April 20, 2024

మాయానగరం – 19

రచన: భువనచంద్ర

ఉపన్యాసాలు రకరకాలు. ఊకదంపుడివి కొన్నైతే, ఉత్తేజాన్ని కలిగించేవి కొన్ని. కొన్ని వినోదప్రదానంగా సాగుతాయి. వాటిలో’విషయం ‘ ఉండదు. కానీ వినే జనాలు మాత్రం ఆనందిస్తారు. జిడ్డు ఉపన్యాసాలు ఓ రకం. వీటిల్లో వ్యక్త మాటిమాటికి ‘ఊత ‘ పదాన్ని వాడుతూ వుంటాడు. వీటిని జనాలు ఎంజాయ్ చేస్తారు…. ఎందుకంటే కొంతమంది ఊతపదాన్ని ప్రసంగం మొత్తంలో ఎన్నిసార్లు వాడాడో లెక్కవేయడం ద్వారా. వాళ్ళ ద్యాస అంతా ఊతపదం మీదే తప్ప ఉపన్యాసం మీద వుండదు. కొందరి ఉపన్యాసం విపణిలో ధరవరల్లా అంటే.. కొందరిది చాలా నెమ్మదిగా చాలా నిరుత్సాహంగా సాగుతుంది. కొందరు ఉపన్యాసం ఇవ్వడం ‘హక్కు’గా భావించి శ్రోతల్ని పీల్చిపిప్పి చేస్తే, కొందరు గబగబ నాలుగు మాటలు చెప్పేసి ‘అమ్మయ్య ‘ అని కుర్చీలో కూలబడతారు. ఏది ఏమైనా ఉపన్యాసాలు తప్పనిసరి దినుసులయ్యాయి. ఏ వుపన్యాసాన్ని ఎవడూ సీరియస్ గా తీసుకోడనేది మాత్రం నిర్వివాదాంశం.
బోసుబాబు ‘సేవ ‘ గురించి మాట్లాడితే, శామ్యూల్ రెడ్డి ‘విద్య ‘ గురించి మాట్లాడాడు. ఓ రాజకీయనాయకుడు ప్రజలూ మైకూ దొరికాయి కదా అని తమ ‘ అధినాయకుడ్ని ‘ వీడి లెవల్లో పొగిడితే, మరో చోటా నాయకుడు అపోజిషన్ పార్టీ మీద ఆముదం జోకులు వేశాడు. ‘గురువు ‘ గురించి విషయం తక్కువా, గుర్తింపు గురించి ఎక్కువగా సాగాయి నాటి గురుపూజోత్సవ ఉపన్యాసాలు. లేడీ టీచర్స్ వరుసగా కుర్చీలో కూర్చొని వుంటే విద్యార్ధులు వచ్చి పాదాభివందనాలు చేసి ‘గిఫ్ట్లు ‘ ఇచ్చారు. బోసుబాబు స్వయంగా, స్వయం హస్తాలతో అందరికీ పట్టు చీరలు, జాకెట్లు పసుపు, కుంకుమ పాకెట్లు అందించాడు. ఆ తరవాత గుడిసెలలో సిటీలోని గుడెసెదారిణికి చీరల ప్లాస్టిక్ బిందెల పంపకం సదరు వేదిక మీద ఆసీనులైన ‘ప్రముఖుల ‘ చేతి మీదుగా జరిగింది. ఎక్కువ మంది శామ్యూల్ ని పొగిడారు. కారణం.. టీచర్లు కూడా తలో రెండు నిమిషాలు ‘స్పీచ్ ‘ ఇవ్వడం. దాంతో శామ్యూల్ ఆకాశంలో వున్నాడు. ఇక బోసుబాబైతే ఎక్కువ చీరల్ని బిందెలని ‘శోభా రాణి ‘ చేతుల మీదుగా ఇప్పించాడు. ఆ విషయం శామ్యూల్ రెడ్డితో బాటు అందరూ గమనించారు. ముఖ్యంగా గుడిసెలవాళ్ళు. త్వరలో శోభరాణి తమకి అప్రకటిత నాయకురాలు అవుతుందని కూడా అనుకున్నారు. రాజు భార్య రాణీనేగా!
సారా చావుల సంగతి ఆల్మోస్ట్ అందరూ మనసులోనుంచి తీసేసుకొని, బోసుబాబుని పొగడ్తలతో నిమగ్నమయ్యారు. “నిన్నటి సంగతి మరచినవాడే నేడు బతకగలడు ” అన్న నిజాన్ని గ్రహించడమే ముక్తిపొందడం అంటే.
కల్తి లేని నిఖార్సైన సారా తాగిన జనాలు నిశ్చింతగా నిద్రపోయారు. నిద్రాదేవి ఎంత గొప్పదీ ! కోటీశ్వరుడ్ని కూలీవాడ్ని కూడా తన కౌగిట్లోకి లాకుంటుంది. కమ్మని కలల తలుపులు తెరుస్తుంది….. అదే రోజు రాత్రి….
*************
“ఒరేయ్ వెంకటస్వామి… వంటల్లో నువ్వు ఎక్ స్పర్ట్ వేరా! సూపర్. కానీ మోనే (బిడ్డ అని అర్ధం మళయాళం లో ) నిన్ను చంపక తప్పదురా. అయితే ఇవ్వాళ కాదు. నువ్వు చేసిన వంట మధ్యాహంచ తిన్నా, రాత్రికి తినబోతున్నా. నువ్వు వేసిన ఉప్పు తిని నీ ప్రాణాలకు ముప్పు తేకూడదుగా. ! అయితే ఎండె కరళే (అయితే నా హృదయమా అని అర్ధం మళయాళం లో) నిను వదిలెయ్యాలనీ వుందిరా. రేపో ఎల్లుండో మహదేవన్ పైకి పోక తప్పదు. అప్పుడు నందిని విలాస్ కి నీలాంటి ఏ- 1 వంటోడు ఎక్కడి నుండి దొరుకుతాడు? కనుక ప్రస్తుతానికి నీ మీద హత్యప్రయత్నం కాన్సిల్. ఇదిగో ఇద్దరం ఫ్రండ్స్. ఓ.కే. హాయిగా తాగుద్దాం… హాయిగా తింద్దాం. హాయిగా నందిని గురించి కలలు కంద్దాం! ” మహా ఫ్రండ్లీగా వెంకటస్వామి భుజం మీద చెయ్యి వేసి అన్నాడు పరమశివం.
గొంగళి పురుగు భుజం మీద పడ్డంత అసహనంగా ఫీల్ అయ్యాడు వెంకటస్వామి.
వీళ్ళని ‘ విందు వంటల ‘ కోసం గా.మో.క వీధికి పంపించింది మహదేవనే. బోసుబాబు వంటల గురించి ఆలోచిస్తుంటే అతనికి మహదేవన్ గుర్తుకొచ్చాడు. మహదేవన్ నిఖార్సైన మళయాళీ, అత్యాశకు పోడు. అందుకే అతనికి ఆర్డర్ ఇచ్చాడు. మహదేవన్ బోసుబాబుతో అన్నీ మాట్లాడి, తన బదులుగా వంట చేయడానికి సర్వింగ్ కీ స్టాఫ్ ని పంపాడు. మెయిన్ ఆంధ్రా వంటలు వెంకటస్వామి చేస్తే స్వీట్లు, చిప్సు, కూటు, అవియల్… ఇలాంటివి పరమశివం చేశాడు.
“చూశావా! హాయిగా తాగారా ప్రాణానికే భయం లేదూ అన్నా నువ్వు తాగలేకపోతున్నావ్ ! అదీ…. భయం అంటే…ఎస్… నాక్కావల్సింది అదే. చచ్చేదాక చచ్చినట్లు ఇలా నాకు భయపడుతూనే వుండాలి. ఎప్పుడేం జరుగుతుందో అని వణకిపోతూ వుండాలి. ఇంకోటి తెలుసా? నువ్వు పారిపోవాలన్నా పారిపోనివ్వను. ఎక్కడకి పారిపోయావో నాకెలా తెలుస్తుంది? నా పద్ధతులు నాకున్నాయి. లేడి పరిగెట్టి పరిగెట్టి వేడెక్కితేగాని, దాని రక్తం వేడిగా వుండదు. పులి అందుకే లేడిని పరిగెట్టిస్తుంది. అచ్చం నాలాగే!.. హి..హి..హి.. నేను టైగర్ పరమశివాన్ని. ” అంటునే జేబులోంచి బాటిల్ బయటకు తీసి “ఇదిగో.. ఇది సీలు విప్పని బాటిల్… పోనీ నువ్వే ఓపెన్ చేయ్. ఇవ్వాళ్టికి ఇద్దరం హాయిగా తాగుద్దాం ! ” అన్నాడు.
గదిలో పెట్టి తలుపులు వేస్తే పిల్లి అయినా ఎదురు తిరుగుతుంది. అంతకు ముందే వెంకటస్వామి ఓ నిర్ణయానికి వచ్చేశాడు. అందుకే మాట్లాడకుండా బాటిల్ ఓపెన్ చేసి సగం తన గ్లాస్ లో పోసుకొని మిగతాది అతని చేతికిచ్చేశాడు.
“నాకూ పొయ్యొచ్చు కదా? ఓ.కె. ఎవరి ప్రెస్టేజి వాళ్లది. ” తనే గ్లాస్ లో పోసుకుంటూ కిసకిసా నవ్వాడు పరమశివం.
రాత్రి రెండింటి వరకు ఇద్దరూ తాగుతూనే వున్నారు కారణం ఇద్దరికి ఫుల్ బాటిల్ బోస్ బాబు ‘గిఫ్ట్ ‘ గా ఇవ్వడం వల్ల.
“ఇవ్వాళ ఏదో ఒకటి తేలిపోవాలి” మనసులో అనుకున్నాడు వెంకటస్వామి. “కానీ ఎలా ” మళ్ళీ ఓ ప్రశ్న లోపలే.
“బాగా వంట చేశారండి… ముఖ్యంగా ఆ సాంబారు… దాన్సిగదరగా.. బ్రహ్మాండంగా వున్నాదండి. ఎప్పుడో చిన్నప్పుడు నెల్లూరు కోమలా మెస్ లో అడిగి అడిగి మరీ ముంతెడు సాంబారు వేయించుకున్నానండి. మళ్ళీ నిన్నండి… అన్నట్టు బీడీ తాగుతారేంటండీ? “ఆప్యాయంగా బీడీ కట్ట అగ్గిపెట్టే వాళ్ళ ముందు పెట్టాడో పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు కూరలు నీళ్ళు సప్లై చేసిన శంఖుచక్రాపురం ఆదినారాయణ. ముప్పై ఏళ్ళుంటాయి.
“థాంక్యూ ఆదినారాయణ ” అని బీడీ వెలిగించాడు వెంకటస్వామి.
“అన్నట్టు ఎల్లుండ మాపక్కూళ్ళో ఓ గొప్ప కూటమి జరగబోతాందండి. వత్తారేటండి? ” అడిగాడు ఆదినారాయణ.
“మేం మా హోటెల్ కెళ్ళిపోవాలా ” ముక్తసరిగా అన్నాడు పరమశివం.
“అయితే సరేనండి.. కానీయండి….మీరు కనక మా వూరొచ్చి ఉత్త ఇడ్లీ సాంబార్ స్టాలు పెట్టారనుకోండి. రోజుకి ఐదు వేలు వీజీగా సంపాయించొచ్చండి. అసలు మీ సాంబారుతో పోటీకొచ్చేది ఈ జిల్లాలోనే లేదండి. వస్తానంటే చెప్పండి. ఫాదర్ గార్లందరూ నాకు తెలిసినోళ్ళేనండి. ” కన్వీన్స్ చేసే ప్రయత్నంలో అన్నాడు ఆదినారాయణ.
వెంకటస్వామికి ఆశపుట్టింది. రోజుకి ఐదు వేలు. !
“కూటమి ఎన్ని రోజులు?”అడిగాడు.
“మూడు రోజులండి. ”
“పరమశివం కూటమికి వెళ్దాం. మన విషయాలు పక్కన పెడితే, యీ ఛాన్స్ మళ్ళీ రాదు.ఇడ్లి వడ ఉప్మా లాంటి టిఫిన్స్ పెడదాం. ఆదినారాయణ గారి సహాయం తీసుకుందాం. మనకొచ్చే లాభాలలో వారికి కొంత శాతం ఇద్దాం. సంపాదించుకున్నదాంట్లో కొంత యజమానికి పోగా మిగతాది మన జేబు ఖర్చుకుంటుంది. ” రిక్వెస్ట్ గా అన్నాడు వెంకట స్వామి.
“సరే.. సరే.. ఎందుకు కాదనాలి? ” నాకు మరో మూడురోజుల వినోదం. భేష్.. పొద్దుటే ఓనర్ కి ఫోన్ చేసి చెబుద్దాం ” నవ్వి అన్నాడు పరమశివం.
ఆదినారాయణకి వీళ్ళ సంభాషణ ఏదీ అర్ధం కాలేదు గానీ, ఏదో మతలబు వున్నదన్న విషయం మాత్రం తెలిసింది. లాభాలలో ‘ షేర్ ‘ ఆశించి అతను వీళ్లని రమ్మనలేదు. మరోసారి ‘సాంబార్ ‘ ని ఫుల్ గా పట్టొచ్చుకదా అని అడిగాడు. షేర్ కూడా ఇస్తామంటున్నారు. ఇంకేం కావాలి?

*************
కళ్ళు మనసుకు వాకిళ్ళు…. కలలకు కన్నీళ్ళకు లోగిళ్ళు. ఆనందరావు ఇంటి వైపు వైపు వెళ్తున్న మదాలసకి ఆనందరావు మరో ఆడదానితో చిన్నగా, కొద్దిగా కుంటుకుంటూ ఎదురు వస్తుండటం కనిపించింది. ఆమె గుండెలో రాయి పడింది. ‘వెంట వచ్చే ఆమె ఎవరు? అందగత్తే… సరోజ అంత కాకపోవచ్చు. సరోజది ఆకర్షణతో కూడిన అందం అయితే యీమెది విజ్ఞానంతో కూడిన అందం. హత్తుకోవాలనే అందం సరోజదయితే హుందాగా వుంచే అందం యీమెది. ఆశ అడియాశేనా? ‘ అనుకుంటుండగానే ఆనందరావు ఆమెను చూసేశాడు.
“నమస్తే మదాలస గారు! వీరు మాధవి గారు. మాకు పరిచయం వున్న శోభరాణి గారికి ఇవాళ గురుపూజ. అందుకే అందరం వెళ్తున్నాము. మీరొస్తే మరీ సంతోషం. “అన్నాడు ఆనందరావు నవ్వుతూ. ఆ నవ్వు నిష్కల్మషంగా వుంది.
“ఇంకేం మరి? ” అని నవ్వి తనూ వాళ్ళతో బయలుదేరింది. ఇలా జరగటం మదాలసకి చాలా ఆనందాన్ని కలగజేసింది. కారణం ఆనందరావుకి మాధవి మధ్య వున్న ‘రిలేషన్ ‘ ఏమిటో, ఎంత గాఢమైనదో తేలిగ్గా తెలుసుకోవచ్చు. సంబంధం గనక ‘మంచి ‘ దయితే మాధవి ద్వారానే అనుకున్న పని సాధిచుకోవచ్చు అని.
“దేవతా, భక్తుడూ ఒకేసారి వచ్చారే ! ” పెద్దగా నవ్వుతూ అన్నది సుందరీబాయి. ఆ మాట విన్న మదాలసకి షాక్.
“సుందరీజీ..దేవుడు భక్తుడు వేరు కాదు. ఒకరు కనికరించేవారు, ఇంకొకరు కరుణించబడేవారు. ఏదైనా దేవుడు లేకుండా జీవుడు లేడు కదా. జీవుడి అస్తిత్వమే దేవుడు…. కనుక మాధవిగారు నిజంగా దేవతే. లేకపోతే ఇలా నడచి రాలేను కదా? ఏమండోయ్…. దేవతకి మీరు స్నేహితురాలు కాబట్టి మీది దేవతల స్థానమే. ! ” నవ్వి అన్నాడు ఆనంద రావు.
మాధవి మొహం ఓ తెలియని ఇబ్బందితో ఎర్రబడింది. అది సుందరి గమనించినా గమనించనట్లు “ఓహ్… అయితే నేనూ దేవతల లిస్ట్ లో చేరిపోయినట్లేగా!… హి..హి..హి… భక్తా… ఇక నుంచి ఈ దేవత చూపుల నుంచి తప్పించుకోలేవు. ” అన్నది. సదంగా మదాలస సుందరి కేసి చూసింది. సుందరి కళ్ళలో విపరీతమైన కాంక్ష, పగ…. ఒకేసారి మెరుపులా మెరిశాయి.
********
“షీతల్…మావగారికి బాగోనందు వల్ల సుందరి గురు పూజ ఫంక్షన్ కి వెళ్ళింది. యీ మద్య ఆవిడ నిఘా వల్ల మనసారా మాట్లాడుకోలేకపోయాం. ఇప్పుడు చెప్పు…. నిన్ను సుందరి భీకరంగా హింసిస్తోంది కదూ? ” షీతల్ వంకే చూస్తూ అడిగాడు కిషన్ చంద్ జరీవాలా.
“కిషన్ జీ! ఆవిడ పెట్టే బాధల కన్నా, మిమ్మల్ని, నన్ను దూరం చేయలేదన్న ఆనందమే నాకు ముఖ్యం. ఆవిడ మనసులో ఏమైనా వుందనివ్వండి, నన్ను మా వూరు పంపలేదు కదా? “ఓ రకమైన తృప్తితో కిషన్ చంద్ ని చూస్తూ అంది షీతల్.
“షీతల్…నువ్వు దగ్గరయ్యేవరకు నిజంగా ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. జీవితం పగలు రాత్రిలా సాగిపోయింది. నువ్వొచ్చాకే ‘మనిషికి తోడు ‘ అంటే అర్ధమైంది. “సిన్సియర్ గా అన్నాడు కిషన్ చంద్.
“బాబూజీ ! “కిషన్ దగ్గరకెళ్ళి అతని ముఖాన్ని గుండెల మీద కి తీసుకొని తల నిమరసాగింది షీతల్.
కిషన్ కి చిన్నప్పుడే చనిపోయిన తల్లి జ్ఞాపకం వచ్చింది రెండు చేతులతో ఆమెను చుట్టేశాడు. సర్వసాక్షి దేవుడు అన్నీ చూస్తూ వుంటాడంటారు. చూస్తూనే వుండాలి మరి !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *