April 20, 2024

రెండు నిమిషాలు !!

రచన: జాజిశర్మ

” అపవిత్ర పవిత్రోవా ……. ” అంటూ రోజూ బాహ్యం, అంతరాలు శుద్ధిచేస్తూన్నట్లు నాటకం నడుపుతూ, గంటలు గంటలు మళ్ళీ మళ్ళీ ఆంతర్యంగా బురదలో పడి దొర్లేవాడికి మనం చెప్పగలిగేది ఎమీ ఉండదు. ఎందుకంటే వానిని చూస్తే, తను చేసే కర్మలన్నీ యాంత్రికంగానే చేస్తున్నాడనీ, దానిలో ఏమాత్రం చిత్తశుద్ధి అనేది లేదని అర్ధం అవుతునే ఉంటుంది. ఇఖ మరి మనం ఎవరికి ఏమి చెప్పాలి అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది.
మనం చెప్పే విషయం సులభంగా ఎదుటివానికి అర్ధం అయ్యేలా చెప్పగలిగితే, విన్నవాడు అది పాటించే ప్రయత్నం చేస్తాడు. చెప్పే విషయం కూడా వినేవాడు పాటించగలిగేదే అయ్యుండాలి.
అదే కంచి పరమాచార్య ఒకసారి భక్తులని “నాకు మీరు రెండు నిమిషాలు దానం చెయ్యండి” అని అడగటంలో ఉద్దేశ్యం.
ఎవరైనా రెండు నిమిషాలు అంటే చాలా సులభంగా ” రెండు నిమిషాలేగా” అని తలపోస్తారు. అసలు ఎవరైనా కాలాన్ని దానం చెయ్యగలరా?
మరి కంచి పరమాచార్య తన దగ్గరకి వచ్చినవారిని రెండు నిమిషాలు దానం చెయ్యమని ఎందుకడిగారు?
ఆ మహాత్ముడు భక్తులందరికీ తరుణోపాయం చూపించటానికి అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ రెండు నిమిషాల దానం ప్రస్తావన తీసుకువచ్చారు.
మనం నిద్రలో షుమారు ఎనిమిది గంటలు గడిపేస్తున్నాం. మిగతా సమయం మన దైనందిన కార్యక్రమాలకు సరిపోతోంది. మరి ఏమిటీ ఈ రెండు నిమిషాల ఆంతర్యం?
ఆయన మన రోజువారి జీవితంలో రెండు నిమిషాలు భగవంతుని స్మరణలో గడపమన్నారు. అలా మనలని రోజులో చాలా కొద్ది సమయాన్ని దైవానికి కేటాయించమని చెప్పారు.
అంటే రోజు రెండునిమిషాలు భగవంతుని స్మరిస్తే సరిపోతుందా ? మనం జీవన్మరణ వలయాన్ని ఛేదించి తరించి పోతామా?
కృత, త్రేతా, ద్వాపర యుగాలలో మునులు చేసిన , ఈ కలియుగంలో కూడా కొందరు ముముక్షువులు సంవత్సరాల తరబడి చేసే తపము, ధ్యానము అన్నీ అర్ధం లేనివా?
మరి సామాన్య మానవుని కంచి పరమాచార్య రెండునిమిషాలు రోజు ఎందుకు భగన్నామ స్మరణ చెయ్యమన్నారు? ఇందులో అర్ధం ఏమిటీ అని కాస్త మనం తరచి చూద్దాం.
మనం సామాన్య మానవులం. సంసారులం. రొజు అనేకానేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఈ జీవన ప్రవాహంలో కొట్టుకుని పోయే గడ్డిపోచలం. పుడుతూ చస్తూ, ఎప్పటికి మనం ఈ జీవన్మరణ వలయాన్ని ఛేదించి పరమాత్మని చేరుకునేది అనే తపన పడి ఆ మహాత్ముడు ఈ సులభమైన రెండు నిమిషాల మార్గం ఉద్భోదించారు. ఒకసారి భగన్నామ స్మరణలోని మాధుర్యాన్ని మనం రుచి చూస్తే, ఇఖ ఆ మాధుర్యాన్ని వదిలిపెట్టమని ఆ మహానుభావుని ఆలోచన. రెండు పదినిమిషాలు గాను, పదినిమిషాలు అరగంటగా మారి, అది ఒక వ్యసనంగా మారాలి అని ఉద్దేశ్యం.

దీనినే ఆగ్లంలో సూక్ష్మంగా
SOW AN ACTION REAP A TENDENCY
SOW A TENDENCY REAP A HABIT
SOW A HABIT REAP A DESTINY అని చెబుతారు.
అంటే మన మనస్సును పరమాచార్య ” నౌకాగ్రకాకవత్ ” దిశగా మళ్ళించాలని ప్రయత్నం చేయమని ఆదేశిస్తున్నారన్నమాట.
ఇక్కడ ‘నౌకాగ్రకాకవత్ ’ అంటే ఏమిటో తెలుసుకుందాము. ఒక కాకి సముద్రంలోకి వెళ్ళుతున్న నౌకాగ్రమున ఉన్న ధ్వజము మీద వాలింది. నౌక సముద్రములోకి వెళ్ళిపోయింది. ఇఖ ఆ కాకి ఎక్కడ వాలాలన్నా నౌకయే శరణ్యం కదా ! కాకిని మన మనస్సుతో పోల్చి చెప్పిన ఉపమానం అన్నమాట. నౌక భగవానుని సన్నిధి. అలా కాకి, నౌకలాగా వాతావరణం మనకు మనమే కల్పించుకుని స్వామి సన్నిధిలో గడపటం అలవాటు చేసుకోవాలి.

“శనై: శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా | ఆత్మసంస్థం మన: కృత్వా న కించిదపి చిన్తయేత్ || అని గీతలో భగవానుడు ఉపదేశము చేశాడు.
అంటే పరమాచార్య మనకు చేసిన ఉపదేశము క్రమక్రమముగా ( శనై: శనై : ) మనస్సుని భగవంతుని వైపు మళ్ళించాలి అని.
మీరు గానీ, మీ పిల్లలు గానీ రోజు ఒక గంటో, అర్ధగంటో, శని ఆదివారలు వస్తే ఇంకో గంటసేపు ఎక్కువగా పూజలో నిమగ్నమై సాధన సాగించాలని అనుకోవడం మంచిదే. కానీ అది నిర్భధం చేసుకోవద్దు. ఎందుకంటే అప్పుడు శని, ఆదివారం వస్తుంది అంటేనో, లేదా తెల్లవారుతుంది అంటేనే భయం వేసే పరిస్థితి వస్తుంది. మనస్సుతో పెట్టి పూజ మాత్రమే భగవంతుని చేరుతుంది. యాంత్రికంగా చేసే ఏ సాధన అయినా నిష్పలమే అని పైన చెప్పుకున్నాము కదా !
అయితే మనకున్న మాధ్యమాలు ఈ రెండు నిమిషాల వ్యవధి కూడా మనల్ని భగవంతుని దగ్గరనుండి దూరం చేస్తున్నాయి. ఉదయం లేవగానే దంతధావనం కాకుండా దృశ్య, శ్రవణ మాధ్యమాలలొకి వెళ్ళిపోతున్న మనం, మన అంతరంగంలో కొలువయిన ఆ పరమాత్మని దర్శించేది ఎలా?
అలా అని ఈ దృశ్య, శ్రవణ మాధ్యమాలను వదిలి దూరంగా ఏ ఆశ్రమాలకో పారిపోవాలా ? అది కూడా సరైనది కాదు. ఎందుకంటే అలా ఏ అరణ్యాలకో ఆశ్రమాలకో పారిపోయేటట్లయితే, పరమాత్మ మనకి ఈ టీవీ, స్మార్ట్ ఫోన్, మాధ్యమాలు సృష్టించి ఇవ్వడు కదా ?
మరి మనకి ఏమిటి దారి ? దీనికి సమాధానం మన శాస్త్రమే” అతి సర్వత్రా వర్జయేత్ ” అని చెబుతోంది.
పరమాత్మ ఇచ్చినవి సరిగా ఉపయోగించుకుంటూ, అవి ” స్వామీ ! నువ్వు ఇచ్చినవే ” అని సద్వినియోగ పరచుకుంటూ, మన దైనందిన కార్యక్రమాలకు ఆటకం కలగని రీతిలో ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, నెమ్మదిగా మనలోపల ఉన్న ప్రపంచము చూడగలగాలి. బాహ్యంగా విహరించే మనస్సుని అదుపు చేస్తూ, ఆ మనస్సుని అంతరంగంలోకి తిప్పగలగాలి. దానికి ఈ రెండు నిమిషాల వ్యవధి మొదట్లో చాలదు. కానీ ఒకసారి ” ఆయన ” చేతిని మీరు అంది పుచ్చుకున్నారు అంటే ఇఖ ఆయన మిమ్మల్ని వదలడు. మీరు వదిలినా ఆయన మిమ్మల్ని వదలడు. ఎందుచేతనంటే “వీడెప్పుడు ఇంటికి వస్తాడా” అని తల్లి తన కుమారుని కోసం ఎదురు చూస్తున్నట్లే భగవంతుడు కూడా “వీడు నా వైపు ఎప్పుడు చూస్తాడా ” అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకసారి మీరు ఆయనవైపు తిరిగారా, ఇక ఆయన మిమ్మల్ని వదలడు. మీరు ఆయనని వదలని పరిస్థితి వస్తుంది. అంటే పరుగెత్తే మనస్సుని మనము మన బుద్దితో బంధించే స్థితికి చేరుకుంటాము. అదే పరమాచార్య చెప్పిన ఈ రెండు నిమిషాల సాధనలోని ఆంతర్యం.

అందుచేత మనం రోజు కొంత సమయం దైవ ప్రార్ధనలో గడుపుదాం. మన జీవితం సాఫల్యం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.

2 thoughts on “రెండు నిమిషాలు !!

  1. భగవంతుడికీ భక్తుడికీ తల్లీ బిడ్డల సామ్యం చాలా హృద్యంగా గా ఉంది.ధన్యవాదాలు శర్మగారూ..

  2. తమరి స్పందనకు ధన్యవాదములు . జై శ్రీమన్నారాయణ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *