April 25, 2024

రీతిగౌళ రాగ లక్షణములు

రచన:భారతీ ప్రకాష్

రీతిగౌళ రాగం 22.వ. మేళకర్త రాగమైన, ఖరహరప్రియ రాగం నుండి పుట్టింది.

మూర్చన :
స గ రి గ మ ని ద మ ని ని స.

స. ని ద మ గ మ ప మ గ రి స

షడ్జమ, పంచమాలతో కలిపి ఈ రాగంలోని స్వరాలు :

చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం మరియు కైశికి నిషాదం. చాలా అరుదుగా శుద్ధ దైవతం అన్య స్వరం గా వస్తుంది.

ఆరోహణలోని జంటస్వరం (ని) ఈ రాగం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది.

ఉభయ వక్ర రాగం. – షాడవ సంపూర్ణ రాగం.

ఆరోహణలో దిస్వర వక్రం – అవరోహణలో ఏకస్వర వక్ర రాగం.
ద్వితీయ ఘన పంచక రాగాలలో ఒక రాగం.

“ గ, మ, ని ” జీవ స్వరాలు.

“ ని. ప. ని. ని. సా ” అనే ప్రయోగం – “ ని ప ని ని సా. “ అనే ప్రయోగం కన్న తగినది.

“ మ ని ని సా. “ — రక్తి ప్రయోగం.

“ ప ద ప మ గ రి సా ” —- విశేష ప్రయోగం.

భాషాంగ రాగం. – “ సా. ద ద మ ” మరియు ” పా ద ద మ ” అనే ప్రయోగాలలో శుద్ధదైవతం అన్య స్వరంగా వస్తుంది.

గమకవరీక రాగం. — త్రిస్థాయి రాగం. —- ఎల్లవేళలా పాడదగిన రాగం.

పూర్వకాల ప్రయోగమైన ” షడ్జమ గ్రామం ” ఈ రాగం లో కనపడుతుంది.

ఈ రాగం లోని రచనలు సాధారణంగా ” ని, గ, ప ” అనే స్వరాలతో మొదలవుతాయి.

దీర్ఘ కంపిత గాంధారం ఈ రాగం లో కనపడుతుంది.

“ ప ” – అంశ స్వరం.

రాగవిస్తారానికి ఎక్కువగా అవకాశం లేని రాగం.

మనవి చేసుకునే అర్ధం వచ్చే సాహిత్యం ఈ రాగం లో బాగా అర్ధవంతమవుతుంది.

ఈ రాగాన్ని సంగీత నాటకాలలో ( operas ) వాడుతారు.

ఈ రాగం మరియు నారాయణగౌళ రాగం — ఈ రెండూ శ్రీ వీణ కుప్పయ్యర్ గారి ఆస్తిగా చెప్పవచ్చు.

ఈ రెండు రాగాలలో ఉన్న శ్రీ వీణ కుప్పయ్యర్ గారి వర్ణాలు ఈ రోజుకీ మనకున్న మంచి రచనలలో ఉత్కృష్ట స్థానం లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

చరిత్ర :

అసంపూర్ణ మేళ పద్ధతిలో 20.వ. మేళకర్త పేరు ” నారీ రీతిగౌళ. ”

కొంతమంది పండితులు శుద్ధ దైవతం మాత్రమే ఈ రాగం లో ఉండాలని అభిప్రాయపడ్డారు.

కాని మనకున్న రచనలన్నింటిలో కూడా చతుశృతి దైవతమే బాగా ఉపయోగపడింది.

ఈ రాగం లోగల కొన్ని ముఖ్య రచనలు :

1. వర్ణం వనజాక్ష అట తాళం శ్రీ వీణకుప్పయ్యర్.

2. కృతి రాగరత్న మాలికచే రూపక తాళం శ్రీ త్యాగరాజు.

3. కృతి దైవత్యము ఆది తాళం శ్రీ త్యాగరాజు.

4. ప్రహ్లాద భక్తి విజయం (opera)- నన్ను విడచి – చాపు తాళం శ్రీ త్యాగరాజు.

5. కృతి శ్రీనీలోత్పల రూపక తాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.

6. కృతి జననీ నినువినా చాపుతాళం శ్రీ సుబ్బరాయ శాస్త్రి.

7. కృతి సద్గురు స్వామి ఆది తాళం శ్రీ రామానంద శ్రీనివాస అయ్యంగార్.

శ్రీ త్యాగరాజస్వామివారు ఈ క్రింది కృతిలో విలక్షణమైన రీతిలో శ్రీరాముని శతరాగ రత్నమాలికతో అలంకరించి, తనుపొందే ఆనందభాగ్యమును తన తోటివారలకు కూడా అందించవలెననే విశ్వ ప్రేమను చూపించారు.

రీతిగౌళ రాగ కీర్తన – రూపక తాళం – రచన : శ్రీ త్యాగరాజు.

పల్లవి :

రాగరత్న మాలికచే రంజిల్లునట హరి – శత || రాగ ||

అనుపల్లవి :

బాగ సేవించి సకల భాగ్యమందుదాము రారె || రాగ ||

చరణం :

నైగమ షట్చాస్త్ర పురాణాగమార్ధ సహితమట – యోగివరులు ఆనందమునొందే సన్మార్గమట

భాగవతోత్తములు కూడి పాడే కీర్తనములట — త్యాగరాజు కడతేర తారకమని చేసిన శత || రాగ ||

తాత్పర్యము :

ఈ కృతి యందు శ్రీ త్యాగరాజు తమ స్వభావమధురమైన రీతిలో శ్రీరాముని శతరాగ రత్న మాలికతో అలంకరించి, తన సర్వస్వమును ఆరామునికే అర్పించి, తన తోటి వారలకు కూడా ఈ భాగ్యమును కలిగించాలని, “ బాగ సేవించి సకల భాగ్యమందుదామురారె ” అని అంటున్నారు.
రాగరత్న మాలిక ఏ విధమైనదంటే ….

1. “ నైగమ ” అనగా వేదము మొదలు పురాణాగమార్ధములన్నియు ఇమిడి ఉన్నది;
2. యోగివరులు ఆనందమొందే సన్మార్గము ;
3. భాగవతోత్తములు కలిసి పాడే కీర్తనములు.

ఇందు రాగము వేదము వంటిది.
అందు రత్నములవంటివే షడంగములు, వేదాంగములు, పురాణాలు మొదలైనవి.
మాలికలో వివిధ పుష్పముల వంటివే సప్తస్వరములు.
ఈ మాలికలో సూత్రము వంటిదే భక్తి. “ శత ” అనే మాటకు అనంతమైనదనే అర్ధం వస్తుంది ఇక్కడ.
ఇట్టి మాలికను రామునికి సమర్పించి, మహా యోగులు ఆనందమనుభవింతురు.
ఇవే భాగవతోత్తములు కలసి పాడే కీర్తనములు.
తము కడతేరుటకు ఇదే తారక మంత్రమని భావించి, శ్రీ త్యాగరాజు కృతార్ధుడగుచున్నాడని దీని భావము.
ఇదే విశ్వప్రేమ, విశ్వ శ్రేయస్సు.

ఈ రాగంలో చాలా మంచి సినిమా పాటలు వున్నాయి.

1. రామా కనవేమిరా ( హరి కథలో మొదటి భాగం ) స్వాతిముత్యం.

2. నాదవినోదం సాగర సంగమం.

3. అందాల రాక్షసివే ఒకే ఒక్కడు.

4. కొంటె చూపుతో అనంతపురం.

5. శేషశైలావాస శ్రీ వేంకటేశా శ్రీ వేంకటేశ్వరమహాత్యం.

పద్మభూషణ్ శ్రీ ప్రొ. సాంబమూర్తి గారికి మరియు శ్రీ కల్లూరి వీరభద్ర శాస్త్రి గారికి శిరసాభివందనములతో,

భారతి ప్రకాష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *