April 19, 2024

జీవితం ఇలా కూడా ఉంటుందా? 6

రచన: అంగులూరి అంజనీదేవి

అబ్బురపడి చూశాడు సతీష్‌చంద్ర. ఇన్నిరోజులు ధృతిని చిన్నపిల్ల అనుకున్నాడు కాని ఆమెకు కూడా కొంత అవగాహన వుందనిపించింది.
ఆమె అంతటితో వదిలెయ్యకుండా ”దేని గురించో వద్దు. మీ గురించే చెబుతాను వినండి!” అంది.
ఏం చెబుతావ్‌ అన్నట్లు సరదాగా చూశాడు సతీష్‌చంద్ర.
”మీ మీద మీకు ప్రేమ లేకుంటే దేశాన్ని ప్రేమించగలరా?” అంది.
”ఇది చాలా వాస్తవం ధృతీ! నేను సైన్యంలోకి వెళ్లిందే నాకోసం. నా ఉనికిని నేను గౌరవించుకోవటం కోసం…”
”అదే చెబుతున్నాను. మనమంటే మనకు ప్రేమ వున్నప్పుడు మనం దేన్నైనా ప్రేమించగలుగుతాం. మీరు ఎక్కడున్నా నన్ను ప్రేమిస్తారు. నాకోసం ఏమైనా చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. కాబట్టే మీరు దూరంగా వున్నా దగ్గరగా వున్నట్లే అనుకుంటాను” అంది.
నరేంద్ర వాళ్ళ ఇల్లు రావడంతో వాళ్ల మాటలు ఆగిపోయాయి.
*****

సతీష్‌చంద్ర తన భార్యతో వస్తున్నాడని తెలిసి తారమ్మ, శేషేంద్ర వాళ్లకు ఎదురెళ్లి ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. దృతిని చూడగానే సౌమ్య ప్రేమగా తన రెండు చేతులతో చుట్టేసింది. తారమ్మకు నరేంద్ర వారం రోజుల ముందు నుండే ఫోన్లో ‘సతీష్‌చంద్ర దంపతులు మన ఊరు వస్తున్నారు. వాళ్లను నాలుగు రోజులు మనింట్లోనే వుంచుకొని, వాళ్లకి అన్ని సౌకర్యాలు కల్పించి చక్కటి ఆతిథ్యాన్నివ్వండి’ అని చెప్పాడు. నరేంద్ర అలా ఫోన్‌ చేసినప్పటి నుండి తారమ్మ హడావుడి అంతా ఇంతా కాదు.
అప్పటికప్పుడు వాళ్లు పడుకునే పక్క గదిలో వున్న పత్తి బస్తాలను, మిర్చి బస్తాలున్న గదిలోకి మార్పించి ఆ గదిని శుభ్రంగా కడిగింది. ట్యూబ్‌లైటు, ఫ్యాన్‌ పెట్టించింది. మంచానికి వున్న నవారును విప్పి తెల్లగా ఉతికించి శేషేంద్ర చేత గట్టిగా అల్లించింది. దానిమీద కొత్త పరుపు, దిండ్లు వేసి, దుప్పటి పరిచింది. సౌమ్య వెళ్లి ఆ మంచం పక్కన ఒక చెక్క టేబుల్‌ వేసి దానిమీద తనే స్వయంగా రంగులతో బొమ్మలేసిన క్లాత్‌ కప్పి, ఆ క్లాత్‌మీద గాజు గ్లాసులుపెట్టి వాటిల్లో నీళ్లు పోసింది. రకరకాల పూలను కాడలతో తెంపుకొచ్చి గాజుగ్లాసుల్లో పెట్టింది. ఆ పూలు తాజాగా, మృదువుగా ఆ గదిలోకి ఎవరు ముందొస్తే వారికి ‘హాయ్‌’ చెప్పటానికి సిద్ధంగా వున్నాయి. ఆ గదికి రెండు కిటికీలు వున్నాయి. నిన్ననే తారమ్మ, సౌమ్య సిటీకెళ్లి కిటికీలకు, తలుపుకు కర్టెన్లు తెచ్చి వేశారు. ఆ కర్టెన్‌ తొలగించి కిటికీలోంచి బయటకు చూస్తే గంగరావిచెట్టు పసుపుపచ్చటి పూలతో గాలికి కదులుతూ కన్పిస్తోంది. దాని పక్కనే రెండు నిమ్మచెట్లు కాయలు కాసి కమ్మి వాసన వెదజల్లుతున్నాయి. ఆ చెట్లపక్కనే కరివేపాకు చెట్టు గుబురుగా కొమ్మల్ని పెట్టుకొని ఎవరైనా నన్ను మీ పోపుల్లోకి తుంచుకోవచ్చు అన్నట్టుంది. కింద పాదుల్లో బంతి, చామంతి, బొండుమళ్లి, సన్నజాజి, మందారం పూలచెట్లు వున్నాయి. ఆ చెట్లన్నీ, సమతుల ఆహారం తింటూ ఆరోగ్యవంతంగా వున్న ఒక సంపన్నుడిలా వున్నాయి.
ఆ గదిలో సతీష్‌చంద్రను, ధృతిని కూర్చోబెట్టి తారమ్మ మాట్లాడుతుంటే ఆమె పక్కనే కూర్చుని శేషేంద్ర చూస్తున్నాడు. ఆమె మాటలు ఎక్కువగా ఆమె కొడుకు మీదనే సాగుతున్నాయి. నేవీలో వాళ్ల కొడుకు చేసే పనులు, వాటి ఉపయోగాలు గురించి సతీష్‌కన్నా ఆమెనే ఎక్కువగా చెప్పడం సతీష్‌కి, ధృతికి ఆశ్చర్యం కల్గించింది. ఒక పల్లెటూరు మహిళలో నేవీ మీద ఇంత అవగాహన వుందా అన్పించింది.
టేబుల్‌ మీద తెలుగు పత్రికలు వుంటే వాటిని అందుకొని ”ఆంటీ! పొలం పనుల్లో వుండే మీరు ఈ పత్రికలు చదువుతారా?” అంది ధృతి.
”లేదమ్మా! నాకు చదువు రాదు. అవి మీకోసమే నిన్న సిటీకెళ్లినప్పుడు సౌమ్య తెచ్చింది. సౌమ్య మాత్రం సమయం వుంటే పాత పుస్తకాలు చదువుతుంది. కొత్తవి ఈ ఊరిలో దొరకవు. మా శేషయ్య పత్తిమిల్లులో పని మానేశాక సిటీకి వెళ్లడం తగ్గించాడు. అయినా ఆయనకు ఇలాంటివి తేవటం తెలియదు” అంది.
సౌమ్య చిక్కి కాఫీ తెచ్చి నలుగురికి ఇచ్చింది.
”నువ్వు కూడా త్రాగు” అంది తారమ్మ కాఫీ అందుకుంటూ. సౌమ్య ”అలాగే అత్తయ్యా!” అంటూ అత్తగారికి, మామగారికి ఎదురుగా కూర్చోకుండా వంటగదిలోకి వెళ్లి కాఫీ తాగుతూ వంట మొదలుపెట్టింది. వంటగది ఆగ్నేయ మూలలో వుంది. వాళ్లకు గ్యాస్‌ కాని, కిరోసిన్‌ స్టౌలు కాని అలవాటు లేవు. కట్టెల పొయ్యి మీదనే చాలా వేగంగా అవలీలగా వంట చేస్తుంటారు. ఆదివారాలు అడవికెళ్లి కట్టెలు తెచ్చి స్టాకు పెడుతుంటాడు శేషేంద్ర. ఆయన పత్తిమిల్లులో పని మానేసినప్పటి నుండి ఆడవాళ్లిద్దరికి ఇంటి పనుల్లో, పొలం పనుల్లో చాలా ఆసరా అయ్యాడు. బయట పనులన్నీ ఆయనే చేస్తుంటాడు. ఏ చిన్న పని వున్నా సౌమ్య ”మామయ్యా” అని పిలుస్తుంది. ఆయన ”చెప్పమ్మా!” అంటూ వస్తాడు. తారమ్మ కూడా అంతే! ఏ అవసరం వున్నా ”శేషయ్యా! ఎక్కడున్నావ్‌?” అంటుంది. వెంటనే ప్రత్యక్షమై ”ఏంటో చెప్పు” అంటాడు. చెప్పిన పని వెంటనే చేస్తుంటాడు. బాధ్యతగా వుంటాడు. ఆయన అలా వుండటం వల్లనో ఏమో ఆ ఊరిలో వాళ్లు సౌమ్య దగ్గరకి వచ్చి ఏది అడిగినా ”మా మామయ్యను అడగండి!” అంటుంది చాలా మర్యాదగా. తారమ్మ కూడా అంతే ”మా శేషయ్య వున్నాడుగా. ఆయన్ను అడిగాకనే ఏ విషయమైన చెబుతాం!” అంటుంది. ఆయన ఎంత బాధ్యతగా వుంటాడో ఆడవాళ్లిద్దరు ఆయన్ని అంత గౌరవంగా చూస్తున్నారు. ఆయన్ని వాళ్లు గౌరవించే కొద్దీ ఆ ఊరి జనంలో వాళ్లకు మర్యాద పెరిగింది. భద్రత పెరిగింది.
సతీష్‌ దంపతులు వస్తున్నట్లు తెలిసి శేషేంద్ర అందరికన్నా ఎక్కువగా సంతోషించాడు. పొలం వెళ్లి అప్పటికప్పుడు కూరగాయలు తెచ్చాడు. ఆయన తెచ్చిన తాజా కూరగాయాలతో రుచికరమైన వంట తయారుచేసింది సౌమ్య.
కాఫీ తాగాక మాటల మధ్యలో ”కాఫీ చాలా టేస్టీగా వుందాంటీ! నేను ఎన్నో దేశాలు తిరిగాను. కాని ఇంతమంచి కాఫీ తాగలేదు” అన్నాడు సతీష్‌చంద్ర. ధృతి కూడా అదే అభిప్రాయం చెప్పింది. సౌమ్య వంటగదిలోనే వుంది. ఆమె చేసిన వంటను ఏ గిన్నెల్లోకి సర్ధితే అందంగా, స్పెషల్‌గా వుంటుందో ఆలోచిస్తోంది.
సతీష్‌చంద్ర కాఫీని మెచ్చుకోగానే ”మాకు చాలా గేదెలున్నాయి బాబు! వాటి దగ్గర ఉదయాన్నే పాలు తీసి పాలకేంద్రానికి పోస్తాం. డబ్బులొస్తాయి. మేకలున్నాయి, గొర్రెలున్నాయి. వాటిని కూడా అప్పుడప్పుడు మంచి ధర వస్తే అమ్ముతుంటాం. రండి వాటిని కూడా మీకు చూపిస్తాను” అంటూ గేదెలు, మేకలు, గొర్రెలు వుండే దొడ్ల దగ్గరకి తీసికెళ్లి చూపించింది. ఆ దొడ్ల పక్కనే వరిగడ్డి వాములు వున్నాయి. ఆ వాముల చుట్టూ కోళ్లు, కోడిపిల్లలు తిరుగుతున్నాయి. కోడిపిల్లలైతే చాలా తమాషాగా ఎగురుతూ పురుగుల్ని తింటున్నాయి. మేకపిల్లలు కూడా చెంగుచెంగున ఎగురుతూ దొడ్డంతా తిరుగుతున్నాయి. ధృతి వాటినే చూస్తూ చెంపలకి చేతుల్ని ఆనించుకొని ‘వావ్‌’ అంది. ధృతిని గమనిస్తూ నవ్వుకుంటున్నాడు సతీష్‌. ఆ దొడ్లు ఎక్కడో లేవు వాళ్ళ ఇంటి వెనకాలే వున్నాయి. వాటిని ఆనుకొని పొలాలు వున్నాయి. అక్కడికి దగ్గరే కాబట్టి వాళ్లను ఆ పొలాల వైపుకి తీసికెళ్లింది.
”ఇక్కడ మాకో ఎకరం పొలం వుంది బాబు. దీనికి బావినీళ్లు అవసరం లేదు. అదిగో అక్కడ కన్పిస్తుందే చెరువు. ఆ చెరువు నీళ్లతోనే పండుతుంది. దీనిలో ఎప్పుడైనా పసుపు, మిరప వేస్తాము” అంటూ పసుపు చేలోకి తీసికెళ్లింది. వెంటనే దృతి ఆ పసుపు ఆకుల్ని పట్టుకొని ”ఈ ఆకులకి పసుపు ఎప్పుడు కాస్తుంది ఆంటీ!” అంది.
”పసుపు ఆకులకి కాయదమ్మా! ఈ మొక్కల వేర్లకు తగులుకొని భూమిలోనే పసుపు కొమ్ములు తయారవుతాయి. పసుపు పండిందని తెలియగానే ఈ మొక్కల్ని పీకి పసుపుకొమ్ముల్ని బయటకు తీస్తాము. దాన్ని కూడా మార్కెట్లో ధర రాగానే అమ్మేస్తాం” అంది. వాళ్లు చాలా ఆసక్తిగా వింటున్నారు. ఆమె కూడా హుషారుగా, తృప్తిగా మ్లాడుతోంది.
వాళ్లున్న చోటుకి ఎదురుగా చెరువు, ఆ చెరువు కట్టమీద గుబురుగా పెరిగిన చెట్లు కన్పిస్తుంటే ”ఆంటీ! అక్కడికి వెళ్దామా?” అంది ధృతి చెరువు వైపు చూస్తూ
”ఇప్పుడు కాదు. భోజనాలయ్యాక కొద్దిసేపు మీరు పడుకోండి! సాయంత్రం తీసికెళ్తాను” అంది.
వాళ్లు సంతోషంగా ‘అలాగే’ అన్నారు.
తారమ్మ ధృతి ముఖంలోకి చూస్తూ ”సాయంత్రం తీసికెళ్తానని ఎందుకన్నానంటే- ఈరోజు లంబాడ గిరిజనులు పాటలు పాడుతూ తీజ్‌ను తీసికెళ్లి ఆ చెరువులో నిమజ్జనం చేస్తారు. చాలా భక్తిశ్రద్ధలతో చేస్తారు. అది మీరు చూడొచ్చు. బావుంటుంది” అంది.
తీజ్‌ అంటే ధృతికి అర్థం కాలేదు. అయినా సాయంత్రం చూస్తాం కదా అన్నట్లు ఇంకేం మాట్లాడలేదు. వాళ్లను చెరువు దగ్గరకి తీసికెళ్లకుండా ఇంటికి తీసికెళ్లింది తారమ్మ.
వాళ్లు వెళ్లేటప్పటికే సౌమ్య భోజనాలు రెడీ చేసింది.
తారమ్మ లోపలకెళ్లి శేషేంద్రతో ఏదో మాట్లాడుతుంటే ఈలోపల ధృతి సతీష్‌చంద్ర చేయి పట్టుకొని గంగిరావిచెట్టు పక్కన వున్న నీళ్ల పంపు దగ్గరకి లాకెళ్లి ”ఇక్కడ కాళ్లు కడుక్కోండి! ఆ నీళ్లు ఎక్కడికి ఎలా వెళ్తాయో చూద్దురుగాని” అంది.
అతను ఆశ్చర్యపోతూ ”ఇదేదో నీకు అలవాటైన ప్లేస్‌లా ఇక్కడికి తీసుకొచ్చావ్‌! ఇది నీకు ముందే తెలుసా? అలా తెలిసే అవకాశం లేదే!” అంటూ కాళ్లు, ముఖం కడుక్కున్నాడు. ఆమె చెప్పినట్లే అక్కడ చుక్క నీళ్లు పడినా నేరుగా మొక్కజొన్న తోటలోకి వెళ్తున్నాయి. ఆ తోటంతా ఎండ పడి పచ్చగా మెరుస్తుంటే ”ఆ తోటలోకి వెళ్దామా?” అంది ధృతి.
అతను వెంటనే వంగి పంపు దగ్గర నీళ్లు చేతిలోకి తీసుకొని ఆమె ముఖంమ్మీద సరదాగా చల్లి నవ్వాడు. నీళ్లు పడగానే ఆమె కనురెప్పలు ఉలిక్కిపడి ముడుచుకున్నాయి. చంద్రవంక మెరిసినట్లు నవ్వింది. అతను మరింత ఉత్తేజితుడై ఆమె ముఖం మీద మళ్లీ నీళ్లు చల్లాడు. కొద్దిసేపు అక్కడే నిలబడి నీళ్లతో ఆడుకున్నాడు. ముందుగా ఆమె తేరుకుని ”పదండి! ఆంటీ పిలుస్తున్నారు” అంటూ అతన్ని లోపలికి తీసికెళ్లింది. వాళ్లు వెళ్లగానే తారమ్మ అందర్నీ కూర్చోబెట్టి భోజనాలు వడ్డించింది. వాళ్ల కబుర్లు సౌమ్య చేసిన కూరల మీదకి మళ్లాయి.
”ఈరోజుల్లో చాలామంది ఆడవాళ్లు వంటలు చెయ్యాలంటే వెబ్‌సైట్ల మీద ఆధారపడుతున్నారు. అలా కాకుండా మీలాంటి వాళ్ల దగ్గర ట్రైనింగ్‌ తీసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం” అన్నాడు సతీష్‌చంద్ర.
”ఏదో అభిమానం కొద్ది అంటున్నారు కానీ మా పల్లెటూరి వంటల్ని ఎవరు తింటారు. ఎవరు గుర్తిస్తారు?” అంది తారమ్మ.
”అలా అనకండి ఆంటీ! అసలు సిటీలల్లో ఇంత తాజా కూరగాయలు దొరకవు. దొరికినా ఇన్ని రకాలు చెయ్యలేరు. ఇంత టేస్ట్‌ కూడా రాదు” అన్నాడు.
అక్కడే వున్న సౌమ్యకు ఆ వాతావరణం, వాళ్లు మాట్లాడుతున్న మాటలు గొప్ప ఆనందాన్నిస్తున్నాయి.
”అనకూడదు కాని మా సౌమ్య చేయి తగిలితేనే కూరలకి మంచి రంగు, రుచి వస్తుంది” అంది తారమ్మ.
వెంటనే సౌమ్య ”ఈ కూరలు కాకుండా రాత్రికి వేరే కూరలు చేసి పచ్చజొన్న రొట్టెలు చేస్తారు మా అత్తగారు. అవి తిన్నారంటే మీరు జన్మలో మరచిపోరు. ఇక్కడే వుండిపోవాలనుకుంటారు” అంది.
”నాకయితే ఇప్పటికే ఇక్కడ వుండిపోవాలనిపిస్తోంది” అంది ధృతి.
”మీ ఆయన వెళ్లిపోయాక ఇక్కడికొచ్చి వుండు. మా సౌమ్యకు, మాకు తోడుగా వుంటావ్‌! మాకు నువ్వూ, నీకు మేము” అంది సరదాగా తారమ్మ.
”బాబోయ్‌ ఆంటీ! అలా అనకండి! నేను వెళ్లకముందే వచ్చేసినా వచ్చేస్తుంది. ఇప్పటికే ఆ మొక్కజొన్న తోటమీద కన్నేసివుంది” అన్నాడు సతీష్‌ నవ్వుతూ.
ధృతి ”ఉష్‌” అంటూ భర్తను మోచేత్తో పొడిచింది.
అది చూసి తారమ్మ ఆలోచనగా ”నువ్వు వస్తానన్నా ఆ అంకిరెడ్డి రానిస్తాడా అమ్మా! ఆయన మహానుభావుడు. ఈ రోజు నా కోడలు బ్రతికి ఇలా వుందీ అంటే ఆయన చలువే… ఎవరో ముక్కూ, మొహం తెలియని నా కోడలి పట్లనే ఆయన అంత మమకారం, శ్రద్ధ చూపాడూ అంటే సొంత కోడల్ని నిన్నెంత అపురూపంగా చూస్తాడో… మీ అత్తగారు మహాసాద్వి. తోడికోడలు ఉత్తమురాలు. అసలు నిన్ను మా లాంటి వాళ్ల ఇళ్లకు రానిస్తారా? ఇప్పుడేదో మా సతీష్‌బాబు తీసుకొచ్చాడు కాని…” అంది తారమ్మ.
”అలా అనకండి ఆంటీ! ఎప్పటికైనా మనమంతా ఒక్కటే! మావారు, మీ అబ్బాయి మంచి స్నేహితులు. ఇకనుండి మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి” అంది ధృతి.
”అలాగేనమ్మా! మాకు మాత్రం ఎవరున్నారు?” అంది తారమ్మ. ఆమె ఏదో బాధపడుతున్నట్లనిపించింది. ఆమెకు ఆ క్షణంలో నరేంద్ర గుర్తు వచ్చివుంటాడు. అందుకే అంత బరువుగా దుఃఖంగా వుందామె గొంతు.
సతీష్‌ అది గమనించి ”నరేంద్రతో మాట్లాడారా ఆంటీ! మేమిలా వస్తున్నందుకు చాలా సంతోషించాడు” అన్నాడు.
”సంతోషం ఎందుకుండదు బాబు! వాడికి నువ్వంటే ప్రాణం” అంది తారమ్మ. ఇప్పుడు మళ్లీ ఆమె మామూలుగా అయింది.
”మా అత్తగారికి మాత్రం నేనంటే ప్రాణం” అంది సౌమ్య. ఆమె అలా అంటుందని ఎవరూ వూహించలేదు.
”మనది అనుకున్నదాని మీద మనం ప్రాణం పెట్టడంలో పెద్ద విశేషమేముంది. మనది కాని దాన్ని కూడా మనం ప్రేమించగలగాలి. అభిమానించగలగాలి. ఒకప్పుడు నేను నా అన్నదాన్ని కూడా ప్రేమించలేదు. అభిమానించ లేదు. తాటకిలా మారి కత్తిలాంటి మాటలతో నా కోడల్ని పొడిచాను. చావు దాకా తెచ్చాను. కొడుకును ఏడ్పించాను. భర్తను బాధించాను. కానీ వాళ్లు నన్ను ప్రేమించారు. నేనెలా వున్నా నేనేం చేసినా సహించారు. సర్దుకుపోయారు. ఓపిక పట్టారు. అలా కాకుండా నన్నో గోనెసంచిలో మూటకట్టి బావిలో పడేసి వుంటే ఈ తారమ్మ ఇప్పుడు వుండేదా? అదీ బాబు ప్రేమంటే! మానవత్వమంటే!” అంది తారమ్మ.
”కానీ మీరు సౌమ్యక్కకు హాస్పిటల్లో చేసిన సేవను చూసి మా నాన్నగారు నమ్మలేకపోయారట ఆంటీ! మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపించిందని కూడా నాతో ఫోన్లో చెప్పారు. అలా వున్నాయట అప్పుడు మీరు మీ కోడలి పట్ల చూపించిన ప్రేమ, దయ, అభిమానం, సేవ ” అన్నాడు.
”నిజమే బాబు! ఏ అత్తా చేయని సేవలు నేను నా కోడలికి చేశాను. కానీ సౌమ్య కోమాలోంచి బయటకొచ్చాక నా సేవల్ని నమ్మలేదు. నన్ను నమ్మలేదు. నేను దగ్గరకి వెళ్తేనే కసిరికొట్టేది. ఏడ్చేది. నానా రభస చేసేది. నర్స్‌లు చెప్పినా వినేది కాదు. డాక్టర్లు చెప్పినా వినేదికాదు. అప్పుడనిపించింది నాకు, నేను నా కోడలిపట్ల ఒకప్పుడు మనిషిలా ప్రవర్తించలేదని… ఇప్పుడు నాకు నా కోడలు కావాలి. నన్నామె తన అత్తగారిలా స్వీకరించాలి. అదే నా కోరిక. వెంటనే డాక్టర్‌ దగ్గరకెళ్లి ఏడ్చాను. ఆ స్థితిలో నాకేం అర్థం కాలేదు. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడున్న డాక్టర్‌ నన్ను చూస్తున్నాడు. నా కోడలు నన్ను నెట్టెయ్యటం చూస్తున్నాడు. నా బాధ ఒకటే! నా కోడలు ఏ నిప్పును చూసినట్లో, జంతువును చూసినట్లో నన్ను చూసి భయపడకూడదు. అదే వేడుకున్నాను వాళ్లను… ఏడుస్తూనే వున్నాను” అంటూ ఆగింది తారమ్మ. ఆమె ఆ రోజెప్పుడో హాస్పిటల్లో జరిగిన సంఘటన ఇప్పుడే జరిగినట్లు బాధపడుతోంది.
సౌమ్య అందుకొని ”ఆ రోజు సాయంత్రమే మా అన్నయ్య వచ్చాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. అప్పటికే ఆ హాస్పిటల్లో డాక్టర్స్‌ నాకు కౌన్సిలింగ్‌ అవసరం అన్నారు. మా అన్నయ్య నన్ను సైకియాట్రిస్ట్‌ దగ్గరకి తీసికెళ్లి దగ్గరుండి కౌన్సిలింగ్‌ ఇప్పించాడు. రెండు, మూడు సిట్టింగ్‌లకే నాలో మంచి మార్పు వచ్చింది. మా అత్తగారిని చూడగానే భయపడటం తగ్గింది. ఆ తర్వాత నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లోకూడా మా అత్తగారు నాచేత వంటపని కాని, బయట పనులు కాని చేయించలేదు. ఇప్పుడిప్పుడే చేస్తున్నాను” అంది.
”ఇంత జరిగినా మీ పేరెంట్స్ మీకు హెల్ప్‌ చెయ్యలేదని అంటుంటే విన్నాను” అన్నాడు సతీష్‌చంద్ర.
అప్పుడు కల్పించుకుంది తారమ్మ ”అలా అనుకుంటే అనుకోవచ్చు కాని మా వియ్యంకులు మాత్రం చాలా మంచివాళ్లు బాబు. నేనెందుకిలా అంటున్నానంటే కొంతమంది తల్లిదండ్రులు అత్తగారింట్లో వుండే తన కూతురు ఎంత హాయిగా వున్నా, మూడుపూటల పుష్టిగా తింటున్నా అది పైకి చెప్పుకోరు. అష్టకష్టాలు పడుతుందనో, అసలు ఏ పూటా తిండి తినడం లేదనో చెప్పుకుంటారు. నేరుగా వాళ్ల దగ్గరకే వెళ్లి ముఖంమ్మీదే మా కూతురసలు తిండే తినడం లేదు. ఏం పెడుతున్నారు మీరు? ఒకవేళ మీరు పెట్టినా మా అమ్మాయి అసలు తిండే సరిగా తినదు. బ్రతిమిలాడి పెడితేనే తింటుంది” అని నానా రభస చేసే తల్లిని చూశాను. అసలా తల్లి పెట్టేది లేకపోయినా కూతురికి వూరికే ఫోన్లు చేసి ”నువ్వు తింటున్నావా లేదా? బాగా తిను. అది తిను ఇది తిను” అని కూతుర్ని అయోమయంలో పడేస్తుంటుంది. ఎక్కడో వుండి తిను తిను అనడం కాదు. దగ్గరకొచ్చి పెట్టే చేయి కావాలి. అలాంటిది ఒక్కరోజు కూడా నా వియ్యంకులు నన్నో మాట అనలేదు. తన కూతురు తిన్నదా లేదా అని అడగలేదు. నేను రాక్షసిలా పీక్కుతింటానని తెలిసి కూడా తన కూతుర్ని నాకే వదిలేశారు. అలా అని వాళ్లకు తన కూతురంటే ప్రేమలేక కాదు. నామీద నమ్మకం. అంతే! నాలో వాళ్లు రాక్షసిని చూడలేదు. మనిషిని చూశారు. వాళ్ల నమ్మకమే నన్ను మనిషిని చేసింది” అంది. ఎవరైనా వాళ్లను వాళ్లు బాగా తెలుసుకున్నప్పుడే అలా మాట్లాడగలుగుతారు.
ఆమె మాటలు వింటూనే భోజనాలు పూర్తిచేశారు.
ధృతి ”హమ్మయ్యా! కడుపు నిండింది. ఇంత హెవీగా ఎప్పుడు తినలేదు” అంది సౌమ్యతో.
అది విని అందరు హాయిగా నవ్వారు.
శేషేంద్ర ”మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి బాబు! సాయంత్రం చెరువు దగ్గర తీజ్‌ ఆట వుంటుంది. అది మీరు చూడదగిన విశేషమైన ఆట” అన్నాడు.
ఆయన అలా అనగానే వాళ్లకోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లారు సతీష్‌, ధృతి.
ఆ గదిలోకి వెళ్లి అలా పడుకున్నారో లేదో అసలు కథ మొదలైంది.
ధృతి పైకప్పుకేసి చూస్తూ, రెండు చేతుల్ని ప్రశాంతంగా పొట్టమీద పెట్టుకొని మాట్లాడసాగింది.
సతీష్‌చంద్రకు నిద్రపోదామనివున్నా ఆమె మాట్లాడుతుంటే నిద్ర రాక ‘ఊ’ కొడుతూ ఆమె చేతుల మీద చేయివేసి వేలితో డిజైన్లు వేస్తున్నాడు.
”మాకు సొంతంగా ఓ ఇల్లంటూ లేదు ఈ భూమ్మీద… మా అన్నయ్య నన్ను చిన్నప్పటి నుండి హాస్టల్స్‌లో వుంచే చదివించాడు. అదీ బి.సి. హాస్టల్స్‌లో. మా స్థాయి అది. అలాంటి నాకు ఫ్యామిలీ వాతావరణం అంటూ తెలిసింది మీరు నన్ను పెళ్ళి చేసుకున్నాకే!” అంది.
”సరేలే! పడుకో! నిద్రపోయి లేస్తే ముఖం బావుంటుంది. సాయంత్రం చెరువుగట్టు మీద ఫోస్‌ తీసుకుందాం. అవి నేను వెళ్లేటప్పుడు నాతో తీసికెళ్తాను. అవి నా వెంట వుంటే నువ్వు నాతో వున్నట్లే!” అంటూ ఒక్క వుదుటన మోచేతుల మీద లేచి ఆమె ముఖం మీదకి వంగి ఉక్కిరిబిక్కిరి చేశాడు. మళ్లీ ఎప్పట్లాగే పడుకున్నాడు. అతనెప్పుడైనా అంతే! ఆమె ఊహించని పనులే చేస్తుంటాడు. ఊహించనివి జరిగితేనే జీవితం జీవితంలా వుంటుందట. లేకుంటే ఎక్కడ నుండో ఓ ముక్కను తెచ్చి మరో ముక్కకి అతికించినట్లు వుంటుందట. అప్పుడప్పుడు సతీష్‌చంద్ర ధృతికి చెప్పే మాటలు ఇవి…
ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ ”నాకు ఈ గది చాలా నచ్చింది. ఇందులోకి అడుగుపెట్టిన క్షణం నుండి హాయిగా వుంది” అంది.
సతీష్‌ నవ్వి ”ఇదేమైనా డూప్లెక్స్‌ హౌసా? నచ్చానికి… ఏముందిక్కడ?” అన్నాడు.
”డ్యూప్లెక్స్‌ హౌస్‌లు ఎలా వుంటాయో నాకు తెలియవు. నేను చూడలేదు. బహుశా పోయిన జన్మలో కూడా నేను వాటిని చూసివుండను. చూడని వాటి గురించి ఎంత చెప్పినా నాకేం తెలుస్తుంది చెప్పండి! ఏదైనా చూడాలి. అనుభవించాలి. అప్పుడే చెప్పగలుగుతాం. ఈ గది మాత్రం ఎంతోకాలంగా నేను వున్న గదిలా అన్పిస్తోంది. నాకు ఇక్కడే వుండాలనిపిస్తుంది”.
”అది సాధ్యం కాదులే పడుకో!”
”ఎందుకు సాధ్యం కాదు. ఎప్పటికైనా మనం ఇదే వూరిలో వుందాం!”
సతీష్‌ భయంతో లేచి కూర్చుని దృతివైపు చూసి ”ఇదే ఊరిలో ఉందామా!!! సౌమ్యక్క వండిన కూరల్లో ఏమైనా తేడా వచ్చిందా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్‌? అసలేమైంది ధృతి?” అడిగాడు. భుజాలు రెండు పట్టుకొని కదిలించాడు.
”నాకేం కాలేదు. నా మాట వింటారా లేదా?”
”వినను. వినను” రెండుసార్లు అన్నాడు.
”అంటే! ఇప్పుడు నేనేం చెప్పినా వినరా? భార్య చెబితే భర్త వింటారే?”
”వినే విషయాలు వింటారు. ఇలాంటివి చెబితే ఎవరు వింరు?”
దృతి అప్పటికప్పుడే అలిగింది. ముఖం అదోలా పెట్టుకుంది.
అతను గంభీరంగా ”ఇక ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం! ఇంకెప్పుడు, ఎవరిముందూ ఈ ప్రస్తావన తేనని నాకు మాట ఇవ్వు. లేకుంటే సతీష్‌చంద్ర పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నాడంటారు. ముఖ్యంగా ఇది మా అన్నయ్యకు తెలిస్తే నిన్ను ఇంట్లోంచి గెంటేయిస్తాడు”
”మీరు ఒప్పుకుంటారా? ఆయన అలా చేస్తే?”
”ప్లీజ్‌! ఇక దీన్ని వదిలెయ్‌ మంటున్నానా?”
”అదేంటండీ మీరు ఒప్పుకుంటారా అంటే సమాధానం చెప్పరు?”
”నేనెలా ఒప్పుకుంటాను. నా భార్య నాకు ఎక్కువ. కానీ ఒక ఇంట్లో నలుగురు వున్నప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అది వింటారా? వాళ్లకూ కొన్ని అభిప్రాయాలు వుండవా? ఒక్కరి అభిప్రాయంతోనే కుటుంబ సభ్యులు నడుచుకుంటారా? రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల అభిరుచులు. అందర్నీ గమనించుకుంటూ పోవాలి కదా! అలాంటప్పుడు నువ్వు ఇలా మాట్లాడితే ఎగతాళి చెయ్యరా? అందుకే నీకు ఏది అనిపిస్తే అది బయటకు చెప్పెయ్యకు. అలా చెబితే నీకే ప్రమాదం”
”ప్రమాదమా?”
”అవును. నువ్విలాగే మాట్లాడుతూ వుంటే మా అన్నయ్య మా నాన్నతో చెప్పి నీకు పిచ్చెక్కిందని ప్రచారం చేస్తాడు. నాకు మళ్లీ పెళ్లి చేస్తాడు”
”మీరు చేసుకుంటారా?”
”చేసుకోను. కానీ నువ్వు లేకుండా నేనెలా వుండాలి? ఒకసారి పెళ్లి అయ్యాక నువ్వు నా భార్యవని నా మనసులో భావించాక మరో జీవిత భాగస్వామిని ఎలా వూహించుకోగలను? అర్థం చేసుకోవేం?” అన్నాడు. అతని మాటలు కాస్త మందలింపుగానే వున్నాయి.
ఆమె ఏమనుకుందో ఏమో గట్టిగా కళ్లు మూసుకుంది. ఆమె కళ్లు మూసుకోగానే సతీష్‌చంద్ర సున్నితంగా ఆమె చెంపలపై తట్టి ”మళ్లీ ఈ మాటలు మాట్లాడనని నాకు మాట ఇవ్వు” అన్నాడు.
ఆమె ఏమాత్రం సందేహించకుండా అతని చేతిలో చేయి వేసింది.
ఆమెకు కూడా భర్త చెప్పింది నిజమే అనిపించింది. ఎందుకంటే అందరూ కలిసి వుండాలన్న అభిప్రాయంతోనే వాళ్లంతా ఒకే ఇంట్లో ఆనందంగా వుంటున్నారు. ఆనంద్‌, మోక్ష బయటకెళ్లకుండా పెద్దవాళ్లతోనే కలిసి వుంటున్నారు. ఇప్పుడేదో తనకి ఈ ఊరూ, ఈ ఇల్లు నచ్చిందని ఇక్కడే వుందామంటే అది తన భర్త ఒక్కడి చేతిలో లేదుగా.
అతని చేతిలో వున్న ఆమె చేయిని నెమ్మదిగా నొక్కి ‘పడుకో!’ అన్నట్లు ఆమె మీద చేయివేసి పడుకున్నాడు…

*****

సాయంత్రం నాలుగు గంటలయింది.
ఆ ఊరిలోని బంజారా కాలనీకి చెందిన లంబాడ గిరిజనులు తీజ్‌ను పట్టుకొని సందడి సందడిగా చెరువు దగ్గరకి వెళ్తున్నారు.
తారమ్మ, సౌమ్య, ధృతి పట్టుచీరలు కట్టుకున్నారు. తారమ్మ అటు ఇటు హడావుడిగా తిరుగుతూ ”ఈ శేషయ్యదే లేటు. స్నానానికి పోతే రాడు” అంటూనే కోడలిని తన కాళ్లకు పసుపు పూయమని, వాళ్లను కూడా వాళ్ల కాళ్లకు పసుపు పూసుకోమని చెప్పింది. పసుపు పూసుకొని తలలో పూలు పెట్టుకున్నారు. అప్పటికే సతీష్‌చంద్ర ఫుల్‌హ్యాండ్స్‌లో వున్న వైట్ షర్టు, డార్క్‌బ్లూ ప్యాంటు వేసుకొని రెడీ అయ్యాడు. అతని ఎత్తుకి, అతని పర్సనాలిటీకి ఆ డ్రస్‌ మరింత హుందాగా అన్పిస్తోంది. పెళ్లికాని అమ్మాయిలు అతన్ని ఒక్కసారి చూస్తే మళ్లీ చూడకుండా వుండలేరు. దొంగచాటుగా ఎన్నిసార్లు చూస్తారో వాళ్లకే తెలియదు. అలా వుంటాడు సతీస్‌చంద్ర.
శేషేంద్ర రెడీ అవగానే అందరు కలిసి చెరువు దగ్గరకి వెళ్లారు. అప్పటికే అక్కడికి చాలామంది ఆడవాళ్లు, మగవాళ్లు వచ్చి వున్నారు. ఆడవాళ్లున్న వైపుకి తారమ్మ, సౌమ్య, ధృతి వెళితే మగవాళ్లున్న వైపుకి శేషేంద్ర, సతీష్‌ వెళ్లారు.
గుంపులు, గుంపులుగా గిరిజన మహిళలు, పెళ్లికాని ఆడపిల్లలు (తీజ్‌) గోధుమనార బుట్టల్ని తలల మీద పెట్టుకొని డప్పుల శబ్దాలతో ఆనందంగా తరలివస్తున్నారు. వాళ్లు వస్తున్న తీరు చూస్తుంటే పచ్చి పొలం ఐదున్నర ఎత్తుకి లేచి నెమ్మదిగా నడిచి వస్తున్నట్లుగా వుంది. ఆ దృశ్యం అద్భుతంగా, అద్వితీయంగా వుంది. ఆ అమ్మాయిలంతా ఒక్కసారిగా చెరువు దగ్గరకి చేరారు. తమ తలల మీద వున్న గోధుమనార బుట్టల్ని మెల్లగా కిందపెట్టి వాటి చుట్టూ నిలబడి ఆడుతున్నారు, పాడుతున్నారు. మగవాళ్ళు కోలాలాడుతున్నారు.
ధృతి సౌమ్య భుజాన్ని పట్టుకొని కళ్లార్పకుండా అటే చూస్తోంది. ఆమెకు చాలా కొత్తగా, వింతగా వుంది. తారమ్మ అక్కడ లేదు. ఆమె వయస్సున్న ఆడవాళ్లవైపుకి వెళ్లి నిలబడింది. చుట్టూ జనం భూమి ఈనిందా అన్నట్లు వున్నారు. ఆ వూరిలోని మహిళలే కాక వారి బంధువులు కూడా వున్నారు. ఆ ఊరి గిరిజనులు ఈ పండుగ వచ్చిందంటే బంధువుల్ని, స్నేహితుల్ని, సన్నిహితులను పిలుచుకుంటారు. అందుకే ఎటు చూసినా జనం. ఒక గంట ముందు నుండే ఛానల్స్‌ వాళ్లు వచ్చారు. చుట్టుపక్కల వున్న చెట్ల మీదకి ఎక్కి తమ కెమెరాలతో ఆ దృశ్యాలను షూట్ చేస్తున్నారు. ప్రెస్‌వాళ్లు వచ్చారు. జనంలో కలిసిపోయి వాళ్లు కూడా కొన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్లలో ఒక రిపోర్టర్‌ వెంటనే గిరిజన నాయకుని దగ్గరకి వెళ్లి ఆ పండుగ ప్రత్యేకతను అడిగి తెలుసుకుంటున్నాడు. ఆయన చెబుతుంటే చకచక రాసుకుంటున్నాడు.
చెరువు నిండా వున్న నీళ్లు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి. అమ్మాయిలు ధరించిన పట్టుపావడాలు, పట్టు ఓణీలు, పూలజడలు, మెడలో నగలు సాంప్రదాయంగా శోభాయమానంగా వున్నాయి. ధృతికి చూస్తున్నకొద్ది అబ్బురంగా వుంది. ఆ పండుగను వాళ్లు ఎలా జరుపుకుంటారో తెలియక పక్కనే వున్న సౌమ్యను అడిగింది.
సౌమ్య వెంటనే ”ఇది పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ధృతీ! తొమ్మిది రోజులు గిరిజన పెద్ద ఇంటి దగ్గర కొత్తగా వేసిన పందిరి కింద ఈ తీజ్‌ బుట్టల్ని పెట్టుకొని అమ్మాయిలంతా ఆడతారు. పాడుతారు. సాయంత్రం వేళల్లో ఈ చెరువు నుండే అమ్మాయిలందరు డప్పుల చప్పుళ్లతో వచ్చి నీళ్లు తీసికెళ్లి గోధుమనారకు పోస్తారు” అంది.
”గోధుమ నార అంటే?” అడిగింది ధృతి.
”పండుగ ప్రారంభం రోజు ఇక్కడ గిరిజన నాయకుడు వాళ్ల సంప్రదాయం ప్రకారం పెళ్లికాని అమ్మాయిలకి గోధుమ గింజల్ని, శెనగల్ని ఇస్తాడు. ఇంటికో బుట్ట చొప్పున తెచ్చుకొని ఆయన ఇచ్చిన గింజల్ని పట్టుకెళ్తారు. ఆ గింజల్ని రాత్రికి నీళ్లలో నానబోసుకొని తెల్లవారి పుట్టమన్ను తెచ్చుకొని ఆ మన్నును బుట్టలో వేసుకొని అందులో గోధుమ గింజల్ని చల్లుతారు. ఆ బుట్టల్ని గిరిజన నాయకుని ఇంటి ముందు పందిరి కింద వుంచుతారు. అందరి బుట్టలు అక్కడికే చేరుతాయి. వాటికి మూడు పూటల నీళ్లు పోస్తారు. ఆ గోధుమలు మొలకెత్తుతాయి. దాన్నే గోధుమనార అంటారు. తొమ్మిదో రోజు ఆ అమ్మాయిల్లో ఒక అమ్మాయి ఉపవాసం వుండి పూజ చేస్తుంది. పూజ అయ్యాక ఆడుతూ పాడుతూ ఆ తీజ్‌ బుట్టల్ని తలల మీద పెట్టుకొని ఈ చెరువు దగ్గరకి తెస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూస్తూనే వున్నావుగా” అని సౌమ్య చెబుతుంటే ధృతి విన్నది.
అంతలో ధృతిని సతీష్‌చంద్ర పిలుస్తున్నాడని ఎవరో వచ్చి చెప్పగానే ఆడవాళ్లలోంచి దారి చేసుకుంటూ సతీష్‌చంద్ర దగ్గరకి వెళ్లింది ధృతి. అతన్ని ఆనుకొని ”పిలిచావా?” అంది.
”అవును. అదిగో అటువైపుకెళ్దాం! అక్కడ చాలా బాగుంది. చెట్టునిండా పక్షుల గూళ్లు అద్భుతంగా వున్నాయి. ఆ గూళ్లన్నీ ఒక్క రోజులో ఏర్పడ్డవి కావు. ఆ గూళ్లు చాలా స్ట్రాంగా చలికి, గాలికి, వర్షానికి తట్టుకునేలా వుంటాయి. పద. చూద్దాం” అంటూ ఆమెను ఆ చెట్టు దగ్గరకి తీసికెళ్లాడు.
నిజంగానే ఆ చెట్టుకి వేలాడుతున్న పక్షుల గూళ్లు చాలా అద్భుతంగా, గమ్మత్తుగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడికి వీళ్లు వెళ్లడం చూసి ఇంకా కొంతమంది వచ్చి ఆ పక్షులను, గూళ్లను చూస్తూ నిలబడ్డారు.
వాళ్లు చూస్తుండగానే ఒక గూటిలోంచి ఒక పక్షిపిల్ల జారి దడాలున చెరువులో పడింది.
అది చూడగానే ”అయ్యో! పడిపోతుందండీ!” అంటూ సతీష్‌చంద్ర చేయిని గట్టిగా పట్టుకుని కెవ్వున అరిచింది ధృతి. ”అయ్యో! అయ్యో!” అంటూ నోటిమీద చేయిపెట్టుకుంది. సతీష్‌చంద్ర ఆమె భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకొని నీళ్లవైపే చూస్తున్నాడు.
ఆ పక్షి పిల్లకి అప్పుడే రెక్కలు మొలుస్తున్నాయి. రెక్కలల్లాడిస్తూ అలలతో పోరాడుతోంది. బావురుకప్పలు దాని చుట్టూ చేరాయి. నీళ్లలో వుండే నాచు దాని కాళ్లకు చుట్టుకుని అడ్డం పడుతోంది. అది మునకేసినప్పుడు దాని ముక్కుల్లోకి నీళ్లు పోతున్నాయి. తల విదిలించి మళ్లీ నీళ్లలోకి జారుతోంది. ఆ పక్షిపిల్లను అలా చూస్తుంటే ఊపిరి సలపని యుద్ధం చేస్తున్నట్లే వుంది. అంతలో ఎక్కడనుండో ఒక ఎండు కర్రపుల్ల రాలి పడడంతో ఆ పక్షిపిల్ల గబుక్కున దానిమీదకి ఎక్కి కూర్చుంది. అది చూడగానే గుండెల మీద చేయి పెట్టుకుని ”హమ్మయ్యా!” అనుకుంది ధృతి.
ఆమెను మరింత దగ్గరకి హత్తుకుని ”భయపడ్డావా?” అన్నాడు.
ఆమె తేలిగ్గా గాలి పీల్చుకుని ”మామూలుగా కాదు” అంది.
”ఆ పక్షిపిల్ల నీటితో యుద్ధం చేసినట్లే మనుషులు కూడా బయట యుద్ధం చేయాలి” అన్నాడు.
”జోక్‌ చేస్తున్నారా? మనుషులు యుద్ధం చేయడం ఏమి? సైనికులు మీరు కదా యుద్ధం చేస్తారు” అంది.
”నీకు ఆ యుద్ధమే తెలుసు. కానీ జీవితంలో ప్రతి మనిషి ఆ పక్షిపిల్ల నీటిలో చేసిన యుద్ధమే చేయాలి. చేస్తారు కూడా. కానీ వాళ్లలో వుండే ఏ శక్తిని బయటకు తీస్తే గెలుస్తారో తెలిసినవాళ్లు చాలా తక్కువగా వుంటారు. అందుకే గెలుపు అనేది అందరికి రాదు” అన్నాడు.
ధృతి ఆ మాటల్ని ఆలోచనగా విని ”నేనిక సౌమ్య దగ్గరకి వెళ్తాను. నాకోసం చూస్తుంటుంది” అంటూ సౌమ్య దగ్గరకి వెళ్లింది.
అమ్మాయిలందరు కలిసి తీజ్‌ను చెరువులో నిమజ్జనం చేశారు. అంతితో నిమజ్జనం పూర్తయింది. ఆ తర్వాత అన్నలందరు చెరువులోంచి నీళ్లు తెచ్చి చెల్లెళ్ల కాళ్లు కడిగారు. మీకు జీవితాంతం మేము తోడుగా వుంటాం అని వాళ్ల కాళ్లకి మొక్కుకున్నారు. అది చూసి దృతి మరింత ఆశ్చర్యపోయి చూసింది.
”అది వాళ్ల సాంప్రదాయం. వాళ్లలో అన్నయ్యలు చెల్లెళ్ల కాళ్లు కడిగి. కాళ్లకి మొక్కి మీకు మేమున్నామని భరోసా ఇస్తారు” అంది.
”ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది” అంటూ మెచ్చుకుంది ధృతి.
సతీష్‌చంద్ర అప్పటికే తన కెమెరా తోటి చాలా ఫోటోలను తీసుకున్నాడు.
ఇంటికొచ్చాక భోజనాలు ముగించుకొని, కొద్దిసేపు ఆరుబయట వెన్నెల్లో మంచాలు వేసుకొని కూర్చున్నారు. మంచి మంచి కబర్లు చెప్పుకుంటూ మనసుకు హాయిగా, ఉత్సాహంగా అన్పించే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా తీజ్‌ పండగ గురించే మ్లాడుకుంటున్నారు. ఆ పండగ గురించి సతీష్‌చంద్ర మాట్లాడుతుంటే పక్కనే వున్న దృతి ”ఈ పండుగ గురించి మీకు ముందే తెలుసా?” అని ఆశ్చర్యపోతూ అడిగింది.
”నేను రాజస్థాన్‌ బార్డర్‌లో అక్కడి ఎడారుల్లో పని చేస్తున్నప్పుడు అక్కడికి దగ్గరలో మా స్నేహితుని ఊరు వుండేది. అతను తీజ్‌ ఉత్సావాలప్పుడు నన్ను వాళ్ల ఊరు తీసికెళ్లాడు. అప్పుడు చూశాను” అన్నాడు.
”అవునా! రాజస్థాన్‌లో కూడా చేస్తారా? మేమింకా ఇక్కడ మా ఊరిలోనే చేస్తామేమో అనుకుంటున్నాం…” అంది తారమ్మ.
”లేదాంటీ! ఈ పండగను ఇక్కడ ఈ ఊరిలోనే కాదు. చాలా దేశాల్లో చేస్తారు. జైపూర్‌ వీధుల్లో అయితే ఖరీదైన దుస్తుల అలంకరణలో స్త్రీ పురుషుల కోలాహాలాలు, పాటలు, అందంగా అలంకరించిన ఏనుగులు, గుర్రాలు, నాట్యకత్తెలు సంప్రదాయ సంగీతకారులు అంతా కలిసి కన్నుల పండుగగా వుంటుంది. ఇంకా ఈ తీజ్‌ని హర్యానా, బీహార్‌, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవాలలో కూడా చేస్తారు. ఇంతెందుకు భారత సరిహద్దు నేపాల్‌లో కూడా జరుపుకుంటారు” అన్నాడు.
”ఇన్ని చోట్ల జరుపుకుంటున్నారు కదా! అసలీ ఉత్సవాలను ఎందుకు జరుపుతారో తెలుసా మీకు?” అని అడిగింది దృతి. వెంటనే నువ్వు చెప్పొద్దు అంటూ సౌమ్యకు సైగ చేసింది. సౌమ్య అలాగే అన్నట్లు నవ్వింది.
”శివుడికి పార్వతి చేరువైనందుకు గుర్తుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఉత్సవ అలంకరణలో పార్వతీదేవి ప్రతిమ తప్పకుండా వుంటుంది. అత్యంత శక్తి సంపన్నత గల ఈ దేవిని హైందవ స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆదిపరాశక్తిగా కొలుస్తారు. విశ్వసృష్టికి, శక్తి సామర్ధ్యాలకు, అన్ని జీవరాశులకూ శక్తినొసంగే అమ్మగా ప్రణమిల్లుతారు. వైవాహిక జీవితం సంతోషంగా, సుఖంగా సాగడానికి ఆమె ఆశీస్సుల్ని కోరతారు. మంచి భవిష్యత్తు కోసం, వైవాహిక జీవితం బాగుండాలని వివాహితలు, కన్నెపిల్లలు అమ్మను పూజిస్తారు. ఉపాసిస్తారు” అన్నాడు.
చూశావా మనం చెప్పకపోయినా చెప్పేస్తున్నాడు అన్నట్లు చూసింది సౌమ్య.
”ఈ పండుగ ఏ దేశంలో జరిగినా దీని ఉద్దేశం ఇదే!” అన్నాడు సతీస్‌.
తారమ్మ అది విని ఇంకా తనకి తెలిసిన సంగతులు కొన్ని చెప్పింది. వాళ్లు చాలాసేపు అక్కడే కూర్చుని ఆనందంగా మాట్లాడుకుంటూ గడిపారు.

*****

నరేంద్రవాళ్ల ఊరిలో నాలుగు రోజులు ఉండాలని వచ్చిన సతీష్‌చంద్ర, దృతి ఇంకో నాలుగు రోజులు అదనంగా గడిపారు. వాళ్లకి ఆ వాతావరణం పచ్చి పొలాలు, కొండలు, నీళ్లు తాగి కొండల మధ్యలో నెమ్మదిగా కదిలే మబ్బులు, చెరువు చూస్తుంటే అక్కడ నుండి వెళ్లాలనిపించలేదు. ప్రతిరోజూ సన్ని వర్షంలో తడిపొడిగా తడుసుకుంటూ పచ్చని కొండల దాకా వెళ్లి వచ్చేవాళ్లు. ఆ అనుభూతి చాలా గొప్పగా వుండేది వాళ్లకి…
అంకిరెడ్డి ఆ సాయంత్రమే కారులో వచ్చాడు. తారమ్మకు, వాళ్ల ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పి కొడుకును, కోడల్ని తీసికెళ్లాడు.
సతీష్‌చంద్రకి అస్సాం వెళ్లాల్సిన రోజులు దగ్గరపడుతున్నకొద్దీ దృతిని వదిలి వెళ్లాలనిపించటం లేదు. ఈ రెండు నెలల్లో ఆమె సాంగత్యానికి బాగా అలవాటు పడిపోయాడు. అతను ఆమె మాటలకి, ఆమె స్పర్శకి పులకించిపోని క్షణం లేదు. ఆమె నవ్వినప్పుడు ఆ నవ్వు అతని కోసమే అన్నట్లు అతి రహస్యంగా సమ్మోహనంగా అన్పిస్తుంది. ఆమె చెక్కిలి నునుపు, పెదవుల మృదుత్వం, కుప్ప పోసినట్లుగా వున్న సౌందర్యం అతనికి అస్సాం వెళితే దొరుకుతుందా? ఎడారులు, అడవులు, చలి, కందకాలు తప్ప ఏముందక్కడ? ఇక్కడ ఇంత అందాన్ని, ప్రేమను, మమతను, మమకారాన్ని వదిలి అక్కడికెళ్లి ఎలా వుండాలి? అసలు వుండగలడా? దృతి గుర్తొచ్చి రావాలన్నా రాలేడే! అక్కడ తన మనసును, హృదయాన్ని ఎవరు చల్లబరుస్తారు. అసలు తనకో హృదయం వుందని అది దృతికోసం కొట్టుకుోంందని ఎవరు కనిపెడతారు? ఎవరికంత సమయం వుంటుంది? ఇలాంటి ఆలోచనలకు ఎవరక్కడ ప్రాధాన్యత ఇస్తారు? పిచ్చోడా! దేశంరా మనకు కావలసింది. దేశం కోసం బ్రతకరా! దేశం కోసం చావరా అంటారు. వద్దు బాబోయ్‌! ఇక వెళ్లొదక్కడికి… వెళ్లకుండా వుండేందుకు ఏదో ఒక మార్గం ఆలోచించాలి… రాత్రి ఇదే మాట తల్లితో చెప్పాడు. అది వినగానే మాధవీలత భయంతో వణికింది.
”వద్దు సతీష్‌! నువ్వు వెళ్లాలి. ఎందుకంటే నేను ఇక్కడ నా స్నేహితురాళ్లందరికి ఫోన్లు చేసి మరీ చెప్పుకున్నాను”
”ఏమని చెప్పావమ్మా?”
”మా ఆనంద్‌కే కాదు, మా సతీష్‌కి కూడా జాబ్‌ వుంది. జీతం వస్తుంది. నెలనెలా మాకు పంపిస్తుంటాడు. దృతిని వదిలేసే వెళ్తాడు. ఇంకెంత… ఇంకో రెండుమూడు రోజుల్లో వెళ్లిపోతాడు అని. నా మాట పోతుంది. నా పరువు పోతుంది. అవి పోయాక నేనుండి ఎందుకురా? అప్పుడేమో సరిగా చదవకుండా నా పరువు తీశావు. ఇప్పుడేమో ఉద్యోగం మానేసి ఇంట్లో వుండి నా పరువు తీస్తావా?” అంది. ఆమె చివరిమాటల్లో కోపం కన్నా ఆవేదన వుంది.
”ఇందులో పోయే పరువేముందమ్మా! నాకు నచ్చినట్లు వుండాలనుకుంటున్నాను. అంతే!” అన్నాడు కచ్చితంగా.
”నువ్వెప్పుడూ అంతేరా! నీకు నచ్చినట్లే వుండాలనుకుంటావ్‌! అందుకే ఏది సరిగా చెయ్యవు. చెయ్యలేవు. ఇక నీ ఇష్టం. ఎంత చెప్పినా విననప్పుడు నేను మాత్రం ఏం చెయ్యగలను. చిన్నప్పుడే మాట వినేవాడివి కాదు. ఇప్పుడు వింటావా? అన్నయ్య హాయిగా చదువుకుంటుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండేవాడివి. పుస్తకం పట్టరా అంటే వినేవాడివా? ఇప్పుడు ఇదికూడా అంతే! నీకు మాట వినటం అంటే ఏమిటో తెలిస్తేగా! ఎందుకింకా నేను నీ ముందు కూర్చోవటం. వెళ్లిపోవటం మంచిది. ఏదో ఒక పని చేసుకుంటుంటే మనసు ఆ పని మీదకు పోయి ప్రశాంతంగా వుంటుంది” అంటూ లేచి వెళ్లిపోయింది.
అయినా సతీష్‌ మనసు దృతి మీదనే వుంది. నరేంద్ర వాళ్ల ఊరెళ్లినప్పటి నుండి అతని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. ఆ వాతావరణంలో జీవం వుంది. జీవకళ వుంది. కానీ నరేంద్ర లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా కన్పిస్తోంది. హుషారుగా పనులు చేసుకుంటున్నారనే గాని తారమ్మను శేషేంద్రను చూస్తుంటే వాలుతున్న పొద్దునే గుర్తొస్తోంది. పక్కన నరేంద్ర లేకపోవడం వల్లనో ఏమో వున్నానంటే వున్నానన్నట్లుంది సౌమ్య. ఆమెను ఎవరు అర్థం చేసుకుాంరు? ఆమె మనసు లోతుల్లోకి ఎవరెళ్లి చూస్తారు? ఆమెకు ఆరోగ్యవంతమైన మనసు వుంది. ఆలోచనలు వున్నాయి. అవి ఎవరిక్కావాలి? ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి అంత అవసరం వుంది? తల్లిదండ్రులకు లేదు. అత్తమామలకు లేదు. ఆమెను వాళ్లు చూడాల్సిన రీతిలో చూస్తూ బాధ్యతగానే వున్నారు. ఎవరి బాధ్యతలు వాళ్లవి, ఎవరి బాధలు వాళ్లవి, ఎవరిభావాలు వాళ్లవి… అందులో అందరితో అన్నీ పంచుకోలేని సందర్భాలు ఎన్నో వుంటాయి. ఒక్కోసారి నరేంద్రను గుర్తు చేసుకుంటూ ఆమె లోకంలో ఆమె వుండి ఎక్కడ కూర్చుంటే అక్కడే వుండిపోయేది. అలాంటప్పుడు తారమ్మ సౌమ్యకు తెలియకుండా ఎన్నోసార్లు తలకొట్టుకుంది. అది చూసి ”ఏందుకాంటీ తల కొట్టుకుంటున్నారు?” అని అడిగితే ”ఏం లేదు బాబు! నా కోడలు కోమాలోంచి బయటకొచ్చినప్పటి నుండి ఇంతే! ఇలా వుందన్న విషయం తనకు తెలియనియ్యకుండా జాగ్రత్త పడుతూ నెట్టుకొస్తున్నాను. మళ్లీ ఏ అఘాయిత్యం చేసుకోకుండా కాపాడుకుంటున్నాను. అలా కాపాడుకుంటానని నరేంద్రకు మాట ఇచ్చాను” అంది… ఇలా ఇచ్చిన మాటలు, తీసుకున్న మాటలు, నిలుపుకున్న మాటలు ఒక అమ్మాయి మనసులోని ఉదృతిని, రహస్య రసోద్విగ్నతను అర్థం చేసుకోగలుగుతాయా? అది సాధ్యమయ్యేదేనా?
రేపు దృతి పరిస్థితి కూడా ఇంతే కదా! దృతిని ఎవరు అర్థం చేసుకుంటారు? సౌమ్య కుటుంబ సభ్యులకు ఆమె కోమాలోకి వెళ్లి తిరిగి బయటకొచ్చిన మనిషి అన్న జాలి అయినా వుంది. దృతిపట్ల అలాంటి జాలి కూడా వుండే అవకాశం లేదు. అందుకే నరేంద్రవాళ్ల ఊరిలో కొంత పొలాన్ని కౌలుకి తీసుకొని ఆ పొలంలో పనులు చేసుకుంటూ దృతిని తీసికెళ్లి అక్కడే వుండిపోవాలనుకున్నాడు. అలా వుంటే నరేంద్ర తల్లిదండ్రులకి తోడుగా వున్నట్లు వుంటుంది దగ్గర కాబట్టి రోజు మార్చి రోజు సిటీకొచ్చి తన తల్లిదండ్రులను కూడా చూసుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకున్నాక ఇది వింటే తల్లికూడా సంతోషిస్తుందని ముందుగా తండ్రి దగ్గరకి వెళ్లి చెప్పాడు. ఆయన దానికి ఒప్పుకోలేదు.
”నీక్కూడా నేను సైన్యంలో లేకుండా ఇంట్లో ఉండటం ఇష్టమేగా నాన్నా! ఎందుకు ఒప్పుకోవటం లేదు. పైగా మీరు పెద్దవాళ్లయిపోతున్నారు. నేను ఇక్కడ వుంటే మీక్కూడా కాస్త ధైర్యంగా వుంటుంది కదా!” అన్నాడు సతీష్‌చంద్ర.
”అన్నయ్య వున్నాడుగా మాకు ధైర్యం చెప్పటానికి. అయినా నేనింకా రిటైర్‌ కూడా కాలేదు. అప్పుడే ఎక్కడ పెద్దవాళ్లమయ్యాం. వయసు వచ్చేకొద్దీ నీకు వున్న బుర్ర కూడా పోతోంది సతీష్‌! లేకుంటే ఇలా మాట్లాడవు” అన్నాడు అంకిరెడ్డి.
మాట్లాడలేక ఒక్కక్షణం ఆగి ”అది కాదు నాన్నా!” అన్నాడు.
ఆయన గంభీరంగా చేయి చూపి ఆపుతూ ”నువ్వింకేం మాట్లాడకు సతీష్‌!” అన్నాడు.
”మాట్లాడకపోతే నా మనసులో మాట నీకెలా తెలుస్తుంది నాన్నా!” అంటూ అతనేం చెయ్యాలనుకుంటున్నాడో చెప్పాడు సతీష్‌చంద్ర.
”ఇది మీ అమ్మతో చెప్పావా?” అని అడిగాడు అంకిరెడ్డి.
”చెప్పలేదు నాన్నా! ముందు మీకు చెప్పాకనే చెబుదామనుకున్నాను. కొంతవరకు చెప్పాను కాని ఇలా అని పూర్తిగా చెప్పలేదు” అన్నాడు సతీష్‌చంద్ర.
”చెప్పకు. వింటే గుండె ఆగి చస్తుంది”
”అదేంటి నాన్నా?”
”అదంతేరా! ఆమె సమాజం కోసం బ్రతికే మనిషి”
”సమాజం కోసమా?”
”అవును సతీష్‌! చుట్టూ వున్న అపార్ట్‌మెంట్స్ లో వుండే ఆడవాళ్లే ఆమె ప్రపంచం. ఆమెలో దేశభక్తి లేదు. దేశసేవకి కొడుకును వదిలెయ్యాలన్న త్యాగభావన లేదు. వుండేదల్లా నీమీద ప్రేమ, మమకారం. అందువల్లనే ఆమె ఆశించినట్లు నువ్వు ఏ డాక్టరో, ఇంజనీరో కాకపోయినా దూర దేశంలో వుండి ఏదో ఒక పని చేస్తున్నావన్న భ్రమలో వుంది. ఆ భ్రమలోనే వుండనీయ్‌! భ్రమలు కూడా మనుషుల్ని బ్రతికిస్తుంటాయి” అన్నాడు.
”భ్రమా?”
”కాక నువ్వేమైనా అన్నయ్యలా చదివావా? అన్నయ్యలా వున్నావా? ఏదో ఒకటి చేసుకుంటూ దూరంగా ఎక్కడో ఎవరికీ కన్పించకుండా వున్నాడులే అని మేం తృప్తి పడుతున్న సమయంలో మళ్లీ ఈ వ్యవసాయం గోలొకటి విన్పిస్తున్నావు. నువ్వు పల్లెటూరులో వుండటం మీ అమ్మ ఇష్టపడుతుందా? దేశం ఎంతో ముందుకెళ్తోంది. పల్లెల్లో వున్నవాళ్లు కూడా సిటీకొచ్చి అపార్ట్‌మెంట్స్ లో వుంటున్నారు. నువ్వు మట్టి పూసుకుంటావా?”
”తప్పేముంది నాన్నా!”
”పైగా తప్పేముంది నాన్నా! అసలు నీ కళ్లకి నేను మీ అమ్మ ఎలా కన్పిస్తున్నాంరా? వెర్రోళ్లలా కన్పిస్తున్నామా?”
”అదేంటి నాన్నా అలా మాట్లాడుతున్నావ్‌?”
”ఇంకెలా మాట్లాడాలి సతీష్‌! అప్పుడేమో వద్దురా అంటే సైన్యంలోకి వెళ్లి మమ్మల్ని ఏడిపించావు. నువ్వు సైన్యంలో వున్నావని నీకెవరూ పిల్లనివ్వకపోతే అదో ఏడుపు. ఇప్పుడు వ్యవసాయం చేస్తాను అంటున్నావు… ఎన్నిసార్లు ఏడిపిస్తావురా నన్నూ, మీ అమ్మను”
సతీష్‌చంద్ర తండ్రి ముఖంలోకి చూడకుండా సీరియస్‌గా ఎటో చూస్తున్నాడు.
”మొన్న నీ పెళ్లిలో ఎవరో అన్నారట చాలామంది తల్లులకు డాక్టర్లు, ఇంజనీర్లు పుడతారు కాని సైనికులు పుట్టరని… అది విని మీ అమ్మ పడే ఆనందం అంతా ఇంతా కాదు. అది కూడా లేకుండా చేస్తావా ఆమెకు?” అన్నాడు అంకిరెడ్డి.
ఇప్పుడు కూడా సతీష్‌ మాట్లాడలేదు. అతని మనసులో పైకి కన్పించని అల్లకల్లోలం మొదలైంది.
”మీ అమ్మ పిచ్చిదిరా! దానికి దేశం మీద ప్రేమ లేదు కాని నీ మీద వెర్రి ప్రేమ. నీ గురించి ఎవరూ తక్కువగా మాట్లాడకూడదనుకుంటుంది. అది గమనించి బ్రతకరా!” అన్నాడు. ఆయన గొంతునిండా అదోరకమైన ఆర్ధ్రత.
మనసంతా వికలమైంది సతీష్‌కి. వెంటనే తండ్రి గదిలోంచి బయటకొచ్చాడు. నేరుగా వాసుదేవ్‌ ఇంటికి వెళ్లాడు.
*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *