April 25, 2024

పాటే మంత్రమో…

రచన: – రాజేష్ శ్రీ
(మ్యూజిక్ వరల్డ్ వ్యవస్థాపకుడు)

music
రేడియో లో వచ్చే ‘జనరంజని’ వింటూ జనాల మధ్య మావూరి బస్సులో ప్రయాణిస్తుంటే ‘జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీరాకకై..’ అంటున్న జానకమ్మ మధురగాత్రం నన్ను ముప్పైయ్యేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది.. అప్పటి జ్ణాపకాల్ని గుర్తు చేస్తూ ఆ రోజుల్లో ఆ పాట వింటున్న సందర్భాల్ని నెమరు వేసుకునేట్టు చేసి ఆ అనుభూతుల్ని మిగిల్చింది..!!
నిజమే పాటకంత పవరుంటుంది.. అరుదైన పుష్పపు పరిమళమో లేదా అద్భుతమైన అత్తరు వెదజల్లే సుగంధాల్ని కొన్ని దశాభ్దాల తరువాత మళ్ళీ మనం ఆఘ్రాణించినప్పుడు అప్పటి ఆ రోజులు గుర్తుకొచ్చినట్టే.. ఆనాటి సంగీతాన్ని ఎప్పుడు విన్నా ఆనాటి కాలాన్ని మళ్ళీ పలకరించుకుంటాము.
సంగీతాన్ని ఇష్టపడనివారంటూ ఉంటారా..?
అమ్మ ఒడిలో జోలపాటలతో … అమ్మమ్మ తన కాళ్ళపై పడుకోబెట్టుకుని లాల పోస్తూ లాలిపాటలతో పెరిగిన మనకు వారే తొలి గాయనీమణులు అవుతారు.. ఈరోజుల్లో పసికందులు కూడా టివిలో మళ్ళీ మళ్ళీ వచ్చే కాసింత సంగీతానికి తదేకంగా వింటూ ఏడుపుని కూడా ఆ కాసింతసేపు ఆపేస్తున్నారు. పసిబిడ్డకు నెలలు గడిచేకొద్దీ పాటకి తగ్గట్టు ఆడటం మొదలెడతారు.. నడక వచ్చాక పాటకి తగ్గట్టు నాట్యం చేయడం.. సంవత్సరాలు గడిచేకొద్దీ సంగీతానికి తోడు సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది.. పాడటం.. పాడతూ ఆడటం ఇవన్నీ చిన్నతనంలో జరిగిపోతాయి..! ప్రాయం వచ్చినప్పుడు ఫాస్ట్ బీట్లు.. కాసింత పరిణితి చెందే వయసులో మెలోడీలు .. నడి వయసు వచ్చే సమయానికి భక్తి గీతాలు ఇలా ఎన్ని అభిరుచులు మారినా మధురమైన పాటకి ఉండే విలువ స్థిరంగా ఉండిపోతుంది..! ఒక సినిమా విజయవంతంగా నడిచి ఆ తరువాత కనుమరుగైపోతుందేమో గాని అందులోని ఉత్తమమైన పాటకి ఆదరణ మాత్రం నిరంతరం కొనసాగుతుంది..

పాట ఎలా ఉండాలి..?
పాట భాషకు గుర్తింపు తేవాలి.. పాట పాడిన వారికి.. రాసిన వారికి.. విన్న వారికీ ఆత్మసంతృప్తి కలిగించేలా ఉండాలి .. మంచి పాట మనశ్శాంతినివ్వాలి.. ఆపాటల్ని వినలేకుండా ఉండే పరిస్థితి రావాలి.. రోగాలు సైతం నయం కావాలి. పాట ఉత్సాహాన్నే కాదు చైతన్యాన్నీ కలిగించాలి.. మంచి ఆలోచనలు రేకెత్తించాలి.. ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాలి. అనుబంధాల్నీ.. ప్రేమానురాగాల్ని పెంచాలి. మానవత్వాన్ని ప్రభోదించాలి. నీతిని భోదించాలి.. ఏకాగ్రతను పెంచాలి.. మనసుల్ని కరిగించాలి.. కదిలించాలి. దేశభక్తిని, దైవభక్తినీ కలిగించాలి. కర్కోటకులు సైతం పాటను వింటే కరుణరసాన్ని పంచాలి..
ఇన్ని రసాలను పంచే పాటలెన్ని ఉన్నా ప్రకృతితో మమేకమయ్యే పాటలు ప్రత్యేకంగా ఉంటాయి..
ఆ పాటల్లో ప్రకృతి పారవశ్యంగా కదలాడుతున్నట్టు..
తొలి చినుకుతో మట్టి చెట్టపట్టాలేసుకుని పరిమళాన్ని వెదజల్లుతున్నట్టు..
వెన్నెల్లో పన్నీరు పారబోసినట్టు ..
చిరుగాలిలో మరుమల్లెలు ఆరబోసినట్టు..
మందార మకరందాలు ఎదని తీపిగా తడిపినట్టు ..
కోటిరాగాలు కొమ్మకొమ్మకో సన్నాయి పలికినట్టు ఉంటాయి..

ఇలాంటి గీతాలు ఎన్నో ఉన్నా.. ఉత్తమమైన గీతాల్ని మరెందరో సమీక్షించినా ..

‘ప్రేమించు పెళ్ళాడు’ చిత్రం లోని అరుదైన ఓ యుగళగీతాన్ని మీకందించాలనిపిస్తుంది.. ఈ గీతంలో ప్రకృతి ప్రేమ ప్రస్ఫుటమవుతుంది..
ఇళయరాజా స్వరపరచిన ఈ గీతాన్ని వేటూరి అద్వితీయంగా ప్రకృతీకరించిన తీరు గొప్పగా ఉంటుంది.. బాలు-జానకి గార్లు తమ మధుర గాత్రాలతో భావయుక్తంగా ఆలపించి ఈ గీతానికి నిండుదనాన్ని తెచ్చారు.

ప్రకృతి ప్రేమ పులకించిన వైనం..
కావలసిన వాళ్ళంతా ప్రకృతి లోని భాగాలై
ఋతువుల శోభలతో అమోఘమైన వర్ణన..
అగ్ని పత్రాలు.. మెరుపు లేఖలు… వెన్నెల వేణుగానం.. ఇలాంటివన్నీ ప్రకృతితో మమేకం అయిన హృదయం మాత్రమే ఇంతటి రమణీయ భావాల్ని ఇంతలా అందించగలుగుతుంది..
బాలు జానకి గార్ల స్వరాలు సుమాలుగ పూస్తే..
ఇళయరాజా బాణీలు నిరంతరమూ వసంతములై..
వేటూరి పదాలు ఫలాలుగా పండాయి ఈ గీతంలో ..

***
నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే
పదాలు ఫలాలుగా పండే

నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే

హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తరలా.. ఆశ కురుల విరి దారులా..
ఈ సమయం ఉషోదయమై
మా హృదయం జ్వలిస్తుంటే

నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే

అగ్ని పత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే
మెరుపు లేఖల్లు రాసి మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోన అందమే అత్తరాయే
మల్లె కొమ్మ చిరునవ్వులా
మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే

నిరంతరమూ వసంతములే
మందారముల మరందములే

***

ప్రకృతి సాక్షిగా స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకలుగా నిలిచిన ఓ ప్రేమజంట పాడుకున్న గీతంలో
హాయిగా పాటపాడే కోయిలే వీళ్ళకు నేస్తమయింది.. తేనెలో తానమాడే తుమ్మెద చుట్టమయ్యింది .. నదులలో వీణమీటే తెమ్మెర వీరికి ప్రాణమయ్యింది..
అగ్ని పత్రాలు రాసి గ్రీష్మం సాగిపోగా .. మెరుపు లేఖలు రాసి మేఘం మూగబోయింది..
మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోగా ..మాఘ దాహాలలోన అందమే ఇలా అత్తరవడాన్ని గమనిస్తే
ఇంతకన్నా ప్రకృతితో మమేకమయ్యే ‘ప్రేమ’ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి..
వేటూరి లాంటి గొప్ప గీత రచయిత అందించిన ఇలాంటి గీతాలను ఆరుబైట వెన్నెల్లో పడుకుని ఆస్వాదించి చూడండి.. ప్రకృతి మిమ్మల్ని ప్రేమించడం మొదలెడుతుంది…. మీతో ప్రకృతి మమేకమవుతుంది.
ఇలాంటి గీతాలను అందించిన మహానుభావుల కాలంలో పుట్టడం.. ఆయా గీతాలను అందంగా ఆస్వాదించడం కేవలం మనం చేసుకున్న అదృష్టం.
కొత్తదనం పేరుతో వెర్రెత్తిన యువత ఇష్టపడే రేకుడబ్బాల్లో రాళ్ళేసి ఊపితే వచ్చే రోత శబ్దాలు కాదు సంగీతమంటే ..
కోరుకున్న రీతిలో మనసుల్ని తడిపే మెలోడీలు.. సరైన శృతిలయల సంగమంలో భావయుక్తంగా వచ్చే రాగాలకు పరవశించడం సంగీతమంటే..
మంచి పాటలు జీవితంలో భాగామవ్వాలి.. అతి చిన్నదైన మానవజీవితంలో పసందైన జీవనరాగం ఆనందంగా పాడుకోవాలి..
అందుకే ఉత్తమమైన తెలుగు సాహిత్యాన్నీ.. తెలుగు సంగీతాన్ని కాపాడుకుందాం .. భావి తరాలకు ఆ సంగీతాన్ని అన్వయిద్దాం..!!

1 thought on “పాటే మంత్రమో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *