ఏడుగడతో (నే) మేలి మనుగడ

రచన: పి.వి.ఆర్. గోపీనాథ్.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… అంటే పురుషులను ఆదర్శప్రాయులుగా గుర్తించేందుకే. అనగా వారి హక్కులను గౌరవిస్తూ, బాధ్యతలు గుర్తుచేసేందుకే అనేది నా అభిప్రాయం. అందుకే పారిజాతాపహరణం ప్రబంధాన్ని మననం చేసుకుంటూ….
——————————————————- —————-

ఉ. తల్లివి, తండ్రివే మరియు దారకు నీవెగ దైవమెప్పుడున్
చల్లని మాటలన్ బలుకు, చక్కటి యొజ్జవు, దాత గావలెన్
మెల్లగ నేర్పుకోవలయు మేలగు విద్యయె నీవు భామకున్
చెల్లదు పౌరుషం బనగ చిల్లర వేషము లేటికిన్ సఖా ?!

ఆ.వె. తిమ్మనార్యు బలికె తీయని పాఠమే
భామ నోట మనకు బాళిగాను
ఏలుకొనగ వలయు యేడుగడగ నీవె
పంక్తి వరుడ వోలె బంచి నలిని !!

(దార…భార్య, యొజ్జ…గురువు, భామ … సత్యభామాదేవి, బాళి…ప్రేమ, ఏడుగడ…ఏడు విధాలైన రక్షణ, పంక్తి వరుడు …. పంక్తి అనగా భూమి, వరుడు అనగా అల్లుడు అనగా శ్రీరాముడే, , నలి … ప్రేమ)

ఆ ప్రబందంలోని “పతి ప్రాణ సదృశ బంధువు…” అనే పద్యమే దీనికి మూలాదారం. ఆ పద్యంలో సత్యభామాదేవి పతియే సతికి ఏడుగడ అని తెలిపింది. అనగా ఏడువిధాలైన రక్షణ కావాలి. అవేమంటే… తల్లి, తండ్రి, గురువు, దైవము, దాత, విద్య, పురుషుడు.
వీటిలో తల్లి, తండ్రి, దైవము మనకు తెలిసినవే. దాత అనగా ఆమె ఆర్థికావసరాలు తీర్చేవాడు.
కాగా, గురువు … విద్య .. వీటికి విస్తృతార్థం ఉంది. లోకం పోకడలూ తమ కుటుంబ సంబందాలు వగైరా అంశాలను వివరిస్తూ ఎలా మసలు కోవాలో పాఠాలు చెప్తాడు. విద్య అనేది ఆద్యాత్మికపరంగా చూడాలి.
ఆంగ్ల సూక్తి…”Knowledge is just gives some power to attain some power, but Education is an Eternal one..”
స్త్రీలకు వివాహం తర్వాత శ్రీ మతి అనే పదాలు చేర్చబడతాయి. అంటే స్రీ అనేది దాతల వలనా, మతి అనేది పెనిమిటి అందించే విద్య వలనా లభిస్తాయనుకోవాలి. అంటే అందుకు తగిన మతి పురుషులు సంతరించుకోగలిగి ఉండాలి.
ఇక చివరగా పురుషుడు…పౌరుషం గలవాడే పురుషుడు. అంటే భార్యను తన వారే కాదు, ఆమెవారు సైతం ఏమీ అనకుండా కాపాడుకోవాలి..ఐనవాడు తిడితే యాచకుడూ తిడతాడనే సామెత గుర్తుంచుకోవాలి. అటువంటి పరిస్థితులు రాకుండా ముందుగానే కాచుకుంటూ ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *