March 29, 2024

కానడ రాగ లక్షణములు

రచన:- భారతీ ప్రకాష్.

 

  1. వ. మేళకర్త రాగమైన, ఖరహరప్రియ నుండి పుట్టిన జన్య రాగమిది.

 

ఆరోహణ :       స       రి        గ        మ      దా      ని       స.

అవరోహణ :     స.       ని       స.       దా      ప       మ      ప       గా       మ      రి        స

 

షడ్జమ పంచమాలతో కలిసి ఈ రాగం లో వచ్చే స్వరాలు:

చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, చతుశృతి దైవతం, కైశికి  నిషాదం.

షాడవ – వక్ర సంపూర్ణ రాగం.

అవరోహణ లోనే వక్రం.             త్రిస్వర వక్ర అవరోహణ.  అవరోహణలో ” కంపిత గాంధారం. “

రాగచాయా స్వరాలు :   “ గ,  ద  మరియు ని ”

న్యాస స్వరాలు : “ రి, గ, ప మరియు ద ”

ఆరోహణలో ” ద ” మరియు అవరోహణలో ” గ ” దీర్ఘంగా పల్కడం లో ఈ రాగము యొక్క మధురత్వం తెలుస్తుంది.

గమక వరీక రాగం. “స.  రీ.  ప.  గా. ” అనే ప్రయోగం లో ” ప ” తన స్వస్థానం లో ఉండదు. దేశ్య రాగం.

“మ ప  గా ” అనే ప్రయోగం లో ఊపుతూ, ఒక ప్రత్యేక పద్ధతిలో పలికే ” గాంధారం ” మరియు

“ని స. దా ద ని పా ” అనే ప్రయోగం లో దైవతం పలికే పద్ధతి ఈ రాగం యొక్క ప్రత్యేక లక్షణములుగా చెప్పవచ్చు.

అంతర గాంధార, కాకలి నిషాద చాయలు అక్కడక్కడ కనిపిస్తూ ఈ రాగం యొక్క అందాన్ని ఇనుముడింపజేస్తాయి.

“వళి, లీనం” అనే రెండు గమకాలు ఈ రాగం లో ఉపయోగిస్తారు.

“సని ప ” మరియు ” ద ని పా ” అనేవి విశేష సంచారములు.

కరుణ రస ప్రధాన రాగం. ఎల్లవేళలా పాడదగిన రాగం.  త్రిస్థాయి రాగం.

ఈ రాగం లోని రచనలు ” రి,  ని ” స్వరాలతో మొదలవుతాయి.

ఈ రాగం లోని సున్నితమైన  శృతులు, గమకాలు పలకాలంటే ఎంతో అవగాహన అవసరమౌతుంది.

ఆలాపనకి తక్కువ అవకాశమున్న రాగం.

ఈ రాగాన్ని ఎక్కువగా రాగమాలికలలో ఉపయోగిస్తారు.

ఈ రాగం లోని కొన్ని ముఖ్య రచనలు:

రచన   –        సాహిత్యం        –        తాళం            –        రచించినవారు

  1. వర్ణం –        నిన్నేకోరి         –        ఆది               –        శ్రీ తిరువొత్తియూర్ త్యాగయ్యర్.
  1. వర్ణం –        నెరనమ్మితి      –        అట               –        శ్రీ రామనాధ్ శ్రీనివాస అయ్యంగార్.
  1. కృతి –        శ్రీ నారద         –        రూపక           –        శ్రీ త్యాగరాజు.
  1. కృతి –        జగదభి రామా  –        ఆది               –        శ్రీ వీణ కుప్పయ్యర్.
  1. కృతి –        కమలాంబ నా   –        ఆది               –        శ్రీ కరూర్ దక్షిణామూర్తి.
  1. జావళి –        చారుమతి       –        చాపు             –                  –
  1. తిల్లానా – గౌరీనాయక      –        సింహనందన    –        శ్రీ మహా వైద్యనాధ అయ్యర్.

 

శ్రీ నారద                   కానడ రాగం              రూపక తాళం             శ్రీ త్యాగరాజు.

పల్లవి  :

శ్రీ నారద నాద సరసీరుహ భృoగ శుభాంగ         //

అనుపల్లవి:

దీనమాన రక్షక జగదీశ భేశ సంకాశ       //

చరణం :          వేదజనిత వరవీణా వాదన తత్త్వజ్ఞ

భేదకర త్రితాప రహిత ఖేచర వినుత

యాదవకులజాప్త సదా మోదహృదయ మునివర్య

శ్రీద త్యాగరాజవినుత శ్రీకర మాంపాలయ.          //

 

తాత్పర్యము :

ఈ కృతిలో శ్రీ త్యాగరాజస్వామివారు నారదుని స్తుతించినారు. నారదుడు సాక్షాత్ శ్రీ నారాయణునికి ప్రతినిధి. బ్రహ్మ మానస పుత్రుడు. త్రిలోకములకు గురువు. సర్వ శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు. ఎల్లప్పుడూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ లోకకల్యాణం కోసం పాటుపడుతుంటాడు.  వేదాగమ పురాణేతిహాసములందు ఆయన పాత్ర అనేక విధములుగా ప్రసిద్ధమైనది.  ఈ కృతిలో సంగీత సంప్రదాయమునందు నారదుని మహిమను స్తుతించినారు.

నాద సరసీరుహ  భృంగ           =        నాదమనెడి పద్మమునకు తుమ్మెదవంటివాడు;

అంటే నాదమును బ్రహ్మానందస్వరూపముగా అనుభవించు మహనీయుడని భావము.

శుభాంగ అనుటచే, “నారదుని శరీరము  భౌతికముగాక, చిదాకాశ రూపమైనందున శుభముల నిచ్చునది.” అని తెలియపరచారు.

నారదుని అంతశ్శరీరము భగవత్సంకల్పానుసారముగా దీనుల కాపాడునట్టిది.

భేశ               =        నక్షత్రములకు ఈశుడైన చంద్రునికాంతి కలది.

అనగా స్వచ్చమైనదిగాన దీనుల మనస్తాపములు ఆ దివ్యాంత:కరణమందు ప్రతిబింబములగును. భగవంతునికి ఈ జీవుల క్లేశములను వినిపించి, నారదుడు లోకరక్షణ మొనర్చును. అందుకే ఆయన “దీనమాన రక్షకుడ”నుట ఒక మంచి విశేషణము.

వేదములనుండి పుట్టిన నాదము వీణావాదమునందే సంపూర్ణముగా వ్యక్తమగును. మహాయోగులు, వీణాదండ సదృశము సకల దేవతామయమునగు సుషుమన్ననాడియందు సమస్త      కళావైభవమును అనుభవింతురు. క్రమముగా బ్రహ్మానందము ననుభవింతురు. ఇందుకు నారదుడే లోక గురువు. కృష్ణుని దివ్యమోహన లీలలయందు నారదునిదే ముఖ్య పాత్ర. అఖండ ప్రేమతత్వముతో, శ్రీకృష్ణుని దివ్యనామ సంకీర్తనము  చేయుచూ, లోక కల్యాణ మొనరించు మహనీయుడు నారదుడని ఈ కృతిలో స్తుతించారు.

 

ఈ రాగం లో వున్న కొన్ని సినిమా పాటలు:

పాట                        –                           సినిమా

 

  1. శ్రీ గౌరి శ్రీ గౌరియే                   –                           విచిత్ర దాంపత్యం.
  2. కనరాని దేముడే కనిపించినాడే   –                           రంగులరాట్నం.
  3. నిన్ను జూచినందాక కన్నుల      –                           భక్త శబరి.
  4. జననీ శివకామిని                  –                           నర్తనశాల
  5. జగదభిరాముడు శ్రీరాముడే       –                           లవకుశ

 

       —————————————————–0————————

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *