April 16, 2024

శుభోదయం – 9

రచన: డి.కామేశ్వరి

“ఏమిటి పెద్ద త్యాగం చేసాననుకుంటున్నావా? భర్తని యింకోరికిచ్చి ఈ పెళ్లి చేసి? ఏమిటసలు నీ ఉద్ధేశం? ఆ మాధవ్ వెధవ పని చేస్తే మొహం యీడ్చకుండా, ఏదో పెద్ద ఘనకార్యం చేశాననుకుంటున్నావా యీ పెళ్లి చేసి?” సరళ స్నేహితురాలిమీద విరుచుకుపడింది. మాధవ్, శారదల పెళ్లి దేముడి గుడిలో క్లుప్తంగా జరిగింది నిన్న. అది విని సుడిగాలిలా వచ్చి రాధని దులిపి వదిలింది.
రాధ నిర్లిప్తంగా నవ్వింది. “మాధవ్ యింక నా భర్త కాడని నీకు తెలుసు సరళా, మా యిద్దరి మధ్య ఆ అనుబంధం ఏమీ మిగలలేదు. నా సుఖం, సంతోషం, శాంతి అన్నీ ఆనాడే పోయాయి. కనీసం మాధవ్‌ని అయినా సుఖపడనీ”.
“ఆహా! పెద్ద పతివ్రత. భర్త సుఖమే నీ సుఖం. నీవేమో ఏడుస్తూ జీవితాంతం గడుపుతావు. అతను మరో పెళ్లి చేసుకుని, పిల్లల్ని కంటూ సుఖంగా వుంటాడు. అంతే, మన ఆడవాళ్లం ఏం చదివినా మారం. అక్కరలేని వెధవ వుద్యోగాలూ, మనమూ.. ఒక్కమాట.. ముందు ఒక్కమాట చెప్పావే. నీ ఆప్తురాలినని అంటావు”నిష్టూరంగా అంది సరళ.
“సరళా! కోపం మాని ఆలోచించు. యిష్టంలేని మగవాడితో ఎన్నాళ్లు నిప్పులమీద నడకలా కలిసి బతకమంటావు చెప్పు? నా ఉనికే అతనికి కంటకంగా వుంది. పిల్లాడి నీడే భరించలేక యింట్లో నరకం సృష్టిస్తుంటే ఎన్నాళ్లు సహించనే? నేనెలాగో అన్నీ నష్టపోయాను. ఆ శారద పిచ్చి మొహంది. ఆ అమ్మాయికన్నా అన్యాయం జరగకూడదే. నేను వెడితే మాధవ్ మరొకత్తిని తెచ్చుకుని చేసుకుంటాడే. శారద ఖర్మానికి శారదని వదిలి. అంచేత పట్టుపట్టి చేశానే.”
స్నేహితురాలి మొహం చూస్తుంటే సరళ కంఠం నిండుకుంది.”ఇప్పుడింక ఏం చేస్తావే? నీ కళ్లెదుటే నీ మాధవ్ మరొకరితో సంసారం చేస్తూంటే చూస్తూ ఎలా సహిస్తావు? ఇంక నీ జీవితం వంటరిగా యిలా వెళ్లవలసిందేనా?” బాధగా అంది సరళ.
“కళ్ళెదుట చూస్తూ వుండనే. ఈ వూరినించి వెళ్లిపోతా. ప్రిన్సిపాల్‌తో నా వ్యథ అంతా చెప్పి నన్నీవూరునించి పంపించమని వేడుకున్నాను. ఆయన అర్ధం చేసుకున్నారు. వీలయినంత త్వరలో ట్రాన్స్‌ఫర్ ఏర్పాట్లు చూస్తానని మాటిచ్చారు. నేను వంటరినెలా అయానే. ఇదిగో వీడు నాకు తోడుంటాడు కదా. వీడికోసమే కదా నా బతుకు యింక. దేవుడి దయవల్ల నాకు వుద్యోగం వుండడం ఎంత మేలయిందో చూశావా? నాకీ ఆర్ధిక స్వాతంత్ర్యం లేకపోతే ఆయనను ఎదిరించగలిగేదాన్నా? ఎదిరించితే నోరుమూయించి మూల కూర్చోపెట్టి, మరో పెళ్లి చేస్కుని నన్ను దాసిదాన్ని చేసేవారుగదే. ప్రతి ఆడదానికి ఆర్ధిక స్వాతంత్ర్యం రావాలే. లేకపోతే వీళ్ల అన్యాయాలని ఎదిరించలేం. ప్లీజ్. సరళా అలా మొహం పెట్టకే. నాకేం అవలేదు. ఇన్నాళ్ళు వీడితో ఈ యింట్లో అనుక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు బతికాను. ఇప్పుడింక స్వేచ్చగా, హాయిగా, నవ్వుతూ నా బిడ్డని పెంచి పెద్ద చేసుకుంటాను” రాధ నిశ్చింతగా అంది.
“ఆ శారద ఏమంటుందే? ఆ పిచ్చిమొహం కాపురం ఎలా చేస్తుందే? పార్వతమ్మగారేమంటుంది?”
శారద నిజంగా సంతోషించిందే. అప్పుడే ఆ అమ్మాయిలో ఏదో కళ, కాంతి వచ్చాయి పెళ్లవగానే. కాపురం చేసుకుంటుంటే గడుసుదనం అదే వస్తుంది. పార్వతమ్మగారే పాపం కూతురి పెళ్లయిందన్న ఆనందం ఒక పక్క. నా బతుకిలా అయిందని ఆవేదన ఒక పక్క. ఆవిడని వప్పించడమే కష్టం అయింది. ఈ వూరు వదిలి వెళ్లద్దంటుంది. కాని నేనిక్కడ వుండలేనే. ఏదోవూరు, దూరంగా, యీ పరిసరాలనించి, నా సంగతి ఎవరికీ తెలియని చోటికి వెళ్లి ప్రశాంతంగా బతకాలని వుందే” కళ్లు మూసుకుంటూ అంది రాధ. ఆ మూసిన కళ్లనించి నీళ్లు జారాయి.

**********

“అంకుల్… అంకుల్.. మీరొకసారి మా యింటికి వెంటనే రాగలరా?” శ్యాం ఆదుర్దాగా అడిగాడు ఫోనులో.
“ఏమయింది? ఎందుకు?” గాభరాగా అడిగాడు అవతలనించి రాజారాం.
“అంకుల్.. అమ్మ ఏదోలా వుంది. ఒక విషయం జరిగింది. అమ్మ చాలా అప్‌సెట్ అయింది. నేనేం అడిగినా చెప్పడంలేదు. మీరొకసారి వస్తే అమ్మ గదిలోంచి వస్తుందేమో. నాకెందుకో గాభరాగా వుంది ప్లీజ్, రండి అంకుల్” శ్యాం ప్రాదేయపడ్డాడు.
“ఆల్‌రైట్, వస్తున్నాను” ఫోన్ పెట్టేశాడు రాజారాం.
రాజారాం స్కూటర్ దిగుతుండగానే గుమ్మంలోనే ఎదురువెళ్లాడు శ్యాం. అతని ఆరాటం చూసి “ఏమయింది శ్యాం? ఏం జరిగిందివాళ? రాధ ఏది?” అతను డ్రాయింగురూములోకి వచ్చి అడిగాడు. శ్యాం ఆదుర్దాగా రేఖమీద అత్యాచారం జరిగిందగ్గిరనుండి అంతా చెప్పి రేఖ తండ్రి తల్లిని ఎలా అవమానించింది, తల్లి ఎలా బాధపడిందీ అంతా చెప్పుకొచ్చాడు.
“అంకుల్! ఆయన ఎవరంటే ఆఖరికి తన భర్త అని చెప్ప్పుకొచ్చింది. ఇంకేం అడిగినా చెప్పలేదు. ఆయన తన మీద కక్ష తీర్చుకొవడానికి రేఖమీద అమ్మే అత్యాచారం చేయించిందంటూ ఆరోపణ చేశాడు. ఆయనమీద అమ్మకి కక్ష ఎందుకు? వున్నా రేఖమీద యింత హేయంగా తీర్చుకోదు అమ్మ. నాకంతా అయోమయంగా వుంది. ఎంతడిగినా చెప్పడంలేదు. ఆయన నా తండ్రి అయితే వీడెవడు? దాని కొడుకా? ఆ నల్ల వెధవ ఎంతవాడయ్యాడు అని అన్నాడెందుకు ఆయన? నాకిదంతా ఏం అర్ధం కావడంలేదు. ప్లీజ్, అంకుల్. మీకు అమ్మ సంగతంతా తెలుసు. నాకు చెప్పరా ఏం జరిగిందో? ఆయన నా తండ్రి కాదా? ప్లీజ్ అంకుల్. వళ్ళు మండిపోతూంది. అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా! తనలో తను కుమిలేకంటే నాకు చెప్పితే కాస్త భారం తగ్గుతుందిగా” శ్యాం ఆవేదనగా అన్నాడు. అంతా విని నిట్టూర్చాడు రాజారాం.
“ఆమె చెపితే నీవు బాధపడతావని చెప్పడంలేదు శ్యాం. విని నీవు తట్టుకోలేవని ఆమె భయం..”
“అంకుల్, నేను చిన్నకుర్రాడిని కాను. ఎంత చేదు నిజమైన భరించగలను. ప్లీజ్! మీరన్నా యింక నా దగ్గిర దాచకుండా చెప్పండి.”
“శ్యాం చెపుతాను. కాని ప్రామిస్! నీవు ఏం బాధపడకూడదు మరి. నీవన్నట్టు నీవు పెద్దవాడివయ్యావు. నిజానిజాలు తెలుసుకోవడం మంచిదే.”
ఆ మాటలు విని రాధ తలుపు తీసుకు వచ్చి, రాజారాం చెప్పబోతున్నది విని “రాజారాం! మతిపోయిందా నీకు? ఇన్నాళ్లుగా వాడినించి దాచింది యిప్పుడు చెప్పి వాడి మనసు పాడు చేస్తావా? వద్దు. చెప్పద్దు” గాభరాగా అంది.
‘రాధా.. లేదు. చెప్పే సమయం వచ్చింది. చెప్పడం మంచిదని నా ఉద్దేశం”
“అమ్మా! దయచేసి అంకుల్‌కి అడ్డురాకు. యింతదాకా వచ్చాక ఆ విషయం తెలుసుకోనిదే నాకు శాంతి లేదు. నీవు వెళ్లమ్మా లోపలికి” శ్యాం స్థిరంగా అన్నాడు.
రాధ అయోమయంగా చూసింది.
“రాధా… మరేం ఫరవాలేదు. శ్యాం మగపిల్లాడు. తగిన వయసు వచ్చింది. విని తట్టుకోగల శక్తి వుంది. నన్ను చెప్పనీ”
“శ్యాం.. వద్దు బాబూ నా మాట విను. .. ఇంత కష్టపడి యిన్నాళ్లుగా దాచింది నీకోసంరా. నీ మనశ్శాంతి కోసంరా..” ఆవేదనగా అంది రాధ.
“మనశ్శాంతి కావాలంటే, యీ సగం సగం తెలియడంకంటే నిజం తెలియడం మంచిదమ్మా. అంకుల్ చెప్పండి”
రాధ వినలేనట్టు గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది. రాజారాం తాపీగా సిగరెట్టు వెలిగించుకుని రాధ తనకు చెప్పిన విషయాలన్నీ ఓ కథలా అరగంట చెప్పాడు. అంతా విన్న శ్యాం మొహం పాలిపోయింది.
“మైగాడ్.. అమ్మ… అమ్మని రేప్ చేస్తే.. తండ్రి ఎవరో తెలియకుండా పుట్టినవాడినా నేను? అమ్మ అందుకే ఆయన్ని వదిలి వచ్చిందా” నుదుట పట్టిన చెమట వత్తుకుంటూ అన్నాడు శ్యాం. పట్టుకున్న గొంతుతో.
“అదిగో, యూ ఆర్ ఫీలింగ్ బాడ్. చూడు శ్యాం! ఇన్నాళ్ల తరువాత ఆ విషయం గురించి నీవు బాధపడకూడదు. తండ్రి ఎవరైతేనేమి నీవు ఏ పరిస్థితిలో పుడితేనేం? ప్రతి తల్లిలాగే, అంతకంటే ఎక్కువగా నిన్ను పెంచింది రాధ. నీకోసం మాధవ్‌ని వదిలి వచ్చింది. నీకోసం..నన్ను.. నన్ను కాదంది. నీకోసం నేను అందించిన అవకాశాన్ని కాదని స్వసుఖాలని త్యాగం చేసింది. అలాంటి తల్లి వున్నందుకు గర్వపడాలి నీవు. శ్యాం, నీ పుట్టుకగురించి మర్చిపో. పుట్టుక ఎలాంటిదైనా పెంపకంలో మనిషి ప్రవర్తన వుంటుందని నిరూపించింది రాధ.”
“అంకుల్.. మీరు అమ్మకి వరసకి అన్నగారవుతారంది. మరి మీరు.. అమ్మ మిమ్మల్ని కాదంది అంటున్నారేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు.
రాజారాం చిన్నగా నవ్వాడు.
“భర్త స్థానం యివ్వనన్నాక ఆ మగాడు సోదరుడే అవుతాడు. మా మధ్య బంధుత్వం లేదు స్నేహం వుంది. మమత వుంది. సౌహార్ధం .. రాధ నాకు యిప్పుడు తోడబుట్టినదానితో సమానం. ఏ మంచి చెడ్డయినా నన్నడగకుండా చెయ్యదు రాధ” రాజారాం గర్వంగా అన్నాడు.
“మరయితే.. నాకోసం మిమ్మల్ని ఎందుకు కాదనడం అంకుల్..”
“శ్యాం… మీ అమ్మ దగాపడిన ఆడది. కట్టుకున్న భర్త ప్రేమించి పెళ్ళిచేసుకున్న రెండేళ్ళ అనుబంధాన్ని తృణప్రాయంగా తెంచుకోగలిగినప్పుడు, యింకో మగాడు మాత్రం శీలం కోల్పోయిన స్త్రీని పెళ్ళాడి ఆదరించి ప్రేమించగలడా అని అనుమానం. ఏ మగాడుకాని తమ రక్తం పంచుకుని పుట్టని బిడ్డని తన బిడ్డగా స్వీకరించి ప్రేమించలేరని దానివల్ల కట్టుకున్నవాడికి, తనకు సుఖం వుండదని, తన బిడ్డ మధ్య నలుగుతాడని తనకింక వివాహేచ్చ లేదని నన్ను తిరస్కరించింది. అప్పటినించి నీవే లోకంగా, నీతోడిదే ప్రపంచంగా వంటరిగా బతుకుతుంది”
“నాకోసం తన సుఖాలన్నింటినీ బలిపెట్టి యింత త్యాగం చేసిందన్నమాట” చెమర్చిన కళ్లతో అన్నాడు శ్యాం.
“త్యాగం అని ఆమె అనుకోలేదు. బాధ్యత అనుకుంది. అసలామెకి మాధవ్ ప్రవర్తనతో పురుషులపట్ల అదోరకం విముఖత కలిగింది. ఆమె ప్రేమని, నమ్మకాన్ని మాధవ్ దెబ్బతీసాక ఆమెలో అదోరకం విరక్తి, నిర్లిప్తత బయలుదేరాయి.”
“అంకుల్.. అమ్మకి మీకూ ఎలా పరిచయం?” కుతూహలంగా అడిగాడు శ్యాం.
“మీ అమ్మ యీ కాలేజీలో పనిచేసేముందు ఆరునెలలు మా కాలేజీలో పని చేసింది. అప్పుడే మా పరిచయం. ఎంతో దిగులుగా, ఈ ప్రపంచ భారాన్నంతా మోస్తున్నట్టు కృంగిపోతూ, బిక్కుబిక్కుమంటూ ఓ మూల ఎవరితో మాట్లాడకుండా కూర్చునే రాధని చూసి నాకెందుకో తెలియని కుతూహలం కలిగింది. ఆమె అందం నన్ను ఆకర్షించింది. ఆమె వివరాలు కూపీ లాగాను. వివాహితురాలని, బిడ్డతల్లని తెలిశాక నీరుకారిపోయాను. అయినా ఆమెపట్ల అభిమానం చావలేదు. కావాలని పలకరిస్తూ ఆమెతో చనువు పెంచుకున్నాను.
ఒకసారి నీకు మూడేళ్ళప్పుడు చాలా జబ్బు చేసింది. ఆ వంటరితనంలో దిక్కుతోచక బెంబేలు పడిన రాధ నా సహాయం కోరింది. అప్పటినించి యిద్దరం స్నేహితులమయ్యాం. ఆ స్నేహం పెంపొందాక పెళ్ళి చేసుకుందామా అంటే వప్పుకోలేదు. ఎంతగానొ అడిగితే అప్పుడీ సంగతి చెప్పింది. విని షాక్ అయ్యాను. అయినా ఫరవాలేదన్నాను ఆఖరికి. ఫరవాలేదన్న ఆ మాట విన్నాక నా గొంతులో దృఢత్వం తగ్గిపోవడం మీ అమ్మ గుర్తించింది కాబోలు ససేమిరా వద్దంది. మనం స్నేహితులుగానే వుందాం అంది. నాకు ఎవరు లేని లోటు అన్నగా తీర్చమంది. లోకులు అనుమాన పడకుండా నన్ను పెళ్ళి చేసుకునేవరకు ప్రాణం తీసింది. ఆనాటినుండి మేం ఒకే కుటుంబంలోణి వ్యక్తుల్లా కష్టానికి, సుఖానికి కలిసిమెలిసి వుంటాం. “రాజారాం! నీకు ఆడపిల్లలుంటే నా కోడల్ని చేసుకునేదాన్ని గదా” అని విచారించేది మీ అమ్మ..”
“అంకుల్.. యింత నల్లగా, యింత అసహ్యంగా ఎందుకు పుట్టానా అని మధనపడేవాడ్ని,. ఆ ప్రశ్నకి జవాబు యిన్నాళ్ళకి దొరికింది. ఎంత దురదృష్టవంటుడ్ని. ఎవడో.. తెలియని అనామకుడు. రౌడీ నా తండ్రి అవడం.. ఎంత దౌర్భాగ్యం..”
“హుష్.. స్టాపిట్.. నీవిలా అంటే మీ అమ్మ చెప్పినందుకు నన్ను తిడ్తుంది. ఫర్‌గెట్ దట్ స్టోరీ. యిన్నాళ్ల తరువాత ఆ మాధవ కూతురు యిలా మిమ్మల్ని కలవడం, ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగడం, దానికి రాధని కారణం చెయ్యడం.. ఎంత విచిత్రం.. ఆ మాధవ్.. ఆ స్టుపిడ్ హీ యీజ్.. రాధని యిలా ఊహించాడంటే.. వాడు ఆమెని ప్రేమించడం అంతా అబద్ధం అన్నమాట అనుకోవాలి. ఆమె మనసెలాంటిదో గుర్తించలేని వాడు. వాడు ప్రేమించింది ఆమె అందాన్ని అన్నమాట..”కోపంగా అన్నాడు.
“అంకుల్.. ఆయన్ ఆమ్మని ఎన్నిమాటలు అన్నాడు? నాకు వళ్లు మండుతుంది. రేఖ అంటే అమ్మకి ఎంత అభిమానం. ఎలాంటి నెపం వేశాడు?” ఆవేశంగా అన్నాడు. రాధ నెమ్మదిగా గదిలోంచి వచ్చింది. భయంగా శ్యాం మొహం చూసింది. ఆరాటంగా అతని మొహంలో భావం వెదకాలని ప్రయత్నించింది. తల్లి కలవరపాటు గుర్తించి శ్యాం చిన్నగా నవ్వాడు.
ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *