April 25, 2024

మొక్కుబడులు-మూఢనమ్మకాలు

రచన: టీవీయస్. శాస్త్రి

tvs
మన ముఖ్యమంత్రులు రకరకాల నమ్మకాలతో ఉంటున్నారు. కొందరికి వాస్తు నమ్మకం అయితే మరికొందరికి ఇంకోరకం నమ్మకం. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఈ మధ్య అకస్మాత్తుగా నిమ్మకాయ నమ్మకం ఒకటి వచ్చింది. ఈ మద్య ఆయన కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో ఈ నమ్మకాలు మరీ పెరిగాయని కొందరు అంటున్నారు. సిద్దరామయ్య తమ స్వస్థలం మైసూర్ లో పర్యటించిన సందర్భంగా కుడి చేతిలో నిమ్మకాయ పట్టుకుని కనిపించారు. ఆయన ఎక్కడకు వెళ్లినా చేతిలో నిమ్మకాయ కనిపించడంతో అది పెద్ద వార్త అయింది. టీవీ చానళ్లలో ముఖ్యమంత్రి నిమ్మకాయపై విపరీత ప్రచారం వచ్చింది. మైసూరులో మీడియాతో మాట్లాడిన సందర్బంలో కూడా నిమ్మకాయ కనిపించింది. నిమ్మకాయ గురించి అడిగితే ఆయన మాట్లాడలేదు. కొందరు జ్యోతిష్యులు పూజలు చేసి నిమ్మకాయ చేతిలో ఉంచుకోవాలని చెప్పారని జెడి ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. గతంలో కాకి వాలిందన్న బావనతో సిద్దరామయ్య కారు మార్చివేయడం వార్త కాగా, ఇప్పుడు నిమ్మకాయతో మరోసారి వార్తలలోకి వెక్కారు. మనిషికి అభద్రతాభావం పెరిగినపుడు, ఆత్మవిశ్వాసం లోపించినపుడు ఇటువంటి మూఢనమ్మకాల మీదకి మనసు పోతుంది! భక్తితో తీర్చుకునే మొక్కుబడులు కొన్నైతే, అభద్రతాభావంతో తీర్చుకునే మొక్కుబడులే చాలా ఎక్కువ!మనిషిని మృత్యువు నుంచి ఏ నిమ్మకాయ కూడా కాపాడలేదు! పరీక్షిత్తు మహారాజు కధే దీనికి గొప్ప ఉదాహరణ. జీవించటం తెలిసినవాడికి మృత్యువు అంటే భయం ఉండదు. ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ముఖ్యమంత్రులే ఇటువంటి వెర్రి వేషాలు వేస్తే , ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది?నేను చిన్నప్పటినుండీ Indian Rationalist Association సభ్యుణ్ణి. కుటుంబ బాధ్యతల రీత్యా కొంతకాలంగా దానికి సంబంధిన activities లో పాల్గొనకలేకపోతున్నాను. దేవుడు అంటే నమ్మకం ఉంది. అయితే అన్నిటినీ ప్రశ్నించే గుణం ఉంది. (అది దుర్గుణమో, సుగుణమో మీరే చెప్పాలి!)నా పేరు నా కులాన్ని తెలుపుతుంది. దాన్ని మార్చుకుందామని ఎప్పుడో నిర్ణయించుకొని మా అమ్మగారి సలహా అడిగాను. అందుకు ఆమె, “మీ నాన్న గారు ఎంతో ఇష్టపడి పెట్టుకున్న పేరది . పైగా అది మీ తాత గారి పేరు. దాన్ని మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. “అని ఆమె అభిప్రాయాన్ని తెలపటంతో, ఆమె అభిప్రాయం సహేతుకంగా ఉండటం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఈ కాస్మోస్ లో మనం గుర్తించబడేది మన జన్మ నామధేయంతోనే!జన్మ నక్షత్రం, తిధి వీటికి పెద్దగా ప్రాముఖ్యత ఉండదని నా అభిప్రాయం!అష్టమి, రోహిణీ నక్షత్రంలో పుట్టిన శ్రీ కృష్ణుడు జగద్గురువు అయ్యాడు. అదే టైంకు కొన్ని పశుపక్ష్యాదులు కూడా జన్మించి ఉంటాయి. జ్యోతిష్య పుస్తకాలు తిరగేస్తే, భగవద్గీతను అనుసరిస్తే ఎవరి కర్మలను బట్టి వారికి జన్మలు లభిస్తాయని అందరూ అంగీకరించాలి!ఎవరైనా ఇల్లు కట్టించుకోవటానికి అవసరమైనది పేరే!ఒకసారి మాస్టర్ సీవీవీ గారి దగ్గరకు ఒక కాషాయబరధారి వచ్చి అతనికి initiation ఇవ్వమని వేడుకున్నాడు. అప్పుడు మాస్టర్ ఆయన పేరు అడిగారు. ఆయన ‘. . . భారతి’అని చెప్పాడు. వెంటనే మాస్టర్, “ఈ సృష్టిలో నీవు గుర్తించబడింది నీ జన్మ నామధేయంతోనే!కృత్రిమమైన పేరు, వేషం వల్ల కలిగే ఉపయోగాలు ఏమీ ఉండవు. అందుచేత ఈ వేషాన్ని తీసేసి, కృత్రిమమైన పేరును తీసేసుకొని వస్తే , నీకు initiation ఇస్తాను. “అని చెప్పారు. వెంటనే అతను కాషాయ వస్త్రాలు తీసేసి, పూర్వనామధేయంతో initiation తీసుకున్నాడు!ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కృత్రిమమైన జీవితాన్ని గడిపేవారు యోగానికే కాదు, జీవితానికి కూడా పనికిరారు . కాషాయం ధరించినంత మాత్రాన అందరూ శంకరాచార్యులు, వివేకానందులు కాలేరు. మనసు కాషాయం కావాలి. కాషాయం తొడిగిన ప్రతివాడూ సన్యాసి కాలేడు. కలం పట్టిన ప్రతివాడూ కవి కాలేడు. ఖద్దరు తొడిగిన ప్రతివాడూ గాంధీ కాలేడు. కళ్ళున్న ప్రతివాడూ క్రాంతదర్శి కాలేడు.

ప్రతి ఛానల్ లో న్యూమరాలజీని గురించిన కార్యక్రమాలు వస్తున్నాయి. పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని భవిష్యత్ ను మార్చుకోమని ఊదరకొడుతుంటారు. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాల మీద ఎందుకు చర్య తీసుకోదో అర్ధం కాదు. ప్రభుత్వాలకు కూడా అవే నమ్మకాలు ఉంటే ఈ దేశ ప్రజల పేర్లన్నీ మార్పించే ప్రయత్నాలు చేస్తే సరిపోతుందేమో!అసలు దేశం పేరు కూడా మారిస్తే అప్పుడైనా దేశం ఏమైనా బాగుపడుతుందేమో?కేవలం రుద్రాక్షల వ్యాపారం చేసి కోట్లు గడించిన ఒకాయన సంగతి మీకు తెలుసు. ధరించిన వారు మాత్రం అలానే ఉన్నారు. పైగా రౌడీలు, లంచగొండి రాజకీయనాయకులు ముఖాన బొట్టు పెట్టుకొని , రుద్రాక్షలు ధరించటం మీరు చూసే ఉంటారు. సినిమాల్లో విలన్స్ కూడా రుద్రాక్షలను ధరిస్తారు!వేషాలు ఎన్ని వేసినా మనిషి ప్రవృత్తిలో మార్పు రావటం కష్టం. దానికి కావలసింది సాధన , వేషాలు కాదు! నా భార్యను కూడా నా మార్గంలోకి తీసుకొని రావటానికి చాలా ప్రయత్నించి వైఫల్యం చెందాను. పైగా ఆమే నన్ను తన మార్గంలోకి తీసుకెళ్లుతుందేమో అని అనుకుంటున్నాను! రెండేళ్ల క్రితం నాకు Spine టీబీ వచ్చి, దాదాపుగా ఒక సంవత్సరం మంచంలోనే ఉన్నాను. కొంతమంది కాన్సర్ అనేమోనని అనుమానించారు కూడా. పూర్తి మనో ధైర్యంతో ఆమె నాకు సపర్యలు చేసి కాపాడుకుంది (ప్రస్తుతానికి!)నాకు త్వరగా స్వస్థత చేకూరుతే నా తలనీలాలు వెంకటేశ్వరస్వామికి ఇప్పిస్తానని ఆమె మొక్కుకుందట!ఆ సుముహూర్తం కోసం ఆమె తొందరపెడుతూనే ఉంది. ఈ మధ్యనే నన్ను ఒక టీవీ సీరియల్ లో నటించమని ఒక టీవీ సీరియళ్ల నిర్మాత ఒత్తిడి పెడుతున్నాడు. ఆ(అ) కారణంగా కూడా నేను ఒక ఆరు నెలలుగా విజయవంతంగా వాయిదా వేస్తూ వచ్చాను. అదే విషయాన్ని నా భార్యకు చెప్పాను. రోజూ ఇంట్లో నటిస్తున్నారుగా, మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు నటించటం? అని ఒక చురక వేసింది.

స్క్రిప్టును కొద్దిగా మార్చమని చెప్పాను నిర్మాతకు. పిల్లలు కూడా వాళ్ళ అమ్మకు వత్తాసు పలుకుతున్నారు. పైగా “నీకు అమ్మమీద ప్రేమలేదని” సూటిపోటి మాటలు కూడా అంటున్నారు. ఆవిడ కూడా, “నేను మిమ్మల్ని పట్టుచీరలు, బంగారు నగలు కావాలని కోరటం లేదు కదా!మళ్ళీ 3 నెలల్లో వచ్చే తలనీలాలేగా ఇమ్మంది!అయినా మీదేమైనా దేవానంద్ హెయిర్ స్టైలా?వేదాంత విషయాలు అన్నీ చెబుతారు, కానీ జుట్టు మీద మమకారం వదులుకోలేరు! పైగా వస్త్రశిరం కూడా వచ్చింది. (అన్నట్లు వస్త్రశిరం అంటే చెప్పాలిగా!వస్త్రం అంటే బట్ట , శిరం అంటే తల, వెరసి వస్త్రశిరం అంటే బట్టతల. ఈ ప్రయోగం హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారిది. ఈ సందర్భంలో ఆయన్ని కూడా తలుచుకోవడం సంతోషంగా ఉంది . వారికి నా స్మృత్యంజలి!)” అని బాగానే రాగం పెంచి సాధిస్తుంది. ఆవిడ చెప్పింది కూడా నిజమేనేమో అనిపించింది. అసలు మళ్ళీ జీవితంలో తలమీద వెంట్రుకలు రావని తెలిస్తే నిజంగా ఎంతమంది తలనీలాలు ఇస్తారు?అలా అయితే, తలనీలాలు చాలామంది ఇవ్వరనే నేననుకుంటున్నాను!ఆమెకు కలిగిన ఈ నిస్స్వార్ధమైన ఈ చిన్న కోరికను తీర్చి , ఆమెను ఆనంద పరచటం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఆఖరికి మా ఆవిడే నన్ను గెలిచింది. జీవిత భాగస్వామి ప్రేమ, సేవ మనల్ని ఎప్పుడూ ఓడిస్తాయి!ఆ ఓటమిలో ఆనందం కూడా ఉంటుంది, ఆ ఆనందం జీవిత భాగస్వామితో పంచుకోవటం వల్ల అది ద్విగుణీకృతం కూడా అవుతుంది!అతి త్వరలోనే తిరుపతికి ప్రయాణం!నా భావాలను మా ఆవిడకోసం కొద్దిగా పక్కన పెట్టి నేను తీసుకున్న ఈ నిర్ణయం సబబే అనుకుంటున్నాను. అవునో, కాదో మీరే చెప్పాలి!

9 thoughts on “మొక్కుబడులు-మూఢనమ్మకాలు

  1. సార్, సి పి ఐ నారాయణ గారు కూడాను కుటుంబసమేతంగా తిరుపతి వెళ్ళినారు . వారిని ఎలా ఏమనుకోవాలి? వ్రాయండి.

  2. శాస్త్రి గారు, జీవిత భాగస్వామి చిన్న కోరిక తీర్చడంలో తప్పు లేదు. నేను మూఢ నమ్మకాలను నమ్మను. కానీ మా కుటుంబంలోని వాళ్ళను మార్చ లేకపోతున్నాను. దేవుడు కూడా వాళ్ళను మార్చ లేడు.

  3. బాగుందండి.వ్యక్తిగత అభిప్రాయాలు, నిజానిజాల మాట ఎలావున్నా మనకు కావలసినది మన వాళ్ళ సంతోషం. ఆనందో బ్రహ్మ. నిజం తెలిసే వరకూ నమ్మకం బలమే కావచ్చు. సాక్ష్యం కాదు. అనుమానం/సందేహం

  4. బావుంది..తన మీద తనకి నమ్మకము లేక..ఆ భద్రతా భావం తో బాధ పదే వాళ్లు ఇలాటి మూఢ నమ్మకాలు పెంచి పోషిస్తారు.వాటిని నిఱమూలించాల్సి పాలకులే..వాటిప్రభావాల్లో కొట్టుకు పోతుంటే..దీనికి అంతెక్కడ ,ఎప్పుడు..మీ వరకు మీరు మీశ్రీమతి అభిలాష తీర్చటమే సబబు.మంచి పోస్ట ధన్యవాదాలు,అభివాదాలు సర్

  5. మొక్కుబడులు అనేవి భక్తులు తమకోరికలు తీరినాక దేవుడికి ఇచ్చేలంచాలు వాళ్లకు ప్రాప్తమున్నదేదో అది జరిగింది దేవుడికి మొక్కున్నాడు కాబట్టి కొబ్బరికాయలు కొట్టటం, తలనీలాలు ఇవ్వటమో ,హుండీలో డబ్బులు వేయటము లాంటి వాటితో తీర్చుకుంటారు ఇది ఒక రకముగా ప్రమాదం లేనిది దేవుడి పట్ల విశ్వాసము లేదా నమ్మకము ప్రదర్శించటము ఇది బాకీ కి సంబంధించింది .రెండవది మూఢ నమ్మకాలు పేరులోనే అర్ధము ఉంది. మూడులు పాటించేవి ఏరకమైన దైవ భక్తి లేదా శాస్త్రము ఉండదు ఒక స్వామీజి యో సిద్ధాంతి అన్న వాడు ,ప్రజల అమాయకత్వము మూఢత్వము ఆధారముగా చెపుతాడు అది ఈ మూర్ఖుడు వింటాడు పొరపాటున వాడు చెప్పినది జరిగితే వీడు పదిమందికి పబ్లిసిటీ ఇస్తాడు ఆరకంగా చెప్పినవాడు పాపులర్ అవుతాడు సరిఅయిన విద్య సమస్యల పట్ల అవగాహన లేకపోవటము మూఢనమ్మకాలను సమాజములో పెంచుతున్నాయి నాయకులు సినిమా తారలు వీటికి ఆజ్యము పోస్తున్నారు అమాయకులు బలిఅవుతున్నారు ఎన్ని చెప్పిన గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది అన్నది జగమెరిగిన సత్యము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *