టించి వుంటాడు. కానీ ఒక తల్లి చూపించే నిర్లక్ష్యాన్ని ఏ కూతురూ దేవుడికి చెప్పుకోదు. నా తల్లిని శిక్షించమని కోరుకోదు. అదీ ఒక కూతురికి తల్లిపట్ల వుండే ఆరాధన, ఆత్మీయత. అందుకే తల్లులు కూతుళ్లను దోసిట్లో దీపంలా చూసుకుంటారు. ఒక తన తల్లి లాంటి తల్లులు తప్ప…
నిజంగా చెప్పాలంటే తన తల్లిలో వచ్చిన మంచి మార్పు వల్లనే ఈ రోజు తను హేమంత్‌తో వుండగలుగుతోంది. అంటే ఇక్కడ ‘వీలునామా’ అన్నది ప్రధానం కాదు. అది చూసి తల్లిదండ్రులందరు కూతుళ్లకి వీలునామాలు రాసిమ్మని కాదు. తన బిడ్డ జీవితం గురించి కన్నతల్లి చివరిదాకా ఆలోచించాలి. బిడ్డకు సరైన ఆలోచనా మార్గాలను తెలియ జెప్పాలి. ఎందుకంటే బిడ్డ పుట్టేది తల్లికి… తల్లి ఎప్పుడూ బిడ్డకు పుట్టదు.
హేమంత్‌ ఆఫీసు నుండి వచ్చాడు. రాగానే సృజిత్‌ను ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. సృజిత్‌ను కిందకి దింపకుండా అలాగే ఎత్తుకుని ఆరాధ్య వైపు చూసి ”వీలునామా గురించి నీకేమనిపించింది?” అని అడిగాడు.
”నాకేమీ అన్పించలేదు. కొడుకులనే కాకుండా కూతుళ్లను కూడా ‘కన్నవాళ్లు’ బాధ్యతగా పట్టించుకోవాలి… ఆ వీలునామా వల్ల మా పేరెంట్స్ కి వచ్చే ఇబ్బందేమీ లేదు. అందుకే అంగీకరించాను. వాళ్లు వున్నన్ని రోజులు వాళ్లకి వుండే స్వీట్ హౌజ్‌ జీవనోపాధి నిస్తుంది. వాళ్లు ఎవరి దగ్గరకి వెళ్లి చేయి చాపాల్సిన అవసరం లేదు. బాధ్యతలు కూడా ఏమీ లేవు… అదీ కాక వాళ్లు బాగా ఆలోచించే ఆ వీలునామా తయారు చేసి వుంటారు. అందుకే నాకేమీ అన్పించలేదు” అంది.
”వాళ్లు చనిపోయాక జరగాల్సిన కర్మకాండల్ని సునీల్‌ చెయ్యడు. అతని తత్త్వం నాకు తెలుసు. మరి నువ్వు కొడుకులా నిలబడి చెయ్యగలవా?”
”మీరు ఒప్పుకొని నా పక్కన నిలబడితే తప్పకుండా చేస్తాను. వాళ్ల ఋణం ఆ విధంగా తీర్చుకునే అవకాశం నాకు లభించటం నా అదృష్టంగా భావిస్తాను” అంది.
”నేను తప్పకుండా ఒప్పుకుంటాను. నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు” అన్నాడు. అతను చాలా ఎత్తుకు ఎదిగి కన్పిస్తున్నాడు.
అతన్ని చూడాలంటే ఆమె కూడా కొన్ని మెట్లు ఎక్కాలని అర్థం చేసుకుంది.
అలాంటి కొడుకును కన్న శార్వాణి ఆంటీ రియల్లీ గ్రేట్ అనుకుంది.
”హేమంత్‌! నాకు ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ చేయించుకోవాలని వుంది” అంది.
సడన్‌గా ఆమె అలా అనేసరికి అతని ముఖం ప్రశ్నార్ధకంగా మారింది.
”నువ్వు అలా అయితేనే నన్ను టచ్‌ చేస్తావు. నాకర్థమైపోయింది. అదే బెటర్‌! లేకుంటే ఎన్నిరోజులు ఇలా?” అంది.
అతను మాట్లాడలేదు.
”నువ్వు హాస్పిటల్‌కి వచ్చి సంతకం పెడితేనే అక్కడ నాకు ఆపరేషన్‌ చేస్తారట. లేకుంటే చెయ్యరట. చెప్పు హేమంత్‌! సంతకం పెడతావా?”
”నువ్వంత రిక్వెస్ట్‌గా అడుగుతుంటే సంతకం పెట్టటం అంత కష్టమా ఆరాధ్యా! అలాగే కానీయ్‌! ఎప్పుడు వెళదాం హాస్పిటల్‌కి?” అడిగాడు హేమంత్‌.
”కానీ హేమంత్‌! ప్రెగ్నెన్సీ టైంలో నాకు వాంతులు కావటం అబద్దం… అదంతా ఆ టైంలో నా మూడ్‌ బాగాలేక నేను కావాలనే చేశాను. సరయు, మా మమ్మీ నన్ను కన్‌ఫ్యూజ్‌ చేసి నా చేత అలా చేయించారు” అంది.
షాకింగ్‌గా చూశాడు హేమంత్‌. అతను తేరుకునే లోపలే…
”నాకు సృజిత్‌ను చూస్తుంటే- సృజిత్‌ని మీరంతా ప్రేమగా చూస్తుంటే నాక్కూడా సృజిత్‌ లాంటి బిడ్డ కావాలని వుంది. సృజిత్‌ కూడా నా బిడ్డే అనుకో!” అంటూ ఆమె కంటి రెప్పకు తగులుకొని వున్న కన్నీటి బిందువును కొనగోటితో తుడుచుకుంది.
హేమంత్‌ మళ్లీ షాకయ్యాడు. అతనికి ఆరాధ్యలో అందమైన, స్వచ్ఛమైన బోసినవ్వుల అమాయకత కన్పించింది.
”ఒకప్పుడు ‘నా ఊహలో నీవు’ ఎలా వుండేదానివో ఇప్పుడలా వున్నావు ఆరాధ్యా! అప్పుడు నా మనసులో ఎంత గాఢంగా కుదురుకుని నన్నావహించి కుదిపావో ఇప్పుడు అదే అనుభూతి కలుగుతోంది” అని మనసులో అనుకున్నాడు.
ఆ క్షణంలో ఎందుకో ఏమో అతని కళ్లకి ఆరాధ్య అద్భుతంగా వుంది. ఎప్పుడూ లేనంత మానసిక సౌందర్యంతో వెలిగిపోతోంది. ఈ క్షణం నుండి తన లైఫ్‌ చాలా బ్యూటీఫుల్‌గా వుంటుందనుకున్నాడు. ఆ ఆనందంతో అతని గుండె పాత్ర నిండి పొంగి పొర్లింది.
అతనిక్కూడా అతని రక్తాన్ని పంచుకుని పుట్టే ఒక బిడ్డ కావాలని వుంది. ఆ కోరికను వెంటనే ఆమెతో చెప్పి ఆమెను కూడా సంతోషపెట్టాడు.

-: అయిపోయింది :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *