April 20, 2024

మాయానగరం – 23

రచన: భువనచంద్ర

బోసుబాబు ప్రభ వెలిగిపోతోంది. కారణం గురుపూజా మహోత్సవం. సారా ప్రవాహానికి గురుపూజకి సంబంధం ఏమిటని ఎవరూ అడగరు. కడుపు నిండా సారా కావల్సినంత తిండి దొరికిందా లేదా అన్నదే ముఖ్యం. అందరూ శివస్వరూపులే… అంటే భోళా శంకరులే. పుష్పం పత్రం తోయం.. చాలు పాపం.
రోడ్డు మీద పోయే సామాన్య మానవుడ్ని పిలిచి “ఇదిగో మనిషి… యీ సంచీలో పది కోట్లు వున్నాయి. హాయిగా తీసుకెళ్ళి ఖర్చుబెట్టుకో అనండి. ఒట్టేసి చెబుతున్నా … ఒక్కడు కూడా తీసుకోడు. సరికదా లక్ష అనుమానాలు వాడి మెదడుని తొలుస్తాయి.
ఇది నిజమైన డబ్బా లేక దొంగ నోట్ల, ధర్మంగా సంపాదించినదా లేక దొంగ సొత్తా, ఇచ్చినవాడు టెర్రరిస్టా, పాకిస్తానీ వాడా లేక విప్లవకారుడా లేక మారువేషం వేసుకొచ్చిన ఎ.సి.బి. వాడా? ఇలా లక్షా తొంభై అనుమానాలు.
తేరగా వచ్చినా తినలేనంత అమాయకులు మధ్యతరగతి సామాన్య మానవులు. వాళ్ళకేం కావాలి? పేదవాడికి పూటగడిస్తే పండగ. కొంచెం పెద్దవాడికి అంటే లోయర్ మిడిల్ క్లాస్ వాడికి నెలంతా అప్పు చేయకపోతే పే….ద్ద… పండగ. అప్పర్ మిడిల్ క్లాస్ ఆశ ఎంత వరకు అంటే కూతురు పెళ్ళయి, కొడుక్కి మాంఛి బాంక్ జాబో , సాఫ్ట్ వేర్ ఉద్యోగమో వస్తే ‘చాలు ‘ అనుకునేంత.
బోసు బాబు గాల్లో తేలుతున్నాడు . కారణం గురువుగారు మెచ్చుకోవడం. “బోసు.. గొప్పగా ఎరేంజ్ చేశావు. ముఖ్యంగా శామ్యూల్ రెడ్డిని పడెయ్యడం. కాస్టు + రెలీజియన్ రెండు విధాలుగా ఓట్లు పడతాయి. టీచర్లని ముగ్గుల్లోకి దించి గురుపూజ జరిపించడం మహా గ్రేట్ . పిల్లకాయల మాటలు తల్లిదండ్రులు చచ్చినట్టు వింటారు. పిల్లలకి హీరోలు మరి గురువులేగా!! శభాష్… ఎలక్షన్ల దాకా జండా ఎగురుతూనే ఉండాలి ” అని భుజం తట్టి మరీ మెచ్చుకున్నాడు.
“థాంక్స్ గురూజీ ! ” అని వినయంగా పాదాలకి నమస్కారం పెట్టి బయట పడ్డాడు బోసు బాబు. అతని ముందున్నవి ప్రస్తుతం రెండు లక్ష్యాలు. ఒకటి ఎలక్షన్లో గెలవాలి. అదీ మామూలుగా కాదు… మంత్రి పదవికి ఎగబాకేటంత మెజారిటీతో. రెండోది శోభారాణి బి.ఎస్.సి. ప్రేమ పొందడమే కాక, పెళ్ళి చేసుకోవడం . చదువుకున్న పెళ్ళాం ” పది పదవుల పెట్టు ” అని పెద్దలు వూరకనే అనలేదుగా మరి.
ఎలక్షన్లకి టైం వుంది కనక రెండో లక్ష్యాన్ని మొదటకి లాక్కురావడం అన్ని విధాల శుభకరం. అయితే యీ విషయం గురువుగారికి చెప్పాలా వద్దా అనేది సమస్య. “చెప్పక పోయినా ఆయనకు తెలియంది ఏముంది? తెలుసు కనక చెప్పకపోయినా పర్వాలేదు. ” అని మనసు బోసుబాబుని బుజ్జగించింది. ఉత్సాహంగా బండెక్కాడు బోసు.

********************

“మల్లియలారా మాలికలారా.. మౌనముగా వున్నారా.. మా కథలే విన్నారా ” స్నానం చేసి ఫ్రెష్ గా కూనిరాగాలు మొదలెట్టాడు ఆనంద రావు.
“తమ్ముడు గారూ ! తలుపు తీస్తారా? ” చాలా తీయగా వినిపించింది మూడో యింటి వకుళమాల గొంతు.
“ఒక్క నిముషం ! ” క్షణం లో టవల్లోంచి లుంగీ బనీన్ల లోకి మారి తలుపు తీశాడు ఆనందరావు.
“అబ్బా! వేడి చల్లారిపోతాయేమో అని భయపడ్డాను.స్నానం చేశారు గనక వెంటనే తినేయండి. ! ” ప్లేటు మీద మూత తీసింది వకుళమాల.
పొగలు గక్కుతున్న ఐదు ఇడ్లీలు, ఉల్లిపాయ టమాటో పచ్చడి , కారప్పొడి, ఓ గిన్నె నిండా ఘుమఘుమలాడే సాంబారు.
“ఎందుకు అక్కయ్య గారు ఇవ్వన్నీ! ” మొహమాటంగా అన్నాడు ఆనంద రావు.
“ఏదో తమ్ముడు గారని ” నవ్వింది వకుళమాల. ఆవిడకు ఇద్దరు చెల్లెళ్లున్నారనీ వాళ్ళకింకా పెళ్ళికాలేదనీ ఆల్రెడీ ఆనంద రావుకి ఇన్ఫర్మేషన్ అందింది.
“మళ్ళీ సాంబారు కావాలన్నా, ఇంకా ఇడ్లీలు కావాలన్నా మొహమాట పడొద్దు! ” చిరునవ్వుతో అంది వకుళమాల.
“అబ్బే! అక్కయ్యగారి చెయ్యి పెద్దది. ఇదే చాలా ఎక్కువ. ” మర్యాదగా నవ్వి అన్నాడు ఆనంద రావు.
“అయితే వస్తాను ” బయటకు వెళ్ళింది వకుళమాల.
“అహా… ఏమి నా అదృష్టము, బ్రహ్మాండమైన ఉపాహారము లభించినదే ” అని నాటకీయంగా అనుకుంటూ కూర్చోగానే , పక్కింటావిడ “ఏమిటీ వకుళమాల వచ్చినట్టుందీ? ” అంటూ లోపలకి వచ్చింది. ఆవిడ చేతిలోనూ ఓ ప్లేటు ఉంది.
“వాళ్ళింట్లో ఇడ్లీ సాంబారు చేశారుట, ఇద్దామని వచ్చారు ” మొహమాటం గా నవ్వి అన్నాడు ఆనంద రావు.
“ఇడ్లీ చూస్తే కోమటి ఛాయమ్మ ఇడ్లీలా వున్నాయే!…. పోనీలే. ఏదో ఒకటి. వాటితో పాటు మా అమ్మాయి మాలతి స్వయంగా చెసిన యీ పెసరట్టు ఉప్మా కూడా తిని చూడు. సొంత కూతురు గురించి గొప్పలు చెప్పుకోకూడదు కానీ , ఉప్మా పెసరెట్టే కాదు, ఆ అల్లం పచ్చడి చేయడంలో దాన్ని మించినది యీ జిల్లాలోనే వుండదనుకో! అన్నిటికీ “?????” పెట్టీ మరీ చేస్తుంది. చెప్పడం ఎందుకూ, తింటే నీకే తెలుస్తుందిగా ! ” ప్లేటు మీద మూత తీసింది.
మూడు పెసరట్లు వున్నాయి. దండీగా అల్లం చెట్నీతో సహా. “బాబోయ్..నేనింత తినలేనండీ ” ఏడుపు మొహం పెట్టాడు ఆనంద రావు.
“ఎదిగే వయసు ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావూ? ఏమిటో బాబు, మా ఆయన బ్రతికున్న రోజుల్లో కనీసం డజను పెసరట్లు, గిన్నెడు ఉప్మాతో ఊదేసేవారు. ఏం మనుషులో ఏం నాజూకు తిండ్లో! ” సాగదీసింది పక్కింటావిడ.
“సరే లెండి.. మెల్లగా తింటాను. ” బుద్దిగా అన్నాడు ఆనంద రావు.
“అదీ.. అదీ… గుడ్ బాయ్ అంటే. సరేనే వెడతా. లేకపోతే వెధవ లోకం ఏది అంటగట్టినా అంటగడుతుంది. ” అని బయటకు వెళ్ళి అన్నది పక్కింటావిడ. అవాక్కై నిలబడి , ఓ క్షణం తరవాత ఫక్కుమని నవ్వాడు ఆనంద రావు. రెండు టిఫిన్ బాక్సు లాంటి గిన్నెలు బయటకు తీసి ఒకదానిలో రెండు ఉప్మా నింపిన పెసరట్లు, మరోదానిలో మూడు ఇడ్లీలూ పెట్టాడు.
“మరి ఈ చెట్నీ సాంబార్ల సంగతేటి? ” అని మనసు ప్రశ్న వెసింది.
“ఇంకో రెండు చిన్న డబ్బాలు వెతుకుదాము ” అని ఇడ్లి తుంచి కారప్పొడి నంజుకుంటూ అనుకున్నాడు ఆనంద రావు.
“లోపలకి రావచ్చా? ” స్వరం బయట నుండి వినపడింది. ఠక్కున లేచాడు ఆనంద రావు. అర్ధ రాత్రి గాఢ నిద్ర లోనుండి లేపినా గుర్తుపట్టగలడు ఆ స్వరాన్ని. అది మిసెస్ మాధవీ రావుది.
“అంత కన్నా ఆనందం యీ లోకం లో మరొకటి వుండదు. ” రెండడుగుల్లో తలుపు దగ్గర నిలబడ్డాడు. ఆనంద రావు నవ్వుతో మొహం వెలిగిపోతోంది.
“టిఫిన్ చేస్తున్నారనుకుంటాను, చేయండి.. నేను క్రింద కూర్చుంటాను. ” క్రింద కూర్చుంటూ అంది మాధవి.
ఇంటి ఓనరు యీ మధ్యనే లక్కీగా ఒక చిన్న టేబుల్, ఓ కుర్చీ ఇచ్చింది. కరెక్టుగా రెండ్రోజుల ముందే వాలు కుర్చీ కర్ర విరిగింది. ప్రస్తుతం ఉన్నది టేబులూ కుర్చీ చాపా దిండు మాత్రమే. సరే గిన్నెలు అవీ కొన్ని వున్నాయి. అది వేరే విషయం. ఎందుకంటే అవన్నీ వాళ్ళూ వీళ్ళు టిఫిన్లు పెట్టి ఇచ్చినవి. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళేదాక ఇక్కడే పడుంటాయి. అయితే కడిగి శుభ్రంగా వుంచడం ఆనంద రావుకి అలవాటు.
“మీరూ టిఫిన్ చేద్దురుగానీ, నేనూ కింద కూర్చుంటా ” తన ప్లేట్ నీ ఇందాక ఇడ్లీ పెసరట్టు ఉప్మా సర్దిన డబ్బాల్నీ కింద పెట్టి అన్నాడు ఆనంద రావు. “అయ్యయ్యో ఇప్పుడిదేం వద్దు, అసలు టిఫిన్ పెద్దగా నేను తినను ” మొహమాట పడింది మాధవి.
“మాధవి గారు! యీ రెండు డబ్బాలు మీవే! వాటిల్లోనే ఇడ్లీలూ, పెసరట్టు ఉప్మలు మీకోసం పాక్ చేసి వుంచాను. నేను తినేసి మీకు తీసుకొద్దామని. ఇక్కడకే వచ్చారు కనక తినేస్తే ఓ పని అయిపోతుంది. మరో ప్లేట్ డబ్బాలోవి వడ్డించి స్పూన్లతో అల్లం చెట్నీ కారప్పొడి వడ్డిస్తూ అన్నాడు ఆనంద రావు.
“సరేలెండి…” పెసరట్టు ఒక ముక్క తుంచి ఉప్మాతో జత పెట్టి అల్లం చెట్నీ తో ముంచి నోట్లో పెట్టుకుంటూ అన్నది మాధవి. నిజానికి మాధవి ఆ రాత్రి కూడా భోజనం చేయలేదు. వొండుకునే ఓపికలేక.
“అబ్బా.. ఇడ్లీలు కూడా భలేగా వున్నాయండి… తెల్లగా.. మొత్తగా.. దూదిలాగా ” ఉల్లిపాయటమాట చెట్నీ తో ఇడ్లీని ఆస్వాదిస్తూ అన్నది.
“చూశారా? ఇదంతా నా వంట కాదు. పక్కింటావిడ పెసరట్టు ఉప్మ ప్లస్ మూడో యింటి వకుళమాల గారి ఇడ్లీ చెట్నీలు ” పకపక నవ్వాడు ఆనంద రావు.
“మీ పని బాగుందే ” కారప్పొడి నంజి అన్నది మాధవి.
“మరి? పెళ్ళికానీ బ్రహ్మచారులకి ఇట్లాంటి సదుపాయాలు వుంటాయని ఇక్కడకి కొచ్చాకే అర్ధమైంది. అయినా నిజం చెపితే మాధవిగారు , ఇలా వాళ్ళు యీ టిఫిన్లు అవీ తీసుకొచ్చి ఇవ్వడం నాకు చాలా ఇబ్బంది గానే ఉంటుంది అండీ, కానీ వద్దంటే వెంటనే వాళ్ళ ముఖంలో అదో బాధకనపడుతుంది. వాళ్ళ చెల్లెల్నో మరదల్నో ఇచ్చి చెయ్యాలని వాళ్ళ ఆశ. కానీ అసలు నాకేముందనీ? ” సడన్ గా మౌనంలోకి వెళ్ళిపోయాడు ఆనంద రావు.
“చూశారా? నన్ను తినమని బలవంతం పెట్టి మీరు సైలెంటైతే ఎలాగూ? పెళ్ళికానీ వాళ్లతో అందునా మంచివాళ్ళతో బంధుత్వం కలుపుకోవాలని ఎవరేనా ఆశపడతారు. అదేమీ తప్పు కాదు. అలాగనీ “మా ఇడ్లీలు నువ్వు తిన్నావు గనక మా పిల్లనే నువ్వు చేసుకోవాలి ” అని ఎవరూ మిమల్ని ఫోర్స్ పెట్టరు.ఇక ఉత్తనే తీసుకున్నాననే భావన కలిగితే , వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఒక బహుమతి ఏదన్నా ఇచ్చి మీ మానసిక ఋణం తీర్చుకోండి. సరేనా? ఏదీ.. ఆ సాంబారు .. ముందు మీరు తీసుకొని తరవాత నాకు ఇవ్వండి! ” ఉత్సాహ పరచే ప్రయత్నం చేసింది మాధవి.
ఒంటరితనం ఆమెకు కొత్తేమీ కాదు. ఒంటరితనం ఎంత భయంకరమైనదో తెల్సు. అదీ ఒంటరితనం ఎంత సుఖవంతమైనదో కూడా అమెకు తెల్సు.
“అబ్బా… యీ సాంబారు వాసనకే నోరూరిపోతోంది. ఓ మాట చెప్పనా? ఇది తెలుగు వాళ్ళు పెట్టే సాంబారు కాదు. తమిళ్ నాడు.. ముఖ్యంగా మద్రాసు లో కొంత కాలం వుండి, నేర్చుకొని పెట్టిన సాంబారు. లేకపోతే ఇంత సువాసన రాదు! ” ఇడ్లీ ముక్కను మరో మారు సాంబారులో ముంచి తినబోతూ అంది మాధవి.
“ఈ సారి వకుళమాల గారిని అడగాలి. వారెప్పుడేనా మద్రాస్ లో వున్నరో లేదో? ” మామూలు లోకంలోకి వచ్చాడు ఆనంద రావు.
“అందుకే అంటారు ఆనంద రావు గారు! దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్ అని … చూడండి.. ఇటువైపు వెళ్తూ వెళ్తూ మీ తలుపు తీసి వుందని లోపలికొచ్చా. బ్రహ్మాండమైన బ్రేక్ ఫాస్ట్ దొరికింది. అసలు నాకెంత ఆకలిగా వుందో నాకే తెలియదు. “చెయ్యి కడుకొని గటగటా గ్లాస్ మంచి నీళ్ళు తాగి అంది మాధవి .
“ఏదన్న కానివ్వండి. యీ రోజు మా ఇంటికి రావడం , ఉన్నది ఇద్దరం పంచుకొని తినడం అద్భుతంగా వుంది. అసలిదంతా నిజమో కలో కూడా తెలియడం లేదు” తనూ చేతులు కడుకొంటూ అన్నాడు ఆనందరావు.
“అంత వద్దులెండి మరీనూ ! సరే ఇప్పుడు మీ ప్రోగ్రాం ఏమిటీ? ” విశ్రాంతిగా అడిగింది మాధవి.
“టిఫిన్ చేశాక ఆ రెండు డబ్బాలు మీ ఇంటికే తెద్దామని ఆలోచించాను. ఎలాగూ మీరే వచ్చారు గనక ప్రోగ్రాం మీ చేతుల్లోనే పెడుతున్నాను. ఇక్కడే కూర్చుంద్దం అంటే ఓ.కె. … లేదూ, మీ ఇంటికి వెడద్దామనా ఓ.కే. అదీ వద్దని ఎక్కడికి ప్రోగ్రాం వేసినా డబుల్ ఓ.కే. ” షర్ట్ తొడుక్కొని అన్నాడు ఆనందరావు.
” ఓ మాట సిన్సియర్ గా అడగనా? ” కొంచం మొహమాటంగా అడిగింది మాధవి.
“అడగండీ ! సందేహం ఎందుకూ? ” కుతూహలంగా అన్నాడు ఆనంద రావు.
“మీకెవరూ లేరా.. అంటే , మీ పెళ్ళి సంబంధాలు చూసేవాళ్ళు… ” ఇబ్బందిగా అంది మాధవి.
“మాధవి గారూ! ‘ఉన్నారు ‘ అనుకుంటే లోకం అంతా మనదే… లోకులందరూ మనవాళ్ళే! ‘లేరు ‘ అనుకుంటే తోడబుట్టిన వాళ్ళు, కన్నవాళ్ళే కాదు, కడుపున పుట్టిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళే! నా వరకు చెప్పమంటే నేను ఒంటరిని. యీ ఒంటరి తనం జన్మతో వచ్చినది కాదు. నాకు నేను తెచ్చుకున్నది. దీని వెనుక ఏ చిదంబర రహస్యాలు లేవు. ఉన్న కారణాలు కూడా ఎవరికీ అపకారం చేసేవో బాధపెట్టేవో అంత కన్నా కావు. ఇక పెళ్ళి సంబంధాలు చూసేవాళ్ళున్నారు. సారీ. కొన్ని నెలలు క్రితం వరకూ పెళ్ళంటే నాకు సదభిప్రాయం లేదు. నిజం చెబితే ప్రేమ అంటే అసహ్యం కూడా. పెళ్ళినీ ప్రేమనీ ద్వేషించేవాడిని. కానీ ఒక వ్యక్తిని చూశాక ప్రేమ అంటే ఏమిటో తెలిసింది. ” సైలెంటయ్యాడు ఆనంద రావు.
“ఎవరామే? ” మాధవి మొహం నిండా కుతూహలమే.
“ఇప్పటికిప్పుడు నిజంగా చెప్పలేను! ” కిందకు చూస్తూ అన్నాడు ఆనంద రావు.
“అంటే..”
“ఆ విషయం ఆమెకే చెప్పలేదు ! ” చిన్నగా తనలో తాను నవ్వుకుంటున్నట్టుగా అన్నాడు ఆనంద రావు.
“పోనీ ఆమె పేరు నాకు చెప్పండి.. మీ బదులుగా మీ ప్రేమ విషయం మీ తరఫున నేనే ఆమెకి చెప్పి ఒప్పిస్తా ” ఓ చెయ్యి ఆనంద రావు చెయ్యి మీద వేసి బరోసా ఇచ్చింది మాధవి.
“క్షమించండి… పేరు కూడా ప్రస్తుతం చెప్పలేను. ఇలా అంటున్నానని మరేమీ అనుకోకండి. నేను నా ప్రేమను వెళ్లడించినప్పుదు ఆమె ఓ.కె. అంటే అంతకు మించి స్వర్గం ఉండదు. ఆమె ‘నో ‘ అని నాతో మాట్లాడం మానేస్తే దానిని మించిన నరకం వుండదు. అందుకే.. యీ విషయం లో మాత్రం నన్ను క్షమించండి. ” మాధవి కళ్ళలోకి చూస్తూ అన్నాడు ఆనంద రావు.
అతని చూపుల్లో ఓ చిత్రమైన భావం … ‘ఆరాధన ‘ లాంటిది. తళుక్కున మెరుపులా మెరిసినట్టు అనిపించింది మాధవికి.
“సరేలెండి … ఇంక మిమల్ని యీ విషయంలో ప్రశ్నలు అడగను. ప్రతీ వ్యక్తికీ తనదైన ప్రైవసీ ఉంటుందనీ, ఉండాలని నేను కోరుకుంటాను. ఓ.కే. మీ విషయం మీది. సరే.. అలా బజారు వైపుకి పోదామా? ” లేచింది మాధవి.
“వైనాట్ ” ఆనందంగా అన్నాడు ఆనంద రావు.
“వీలుంటే ఇవాళ వంట భోజనం కూడా మా ఇంట్లోనే చేద్దాం ! ” సన్నగా అన్నది మాధవి.
“అయితే ఇంకేం.. యీ రోజు పర్వదినమే అన్న మాట ! ” మహదానందంగా పాంట్ తీసుకొని దొడ్డి వైపుకి వెళ్ళాడు ఆనంద రావు. అది చూసిన మాధవి నోట మాట రాలేదు.
“మీకు పర్వదినం కావొచ్చు ఆనంద రావు గారు! నాకు మాత్రం యీ రోజు అత్యంత విచారకరమైన రోజు. ‘నా భర్త కాని భర్త ‘ చనిపోయి నిన్న రాత్రికి అయిదేళ్ళైంది. మధ్యాహ్నం , అంటే నిన్న మధ్యాహ్నం పులిహోర పొట్లాలు కట్టించి అనాధశరణాలయం లో పంచి , ప్రసాదంగా తానూ ఒకటి తిన్నది. అంతే తిండి లేదు, మళ్ళీ పొద్దుట ఆనందరావు పెట్టిన పెసరట్టు ఉప్మ ఇడ్లీలు. మనసులో ‘ఉపవాసం ‘ లేననే బాధ , చూస్తే తినేసిందాయే ! అది పోగొట్టుకోవాలంటే చక్కగా భోజనం తయారు చేసి యీ బ్రహ్మచారికి పెడితే పైలోకాలలో వున్న ‘రావు ‘ కి ఉత్తమగతులు లభిస్తాయే మోనన్న మూఢనమ్మకమూ కావొచ్చు.
ఇద్దరూ నడుస్తున్నారు, “ఏమిటీ.. నన్ను సైలెంట్గా వుండొద్దని మీరే సైలెంటైపోయారు? “అడిగాడు ఆనందరావు.
“బహుశా చుట్టుపక్కల వాళ్ళందరు బయటకు వచ్చి మరీ మనందరినీ చూసినందుకా? ” కొంచెం ఇబ్బంది గా మళ్ళీ అన్నాడు ఆన్మద రావు.
“అందులో ఏముంది? చూడకపోతే ఆశ్చర్యపోవాలి. మంచివాళ్లైతే ఎవరో తెలిసినావిడ అయివుంటుందీ అనుకుంటారు. మరో టైపు మనుషులైతే రకరకాల రిలేషన్ లు అంటగడతారు. అంతేగా ” మామూలుగా అన్నట్టు అంది మాధవి.
“పోన్లెండి.. ఎలా అనుకున్నా రేపటి నుండి నాకు సంబధాలు వెతకడం మానేస్తే అంతే చాలు ” అన్నాడు ఆనందరావు.
“అదెలా మారతారు? మీ యింటికి ఎంత మంది ఆడవాళ్ళు వస్తే అంత గ్లామర్ పెరుగుతుంది. మీరు ఎంతమంది ఆడవాళ్ళతో కనిపిస్తే అంత హీమాన్ గా గుర్తించబడతారు. ఆనందరావు గారు.. మన పెంపకంలో ఒక దోషం వుంది. పెంపకమే కాదు మన దృష్టిలో కూడా దోషం వుంది. ఒక తప్పు చేసినవాడు యీసడింపబడితే వేయి తప్పులు చేసిన వాడు గౌరవింపబడతాడు. అదీ భయంతో కూడిన గౌరవం. మంచివాడికి లోకంలో విలువుండదు. అందుకే దుర్మార్గులను గ్లామరైజ్ చేసి మరీ చూపిస్తారు. వారి గురించి వార్తలు వైనవైనాలు గా చెప్పుకుంటూ వుంటారు. గాడ్ బ్లెస్ థిస్ ఇడియట్ పీపుల్ ” నిటూర్చి అన్నది మాధవి.
మాధవిలో ఈ కోణం చూడని ఆనంద రావు ఓ నిముషం ఆశ్చర్యం తో ఆగి మళ్ళీ నడక మొదలెట్టాడు.
చాలా సేపు మౌనం నాట్యమాడింది.
“కూరలు నేను సైలెంట్ చేయనా? ” కూరగాయల మార్కెట్ కు రాగానే అడిగాను ఆనంద రావు. మాధవికి ఎందుకో నిసత్తువ ఆవహించింది. గంటల తరబడి ఏమీ తినకుండా సడన్ గా తింటే అలాగే అవుతుంది. ఆ విషయం ఆవిడ ఏనాడు గుర్తించలేదు. అదీగాక రాత్రంతా నిద్ర కూడా లేదు. ఒక్క రోజు నిద్రపోకపోవడం అనేది పదిరోగాలతో సమానం అనే విషయం ఆవిడకు ఎవరూ చెప్పలేదు.
“మీయిష్టం బహుశా నేను వంట చేయలేనేమో ” నిస్పృహగా అంది మాధవి.
“అరే ఏమైంది.. ఒక్క నిమిషం ” కొంచెం కంగారుగానే మాధవి చెయ్యి పట్టుకొని దగ్గరలోనే వున్న మర్రి చెట్టు కింద వేసి వున్న అరుగు మీద కూర్చోబెట్టాడు.
“ఏమీ లేదు.. మీరు కూరలు తెండి.. యీలోగా సర్దుకుంటుంది ” కూర్చునీ కళ్ళు మూసుకొంది మాధవి.
మాధవి చెయ్యి పట్టుకొని అరుగు మీద కూర్చోబెట్టడం చూసిన వాళ్ళు ఇద్దరు . ఒకరు మదాలస భర్త సుందర రామ మూర్తి అయితే రెండో వ్యక్తి మదాలస ఆడపడుచు… అనగా నీరజ. కూరగాయల కోసం వాళ్ళిద్దరూ మార్కెట్ కి వచ్చారు. కారణం ఆ మరుసటి రోజు వాళ్ళ నాన్న గారి తద్దినం. సుందర రామూర్తీ ఆల్రెడీ ఆనంద రావుని చూశాడు. నీరజ అంతకు ముందు చూడలేదు గానీ ఇప్పుడు చూసింది… చాలా కుతూహలంగా. కారణం ఆనంద రావు చాలా ప్రేమతో ఆమెను నడిపించి కూర్చోబెట్టిన తీరు నీరజని ఆకట్టుకోవడమే.
“లవ్ అంటే అదీ.. లవర్ అంటే అలాంటివాడు! ” అని మనసులోనే ఆనందరావుకి నూటికి నూరుమార్కులూ ఇచ్చింది కానీ , యీ ఆనంద రావు వల్లే అన్నకీ వదినకీ మధ్య భయంకరమైన యుద్ధం సాగుతోందని ఆమెకు తెలియదు.
అసలు మదాలస ఆనందరావుని ‘తన ‘ కోసమే అని నీరజకి అసలు తెలియదు. సుందరరామమూర్తీ , ఆనంద రావు మదాలసతో కనిపించాడని నీరజతో చెప్పలేదు… చెప్పలేడు కూడా. ఆరడుగుల అందగాన్ని చెల్లెలికి చూపించి ” చెల్లీ వీడే నీ వదిన అనగా నా భార్య బాయ్ ఫ్రండు ” అని ఏ మగాడైనా ఎలా చెప్పగలడు.
విషయం వివరంగా చూద్దామని సుందర రామ మూర్తీ కూరల కొనుగోలు ఆలస్యం చేశాడు. ఆనంద రావు కూడా అదే షాప్ లో గబగబా కూరలు సెలెట్ చేసుకొని , రిక్షాని పిలిచి , రిక్షా లో మాధవిని జాగ్రత్తగా ఎక్కించి తనూ కూర్చున్నాడు.
ఆ రిక్షా కదిలాక సుందర రామమూర్తి ఓ విధంగా నిట్టూరిస్తే, నీరజ మరో విధంగా నిట్టూర్చింది.
**********************
“రేపటికి కూడా వుండి వెళ్ళండి. జనాలు మరీ అంత మంది వుండరు కానీ వందా రెండొందల మంది వుంటారు. కార్యకర్తల కోసం రేపు ప్రత్యేక విందు ఇస్తున్నాము. అదీ మీరే చెయ్యాలి. మరి ఏమిమ్మంటారో మీరే చెప్పండి! ” ప్రేమగా అడిగాడు ఫాదర్ ఆల్బర్ట్ డేవిడ్… లోకల్ చర్చ్ ఫాదర్.
“అయ్యా.. మీకు తోచినది ఇవ్వండి. యీ మూడు రోజు మీ పవిత్ర ఉపన్యాసాలతో పునీతులమయ్యాం !” వినయంగా అన్నాడు వెంకటస్వామి.
“ఎనిమిది వేలు ఇప్పించండి రేపటికి ” వంకర నవ్వుతో అడిగాడు పరమశివం.
“అతను అలాగే అంటాడు అయ్యగారు. వంద ఇచ్చినా నాకు ఓ.కే. ” ఒక వేళ అతనికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు. నేను ఒక్కడ్ని చాలు. మీకు కావల్సింది శుచిగా, రుచిగా వండిపెడతా. ” స్థిరంగా అన్నాడు వెంకటస్వామి.
“నీ మంచితనమే నీకు రక్షణ ఇస్తుంది. ” క్రాస్ వేసుకొని దీవించాడు ఫాదర్ ఆల్బర్ట్. ఇద్దరూ బయటకు వచ్చారు.
పరమశివం వెంకటస్వామిని కౄరంగా చూస్తూ “వీళ్లకి ఫారన్ ఎయిడ్ ఎంతొస్తుందో తెలుసా? మా కేరళలో బోలెడు మంది క్రీస్టియన్లే. కోట్లు కోట్లు సంపాదించారు మతం పుచ్చుకొని. నీ భక్తేమిటీ? నువ్వేమిలా క్రీస్టియన్ కాదు కదా? హాయిగా డబ్బు తీసుకోడానికి దొబ్బు తెగులా? ” అన్నాడు.
“ఏమో వాళ్ళకి ఎంతొస్తుందో మనకు అనవసరం పరమశివం… మొన్న మొన్నటి వరకు నీ కంటే ఎక్కువవ్వాలన్న మోహం వుండేది డబ్బంటే. ఇవ్వాళ అంత లేదు. అంతే కాదు. వీళ్ళెంత డబ్బు సంపాయించుకున్నా దీనులకు వీళ్ళు చేసే సేవ ఎవరూ చేయలేరు. అందుకే వంద రూపాయులకు మించి ఒక్క పైసా తీసుకోను. ఇష్టం వస్తే సహాయం చెయ్యి. లేకపోతే నీ దారి నీది .” స్థిరంగా అన్నాడు వెంకటస్వామి.
“నువ్వు భక్తి ముసుగు వేసుకొన్న మాత్రానా చంపకుండా వదుల్తానని మాత్రం అనుకోకు నీ చావున్నది నా చేతిలోనే. ” చాలా కౄరంగా చాలా మెల్లగా నవ్వుతూ అన్నాడు పరమశివం.
“పిచ్చివాడా.. ఎవరి చావు ఎవరి చేతిలో వుందో చెప్పాల్సింది నువ్వు కాదు. ఆ రహస్యం తెలిసింది.. తెలిసేది పైవాడు ఒక్కడికే ” వెంకటస్వామి మాటల్లో ఏమాత్రం బెరుకు లేదు.
“ఠంగ్ ” మని మ్రోగింది చర్చ్ గంట.. గాలికి!! ఓ క్షణం నిర్ఘాంతపోయాడు పరమశివం.

ఇంకా వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *