April 24, 2024

లేకితనం .

రచన. ఆదూరి.హైమావతి.

తిరుమలరావు తిరుపతికి మొక్కు తీర్చుకోవడానికి కుటుంబంతో సహా బయల్దేరాడు. ముందుగానే కల్యాణోత్సవానికీ, తోమాల సేవకూ, సుప్రభాత దర్శనానికీ, వసతికీ కూడా గదులు ‘ఆన్ లైన్ ‘ లో బుక్ చేసుకుని, మరీ బయల్దేరాడు. వసతి గదిలో దిగి స్నానపానాదులు పూర్తి చేసుకుని , కల్యాణోత్సవానికి వెళ్ళి వచ్చాడు , భోజనాదికాలూ కానిచ్చి ఆ తర్వాత , చుట్టూ చూస్తూ విశ్రాంతిగా వరండాలోని కుర్చీలో కూర్చున్నాడు.

 

తిరుమలరావు శ్రీమతి- సీతాలక్ష్మి చాలా కలుపుగోలు ఇల్లాలు.ఇరుగూ పొరుగులను పలకరిస్తుండ టం ఆమె అలవాటు. ఆ అలవాటు ప్రకారం పక్కనే ఉన్న వసతి గదిలోని వారిని పలకరించింది. వారంతా కాస్తంత చిరాగ్గా వరండాలో తిరుగు తున్నారు. ” ఏమండీ! ఏ ఊరు మనది? దర్శనాలయ్యాయా!”అంది. ఆ గదిలో దిగిన యజమాని ఇల్లాలు “ఎక్కడండీ! అంతా బాగుందని గది ఇచ్చారు. తీరా చూస్తే బాత్ రూములోని గీజరు పని చేయడం లేదండీ! ఎవ్వరి స్నానాలూ కాలేదు. చన్నీళ్ళ స్నానాలు మాకెవ్వరికీ పడవు. స్నానాలు కాకుండా దర్శనాని కెలా వెళ్ళడం? ఎలక్ట్రీషియన్ కోసం ఎదురుచూస్తున్నాం?” అంది ఆమె. ” పోనీ ఒక పని చేయండి! మా గదిలోని వేడినీరు తీసుకుని స్నానాలు కానిచ్చేయండి.”అంది సీతాలక్ష్మి. ” చాలా థాంక్సండీ! గొప్ప సాయం ఆఫర్ చేశారు, ఉండండి రెండు బకెట్లు పట్టుకొచ్చి వేడినీళ్ళు పట్టుకెళతాము.” అంటూ ఆ ఇల్లాలు లోనికెళ్ళింది, సంబరంగా .

వెంటనే తిరుమలరావు ” అదెలాగే! ఆలోచన లేకుండా వాగుతావ్! మన గదిలో నీళ్ళు వారికెలా ఇస్తాం? నోరుమూసుక్కూర్చో లేవా “ అంటూ భార్యపై ఆగ్రహించాడు. ఆమె ” ఈ నీళ్ళు మనవా! ఈ కరెంటు మనం కడుతున్నామా! అంతా ఆ శ్రీనివాసునిదే! భక్తులందరి కోసమే కదండీ ” అంది. “నోరు మూసుకుంటావా! నాకే ఎదురుచెప్తావా! వెళ్ళు, జాగ్రత్త ” అంటూ భర్త కోప్పడగానే , ముఖం చిన్న బుచ్చుకుని లోని కెళ్ళింది.

 

బకెట్స్ పట్టుకొచ్చిన పక్క వసతి గది ఇల్లాలు అతడి మాటలు విని, చిన్న బోయి నిల్చుంది. ఇంతలో ఎలక్ట్రీషియన్ వచ్చాడు తన పరికరాల పెట్టెతో. ఐదు నిముషాల్లో గీజర్ స్విచ్ బాగు చేసేసి వెళ్ళాడు. వారు స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళి పోయారు.

 

మరునాడు సుప్రభాత దర్శనానికై తిరుమలరావు కుటుంబం ఆయత్త మైంది. ఐతే స్నానాలు చేయను గీజరు వేడి నీళ్ళివ్వ లేదు. సీతాలక్ష్మి తిరుమల రావు చేత ఎలక్ట్రీషియన్ కు ఫోన్ చేయించింది. ఉదయం తొమ్మిదికి వస్తానని సమాధానం చెప్పాడు , ఏం చేయనూ పాలుపోక వరండాలో తిరుగుతున్న సీతాలక్ష్మిని , పక్క గది ఇల్లాలు పలకరించి , విషయం తెల్సుకుని , గబగబా లోని కెళ్ళి రెండు బకెట్స్ నిండా వేడి వేడి నీరు తెచ్చి గుమ్మం ముందు ఉంచి,” కానివ్వండి స్నానాలు, మేమూ సుప్రభాత దర్శనానికే నండీ!, అంతా కలిసే వెళ్దాం. ” అంది నవ్వుతూ.

గదిలోంచి అంతా వింటూన్న తిరుమలరావు తన దిగజారుడు బుధ్ధికి , లేకితనానికీ సిగ్గిలి తలదించుకున్నాడు.

————————

2 thoughts on “లేకితనం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *