రచన: టి.వి.ఎస్.శాస్త్రి

నాకు ఈ మధ్య ఒక కోరిక కలిగింది. మీరు నవ్వుకున్నాసరే! ఆ కోరిక చెప్పితీరుతాను. అది ఏమిటంటే ‘సన్యసించాలని’! ఆధ్యాత్మిక వాసనలు ఎక్కువై సన్యసించాలనుకోవటంలేదు. ప్రాపంచిక సుఖాలమీద మోజు ఎక్కువై సన్యసించాలనుకుంటున్నాను. అబ్బురపడకండి!అటువంటి కోరిక కలగటానికి కారణం, ఈనాటి కొంతమంది ‘సన్యాసుల’ జీవితాలను గురించిన విశేషాలు విన్న తరువాత నాకు మాత్రం అనిపిస్తుంది– బ్రతికితే సన్యాసిగానే బ్రతకాలని!ఈ మధ్య ఒక సన్యాసి కాని సన్యాసి 5 కోట్ల రూపాయల జరిమానాను 3 వారాల్లో కడతానన్నాడు !40 ఏళ్ళు ఉద్యోగం చేసి సంపాదించినా అందులో పావువంతు కూడా మిగుల్చుకోలేం! మనం పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ మధ్యలో తీసుకుంటే టాక్స్ వేస్తారట. మధ్య తరగతి ప్రజలు పెడబొబ్బలు పెడితే దానిని ఉపసంహరించుకున్నారనుకోండి!

ఈరోజు మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళు–సినిమాతారలు, క్రికెట్ క్రీడాకారులు, రాజకీయనాయకులు మరియూ సన్యాసులు. వీరందరిలో మొదటి స్థానం సన్యాసులదే! ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ సన్యాసులను ఆశ్రయించి, వారి ఆశీర్వాదాల కోసం ఎదురు చూసేవారే!

ఇవన్నీ గాక నా అదృష్టం బాగుంటే, నా వాగ్ధాటి జనానికి నచ్చితే రాబోయే రోజుల్లో నాకు ‘పద్మ’సత్కారాలు కూడా రావచ్చునేమో! ఈ నా కోరికను ముందుగా నా ప్రాణ స్నేహితునికి తెలియచేశాను. వాడు ఆశ్చర్యపోయి–ఇదేమి కోరికరా బాబూ! ఎవరైనా వింటే నవ్వుతారు అని సూక్ష్మంగా మందలించాడు. వాడికి అసలు విషయం చెప్పిన తరువాత ఆనందంతో నా అభిప్రాయంతో ఏకీభవించి, తొందరగా నిర్ణయం తీసుకో!అందులో ఇది మంచి సీజన్ కూడా అని చెప్పాడు. సన్యాసులకు సీజన్ ఏమిటిరా అంటే, వాడు ‘నవరాత్రులు’వస్తున్నాయి, నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికి ఇదే అనువైన కాలం అని వాడికున్న పరిజ్ఞానాన్ని కూడా చూపించాడు. సన్యాసం పుచ్చుకున్నా వీడిని వదలకూడదని నిశ్చయించుకున్నాను. సన్యాసం పుచ్చుకుంటే మొదటి లాభం–మనం చేసిన అప్పులు తీర్చనవసరం లేదట! అలా అని ఒక లాయర్ మిత్రుడు చెప్పాడు, చెప్పటమే కాకుండా నాకు న్యాయశాస్త్ర గ్రంధాలను కూడా చూపించాడు. వాడు నాకొక సలహా కూడా ఇచ్చాడు. అదేమిటంటే “సన్యసించే ముందు విపరీతంగా అప్పులు చెయ్యి. తరువాత సన్యసించు”అని. శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేస్తుంటే, అర్జునుడు కృష్ణుని కాళ్ళ వద్ద నమస్కరిస్తూ శ్రద్ధగా వింటున్న దృశ్యం నా కళ్ళ ముందు కనపడింది. ఆ క్షణంలోనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.

అదేమిటంటే నా ఆశ్రమానికి వీడినే న్యాయ సలహాదారుడిని చేయాలని! ఆశ్రమాలకు న్యాయ సలహాదారులు కూడా కావాలని వాడు చెప్పేదాకా నాకు తెలియదు. ఇలా నాకు కలిగిన కోరికను అందరికీ చెప్పాను, నా పిల్లలూ భార్యకూ తప్ప!ముందు బయట వాళ్లకు చెబితే, వారి ద్వారానే వీళ్ళకు తెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదీగాక నా కోరికను సమర్ధించటం కోసం, పీకల దాకా ఇరుక్కున్న నా మిత్రులు, నాభార్యా పిల్లలనూ వాళ్ళే చచ్చినట్లు ఒప్పిస్తారు. నేను సన్యసించటానికి అన్నిటికంటే ముఖ్య కారణం–నాకు అమెరికాలో కూడా కొంత బేస్ ఉండటం. కళ్ళ ముందు డాలర్ల కల్పవృక్షం కనపడింది. ఇంతవరకూ బాగానే లాక్కొచ్చాను కదూ! పేరు కూడా నిర్ణయించుకున్నాను–‘శ్రీ సదానందేంద్ర స్వామి’. పేరు కూడా బాగుంది కదూ! ‘సదానందం’ కోసమే కదా సన్యసిస్తున్నది! వేషం భాష ఇవన్నీ పెద్ద విశేషాలేమీ కావు. నా స్నేహితులకు అన్నీ నచ్చాయి. నా కన్నా వాళ్ళ తొందర ఎక్కువైంది. ఎందుకో వాళ్ళ మీద నాకు కొద్దిగా అనుమానం వేసి ఇలా అడిగాను—“ఇంత అవగాహన, సన్యాసుల జీవితాలను గురించి పూర్తిగా తెలిసిన మీరు సన్యసించకుండా, నన్నెందుకు ముందుకు తోస్తున్నారు?”అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం—“నీవు నాలుగు మాటలు మాట్లాడి బ్రతకగలవు. పైగా మహారాజశ్రీ శ్రీగిరీశం గారికి ఉన్నట్లు కొద్దిగా eloquence కూడా ఉంది. ప్రస్తుతపు రోజుల్లో సన్యాసులకు కావలసిన అర్హతలూ, లక్షణాలూ మాలో కన్నా నీలోనే పుష్కలంగా ఉన్నాయి. ” చాలావరకు కన్విన్స్ అయ్యాను. అనవసరంగా ప్రాణస్నేహితులను శంకించినందుకు బాధ కూడా పడ్డాను.

నా స్నేహితుల్లో ఒకడు మాత్రం చాలా భయపడుతున్నాడు. వాడు వేదాంత గ్రంధాలను ఎక్కువగా చదువుతాడు. వాడు చెప్పేదేమిటంటే, –“ఇంత జటిలమైన వేదాంత విషయాలను ఎలా చెప్పగలవు ?మరియూ వినే వాళ్ళ సందేహాలను ఎలా తీరుస్తావు?”అని. అప్పుడు వాడిని నేను సూటిగా ఒక ప్రశ్న వేశాను, “నీవు ఎంతకాలం నుండి వేదాంత గ్రంధాలను చదువుతున్నావు?నీ సందేహాలు ఏమైనా తీరాయా?” అని. అందుకు వాడు తల అడ్డంగా తిప్పుతూ, “ఒకళ్ళు చెప్పింది మరొకళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పింది, వీళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. ఇంతవరకూ నాకు ఒక్క విషయం అర్ధం కాలేదు. ” అని వాడు చెప్పాడు. అయినా సరే వేదాంత ఉపన్యాసాలు వినటానికి వెళ్ళుతుంటాడు, వందల రూపాయలు పెట్టి పుస్తకాలు కొంటూ వుంటాడు. అప్పుడు వాడితో చెప్పాను, “నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ దేశంలో! వాళ్లకు ‘వేదాంత పిచ్చి’. మనం తెలుసుకోవాల్సిన విషయాలు బయట ఎక్కడో ఉంటాయని, వారి భ్రమ!మనకు అర్ధం కానివన్నీ గొప్పవనుకుంటారు కొందరు, అర్ధం చేసుకొనటానికి ప్రయత్నించరు మరి కొందరు!” అని చెప్పాను. ఇంతలో వాడు హడావుడిగా, ఇప్పుడు పత్రికా విలేఖరులు, TV వాళ్ళు వస్తున్నారట! అని బాంబు పేల్చాడు. ఏమి చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాను.

ఎందుకంటే, వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత తేలికకాదు. నా ఆలోచనకు వాడే బ్రేక్ వేసి– వాడే ఇలా చేస్తే సరిపోతుంది, అంత ఖంగారు దేనికి?అని నన్ను తేలిక పరిచాడు. “ఏమి చెయ్యాలో తొందరగా చెప్పు!” అని వాడిని తొందర చేశాను. వాడు ఇలా చెప్పాడు”స్వామి, మూర్ఖులతో మాట్లాడరు అని చెప్పి వారిని పంపివేస్తాను. ” “ఈ ఆలోచన నీకెక్కడి నుండి వచ్చిందిరా?”అని వాడిని అడిగితే వాడు–“పూర్వం నాకున్న ఒక మూర్ఖ భక్త స్నేహితుడు ఈ విషయం చెప్పాడు. “అని అన్నాడు. “ఇంక ఆలస్యం ఎందుకు? తొందరగా ఏదో ఒక పీఠం ఎక్కు. “అని వాడు తొందర పెడుతున్నాడు. అందుకు, నేను, “తొందర పడకు. ప్రజలు మనలను దైవాంశ సంభూతులుగా నమ్మాలంటే, వారికి కొన్ని శక్తులు (magics)చూపించాలి. చేతిలోంచి చిటికెడు బూడిద తీసి వారికి ఇస్తే, వారు మనకు గుప్పెడు బంగారం ఇస్తారు. వారికి ‘విభూతియోగం!’, మనకు ‘స్వర్ణయోగం!’. ప్రజలకు బూడిద ఇచ్చే విద్య నేర్చుకోవటం ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది. అదీ గాక తన్మయత్వంతో నృత్యం చేసే నటనను కూడా నేర్చుకోవాలి!అవి పూర్తి కాగానే నీవన్నట్లు ఏదో ఒక పీఠం ఎక్కుతాను. పైగా నాకు ఒక కేంద్ర మంత్రిగారి మద్దతు కూడా ఉంది. మనకు రాబోయేది ‘స్వర్ణయుగం’. “పనిలో పని ‘రక్తపాతం’కూడా నేర్చుకో గురూ! నాలుగు డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు!”అన్నాడు నా స్నేహితుడు. “రక్తపాతం కాదురా ‘శక్తి పాతం’ అది. అంటే జనం నెత్తిన చేతులు పెట్టటం!’అని చెప్పి వాడిని సమాధాన పరచాను. వాడి సందేహాలన్నిటినీ తీర్చాననుకున్నాను. వాడు అంతటితో వదిలి పెట్టలేదు, ఇదే నా చివరి సందేహం, ఇదొక్కటి తీరుస్తే చాలు నాకు చాలా సంతోషం, అని ఇలా అడిగాడు వాడు, “అసలు వేదాంతం అంటే ఏమిటో చెప్పు చూద్దాం?”అని సూటిగా ఒక ప్రశ్న వేశాడు.

కొద్దిసేపు ఆలోచించాను. నాకు ‘విప్రనారాయణ’ సినిమా గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో దేవదేవి(భానుమతి), రంగరాజుని(రేలంగి)ని ఇదే ప్రశ్నవేస్తుంది. అప్పుడు, రంగరాజు ఇలా చెబుతాడు, “చెప్పేవాడికీ, వినేవాడికీ ఇద్దరికీ అర్ధంకాని దానినే వేదాంతం అంటారు”అని. (శ్రీ సముద్రాల గారు ఎంత వి(స)లక్షణంగా చెప్పారో చూడండి! ఆ మహనీయునికి నా శ్రద్ధాంజలి!) అదే సమాధానాన్ని వాడికి చెప్పాను. వాడికి ఇదొక్కటే బాగా అర్ధమయినట్లున్నది. సంతోషంగా వాడు కూడా నాకు పచ్చ జండా చూపించాడు. “నీ ప్రణాళికతో నీవు ముందుకు పో! జనాన్ని నేను పోగు చేస్తాను. ఈ ‘వేదాంతం పిచ్చి’వాళ్ళలో నాకు ‘పిచ్చ’ సర్కిల్ ఉంది. వాళ్ళు విపరీతంగా వేదాంత గ్రంధాలను అప్పుచేసి మరీ వందల రూపాయలు పెట్టి కొంటుంటారు. అందులో ఈ మధ్య నీవు వ్రాయటం కూడా మొదలు పెట్టావు కదా!నీ పుస్తకాలను ‘అచ్చేసి’ఆంద్ర దేశం మీదికి వదిలే హక్కులు మాత్రం నాకే ఇవ్వాలి! పనిలోపనిగా వాటితో కలిపి నా వద్దనున్న పాత పుస్తకాలను కూడా ఏదో ఒక ధరకు అమ్ముకుంటాను. గో ఎహెడ్ !” అని వాడు చెప్పాడు. సన్యాసం స్వీకరించక ముందే చాలామంది శిష్యులు పోగయ్యారు. ఇందాకటి మిత్రుడి సందేహాలన్నీ తీరినాయి. వాడి పనిలో వాడు మునిగిపోయాడు. నా వేదాంత పరిజ్ఞానానికి వాడు అమితమైన ఆనందంపొంది, అప్పుడే రోజూ నా దగ్గరికి రావటం, జనాన్ని తీసుకురావటం మొదలు పెట్టాడు. ఇంక మంచి ముహూర్తం చూసి సన్యసించటమే నా తదుపరి కార్యక్రమం!

(ఇది కేవలం వ్యంగ్య, హాస్య రచన మాత్రమే! ఎవరినీ ఉద్దేశించి వ్రాసింది కాదు. ఎవరైనా భుజాలు తడుముకుంటే మాత్రం నా బాధ్యత కాదు!)

టీవీయస్. శాస్త్రి

By

46 thoughts on “ఏదో ఒకరోజు నేను సన్యసిస్తా!”
  1. Dear TVS, మీ పీఠం పేరు లో ఇంద్రుణ్ణి దించి, ఆయనగారు పరకాయప్రవేశాన అహల్యను కామించిన
    గాధను గుప్తంగా గుర్తు చేశారు.అమ్మో! మీరు ఎంతకైనా తెగించేట్టున్నారు.సదానంద స్వాములవారి చెంతకు ఆధ్యాత్మిక”చింత” తో ఆవాసభామలు సావాసం కోసం సమీపిస్తారు.ప్రత్యేక శయనాగారము
    సమీకరించుకోండి.ఎందుకైనా మంచిది,గిట్టని “ముండలు” సీ సీ కెమెరాలు పెడతారు,జాగ్రత్త.మరోమాట!
    నేను ‘సాయిబు’ ని గదా! పగలు ధూపం వేయడానికి సామ్రాణి,రేరాణులకొరకు అరేబియన్ నైట్స్ సెంటు
    హోలు’సేలుగా సప్లయి చేస్తాను,hole ‘ sale రేటుకే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *