April 25, 2024

గెలుపు కోసం

రచన: స్వాతీ శ్రీపాద

ప్రియాతి ప్రియమైన ప్రియా
ఆశ్చర్యపోతున్నావా? మూడు ముళ్ళువేసి మూడున్నర గంటలు దాటలేదు, అప్పుడే ఇంత ప్రియాతి ప్రియమైన దానను అయిపోయానా అని. సంవత్సరాలు నెలలు గంటలు ఎందుకు ప్రియా, మూడు క్షణాలు చాలదూ… ఎక్కడో తప్పిపోయిన ఆత్మను వెతుక్కునేందుకు? నువ్వు మధుప్రియవే కావచ్చు ఎవరికైనా, మధు కావచ్చు కానీ నా ఒక్కడికి మాత్రం ప్రియవు. ఇవి పెదవుల చివర తేనె రాసుకుని పలుకుతున్న చిలకపలుకులు కావు. తొలిచూపు ప్రేమ పైత్యమా అంటావేమో, కాదు గాని అసలు సంగతి ఇప్పుడు చెప్పక పోతే మరెప్పుడూ చెప్పేఅవకాశం రాదేమోరా. అందుకే ఇలా అందరినీ తప్పించుకుని బాత్ రూమ్ లో కూచుని రాస్తున్నానిది.
చిన్నప్పటి నుండి చదువు, మార్క్ లు, రాంక్ లు తప్ప మరొకటి తెలియదు. ఆ ధ్యాసలోనే ఇరవై రెండేళ్ళు గడిచిపోతే, ఉద్యోగం వెతుక్కోడం వాటిల్లోమరోమూడేళ్ళ సమయం గడచిపోయింది. ఇహ కలలు గనే వయసెక్కడ?
నా పెళ్లి మాట పెద్దలకు వదిలేసి వాళ్ళ వెంట పెళ్లి చూపులకు వచ్చాను.
కానీ, ప్రియా ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది గనక తెలిసింది కాని ఈమాట మరెవరైనా చెప్పుంటే కచ్చితంగా పిచ్చిఅనే అనేవాడిని.
ఒక్కసారి తొలిచూపు వలపంటే ఏమిటో తెలిసి వచ్చింది. అదేమిటో నిన్నుచూడగానే గుండె
ఒక్కసారి లయ తప్పినట్టని పించింది. ఇది అని చెప్పలేని అనుభూతి. ఎన్నిజన్మల క్రితమో ఒక్కటిగా ఉన్న మనని రెండు ముక్కలుచేసి చెరో మూలకు విసిరేసాక మళ్లీ కలుసుకున్నట్టు అనిపించింది.
అందుకే మరోమాటకు ఆస్కారమే లేకుండా పెళ్ళికి సిద్ధమయాను.
మధ్యలో ఇరవైరోజులు ఎంత భారంగా గడిపానో తెలుసా?
ఎప్పటి కప్పుడు ప్రతిక్షణం కాల్ చేసి మాట్లాడదామనిపించేది. ఎన్నిసార్లు పోన్ చేతుల్లోకి తీసుకుని ఆగిపోయానో. మధ్యలో ఒకటి రెండు సార్లు నిన్ను చూడాలనిపించి మీ వీధి మలుపులో బండి ఆపి ఉదయమే ఇంటిముందు ముగ్గేస్తున్నప్పుడోసారి, సాయంకాలం బండి మీద కూరలు కోనేప్పుడోమారు చూసి వెళ్ళాను తెలుసా?
పెళ్ళికి ముందే ఇలా వేధిస్తున్నాదేమిటని ఎక్కడ అపార్ధం చేసుకుమ్తవోనన్న బెరుకుతో ధైర్యం చెయ్యలేకపోయాను.
ఇప్పుడు , ఇప్పుడిక నువ్వు నా సర్వస్వం. అందుకేరా బంగారూ , ధైర్యంగా రాయగలుగుతున్నాను.
రాత్రికి నీ సమక్షంలో నన్నునేను మైమరచిపోయేలోగా నా మనసు నీకు తెలపాలన్నతపన అంతే.
ప్రతి నిమిషం వెయ్యియుగాలుగా ఎదురుచూస్తూ
నీ
……………
ఉత్తరం చదివి నవ్వుకుంది మధుప్రియ.
అలసిపోయానన్న నెపంతో తన గదిలోకి వచ్చి ఇందాక ఎవరుచూడట్లేదని నిర్ధారించుకుని రాజ్ తన చేతిలో కుక్కిన మడచిన కాగితం ముక్కను విప్పి చదువుకుంది.
పెళ్లి హడావిడి ఏమిటో గాని వారం రోజులుగా నిద్ర సరిగా లేక , మళ్ళీ ఉదయం నాలుగింటికే లేవడంతో తలనొప్పిగా ఉంది. ముహూర్తం పన్నెండుకే అయినా ఫొటోలు, అతిధుల పరామర్శలు భోజనాలు ముగిసేసరికి ఈ వేళ అయింది.
ఓ పది నిముషాలు పడుకుంటే ఏమైనా తగ్గుతుందేమోననుకుంటే మాటికోసారి ఎవరో ఒకరు రావడం, ఎదో అడగడం, లేదా పెళ్ళికొడుకు వైపువాళ్ళు వచ్చిమాట్లాడటం.
రాత్రయేసరికి తలనొప్పితో పాటు జ్వరం కూడా వచ్చినట్టని పించింది.
కళ్ళు ఎరుపెక్కాయి.
ఎవరో మేల మాడారు.
“ఇప్పుడే కళ్ళుఎరుపెక్కితే రేపు పొద్దుటికి మండే సూర్యగోళాలవుతాయేమో..” అంటూ కిసుక్కున నవ్వారు.
మధుప్రియకు జరిగేదేమిటో తెలుస్తోంది.
ఒక నిమిషం తల్లికి జ్వరంగా వుందని చెబ్దామా అనిపించింది.
కాని క్షణాల్లో వార్త ఇల్లంతా పాకడం తధ్యం. ఆ వెంటనే ఎందరి పరామర్శ లో, ఎందరి సలహాలో ..
అందుకే నిస్సహాయంగా ఉండిపోయింది.
***********
రాత్రి అందరి భోజనాలు ముగిసి చిన్నాపెద్దా సెకండ్ షో సినిమాకు వెళ్ళాక తల్లి చెప్పగా లేచి గదిలోకి వెళ్ళింది మధుప్రియ.
అప్పటికే గదిలో సెంటర్ టేబుల్ మీద పాలగ్లాస్ పళ్ళు స్వీట్లు అమర్చిఉన్నాయి.
పెద్ద సినిమాల్లో లాగా అలంకరించకపోయినా కొత్తప్రింటెడ్ బెడ్ షీట్ కిటికీలకు తెరలు కొత్తగానే ఉన్నాయి.
కాస్సేపు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు మధుప్రియకు.
రెండు నిముషాలు చూసి వెళ్లి మంచం పైన వాలింది. అంతే తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది.
మెలుకువ వచ్చేసరికి మసక చీకటి, కిటికీ లోంచి వెలుగు రేఖలు తొంగి చూస్తున్నాయి.
ఉలిక్కిపడి లేచి కూచుంది మధుప్రియ. కంగారుగా నైట్ స్టాండ్ పైనున్నటేబుల్ లాంప్ ఆన్చేసి గోడ
గడియారం వంక చూసింది.
అయిదున్నర.
పక్కన మంచి నిద్రలో రాజ్. బయట పిల్లలతో మాట్లాడుతున్న వాడు ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు. ఏమనుకుని ఉంటాడు?
తనకు ఇష్టం లేక ఇలా… ఆలోచించలేక పోయింది.
ఇంకా తలనొప్పి తగ్గినట్టులేదు.
కాస్త జ్వరంగా కూడా అనిపిస్తోంది.
దిండు మీద ఒరిగే లోగా అటునుండి ఇటు తిరిగి కళ్ళుతెరిచి నవ్వాడు రాజ్.
“ నిద్రలో ఉన్నారనుకున్నాను” నసిగింది.
“ అవును ప్రియా, నిద్రలోనే ఉన్నాను. ఇప్పుడే నువ్విలా లైట్ వెయ్యగానే మెళుకువ వచ్చింది. “
ఒక్క క్షణం ఆగి,
“సారీ రాజ్, నాకు తెలియకుండానే …”
“దీనికి సారీ ఎందుకురా ప్రియా ? అంతగా నిద్రలో ఉన్నావంటే ఎంత అలసి పోయావో ఉహించ గలను.
ఏదో పెద్దవాళ్లు వాళ్ళ చాదస్తం వాళ్ళది. ఈ ఒక్కరోజుతో మనం మిస్ అయిపోయిందేం లేదుగా..
అవును ఇంకా నీ కళ్ళు ఎర్రగానే ఉన్నాయి. మరి కాస్సేపు పడుకో, అలసట తీరలేదా ?” పరామర్శగా చెక్కిలిపైన చెయ్యి వేసిన అతను అదిరిపడ్డాడు.
“ వేడిగా వుంది, జ్వరంలా వుంది. ఏదైనా టాబ్లెట్ వేసుకుంటావా? వెళ్లి తేనా ?” లేవబోయాడు.
ఏ మాత్రం సంకోచించకుండా అతని చెయ్యి పట్టుకు ఆపేస్తూ,
“ఆ పక్కన కప్ బోర్డ్ లో మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు “
అన్నాక గాని అతని చెయ్యి పట్టుకున్న సంగతి గుర్తు రాలేదు.
చప్పున వదిలేస్తూ తలదించుకున్నా అతని పెదవుల పైన పాకిన చిరునవ్వును గమనించనే
గమనించింది.
తలపక్కకు తిప్పుకుని నాలుక కరచుకుంది.
రాజ్ లేచి వెళ్లి ఒక టాబ్లెట్, అమృతాంజన్ బాటిల్ కూడా తెచ్చాడు.
టాబ్లెట్ ఫాయిల్ నుండి తీసి ప్రియ చేతిలో పెట్టి నీళ్ళ గ్లాస్ అందించాడు.
మంచం మీద కూర్చుని బాక్ రెస్ట్ వెనక దిండు అమర్చుకుంటూ “ ఇటు రా ప్రియా కాస్త అమృతాంజనం రాస్తాను” అంటూ వారిస్తున్నా వినకుండా ప్రియ తలను వడిలో పెట్టుకుని
“ బుజ్జి బంగారువు కదూ, కాస్సేపు కళ్ళు మూసుకుని పడుకో” అంటూ కణతలపై మునివేళ్ళతో మృదువుగా మర్దనా మొదలెట్టాడు.
వేసుకున్నటాబ్లెట్ కో, అతని మర్దనాకో గాని ప్రియ తలనొప్పిఅరగంటలో తగ్గి కాస్త ఉపశమనం కలిగింది.
లేచి కూర్చోబోయిన ప్రియను ఆపేసి
“ ఉహు ఓ గంటనిద్రపో. కాస్త బావుంటుంది.” అంటూ ఆపేశాడు.
“ అందరూ ఏమనుకుంటారు? ..”
“ఏమీ అనుకోరు.. ఓ పోనీ నేను బయటకు వెళ్లి చెప్తాలే నీకు జ్వరంగా వుందని”
ప్రియను పడుకోబెట్టి దుప్పటికప్పి కదలబోయిన అతన్నిచెయ్యిపట్టి ఆపేసింది ప్రియ.
అప్పటికే కిటికీ మూసి లైట్ ఆఫ్ చెయ్యడం వాళ్ళ చీకటిగానే అనిపించింది.
“లేదు. రాత్రే ఆలస్యంగా పడుకున్నారు. రండి అంటూ “ లాగి పక్కన అతను వాలగానే చటుక్కున అతని వైపు తిరిగి మరింత దగ్గరగాజరిగి అతన్నిగట్టిగా హత్తుకు పడుకుంది.
“ప్రియా” ఆశ్చర్యంగా పలికింది ఆతనిస్వరం.
“ రాజ్ నిజానికి మీ ఉత్తరం చదివాక కాస్త భయపడ్డాను. మీ భావోద్వేగంలో నాకు కాస్తంత వ్యామోహం కోరిక కూడా కనిపించాయి. అందరు అమ్మాయిల్లాగే మీ ప్రవర్తన ఎంత వైల్డ్ గా ఉంటుందోనని సంశయించాను. అయినా అలసట, జ్వరం వల్ల తెలీకుండానే నిద్రపోయాను.
అయినా రాత్రి ఎంత సైలెంట్ గా వచ్చి, నాకేమాత్రం మెలుకువ రాకుండా పడుకోడమే చెప్పింది మీ గురించి. ఇందాక మీ స్పర్శలో జన్మజన్మలకు కావలసిన ఆత్మీయత , ప్రేమ కనిపించాయి గాని మోహమో కోరికో కాదు.
నేను ఎంత అదృష్టవంతురాలనో అర్ధమైంది.
నా జీవితాన్ని నిశ్చింతగా మీచేతుల్లో పెట్టి బ్రతగ్గలను. మీకోసం ఏమైనా చెయ్యగల స్థితిలోకి తెచ్చినన్ను
గెలుచుకున్నారు”
అంటూ అతన్నిమరింత అల్లుకుపోయింది.
ఆడవాళ్ళను గెలుచుకుందుకు అర వీసం ప్రేమకావాలి కాని సిక్స్ పాక్సో, ఆరడుగుల పొడవో కాదు గదా– ఈ మాటలు మనసులోనే అనుకుంది ప్రియ.

****

2 thoughts on “గెలుపు కోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *