April 23, 2024

సినిమా పాట పుట్టుక

రచన: కందికొండ
ఎం.ఎ. తెలుగు (పిహెచ్‌.డి.) పరిశోధకుడు,
ప్రముఖ సినీ గీత రచయిత

సినిమా పాట ఒక విక్షణమైన సాహిత్య ప్రక్రియ. నేడు జనజీవితంలో ఒక అందమైన లతలా పెన వేసుకుంది. అది ఎంతగానంటే! ప్రయత్నంగానో, అప్రయత్నంగానో మన అనుమతి లేకుండానే మన చేతనే ఆలాపింప చేసేటంతగా విందుల్లో, వినోదాల్లో, వేడుకల్లో పాటు వినిపించడం మనం నిత్యం వింటున్నాం, చూస్తున్నాం.
సాహిత్య ప్రక్రియగా సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకునే క్రమంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సినిమా పాటను నాటి నుండి నేటి వరకు పరిశీలిస్తే అనేకానేక అసక్తికరమైన విషయాలు, దాని వెనుక దాగివున్న కఠోర శ్రమ మనల్ని ఆశ్చర్యంలో ముంచి ఆలోచింపజేస్తుంది.
అసలు ఈ సినిమా అనే పదం దేని నుంచి పుట్టింది?. ఇది ‘‘కినెమా’’ అనే గ్రీకు పదం నుండి పుట్టింది ‘‘కినెమా’’ అంటే పురోగమనమని అర్థం. థామస్‌ అల్వా ఎడిసన్‌, డికెనసన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1889 అక్టోబర్‌ లో ‘‘కినెటోస్కోప్‌’’ కనుగొనడంతో అంత వరకు వున్న ‘‘మాజిక్‌ లాంతర్లు’’ అంతర్థానమై వాటి స్థానంలో సినిమా లాంటిది ఊపిరి పోసుకుంది. అది పరిణామ క్రమంలో నేటి సినిమాలా రూపుదిద్దుకుని చిత్రయుగం 1913 వరకు కొనసాగడం జరిగింది. అనంతరం ఈ మూకీ చిత్రాల నిడివి పెరిగి కథకు ప్రాముఖ్యం హెచ్చింది.
ప్రస్తుత ముంబాయిలో 1896 లో చలన చిత్ర ప్రదర్శన ప్రారంభమైనప్పటికి స్వదేశి చిత్రాలు రూపు దిద్దుకోలేక పోయాయి. తరువాత ‘‘భక్త పుండలిక్‌’’ అనే మూకీ చిత్రాన్ని 1910లో ‘‘ఆర్‌.జి.టోర్నే’’ నిర్మించారు. కాని నిర్మాణంలో విదేశీ సాంకేతిక నిపుణులు పాల్గొని ఒక రంగస్థ నాటకాన్ని యదాతథంగా తెరకెక్కించడం చేత ‘‘ఆర్‌.జి.టోర్నే’’ గారు భారత చలనచిత్ర పిత గా గుర్తింపు పొందలేక పోయారు. తర్వాత 1911 లో వచ్చిన ‘‘రాజదర్భారు’’ భారతదేశంలో మొదటి మూకీ గా పరిగణింపబడినప్పటికి, పూర్తిగా భారతదేశ సాంకేతిక నిపుణులతో సర్వస్వతంత్రంగా నిర్మించిన చిత్రం మాత్రం ‘‘రాజా హరిశ్చంద్ర’’ యే. అందుచేతనే ఆ చిత్ర నిర్మాత అయిన ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే’’ కు ‘‘భారతీయ చలన చిత్ర పిత’’ గా అరుదైన గౌరవం దక్కింది.
‘‘హరిశ్చంద్ర’’ చిత్ర నిర్మాణం కోసం ఫాల్కే పడిన కష్టాలు నేటికి కథలు కథలుగా చెప్పుకొంటారు ‘‘చంద్రమతి’’ పాత్ర పోషించడానికి స్త్రీలెవరు ముందుకు రాకపోవడంతో చివరకు ముంబాయిలోని వేశ్య వాటికకు వెళ్ళి ఆ పాత్ర ధరించమని ఎందరో వేశ్యలను అడిగారట. చివరకు ఫలితం లేకపోవడంతో ‘‘ఫాలుంకే’’ అనే ఒక పురుషుడి చేత ఆ పాత్రను వేయించి మెప్పించారు. ఈ చిత్రం పేరు ‘‘కీస్తు జీవితం’’ (లైఫ్‌ ఆఫ్‌ క్రైస్ట్‌).
ఇక తెలుగు విషయానికోస్తే తెలుగువారు నిర్మించిన తొలి తెలుగు మూకీ చిత్రం ‘‘భీష్మ’’. దీనిని ‘‘రఘుపతి వెంకయ్య’’ గారు 1923 లో నిర్మించారు. నిశ్శబ్ధ చలన చిత్రం అయిన ఈ దృశ్య ప్రక్రియ మొదట్లో ప్రేక్షకులను అలరించి నప్పటికి రాను రాను ఏదో వెలితి వున్నట్లు ప్రేక్షకులు భావించడం ప్రదర్శకులు గమనించారు. దానికోసం ప్రథమంగా ప్రదర్శన శాలల్లో వ్యాఖ్యాతలను నియమించారు. ఆ తరువాత నాటకాల్లో లాగే తెరముందు ప్రేక్షకుల దృష్టికి అవరోధం కలగకుండా గొయ్యివంటి భాగంలో ‘‘వాద్యగోష్టిని’’ ఏర్పాటు చేసి సంఘటనను అనుగుణమైన శబ్దాలను, సంగీతాన్ని వినిపించి రసానుభూతికి కృషి చేశారు. అయినప్పటికిని నాటకాల పోటిని తట్టుకొని మూకీలు నిలబడ లేకపోయాయి. ఇక్కడే… ఇక్కడే…. పాట జీవం పోసుకునేందుకు ఆస్కారం, అవసరం ఏర్పడింది. ప్రేక్షకుల యొక్క అసంతృప్తిని రూపు మాపి వారికి మూకీ పట్ల ఆదరణను పెంచడం కోసం మూకీ చిత్రాలలోనే వాద్యగోష్ఠి ద్వారా పాటల్ని వినిపించేందుకు అంకురార్పణ జరిగింది. అలా ఆ రోజులో ప్రదర్శింపబడిన పాశ్శాత్య చిత్రాల్లో ‘‘మై లోన్లీ హర్ట్‌’’ ‘‘హర్ట్‌ అండ్‌ ప్లవర్స్‌’’ ‘‘బ్యూటిఫుల్‌ బ్లూలాటూన్‌’’ వంటి పాటల్ని సందర్భోచింతంగా వినిపించారు. తరువాత అదే విధంగా హిందీ చిత్రాలో ‘‘జల్‌మె చణ్‌కె జల్‌కీ మచ్చరియా’’ ‘‘ఉంగ్లీమారోరి మోరీ’’ ‘‘మత్‌ బోలో బహర్‌కీ బతియా’’ వంటి రాగాశ్రయ గీతాలు, జానపద వాద్యగోష్ఠి ద్వారా భారతీయ చిత్రాలో వినిపించారు. ఈ పాటలు ఈ చిత్రాల కోసమే రచించినవి కావు. సందర్భోచింతంగా ఆయా సందర్భాలకు సరిపోయే ప్రజా రంజకమైన పాటలు మాత్రమే.
భారతీయ చిత్రాలను వాద్య సమ్మేళనంలో తబలా, హర్మోనియం ఉపయోగించేవారు. ఇట్టి వాద్య కళాకారులే ఈ మూకీ చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించబడేవారు. అట్లే వాద్యగోష్ఠి ద్వారా పాటలు వినిపించడం, ప్రారంభించడం జరిగిందని చెప్పవచ్చు.
1927 అక్టోబర్‌ 6వ తేది రోజున ‘‘వార్నర్‌’’ ప్రదర్శన శాలలో ‘‘జాజ్‌సింగర్‌’’ అనే కథాకమీషూ వున్న మొదటి శబ్ద చిత్రం ప్రదర్శించటం జరిగింది. ఈ చిత్రంలో బహుళ ప్రచారం పొందిన ఏడు పాటలున్నాయి. వాటిలో బాబీగార్డన్‌ పాడిన ‘‘మై గాల్‌సాల్‌’’ అనే పాట చిత్రంలో వినిపించే మొట్ట మొదటి పాట ఇదే ప్రపంచంలో మొడటి సినిమా పాట! పాల్‌ డ్రెస్సర్‌ ఈ గీతాన్ని రచించి స్వరకల్పన చేశారు.
‘‘షోబోట్‌’’ అనే పాశ్చాత్య టాకీని చూసి ముగ్ధుడై ‘‘శబ్ధగ్రహణ’’ యంత్రాన్ని దిగుమతి చేసుకుని ‘‘ఇరానీ’’ నిర్మించిన ‘‘ఆలం ఆరా’’ 14.3.1931న బొంబాయిలోని ‘‘మెజిస్టిక్‌ ధియేటర్‌’’ లో విడుదలై సంచనం కలిగించింది. ఇదే తొలి భారతీయ శబ్ధ చిత్రం. దీనిని ‘‘ఆర్దేషిర్‌ ఇరానీ’’ నాలుగు నెల్లో నలభై వేల రూపాయల వ్యయంతో పాశ్చాత్య సాంకేతిక నిపుణుల సహాయం లేకుండా నిర్మించారు. 10,500 అడుగు చిత్రం. ఈ చిత్రంలో ఫకీరు పాత్ర ధరించిన డబ్ల్యూ.ఎం.ఖాన్‌ పాడిన ‘‘కుచ్‌ చాహే అగర్‌తో మాంగ్‌లే / ముఝె హిమ్మత్‌హై మగర్‌ దేనేకీ (నీకు ఇవ్వగలిగిన తాహత్తు వుంటే దేవుడి పేర ఇవ్వు / నీకు ఏదైనా అడగగలిగిన ధైర్యముంటే అప్పుడది కావాని అడుగు) ఇది బాగా ప్రాచుర్యం పొందిన తొలి భారతీయ చలన చిత్ర గీతం. భారతీయ షేక్స్‌పియర్‌ గా పేరు పొందిన ఆగాహష్ర్‌ కాశ్మీరీ ఈ పాటను రచించారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాత అయిన ఎల్‌.వి. ప్రసాద్‌ ఈ పాట చిత్రీకరణ సమయంలో ప్రత్యేక్ష సాక్షి కావడం తెలుగువారికి గర్వకారణం.
‘‘ఆలం ఆరా’’ విడుదలయ్యే నాటికి దాక్షిణాత్యులనేకులు నేటి చలన చిత్ర ప్రముఖులైన ఎల్‌.వి. ప్రసాద్‌ గారు నెల జీతం నటుడిగా ‘‘బొంబాయి’’ లోని ఇంపీరియల్‌ కంపెనీలో పనిచేస్తుండేవారు. ‘‘రాజాశాండో’’ మూకీ చిత్రాలో ప్రాచుర్యం పొందిన కథానాయకులు వై.వి.రావు నటునిగా అనుభవం పొందారు. హెచ్‌.ఎమ్‌.రెడ్డి కృష్ణా ఫిలిమ్స్‌లో సమర్ధుడైన నిర్వాహకులుగా పేరు తెచ్చుకున్నారు. వీరంతా బొంబాయి, కలకత్తా చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తుండేవారు. అందుచేత తొలి తెలుగు చిత్రం ముంబాయిలోనే నిర్మించబడిరది. అదే ‘‘భక్త ప్రహ్లాద’’. దీనిని ‘‘ఇంపీరియల్‌ మూవీటోన్‌’’ బొంబాయి వారు నిర్మించగా హెచ్‌.ఎమ్‌.రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
తొలి తెలుగు సినిమా పాట విషయానికొస్తే ‘‘భక్త ప్రహ్లాద’’ సినిమాలో పోతన పద్యాలు ధర్మవరం కృష్ణమాచార్యుల వారి కొన్ని పాటలతో మరికొన్ని పాటలు కూడా చోటు చేసుకున్నప్పటికి ఈ చిత్రంలోని ‘‘పరితాపంబు భరియింపతరమా / కటకటనే విధి గడుపంగ జాలదు’’ అనే పాటను ‘‘చందా కేశవదాసు’’ (1976-1986) రచించారు. ఈ పాటను అంతకు ముందే రచించిన్పటికి ‘‘చందా కేశవదాసు’’ అనుమతితో మార్పు, చేర్పు వారి చేతనే చేయించి హెచ్‌.ఎమ్‌.రెడ్డి గారు ఈ పాటను ఉపయోగించుకున్నారు. అందుకే ‘‘కేశవదాసు’’ ను తొలి తెలుగు సినిమా కవిగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నేడు సినిమా పాట ఒక సంపూర్ణ సాహిత్య ప్రక్రియగా జీవం పోసుకుని మనల్ని అలరిస్తోంది, అనందిపచేస్తోంది, పాడిస్తుంది, ఆడిస్తోంది. ఇలా ఈ సినిమా పాట విలక్షణతను సంతరించుకుని ఎన్నో పోకడలు పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *