March 28, 2024

అనగనగా ఒక రాజు

రచన: ధనికొండ రవిప్రసాద్

“ఏం గురూ ! ఈ మధ్య కథలేమీ రాయట్లేదా ? ” అన్నాడు సుబ్బారావ్.
“పత్రికలకి రాస్తూనే ఉన్నా” అన్నాను.
“ఇంకా పత్రికల కథల దగ్గరే ఉన్నావా ? ఏ టి.వి.సీరియల్సో రాయక. ఆ పత్రికలోళ్లు పది కతల్రాస్తే ఒక కత యెయ్యటమే ఎక్కువ. ఆళ్లిచ్చే డబ్బులు మనకేం లెక్క ! ఈ మద్య నేను టి.వి. సీరియల్స్ కి రాస్తన్నా అన్నాడు.
నాకు మతి పోయినంత పని అయ్యింది. “నువ్వు టి.వి. సీరియల్స్ కి రాస్తున్నావా ? అసలు నువ్వెప్పుడూ పత్రికలో కూడా ఒక కథ రాసిన గుర్తు లేదు . నవలలు కూడా చదివేవాడివి కాదు. అప్పుడే ఇంత ఎదిగిపోయావ్!” అన్నాను ఆశ్చర్యంగా.
“మనకెప్పుడూ జంపింగే కానీ వాకింగ్ తెలియదులే. ఈ మద్యన అనగనగా ఒక రాజు అని కొత్త సీరియల్ మొదలెట్టా” అన్నాడు.
“వెరీ గుడ్! కథ ఎవరిది ? డైరెక్టర్ ఎవరు ? నిర్మాత ఎవరు?” అన్నాను.
“అన్నీ మనం చూస్కోటమే. డబ్బులెట్టి యేరే వోణ్ని తెచ్చుకోటమెందుకు ? అన్నాడు.
“ఇంతకీ కథ ఏమిటో బ్రీఫ్ గా చెప్పు” అన్నాను.
“మనం ఒకటో క్లాసులో “అనగనగా ఒక రాజు. రాజుకి ఏడుగురు కొడుకులు. చేపలు తెచ్చారు” అనే కత చదివాం గుర్తుందా ! దాన్ని సీరియల్ గా తీద్దామనుకుంటున్నా” అన్నాడు.
నా మతి మళ్లీ పోయింది. “ఆ కథ అంతా కలిపి ఒక పేజీ వొస్తుంది. దాన్ని సీరియల్ చెయ్యటమేమిటి? అన్నాను.
ఇక కథని సీన్స్ గా విడగొట్టి చెప్పటం మొదలెట్టాడు సుబ్బారావ్.
మొదటి సీన్ లో రాజు గారు, రాణి గారు బంగారు పళ్లేలలో భోంచేస్తూ ఉంటారు. భోజనం ముగించిన రాజు గారు “దేవీ ! ఈ నాటి సొరకాయ పులుసు అద్భుతంగా ఉన్నది. ఇది చేసిన వంటవాడెవ్వడు ? ” అంటారు.
“నేనే స్వామీ ! ” అంటుంది రాణి.
“దేవీ ! మీరు !! ! వంట చెయ్యటమా !!!” అనే డైలాగ్ రిపిటీషన్ తో . కొంపలు తగలడ్డ సీనుకి కొట్టినంత మ్యూజిక్ ఉంటాయి.
“అవును మహారాజా ! ఏ స్త్రీ అయినా భర్తకి స్వయంగా సేవ చెయ్యటంలోనే ఆనందిస్తుంది.” అంటుంది రాణి.
” ఈ రోజు మేము ఆరగించిన సొరకాయ పులుసు ఎందులకో సొర చేపను జ్ఞప్తికి తెచ్చినది . సొరచేప తిని ఎంతో కాలమైనది.” అంటారు రాజు గారు.
“రేపు సముద్రం లో దిగి పట్టుకు రమ్మంటారా ?” అంటుంది రాణి గారు.
“దేవీ ! ఏమంటి రేమంటిరి ! రాణివాసంలో ఉండే మీరు – సామాన్య స్త్రీ వలే – సముద్రం లో – ఈతకొట్టి – చేపలు—- హా! ఎంథ మాఠ ! ఎంత మాఠ ! (దానవీరశూరకర్ణలో యన్ టి ఆర్ లెవెల్ లో). సేవకులున్నారు కదా ! దేవీ ! మీరు ఈతలో ప్రవీణులని మాకు తెలిసినదే. మీరు సముద్రములో ఈదుతూ మత్స్యములను పట్టుచుండగా మీ సౌందర్యం మా మనస్సును హరించినదనీ , ఆ ప్రేమయే మన వివాహానికి కారణమనీ మరువలేదు దేవీ ! కానీ ఈనాడు మీరు పట్టపు రాణి. మీరు చేపల వేటకు వెళ్లటం మన రాచమర్యాదకు శోభనివ్వదు.” అంటారు రాజు గారు.
“మన్నించండి ప్రభూ ! మరొక సూచన . మనకి ఏడుగురు కుమారులున్నారు కదా ! వీరి శక్తిసామర్ధ్యాలను, సాగర లంఘనంలో వారి లాఘవాన్నీ పరీక్షించటానికి సొరచేప వేటని ఒక పరీక్షగా ఏర్పాటు చేద్దాం ” అంటుంది రాణి గారు.
” భళా ! ఇది గొప్ప సూచన దేవీ ” అన్నారు రాజు గారు.
“ఇక్కడికి కథ మొదలు కాకుండానే ఒక ఎపిసోడ్ పూర్తైంది కదా! ” అన్నాడు సుబ్బా రావ్.
“నెక్స్ట్ సీన్ ఏమిటో ఊహించు” అన్నాడు సుబ్బారావ్.
“ఏముంది ! ఆ కొడుకు లంతా వేటకెళ్లి చేపలు తెస్తారు” అన్నాను.
“అదే మీ పత్రికల కథలకి టి.వి, కథలకీ తేడా. మీరు క్లుప్తంగా చెప్పాలనుకుంటారు. మేము విపులంగా చెప్పాలనుకుంటాము. ఏడుగురు కొడుకులు ఏట్లో పడి ఏడు చేపలు తెచ్చినట్టు కథలో ఉంది కానీ ఏడుగురూ ఒకేసారి పడ్డారని చెప్పి తీరాలా ? ఒక్కొక్కళ్లు ఏట్లో బదులు సముద్రంలోకి వెడతారు. మామూలు చేప బదులు సొర చేపకి ప్రయత్నిస్తారు. ఇందులో ప్రతి ఒక్కరూ ఎన్నో ఒడుదుడుకులనుభవిస్తారు. ఇలా కనీసం ముప్ఫై, నలభై వారాలు నడపొచ్చు . ఇక నెక్స్ట్ సీన్.” అని మొదలెట్టాడు సుబ్బారావ్ .
“ఇంతకీ కథలో సస్పెన్స్ ఏముంది ? అందరికీ తెలిసిన కథేగా!” అన్నాను.
“రామాయణ భారతాలల్లో కూడా సస్పెన్స్ లేదు. రావణాసురుడు చస్తాడనీ, దుర్యోధనుడు చస్తాడనీ అందరికీ తెలుసు. అయినా టీ వీ వాళ్లు ఎలా చంపుతారో చూద్దామని అందరూ సంవత్సరాల తరబడి చూట్టం లేదా ? నువ్వు మాటమాటకీ అడ్డం తగలక స్టోరీ విను గురూ! .” అని కంటిన్యూ చేశాడు.
రెండవ ఎపిసోడ్ . “పితాశ్రీ !నన్ను ఆశీర్వదించండి. తమ అభీష్టం మేరకు సొరచేప వేటకు బయలుదేరుతున్నాను.” అంటాడు రాజుగారి పెద్ద కుమారుడు.
“దీర్ఘాయుష్మాన్ భవ !” అని ఆశీర్వదించి ” నీకు తోడుగా నలుగురు సైనికులను తీసుకెళ్లు నాయనా !” అంటారు రాజు గారు .
“మాకు సైనికుల అవసరం లేదు. మా సామర్ధ్యంపై నమ్మకం ఉంచండి పితాశ్రీ ! ” అని యువరాజు అనటం. రాజు బతిమిలాడటం. చివరికి యువరాజు ఒక్కడే బయల్దేరటం ఇదంతా రెండో ఎపిసోడ్ కి సరిపోతుంది..
మూడు , నాలుగు ఎపిసోడ్స్ – యువరాజు సముద్రంలో ఈతకి దిగుతాడు. ఈదుతుండగా అల్లకల్లోలంగా తుఫానొస్తుంది. కానీ అతని దీక్ష అచంచలం. అతడు మొసళ్లతో ఫైటింగ్ చేస్తాడు. అలిసిపోతాడు. అంతటి అలసటలోను మొసలితో పోరాడి ఒక సొరచేపని పట్టుకుని వొడ్డుకి చేరతాడు .
ఐదవ ఎపిసోడ్- రాజుగారు సభ తీర్చి ఉంటారు. జయజయధ్వానాలు మామూలే. రాజ్యంలోని విశేషాలు మంత్రులు చెపుతూ ఉంటారు. ఇంతలో మత్స్యశాఖామంత్రి వస్తాడు.ప్రభూ ! మన రాజ్యం మత్స్యసంపద విషయంలో అద్భుతమైన కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నది. ఈ రాజ్యం ఇంతటి కీర్తిప్రతిష్టలు పొందిందంటే మత్స్యసంపదపై మీకు గల ప్రత్యేక అభిమానమే కారణం. అని సుత్తి కొడతాడు. ఈ సుత్తి ఇలా ఉండగా రాజుగారు “సభాసదులారా ! మంత్రివర్యులారా ! చేపలవేటకై సముద్రానికి వెళ్లిన యువరాజులుంగారు ఇంకా రాలేదు. మా మనమ్ము చింతాక్రాంతమై యున్నది.”అంటారు.
“ప్రభూ ! యువరాజులుంగారికి ఎట్టి ప్రమాదమూ జరగదు. నేనిప్పుడే సముద్రయుద్ధం నేర్చిన వందమంది సైనికులని వెంటపెట్టుకొని వెళ్లి రాజకుమారుని వెంటబెట్టుకొని వస్తాను. వారి ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డువేస్తాం ” అంటూ కాసిని బడాయికోరు డైలాగులు చెపుతాడు.
ఆరవ ఎపిసోడ్- రాణీ గారు తన బిడ్డ క్షేమం కోసం అమ్మవారిని ప్రార్ధిస్తుంది. ఆ సందర్భంలో ఒక పాట రెడీగా ఉంది. దాసీలు ఆమెకి ధైర్యం చెప్పే డైలాగులు ఉంటాయి. ఇంతలో రాజకుమారుడు రొప్పుకుంటూ రోజుకుంటూ చేతిలో చేపల బుట్ట పెట్టుకొని తిరిగొస్తాడు.”నాయనా !” అంటుంది రాణి. “అమ్మా” అని కావిలించుకుంటాడు కొడుకు . “అమ్మా”అనే డైలాగ్ తో ఆ ఎపిసోడ్ ఆఖరు.
“మన సైనికులు నిన్ను సురక్షితంగా తీసుకు వచ్చారా నాయనా ?” అని రాణి అడగటం ఆ విషయం తనకి తెలియదని, తనకు తానే ప్రమాదం నుంచి బయట పడ్డానని రాజకుమారుడు వివరించటం ఆ డైలాగులతో కొంత సమయం గడుస్తుంది. ఇంతలో రాజు గారు అంతః పురానికి వచ్చి తండ్రికి నమస్కరించటం, తండ్రి కౌగిలించుకోవటం, ఆ డైలాగులతో ఏడవ ఎపిసోడ్ సమాప్తి. ఈ మొత్తం ఒక చేప కథ.
ఎనిమిదవ ఎపిసోడ్- రాజుగారి రెండవకుమారుడు కూడా నమస్కారాలు చెయ్యటం ఆశీర్వాదాలు పొందటం మొదలైన ఫార్మాలిటీలు పూర్తి చేసి చేపలు పట్టటానికి బయల్దేరతాడు. శత్రుదేశపు గూఢచారులకి ఈ విషయం తెలిసి రాజకుమారుణ్ని సముద్రంలో మట్టు పెట్టటానికి ప్రయత్నిస్తారు. ఆ శత్రుదేశపు రాజసభ , అక్కడి మంతనాలు తొమ్మిదో ఎపిసోడ్. ఆ తర్వాత వాళ్ల సైనికులు పదిమంది రాజకుమారునిపై దాడి చెయ్యటం అతను సింగిల్ హ్యాండెడ్ గా వాళ్లని ఓడించటం పదవ ఎపిసోడ్. తిరిగి అతడు రాజసభకి రావటం అందరూ మెచ్చుకోవటం నమస్కారాలూ, ఆశీస్సులు పదకొండో ఎపిసోడ్.
పన్నెండవ ఎపిసోడ్ లో మూడో రాజకుమారుడు బయల్దేరటం. పదమూడవ ఎపిసోడ్ లో మిత్ర దేశపు నౌక ప్రమాదం లో చిక్కుకుంటుంది. రాజకుమారుడు తన నైపుణ్యాన్ని , సాహసాన్ని ఉపయోగించి నౌకలోని వారిని రక్షిస్తాడు. పధ్నాలుగో ఎపిసోడ్ వరకూ ఇది నడుస్తుంది. పదిహేనో ఎపిసోడ్ కి అతను చేపని తీసుకొని రావటం , నమస్కారాలు, ఆశీస్సులు వగైరా.
పదహారవ ఎపిసోడ్ లో నాలుగో రాజకుమారుడు బయల్దేరతాడు. ఒంటరిగా వచ్చిన రాజకుమారుణ్ని గమనించి సముద్రపు దొంగలు వెంటపడతారు. పదిహేడు , పద్ధెనిమిది ఎపిసోడ్లు వాళ్ల పోరాటానికి సరిపోతాయి. చివరికి సొరచేప దొరుకుతుంది. పంతొమ్మిదవ ఎపిసోడ్ లో సముద్రపు దొంగలని హతమార్చినందుకు గ్రామస్తులు రాజకుమారుణ్ని అభినందించటం. ఇరవయ్యో ఎపిసోడ్ లో రాజకుమారుడు కొంపకి చేరుకోటం అమ్మా నాన్నల ఆశీస్సులు వగైరా.
ఇరవై ఒకటో ఎపిసోడ్ లో ఐదవ రాజ కుమారుడు బయల్దేరటం. ఇరవ రెండు , ఇరవై మూడు ఎపిసోడ్లలో ఒక మాంత్రికుడు రాజకుమారుణ్ని తన ద్వీపానికి తీసుకు పోవటం. ఇరవై నాలుగో ఎపిసోడ్ లో కాళికాదేవికి బలి యివ్వటానికి ప్రయత్నించటం. ఇరవై ఐదో ఎపిసోడ్ లో వాడి ప్రాణం వాడి శంఖంలో ఉన్నదని గ్రహించిన రాజకుమారుడు ఆ శంఖాన్ని బద్దలుకొట్టి వాణ్ని చంపటం. ఇరవ ఆరో ఎపిసోడ్ లో వాడు ఒక చేపని పట్టుకురావటం నమస్కారాలు, ఆశీస్సులు.
ఇక ఇరవై ఏడో ఎపిసోడ్ లో నమస్కారాలు, ఆశీస్సులూ అయి ఆరో రాజకుమారుడు బయల్దేరటం. ఇరవై ఎనిమిదో ఎపిసోడ్ లో అతను చేప అనుకొని పట్టుకోబోగా అతని చేతికి ప్రమాద వశాత్తు సముద్రంలో పడి కొట్టుకుపోతున్న ఒక అందమైన అమ్మాయి దొరకటం. ఇరవై తొమ్మిదో ఎపిసోడ్ లో ఆమె క్షత్రియ కన్య కాకున్నా ఆమెని రాజకుమారుడు ప్రేమించటం ఇలా కొంత సంస్కరణ భావం చొప్పించటం. ముప్ఫయ్యో ఎపిసోడ్ లో ఆమెని, చేపని తీసుకొని రాజకుమారుడు కొంపకి చేరటం , ముప్ఫై ఒకటో ఎపిసోడ్ లో వారి వివాహానికి రాజు, రాణి అంగీకరించటం.
నేను సుబ్బారావుకి మళ్లీ అడ్డు తగిలాను.” ఇప్పటివరకూ ఎక్కడా లేని హీరోయిన్ వీడికే ఎందుకు కావాల్సొచ్చింది ? అన్నాను.
“ఏంచేస్తాం ! ఇదొక ఆబ్లిగేషన్. వాడు హీరోయిన్ లేకపోతే నటించనన్నాడు. అప్పుడే ఒకమ్మాయి తనకి హీరోయిన్ రోల్ ఇవ్వమని పీక్కు తింటం మొదలెట్టింది. ఇరవ వేలు ఇస్తానంది. తప్పలేదు. దొరికిన మనుషుల్ని బట్టి కథలు, మాటలు మార్చటం మామూలేలే” అన్నాడు సుబ్బారావు.మళ్లీ కథ మొదలెట్టాడు.
ముప్ఫై రెండో ఎపిసోడ్ లో ఇక ఏడో రాజకుమారుడు వెడతానంటాడు. వాడు మరీ చిన్నవాడు కాబట్టి అమ్మా , నాన్న , అన్నలు వద్దంటారు. వాడు బుంగమూతి పెట్టి మారాం చేస్తూ ఉంటాడు.సరే ! మరీ లోతుకి వెళ్లకండా ఏదో ఒక చేపని తెమ్మంటారు. ముప్ఫైమూడో ఎపిసోడ్ లో వాడొక రొయ్యని తెస్తాడు. ముప్ఫై నాలుగో ఎపిసోడ్ లో వాడు దానిని ఎండబెట్టటం , అక్కడ గడ్డి పరక అడ్డం వొచ్చి ఎండకపోవటం. ఇక్కడ ఫొటోగ్రఫీ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముప్ఫై ఐదో ఎపిసోడ్ లో చేప ఎండలేదని వాడు మారాం చేస్తుంటే రాజుగారు భరించలేక “చేపా! చేపా ! ఎందుకు ఎండ లేదు ?” అంటారు. నాకు గడ్డి పరక అడ్డం వొచ్చింది అంటుంది చేప. చేప మాట్లాడటంతో రాజు ఆశ్చర్యపోతాడు. గడ్డి పరకా! ఎందుకడ్డమొచ్చావ్ ? అంటాడు రాజు.
“నన్ను ఆవు మెయ్యలేదు” అంటుంది గడ్ది పరక.
రాజు, రాణి గోమాత వద్దకి వెళ్లి ” గోమాతా ! నువు మేత మెయ్యకపోటానికి కారణమేమిటి తల్లీ ?” అని అడుగుతారు.
అక్కడ గోమాతని రాజదంపతులు పూజించటం , ఒక పాట ఉంటాయి. ఆ పాటలో గోవధానిషేధాన్ని బోధించే వాక్యాలు కూడా రాయించి సమకాలీన విషయాన్ని చొప్పించాను.
ముప్ఫై ఆరో ఎపిసోడ్- గోమాత తనని పాలేరు మేపలేదనిని చెపుతుంది. రాజు వెంటనే పాలేరుని పిలిపిస్తాడు. రాజు ఆగ్రహోదగ్రుడై పాలేరుని మందలిస్తాడు. పాలేరు అమ్మ తనకి సమయానికి బువ్వ పెట్టలేదని చెపుతాడు. వెంటనే ఆమెని సభలో ప్రవేశపెట్టమని రాజభటులని పంపిస్తాడు రాజు. ఆమె సభలోకి రాగానే ముప్ఫై ఆరో ఎపిసోడ్ సమాప్తం.
ముప్ఫై ఏడో ఎపిసోడ్- “ఓసీ ! వృద్ధురాలా ! నీవు పేదదానవని నీ కుమారునికి పాలేరుతనం అనుగ్రహిస్తే వానికి తిండిపెట్టక గోమాత పస్తులుండే పరిస్థితికి కారకురాలివయ్యావు. నీకు దండన తప్పదు. ” మొదలైన డైలాగులు చెపుతారు రాజు గారు.
ఆమె వలవలా ఏడుస్తూ “ప్రభూ ! మన్నించండి ! నా పిల్లని చీమ కుట్టింది.లేకుంటే నేను నా ధర్మాన్ని నిర్లక్ష్యం చెయ్యను ప్రభూ” అని వృద్ధురాలు మొత్తుకుంటుంది. “ఏది! ఆ చీమలెక్కడో నాకు చూపించు. అన్నీ కుంటి సాకులు” అంటారు రాజు గారు. “రండి ప్రభూ” అని ఆ వృద్ధురాలు రాజు గారిని చీమల పుట్ట వద్దకి తీసుకెళ్లటంతో ముప్ఫై ఏడో ఎపిసోడ్ అయిపోతుంది.
ముప్ఫై ఎనిమిదో ఎపిసోడ్- “చీమల పుట్ట వద్ద నిలబడ్డ రాజు గారు “ఓసీ చీమల్లారా ! ఇన్ని చీమలలో ఈమె పిల్లని కరిచిన చీమ ఎవరో వెంటనే బయటకి వచ్చి కారణం చెప్పాలి. లేకుంటే ఈ పుట్ట మొత్తాన్ని తవ్వించి చీమలన్నిటినీ యమలోకానికి పంపిస్తాను” అంటారు రాజు గారు.ఒక చీమ నెమ్మదిగా పైకొచ్చి “రాజా” ఆ పిల్ల నా బంగారం లాంటి పుట్టలో వేలు పెడితే కుట్టక ఏం చెయ్యమంటారు. మా ప్రాణాలు మాకూ ఎక్కువే. నేను కుట్టకపోతే ఆమె మా అందరినీ చంపేసి ఉండదా ! మీరే న్యాయం చెప్పండి” అంది ధైర్యంగా. చీమ ధైర్యాన్ని రాజుగారు మెచ్చుకున్నారు. ఇంతటితో సీరియల్ సమాప్తం. అని ముగించాడు సుబ్బా రావు.
“ఇంతకీ ఈ కథలోని సామాజికస్పృహ ఏమిటి ?” అన్నాను నేను.
“ఇదేమన్నా పత్రికలో కథా ఏంటి గురూ ! టి.వి. సీరియల్ కి సామాజిక స్పృహ, గోంగూర అంటే మనం తీసినట్టే . ఏదో ఈ చిన్న కథని ముప్ఫై ఎనిమిది వారాలు లాగించటమే గొప్ప” అన్నాడు సుబ్బారావ్.
“అలా కాదులే ! ఇంత పెంచిన వాడివి మరో రెండు వారాలు పెంచు. దీనిలో సామాజికస్పృహ కూడా ఉంది” అన్నాను. “ఎలా గురూ!” అన్నాడు సుబ్బా రావ్.
ఇక్కడ అసలు తప్పెవరిది అని రాజు గారు ఆలోచించి మంత్రులనీ, రాజపురోహితుణ్నీ పిలుస్తారు. ఒక మంత్రిగారు “తప్పంతా పాలేరు తల్లిదే అని ఆమె బిడ్డని జాగ్రత్తగా చూసుకోకపోవటం వలన చీమ కుట్టిందని, అందువలన పాలేరుకి అన్నం ఆలస్యమైందనీ , అందువలన ఆవు గడ్డి మెయ్యలేదని, అందువలన గడ్డి పరక మిగిలి చేప ఎండకుండా అడ్డం వచ్చిందనీ కనుక వృద్ధురాలు దండనార్హురాలని” అంటాడు. ఇది ముప్ఫై తొమ్మిదో ఎపిసోడ్.
నలభయ్యో ఎపిసోడ్- రాజపురోహితుడు ప్రశాంతంగా ” మహారాజా ! శాంతించండి. తప్పెవరిదో నిర్ణయించి దండించటం ఒక్కటే మన లక్ష్యం కాదు. ఆ వృద్ధురాలు మాత్రం ఇదంతా ఊహించిందా ! కాబట్టి ఈ సంఘటన ఏ జీవితసత్యాన్ని చెపుతోందో మనం గ్రహిద్దాం. ఒక వ్యక్తి తాను చేసేది ఎంత చిన్న పని ? అని అశ్రద్ధ వహించ కూడదు. ఒక తల్లి తన బిడ్డని కాసేపు అశ్రద్ధగా వదిలేసినంత మాత్రాన దాని ఫలితం రాజుగారి కుటుంబం వరకూ చేరింది. కాబట్తి ప్రతి వ్యక్తి తనకర్తవ్యం ఎంత చిన్నదైనా దానిని సక్రమంగా నిర్వర్తించాలనీ సూచిస్తోంది. అంతే కాదు మహారాజా ! రాజులు సామాన్యంగా ఈ రాజ్యమంతా తమవలననే నడుస్తున్నదని భావిస్తారు. కానీ రాజ్యం లో ఏ ఒక్క వ్యక్తీ అప్రథానుడు కాదు. ఒక పాలేరు యొక్క తల్లి ఒక రోజు రవ్వంత అశ్రద్ధ చేస్తే ఇంత సమస్య వచ్చింది. అంటే రాజ్యంలో ప్రతి వ్యక్తి ప్రధానమైన వారే అని అర్ధం కదా ! ఈ విషయాన్ని తమరు గ్రహించాలి . ఎవరి వృత్తినీ తక్కువగా భావించకూడదు.” అని ముగించాడు.
“బలే చెప్పావ్ గురూ !” అన్నాడు సుబ్బారావ్.
దీన్నే ఆధునిక కాలానికి వర్తింపజేస్తే ఒక పెద్ద ప్రభుత్వకార్యాలయంలో మంత్రుల, ఐ ఎ యస్ ల ప్రణాళికలు అమలు కావలసి ఉండగా ఉత్తరాలని పోస్ట్ చెయ్యవలసిన ఒక చిన్న గుమాస్తా, ఒక జమాను తమ పని సక్రమంగా చెయ్యకపోతే ఆ కార్యాలయం సాధించవలసిన లక్ష్యాలన్నీ నాశనమౌతాయి. అంతే కాదు ఆ కార్యాలయం అనేక లిటిగేషన్లలో కోర్టు కేసుల్లో , ఆర్ధిక నష్టాలలో చిక్కుకోవచ్చు. ఈ కథ ఆధునిక కాలానికీ వర్తిస్తుంది.” అన్నాను.

1 thought on “అనగనగా ఒక రాజు

  1. నా పర్సెప్షన్!?-
    ఇందులో నేను కాచ్ చేసిన మరో సుదీర్ఘ సుత్తి నీతి ఏంటంటే….సుత్తి తీసుకుని కొట్టనని మాటిస్తేనే చదవండి…
    “ఏ పనికైనా ఆటంకాలూ తప్పవు
    పై వారి ఆగ్రహాలో నిగ్రహాలో తప్పవు!”
    “ఏ సుత్తి కైనా కొనసాగింపుల సుత్తీ తప్పదు!-
    కొట్టకొనదాకా సా…..గింపులు…
    మ…..ళ్ళింపులు…..ఉంటేనే కదా సుత్తి జన్మ చరితార్ధక మయ్యేదీ….
    తొందరపడితే జన్మ లో మనం సుత్తితో తరించలేమని
    సచ్సుసచ్చిదానంద సత్యసాధువే స్వయంగా నుడివాడు !?-సుత్తి సుత్తిగా !…..సుతిమెత్తని హృదయాలతో సుత్తిని సహనంగా సునాయాసంగా భరిస్తేనే మరుజన్మకి సుత్తి నుండి విముక్తి లభిస్తుందని…..సుత్తిజన్మ తరిస్తుందనీ తిత్తి పునర్జన్మ రాహిత్యం కోసం సుత్తి సత్యనారాయణ సుత్తి వ్రతాన్ని శృతిబద్ధంగా సుత్తిగా చేయా లనిన్నూ…
    అది తెలుగు సీరియలే అయినా తమిళ సీరియలే అయినా..తప్పని సుత్తేననియు..!…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *