April 25, 2024

లైఫ్ ఈజ్‌ బ్యూటిపుల్ – (తరాలు – అంతరాలు)

రచన: మణి వడ్లమాని

“చదువులు కూడా కొత్త తరం భార్యభర్తల్లో కాస్తంత సర్దుబాటు తత్వాన్ని నేర్పించలేకపోతున్నాయి. లక్షల సంపాదన ఇద్దరిలోనూ ‘నేను’ అనే అహంభావాన్ని పెంచి పోషిస్తోందేమో తెలియదుగాని. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూడటం… ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకోవడం… ఇక కలిసుండలేమంటూ కోర్టు మెట్లెక్కడం.. వెరసి పెళ్లైన మూణ్ణెల్లకే విడాకులకు అర్జీ పెట్టుకోవడం. వాస్తవాలకు దూరంగా ఆలోచించడం. ఊహా ప్రపంచంలో విహరించడం వల్ల ఇద్దరి ఆలోచనల మధ్య ఎక్కువ వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి.”

‘నా లైఫ్ ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు. వెన్నెల రాత్రులు, కాండిల్ లైట్ డిన్నర్లు కాస్తా బిజినెస్ మీటింగ్స్ తోనూ, రిపోర్ట్స్ తయారు చేయడంతోనే గడచి పోతాయని, స్వీట్ నథింగ్స్ చెప్పాలిసిన ఫోన్స్ లో టెలికాన్ఫెరెన్స్ లు మాట్లాడవలసి వస్తుందని అస్సలు అనుకోలేదు.

వాలెంటైన్స్ డే కి ఒక బోకే కొని తేవాలని ఉన్నా, అరగంట టైం తినేస్తుందని దానికన్నా ఇంటికి వచ్చి నీతో గడపటం, ఎక్కువ అనుకోని, వట్టి చేతులతో వచ్చాను. అది అర్ధం చేసుకోకుండా నువ్వు ఎంత పెద్ద గొడవ చేసావు. దాంతో మనిద్దరి మధ్య మాటలు బంద్. నేనేమో ఇంటికి ఆకలితో వచ్చాను. నువ్వు ఆఫీస్ నుండి తొందరగా వచ్చేసి బయటకు వెళదామని ప్లాన్ చేసావు. నాకు తెలుసు నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసావో, ఎన్ని వాట్సన్ప్ మెసేజ్ లు పెట్టావో. కాని వీడియో కాన్ఫరెన్స్ మధ్యలో ఉన్నాను. అందులో అది COO తో డైరెక్ట్ మీటింగ్. ఇవేమీ నీకు తెలియని వి కావు. నేను ఎన్ని కలలు కన్నాను, ఎలా ఉండాలి అనుకున్నాను. కాని ఎలా? దీనికి సొల్యుషన్ ఏంటి? మైండ్ అంతా బ్లాంక్ అయిపొయింది.’ అని తన లో తను అనుకుంటోంది లాస్య.
***
అప్పటికే మొహం చిన్నది చేసుకొని హాల్ లో లాప్టాప్ పట్టుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చొన్నాడు ఆరవ్. లాస్య మీద చాలా కోపంగా ఉంది.
పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ వాలంటైన్ డే అని సర్ప్రైజ్ గా ‘నక్షత్ర’ డైమండ్ రింగ్ తీసుకున్నాడు.
డిన్నర్ కి ‘అదా-తాజ్ ఫలక్ నామా హోటల్’ లో టేబుల్ రిజర్వు చేసి ఉంచాడు. ఈ స్పెషల్ డే రోజున లాస్యకి చూపించాలి అన్న కోరికతో,
కాని అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి. ముందే చెప్పి ఉంచాను తనకి, “ఆరోజు వేరే కమిట్‌మెంట్స్ పెట్టుకోవద్దు. మొహమాటపడకు, స్మార్ట్ వర్క్ చేయడం అలవాటు చేసుకో”, అని చెప్పినా, వినలేదు. “అలా బాగుండదు , ఆరవ్ నా వర్క్ ని వేరే వాళ్ళమీద తోసేయలేను” అని అంది.
ఇలా ఇద్దరూ చెరొక చోట కూచుని లోలోపల ఉడికిపోతున్నారు. లాస్య రెండుసార్లు ట్రై చేసింది. ఆరవ్ ని పలుకరించడానికి. కాని ఆరవ్ కొంచెం కూడా చలించ క పోగా అక్కడనుంచి లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
ఆ చర్యకి ఒక్క సారిగా లాస్య కళ్ళలో నీళ్ళుతిరిగాయి. ఛీ ఛీ మరి ఇంత అవమానమా? అనుకుని తను కూడా ఇంకో బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది.

సాయంత్రం నుంచి వరుస మీటింగ్ లతో అలిసి పోయిన లాస్యకి నీరసం వచ్చి, నిస్త్రాణ అయిపొయింది. అదిగాక ప్రతి నెల వచ్చే కడుపు నొప్పి , అసలు ఆ సమయంలో ఎంతో ప్రశాంతంగా ఉండాలి అంటుంది డాక్టర్. కాని అదే అస్సలు కుదరటం లేదు. ఫిజికల్ పెయిన్ తో పాటు మెంటల్ గా డిస్టర్బ్ అవడంతో లాస్య కి దుఖం తన్నుకు వస్తోంది.
పెళ్లి కానప్పుడు ఎంత ప్రేమగా ఉండే వాడు. తలనొప్పి గా ఉందని ఫోన్ లో చెబితే చాలు ఆల్ ది వే మాదాపూర్ నుంచి శ్రీనగర్ కాలనీకి ఇంటి కి వచ్చేసే వాడు. ‘ఏంటి తలనొప్పా! ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది’ అని తెగ హడావుడి పడిపోయే వాడు.
నాన్నగారు, అమ్మని చూస్తూ కళ్ళ సైగలు చెయ్యడం, నాకు ఏదో మొహమాటంగా ఉండేది. అందులో అది తెలిసిన వాళ్ళ సంబంధం అవటంతో అతను ఏ టైం లో వచ్చినా కూడా ప్రాబ్లం ఉండేది కాదు.
పైగా తనకున్న హెల్త్ కాన్షస్ చూసి ఇంట్లో అందరూ కూడా మెచ్చుకునేవారు. భలే చూసుకునే వాడు. మరి ఈ రోజు మాత్రం చాలా సీరియస్ గానే ఉంటున్నాడు. రెండు మూడు సార్లు అడిగినా గాని చెప్పలేదు. తను కూడా కావాలని చెయ్యలేదు కదా ! తను సేం ప్రొఫెషన్ లో ఉన్నవాడు! తనకు తెలియదా అందులోని సాధకబాధకాలు? ఆలోచిస్తూనే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.
ఆరవ్ ఆలోచిస్తూ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. అతని కళ్ళు లాస్య కోసం వెతికాయి. ఎక్కడా అలికిడి లేదు.ఆ పక్క బెడ్ రూమ్ తలుపు మూసి ఉంది. తలుపు తట్టి పిలుద్దామని, చెయ్యి తలుపు మీదకి వెళ్ళింది. కాని అంతలోకే వెనక్కి తీసుకోని, రూమ్ లోకి వెళ్ళిపోయాడు

***
సెల్ మూగడంతో ఉలిక్కిపడి లేచాడు ఆరవ్, మోగుతున్న సెల్ ని ఆన్ చేసి “హలో” అన్నాడు, అవతల పక్కనుండి లాస్య డాడి రవికాంత్ లైన్ లో. “హలో ఆరవ్ ఓ సారి ఇంటికి రా” అని పొడి పొడి గా చెప్పారు. ఓ హాయ్, హలో ఏవి లేవు, ఆ టోన్ కూడా చాలా డ్రైగా ఉంది, ఎప్పుడులా ప్రేమగా లేదు
.
అప్పుడు ఫ్లాష్ లా తోచింది వెంటనే గభాల్న మంచం దిగి ఇల్లంతా వెతికాడు, లాస్య కోసం. ఎక్కడా కనిపించలేదు. మొత్తం ఇల్లంతా కలియదిరిగాడు. అప్పుడు అర్ధమయింది. ‘ఛీ నేనుఎంత ఫూల్ ని లాస్య వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసారంటే అర్ధం, తను అక్కడకి వెళ్లిపోయి నా మీద వాళ్ళ కి కంప్లైంట్ చేసిందని’ .

అయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏన్నో జరుగుతాయి అంతమాత్రానికే అలిగి వెళ్లి పోతుందా? చిన్నపిల్లలా వాళ్ళ డాడికిచెప్పడం ఏంటి అనుకుంటూ , కారు తీసుకుని లాస్య వాళ్ళింటికి బయలుదేరాడు.

కింద కార్ పార్క్ చేసుకుని లిఫ్ట్ లో ఫోర్త్ ఫ్లోర్ లోకి వెళ్ళాడు, వాళ్ళింటి ముందు నిల్చొని కాలింగ్ బెల్ నొక్కాడు. లోపలనుండి లాస్య వాళ్ళ అమ్మ సుధ వచ్చి తలుపు తీసింది. “రా ఆరవ్! ఎలా ఉన్నావు” అని అంటూ ‘లాస్యా, ఆరవ్ వచ్చాడు కాఫీ తీసుకుని రా’ అని చెప్పింది.

హాలులోనే ఎదురుగా సోఫా లో రవికాంత్ కూర్చొని ఉన్నాడు. అతని దగ్గరగా వెళ్లి కొద్దిగా వంగి పాదాలు తాకబోయాడు, “Its ok, కూర్చో ఆరవ్ “అని అన్నాడు రవికాంత్
.
కాఫీ కప్ తో లాస్యవచ్చింది. అక్కడున్న టీ పాయి మీద ఠక్కున పెట్టి గిర్రున లోపలి వెళ్లి పోయింది. అది చూసిన ఆరవ్ కి మండిపోయింది. తనకి హాయ్ చెబుదామని నోరు తెరిచిన అతను మొదట షాక్ తిన్నాడు , ఆ వెంటనే లేచి నిలబడ్డాడు వెళ్ళిపోవడానికి! చాలా అవమానంగా తోచింది.

అప్పుడు రవికాంత్ అన్నాడు “లాస్య కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందని”. రవికాంత్ నోట్లోంచి అది వినగానే “నేను అంటే ఇష్టం లేకపోతే ఇంక రానే రావద్దని చెప్పండి తనకి” అని ఆరవ్ కొంచెం కోపంగా గట్టిగా అన్నాడు.“చూడు ఆరవ్ ఒకవేళ, మీకిద్దరికి సరిపోవటంలేదంటే చెప్పు ఇప్పుడే లీగల్ గ ప్రోసిడ్ అవుదాం. ఈ రోజుల్లో ఇది కామన్ అయిపొయింది నాట్ ఏ ప్రోబ్లం” అని రవికాంత్ అన్నాడు.

“వండర్ ఫుల్ అంకుల్, ఎవరన్నా పెద్ద్దవాళ్ళు అసలు ఏం జరిగింది, తప్పు ఎవరి పక్క నుండి జరిగినా కలిసి ఉండండి అని సర్ది చెబుతారు, లేదా ప్రయత్నం చేస్తారు, మీరేంటి, చిన్న విషయానికి ఏకంగా డైవోర్స్ తీసుకోమని చెబుతున్నారు.సరే మీరే అలా అంటే నాకేంటి? నాకు అవసరంలేదు. గుడ్ బై” అని ఎదురుగా ఉన్నటీ పాయిని విసురగా తన్నుతూ లేచాడు. ఆ ధాటికి దాని మీద ఉన్న కాఫీ కప్ కాస్త కింద పడి ముక్కలయింది.
“ఆ కాఫీ కప్ లాగా నా జీవితం కూడా ముక్కలు చేసావు రాక్షసి, అంటూ గట్టి గా అరుస్తున్నాడు. నిన్ను ఎంత ప్రేమించాను, చిన్న విషయానికి పెద్ద గొడవ చేస్తావా? లాస్యా ఐ లవ్ యు, నన్ను వదిలి వెళ్ళకు, లాస్యా ప్లీజ్, , లాస్యా……….”

గబుక్కున కళ్ళు తెరిచాడు, తనకెంతో ఇష్టమైన “క్లైవ్ క్రిస్టియన్” పెర్ఫ్యూమ్ వాసన వస్తోంది. అంటే లాస్య వెళ్లి పోలేదా? అని మంచం దిగబోతుంటే , బేబీ పింక్ చుడిదార్ లో గులాబిలా తన ఎదురుగా కనిపించింది. వెంటనే లేచి వెళ్లి సుడిగాలిలా ఆమె ని చుట్టేసి “ డోంట్ లీవ్ మి” అంటూ తప్పి పోయిన చిన్నపిల్లాడిలా అన్నాడు.

ముందు ఒక్క క్షణం, ఏం జరుగుతోందో తెలియలేదు కానీ ఆరవ్ చర్య తో అర్ధమయింది లాస్య కి “ఏంటి ఏదైనా బాడ్ డ్రీం వచ్చిందా?” అని అంది. అవునని తల ఊపి “ఐ యాం సారీ లాస్యా , నిన్న మనం ఎంజాయ్ చెయ్యలేకపోయాం అనే ఫ్రస్ట్రేషన్ లో నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ డియర్”
“ఓకే ఒకే. ఇట్ ఈస్ ఫైన్. మనం ఇప్పుడు చాలా కుషీ గా ఉన్నాము యు నో వాట్ , మా COO నాకు నిన్నటి వర్క్ గురించి ఎంతో చక్కటి అప్రిషియేషన్ మెయిల్ పెట్టాడు. ఇట్స్ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఆరవ్, ఇదిగో చూడు” అంటూ చూపించింది తన ఐ ఫోన్ లో.

అది చదివి “గ్రేట్ లాస్య, రియల్లీ గ్రేట్, ఎలాగు ఇవాళ వీక్ఎండ్ కాబట్టి నిన్నటి ప్రోగ్రాం ఇవ్వాళ్ళ ఎంజాయ్ చేద్దాము” అంటూ చిన్నపిల్లాడి లా ‘లైఫ్ ఇస్ బ్యూటిపుల్’ పాటపాడుకుంటూ బాత్ రూమ్ లోకి వెళుతున్న ఆరవ్ ని మురిపెంగా చూసుకుంది.

ఆరవ్ కిలాంటి పీడకల రావడానికి గల కారణం నిన్న జరిగిన సంఘటన. అది ఇంకోసారి గుర్తుకి తెచ్చుకున్నాడు.
నిన్న, పొద్దుట నుంచి వంశీ అదోలా ఉన్నాడు . ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదు . ఆఖరికి లంచ్ టైం లో వాడిని బలవంతం చేస్తే చెప్పాడు. “రూప డైవోర్స్ కావాలంటోంది” అని అన్నాడు.
“అంతగాను మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమున్నాయి రా?”
“ఏం లేదు ఆల్ ది టైం తన తో సస్పెండ్ చెయ్యాలి, తను చెప్పిన మాట వినాలి. మొన్న టి కి మొన్న సినిమాకి tkts Imax లో దొరకలేదు, వేరే చోట తీసుకున్నా, అది నచ్చలేదు, సో అది నా ఫెయిల్యూర్ గా తీసుకుంది. దానికి పెద్ద ఆర్గ్యుమెంట్ , కోపం వచ్చి టికెట్స్ చింపేసా. ఇలాంటివి చెప్పడానికి, వినడానికి చాల సిల్లీ గా అనిపిస్తుంది. కాని ఆ మూమెంట్ లో అదో పెద్ద విషయం అయి కూర్చొంటుంది. ఇంకా ఇలాంటివే చాలా చాలా చిన్న విషయాలు. పెళ్ళికి candid photos అనుకున్నాము. అది కుదరలేదు. చాల ఖరీదు గా అనిపించింది. అది ఇప్పటికి దెప్పుతుంది.. అదయితే చాల బావుండేవి. అలా ఇలా అని. అది కాక ఒక్కతే అవడం వల్ల షేరింగ్ లేదు. అదే మెయిన్ రీసన్ అని” అన్నాడు వంశీ
కాని వంశీ నువ్వు ఎంత దగ్గరో, రూప కూడా అంతే దగ్గర, అలాంటి మీరిద్దరూ ఇంత పెద్ద మేజర్ డెసిషన్ తీసుకోవడం చాలా బాధ గా ఉంది అని అన్నాడు.
అదే మూడ్ తో ఇంటికి వచ్చాడు. తమ ఇద్దరి మధ్య కూడా గొడవమొదలవడం, వంశీ , రూపాల ఇష్యూ ఆ పైన రాత్రి FB లో చూసిన పోస్ట్, అది మన దేశంలోనే చిన్నచిన్న కారణానికే డైవోర్స్ తీసుకున్న జంటల గురించి, కలిసి బతకడం రానురాను కష్టమవుతోంది. పెద్ద పెద్ద చదువులు కూడా కొత్త తరం భార్యభర్తల్లో కాస్తంత సర్దుబాటు తత్వాన్ని నేర్పించలేకపోతున్నాయి. లక్షల సంపాదన ఇద్దరిలోనూ ‘నేను’ అనే అహంభావాన్ని పెంచిపోషిస్తోందేమో తెలియదు గాని. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూడటం… ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకోవడం… ఇక కలిసుండలేమంటూ కోర్టు మెట్లెక్కడం.. వెరసి పెళ్లైన మూణ్ణెల్లకే విడాకులకు అర్జీ పెట్టుకోవడం. వాస్తవాలకు దూరంగా ఆలోచించడం. ఊహా ప్రపంచంలో విహరించడం వల్ల ఇద్దరి ఆలోచనల మధ్య ఎక్కువ వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి. ఆలుమగలిద్దరూ అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని పొందలేక పోవడం. పెళ్లిని బొమ్మలాటగా భావిస్తున్నారు కొందరు యువతీయువకులు. నచ్చకపోతే తిరిగి ఇచ్చేయొచ్చనుకుంటున్నారు. నాకు తగ్గట్టు నువ్వు ఉండటం లేదంటే నువ్వు ఉండటం లేదని ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. వారి జీవితాల్లో ‘సర్దుకుపోదాం’ అనే మాటకు చోటే లేదు. దాన్ని ఏ మాత్రం ఖండిచని పెద్దలు, అన్న న్యూస్ చదివి ఆలోచిస్తూ పడుకున్నాడు

అవన్నీ కలగలపి అతనికి నిజంలాంటి కల వచ్చింది. ఆ కల తాలూకు ప్రభావం నుంచి బయటకు పడటానికి ఎంతో కష్టపడ్డాడు. ఒక్క క్షణం అదే నిజమేమో అన్నంత భయం కూడా వేసింది ఆరవ్ కి.

అమ్మో! నేను అస్సలు వంశీ, రూపల లా ఆలోచించను. అమ్మ నాన్న చక్కటి విలువలతో పెంచారు. నాకు పెళ్ళయిన అక్క ఉంది. అమ్మ, ఎప్పుడూ అంటూ ఉండేది దేనికన్నా పట్టు విడుపు ఉండాలి. కొన్ని విషయాలు నిజంగా మనకు నచ్చకపోవచ్చు. కాని సర్దుకు పోవాలి. ఏదైనా తెగే వరకు లాగితే ముక్కలే మిగులుతాయి అని. స్నానం చేస్తూ నిన్న రాత్రి తన ప్రవర్తన గురుంచి ఆలోచిస్తున్నాడు ఆరవ్, ‘ఎంత స్టుపిడ్ గా బిహేవ్ చేశాను! అసలు నేను అర్ధం చేసుకొని ఉంటే, ఏ గొడవా ఉండేది కాదు. ఇలాంటి పిచ్చి కల వచ్చేది కాదు.
పాపం లాస్య ఎంత ఫీల్ అయిందో, నిజానికి నేను తనకి కంగ్రాట్స్ చెప్పాలి. అంత మంది లో వాళ్ళ కంపెనీ COO తనని మెచ్చుకున్నాడు అంటే, అదేం చిన్న విషయం కాదు. అలాంటి అవకాశం రావాలని అందరూ మరీమరీ అనుకుంటారు. ఇప్పుడు తనకి చక్కటి ట్రీట్ ఇస్తాను ఇదే అసలయిన సర్ప్రైజ్. అని అనుకున్నాడు ఆరవ్

మ్యూజిక్ సిస్టం లో టోనీ బెన్నెట్ పాడిన లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ పాట ప్లే అవుతోంది .
పాట వింటూ అక్కడ టేబుల్ మీద ఆరవ్ హ్యాండ్ రైటింగ్ తో రాసిన “I AM SORRY LAASYA” అన్న పేపర్ని ఎన్ని సార్లు చదివిందో ఇంతలో
స్నానం పూర్తయి వచ్చిన ఆరవ్ “లాస్యా! రెడీ నా” అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు.

(సమాప్తం)
*********************

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద

“చదువులు కూడా కొత్త తరం భార్యభర్తల్లో కాస్తంత సర్దుబాటు తత్వాన్ని నేర్పించలేకపోతున్నాయి. లక్షల సంపాదన ఇద్దరిలోనూ ‘నేను’ అనే అహంభావాన్ని పెంచిపోషిస్తోందేమో తెలియదుగాని. చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూడటం… ‘నువ్వెంతంటే నువ్వెంత’ అంటూ ఒకరిపై మరొకరు మాటల తూటాలు విసురుకోవడం… ఇక కలిసుండలేమంటూ కోర్టు మెట్లెక్కడం.. వెరసి పెళ్లైన మూణ్ణెల్లకే విడాకులకు అర్జీ పెట్టుకోవడం. వాస్తవాలకు దూరంగా ఆలోచించడం. ఊహా ప్రపంచంలో విహరించడం వల్ల ఇద్దరి ఆలోచనల మధ్య ఎక్కువ వైరుధ్యాలు ఏర్పడుతున్నాయి.”
గృహిణిగా ఉద్యోగాస్తురాలిగా నలిగిపోతున్న ఆధునిక మహిళ పరిస్థితులను వివరిస్తూ రాసిన ఈ కధ, స్వర్గమైనా నరకమైనా ఎదుటి వారు కాకు౦డా ఎవరికీ వారు ఆలోచనలతో ఏర్పరచుకునేదేనని చెప్పకనే చెప్పారు రచయిత్రి. చక్కని శైలితో సాఫీగా సాగి ఆసక్తిగా చదివి౦చే అందమైన కధ.

6 thoughts on “లైఫ్ ఈజ్‌ బ్యూటిపుల్ – (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *