April 25, 2024

పొగ చూరిన ప్రశ్న

అనువాదం: వాయుగుండ్ల శశి కళ

కవయిత్రి మ్రిలిన్ నరోహా (Mrilyn Naroha) ఇప్పటి కాలానికి చెందిన వారు, ముంబాయి వాస్తవ్యులు. వారు ఆంగ్లంలో వ్రాసుకున్న నాకు ఎంతో నచ్చిన కవితలను నేను తెలుగులోకి అనువదించాను. టీచర్ గా పనిచేస్తూ ఈవిడ కవితలే కాకుండా ఎన్నో కధలు, నవలారచనలను కూడా చేస్తారు. నాకు నచ్చిన ఆవిడ నవల డిఫరెంట్ ఫేసెస్.

ఈవిడ కవితల్ని ఒకసారి పరిశీలిస్తే దీనిలో పదాలతో కలిసి నడిచే స్త్రీ అంతరిక ఘర్షణ గంబీరంగా నదిలా నిండుగా ప్రవహిస్తూ ఒక్క సారి స్వేచ్చగా ఉరికే జలపాతం లాగా సహనం విరిగిపోయిన చివరి క్షణాన్ని సూచిస్తుంది . ఏ అణచివేత కైనా సహనం విరిగిపోయి నప్పుడు ప్రళయం లా తిరిగుబాటు తప్పదు . ఇంత లోతుగా స్త్రీ సమస్యలు చిత్రీకరించడం లో కవయిత్రి సఫలం అయినారు .

పొగ చూరిన ప్రశ్న

వెతుకుతూనే ఉన్నాను మౌనంగా
నాలో నేనే పొగ చూరుతూ
నా విలువను దేనితో తూచాలి ?
గడ్డి పోచతో తూకమేస్తూ
క్షణం లో దగ్దమయ్యె స్త్రీని
కాని అతను ….
రూపించిన దివ్య శక్తి
విలువలేని గడ్డి పోచగా
లోకంలో ఎన్నో మృగాలకు ఆకలి తీరుస్తూ
ఒక్క క్షణం తిరగబడాలంటే
కరుడుగట్టిన ముళ్ళు
కసుక్కున గుచ్చుకుంటాయి
కకావికలమైన హృదయం అస్తిత్వం కోసం కొట్టుకుంటూ
అతని కాళ్ళ కింద పది నలిగి పోవడం తప్ప
ఏముంటుంది !
మౌనపు దారుల్లో వెతుకుతూనే ఉన్నాను
నాలో నేను పొగ చూరుకుంటూ
దొరకని ఆ ఒక్క పోచ కోసం
రగులుతున్న బూడిదలో
వెతుకుతూనే ఉన్నాను
చివరిగా నా సహనాన్ని బద్దలు చేసిన క్షణాన్ని
దానిని మోసుకొచ్చిన ఆ పల్లకిని
పొగ చూరుకుంటూ వెతుకుతూనే ఉన్నాను
గరిక మీద మొలవబోయే రేపటి ఉదయాన్ని …..

@@@@@@@

కొసరు

అమ్మ చేతి ముద్దలు కడుపునింపే సాక వేళ్ళ పై ఆనుకొని
నూగుగా మెరుస్తూ గిన్నె అంచుకు చేరి నాలుక పై వాలే
కొసరు ఎంత బాగుంటందని……
ఏ భాషకు పూస్తేనేమిటి కలానికి అంటి మెరిసే నక్షత్రాలు
భావాల చల్లదనం తో సేద తీర్చినాక మెత్తగా ముక్కు నంటే
అర్ధపు పరిమళపు కొసరు హృదయానికి హత్తుకుంటే ఎంత బాగుంటుందని ….

కన్నీరో !పన్నీరో ! వేదనో ! నివేదనో ! మైమరుపో ! ప్రకృతి మెరుపో !
వేరే బాష అందాలను మన తీపి తెలుగులో వడ్డిస్తే ఏ హృదయం
ద్రవించదు , ప్రతిధ్వని వినిపించదు …. అదే నా కలం నుండి
జాలువారిన కొసరు . కలాల అలల పల్లకి లో సేద తీరండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *