April 23, 2024

!!అద్భుతమైన ప్రతిభ కి అక్షర రూపం, అసమాన అనసూయ !!

సమీక్ష: పుష్యమి సాగర్

asamanaanasuya600

ఒక మనిషి జీవితం మహా అయితే ఎంత ఉంటుంది ఇప్పటి కాలంలో అయితే ఎక్కువలో ఎక్కువ 50 అనుకుంటాను ..కానీ 95 వసంతాలు దాటినా ఇప్పటికి జీవితం పట్ల అదే స్ఫూర్తిని సంతోషాన్ని కొనసాగిస్తూ, నలుగురికి మార్గదర్శకంగా ఉండే వ్యక్తి గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము …వారెవరో కాదు కళాప్రపూర్ణ బిరుదాంకితులు Dr. అవసరాల (వింజమూరి ) అనసూయా దేవిగారు. వారి ఆత్మకథని వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికావారు ఒక పుస్తకంగా తీసుకురావడం ఎంతో సంతోషం…1920 లో కాకినాడలో జన్మించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న అలనాటి అపురూప గాయని “కళా ప్రపూర్ణ ” డాక్టర్ అవసరాల (వింజమూరి ) అనసూయాదేవి గారు అసాధారణ ప్రజ్ఞావంతురాలు అయిన మహోన్నతమైన వ్యక్తి . శాస్త్రీయ, లలిత, జానపద సంగీత త్రివేణి సంగమం . అపురూపమైన, అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేది ఆమె స్వరం ..ఆనాటి మేటి కవులు అయిన మేనమామ దేవులపల్లి కృష్ణ శాస్త్రి, రాయప్రోలు, గురజాడ, శ్రీ శ్రీ , నండూరి వంటి వారి గీతాలకి సంగీతం సమకూర్చి భావ గీతాలు, లలిత సంగీతాల పేరిట అద్భుతమైన ప్రాచుర్యాన్ని కలిగించిన మేధావి ..మారుమూల పల్లెలో దాగి ఉన్న జానపద గేయాలకు మెరుగుదిద్ది అంతవరకు “కామెడీ పాటలు” గా పిలవబడుతున్న వాటికి సభా, గాన మర్యాద చేకూర్చడమే కాకుండా సంగీత జగత్తు లో ఉన్నత స్థానాన్ని చేకూర్చిన ఘనత అనసూయాదేవి గారిదే…
ఇది 94 సంవత్సరాల అనుభవాల మెరుపులు. మొదటి జ్ఞాపకమే చదువుల తల్లి ఆశీస్సులతో ఆరంభం అయ్యింది . 1925 సంవత్సరంలో సరస్వతీ గానసభ వారి అద్వర్యంలో, కాకినాడ, ఆంధ్ర సేవాసంఘం హాలులో జరిగిన సభకు నాన్నతో వెళ్లడం…అక్కడ సంగమేశ్వర శాస్త్రి గారి పరిచయం మలుపు తిప్పింది అని గుర్తు చేసుకుంటారు.కృష్ణమాచారి గారి(ప్రముఖ గాయకుడు P.B శ్రీనివాస్ మేనమామ) కచ్చేరి తోనే సంగీతం పట్ల ఆసక్తి మొదలు అయింది …సంగమేశ్వర శాస్త్రి గారు కచ్చేరిలో అడిగిన ఓ చిన్న సందేహానికి అబ్బుర పడతారు (అప్పటికి అనసూయ గారి వయసు నాలుగేళ్లు) …ఆ సందేహం ఏమిటి అంటే ….”ఒక వీణ మాత్రమే వాయించినా, నాలుగు వీణలను వాయించినట్టు నాదం వచ్చింది ఏమిటి “? అని సంగమేశ్వర శాస్త్రి గారిని అడిగిన ఘటికురాలు ..అయన అప్పట్లోనే అంటే 90 ఏళ్ళ క్రితమే , వెస్ట్రన్ మ్యూజిక్, వాల్ట్ జ్ (waltz music) లో నిష్ణాతులు. రవీంద్ర నాథ్ టాగోర్ లాంటి వారే శాస్త్రి గారిని వరల్డ్ టూర్ (మ్యూజిక్ కన్సర్ట్ ) కి తీసుకు వెళ్లాలని ప్రయత్నించి విఫలం అయ్యారు అంట…
అనసూయగారు తమ అక్షరాబ్యాసాన్ని ఐదవ ఏట మొదలు పెట్టారు. మేనత్త నేర్చుకున్న హార్మోనియం పైన గురువు గారు లచ్చయ్యగారి సమక్షంలో “మురారి దానవ విరామ కేశవా పరాత్పరా ” అంటూ రెండు చేతులతో వాయిస్తూ పాడిన పాట కి గురువు గారు సంతోషపడి, సరస్వతీ కటాక్షంతో పుట్టిన జీనియస్ అంటూ కితాబిచ్చారు …అక్షరాభ్యాసం అయ్యాక ..మరో మంచి గురువు కోసం వెతుకులాట … సరి అయిన గురువు దొరకలేదు ..పళ్ళాచారి గారి దగ్గర వీణ నేర్చుకోవడం వలన గాత్రాన్ని వదులుకోవాల్సి వస్తుంది అని వీణని నేర్చుకోవడం వదిలేశారు ..వీణకి ప్రాధాన్యం, గాత్రానికి స్కోప్ లేకపోవడంతో మరల సరి అయిన గాత్రం నేర్పే గురువు కోసం వెతికారు ..ఇక అదృష్టం కొద్దీ వెంక్రటావు గారు గురువుగా రావడం శాస్త్రీయ సంగీతంలో గమకాలూ, మెళుకువలు, దశ విధ గమకాల ప్రయోగాలు, ప్రయోజనాలు, సమాసము విడగొట్టకుండా , భాష చెరపకుండా , భావయుక్తంగా పాడటం మొదలైనవి పాడి వినిపించేవారు కాదు. ఎక్కువగా నేర్పకపోయినా ఏక సంథాగ్రాహి అయిన అనసూయగారు ఇట్టే నేర్చుకునేవార . అప్పట్లోనే జెట్ శంకర్, గంగూబాయి హంగల్, క్రీం ఖాన్, రోషనార బేగం, వారి గీతాలు, రష్యన్ జానపద గీతాలు, పిఠాపురం రాజావారి కుటుంబం తో waltz, foxtrot, rhythms వినడం వలన అన్నీ తలొక కొంచం అమృతాన్ని పంచాయి. తాను పాడి నేర్చుకున్న దానికంటే కూడా విని నేర్చుకున్నదే ఎక్కువ. కాకినాడలో మెక్లారిన్ హోం స్కూల్ వ్యవస్థాపకులు మెక్లారిన్ దొర ఇంట్లో పార్టీకి అనసూయగారు హార్మోనియం మీద నోట్స్ లేకుండా వాయించడం అందరు మెచ్చుకోవడం గొప్ప అనుభూతి ..అవి ఇంకా సైలెంట్ మూవీ రోజులు ఒక సినిమా హాల్ ఉండేది ..టికెట్ పావలా, కుర్చీ, భేడా (రెండణాలు ) బెంచ్, అణా (నేల క్లాస్ ) .. సినిమా ఆరంభం నుంచి ఒకరు బెంచ్ క్లాస్ గేట్ దగ్గర కుర్చీలో కూర్చొని రన్నింగ్ కామెంటరీ లాగ చెప్పుకుంటూ పోయేవారు …చిత్రమే కదా…అవును ఇప్పుడు అంటే మనం అంతా అధునాతనంగా మాట ల సినిమాకి అలవాటు పడ్డం కానీ అప్పట్లో అది లేదు కదా…
తను హార్మోనియం నాదం చాలా బాగుండేది ..మోహన్ ఫ్లూట్ అంటారు .90 ఏళ్ళ జీవితంలో ఇద్దరు మాత్రమే ప్రముఖం అయినారు …అని అందులో మొదటి వారు ప్రఖ్యాత పత్రిక విమర్శకులు కీ. శే. సుబ్బుగారు, మరొకరు అనసూయ గారు …అప్పట్లో కాకినాడకి వెళ్ళాలి అంటే రైలు లేవు కదా. ఎడ్లబండి బండి మీద చిత్రాడకు వెళ్లడం …అక్కడ చిత్రాడ రైతు దమ్మాలబ్బాయి ఇంటి అరుగు పై పెసరట్టు ఆవు నేతితో పెనం సైజు పెసరట్టుని వేడి గా ఇవ్వడం, తినడం అదో మర్చిపోలేని అనుభూతి ..ఇన్ని సంవత్సరాలలో మరల అటువంటి పెసరట్టు తినలేదు అంటారు
గొప్ప జానపద గాయనిగా తయారు చేసి ప్రపంచానికి ఇవ్వదలచుకున్న భగవంతుని ఆనని ఎవరు మార్చగలరు ..జగన్నాధరావుగారి ఆశీర్వచనము ఫలించింది …1928 చెన్న పట్నంలోని థియోసోఫోఫికల్ సొసైటీ రాజమ్మగారింట్లో మొదలు అయి అనేక సభల్లో పాల్గొనేవారు ..తన మొదటి పాట “కొయ్యేడు పదం ” అది యుగళ గీతం …అలా ఓ చిన్న ఆర్కెస్ట్రా తో మొదలు పెట్టి ఈ రోజు ప్రపంచం గుర్తించే స్థాయి కి ఎదిగారు ..మరల 1930 10 ఏళ్ళ వయసులో మద్రాస్ వచ్చారు …అక్కడ కొచ్చమ్మాళ్ రూమ్ కి వెళ్లి తమిళ పాటలు కూడా నేర్చుకోవడం జరిగాయి ..ఆసక్తికరమైన విషయము ఏమిటి అంటే జగన్నాధరావు గారు తాను పాడిన డ్యూయెట్ “చీర కట్టుకుని చిలకలాగున్నావు” అత్త-అల్లుడు సంవాదం అలా అప్పుడు పాడిన పాత పాట మరల 65 ఏళ్ళ తరువాత బాల మురళికృష్ణగారు, అనసూయాదేవిగారు కలిసి ఓ సంగీత రికార్డింగ్ లో తిరిగి పాడటం ..
ఇక వీణ నేర్చుకోవాలని, సరస్వతి పోజ్ లో ఫోటో తీయించుకోవాలని ఎంతగా ఉబలాట పడ్డారో …దాని కోసం అని బొబ్బిలి వీణలు, పిఠాపురం వీణలు తెప్పించి “పళ్ళచారి ” గారి దగ్గర నేర్చుకోవడానికి సిద్ధం అయ్యారు …వారు చెప్పే దానికి తనకి పొంతన లేక మధ్యలోనే వదిలేసారు అది వేరే విషయం ..కానీ ఫాల్స్ వాయిస్ పాడటం ఇష్టం లేకనే వీణని మానేసాను అని స్వయంగా చెప్పుకుంటారు .. అయినా కూడా నో రిగ్రెట్స్ అంటారు ..పిఠాపురం రాజావారి కుటుంబంతో వున్న సాన్నిహిత్యం వలన waltz, foxtrot, rhythms, అలాగే మన జానపదాలతో తలొక అమృతాన్ని అందించాయి.
జానపద పితామహులు వల్లూరి జగన్నాధరావు గారు మద్రాస్ నుంచి తిరిగి వచ్చి తనకి ప్రతి శని ఆది వారాలలో జానపద గేయాలు, క్లిష్టమైన కీర్తనలు, పదాలు, జావళి లు నేర్పేవారు …వాయిస్ కల్చర్ , modulation, lip movement, (ఉచ్చారణ సరిగా ఉండడానికి) ..నేర్పేవారు …జీవితం లో ఏడు స్టేజెస్ తో జీవితాంతం పనికి వచ్చే పెద్ద గిఫ్ట్ ఇచ్చి పోయినందుకు ఎప్పటికి రుణపడి ఉంటానని వినమ్రం గా చెప్తారు …అయన వేసిన పాట ల బాటలో సప్త లోకాలు, సప్త స్వరాల సంగీతాన్ని 87 ఏళ్ళ లో 7 తరాల పాట పాడుకుంటూ “జ్ఞానపదం “(జానపదం) లోకి రాగలిగాను ..తానూ నేర్చింది శాస్త్రీయ సంగీతం అయినా వరించింది మాత్రం లలిత సంగీతం, అయితే తనని తరింప చేసింది మాత్ర్రం జానపద గీతమే…దానికి పునాది కలిగించిన వేదిక పిఠాపురంలోని పొన్నాడ మందబయలు …కుక్కుటేశ్వర స్వామీ రధోత్సవం సందర్భం లో పాడిన పాటలు, చెక్క భజనలు , తప్పెట గుళ్ళు ప్రభావం చూపాయి …ఇక జానపద గీతాన్ని లలిత సంగీతాన్ని రెండిటి ని కొనసాగించుతూ ముందుకు సాగారు .. లలిత సంగీతం పుట్టుక, భావ గీతాల పుట్టుక (1929) గురించి మననం చేసుకుంటూ ..ఆస్థాన కవుల పరంపరలో వచ్చే కృష్ణశాస్త్రిగారు (ప్రముఖ రచయత, వీరికి స్వయానా మావయ్య అవుతారు ) రాయమన్నారు . ట్యూన్ ఉన్నదానికి వేరుగా పాడి శెభాష్ అనిపించింది …ఆ పాటలు ఏమిటి అంటే.. (1) చెలులారా చెలులారా (2) నిల్పిరో పల్లకి నిలిపిరో (3) పూవు బంతులాడెను నేడు మన యువరాజు . ఈ పాటలతో పిఠాపురం అంతా మారు మోగిపోయింది .. లలిత సంగీతంగా పిలవబడుతున్న అప్పటి భావ గీతాల తోటి ప్రారంభం అయ్యాయి ..నవ్య సాహిత్యం 1920లో మొదలు అయితే , తన భావ సంగీతం 1928 లో ప్రారంభం అయ్యాయి …90 ఏళ్ళ చరిత్రలో ఎందరో ప్రముఖుల్ని కలిశారు ..వారి పాటలు కూడా పాడారు …కవుల్లో ముఖ్యం గా గురజాడ, రాయప్రోలు, బసవరాజు, విశ్వనాధ, అబ్బూరి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి ,ఇంద్రగంటి వారు, నాయిని సుబ్బారావు …శ్రీ రంగం శ్రీనివాస రావు (శ్రీ శ్రీ) …వంటి వారు ఉన్నారు ఆ తరువాత AIR వచ్చాక కొన్ని వందల మంది పాటలకి ట్యూన్స్ పెట్టి పాడారు ..1931 సంవత్సరం లో దేశరాజు రామారావు గారి కూతురు పెళ్లి లో బుచ్చి వెంకట సుబ్బారావు గారిని అనగా బుచ్చిబాబుని కలవడం చిన్నారులు ఇద్దరి మధ్య పోటీ పెట్టడం తాను గెలవడం జరిగింది ..
గాంధీగారిని చూడటం, కలవడం, గొప్ప అనుభూతినిచ్చింది. వర్షంలో హార్మోనియం పాడయిపోతే ఎలా అని భయపడి చీర కుచ్చిళ్ళను హార్మోనియం మీద కప్పి వాయించి పాడటం కూడా మరిచిపోలేని గొప్ప జ్ఞాపకమే…అలాగే 1931-1932 అనసూయ గారి జీవితంలో మర్చిపోలేని సంవత్సరం అని చెప్పొచ్చు. అదే సంవత్సరంలో ఎన్నో ఘనకార్యాలు జరిగాయి . ఎవరు నేర్పకుండానే హార్మోనియం వాద్యం వాయించడం, 8 ఏటా నుంచి gram phone రికార్డింగ్ lo పాడటం, 9 ఏటా నవ్య సంగీతం, భావ గీతాలు (ఆ తరువాత లలిత సంగీతం గా పిలువబడింది) . అది కూడా గాంధీగారి సభలో పాడటం గొప్ప విషయమే. ఇక సంగీత సభలో జానపద సంగీతం ప్రవేశం కూడా 1931 లో నే జరిగింది. అది అనసూయ గారి జీవితంలో మరో మలుపు . ఇక గురజాడ, వేధుల, శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రిగారి లాంటి వారి గీతాలకి సంగీతం సమకూర్చారు .నండూరివారి ఎంకి పాటలని శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానానికి మొదటి సారి పాడించారు. H.M.V recording 1936 లో తన గీతాలను రికార్డు చేశారు. ఆ రోజుల్లో ఒక gram phone రికార్డు అంటే 2 పాటలు . 8 పాటలను రికార్డు చేశారు.. అల్ ఇండియా రేడియో 1938 ప్రారంభం అయింది .AIR తో తన ప్రస్థానం దాదాపు 78 ఏళ్ళ వరకు కొనసాగింది . అయితే అనసూయ గారు ఎంతో మక్కువ గా నేర్చుకోవాలన్న శాస్త్రీయ సంగీతం తపన సరి అయినా గురువు దొరకక మానుకోవాల్సి వచ్చింది .1941 సంవత్సరం ఎంతో అపురూపం అయింది ఆ ఇయర్ లో తాను తన ఇండివిడ్యువాలిటీని బయట పెట్టిన రోజులు ..me, myself, I ఎప్పుడు వెంటాడుతూనే ఉండేవి అని చెప్పుకున్నారు …
తన 14 ఏట పెద్దమనిషి అయినప్పుడు అప్పటి సనాతన సంప్రదాయపు ఆచారంలో బంధించబడం అమానుషము, స్వేచ్ఛని హరించేది అని నిరసించి తన పనులు తానే చక్కబెట్టుకున్నారు ..బహుశా ఆ రోజుల్లో సంప్రదాయానికి ఆచారానికి ఎదురు తిరిగిన మొట్టమొదటివారు అనసూయగారే..
మలుపు తిప్పిన పుట్టిన రోజు 1945 మే 12, మావయ్య చేతిలో అవమానించబడిన రోజు . తనకు అంత అవమానం ఎప్పుడు జరగలేదు .దీనికి కారణం శేషగిరి రావుగారితో చనువుగా ఉండటమే మావయ్యకి కంటగింపు గా మారింది ..గిరి గారితో తిరగవద్దు అని అందరి ముందు చెప్పడం …ఆ అవమానభారాన్ని తట్టుకోలేక గిరిగారితో అక్కడినుంచి వెళ్లడం, అదే అదనుగా గిరిగారు తనపై చెయ్యకూడని తప్పిదం చేశారు …ఇక చేసేది లేక అప్పటికే పెళ్లి అయి పిల్లలు వున్నా గిరిగారితోనే మరల వివాహానికి సిద్ధపడం ..దాన్ని ఇంట్లోవారితో సహా అందరు వ్యతిరేకించడం జరిగింది ..శేషగిరి రావుగారితో వివాహం ..జీవితంలో వైవాహిక జీవితంలో వొడిదుడుకులు తనని ఎంతో వేదనకి గురి చేశాయి ..అయినా కూడా 90 ఏళ్ళ జీవితాన్ని ఎన్నో కష్టాలతో గడిపి గొప్ప అనుభవాలను పోగు చేసుకోడవడం అంత సులువు ఏమి కాదు .మనో నిబ్బరంతో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన అనసూయగారు ఓ చోట ఇలా వాపోయారు . “నాలాంటి స్ట్రాంగ్ విల్ ఉన్నవాళ్ళకే ఇటువంటి గతి పడితే అమాయకులైన అమ్మాయిల పరిస్థితి ఏమిటి …? వైవాహిక జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ఒక వైపు కెరీర్ ని మరో వైపు కుటుంబ బాద్యతలను రెండింటిని బాలన్స్ చేసుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగారు ..
ముగింపులో మొదట్లోనే ముళ్ళ దారిలోకి మళ్లబోయిన జీవితాన్ని సువాసన భరితమైన నందనవనంలోకి మరలించుకున్నాను …నాకు 5 గురు పిల్లలు రత్న పాప, కృష్ణ గిరి, సీత రత్నాకర్, కమలా శ్రీకర్, నిహారిగిరి పంచప్రాణాలు, తొమ్మిది మంది నవరత్నాల్లాంటి మనవలు మనవరాళ్లు , 6 మంది మునిమనుమలు. జీవితం పరిపూర్ణమైంది అని, కోరికలన్నీ తీరాయని వైకుంఠపాళీలో పెద్ద నిచ్చెనెక్కి పైకి వెళ్లిన నేను తక్షణమే పెద్ద పాము నోట్లో పది కిందకు వచ్చాను అయితేనేమి పందేలు వేసుకుంటూ పరమ పదం వరకు చేరాను భయం లేదు …సన్మార్గంలో నడిపిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు …

చివరగా
నలుగురు కూర్చొని నవ్వే వెళల
నా మాటొకపరి తలవండి
నా పాటకోసారి పాడండి !

వారు ప్రతిభ గురించి మరికొన్ని విషయాలు ..
– విశ్వవిద్యాలయాలలో సంగీతం సబ్జెక్టుగా చేర్పించిన అసమాన గాయని
-దక్షిణ భారతం లో తోలి మహిళా సినిమా దర్శకురాలు
-“కళా ప్రపూర్ణ”, “లలిత జానపద సంగీత సామ్రాజ్జి “, “సంగీత సరస్వతి”ఇత్యాది బిరుదులూ .
-ప్రపంచవ్యాప్తం గా 11 జీవన సాఫల్య పురస్కారాలు , గృహలక్ష్మి కంకణం, సహస్రాధిక సత్కారాలు, పురస్కారాలు, ప్రభుత్వ గుర్తింపులు,
-ప్రపంచవ్యాప్తం గా వేలాది కచేరీ లు
-11 గ్రంధాల రచన
ఇవి మచ్చుకు మాత్రమే ..అనసూయాదేవిగారి ప్రతిభ గొప్పది ఎల్లలు లేనిదీ అని చెప్పవచ్చు …అని ఆరు తరాల జీవితాన్ని జీవిత చరిత్రకి అక్షరః రూపం ఇచ్చిన వంగూరి ఫౌండేషన్ వారికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముగిస్తారు … ఇది ఆటో బయోగ్రఫీ జీవిత చరిత్ర ….అవ్వడానికి అనేక సంఘటనల సమాహారం అయినప్పటికి కధల పుస్తకానికి ఏ మాత్రం తీసిపోని విధంగా చక్కగా వర్ణించారు …ముఖ్యంగా ఎప్పటివో సంగతులు గుర్తు పెట్టుకొని అక్షరంగా మలచడం ముదావహం ఇంత మంచి పుస్తకాన్ని అందించిన వంగూరి ఫౌండేషన్ వారికీ, చిట్టెన్ రాజు గారికి అభినందనలు.
ఈ పుస్తకంలో అనసూయగారి స్వీయానుభవాలతో పాటు అపురూపమైన చిత్రాలు కూడా జతచేయబడ్డాయి. వాటితో పాటు అనసూయ గారు సేకరించి, దాచిపెట్టుకున్న ఎందరో మహానుభావులు, ప్రముఖుల ఆటోగ్రాపులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ పుస్తకానికి మరింత వన్నె తెచ్చాయి..

-పుష్యమీ సాగర్
పుస్తకం ధర: రూ. 250
పుస్తకం లభించు చోటు: నవోదయ, జె.వి.పబ్లికేషన్స్, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *