April 19, 2024

యాచకులు

 రచన:  – పుక్కళ్ళ రామకృష్ణ

 

ఇంటి ముందాగున్న కారులో కూర్చోడానికి వెళ్తున్న సుచిత్రను చూసి చిరునవ్వు చిందించింది గేట్ ముందు నిల్చున్న కనకమ్మ. కనకమ్మ చేతిలో ఏభై రూపాయల నోట్ పెట్టి కార్లో వివేక్ పక్కన వెళ్లి కూర్చుంది సుచిత్ర.

కారు కొంచెం దూరం వెళ్ళాక “కాలువలు ఊడ్చడానికి జీతాలు దొరుకుతాయి వాళ్లకు. లెక్కాడొక్కా లేకుండా వారానికి రెండు మూడు సార్లు కనకమ్మకు డబ్బులిస్తుంటావ్! డబ్బులకలవాటు పడితే లంచమిస్తే గానీ పని చేయరు” అన్నాడు వివేక్.

“పెద్దావిడా, పాపం! వీధికి రెండు వైపులా ఉన్న కాలువల్నిఈ చివర్నుండి ఆ చివరి వరకూ నడుం పడిపోయేలా ఊడ్చుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలోస్తే వాళ్ళకిచ్చే జీతాలేం సరిపోతాయి వివేక్? సొంతిల్లులున్న మన బోటి వాళ్ళం అప్పుడప్పుడు పదో పరకో సాయం చేస్తే వాళ్లకు ఆర్థికంగా సహాయపడిన వాళ్ళమవుతాం” అంది సుచిత్ర.

“వాళ్ళపై జాలి పడటం దేనికీ? ఇష్టంగానే ఆ ఉద్యోగాలలో చేరుతారు. ఆరోగ్యపరమైన సమస్యలొస్తే వాళ్లకు వైద్య సహాయం అందుతుంది” అంటూ కారు పెట్రోల్ బ్యాంకు దగ్గర ఆపాడు వివేక్.

వివేక్ కారు దిగి పెట్రోల్కి డబ్బులు పే చేస్తుంటే, “ధర్మం సేయండమ్మగోరు” అంటూ ఓ అరవై ఐదేళ్ళున్న బిక్షగాడు సుచిత్ర కూర్చున్న విండో దగ్గరకు వచ్చి  చేయి చాచాడు. సుచిత్ర వాడి వైపు జాలిగా చూసి హేండ్ బ్యాగ్లో చేతికందిన చిల్లర నాణేల్ని బిక్షగాడి చేతిలో పెట్టింది.

“ఇల్లు దాటేటప్పుడు, గుళ్ళూగోపురాలు సందర్శించేటప్పుడూ, పెట్రోల్ బంక్ దగ్గర కారాగినప్పుడూ… కాదే సందర్భం నీకు దానంకి అనర్హం. దానధర్మాలు చేయడం కూడా మానసిక రుగ్మత” అన్నాడు వివేక్, కారు స్టార్ట్ చేస్తూ.

“పాపం, ముసలాయనా! ఓ రెండు రూపాయలు దానం చేస్తే మన సొమ్మేం పోతుంది వివేక్?” అంది సుచిత్ర నవ్వేసి.

“ఒళ్ళొంచి కష్టపడడానికి ఇష్టపడరు ఈ బిక్షగాళ్ళు. బిక్షమెత్తుకున్న డబ్బులతో తాగి తందనాలాడుతారు. నీలాంటి దయామయులున్నంత కాలం వీళ్ళ బిక్షాటన మూడు పువ్వులూ ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది” అన్నాడు వివేక్.

నాలుగు రోడ్ల కూడలి దగ్గర రెడ్ సిగ్నల్ పడటంతో కారాపాడు వివేక్. సుచిత్ర దృష్టి, ఓ రెండేళ్ళ చంటిపిల్లను చంకలో ఎత్తుకునీ, సిగ్నల్స్ పరిసరాలలో బిక్షమెత్తుకుంటున్న ఓ బిక్షగత్తె మీదకు మళ్ళింది.

“పాపం, ఆ చంటిపిల్ల ఒంటి మీద నూలుపోగైనా వేయకుండా చంకనెత్తుకుని ఈ చలి గాలిలో ఎలా అడుక్కుంటుందో చూడు వివేక్?!” అంది సుచిత్ర, కారులో నుండి బయటకు చూస్తూ.

“కారు సిగ్నల్స్ దగ్గర ఆగటమే ఆలశ్యం, అభాగ్య సమాజమంతా నీ కళ్ళ ముందు గోచరిస్తుంది. ఆ తల్లికి లేని జాలి నీకెందుకు చెప్పూ?” అన్నాడు వివేక్ చిరాకు పడుతూ. వివేక్ మాటల్ని వినిపించుకోకుండా బిక్షగత్తె వైపే చూస్తూ ఉండిపోయింది సుచిత్ర.

కారు సిగ్నల్స్ దాటాక, సిగ్నల్స్ కి కుడి పైపున్న షాపింగ్ మాల్ దగ్గర కారాపాడు వివేక్. కార్ పార్కింగ్ ఇరుకుగా ఉంటుందని సుచిత్రను కొంచెం దూరంలో దింపేశాడు వివేక్. సుచిత్ర నిల్చున్న చోటు నుండి సిగ్నల్స్ దగ్గర పిల్లనెత్తుకుని అడుక్కుంటున్న బిక్షగత్తెను చూస్తూ నిల్చుంది సుచిత్ర.

సుచిత్ర చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్లో మూడేళ్ళ వయసున్న తన కూతురు సోనియా సైజుకు కొంచెం చిన్నదిగా ఉన్న ఫ్రాక్ ఉంది. ఆ షాపింగ్ మాల్ నుండి నిన్న మొత్తం మూడు ఫ్రాకులు కూతురు కోసం కొని తీసుకెళ్లాడు వివేక్. చిన్నదైపోయిన ఫ్రాక్ని ఎక్చేంజ్ చేయడానికి షాపింగ్ మాల్కొచ్చారు దంపతులిద్దరూ.

“వివేక్, ఫ్రాక్ ఎక్చేంజ్ చేయాలని లేదు. దీన్నీ ఆ బిక్షగత్తెకిచ్చేసి మనం మరొకటి కొనుక్కుందాం. ఆ చంకలో ఉన్నమ్మాయికి ఇది చక్కగా కుదురుతుంది” అంది సుచిత్ర, కార్ పార్క్ చేసి తిరిగొచ్చిన వివేక్తోమ.

“నీకంత జాలిగా ఉంటే ఓ వంద రూపాయలు దాని ముఖాన కొట్టు, దాని తాహత్తుకు తగిన బట్టలు కొని పిల్లకు తొడుగుతుంది. పైసాపరకా?… నాలుగు వందల ఏభై రూపాయల పెట్టి కొన్నాను!” అన్నాడు వివేక్ విస్తుపోతూ.

“వస్త్రదానం చేస్తే మంచిది వివేక్, నాలుగు వందల ఏభై రూపాయలు మనకు భారం కాదు” అంది సుచిత్ర. వివేక్కి ఒప్పుకోక తప్పలేదు.

ఫ్రాక్ తీసుకెళ్ళి బిక్షగత్తెకివ్వాలని వివేక్ కదలబోతుంటే, “అయ్యగోరూ …” అంటూ ఓ పన్నెండేళ్ళు వయసున్న అమ్మాయి వివేక్ ముందు చేయి చాచింది. వివేక్ పర్స్ నుండి ఓ రూపాయి నాణెం తీసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి, “చూడమ్మాయ్, ఆ సిగ్నల్స్ దగ్గర పిల్లనెత్తుకుని బిక్షమెత్తుకుంటున్నామెకు ఈ ఫ్రాక్ వెళ్లి ఇస్తావా?” అడిగాడు వివేక్.

“సెంకలో ఉన్న పిల్ల దాని సొంత కూతురు కాదయ్యగోరు, అద్దెకు తెచ్చుకున్న బిడ్డ” అంది ఆ అమ్మాయి సిగ్నల్ వైపు చూడకుండానే.

“అద్దెకు పిల్లల్ని ఎవరిస్తారు?” అడిగింది సుచిత్ర ఆసక్తిగా.

“ఇంకెవరూ?….ఆ పిల్ల సొంతమ్మే! సొంతమ్మ పూర్నా మార్కట్టు దగ్గరుంటాది” అంది ఆ అమ్మాయి అక్కడ్నుండి వెళ్ళిపోవాలని తొందరపడుతూ. ఆ అమ్మాయి చెప్పింది విన్నాకా సుచిత్రలో ఇంకాస్తా కుతూహలం పెరిగింది. ఎలాగైనా మరికొంత సమాచారం రాబెట్టాలని భావించి ఆ అమ్మాయి పేరేంటో అడిగింది.

“వెంకటమ్మ” గర్వంగా చెప్పిందా అమ్మాయి.

“కాసేపు నాతో మాట్లాడితే నీకు పది రూపాయలిస్తాను వెంకటమ్మా” అంటూ ఆశ పెట్టింది సుచిత్ర. విప్పారిన ముఖంతో సరేనన్నట్లు తలూపింది వెంకటమ్మ.

“అద్దెకు తెచ్చుకున్న బిడ్డయితే ఏమైంది?! నువ్వు ఈ ఫ్రాక్ తీసుకెళ్లి ఆవిడకివ్వాలి?” అంది సుచిత్ర, బ్యాగ్లో నుండి ఫ్రాక్ బయటకు తీసి ఆ అమ్మాయికి చూపిస్తూ. ఫ్రాక్ చూస్తూనే వెంకటమ్మ కళ్ళు మెరవడం గమనించింది సుచిత్ర.

“ఒంటి మీద నాడిమైన గుడ్లేసి బిచ్చం దండుకుంటే ఎవలూ సిల్లిగవ్వ కూడా సిప్పలో ఎయ్యిరమ్మగోరు, దానికిత్తే అదే ఉంచీసుకుంటాది. పిల్లోంటిమీదెయ్యదు” అంది వెంకటమ్మ లౌక్యంగా.

వెంకటమ్మ చెప్పింది విని ఆశ్చర్యపోయింది సుచిత్ర. బిక్షం వేసే దాతల ఆలోచనలు ఎలా ఉంటాయో సుచిత్రకు తెలియజేస్తున్న ఆరిందలా నిల్చుంది వెంకటమ్మ. వివేక్ అసహనంగా వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాడు. సుచిత్ర దగ్గర్నుండి పది రూపాయలు అంకించుకుని తొందరగా వెళ్లిపోవాలనే కంగారులో ఉంది వెంకటమ్మ. సుచిత్రతో మాట్లాడుతూనే ఎందుకో భయంభయంగా దిక్కులు చూస్తోంది వెంకటమ్మ.

“నిన్నాగుంటని నానే అద్దెకి తీసుకుని తిప్పేనమ్మగోరు. గుంటోంట్మీదున్న గుడ్డలూడదీసి దినమంతా సంకలేసుకుని జెగదాంబ జంక్షన్లో తిప్పి నాలుగొందల రూపాయలు దండేను. రెండొందలు దానమ్మకు అద్దిచ్చాను. సంకలో పసిగుంటుంటేనే బిచ్చమేసోటోల్లకి కనికారం కలుగుతాది” చెప్పింది వెంకటమ్మ.

బిక్షాటనలో ఒక రోజు సంపాదన నాలుగు వందల రూపాయలని విని ఆశ్చర్యపోయింది సుచిత్ర. బిక్షమెత్తుకున్నప్పుడు చంకలో ఉన్న బిడ్డ ఒంటి మీద బట్టలుండకూడదనే నియమాన్ని బిడ్డనెత్తుకునే వాళ్ళు పాటించాలి కనుకా.. సుచిత్ర ఫ్రాక్ ఆ బిక్షగత్తెకిచ్చినా అది నిరుపయోగమవుతుందని సూచాయిగా చెప్పింది వెంకటమ్మ. వెంకటమ్మ చెప్పింది విన్నాక సుచిత్రకు ఫ్రాక్ ఆ బిక్షగత్తెకు ఇవ్వాలనిపించలేదు.

వెంకటమ్మ భయంభయంగా దిక్కులు చూస్తూనే సుజాత ఇవ్వబోయే పది రూపాయల కోసం ఆత్రుత పడుతోంది.

“ఆలొత్తున్నారు!… బేగా డబ్బులియ్యండమ్మగోరు” అంటూ జంకుతూ వెనక్కి చూస్తూనే చేయి చాచింది వెంకటమ్మ .

ఆ వచ్చేదెవరని సుచిత్ర కూడా వెంకటమ్మ చూస్తున్న వైపే చూసి, వెంకటమ్మ చేతిలో పది రూపాయల నోటు పెట్టింది. పది రూపాయల నోటు చేతిలో పడగానే తుర్రుమని పరుగంకించుకుంది వెంకటమ్మ.

వెంకటమ్మ అలా పారిపోగానే, బేనర్లూ, ప్లకార్డులు పట్టుకుని ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అటుగా వచ్చారు. చూడటానికి అందరూ చదువుకున్న యువకుల్లా కనిపిస్తున్నారు. కొందరబ్బాయిలు పాదచారులకు కరపత్రాలు పంచిబెడుతున్నారు.

వెంకటమ్మ పరిగెత్తి పారిపోవడం గమనించిన ఓ యువకుడు సుచిత్ర దగ్గరకొచ్చి, “బాల యాచకుల్ని ప్రోత్సాహించకండి మేడమ్. మా హోమ్లో చేర్పించండి. ఉచిత విద్యతో పాటే వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నాం” అంటూ ఒక కరపత్రం సుచిత్ర చేతికందించాడు.

బేనర్ల మీద వ్రాసినది చదివి ఆ సంస్థ ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకునీ “మరి ఆ అమ్మాయి మిమ్మల్ని చూసి భయపడి పారిపోయిందెందుకూ?” అంటూ సందేహం వ్యక్తపరిచింది సుచిత్ర.

“బాల యాచకులు ఎవరైనా మా కంటబడితే వాళ్ళను పట్టుకుని మా సంస్థ వాహనంలోకి ఎక్కించి వాళ్ళ నివాసాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మా సంస్థలో చేర్చుకుంటున్నాం. చేర్పించడం ఇష్టం లేని తల్లిదండ్రులకు పిల్లల్ని బిక్షాటనకు పంపొద్దని హెచ్చరికలు జారి చేస్తున్నాం” చెప్పాడు ఆ యువకుడు.

“వాళ్ళ తల్లిదండ్రులు మీ హెచ్చరికలను పెడచెవిన పెడితే బాల యాచకుల్ని పట్టుకుని బలవంతంగా మీ వసతి గృహలకు తరలించ లేరా?” అడిగింది సుచిత్ర.

“మా సంస్థకు ఆ హక్కు లేదు మేడమ్, అందుకే ఈ ప్రచారం చేపట్టాం. బాల యాచకులకు మనం దానం చేయడం మానేస్తే యాచక వృత్తి మీద వాళ్లకు ఏవగింపు పుడుతుంది. మీరంతా సహకరిస్తేనే బాల యాచకులకు మా వంతు సాయం చేయగలం” అని చెప్పి ఆ యువకుడు అక్కడ్నుండి వెళ్ళిపోయాడు.

ఆ యువకుడు చెప్పింది విన్నాక ఆలోచనలో పడింది సుమిత్ర. ఆలోచిస్తూనే వివేక్ వెనుక నడుస్తూ షాపింగ్ మాల్లోంకి వెళ్లి ఫ్రాక్ ఎక్చేంజ్ చేసింది. కాసేపు షాపింగ్ చేసి, బయట పడేసరికి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది.

“సోనియా అమ్మను సతాయిస్తుందేమో వివేక్?” అంది సుచిత్ర, ఇంటికి తొందరగా వెళ్ళాలనే ఆలోచనతో కార్లో కూర్చుంటూ.

“సోనియాను మీ అమ్మ దగ్గర వదిలేసి మనిద్దరం ఇలా షికార్లు చేయడం నాకిష్టముండదు సుచిత్ర. మన పిల్లలు మనకు బరువనుకుంటే ఎలా?… మనమేమైనా మోయాలా?… కారే కదా మోస్తుంది! పెట్రోల్ బంక్కి ఎదురుగా ఉన్న షాప్లోం వెజిటబుల్స్ కొనుక్కుని వెళ్దాం. అంత వరకూ ఓపిక పట్టు” అంటూ కారు స్టార్ట్ చేశాడు వివేక్.

ఓ ఇరవై నిమిషాల తరువాత, ఉదయం పెట్రోల్ పోయించుకున్న బంక్కిల ఎదురుగా ఉన్న వెజిటేబుల్ షాప్ ముందు కారాపాడు వివేక్. కారు దిగే ఓపిక లేనట్లు కారులోనే ఉండిపోయింది సుచిత్ర. వివేక్ కారు దిగి వెజిటేబుల్స్ షాపులోకి వెళ్ళాడు.

ఏమీ తోచక సుచిత్ర కార్లో నుండి రోడ్డుకవతల పెట్రోల్ బంక్కుయ పక్కనే ఉన్న వైన్ షాపు దగ్గర మందుబాబుల సందడి  వైపు చూస్తూ కూర్చుంది. మధ్యాహ్నమే ఐనా వైన్ షాప్ తాగుబోతుల రాకపోకలతో రద్దీగా ఉంది. అప్రయత్నంగా సుచిత్ర దృష్టి దర్జాగా చుట్ట పీలిస్తూ, తూలుతూ వైన్షాైప్ నుండి బయటకొచ్చిన ఓ అరవై ఐదేళ్ళ వ్యక్తి మీద పడింది. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తనను బిక్షమడిగిన బిక్షగాడే ఆ ఆసామనీ గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు సుచిత్రకు.

“ఆ వైన్షానప్ ముందు దర్జాగా చుట్ట పీలుస్తున్న ముసలాడిని గుర్తించావా వివేక్?” అడిగింది సుచిత్ర, అప్పుడే వెజిటేబుల్ బ్యాగ్తోన వచ్చి కారు స్టీరింగ్ ముందు కూర్చున్నా వివేక్నిమ.

“కార్లో కూర్చుని నీవు బయటకు చూశావంటే చాలు, చిత్రమైన ప్రపంచం కనిపిస్తుంది నీ కంటికి. వాడేవడ్నో నేనెందుకు గుర్తు పట్టాలి?” విసుగ్గా అన్నాడు వివేక్, కార్ స్టార్ట్ చేస్తూ.

“ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర నేను బిక్షం వేసిన ముసలాయన, ఫుల్గా తాగున్నట్లున్నాడు, తూలుతున్నాడు” అంది సుచిత్ర.

వివేక్ ఆసక్తిగా అటు వైపు చూసి వాణ్ని గుర్తు పట్టి, “చెప్పాను కదా సుచిత్ర, కొందరు బిక్షగాళ్ళు తాగుడికి బానిసలు. వాళ్ళు బిక్షమెత్తుకునేదే తాగుడు కోసం. ఒళ్ళొంచి పనిచేయడానికి ఇష్టపడరు” అన్నాడు.

“నీకు ఈ బిక్షగాళ్ళను చూస్తే జాలేందుకు కలగదో ఇప్పుడర్ధమయింది” అంది సుచిత్ర.

సిగ్నల్ దగ్గర బిక్షమెత్తుకునే బిక్షగత్తె చంకలో రెండేళ్ళ పాప కోసం ఆలోచిస్తూ, కారు ఇల్లు చేరే వరకూ మౌనంగా కూర్చుంది సుచిత్ర.

ఇంటి ముందు సుచిత్ర కారు దిగడం చూసి ఎదురింటి వనజమ్మ పనిగట్టుకుని పలకరించి “సుచిత్రమ్మా, ఆ కనకమ్మకు నువ్వు డబ్బలవాటు చేశావు. ఉదయం మా ఇంటి ముందు కాలువలో చెత్త ఊడ్చకుండానే వెళ్ళిపోయింది. నీలా దానికి చీటిమాటికీ లంచమిచ్చి ఊడ్పించుకోవాలంటే నాకయ్యే పని కాదు” అంది నిష్టూరంగా.

“అయ్యో పిన్నిగారు, లంచం కాదు. మన వీధికి రెండు వైపులా కాలువల్ని శుభ్రంగా ఉంచుతుందనే నమ్మకంతో కనకమ్మకు అప్పుడప్పుడు పదో పరకో ఇస్తున్నాను. మా ఇంటి ముందు ఊడ్చి మీ ఇంటి ముందు వదిలేయమని ఆమెను ప్రోత్సాహిస్తున్నానని భావించకండి. రేపోస్తుంది కదా… కనకమ్మను నిలదీద్దాం” అంటూ వనజమ్మ ముఖం మీద కొట్టినట్లు సమాధానమిచ్చి వివేక్ వెనుక ఇంట్లోకి నడిచింది సుచిత్ర.

“ఎంతో హుషారుగా ఇంటికొచ్చాను వివేక్! ఎదురింటి పిన్నిగారు నిష్టూరంగా మాట్లాడి నా మూడ్ పాడు చేసింది” అంటూ సోఫాలో కూలబడింది సుచిత్ర.

“ఉదయం బయల్దేరినప్పుడే చెప్పాను, ఆ కనకమ్మకు డబ్బలవాటు చెయ్యొద్దని. నా సలహాలు పెడచెవిన పెడితే ఫలితాలు ఇలానే ఉంటాయి” అన్నాడు వివేక్ నవ్వుతూ.

“సుచీ, కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎవరో ఎత్తుకుపోయారటా!. ఉదయం టీవీలో చూసినప్పట్నుండి నాకు ఒకటే గాబరాగా ఉంది. మీ శంకరం మామయ్యా ఈవాళ ఉదయమే తన కూతురు శ్యామలను డెలివరీ కోసం అక్కడ జాయిన్చేశాడు. మామయ్యకు ఫోన్ చేసి శ్యామల డెలివరీ అయ్యాక పుట్టిన బిడ్డను కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పు” అంటూ సోనియాను ఎత్తుకుని హాల్లోకి వచ్చింది సుచిత్ర తల్లి సుమతి.

“ఆ జాగ్రత్త లేవో నీ తమ్ముడికి నువ్వే చెప్పు మమ్మీ! శంకరం మామయ్యకు అర్థమయ్యేలా చెప్పడం నాకు చేతకాదు” అంటూ నెంబర్ డైల్ చేసి మొబైల్ తల్లి చేతికిచ్చి, తల్లి చంకలో ఉన్న కూతుర్ని తీసుకుంది సుచిత్ర.

“అవును వివేక్!, నాకు తెలియక అడుగుతున్నాను, ఇంకా కళ్ళు తెరవని పసికందుల్ని తల్లి పక్కలో నుండి ఎత్తుకుపోయి ఆ పిల్లల్ని ఏంచేసుకుంటారు?” అడిగింది సుచిత్ర.

“సంతానం లేని దంపతులకు అమ్మేయోచ్చు, లేదా వెంకటమ్మ చెప్పినట్లు చంకలో ఎత్తుకుని యాచించే యాచకులకు అద్దెకివ్వొచ్చు. ఆసుపత్రిలో పసికందులు అదృశ్యం కాకుండా ఉండాలంటే వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తీరా పిల్లల్ని ఎవరో ఎత్తుకుపోయాక ఆసుపత్రి సిబ్బందినీ, సెక్యూరిటీని నిందిస్తూ రోధిస్తే ఫలితం శూన్యం. హాస్పిటల్స్ నుండే కాదు, వీధిలో ఆడుకుంటున్న పిల్లల్ని కూడా ఎత్తుకు పోయి, వాళ్ళను హంతకులుగా, యాచకులుగా, వ్యభిచారులుగా మార్చే ముఠాలు కూడా ఉన్నాయి. తల్లి దండ్రులు పిల్లల విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి” అన్నాడు వివేక్.

“అమ్మో!… అలా భయపెట్టకు వివేక్! ఇకపై బయటకు వెళ్తే సోనియాను మనతో పాటే తీసుకెళ్దాం” అంటూ కూతుర్ని వాత్సల్యంగా గుండెకు హత్తుకుంది సుచిత్ర.

 

***

 

 

 

 

 

6 thoughts on “యాచకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *