March 29, 2024

ఎఱ్ఱ మందారం

రచన: శ్రీకాంత గుమ్ములూరి

రోజూ ఎంత లేపినా లేవని వసంత ఈ రోజు ఆరింటికే నిద్ర లేచేసింది. ఇంటి ముంగిట్లో ఉన్న ఎఱ్ఱ మందారపు చెట్టుకి ఎన్ని పూలు పూసాయో పదే పదే లెక్కపెట్టింది. పదకొండు పూలు!
ప్రతి రోజూ తాను లేచే వేళకి చెట్టుకి ఒక్క పువ్వు కూడా కనబడేది కాదు. ‘మన మందార చెట్టుకి అసలు పువ్వులే పుయ్యవు!’ అని పెద్దక్కకి కంప్లైంటు కూడా చేసింది ఆ ముందు రోజు. అక్క తనను చెట్టు దగ్గరకి తీసుకువెళ్లి ఎఱ్ఱగా మిరపపళ్ళలాంటి మొగ్గల్ని చూపించి, ‘ఇవన్నీ రేపటికి పూలుగా వి చ్చుఁ కుంటాయి . మన చెట్టుకి రోజూ పూలు పుయ్యక పోలేదు .’ అని జ్ఞాన బోధ చేసి తనను అజ్ఞానం లోంచి బయట పడేసింది. ‘మరి పూలన్నీ ఏమవుతున్నట్టు?’ అక్క జవాబియ్యలేదు. దీని సంగతేమిటో కనుక్కుని తీరాలని తీర్మానించుకుంది ఎనిమిదేళ్ల వసంత.
అక్కకి ఉదయాన్నే సూర్యుడితోపాటే లేచిపోయి మొక్కల్లో తిరగడం, వాటికి స్నానాలు చేయించడం, మొక్కలకి గొప్పులు తవ్వడం, ఎండిన ఆకుల్ని కత్తిరించి మొక్కలు అందంగా కనబడేటట్లు ప్రూనింగ్ చేయడం, చిన్న చిన్న మొక్కల్ని వరసలో పాతడం – ఈపనులన్నీ అంటే తనకి చాలా ఇష్టం. అంచేత అదే ఉదయం కాలేజీ కెళ్లే ముందు తన దినచర్యలో భాగం. ఈ రోజు తానూ అక్క వెనకాలే తమ పూతోటలో తిరుగుతోంది. అక్క చెప్పింది నిజమే! ప్రహరీ గోడ మీంచి ఎత్తుగా ఎదిగిన మందార కొమ్మల చివరలు ఎఱ్ఱని పువ్వులతో, చల్లని పిల్లగాలుల్లో అటూ ఇటూ ఊగుతూ మమ్మల్నే చూడండన్నట్లు నాట్యం చేస్తున్నాయి. సన్నని ఎండలో ఆహ్లాదకరంగా ఎఱ్ఱని జుంకీల్లాగా ఊగుతున్న వాటి అందాలు ఆస్వాదిస్తూ నిలబడ్డారిద్దరూ!
ఈలోగా అమ్మ కాఫీ సేవనకి పిలిస్తే వంటింటి వైపు దారి తీశారు ఇద్దరూ. కాఫీ గబగబా తాగి, మళ్లీ మందార చెట్టు వైపుకి వచ్చింది వసంత పరిశోధనార్థియై. ‘అరెరే! నిముషంలో జరగ కూడనిది జరిగి పోయిందే! చెట్టు మీద పదకొండు బదులు ఎనిమిది పువ్వులే కనిపిస్తున్నాయి! ఎవరు కోసేసారో ఇంతలో’ అని గోడమీద నుంచి తొంగి చూడ్డానికి ప్రయత్నించింది కానీ ఆ గోడ చాలా ఎత్తు తనకి. కానీ… అక్కడ ఒక చేతి కఱ్ఱ పూలున్న కొమ్మని లాగడానికి కదులుతూ కనబడింది. అంతే ! ఒక్క ఉదుటున వసంత చలాంగుమని గెంతు గెంతి, చటుక్కున వరండా మూలనున్న తాతగారి గొడుగుతో ఆ కఱ్ఱమీద ఒక్క దెబ్బ వేసింది తన బలాన్నంతా ఉపయోగించి. ఆ కదుల్తున్న కఱ్ఱ కాస్తా రెండు ముక్కలై గోడకు రెండు వైపులా చెరో ముక్కా పడింది. గోడవతల దబ్బు మని ఏదో పడిన శబ్దం కూడా చెవిని పడింది!
ఇక్కడింత హడావిడి జరుగుతున్నా అక్క వీటన్నిటికీ అతీతంగా కనకాంబరం మొక్కల్లో కలుపు మొక్కలు పీకడంలో మునిగిపోయి ఉంది కూని రాగాలు తీసుకుంటూ !
ఏమయుంటుందబ్బా! అని వసంత గేటు వైపు పరుగుతీసింది. గేటు సందుల్లోంచి తొంగి చూసింది. రెండిళ్ళవతలి రంగారావు తాతగారు గోడపక్కన, నేలమీద చతికిలబడి వున్నారు ఉక్రోషంతో, విరిగిన నడుముతో, విరిగిన చేతి కఱ్ఱతో, నేల పా లైన మూడు మందారాలతో!
వసంతకి నవ్వాగలేదు. అక్క తలెత్తి చూసింది తన పని పక్కకి పెట్టి. మార్ణింగ్ వాక్ కోసం బయటకు వచ్చిన నాన్నగారు గేటు తెరచి క్రింద పడ్డ రంగారావు తాతగార్ని చూసారు. ‘అయ్యయ్యో ! బాబాయిగారూ ఏమైంది? అలా ఎలా పడ్డారు ? దెబ్బలు గానీ తగలలేదు కదా !’ అంటూ చేయూతనిచ్చి ఆయన్ని లేవనెత్తారు.
ఇంతలో విరిగిన చేతి కఱ్ఱ చేత్తో పట్టుకుని గేటు బయటికి వచ్చింది వసంత. అది చూసి, తాను పడ్డానికి కారణం ఎవరో గ్రహించారు ఆయన. కోపంతో ‘మీ ముద్దుల కూతురు చేసిన నిర్వాకమేనండీ !’ అంటూ నాన్నగారికి పితూరీ చేశారు.
ఆశ్చర్యంతో వసంత వైపు చూసారు నాన్నగారు !
‘ఈ కఱ్ఱ ఆయనదని నాకు తెలీదు నాన్నగారూ …. ప్రతిరోజూ మనింట్లో పూసిన మందార పూలు మాయమై పోతున్నాయి. ఎవరు కోసేస్తున్నారో గమనిద్దామని చెట్టు ముందు నించున్నా. ఈ రోజు మరి పూకొమ్మల్ని లాగుతూ కఱ్ఱ కనబడింది! మన పూలని రక్షించుకోడానికి కఱ్ఱని గొడుగుతో కొట్టానంతే! తాతగారు అలా క్రింద పడతారని నాకేం తెలుసు?’ అంటూ సంజాయిషీ ఇచ్చింది వసంత అతి తెలివితో !
ఆహా! తనకి తెలుసు ఆయనే రోజూ పువ్వులు కోసే స్తున్నారని ! కానీ తాను నోరు విప్పలేక పోయింది. ఎంత సునాయాసంగా చెల్లెలు ఆయన్ని బయట పెట్టింది! అక్క సంతోషించింది!
వీధిలోకప్పుడే వచ్చిన అమ్మ విషయాన్ని గ్రహించి, విస్తుపోయి, వేదాంతిలా చిరునవ్వు నవ్వుతూ వంటింట్లో కెళిపోయింది.
నాన్నగారు నిర్వికారంగా బయటకి నడిచారు.
‘తాతగారికి తగిన శాస్తి జరిగిందిలే! లేకపోతే అందరి కళ్ళూ కప్పి పూలన్నీ రోజూ కోసేస్తారా!’ వసంత కసిగా ముసి ముసి నవ్వులు నవ్వింది.
తన రంకుతనం ఎవరికైతే తెలియ కూడదో వాళ్ళకే తెలిసిపోయిందని తాతగారి ముఖం సిగ్గుతో ఎఱ్ఱ మందారం అయింది!!!

—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *