April 25, 2024

రాయినైనా కాకపోతిని…..

కన్నడ మూలం – ఎమ్. ఆర్ మందారవల్లి
తెలుగు అనువాదం- బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

కంపెనీ బస్ లో ఇంటికి బయల్దేరాడు సుందరం. మొదటి ట్రిప్ కావడంతో బస్ కొంచెం ఖాళీగానే ఉంది. పండగరోజు కావడం వల్ల చాలామంది రాలేదు. బస్ మధ్య ఉన్న సీట్ లో కిటికీ ప్రక్క కూచున్నాడు. ఇంటికి చేరడానికి ఒక గంటకు తక్కువేమీ పట్టదు. హాయిగా ఒక కునుకేసేయవచ్చు. కళ్ళు మూసుకుని కూర్చోగానే అతనికి సుమతి మదిలో మెదలసాగింది. భార్యే అయినా, సుందరానికామె ఒక ప్రశ్నగానే మిగిలిపోవడం సమస్యనో కాదో దేవునికే తెలియాలి. అతని మనసులోనే ఒక చిన్న మందహాసం విరిసింది. ఈ వేళలో ఆమె ఏం చేస్తూ ఉంటుందో? లేతపసుపురంగు చీర నేతచీర కట్టుకొని వంటగదిలో తన కోసం ఏదైనా చేస్తూ ఉంటుందేమో అనుకుంటే మనసులో ఏదో పులకరింత. ఇంటికి వెళ్ళాక ‘నాకోసమేనా ఈ పకోడీలు’ అంటే, ‘అబ్బే, అదేం లేదు. పిల్లలు ఇంటికి వచ్చే వేళయింది కదా, ఏమన్నా కావాలంటారని’ అనేస్తుంది. తనకోసమే ఎన్నో చేస్తుంది కానీ ఆమాట ఒప్పుకోవడానికి ఆమెకేం ఇబ్బందో ఇన్నేళ్ళయినా అతనికర్థం కానేలేదు. నిన్న రాత్రి గొంతు కొంచెం బొంగురుపోతుంటే పదే పదే అతను గొంతు సవరించుకోవడం గమనించి, ఆమె ‘ బయటి నీళ్ళేవైనా పడలేదో ఏమో! వేడినీళ్ళు తాగండం’టూ నీళ్ళు వెచ్చబెట్టి ఇచ్చింది. ఈరోజు పొద్దున్న మిరియాల చారు, అల్లం చెట్నీ చేసింది. ‘నా గొంతుకు మందా?’ అని అడిగితే ‘అలా అని కాదు. వాతావరణం మారుతున్నపుడు రెండు రోజులు మిరియాల చారు, అల్లం చెట్నీ తింటే నయం’ అనేసింది. పిల్లలు’ ఏంటమ్మా…మిరియాల చారా…? ‘ అని ముఖం చిట్లించుకుంటే ,’ తట్టలో వేసిన అన్నాన్ని పేర్లు పెట్టకూడదు. తినేసి లేవండి.’ అని ఖచ్చితంగా చెప్పేసింది. తలచుకుంటే అతని మనసులో ఒకరకమైన గగుర్పాటు, దాంతో పాటు అదే బదుల్లేని ప్రశ్న- మనసు విప్పి మాట్లాడదెందుకు? అతని మనస్సు పెళ్ళైన కొత్త రోజులకు పరుగుతీసింది.
బి ఎస్సీ చివరి పరీక్షలు ముగించి ఆమె ఇల్లు చేరిన రోజుల్లోనే వాళ్ళింటికి మొదటిసారి వెళ్ళడం. పొడుగూ పొట్టీ కాని, బొద్దైన, మంచి చాయ గల రూపం. పొడుగాటి జడ, మౌనమందారం. తనకు ఆ అమ్మాయి నచ్చడంలో వింతేమీ లేదు. ఆ రెండు కళ్ళే చాలు తన సమస్తాన్నీ లాగేయడానికి. పెద్ద పెద్ద తామరరేకుల్లాంటి కళ్ళు. వాటిలో దాగిన భావాలను ఏమని ఊహించుకోగలం? ఆ కళ్ళు తననెప్పటికీ వదలని సహచరిగా ఉండిపోయాయి. ఇప్పటికీ అంతే. కోపంతో విచ్చుకున్నా, సాంత్వనగా అవనతమైనా, తీక్ష్ణతలో ముడుచుకున్నా……అందులో చెప్పలేని భావమొకటి ఏదో తెలుస్తూ ఉండడం మాత్రం నిజం. పెళ్ళి కుదిరాక కూడా ఏమీ మాట్లాడని ఆ అమ్మాయిని తానే ప్రయత్నంమీద పిలిపించుకొని కూర్చోబెట్టి మరీ మాట్లాడించాడు. ‘ఏమైనా మాట్లాడు.’ అని తానే అడిగితే ‘ఏం మాట్లాడాలి?’ అన్నట్టుగా మూగగా ఉండిపోయింది. చివరకు అతనే ‘నేనంటే నీకిష్టమేనా?’ అని అడిగితే….అవే పెద్ద కళ్ళని విప్పార్చి తన వంక చూసింది. ఆ ముఖంలో కనిపించీ కనిపించని దరహాసం. ఆ చూపులో మునిగిపోకముందే, ‘మీరైనా, ఎవరైనా….పెళ్ళిఅంటూ చేసుకోవాలి కదా!’ అనేసి తుర్రుమంది. అదే సమాధానమో, లేక తనకు చేసిన బోధనో….ఇంతవరకూ తనకు తెలియనేలేదు.
బస్సు ఠక్కున ఆపి బ్రేకు వేసిన డ్రైవర్ ఎవరినో బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు సుమతి ఉంటే ఏమనేది…ఊహించుకోగానే అతని పెదవులపై చిరునవ్వు మెదలింది.” పెళ్ళైన కొత్తలో ఒకసారి బంధువులింటికి పరిచయమున్న ఆటో లో పోతున్నపుడు ఇలాగే అడ్డం వచ్చిన సైకిల్ ను తప్పించడానికి బ్రేకు వేసి ఆటోడ్రైవరు ఆ చిన్న పిల్లాడిని తిట్టి ఆటో పోనిస్తూ తమకు సారీ చెప్తే, ఏమంది? ‘అదికాదయ్యా వాడు చిన్న పిల్లాడు.మనమే కొంచెం చూసుకొని పోవద్దూ!’ అంది. ‘ ఏదైనా జరిగిందంటే ప్రాణం మీదకు వచ్చేది కాదా’ చిరాగ్గా అన్నాడా ఆటోవాడు. ‘అందుకే చెప్పేది. మనమే చూసుకొని పోవాలని. పెద్దవాళ్ళు మీకే తెలియనిది పిల్లాడికి తెలుస్తుందా’ అంది. వాడేం మాట్లాడలేదు. కానీ సుమతి ఊరుకుందా! ‘అవేం చెడ్డ తిట్లవి?అయినా చెప్పాలనుకుంటే ఒక మాటలో చెప్పలేమా?’ అంది. ఇక తను కల్పించుకొని ‘ పోన్లే, ఏదో దేవుని దయ’ అన్నపుడు తనపైనే కళ్ళెర్ర జేసి చూసింది. ఆ కళ్ళు ఏం చెప్పాయో, తనకేమర్థమైందో మరి!”
స్టాప్ లో దిగి సందులోకి తిరిగి ఇంటివైపు నడవసాగాడు సుందరం. ఇల్లు సమీపిస్తుండగా తంబూరాశృతితో,
‘రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతిని పుణ్యచరితము రాయగా ‘
అంటూ శ్రావ్యంగా పాట వినిపిస్తోంది. మనసంతా దూదిపింజెలా తేలికైపోగా, చప్పుడు కాకుండా షూ విప్పి, లోపలికి నడిచాడు. లీనమై పోయి పాడుతున్న సుమతిని చూసి అవాక్కై,’ అరె, సుమతి! పెళ్ళై ఇరవై నాలుగేళ్ళయినా ఒక్కరోజూ నాముందు పాడనే లేదు! ఈ రోజు ఉన్నట్టుండి పాడుతూంది!’ అనుకుంటుండగానే, సుమతి సుందరాన్ని చూసి తడబడి, “అరె, త్వరగా వచ్చేశారే!” అంటూ తంబూరా ఎత్తి పైన పెట్టి లేచింది. “ఎందుకాపావు? పాడు. బాగానే పాడుతున్నావే!” అన్నాడు సుందరం ముచ్చటగా చూస్తూ.
‘అదేముంది లెండి. ఎప్పుడో బళ్ళో చదువుకునే రోజుల్లో నేర్చుకున్నది. అప్పుడు పాడుకుంటుండేదాన్ని. ఇప్పుడు, ఈ వయస్సులో , ప్రాక్టీసూ లేక ఏం బాగు! ఏదో కాస్త తీరికగా ఉంటే అలా పాడుతున్నానంతే.’ అనేసి అతడి క్యారియర్ డబ్బా తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. సుందరం లోపలికెళ్ళి బట్టలు మార్చుకొని, కాళ్ళూ ముఖం కడుగుకొని, హాల్లోకొచ్చి ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాడు. ఇంతలో సుమతి వేయించిన అటుకుల పళ్ళెం, కాఫీ తెచ్చి ఇచ్చి కూర్చుంది. సుందరం భార్యవైపు తదేకంగా చూశాడు. పాపం, స్కూలు, కాలేజ్ అంటూ హాయిగా పక్షిలాగా గాల్లో ఎగురుతూ ఉన్న అమ్మాయిలు పెళ్ళి అవగానే తమకంటూ ఒక జీవనం ఉన్న మాటే మరిచిపోతారుకదా!భర్త, ఇల్లు, పిల్లలు, సంసారం….ఇలాగే బ్రతుకంతా గడిపేస్తారదేమిటో! అని ఆలోచిస్తూ అటుకులు నోట్లో వేసుకుంటూ మళ్ళీ ఆమె వైపు చూశాడు. ఇంకొంచెం బొద్దుగానే తయారైంది. అందుకేనేమో చాయ కూడా పిసరంత హెచ్చింది. పొడవైన జుట్టులో దాదాపు సగం తెల్లబడుతోంది. జుట్టుకు రంగేద్దామన్న ఆలోచనేమీ ఉన్నట్టు లేదు. ఇంక తానే చెప్పబోతే, ‘మీ మగాళ్ళున్నారే..! జుట్టు తెల్లబడినా ఏడుపే, ముఖం నల్లబడినా ఏడుపే…విచిత్రమైన లాజిక్ మీది’ అంటుందేగాని తన మనసులో మాటేమిటో బయటపడదు.
“ఏమిటలా చూస్తున్నారు? అటుకులు సరిగ్గా వేగలేదా ఏమిటి?” అటుకుల గురించి అడుగుతున్నా, ముఖంలో సిగ్గుతెరలు చక్కగానే చూడగలిగాడు సుందరం.
అంతలోనే బస్ లో కూర్చున్నపుడు తన మదిలో మెదలిన పెళ్ళైన కొత్తరోజుల జ్ఞాపకాలు తలపుకొచ్చి, ఇప్పుడన్నా అడగాలి తన మనసులో మాట అనుకుంటుండగానే , ముసిముసి నవ్వులతో “మిమ్మల్నే, ఏంటంతలా చూస్తున్నారు?” అని రెట్టించింది సుమతి.
“ అదికాదోయ్….నీకు నేను నచ్చానో లేదో అని అడిగితే అప్పట్నించి ఇప్పటిదాకా నీవు జవాబే ఇవ్వలేదే? నేనూ ఏమీ అర్థం చేసుకోలేకపోయాను…..అదే ఆలోచిస్తున్నాను.” అన్నాడు.
“పిల్లలు ఇంటికొచ్చే వేళ అయింది. ఇప్పుడేంటీ మాటలు!” కళ్ళు పెద్దవి చేసింది ఆశ్చర్యంతో.
“‘ఇప్పుడేంటా..? మరి అప్పుడే అడిగితేనూ చెప్పకపోతివి.”
“అప్పుడా? ఎప్పుడూ?” సుమతి కళ్ళు మరింత విచ్చుకున్నాయి. తామరపూరేకులేనా అవి!!
“అప్పుడంటే మన నిశ్చితార్థం రోజున….” గుర్తు చేశాడు. సుందరం మనసు రెక్కలు కట్టుకొని ఎగురుతోంది.
“అదా….” నెలవంక విరిసినట్టు నవ్వింది. “బాగుంది కథ! మీరు ఇష్టమో కాదో చెప్పడానికి మీరేమైనా తినుబండారమా, ఏమిటి? ఇది జీవితం కదండీ…మనమంతా మనుషులం. కాదా!”
అది తన ప్రశ్ననా, నాకు పాఠమా…మళ్ళీ గందరగోళంగానే ఉంది సుందరానికి. తమ యింట్లో నాన్న దగ్గర్నించీ, చివరి తమ్ముడి వరకూ అందరూ ఇష్టపడి పెళ్ళిళ్ళు చేసుకున్నవాళ్ళే కావడంతో వాళ్ళ ప్రేమ, అనురాగాల మాటలు వింటూ చూస్తూ పెరిగిన సుందరానికి పెళ్ళి, భార్య, పెళ్ళి ముచ్చట్లు, పెళ్ళి పనులు, పెళ్ళిబట్టలు అన్నిటి గురించి ఏవేవో ఊహలుండేవి. ఈ సుమతి ఇలా మాట్లాడుతుందేమిటా అనుకున్నాడు. “నాకు నీవు నచ్చావో లేదో అనీ నీవడగలేదు. నేను నీకు నచ్చానా అంటేనూ చెప్పవు. మన మధ్య ఏ ఇష్టం, ప్రేమ లేకుండానే కాపురం చేస్తున్నామంటావా?” కాఫీ తాగేసి, లోటాతో పాటు తన సమస్యనూ ఆమె ముందుంచాడు సుందరం.
“బావుందండీ మీ వరస. ఇది సంసారం. ఇందులో ఇష్టమూ కష్టమూ అంటూ ఎందుకుండాలి చెప్పండి. ఎండ, వాన, గాలి చెప్పి వస్తాయా ? జీవితంలోనూ అంతే. సంసారం అలా ఏర్పడుతుందంతే. బాధ్యతగా నడుపుకోవాలసిన పని మనదే. దీంట్లో ఇంతగా ఆలోచించాల్సిన పనేముంది చెప్పండి? పిల్లలు వచ్చేసినట్టున్నారు. చాలు ఇప్పటికి.” అనేసి పళ్ళెం, లోటా తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది.
పెళ్ళై ఇరవై నాలుగేళ్ళయింది. ఎమ్మెస్సీ చదివే కొడుకు, బికాం చదివే కూతురు. వాళ్ళెదురుగా పెట్టుకొని ఇంకేం మాటలు! అయితే సుందరం చింత వదల్లేదు. అసలు సుమతి సున్నితమైన భావాలంటూ ఏం లేనట్టుంటుంది. ఓ సినిమా చూసినా అంతే…ఏదీ పెద్దగా బాధించదు తనను. కానీ…అంత బాగా పాడుతుందే మరి! ఆ సున్నితత్వం మనసులో లేకపోతే అలా గుండెను తాకేలా పాడడం సాధ్యమేనా? ఏం పాట అది? సుందరం గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించాడు. ‘రాయినైనా కాకపోతిని అంటూ కదూ! తన పాట ద్వారానే తన మనసు కనిపెట్టాలి. తన భావనలేమిటి, తన కలలేమిటి, తన తత్త్వమేమిటి…..నాతో తను సంతోషంగా ఉంటోందా…ఇదంతా మన జీవితానికి ఎంత అవసరమో తనకు తెలియజెప్పాలి. ఎందుకివన్నీ తన మనసులో రావు….సుందరం ఆలోచనలు తెగలేదు.
‘తానూ ఇన్నేళ్ళూ తన ఉద్యోగం, సంసారం అని మునిగి తేలింది చాలు. అక్కాచెల్లెళ్ళ ప్రసవాలు, తమ్ముడిని ఇంటివాడ్ని చెయ్యడం అన్నీ ముగించి తానూ ఒక చిన్న ఇల్లు కట్టుకొని హమ్మయ్య అనుకొనే నాటికి పిల్లలిద్దరూ పెళ్ళీడు వాళ్ళయిపోయారు! సుమతి చెప్తున్న ఫిలాసఫీ ఇదేనా?’ మనసు భారంగా తయారయింది. ‘మనం కనే కలలేమిటి, పెట్టుకొనే ఆశలేమిటి….., ఈ జీవితం అనే పరుగుపందెంలో మనం పరుగెత్తినది ఎంత దూరం అని తెలుసుకొనే లోపే సమయం చేజారిపోతుందే! అటు కంపెనీలోనూ కష్టంగానే ఉంది. చాలామంది విఆర్ ఎస్ తీసుకుంటున్నారు. ‘మీరూ తీసుకోండి మిస్టర్ సుందరం…’ అంటున్నాడా బాస్ వెధవ. వాడి కంటికి నేనేమన్నా అరవై ఏళ్ళవాడిలా కనిపిస్తున్నానా? ‘ చూడండి మిస్టర్ సుందరం. ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలా డైనమిక్. యు నో….మన అసైన్ మెంట్ స్ కూడా పెరుగుతున్నాయి. ఇన్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ద కంపెనీ….’ అని భుజం తట్టి చెప్తాడు. నేనూ యంగ్ గా ఉన్నప్పుడే వచ్చాను….నీ కంపెనీలోనే నయ్యా నా జుట్టు తెల్లబడింది అనాలనున్నా, ఏడవలేక నవ్వుతూ, ‘ఫామిలీ కమిట్ మెంట్ స్ సార్.. రైట్ నౌ ఐ కాంట్ థింక్ ఆఫ్ ఇట్’ అని వచ్చేశాడు తను. జరిగినవి ఆలోచిస్తూ కంప్యూటర్ ముందు కూచొని ఇంటర్ నెట్ లో ఆ పాట సాహిత్యం డౌన్లోడ్ చేశాడు.
రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా….
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా..
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా…
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా..
ఇంకా కొన్ని లింకుల్లో ఈ పాట గురించి విశ్లేషణలు అవీ కూడా ఆసక్తిగా అనిపించాయి. చదువుతుంటే అనిపించిందతనికి….ఔనునిజమే, ఈ మనిషి జన్మనే ఇంత. రాయినో ఉడతనో పడవనో….ఏదో అయి ఉంటే ఎంత బాగుండేది. ఒకవేళ రాయినైంటే నేనేం చేసేవాడినా అని ఆలోచించాడు. ఆ బాస్ తల బద్దలు కొట్టేవాడిని…..పాదుకైతే వాడికి తగిన బుద్ధి చెప్పే వాడిని అని ఆలోచిస్తూ ఆనందించాడు.
లోపల కూతురి మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి. “పోమ్మా ఎప్పుడు చూసినా బస్ లో పొమ్మంటావు. నా ఫ్రెండ్స్ అందరూ ఝామ్మంటూ స్కూటీలో వస్తారు. నేను మాత్రం….ఒక్క రోజన్నా అలా ఎంజాయ్ చేయడానికి కుదురుతుందా?”
“అదలా ఉంచు. ఈ కొబ్బెర కొంచెం తురుము. కూరలో వేద్దాము.” సుమతి నిర్వికారమైన గొంతు.
“నీకు అన్నయ్యంటేనే ఎక్కువిష్టం. వాడికి మాత్రం బైక్ కొన్నావు. నేనే రోజూ వాడికోసం ఎదురుచూస్తూండాలి.” కొబ్బెర తురిమిన చప్పుడు. “నాకంటూ ఒక అస్తిత్వమే లేదన్నట్టు చేస్తావు.”
“అయిందా తురమడం! ఇలా తే!” సుమతి గొంతు.
“ఎంత పక్షపాతమో కొడుకంటే…” కూతురి మాట మధ్యలోనే అందుకుంటూ, “పళ్ళు రాలగొడతాను చూడు ఇంకోసారి వాడి మాటెత్తావంటే! నీ అనుమతి తీసుకునే వాడికేమైనా కొనాలంటావా? నీకెందుకు కొనలేదు అనడుగు చెప్తాను. ఇప్పుడు డబ్బు లేదు. ఇంకో సంవత్సరం చదువు. ముగించావా, తర్వాత నీ సంపాదన, నీ ఇష్టం.” పుల్ల విరిచినట్టుగా వినిపించింది సుమతి గొంతు. అంతలో కొడుకు మాట వినపడింది. “నాకంటూ ఈ జీవితంలో దొరికిందదొక్కటే డొక్కు సెకెండ్ హాండ్ బైకు. నీ దృష్టి దానిమీద పండిందేమిటే బాబూ! పోయిన జన్మలో నా శత్రువ్వేమో నువ్వు.”
“సెకెండ్ హాండో, థర్డ్ హాండో….ఝామ్మని వెళ్తావుగా! ఊరికే అలా అంటావంతే.” కూతురి వ్యంగ్యం.
“ఊఁ..ఝామ్మ్…. నా క్లాస్ అయిపోతే కూడా నీకోసమే ఆగాలి, నిన్ను తీసుకురావాలి. నాకు క్లాస్ లేకున్నా నీకోసం ముందే బయల్దేరాలి…”దెప్పిపొడిచాడు కొడుకు.
“ఔను, నీ డ్యూటీ అది. బైకు తీసుకుంటే బాధ్యత కూడా తీసుకోవాలి” ధీమాగా చెప్తోంది కూతురు.
“ఔనమ్మా ఔను….అంతా నా కర్మ. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ గాళ్ ఫ్రెండ్స్ తో ఝామ్మంటూ వెళ్తుంటారు. నా తలరాత చూడు, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అమ్మా, దీనికీ ఒక స్కూటీ కొనిచ్చేయవే…నా కష్టం తప్పుతుంది.”
“నీ తలరాత కాదు బాబూ నా తలరాత అలా ఉంది. జైలర్ వెనుక కైదీ వెళ్ళినట్టు నేన్నీతో పాటే రావాలి. నీవు గాళ్ ఫ్రెండ్స్ తో తిరిగినట్టు నేనెవరితోనైనా వెళ్ళినట్టే. ఎందుకంటే నేను అమ్మాయిని. ఎందుకన్నా నేనాడపిల్ల గా పుట్టానో ఖర్మ. అబ్బాయినైతే బాగుండేది.” అంటోంది కూతురు.
సుమతి ఏమంటుందోనని సుందరం చెవులు రిక్కించాడు. లోపల్నించీ తట్టలు, లోటాలు సర్దుతున్న చప్పుళ్ళు, తిరగమోత పెట్టిన శబ్దాలు వినిపిస్తున్నాయి….అంతలో సుమతి గొంతు.
“పృథ్వీ, పూజా… ఎప్పుడూ ఇలాగే పోట్లాడుకుంటుంటారా, లేచి పనులు ముగించుకొని చదివేదేమన్నా ఉందా!” స్థిమితంగా వినిపించింది సుమతి మాట.
‘ఏంటి, ఇంట్లో ఇవన్నీ జరుగుతుంటాయా రోజూ! తాను గమనించనేలేదు. పొద్దున్న ఏడింటికి బయల్దేరితే మళ్ళీ రాత్రి ఎనిమిది దాటుతుంది కొంపకు చేరేసరికి. ఈ స్కూటీ సమస్య నా దృష్టికి రానే లేదు. ఎందుకంటే సుమతే ఆర్థికమంత్రి ఇంటికి. ఈ ఇరవై నాలుగేళ్ళలో ఎలా చక్కబెట్టుకుంటోందో ఏమో తనకే తెలుసు,’ జాలిపడ్డాడు సుందరం. అతనికింత పాకెట్ మనీ ఇస్తే చాలు. మిగతాదంతా ఆమె రాజ్యమే. ఈ రోజు ఇదంతా విన్నాక అతని సంతోషమంతా ఎగిరిపోయింది. కోపం చర్రున వచ్చింది. ఏమనుకుంటున్నారీ పిల్లలు! నోటికి వచ్చిందంతా మాట్లాడేయవచ్చునా? కొంచెం కూడా సంస్కారం లేదు. ఈ రోజు చెప్తా వాళ్ళపని అనుకున్నాడు.
రాత్రి భోజనానికి కూర్చున్నపుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. సుందరమే అన్నాడు.”…ఏంటమ్మా, సాయంకాలం అమ్మతో చాలా మాట్లాడుతున్నట్టున్నావు?” పదునుగా ఉన్న తండ్రి స్వరం విని బెదరినట్టుంది పూజ సారీ నాన్నా అని తల ఎత్తకుండా తినేసి వెళ్ళిపోయింది. కొడుకు వైపు చూసి, “ఏంట్రా ఎమ్మెస్సీ.. ఏంటి నీ సమస్య?” అంటే, “ఏం లేదు నాన్నా, ఊరికే అంతే.” అని తల దించేశాడు. “భోజనమయ్యాక మీరిద్దరూ నా గదికి రండి. మీతో మాట్లాడాలి” సుందరం చెప్పి భోజనం ముగించి లేచాడు.
అయితే గదికి వచ్చింది సుమతి!
“నీవు కాదోయ్! నీవెళ్ళి పడుకో. వాళ్ళిద్దరినీ రమ్మన్నాను నేను. నాకంతా తెలుసు.” మెల్లగానే చెప్పాడు. ఇక మీదటైనా తను కూడా కొంచెం కుటుంబ బాధ్యత తీసుకోవాలని అనిపించిందతనికి.
“ఏం తెలుసు అంతా మీకు?” ఆమె గొంతు కూడా చిన్నగా ఉన్నా చిన్న గదమాయింపు కూడా ధ్వనిస్తోంది. “ఈ కాలం పిల్లలు. ఏదో మాట్లాడతారు. దానికి ఎందుకింత రాద్ధాంతం? వద్దు.” తాంబూలం అందించింది.
“ఏం?” గొంతు పెంచాడు.” ఈకాలం పిల్లలైతే?ఆకాశం నుంచి ఊడిపడలేదుగా? కని, పెంచి ఇంతవాళ్ళను చేస్తే ఈ మాటలు, చదువులు అన్నీ వచ్చాయి…ఇంతవరకూ ఇదంతా నా దృష్టికి రాకపోవడమే తప్పంటాను. ఈనాటికి ఇలా మాట్లాడేవారయ్యారా? ఏమంటే…ఈ కాలం పిల్లలంటూ రాగం తీస్తున్నావు! ఏం జరుగుతుందసలు మనింట్లో! ఊర్కోమంటే ఏమిటర్థం?” చేతిలో ఉన్న పుస్తకాన్ని బల్లమీదకు గిరాటేశాడు విసురుగా.
‘ష్..మెల్లగ మాట్లాడండి. కోపం వస్తే మాత్రం, వెంటనే చూపించాలా? అందరింట్లోనూ ఉండేదే ఇది…మీకు మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తోందంటే ఎందుకో మీరే ఆలోచించుకోండి. జరగరానిదేదో జరిగిపోయినట్టు ఎందుకింత ఎగిరిపడుతున్నారో అర్థం కావట్లేదు…..పండుకోండి ముందు. గుడ్ నైట్.” సుమతి వెళ్ళిపోయింది.
సుందరానికి అయోమయంగా అనిపించింది. ఏమీ విచిత్ర స్వభావం సుమతిది? ఎంత మౌనిగా ఉన్నా క్రమశిక్షణ, సంయమనం మాటొస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది కాదూ! ముగ్గు వేయడం కొద్దిగా ఆలస్యమైనా, పూనకం పూనినట్టు అయిపోతుంది. దేవుని అఖండదీపం ఆరకుండా జాగ్రత్తగా ఉంటుంది, రాత్రెప్పుడైనా ఆరిపోతే …అయ్యయ్యో, ఇలా జరిగిందెందుకు..ఎందుకబ్బా అంటూ క్షణమాగకుండా వెళ్ళి వెలిగిస్తుంది. తిండితిప్పల విషయంలో నియమాలన్నీ పాటిస్తూ, ‘క్రమశిక్షణ మొదటి పాఠాలు ఇంట్లోనే. బయటి ప్రపంచం మనను చూసినపుడు ఇంట్లో ఏం నేర్చుకొన్నారో వారికి అర్థం కావాలి. ‘ అని చెప్తూ చెప్తూ తన జీవిత విధానాన్నే తీర్చిదిద్దింది.
సుందరం ఆలోచిస్తున్నాడు. తాను క్రాంతి, విప్లవం అని ఫోజులు కొడుతున్న రోజుల్లో , తానే హీరో అని భ్రమించే కాలాల్లో మర్యాద, ఇల్లు, వంశం, కులం, ప్రతిష్ఠ అంటూ మాట్లాడి తన వ్యక్తిత్వాన్నే మలుపు త్రిప్పిన సుమతి, ఈ నాడు పిల్లల విషయంలో క్రమశిక్షణ అన్న తన మాటకే బదులు చెప్పకుండా ఉండిపోయిందెందుకు?
మరుసటి రోజు సుందరం కావాలనే తీరిగ్గా లేచాడు. సుమతి పిల్లలకు కాఫీ కలుపుతోంది. కాఫీ అందుకున్న కొడుకు అడుగుతున్నాడు.”అమ్మా , రాత్రి నాన్న చాలా కోప్పడ్డారా?”
“నాన్న మమ్మల్ని కోప్పడ్డారామ్మా?“ కూతురు అడుగుతోంది.
“వారి కోపానికి మీరెంతమాత్రం విలువ ఇస్తున్నారు?” అడిగింది సుమతి.
“సారీ అమ్మా….ప్లీజ్.” పిల్లలిద్దరూ.
“హద్దు మాటల్లో లేకుండా పోయిందంటే, మన నడతలో కూడా లేకుండా పోతుంది. ఈ విషయం మీరిద్దరూ తెలుసుకొని తీరాల్సిందే.” స్థిమితంగా, స్థిరంగా సుమతి మాట.
తర్వాతి రెండు మూడు రోజులు సుందరం కోపంగానే ఉన్నాడు. అతని మనస్సులో ఆపలేని గందరగోళం. కంపెనీలోనూ ఇటువంటి మాటలే. ఇదివరకు ఏ వార్తలయినా ఏమీ తేడా తెలిసేది కాదు. అయితే ఇప్పుడు ప్రతిమాటా తనకే గుచ్చుకుంటోందనిపిస్తుంది.
ప్రక్క సీట్ సతీశ్ , “మా పక్కింటమ్మాయి వేరే జాతివాళ్ళను పెళ్ళి చేసుకొని తీసుకొచ్చేసింది. వాళ్ళ బాధ చూడలేకున్నాము. మా అమ్మాయి కూడా రేపిలాగే చేస్తే…. ఒంట్లో ఒణుకు పుట్టింది.” అన్నాడో రోజు. వెంటనే కంపెనీ సెక్యూరిటీగార్డు “మా ఎదురింటి పిల్లాడు రోజుకొకర్ని బైక్ ఎక్కించుకొని తిప్పుతాడు సార్. వాని కన్నవాళ్ళకు పెద్ద తలవంపులైపోయింది.” అనగానే ‘నా సుపుత్రుడేం చేస్తాడో ఏమో రేపొకనాడు’ అనిపిస్తోంది. ఏ అమ్మాయి, అబ్బాయిలను చూసినా, అదరుపాటుగానే ఉండేది. ఇదే విషయం పురుగులా తొలిచేస్తుంటే, మనసంతా పాడైంది. ఒకే వారంలోనే జుట్టు ఇంకా నెరిసిపోయింది. గడ్డం పెరిగింది. సుమతితో మామూలుగా మాట్లాడాలన్నా ఏదో బెరుగ్గానే ఉంది. ఇదివరకు అప్పుడప్పుడూ చిన్నపాటి వేళాకోళాలు చేసేవాడు. ‘పూజా, మీ అమ్మేది రా?’ అంటే, ‘అమ్మ ఎదురుగానే ఉందిగా నాన్నా!’ అని చూపించగానే,’ ఓ….ఔను కదా, నేనింకా ఆ పక్కవీథిలో ఉండే సుశీలమ్మ గారనుకుంటున్నా’ నంటూ అరవై ఏళ్ళ ముసలామెతో పోల్చేవాడు. అప్పుడప్పుడూ ఏ పెళ్ళికో, గృహప్రవేశానికో వెళ్తూ సుమతి బాగా తయారైతే, ‘ఈరోజు జాగ్రత్తగా ఉండాలోయ్ నేను. నీవు నా ప్రక్కనే ఉండు సుమా! ఎవరెత్తుకెళ్ళిపోతారో ఏమో నిన్ను.’అనేవాడు. ఆమె కూరకు తాళింపు వేస్తే, బిసిబేళా భాత్ వాసన వస్తుందనో, కాఫీ డికాక్షన్ వేస్తుంటే, ‘ఆహా…ఈ వాసనకు కల్లు వాసన ఆమడ దూరం పోదూ’ అనో వేళాకోళాలాడేవాడు. పిల్లలు పకపకా నవ్వితే , సుమతి మాత్రం అబ్బ, ఆపుతారా అనో, లేక ఇదే చేస్తుంటారా లేక….అంటుండేది. ఈ మధ్యకాలంలో సుందరం ఇలా సరదా మాటలేవీ మాట్లాడలేకపోతున్నాడు.
సతీశ్ అప్పుడప్పుడూ చెప్పేవాడు.’ పిల్లలు త్వరగా పెరిగిపోతారు. మన మాటలే వాళ్ళకు వేరే విధంగానే అర్థమౌతాయి. మనం వాళ్ళని చిన్నపిల్లలనే అనుకుంటూ ఉంటాము.’
ఎదురుగా కూర్చునే శంకర్ ‘ పిల్లలు పుట్టినప్పటినుంచీ మనమే తల్లిదండ్రులమనీ, మనమీదే బాధ్యతంతా అనీ హడావిడి పడిపోతుంటాము. అయితే పెరిగిన తర్వాత ఆ పిల్లలకు అదే భావన ఉండాలని ఏముంది చెప్పండి?’ అనేవాడు.
ఆ మూల కుర్చీ శ్రీనిధి మాటలైతే ఇలా ఉంటాయి.’ అదికాదండీ, పిల్లలు పుట్టకముందే వాళ్ళ జీవనవిధానం ఇలా ఉండాలి, ఇలా జరగాలంటూ మనమేవో ఆలోచించి ఆ ప్రకారం చేస్తాము. వాళ్ళు పుట్టాక మనము అన్న మాటనే మరచి, వాళ్ళే మన బ్రతుకూ భవిష్యత్తంటూ, జీవితాన్నే త్యాగం చేస్తాము. వాళ్ళేమో పెరిగే కొద్దీ ఇవన్నీ మరిచిపోతారో లేక వాళ్ళకీ భావనలే ఉంటాయో, ఉండవో…మనమంతా ఏదో భ్రమలో బ్రతుకుతున్నామనిపించట్లేదా?’
సుందరం మనసు అల్లకల్లోలమైంది. పదహైదు రోజులు తిరిగే సరికి బరువు కూడా తగ్గిపోయాడు. సాయంకాలం ఆరయితే చాలు, బస్ లో ఉండనీ, కంపెనీలో ఉండనీ….పిల్లల మాటలే అతని మనసును ఆక్రమిస్తున్నాయి. సుమతి మాత్రం ఏమీ జరగనట్టు, పొద్దున లేస్తే వంట, సాయంత్రం ఫలహారాలంటూ తన పనిలో ఎప్పట్లాగే మునిగి తేలుతోంది. కానీ సుందరాన్ని, అతని వాలకాన్ని కూడా గమనించినట్టే ఉంది.
“ఎందుకండీ, ఈ మధ్య ఒకరకంగా ఉంటున్నారు? ఒంట్లో ఏమన్నా నలతగా ఉంటోందా? చెప్పండి. ఒకసారి డాక్టర్ కి చూపించుకొని వద్దామా?” అంది.
“ అబ్బే, అలాంటిదేం లేదు. నేనే రెండు రోజులు శలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటాను.” భార్యతో మనసువిప్పి మాట్లాడి, సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాలని ఉందతనికి.
మరునాడే, సాయంకాలం శలవు పెట్టి ఇంటికి వస్తూ దూధ్ పేడా, భేల్ పురి తీసుకొచ్చాడు ఇంటికి. పిల్లలు’నాన్న ఈరోజు తొందరగా రావడమే కాక ఇవన్నీ తెచ్చాడం’టూ సంబరపడ్డారు. తమ మాటలు నాన్న మనసునెంత బాధపెట్టాయనే స్పృహ లేదసలు వాళ్ళకు.
“రెండు రోజులు శలవు పెట్టాన”ని చెప్పాడే కానీ సుందరం గొంతులో ఏ ఉత్సాహమూ ధ్వనించలేదు.
“ఓ…అమ్మతో పాటు సెకండ్ హనీమూనా” అని ఇద్దరూ మేలమాడారు.
“కొంచెం సేపూరుకుంటారా , చాలు. ఎప్పుడేమి మాట్లాడాలో తెలియదు మీకు. ఇంత పెద్దవాళ్ళయినారు గానీ..” వంటగదిలోంచి గదమాయింపు. కూతురు నాన్న చెవిలో,’నాన్నా…అమ్మ ఊరికే అలా అంటుందిగానీ, లోపల్లోపల సంతోషమే మా మాటలకు’ అంది.
సుందరానికి తనకన్నా కూతురే తల్లిని బాగా అర్థం చేసుకుందేమో నన్న భావన ఎక్కడో గుచ్చుకుంది.
మరునాడు మధ్యాహ్నం భోజనాలయినాక విశ్రాంతిగా పడుకున్నపుడు సుమతి పక్కగదిలో తంబూరా మీటుతూ, మెల్లగా పాడుతుండడం చెవిలో పడింది. లేచి సుమతి దగ్గరికెళ్ళాడు సుందరం.
“అయ్యో, నిద్దర లేపేశానా?” నొచ్చుకుంది సుమతి.
“అదేం లేదు, నీవు ఆరోజు పాడుతుండగా నేను విన్నాను కదా, ఆ పాట పాడవా ఇప్పుడు. వినాలనిపిస్తుంది.”అన్నాడు.
వెంటనే తంబూర అందుకొని పాడసాగింది. ఆమె తన్మయత్వమో, భక్తో లేక అతని మైమరపో …ఎందుకో ఏమో గానీ…సుందరం కళ్ళు తడి అయినాయి. సుమతి తంబూర క్రింద పెట్టి “ఏదో బెంగ పెట్టేసుకున్నట్టున్నారు. ఎందుకా చింత? అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో తంబూరా వాయించినా, పాటలు పాడుకున్నా ఇంటికి మంచిదని మా సంగీతం టీచర్ చెప్పేవారు. అందుకే నేనూ ఈ మధ్య నాలుగు నెలలనుంచి ఈ వేళప్పుడు ఇలా పాడుకుంటాను కాస్సేపు. ఏదో నా వల్ల మంచి జరగనీ అని ఆశ.” గొంతు భారమైందో, ఉద్వేగమో తెలియలేదు.
“ఆరోజు పిల్లలు మాటలు విన్నానుగా. స్కూటర్ విషయం..అది విన్నప్పట్నించీ నాకు మనసు బాగాలేదు. దేనిమీదా ఆసక్తి కలగడం లేదంటే నమ్ము.” సూటిగా విషయానికొచ్చాడు సుందరం.
“అదేం పెద్ద సంగతి అని? దాని గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా?” సుమతి అంది లాలనగా.
“నాకసలు నీ పోకడే తెలియడం లేదు. ఎవరింటికో గృహప్రవేశానికి వెళ్తే , గుమ్మం కలప దగ్గర్నించీ, టైల్స్ వరకూ వంద ప్రశ్నలు వేసి వివరాలు రాబడతావు. పిల్లల విషయంలో నీవింత నిర్లిప్తంగా ఉండడం నాకేమాత్రం సబబుగా అనిపించడం లేదు. నిన్నెలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. పిల్లలు దారితప్పితే మన బ్రతుకులేమవుతాయి చెప్పు? పెద్దవాళ్ళతో ఎలా నడచుకోవాలో, వినయం అంటే ఏమిటో అసలేమీ తెలియనవసరం లేదా వాళ్ళకు? నీకసలు ఏమీ పట్టడం లేదు. నేనేం చెప్పనింక?” నిట్టూర్చాడు సుందరం.
సుమతి సూటిగా, దృఢంగా, సౌమ్యంగా ఇలా అంది. “ఏ దిగులూ, బెంగా లేకుండా మనం ఎలా మనుష్యులుగా ఉండగలమండి?అలా లేకుంటే మనకూ చీమలకూ దోమలకూ వ్యత్యాసమేముంది?” చురుగ్గా చూసిందతనివైపు.
అతనికేమీ అర్థం కాలేదు. ‘హారి భగవంతుడా! మనుష్యులు పుట్టిందే బెంగెట్టుకోడానికి అని కొత్త సిద్ధాంతమేదన్నా ప్రతిపాదిస్తోందా ఏమిటి?’
“బెంగో, చింతో ఉండి తీరాలండీ.. పిల్లల గురించి, భర్త గురించి, అత్తమామల గురించి. అసలు సంసారమంటేనే ఇదే కదా?” ప్రశ్ననా, జవాబా, సిద్ధాంతమా ఆమెకే తెలియాలి.
“ఆగాగు. ఒకవేళ రేపే నీ కూతురు ఎవర్నైనా పెళ్ళి చేసుకొని నీ ముందుకొచ్చిందే అనుకో. ఏమిటి గతి? కొడుకు ఎవరినో తీసుకొచ్చి ఇదిగో నీ కోడలన్నాడనుకో, ఏం చేయగలం?” సుందరం అడిగే తీరు చూస్తుంటే అతని బుర్ర ఏమాత్రం స్థిమితంగా ఉన్నట్టు లేదు. ఎన్నో రోజులనుంచి పేలని బాంబును ఒక్కసారి పేల్చినట్టు ఆవేశంగా ఉన్నాడు.
అంతే శాంతంగా సుమతి ”అలా వాళ్ళేమన్నా చేస్తే….మీరు ఎఱుక గలిగినవారు. సుఖంగా బ్రతకమని దీవించి అక్షింతలు వేసి పంపించవచ్చు.” నికార్సైన బదులిచ్చింది.
“అంటే…” సుందరం విస్తుపోతుంటే, మళ్ళీ అంది. “కాకపోతే ఏమిటండీ? పిల్లలు పుట్టినపుడు వారి చదువు గురించి మనం బాధ్యతగా ఉంటాము, వాళ్ళు పెద్దయ్యాక సొంతకాళ్ళ మీద నిలబడనీ అని, తర్వాత సరిజోడు చూసి పెళ్ళి చేయాలనీ అది మన బాధ్యతనీ మనకు తెలుసు. అయితే ఈ విషయాలమీద వాళ్ళే ఒకడుగు ముందుకు వేసి ఇవన్నీ చేయగలుగుతున్నపుడు, మీ ఎంపిక మీ ఇష్టం. మీ జీవితం మీధర్మం అంటూ ఆశీర్వదించి పంపడమే!” పెదవులపై చిరునవ్వుతో తాననుకున్నది నొక్కి చెప్పింది సుమతి.
“అదేంటి….అంత సులభమా ఇదంతా? ఇప్పట్నించే కొంచెం వాళ్ళని కంట్రోల్ చెయ్యవద్దా? హద్దులు మీరే వరకూ ఊరుకుండి తర్వాత ఏడిస్తే లాభమేమిటి?”
“కంట్రోల్ చెయ్యడమా?? ఇదేమి బంధమా లేక కుక్క మెడకు కట్టిన గొలుసనుకున్నారా?” సుందరం ఆదుర్దా చూసి మళ్ళీ చెప్పింది. “జీవితాలు, బంధాలు, సంసారాలు….అనుకుంటూ పెద్ద బాధ్యత అనుకుంటూ , బెంగపెట్టుకుంటూ కూర్చోవడమా లేదా సుఖము, సంతోషము, కర్తవ్యము అనుకుని నిర్వహిస్తూ ఆ ఆనందం అనుభవించడమా అనేది మనమే నిర్ణయించుకోవాలి. కాదంటారా? జీవితమంటే చిరుగాలులూ ఉంటాయి, సుడిగాలులూ ఉంటాయి. సుడిగాలి ఉందని భయపడుతూ కూర్చుంటే చిరుగాలికే చలిజ్వరం వచ్చేస్తుంది.” మృదువుగా, దృఢంగా ఉంది సుమతి గొంతు.
సుందరం ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ ఉండిపోయాడు. సుమతి వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది. చాలా రోజుల తర్వాత ఇద్దరూ తీరికగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సుందరం మనసు కొంచెం శాంతి పొందుతున్నట్టనిపిస్తోంది. అతనికెప్పుడూ అనిపించేది ఆమే తనపాలిట శాంతితీరమని. ఆమె నియమపాలన, క్రమశిక్షణ ఏదెలా ఉన్నా ఆమె దగ్గరున్నపుడు బెంగ తీరడం మాత్రం వాస్తవం. కాఫీ త్రాగడం పూర్తిచేసి ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఆమె అతని తల నిమురుతూ కూర్చుండిపోయింది.
“నీవెన్నన్నా చెప్పు ఈ దిగుళ్ళు మనని వదిలేవి కావు. నీవు పాడిన ఆ పాట నాకెందుకిష్టమో తెలుసా!
ఎంతో సమాధానంగా అనిపిస్తోంది. ఆ పాట గురించి ఎవరో ఎంత చక్కగా వ్రాశారనుకున్నావు! కన్నడ భాషలో ఇలాంటిదే ఒక కీర్తన కూడా ఉందట. దాసర కీర్తనల్లో ఒకటి. శ్రీగంధ నానాగి….అర్థం చెప్పనా!
శ్రీగంధం నేనై పుట్టి ఉంటే నీ పాదార్చనలో ఉపయోగపడకుందునా,
చెట్టుపై పువ్వై ఉంటే నీ పాదపూజలో చేరకుందునా అని…
మన వంటి వారి భ్రాంతులకు, చింతలకు అందులో ఏదో బదులుందనిపిస్తుంది. మనం మనుష్యులుగా కాక అలా పుట్టి ఉంటే బాగుండేదేమో కదా!” అన్నాడు.
అతన్ని భావుకత్వం నుంచి బయటకు తీసుకొచ్చేలా బదులిచ్చింది సుమతి. “వేరేలా పుడితే మటుకు? ఏ సమస్యలూ ఉండవనా? వాళ్ళు వ్రాస్తారు, మేము పాడతామంతే గానీ మనకెలా తెలిసేదప్పుడు? ఇప్పుడు మనుషులుగా ఉండి మిగతా రూపాల గురించి, జన్మల గురించి ఆలోచించగలుగుతున్నాము గానీ, అందులో ఏమేమి ఎదుర్కోవాలో తెలియదు కదా? వ్రాయడం, పాడడం సులభం. నిజంగా అలా అవ్వాలంటే ఎంత కష్టం?”
“అదికాదు, మనుష్యజన్మ నే గొప్పదంటారు మరి…!” సుమతి సిద్ధాంతం అతనికింకా పూర్తిగా తెలియలేదు.
“అలా అన్నదీ మనుష్యులే కదా! పోనీ అదే నిజం అనుకున్నా, గొప్ప మనుష్యజన్మ ఎత్తి కూడా మళ్ళా పువ్వై పుట్టలేదు, పక్షినై పుట్టిఉంటే బాగుండేది ….అని ఏడవడం ఎందుకు చెప్పండి? మనుష్యులుగానే ఇంకా ఉత్తములుగా ఉండవచ్చు కదా!” అతని దగ్గర ఏ జవాబూ లేదు.
సుందరం మనస్సులో కొంతవరకూ సమాధానపడినట్టే ఉంది. కానీ వాదంలో ఓడిపోవడం ఇష్టంలేదు. ఊరికే పొడిగిస్తున్నాడు. “అయినా…..మనుష్య జన్మకు ఉండే చింతలూ బెంగలూ మాత్రం ఇంక వేటికీ ఉండవు అనేది వాస్తవమేగా!”
ఆమె కూడా ఒప్పుకుంటూ ”ఔనౌను…ఈ మనుష్యజన్మకే సంసారమని ఉండేది. మిగతా వాటికవేవీ లేవుగా! సర్సరే, లేద్దురూ! పిల్లలు వచ్చే వేళయింది.” అంది.
ఆమె నికార్సైన మాటో, థియరీనో, తీర్మానమో తెలీదు….మొత్తం మీద అతనికి రెండు రోజుల శలవు హాయిగా గడచినట్టనిపించింది. ఆఫీసుగురించిన బెంగా బాధించలేదు. ఏ కల్లాకపటమూ లేని పిల్లలు ఆ ఆదివారం, ‘నాన్నా, క్యారమ్స్ ఆడదాం వస్తారా నాన్నా!’ అన్నప్పుడు అతని చింతలన్నీ వారి సాన్నిహిత్యంలో కరిగిపోయాయనిపించింది.
————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *