April 20, 2024

నిరంతరం నీ ధ్యానంలో (తరాలు – అంతరాలు)

రచన: కోసూరి ఉమాభారతి

kunni 3 maalika
‘యువరాజ్ ‘ గురించే ఆలోచిస్తూ తయారవుతున్నాను. ఎప్పటిలా మౌర్య గార్డెన్స్ లో కలుస్తానని, పొద్దున్నే మెసేజ్ పంపాను. రాజ్ కి నచ్చేలా ముస్తాబవుదామని, కాస్త ముందుగానే అద్దం ముందు చేరాను.
అతన్ని కలిసి వారమయింది. లాలనగా దగ్గర చేరి, “నాకంతా అర్ధమయింది రాజ్, నాకిప్పుడు ఏమాత్రం కోపం లేదు. నిన్ను క్షమించేసాను. యూ ఆర్ మై ప్రిన్స్ చార్మింగ్, ఐ లవ్ యూ,” అంటూ అతని చేతుల్లో వొదిగిపోవాలని ఆత్రుతగా ఉంది. రాజ్ ని గురించిన అపార్ధం తొలిగి, నా మనస్సిప్పుడు అతని పట్ల అభిమానంతో సందడి చేస్తుంటే, క్షణం ఒక యుగంలా గడుస్తుంది…
“యూ ఆర్ చీట్, అసలు నాకిక కనబడకు,” అని ఆ రోజు నా హాస్టల్ రూం బయట అతన్ని చడామడా తిట్టేసి, ముఖాన తలుపులు వేసినప్పుడు, పాపం ఎంత బాధపడ్డాడో కదా!
“ఫర్గివ్ మి కలీ, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్,” అంటూ ఓ మారు, “కేవలం నీతో స్నేహం కోసమే, నీ నుండి నిజం దాచాను. అర్ధం చేసుకో, కలీ,” అని మరోమారు – రోజుకో ఆభ్యర్ధనతో నోట్ రాసి, ఫ్లవర్ బొకేలతో పాటు నా డోర్స్ వద్ద, వదిలి వెళుతున్నాడు…
నా గదంతా ఇప్పుడు ఆ పువ్వులతో, సువాసనలతో నిండిపోయింది…
గడిచిన వారం రోజులుగా అతగాని ధ్యాసలోనే ఉన్నాను…నాలుగేళ్ళ మా పరిచయంలో ముందు స్నేహితుడయ్యాడు, సాన్నిహిత్యం పెరిగి, రెండేళ్లగా ప్రియమైన నేస్తంగా మారి అంతకన్నా ఎక్కువే మనసుకి దగ్గరవుతున్నాడు. అతడి నుండి ఏనాడూ అభ్యంతకరమైన మాట గాని, ప్రవర్తన గానీ లేదు. నాతో ఎంతో ప్రేమగా, గౌరవంగా మెలుగుతాడు…. పైగా నాకు చారిటీ వర్క్ ముఖ్యమని తెలిసి, మా ఆశ్రమం వారి ప్రతి ఫండ్-రైజింగ్ కి నాతో కలిసి ఎంతో పాటు పడతాడు, వృద్ధాశ్రమం వారికి సాయం చేస్తాడు. మొదటిసారి రాజ్ ని కలిసిందే మా అనాధాశ్రమానికి వాలంటీర్ గా అతను వచ్చినప్పుడు.
స్మార్ట్ గా ఉంటాడు రాజ్, మంచివాడు కూడా. నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడని అర్ధమయ్యాకే అంతకి రెండింతలు యువరాజ్ ని నేనూ ఇష్టపడసాగాను…. నాలోని మంచితనం, ఔన్నత్యం తనని ఆకర్షించాయని, నన్ను, నా వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తున్నానని, నిత్యం చెబుతుంటాడు.
నా పేరు కల్యాణి అయితే, గులాబి మొగ్గలా ఉన్నావంటూ ముద్దుగా ‘కలీ’ అని పిలుస్తాడు. ‘మెరుపు తీగ’ లా ఉన్నావంటూ టీజ్ చేస్తుంటాడు కూడా! ఇలా యువరాజ్ తలపులతో నా చెక్కిళ్ళు ఎరుపెక్కి, పెదవులపై చిరునవ్వు వెలిసింది… అద్దంలో నా రూపు నిజంగానే వింతైన మెరుపులా అనిపించింది…
‘యువరాజ్ పై ఉన్న కోపం పిచ్చిప్రేమగా మారిందా ఇవాళ?’ నాలుగు రోజులు అతన్ని చూడకపోతే ఇంతలా మిస్ చెయ్యాలా?’ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ‘కాదు కాదు… నన్ను మోసగించాడనుకున్న అప్పటి ఆ కోపం, ఇప్పుడు ఇలా అతనిపై అభిమానంగా మారిపోయింది. నాదే అసలు సిసలైన పిచ్చిప్రేమ అని నవ్వుకుంటూ, యువరాజ్ కి ఇష్టమైన పింక్ కలర్ శల్వార్ కమీజ్ వేసుకొన్నాను…
ఫోన్ రింగయింది… పికప్ చేసేలోగా ఆగిపోయింది… మరో నిముషానికి మెసేజ్ వచ్చింది…”నీ ధ్యాసతోనే ఆఘమేఘాల మీద
వచ్చేస్తున్నా .. కనికరించి నన్ను మీట్ అవుతున్నందుకు – ఐ యాం యువర్స్ ఫారెవర్” అని యువరాజ్ మెసేజ్…….
మళ్ళీ నవ్వుకున్నాను.
నాకిష్టమని తెలుగు భాష పైన దృష్టి పెట్టి, పార్వతమ్మ అనే ఓ బంధువు నుండి తెలుగులో బాగా మాట్లాడ్డం నేర్చాడు. అందుకోసం ఆమెతో కలిసి వాళ్ళింట పాత సినిమాలు కూడా చూస్తుంటాడు… ఆ సినిమాల పాటలు కూనిరాగాలు తీసి నన్ను నవ్విస్తుంటాడు…తన కుటుంబం గురించి పెద్దగా ఏదీ చెప్పలేదు. తను కూడా నాలాగే తల్లితండ్రి లేనివాడనని చెప్పాడు. నేను అనాధాశ్రమంలో పెరిగి పెద్దయ్యానని తెలియజేసినప్పుడు నా పై మరింత ప్రేమ, శ్రద్ధ కలిగాయన్నాడు. తను ‘మౌర్య సంస్థల’ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో జాబ్ చేస్తున్నానని చెప్పాడు..
ఆలోచిస్తూ చప్పల్స్ వేసుకొని హ్యాండ్ బాగ్ అందుకునే లోపు మళ్ళీ ఫోన్ మెసేజ్ …. ‘ఐ యాం హియర్. జస్ట్ వెయిటింగ్ ఫర్ యు, మై ఏంజల్’ అంటూ రాజ్ నుండే. అక్కడికి దగ్గరలో ‘మౌర్య ఎంప్లాయీ క్వార్టర్స్’ లోనే ఉంటాడతడు.
తలుపులు వేసి, అక్కడినుండి కదిలాను. పది నిముషాల వాకింగ్ డిస్టెన్స్ లో ఉంది ‘మౌర్య ఆర్కేడ్’ వెనుక గార్డెన్స్.
రోజూ కాలేజీ, ట్యూషన్స్ చెప్పడం అయ్యాక, ఆ షాపింగ్ ఆర్కేడ్ లోనే నేను రాజ్ ని మీట్ అయ్యేది. గార్డెన్స్ లో కాసేపు కబుర్లయ్యాక, కేఫ్ లో టిఫిన్ తినేసి హాస్టల్ కి వెళ్ళిపోడం పరిపాటే నాకు.
******
‘ఆర్కేడ్’ గేటులో అడుగు పెడుతుంటే, గుండె ఒక్కసారిగా ఝల్లుమంది. అడుగులు తడబడ్డాయి. మౌర్య షాపింగ్ మాల్, మౌర్య ప్రైవేట్ బాంక్, మౌర్య టెక్స్టైల్స్, మౌర్య గ్లోబల్ టెక్నాలజీస్ – ఇంకా ఎన్నో వ్యాపారాలు… ఈ పేరున్న ‘మౌర్య వ్యాపార సామ్రాజ్యం’ కి అధినేత నా యువరాజ్. ఓ సామాన్యుడుగా, నా స్నేహితుడుగా నా వెంట ఉండే యువరాజ్, నిజానికి ఓ ప్రముఖ వ్యాపారవేత్తని నాకు ఇటీవలే కొత్తగా తెలిసింది.
మరి నాలుగేళ్లగా ఈ నిజాలని నానుండి దాచి ఉంచాడన్న కోపంతోనే, ఆ రోజు యువరాజ్ ని దూషించి, తన నుండి దూరంగా ఉండిపోయాను.

యువరాజ్ గురించిన నిజం – క్రిందటి వారం మా సైన్స్ కాలేజీ కాన్వకేషన్ ఫంక్షన్ లో తెలిసింది. ఆ వేదికపై
కాలేజీ గ్రాండ్ బెనిఫాక్టర్ ఐన ‘మౌర్య సంస్థల’ అధినేతగా యువరాజ్ ని, పరిచయం చేసినప్పుడు, నివ్వెరపోయాను. నిజానికి, అతను ఓ కోటేశ్వరుడని, ‘యువరాజ్ మౌర్య’ గా గుర్తింపున్న వ్యక్తని అర్ధమయ్యి అవాక్కయ్యాను. అతని చేతులమీదుగా ‘ఎకడమిక్ ఎక్సెలెన్స్ అవార్డ్’ అందుకోడానికి తడబడిపోయాను…. మిగతా కాన్వొకేషన్ తతంగం ముగిసాక, హాస్టల్ కి తిరిగి వచ్చిన నేను, నా రూం ముందు వెయిట్ చేస్తున్న యువరాజ్ ని ‘మోసగాడివంటూ తూలనాడి మొహానే తలుపులు వేసేసాను.
అతని గురించి, అతనితో నా స్నేహం గురించి, అయోమయంలో పడిపోయాను. అర్ధంకాని ఆవేదనతో, అపనమ్మకంతో రాత్రిపగలు కుమిలిపోయాను. అప్పుడే – యువరాజ్ పంపిన అపాలజీ నోట్స్, మాట్లాడమని చేసిన రిక్వెస్టులు, మా స్నేహం గురించి సుదీర్గంగా ఆలోచింపజేసాయి.
నాలుగేళ్లగా నాతో చెలిమి కోసం తన అంతస్తులని వీడి, నా వంటి మామూలు యువతికి నేస్తంగా మెలిగాడంటే, అతనిది
ఉన్నతమైన వ్యక్తిత్వం అనిపించింది. నాకు అతని ప్రేమ ఓ అరుదైన అదృష్టమేననిపించింది. నా స్నేహం కోసమే అలా
నానుండి తన గురించిన నిజాలు దాచాడని నమ్మకంగా నిశ్చయించుకొన్నాకే, ఇప్పుడిలా అతన్ని కలవడానికి రాగలిగాను….

ఈ ఆలోచనలతో, షాపింగ్ మాల్ దాటి, ఆ వెనుకే ఉన్న ‘మౌర్య గార్డెన్స్’ ఎంట్రెన్స్ లోకి వచ్చేసాను. టైం సరిగ్గా యేడయిందేమో, ఒక్కసారిగా గార్డెన్ లోని డోమ్ లైట్స్ జిగేలుమని వెలిగాయి. చాలా ప్రత్యేకంగా తీర్చి దిద్దింటుంది గార్డెన్. చుట్టూ పందిళ్ళకి విరబూసిన రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎప్పటిలా షాపింగుకి వచ్చిన వాళ్ళతో, పిల్లలతో కోలాహలంగా ఉంది.. వారిని దాటుకుంటూ కాస్త ఎడంగా, మేము అలవాటుగా కూర్చునే గజేబో వైపు నడిచాను.
అప్పటికే అక్కడికి చేరుకొన్న యువరాజ్, పూలపందిరినానుకొని నిలబడి, నవ్వుతూ నా వైపే చూస్తున్నాడు. ‘కొత్తగా కనిపిస్తున్నాడు ఇవాళ’ అనుకుని, కాస్త వడిగా యువరాజ్ దిశగా అడుగులు వేశాను.
******
నా చేయందుకుని దగ్గరికి తీసుకున్నాడు రాజ్. అతని చేతుల్లో ఒదిగిపోయిన నన్ను సున్నితంగా గుండెలకి హత్తుకున్నాడు. “గ్లాడ్ యు హావ్ ఫర్గివెన్ మి కలీ,”, “ఐ యామ్ గ్రేట్ఫుల్ టు యు,” నా చెవిలో మృదువుగా అంటున్న అతన్ని, మరింత హత్తుకుపోయాను. పూల పందిరి మాటున, ఇరువురం మాటలకందని మనస్సు భాషలో బాసలు చేసుకుని, క్షమాపణలు చెప్పుకున్నాం.
“కలీ, మన బరువుకి ఈ పువ్వుల పందిరి మెల్లగా ఒరిగి పువ్వుల పానుపవుతుందేమో! నీ ఇష్టం,” అన్నాడు కొంటెగా యువరాజ్… నవ్వుతూ దూరంగా జరిగి ఎదురుగా స్తంభానానుకొని కూర్చున్నాను.
“నావి కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పు రాజ్,” అంటున్న నా పక్కనే వచ్చి కూర్చున్నాడు…
“లిజెన్ కలీ, నేను చెప్పవలసింది వింటే నీ ప్రశ్నలన్నింటికీ ఆన్సర్స్ దొరుకుతాయి,” అంటూ నా చేతిని తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. అతని భుజం మీద తల ఆన్చాను ‘చెప్పమన్నట్టు’.
“నేను హైస్కూల్ నుండి, ఎం.బి.యే వరకు అమెరికాలో చదివాను. అక్కడినుండి పిలిపించి, ఇరవైరెండేళ్ళకి తన బిజినెస్ ఎంపైర్ కి నన్ను ‘పవర్ ఆఫ్ ఎటర్నీ’ హోల్డర్ గా నియమించి బాధ్యతలు అప్పజెప్పారు మా డాడీ. తరువాత కొన్నాళ్ళకు మా పేరెంట్స్ వరల్డ్ టూర్ కి బయలుదేరి వెళ్ళారు. నా దురదృష్టం – ఇరువురు పారిస్ లో కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. మా డాడీకి నేను చాలా ఆలస్యంగా కలిగిన ఏకైక సంతానం. తన ఆశలని, ఆశయాలని నేను పూర్తిచేయాలని, కొనసాగించాలని ఆకాంక్షించారు. పార్వతమ్మ అంటే ఎవరో కాదు. మా పెద్దమ్మ. పార్వతిఅమ్మ అని పిలుస్తాను. నన్ను ముందునుండీ కన్నతల్లిలా పెంచింది. ఆవిడే ఇప్పటికీ నా తల్లితో సమానమైన గాడ్ గివెన్ మదర్. ఆరేళ్ళగా ‘మౌర్య’ వ్యవహారాల్లో కూడా ఆమే నన్ను ముందుకి నడిపిస్తుంది,” ఆగి నావంక చూసాడు.
తడయిన నా కళ్ళని చూసి కంగారు పడ్డాడు… “ఏంలేదు, నీ గురించి వింటుంటే అలా టియర్స్. అంతే, చెప్పు,” అతని చేతిని చుట్టేసి మరింత దగ్గరగా జరిగాను.
క్షణమాగి మళ్ళీ చెప్పసాగాడు రాజ్. “మా డాడీతో నా లాస్ట్ కాన్వజేషన్ మరిచిపోలేనిది, కలీ. లైఫ్ లో నేను తనకన్నా ఉన్నతంగా ఎదగాలన్నారు డాడీ. ‘మౌర్య వంశ’ వారసుడిగా సమాజసేవ, చారిటీ వర్క్ కి నేను కట్టుబడి ఉండాలన్నారు. అన్నివిధాల అర్హురాలైన అమ్మాయిని పెళ్ళి చేసుకొని త్వరగా స్థిరపడాలన్నారు. ఆ ఎంపికలో నాకు పూర్తి స్వేచ్చ
ఉందన్నారు. తమ వంశోద్దారుకులని మంచి పౌరులుగా ఉన్నత స్థితిలోకి పెంచి పెద్ద చేసే వ్యక్తిత్వం ఉన్న యువతిని
తమ కోడలిగా ఆహ్వానిస్తామన్నారు,” అని చెబుతూ ఓ క్షణం ఉదాసీనంగా అయిపోయాడు…..
నేనే చెలిమిగా చెంప మీద తడిమాను…తేరుకొని సన్నగా నవ్వాడు.
“అప్పటినుండీ ‘మౌర్య’ ఆఫీసు పనుల్లో మునిగిపోయినా, మా పేరెంట్స్ పోయారన్న బాధనుండి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. ఎలాగోలా బిజీగా నడిచిపోతున్న నా లైఫ్ లో నాలుగేళ్ళ క్రితం ఓ విశేషం జరిగింది,” నా వైపు తిరిగి నా చెక్కిలిపై సున్నితంగా తాకాడు.
“ఓ ఆదివారం పొద్దున్నే జాగింగ్ చేసేప్పుడు, నిన్ను చూసాను. మెయిన్ రోడ్ మీదనున్న ‘శాంతి అనాధాశ్రమం’ నుండి ఫిజికల్లీ – హాన్డికాప్డ్ పిల్లల్ని, ముందుండి నడిపించి పార్క్ కి తీసుకెళుతున్నావు. తరువాత ప్రతి ఆదివారం అదే పని చేస్తున్న నిన్ను గమనించాను. అప్పుడే నీ పైన ఇష్టం, గౌరవం కలిగాయి,” ఆగి నా వంక చూసి కన్ను గీటాడు.
“నీతో దగ్గరగా మెలగాలని నేను కూడా ఆశ్రమంలో వాలంటరీ వర్క్ కి ఎన్రోల్ అయ్యాను… వాకబు చేసి నీ గురించి వివరాలు తెలుసుకున్నాను. తరువాత యేడాది పాటు నిన్ను వెంబడించి, నీతో సమయం గడిపాక, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. నిన్ను అనుసరిస్తూ, ప్రేమిస్తూ నీకోసం పిచ్చివాణ్నయ్యాను. నా ప్రేమ గురించి నీకు చెప్పేయాలని డిసైడ్ అయ్యాను… కాని, ఇన్నాళ్ళ తరువాత, నేనొక డబ్బు- పరపతి ఉన్నవాడినని, కొత్తగా నా గురించిన నిజం నీకు తెలిస్తే, నాకు దూరమవుతావని అనిపించి భయం వేసింది….
ఏంచేయాలో తోచక పార్వతిఅమ్మకి నా ప్రేమ గురించి, నా సమస్య గురించి చెప్పాను. ఆవిడ సలహా మేరకే, ముందు మా ’గురుకృప’ బంగళా నుండి ‘మౌర్య’ ఎంప్లాయీ క్వార్టర్స్ కి మారాను. ఓ కంపెనీ ఉద్యోగస్తుడిగా నా లైఫ్-స్టైల్ నీకు కంఫర్టబుల్ గా అనిపించి, మనం దగ్గరయ్యే అవకాశం ఉంటుందని, ఒకరినొకరం అర్ధం చేసుకున్న తరువాత నీకు అన్నీ విన్నవించుకునే వీలుంటుందని ఆమే ప్రోత్సహించింది. అదీ విషయం,” అంటూ నా నుదిటిపై ముంగురులు సవరించాడు.
“ఇంక ఏమీ అనవద్దు రాజ్. అవసరం లేదు. ఐ టూ లవ్ యు మోర్ దెన్ లైఫ్,” ఆర్ద్రతతో అతని చెక్కిలి పైన ముద్దు పెట్టుకుని కన్నీళ్ళనాపుకుంటూ యువరాజ్ భజంపై తల వాల్చాను…
******
“వి విల్ సర్వ్ బ్రేక్ఫాస్ట్ సూన్,” ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసింది. సీట్-బెల్ట్ తీసి నాకు దగ్గరగా జరిగాడు రాజ్.
“సారీ కలీ, వారం క్రితం పెళ్ళవగానే స్విట్జర్లాండ్ వెళ్ళవలసిన వాళ్ళం. గురువుగారి ఆశీస్సులు, శోభనం, ముహూర్తం అంటూ పార్వతిఅమ్మ మనల్ని విడిగా ఉంచింది. విలువైన హనీమూన్ టైం వేస్ట్ అయింది. ఐ విల్ మేక్ ఇట్ అప్ టు యు మై లవ్,” నా చెక్కిలి పై ముద్దు పెట్టి, చెవిలో గుసగుసలాడాడు.
*****
హోస్టెస్ తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటూ పార్వతి అత్తయ్య గురించి అలోచించాను. ఆవిడ, రాజ్ నాన్నగారి పెద్దభార్య. పెళ్ళయి
పదేళ్ళయినా సంతానం కలగకపోతే, వారసుడి కోసం పట్టుబట్టి, భర్తకి మరో పెళ్ళి చేసారట పార్వతి అత్తయ్య. రెండవ భార్య
సంతానమే రాజ్. ఆమెది ఎంతటి నిస్వార్ధత అనిపించింది.
ఆమె వల్లనే మౌర్య వంశ పరపతి, వ్యాపారాలు పదింతలు విస్తరించాయని అత్తయ్యకి పేరు, గౌరవం…
వ్యాపారాలు చూసుకోడానికే, ఆవిడ చదువుకొని అకౌంటింగ్-ఫైనాన్స్ లో డిగ్రీ కూడా పొందారట. మౌర్య వ్యాపార
వ్యవహారాల్లో ఇప్పటికీ అత్తయ్య మాట, నిర్ణయాలే పాటిస్తారుట యువరాజ్ తో పాటు మిగతా డైరెక్టర్స్ కూడా.
ఇంట ఏకంగా ఒక పుస్తకాలయమే ఉంది అత్తయ్యకి. దైవభక్తి, గురుభక్తి కూడా మెండు. సర్వేశ్వర స్వామి అనే ఆధ్యాత్మిక గురువుని భక్తితో అనుసరిస్తారటామె. ప్రతియేడు ‘గురుకృప’ లోని పూజామందిరంలో, గురువుగారి చేత హోమం జరిపిస్తారట.
నన్నైతే, వారి వంశానికి నేనో యువరాణినన్నట్టు ఆదరించారు అత్తయ్య. అకడెమిక్ స్కాలర్షిప్ తో చదువుకున్నందుకు నన్నెంతగానో మెచ్చుకున్నారామె.
*****
హనీమూన్ నుండి తిరిగొచ్చిన నెల రోజులకి ఎం.ఎస్.సి లో సీట్ వచ్చినట్టు లెటర్ అందింది. జాయిన్ అవ్వమని ప్రోత్సహించాడు రాజ్. నాకిక చదవాలని లేదన్నందుకు నా మీద కోపగించుకుని అలిగాడు కూడా.
“నా మనసు నిత్యం నీ ధ్యాసలోనే, నేను ప్రతిక్షణం నీ కోసమే జీవించాలి. నాకిక మరో వ్యాపకమే వద్దు. నిజం,” అని కన్నీళ్ళ పర్యంతమైతే గాని అలక మానలేదు యువరాజ్.
“నాకు నువ్వు, నీకు నేను. మనమధ్య గాలిని కూడా రానివ్వను కలీ. నీవు కన్నీళ్లు పెట్టినా, మనసు కష్టపెట్టుకున్నా నన్ను నేను శిక్షించుకుంటాను,” అన్నాడు నా చేతిలో చేయి వేస్తూ. యువరాజ్ తో జీవితం ఓ కలలా ఊహించని అదృష్టం.
*****
అత్తయ్య అడుగుజాడల్లో అనుసరిస్తూ ఎంతో నేర్చుకుంటున్నాను. అత్తయ్యతో పాటు ‘మౌర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ కి బోర్డ్ మెంబర్ గా పనిచేస్తున్నాను కూడా.
అదంతా ఓ ఎత్తైతే, రాబోయే వారసులకి అంటూ అధునాతంగా నర్సరీలు, ప్లేరూమ్స్ కట్టించారు అత్తయ్య. ఓ రెండు మూడేళ్ళు మాత్రం, తమని పిల్లల్ని కనమని వొత్తిడి చేయవద్దని రాజ్ ప్రాధేయపడితే ఆవిడ సరేనన్నారు…
*****
“అత్తయ్య పట్ల నాలో ఆరాధనా భావం రెట్టింపయ్యింది,” అన్నాను రాజ్ తో ఓ రాత్రి. “ఎందుకట?” అంటూ నా ఎదపై తలపెట్టి నా కళ్ళలోకి చూసాడు. “సొంత బిడ్డలా నన్నాదరిస్తుంది. మేధావి. కాక త్యాగమయి. నిజంగానే ఆమె దేవత. వారసుడి కోసం భర్తకి రెండో పెళ్లి చేయడం మాటలా? అది నాకసాధ్యం. ఆ విషయంగా, అలా నాలో ఏదైనా లోపం ఉంటే, నీ జీవితం నుండి వెళ్ళిపోతాను. కాని నిన్ను మరెవరితోనూ పంచుకోను రాజ్,” అంటూ రాజ్ కి దగ్గరగా జరిగాను.
ఉలిక్కిపడ్డట్టుగా లేచి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. “నీలో ఏ లోపమూ ఉండదు. నీ సంతోషం కంటే, నాకేదీ ముఖ్యం కాదు కలీ,” అంటూ నన్ను ముద్దులతో మరిపించేసాడు నా రాజ్.
*****
పెళ్ళయి ఐదేళ్లు గడిచాక కూడా, మా మధ్య ప్రేమ, లాలన, ఆరాధన అలాగే సరికొత్తగా నిలిచున్నాయి.
“పెళ్ళికి ముందు నిరంతరం నీ ధ్యానంలో గడిపాను… ఇప్పుడు నిత్యం నీ ఆరాధనలో గడుపుతున్నాను,” లాంటి మాటలతో
నన్ను ఎప్పుడూ మురిపిస్తూ ఉంటాడు రాజ్… నాలోనూ అతని పట్ల అనురాగం ఒక్కోప్పుడు వ్యసనంలా అయిపోతుంది.
**
రోజులు, నెలలు, సంవత్సారాలు సంతోషంగా హాయిగా గడిచిపోతున్నాయి.
ప్రతియేడు మా పెళ్ళిరోజున ఇంట్లో వ్రతం చేయిస్తారు అత్తయ్య. అలాగే, ‘మౌర్య’ వ్యవస్థకి, సమాజానికి కూడా ఉపయోగపడే
యేదేని ఓ కొత్త ప్రాజెక్ట్ కి, గురువుగారి ఆధ్వర్యంలోనే మాచేత పునాదులు వేయిస్తారు. తల్లిప్రేమను నాకు ఆవిడ
రూపంలోనే ప్రసాదించాడు దేవుడు అని నమ్ముతాను.. ప్రతిసారి ఆ పెళ్ళిరోజు వేడుక అయిన మరునాడు రాజ్ నన్ను వెకేషన్ కి తీసుకెళ్ళడం తప్పనిసరి. ఇప్పటికే దేశవిదేశాల్లోని ఎన్నో ఎగ్జాటిక్ హాలిడే స్పాట్స్ చూసాము..
వారం రోజుల్లో మా ఎనిమిదవ వెడ్డింగ్ యానివర్సరీ…కూడా.
ఇంతటి అందమైన, అర్ధవంతమైన జీవితాన్ని ఇచ్చిన యువరాజ్ కి అందమైన పిల్లల్ని కనివ్వాలని ఉంది. అత్తయ్యని సంతోషపెట్టాలని ఉంది. అప్పుడే యేడాదిన్నరగా నా కడుపు పండాలని నాకు ఆత్రుతగా ఉంది.
అందుకోసమే, యేటా యింట జరిగే హోమం,శాంతిపూజల్లో భక్తితో పాల్గొని, గురువుగారి దీవెనలు అందుకుంటాను కూడా.
తెల్లారితే మా ఫ్లైట్. ఈ సారి ట్రిప్ స్పెయిన్ కి. వెళ్లేముందు, ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేస్తూ అత్తయ్యతో ఆఫీసురూమ్ లో ఉన్నాడు రాజ్. తన ప్యాకింగ్ తనే చేసుకునే అలవాటు రాజ్ కి. బట్టలవీ ఇంకా సర్దుకొనే లేదు. అర్ధరాత్రి వరకు చూసి, నా ప్యాకింగ్ మటుకు ఫినిష్ చేసి పడుకుండిపోయాను……..
*****
కిటకీ అద్దాల మీద వర్షపు చినుకుల చప్పుడికి, గబుక్కున మెలుకువ వచ్చింది. రాజ్ కోసం చూస్తే, బెడ్ మీద కాని, గదిలో గాని లేడు. సూట్కేస్ కూడా సర్దుకున్నట్టు లేదు. బెడ్ రూమ్ వెనుకగా ఉన్న లైబ్రరీలో లైట్ వెలుగుతుండటం చూసి అటుగా వెళ్లాను. డెస్క్ వద్ద కూర్చుని ఏదో దీర్గాలోచనలో మునిగి ఉన్నాడు. వెనుకగా వెళ్లి, రాజ్ భుజాలపైన చేతులు వేసాను. “ఏమిటిట రాజావారి ధ్యాస నాపై నుండి సడిలినట్టుగా ఉంది?” అడిగాను.
“నీతో మాట్లాడాలి పద,” అంటూ నా చేయి పట్టుకుని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి, నా పక్కనే కూర్చున్నాడు.
కాస్త తటపటాయించి, “అదే, పొద్దున్న పార్వతిఅమ్మ మనతో అన్న విషయం…..” అంటూ నసిగాడు.
“చూడు రాజ్, అత్తయ్య చెప్పింది చాలా కరెక్ట్, స్పెయిన్ నుండి వచ్చాక, మెడికల్ ఫెర్టిలిటీ టెస్ట్స్ తప్పక చేయించుకుందాము. అది మనకి, అత్తయ్యకి అతి ముఖ్యం. మనదైన బిడ్డ కావాలని నాకూ ఆత్రుతగా ఉంది. అత్తయ్య అన్నదానికి తప్పు పట్టవద్దు రాజ్. అదీకాక, ఆమే కదా నిన్ను నాకు దగ్గర చేసి నాకీ జీవితాన్నిచ్చి, ఇంతటి గౌరవం, పరపతి, సమకూర్చింది. కాబట్టి ఆమె మాట నాకు వేదవాక్కు,” అంటూ రాజ్ క్రాఫు చెరిపేసి అతని చెంప మీద ఘాడంగా ముద్దు పెట్టాను.
రాజ్ అమాంతం నన్ను తన చేతుల్లో ఎత్తుకుని బెడ్ రూమ్ వైపు నడిచాడు.
“రాజ్, మన ప్రయాణానికి ఎక్కువ టైం లేదు. నీ ప్యాకింగ్ కూడా అవ్వలే….,” అంటున్నా వినకుండా, నన్ను తన
ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసాడు.
*****
“అంతే కాదురా, కలీ, ఇకనుండి నేను బయట ఊళ్ళకి కూడా వెళ్ళవలసి వస్తుంది. పోయిన వారం పార్వతిఅమ్మ
ఓ జాపనీస్ కంపెనీతో ‘హ్యాండిక్రాఫ్ట్స్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్’ సైన్ చేసింది. వైజాగ్, నిజామాబాద్, కాకినాడ, సికందరాబాద్
లల్లో ఆఫీసులు సెట్-అప్ చెయ్యాలి. నిన్ను వదిలి నేనెలా ఉండగలను?” అన్నాడు తన సూట్కేస్ లాక్ చేస్తూ.
“పోతే అసలు విషయానికొస్తాను. మనకి బిడ్డలు పుట్టడం గురించి అసలెందుకీ గొడవ? నాకది పెద్ద విషయంగా
అనిపించడం లేదు. మెడికల్ టెస్ట్స్ వల్ల లాభం లేదు. ఎవరిలో లోపం ఉందని తేలినా నువ్వు హర్ట్ అయి బాధపడతావు.
అది నేను భరించలేను… అన్నిటికన్నా నాకు నువ్వు ముఖ్యం. నీ మనసు కష్టపడితే, భరించలేను కలీ. పార్వతిఅమ్మ
ఎందుకిలా చేస్తుంది?” అన్నాడు రాజ్ నన్ను దగ్గరికి తీసుకుంటూ.
“ఆమె ఏంచేసినా మన భవిష్యత్తు కోసమే కదా! నీకుమాత్రం తెలియందేముంది? ఇక పద మరి. సూట్ కేసులు రాము తెస్తాడు,” అంటూ రాజ్ చేయందుకుని అక్కడినుండి కదిలాను.
*****
స్పెయిన్ నుండి వచ్చాక, డాక్టర్ నిరంజన్ గారు, రెండురోజుల పాటు మా ఇరువురివీ ఫెర్టిలిటీ టెస్ట్స్ జరిపించారు.
అదయ్యాక – హైదరాబాదు, రాజమండ్రీ లోని ‘మౌర్య’ వ్యాపారాలని గ్రూప్ చేసి, నన్ను చైర్మన్ గా నియమించారు, అత్తయ్య. చాలా పెద్ద బాధ్యత అని వారించినా, “నా తరువాతైనా ఈ వ్యవహారాలు నీవు చూడవలసినదే. యేడేళ్ళగా నా వెంటే ఉండి చక్కగా నెరవేరుస్తున్న బాధ్యతలేగా తల్లీ ఇవి,” అంటూ నా అభ్యంతరాన్ని కొట్టిపారేశారామె.
“అదీగాక, మీ మామగారి కోరిక ప్రకారం, సమాజానికి తోడ్పడే ‘మౌర్య చారిటీ’ వ్యవస్థని స్థాపించే యత్నమే – ఈ హ్యాండిక్రాఫ్ట్స్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్. నాకు శక్తి ఉండగానే, స్వచ్చంద సేవా కార్యక్రమాలని స్థాపించి, మీకు, మీ వారసులకి ఇచ్చేస్తే, అదో పద్దతిగా కొనసాగుతుందమ్మా. అందుకే నేను, యువరాజ్ కూడా మా దృష్టిని అటు పెట్టవలసిందే తల్లీ,” అని వివరించారమె.
*****
చెయిర్మన్ గా బాధ్యతల్లో నేను తలమునకలవుతుంటే, అత్తయ్య, రాజ్ అహర్నిశలు నిర్విరామంగా వారి ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయారు. ఇద్దరూ కలిసి, విడివిడిగానూ నెలకి రెండువారాలు ఊళ్ళకి వెళ్లి వస్తున్నారు. ఇంత పని వత్తిడిలో మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. రాజ్ తో ప్రేమలు, సున్నితత్వాలు ఇప్పుడు లోపించాయి. అతన్ని చెప్పలేనంత మిస్ అవుతున్నాను. నెలకి పది రోజులే నాకు దగ్గరగా ఉంటున్నాడు నా యువరాజ్.
పోతే, నాలుగునెలల క్రితం జరిపించిన ఫెర్టిలిటీ టెస్ట్స్ రిపోర్ట్స్ వచ్చాయని, మేమిరువురమూ ఎటువంటి లోపాలు లేకుండా,
అంతా నార్మల్ , అని తేలిందటని రాజ్ చెప్పడంతో, చాలా రోజుల తర్వాత మునుపటిలా ఆనందంగా గడిపాము.
మరునాటి నుండి షరా మామూలే…ఎవరి వ్యాపార వ్యవహారాల్లోకి వాళ్ళం తలో దిక్కు…
*****
రానురాను నాతో ప్రేమగానే ఉన్నా, రాజ్ లో మునుపటి సరదా, సంతోషం లేవు. కలిసినప్పుడు కూడా రాజ్ తో సాన్నిహిత్యం
లాలిత్యం, ప్రేమ అన్నీ బెడ్రూం వరకే పరిమితం. బిగికౌగిట లాలించినా, ముద్దు మురిపాలలో ముంచెత్తినా – అదంతా అప్పుడే, ఆ రాత్రికే. తెల్లారితే పరాయి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. అంతలా మారిపోతున్నాడు….
రాత్రంతా చెవిలో ఎన్నో చిలిపి మాటలు చెప్పి కవ్వించిన నా రాజ్ ఇతడేనా? అని నేను ఆశ్చర్య పోని తడవ లేదు. ఆలోచిస్తూ అలిసి, నలిగిన మనస్సుతో నిద్రలోకి జారుకోవడం అలవాటయిపోయింది నాకు.
*****
నన్ను అమ్మతనం ఎప్పుడు వరిస్తుందో అని కూడా నా మనసుని తొలిచేస్తున్న సమస్య మరోవైపు. ఓ రోజు ఇంక
ఉండబట్టలేక పోయాను. సోఫాలో కుర్చుని పేపర్ చూస్తున్న రాజ్ కి కాఫీ అందించి ఎదురుగా కూర్చున్నాను.
‘ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ బిడ్డని దత్తత తీసుకుందామని ప్రస్తావించాను. నా వంక వింతగా చూసి, కాఫీ కప్పు
టేబిల్ పై ఉంచుతూ, “ఇలా రా,” అంటూ నా చేయిపట్టి తన దగ్గరిగా కూర్చోబెట్టాడు.
తలెత్తి సూటిగా రాజ్ ముఖంలోకి చూసాను. “మనిద్దరికీ సొంతమైన బిడ్డ కావాలి. లేదంటే ఎవరికీ సొంతంకాని అనాధ బిడ్డని మన సొంతం చేసుకుందాం రాజ్. అదొక్కటే మనకున్న ఆప్షన్,” అన్నాను కన్నీళ్ళనాపుకుంటూ.

“చూడు కలీ, మనం ఒకరికొకరం చాలు. లేదంటే నీవన్నట్టు బిడ్డని అడాప్ట్ చేసుకోను నాకు ప్రాబ్లం లేదు. కానీ పార్వతిఅమ్మ ఒప్పుకోదు. మన వంశం, మన వారసులు, మన పారంపర్యం అంటూ అదే మూసలో సాగుతాయి ఆమె పాతకాలపు ఆలోచనలు. నీవనే లాంటి ఎడాప్షన్ కి ఆమె ఒప్పుకుంటే, నాకెంతో హాయిగా ఉండును,” అంటూ బాధగా తలొంచుకొన్నాడు.
రాజ్ మీద జాలి వేసింది. ఈ వొత్తిడి వల్లనేమో, రాజ్ నాతో ఒక్కోమారు ఒక్కోరకంగా మసులుతున్నాడు అనుకున్నాను.
*****
మరో యేడాదిన్నర గడిచింది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా, వ్యాపార పరంగా అన్నీ అత్తయ్య అనుకున్నట్టే జరుగుతున్నాయి. నేను నిర్వహిస్తున్న పరిశ్రమలతో సహా లాభాలని తెచ్చిపెడుతున్నాయి. వ్యాపారరంగంలో యువరాజ్ తో సమానంగా నాకూ గుర్తింపు, అవార్డులు లభిస్తున్నాయి.
మరో నెల రోజుల్లో, మా టెన్త్ వెడ్డింగ్ యానివర్సరీయే కాక, ‘మౌర్య వ్యవస్థ’ విజయాలు సాధించిన సందర్భంగా ఇంట్లోనే వ్రతం, అన్నదానం జరిపించాలనే ప్రయత్నం మీదే ఉన్నారు అత్తయ్య. ఇటీవలే అత్తయ్య రెండో మోకాలి సర్జరీ అయ్యాక, నడక తగ్గించి, వీల్-చైర్ వాడుతూ, ఇంటినుండే ఆఫీస్ పని పర్యవేక్షిస్తున్నారు. దాంతో, మా బంగళా ఆధునీకరణ చేపట్టాము. ఇంటి లోపల, బయటా కూడా కొత్తగా పెయింట్ చేయించి, మా ‘గురుకృప’ బంగళాని చాలా అందంగా తీర్చిదిద్దాము..
*****
రెండురోజుల్లో జరగవలసిన వ్రతాన్ని, ఉన్నట్టుండి వాయిదా వేయించారు అత్తయ్య. నన్ను పిలిచి, ఊరెళ్ళిన రాజ్, అనుకున్న సమయానికి ఇంటికి రాలేక పోవచ్చునన్నారామె. నన్ను నిరుత్సాహ పడకుండా రిలాక్స్ అవ్వమన్నారు. తాను కూడా పలువురితో మాట్లాడవలసిన పనులయ్యాక, విశ్రాంతి తీసుకుంటానని, ఆఫీసు లైబ్రరీలోకి వెళ్ళిపోయారామె.
అత్తయ్య కూడా ఆదుర్దాగా కనబడ్డారు. మా పెళ్లిరోజు వ్రతం ఇలా వాయిదా పడటం ఇదే మొదటిసారి.
రాజ్ కి ఫోన్ చేస్తే, “అవును కలీ, అనుకోని పనులన్నీ పుట్టుకొస్తున్నాయి. పార్వతిఅమ్మ సలహా ప్రకారమే అన్నీ చేసుకొని లేటుగా వస్తానేమో! వ్రతం కూడా పోస్ట్ఫోన్ అవుతుందటగా! ఐ మిస్ యు కలీ, మళ్ళీ ఫోన్ చేస్తా, బై,” అన్నాడు …
అయోమయంగా ఉంది. నిద్రపట్టక, రాజ్ పక్కన లేక, ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయేమో…….
తెల్లవారక ముందే, హాల్లో నుండి పనివాళ్ళ హడావిడి, అత్తయ్య గొంతు వినబడ్డంతో, లేచి వెళ్లాను. ఇంట్లోకి అడుగు పెడుతున్న, గురువులు – సర్వేశ్వర స్వామిని, అత్తయ్య వీల్-చైర్ లోనే ఎదురు వెళ్లి ఆహ్వానిస్తున్నారు. “ఇటువంటి సమయంలో మాకు మీ ఆశీస్సులు, సలహాలు అవసరమని గ్రహించి, ఇలా దయచేశారు, కృతజ్ఞులం,” నమస్కరించారామె.
*****
హోమం, శాంతిపూజల్లో పాలుపంచుకుని దీవెనలందుకున్నాను. “అశాంతులు లేకుండా జీవితాన్ని స్వర్గతుల్యం
చేసుకో తల్లీ,” అని దీవించారు. తరువాతి రోజంతా గురువుగారితో, వారి పరివారంతో పూజామందిరంలో గడిపారు
అత్తయ్య. ఆమె ముభావంగా ఉన్నారనిపించింది. అర్ధరాత్రి దాటాక, తిరిగి, బయలుదేరి వెళ్ళిపోయారు గురువుగారు వాళ్ళు.
తెల్లారుజామునే మెలుకువచ్చింది. నిజానికి వ్రతం జరగవలసిన రోజిది. గుబులుగా, చికాగ్గా ఉంది. ఎటువంటి సమాచారం లేకుండా గురువుగారు ఎందుకు వచ్చారో అర్ధం కాలేదు. రాజ్ క్షేమమని తెలుసు. వ్యాపారాల్లో కూడా క్లిష్ట పరిస్థితులేమీ లేవు. లేచి మొహం కడుక్కుని, వెళ్లి కాఫీ కలుపుకున్నాను. తిరిగి బెడ్ మీద చేరి, రాజ్ కి ఫోన్ చేస్తే, రెస్పాన్స్ లేదు.
ఓ వైపు తెల్లారుతున్నా కళ్ళు మూసుకుని పడుకుండిపోయాను.
*****
ఎప్పటికో రాజ్ కార్ హార్న్, వెంటనే గేట్ బార్లా తీయడం వినబడి, లేచి ఆత్రుతగా ఇంటిముందు పోర్చ్ లోకి వెళ్ళాను. ఆయమ్మ చేత హారతి పళ్ళెం పట్టించుకుని నా వెనుకే వచ్చారు అత్తయ్య. ఎంట్రెన్స్ వైపు వస్తున్న కార్, రాజే డ్రైవ్ చేస్తున్నాడు. ఇలా సమయానికి రాకుండా, నన్ను ఏడిపించినందుకు, గదిలోకి తీసుకెళ్ళి రాజ్ చెంపలు వాయించాలా, ముద్దుల్లో ముంచేయాలా? దూరంగా నేట్టేయాలా, హత్తుకొని పెనవేసుకుపోవాలా? గమ్మత్తైన ఆలోచనల్లో ఉన్న నేను, కారులోంచి యువరాజ్ వెంట దిగుతున్న ఓ యువతిని, ఆమె చేతుల్లో ఉన్న పసిబిడ్డని చూసి ఉలిక్కిపడ్డాను.
ఆమెని చేయి పట్టి, మా దిశగా వస్తున్న రాజ్ ని చూసి ఒక్కసారిగా నా కళ్ళు బైర్లు కమ్మాయి. అత్తయ్య ఎదురెళ్ళి హారతిచ్చారు. నాకు అతిదగ్గరగా వచ్చి నిలబడి నా వంక చూస్తున్న రాజ్ ని చూసి, తల గిర్రున తిరిగింది. పాదాలు పట్టు తప్పి నేను కూలిపోవడం, ‘కలీ, ప్లీజ్ ఫర్గివ్ మీ.. నన్ను క్షమించు. అంతా వివరిస్తాను,” అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి, రాజ్ నన్ను భద్రంగా బెడ్ మీదకి చేర్చడం తెలుస్తుంది…అంతే…నిస్సత్తువుగా కళ్ళు మూతలు పడిపోయాయి……
**
కళ్ళు తెరిచేప్పటికి, నా బెడ్ పక్కనే ఆదుర్దాగా అత్తయ్య, నా పాదాలపై చేయి వేసి బెడ్ చివర్లో కూర్చున్న రాజ్ కనిపించారు.
నా చేయందుకుని సూటిగా నావైపు చూసారు అత్తయ్య. “చూడమ్మా, నీకేమీ కాలేదు. స్పృహ తప్పావు. ఇప్పుడు బాగున్నావు! నేరుగా విషయానికొస్తా. నిబ్బరంగా విను,” క్షణమాగారు. “దాదాపు రెండేళ్ళ క్రితం, ఫెర్టిలిటీ టెస్ట్స్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, మీకు బిడ్డలు కలగకపోవడానికి కారణం – నీలోని లోపమేనని తెలిసింది. మరో ఇద్దరు నిపుణుల చేత ఆ వివరాలు నిర్ధారణ చేయబడ్డాయి కూడా. అప్పుడే నీకు చెప్పి, నీ అనుమతి పొంది, వారసుల కోసం మరో వివాహమన్న నా ప్రస్తావనకి ససేమిరా ఒప్పుకోలేదు యువరాజ్. వాడి మనోవ్యధ నేనర్ధం చేసుకున్నాను. అయితే, మీ బాంధవ్యానికి మచ్చరాకుండా, ఒకరిపట్ల ఒకరికున్న నమ్మకం వమ్ము కాకుండా, ప్రత్యామ్నాయ మార్గం చూపితే, తను కట్టుబడి ఉంటానన్నాడు. అదలా ఉంచితే, నీలోనే లోపమన్న సంగతి నీకు వెల్లడవడం కూడా ఏమాత్రం కుదరదన్నాడు. అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ, డాక్టర్ నిరంజన్ నుండి, నానుండి మాట తీసుకున్నాడు,” క్షణమాగారు అత్తయ్య.
నా వంక ప్రశాంతంగా చూసి, చెప్పసాగారు….
“ఇక అప్పటినుండి సమస్య పరిష్కారం కోసం, రాత్రింబవళ్ళు ఆలోచించసాగాను. గురువుగారిని, జ్యోతిష్యులని సంప్రదించాను. అదే సమయంలో నా ఇయర్లీ మెడికల్ చెకప్ కోసం, ఎప్పటిలా రెండురోజులు హాస్పిటల్లో చేరాను. అక్కడ డాక్టర్ నితిన్ వద్ద వాలంటరీ వర్క్ చేస్తున్న 20 యేళ్ళ అమ్మాయి, జాబిలి తో పరిచయమైంది. కలివిడిగా మాట్లాడుతూ వెంటే ఉండి నాకెంతో సాయం చేసింది. డాక్టర్ అవ్వాలన్నది తన ఆశయమని, యేడాది రెండేళ్ళల్లో తప్పక మెడిసిన్ లో చేరుతానని మాటల్లో అన్నదామ్మాయి. జాబిలి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది.
సహాయం చేద్దామన్న ఉద్దేశంతో, యధాలాపంగా వాకబు చేస్తే, తమ ఊరి చర్చ్ వాళ్ళని ఆశ్రయించి బతుకెళ్ళదీస్తున్న
నాయినమ్మ తప్ప, ఎవరూ లేరట. ఆర్ధిక స్తోమత లేక మెడికల్ ఎంట్రెన్స్ లో రాంక్ వచ్చినా చదువు సాగలేదట.
అయితే, జాబిలి ఇటీవలే ‘సర్రొగసీ ప్రోగ్రాం’ లో తన పేరు నమోదు చేసిందని కూడా నితిన్ చెప్పాడు. బిడ్డ కోసం పరితపించే వారికి సాయం చేయాలన్న కోరిక కూడా బలంగా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకుందట. అటువంటి అవసరముండి, తన చదువుకి సరిపడా నిధులు సమకూర్చగలిగిన వారికి తను ‘సర్రొగేట్ మదర్’ పద్దతిలో బిడ్డని కనిస్తానని, సంబంధిత ప్రోగ్రాం డైరక్టర్ వద్ద తన సమచారమంతా ఉంచిందట.
జాబిలితో స్నేహం చేసి, కొన్నాళ్ళు ఆమెని గమనించాను. బాగా ఆలోచించాకే, ‘జాబిలి’ అనబడే ఆ అమ్మాయే మన సమస్యకి జవాబని, సరయిన ప్రత్యామ్నాయమని నిశ్చయానికి వచ్చాను. వెంటనే డాక్టర్ నితిన్ తో, ప్రోగ్రాం డైరెక్టర్ తో, లీగల్ అడ్వైజర్ తో, జాబిలి తోనూ సంప్రదింపులు జరిపాను,” అంటూ సున్నితంగా నా తలపై చేత్తో తాకారు అత్తయ్య.
“వింటున్నావు కదూ! నీ కోసం, మీ బాంధవ్యం కోసం నా వద్ద షరతులు పెట్టాడు యువరాజ్. వంశ పారంపర్యం కోసం నేను నిశ్చయించిన ప్రత్యామ్నాయంకి, వెంటనే ఒప్పుకోవలసిందేనని నేనూ పట్టుబట్టాను. నా మీద, నా పెద్దరికం మీద గౌరవముంచి, ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు యువరాజ్.
ఇక జాప్యం కాకుండా, వైద్యపరంగా క్లినిక్ లో ‘స్పర్మ్-డొనేషన్’ ప్రొసీజర్ లో పాల్గొనడం మినహా, రాజ్ కి ఇతర బాధ్యతలేవీ లేకుండా, వ్యవహారమంతా సజావుగా జరిపించానమ్మా,” అలసటగా కుర్చీలో వెనక్కి వాలారు అత్తయ్య.
**
మరునిముషంలో ముందుకు లేచి, “చూడమ్మా కళ్యాణీ, నేను నా పదహారో యేట జనార్ధన్ని పెళ్లి చేసుకొని కోడలిగా ఇంట అడుగుపెట్టాను. యాభైరెండేళ్ళుగా కుటుంబ శ్రేయస్సుకి, మౌర్య వ్యవస్థ కీర్తికి పాటుపడ్డాను. వందకోట్ల ఆస్థి, ఈనాడు వేలకోట్ల వ్యవస్థగా మారడంలో నా హస్తం ఉంది. వంశోద్ధారకుడి కోసం నా జీవితాన్ని, భర్త ప్రేమని త్యాగం చేసాను. నాకిప్పుడు అరవైయెనిమిది సంవత్సరాలు. మీ విషయంగా నేను చేసిన ఈ పని, నీ సుఖం కోసమేనమ్మా. నీ మీద నమ్మకంతోనే, నీ ఈ లోపాన్ని పూడ్చి, మీ జీవితాలని సంపూర్ణం చేసాను తల్లీ. గ్రహించుకో,” నవ్వుతూ నా వంక చూసారామె.
“వ్రతమయ్యాక, మీ చైనా ట్రిప్ కి ముందే అన్ని విషయాలు శాంతంగా, నీకు విన్నవించుదామని అనుకున్నాము. అలా కుదరలేదు. మీరు టూర్ లో ఉండగా, ‘గురుకృప’ లో అడుగిడవలసిన మీ వంశోద్దారకుడు, ఎమర్జెన్సీగా ముందే రావాలనుకున్నాడు. గురువుగారు పెట్టిన ముహూర్తానికి పసివాడిని తప్పక ఇంటికి తెచ్చుకోవాలి కనుక, రాజ్ వైజాగ్ నుండి వస్తూ, హాస్పిటల్ కి వెళ్ళక తప్పలేదు.
రేపు గురువుగారే మీచేత హోమం, వ్రతం చేయిస్తారు. పోతే, జాబిలి నెలరోజుల్లో అమెరికా వెళ్ళిపోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కూడా. నీ కెటువంటి బెంగా అవసరం లేదు. నేను చెప్పవలసింది కూడా ఇక ఏమీ లేదు,” అంటూ పైకి లేచి రూమ్ బయటకి నడిచారామె.
విన్నదంతా ఆకళింపు చేసుకోలేక కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను.
**
మళ్ళీ కళ్ళు తెరిచేప్పటికి, నా ఎదురుగా కూర్చున్న రాజ్ ని చూసి దుఃఖం ఆగలేదు. తను కూడా చమర్చిన కళ్ళతో నా
చేయందుకున్నాడు. “ఫర్గివ్ మీ ప్లీజ్, కలీ. నిన్ను నొప్పించకూడదనే, నీ నుండి నిజాన్ని దాచాను. నా నిర్ణయం తప్పైతే క్షమించు. ఎడాప్షన్ కి పార్వతి అమ్మ ఒప్పుకోలేదు. అందుకే ఇలా,,,” దుఃఖంతో తల దించుకున్నాడు. అతనలా దుఃఖించాల్సి రావడం తట్టుకోలేను. నా రాజ్ ని నేనే ఓదార్చాలి! మేమిరువురం ఒకరికొకరం! రాజ్ కోసం, రాజ్ ధ్యాసలోనే జీవించాలి.****

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద

అందమైన ప్రేమ కధకు చక్కని శైలిలో ఆధునిక సాంకేతికత జోడించి అ౦ది౦చిన కధ ఇది. కథా? స్వప్నమా అనిపిచే౦త మ౦చితనం ప్రతి పాత్రలో నిక్షిప్త పరచారు రచయిత్రి. ప్రేమ కధతో ఆర౦భి౦చి పెళ్లి కోరిన కొడుకు వరకూ నడిపించి ఒక చక్కని ఫీల్ గుడ్ మూడ్ లోకి చదువరులను నడిపిస్తు౦ది కధ. పాత్ర చిత్రణ గొప్పగా వు౦ది. ఇంతటి పరిపూర్ణత ఎంత మ౦దికి సాధ్య౦? మ౦చి కధను అ౦ది౦చారు రచయిత్రి.

5 thoughts on “నిరంతరం నీ ధ్యానంలో (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *