April 19, 2024

!! నిప్పులను వెదజల్లే అక్షరాల లిపి !!

సమీక్ష: పుష్యమీ సాగర్

manthra ilpi

మంత్ర లిపి కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత వెలుగు చూసిన అక్షరాలు. చీకటి రాజ్యం పై దండెత్తిన కరవాలం. నిజం నిప్పు అయితే దాన్ని పట్టి చూపించే దమ్మున్న అక్షరాల సుమం ఈ మంత్రం లిపి. కొనకంచి లక్ష్మి నరసింహ గారు మంచి కధకులు, నవలాకారులే కాదు మంచి కవి కూడా. మొత్తం 54 కవితలలో తర తరాలు గా సాగుతున్న మానసిక బానిసత్వపు సంకెళ్ళని, పుచ్చిపోయిన రాజకీయ వ్యవస్థ ని కడిగిపడేసే కవిత్వాన్ని ధార గా అందించారు. ప్రజల జీవితాన్ని రాజ్యం యుద్ధం లో కి తోసినప్పుడు సైనుకుడి లా పోరాడాలి అంటారు. నాశనమైన మానవత విలువ లకి చిరు దీపమై నిలుస్తాను లిపి సాక్షి గా.. అని అన్యాయం పై తిరుగుబాటు జెండా ఎగరేసారు. చావు బతుకుల మధ్య ఓ చిన్న విరామ చిహ్నమే ఈ జీవితం, అంతటి వైరాగ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాడు అనుభవించాల్సిందే. నీతులు ఒకరికి చెప్పి తాము ఆచరించకపోవడంలో ఉన్న మతలబును “అజ్ఞాతం గా మనుషులంతా అణగారిన చోట” లో బాగా వివరిస్తారు.

ప్రొఫెసర్ కొడుకు పక్కా క్యాపిలిస్ట్ గా మారేందు కు విదేశాల్లో చంపుడు చదువులు చదువుకుంటే, దాస్ కాపిటల్ అబద్ధపు పుస్తకం అవుతుంది, ఇలా హిపోక్రసి ని నిలదీయగల దమ్ము సగటు మనిషి కి వస్తుందా…? లలో కత్తిని, పువ్వు ని రెండూ ఒకేసారి ఉపయోగించడం బహుశ మొదటి సారి చూస్తాం. ఓ పక్క సామాజిక అంశాలపై తమ గళాన్ని వినిపిస్తూనే మరో పక్క ప్రేమ భావన ని అనుభవిస్తారు. ఓ చోట ఎంత బాగుందో “నీ కోసం నేను సృష్టించుకొన్న వర్ణ ప్రపంచం లో నా అక్షరాలన్నీ, ఉయ్యాలలో ఊగుతున్న పసిపాపలు అయ్యాయి ” అని చెప్తూనే తన కోసం బ్రతకటం స్వప్నం అయినప్పుడు నా ప్రపంచమంతా ఉద్యానవనమే అంటారు. “నీ కోసం బ్రతకటమే ఓ స్వప్నమైనప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కో ఉద్యనవానమే కదా..(నువ్వు ఎవరు అనుకుంటున్నావు ?). ఇక “మంత్ర లిపి ” లో అమ్మక ద్రోహం మా ఇంటి పేరు , లంచం మా జన్మ హక్కు, అవినీతి మా జాతీయ సంపద, దేశం అంటే ఉత్తి నల్ల మట్టి, మనిషంటే పిడికెడు బూడిద మాత్రమే” ఈ దేశం లో పాతుకు పోయిన అవినీతి జాడ్యానికి సగటు మనుషులు అందరూ మట్టి లో కలిసి పోయారు …నిజమే దేశం అంటే ఇప్పుడు మట్టి మాత్రమె, మనుషులు కొట్టుకు పోయారు అవినీతి వరదల్లో.

ప్రజల అమాయకత్వాన్ని దోచుకొని కోట్ల కు పడగలెత్తిన నాయకుల వైఖరి ని చూస్తున్నప్పుడు ప్రతి రోజు కూడా ఒక దగ్ధ గీతం లాగానే అనిపిస్తుంది. రాజకీయ నాయకుని చేతి లో దేశం కాని, రాష్త్రం కాని ఎలా ఆట ఆడించే జంతువు గా మారిన క్రమాన్ని అక్షరాల్లో చదివినప్పుడు రక్తం మరుగుతుంది . ఓటర్లు కు తెలియకుండా వాళ్ళ ప్రాణాలని లాగేసుకుంటే, ప్రాణం లేని మనుషులు తమ ప్రాణాలెక్కడున్నాయా అని విలపిస్తే, ఐదేళ్ళ పాటు రాజ్యం మీద పడి వెతుక్కుంటూ వుంటారు. సగటు ఓటరు పరిస్థితి ని కళ్ళకు కట్టినట్టు చూపించలేదు. తిరిగి రాని వసంతం లో తన నుంచి దాటుకు పోయిన బాల్యాన్ని, నాన్న పంచిన అనుభూతులను గుర్తు చేసుకుంటూ “నేను దిద్దిన ఒనమాల పలక ఏ ద్వీపం లో ముక్కలు అయ్యిందో” అనుకోని కూడా అవి అవధులని దాటి ప్రపంచం మొత్తం విస్తరించడం బాగుంది అంటారు. పేదోడు కులం ఏమిటి ఆకలే, …అలాంటి పేదోళ్ళ కులం మేమంతా ఒక్కటే . డబ్బున్న వాడు పవ్మేంట్ మీద వాహనం తో తొక్కించినప్పుడు ఎవడికి చెప్పుకుంటారు వారి వేదనని? అది తన అక్షరం గా మలిచారు రచయిత. “పుట్ పాత్ అంటే సజీవత్వం అంతు దొరకని నవ్యత్వం, ఒకానొక నిండు చైతన్యం,” అని వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. పుట్ పాత్ మీద బ్రతికే జీవులు గొప్పగా పోరాడే యోదులే అని నిర్ధారిస్తారు . “దేశ సరిహద్దుల్లో సైనికుల లాగానే పుట్ పాత్ ల మీద బ్రతుకు యుద్ధం చేస్తా రు”. క్రింది స్థాయి ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి అన్న నిజం గుర్తుకు రాకపోదు (అవును మేమతా ఒక్కటే ).ఈ దేశం అవమానించ బడటం క్రొత్తేమీ కాదు. అలాగే ప్రజలు కూడా …మరుగు దొడ్లు కడిగేందుకు పనికి రాని మేధావులు వికృతమైన ఆలోచనలతో పెడ త్రోవ పట్టిస్తారు. వీటిని ఖండించిన తీరు అద్భుతం (నిన్ను నేను క్షమించను ) ..”ఇది రాత్రి కాదు” లో అమ్మటం కొనటమే తెలిసిన చోట కవిత్వమేమిటి, జీవితమేమిటి , అని వైయుక్తికం గా ప్రశ్నిస్తారు .

ఇప్పుడు పసి పిలలు, యువతులు అని తేడా లేకుండా ఆడ పిల్ల అయిన పాపానికి అత్యాచారాలకి ఘోరాలకి బాదితులు గా నిలబడటం నడుస్తున్న చరిత్ర ..గొప్ప దేశం లో ఆడ పిల్ల భద్రత అన్నది నీటి బుడగనే తల్లి అంటూ దేశం లో ఆడపిల్ల పై జరుగుతున్న దారుణాలని ఎండగడతారు

యుక్త వయసు నీకు పెరుగుతూ ఉంటే అమ్మ కొంగు లో కార్చిచ్చు ఉన్నట్లు, అర్థ రాత్రుళ్ళు ఉలిక్కి పడి నిద్ర లేచి నిన్ను చూసుకునేది అంటే ఇంట్లో వున్నా కూడా ప్రతి తల్లి కి భయమే నిజమే. నీకు తెలియదు అమ్మా… మనషులు ఎప్పుడో జంతువులు అయిపోయారు అంటూ మనిషి లో ని కాముకత్వం ఎంతటి క్రూర ప్రవృత్తి ని పెంచుతుందో చెప్పకనే చెప్పుతున్నారు ..(ఓ అమ్మాయీ అమేలియా ). తనని తన అక్షరాలని అక్కున చేర్చుకొని ..కవిత్వ దారలో ముందుకు తీసుకువెళ్ళిన రచయతలను ..తన కంటే ముందు తరం వాళ్ళని గుర్తు చేసుకునే క్రమం గొప్ప గా ఉటుంది.

“చాక్ పీస్ చిత్రాల్లా”, “కలాల తోటి”, “అబ్బో….నన్ను ఆకాశం లో కి చెయ్యెత్తి మరి ఆహ్వానించారు (నా ముందు తరం రచయతలు)”, “అపుడెప్పుడో దశాబ్దాల క్రితం నా ఉడుకు వయసు లో నువ్వు వేసిన గాలానికి చేపలా తగులుకున్న నేను అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా గిల గిల తన్నుకుంటూ వున్నాను” అని గతంలో ప్రేమ తాలూకు విషాదాన్ని మననం చేసుకుంటారు ..(నువ్వు, నేను, మన ప్రేమ).

కడుపు నిండా అన్నం పెట్టె రైతు నేడు ఆత్మ హత్య చేసుకోవాల్సిన స్థితి కి ఎందుకు దిగజారింది, దేవుళ్ళందరూ వున్నా ఇక్కడమనిషి కరువంటారు. రాజ్యాంగం అబద్దమైన చోట, బతుకులు అబద్దమైన చోట దేశం మాత్రమే నిజం అంటారు..
రైతు పండించే ధాన్యం నిజం, రైతు మాత్రం అబద్దం నిజమే …బువ్వ ని అందించే రైతు అబద్దం. ఈ దేశం లో అనే కవిత లో “నాయకుల ఇంట వెలుగుతున్న లాంతర్లలో ఇంధనం గా వెలుగుతున్నది చచ్చిపోయిన రైతు రక్తమే” ఎంత దారుణం, . అలాగే, “నేను అన్నం తిందాము అనుకుంటున్న ప్రతీసారి నా కంచం లో ఏ కన్న తల్లివో రెండు కన్నీటి బొట్లు జారి పడి మెరుస్తున్నాయి, నా కంచం లో ఆత్మ హత్య చేసుకున్న ఏ రైతు భార్య వో రోదిస్తూ తెగిపడ్డ పుస్తెలు కనిపిస్తున్నాయి, అనడం వెనుక ఎంత వేదన వున్నది !! చివరికి ఈ రైతు చచ్చిపోవడం అంటే దేశం చచ్చిపోవటమే, రైతు చచ్చిపోవటం అంటే రేపటి తరాలు చచ్చిపోవడమే (ఇది హత్యాత్మ హత్య )

తను ఎంతో ప్రేమించినవాడిని దేశం కోసం త్యాగం చెయ్యాల్సి వస్తే ఆ ఇంతి మనసు ఎలా తల్లడిల్లుతుంది ..”అదేంటో కళ్ళు మూసుకుంటే అన్ని రాకూడని కలలే వస్తాయి, కలలో ఎవరో తెల్ల చీర కట్టినట్టు కనిపిస్తుంది. చేతి గాజులను పగలగొట్టినట్టు అనిపిస్తుంది” అని ఆ వీరుడి భార్య దు:ఖిస్తూ ఉంటుంది (ఏమండీ ప్రియమయిన మీకు). ఇదే కవిత లో పోరు ముగిసాక ఈ రాజ్యానికి మనం ఎవరు? పోరు ముగిసాక మనం దిష్టి బొమ్మలు గా కూడా పనికి రామన్న నిజాన్ని వీరులు ఎందుకు గుర్తించరో అని వాపోతారు. దేశం వీరుల చావులని తమ స్వార్ధ ప్రయోజనాలకి వాడుకొని తరువాత మర్చిపోవడం కొత్త విషయము ఏమి కాదు కదా.

ఇంకా ఇందులో “కళ్ళు”, “చీకటి లో చీకటి “, “అనుభూతి ఒక శాపం” “నిన్నెలా మరువను” , పొగడరా “నీ తల్లి భూమి భారతి ని”, “అవును మేమంతా ఒక్కటే ” లాంటి మంచి కవితలు వున్నాయి. నేను పేర్కొన్న వి కేవలం కొన్ని మాత్రమే. ఒకసారి ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని చదివిన తరువాత మనలో కలిగే భావ సంఘర్షణ ని అడ్డు కట్ట వెయ్యడం అసాధ్యమే. కొనకంచి గారి కవితలు చాల వరకు సామాజికం గాను, వైయుక్తికం గాను, స్పూర్తిని నిమ్పేవి గాను మనకు కనిపిస్తాయి. ప్రజల పక్షాన నిలబడే రచన ఎప్పుడు పది కాలాల పాటు నిలుస్తుంది. ఆ కోవ లో కి ఈ “మంత్రం లిపి ” వస్తుంది అందు లో ఎలాంటి సందేహం లేదు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *