June 14, 2024

గుండెకీ గుబులెందుకు! ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మాలాకుమార్

“అదేమిటి అట్లా కూర్చున్నావు?” బాత్ రూం నుంచి వస్తూ, మంచం మధ్యలో గడ్డం కింద చేయి పెట్టుకొని మూడీగా కూర్చున్న సుజాతను అడిగాడు అర్జున్.
అతని ప్రశ్నను పట్టించుకోకుండా “పాపం మీకు మీ నాన్న అన్యాయం చేసారు కదూ ?”విచారంగా అంది సుజాత.
“మా నాన్న నాకేమి అన్యాయం చేసాడు? పొద్దున్నే లేవగానే నీకా అనుమానం ఎందుకు వచ్చింది?”అడిగాడు అర్జున్.
“మీ అన్నయ్యకేమో తెలివిగల, పనిమంతురాలైన అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసారు.అందరూ ఆమె తెలివితేటలని మెచ్చుకుంటున్నారా లేదా? మీ తమ్ముడికేమో అదృష్ఠవంతురాలిని ఇచ్చి చేసారు. అందరూ ఆమె వచ్చినప్పటి నుంచి మీ తమ్ముడి దశ తిరిగిందని అన్నీ కలిసొస్తున్నాయని అంటున్నారా లేదా? మరి మీకేమిటి నాలాంటి తెలివితక్కువదాన్ని, అయోమయాన్ని ఇచ్చి చేసారు?”
“ఏమి చేస్తాం ఒకొక్కరి తలరాత. ఐనా ఇప్పుడనుకొని ఏమి లాభం.ఎందుకిలా చేసాడో అడుగుదామంటే మా నాన్నా లేడు.”నవ్వుతూ అన్నాడు అర్జున్.
“అంతే కాని, నువ్వూ తెలివిగలదానివే , అదృష్ఠవంతురాలివే అనరన్నమాట. అంతేలెండి , నేనంటే మీకు అలుసైపోయాను.”కోపంగా అంటూ బాత్రూంలోకి వెళ్ళి ధఢాం అని తలుపేసుకుంది సుజాత.
ఏదో జోక్ అనుకుంటే నిద్ర మంచం మీదే ఈ గొడవేమిటి అని బిత్తరపోయాడు అర్జున్.
కాఫీ తెచ్చి ఇచ్చిన సుజాత ముభావంగా ఉండటం చూసి, “ఏమిటి సుజా జస్ట్ జోక్ చేసాను. ఐనా ఇంకా కోపం తగ్గలేదా?”అనునయంగా అడిగాడు అర్జున్.
“మీకు నేనంటే జోక్ గానే ఉంటుంది.ఐనా మీకు నేనంటే ఎప్పుడు విలువ ఉంది గనుక.”ఉక్రోషంగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
సెల్ రింగవుతుంటే అనాసక్తిగా అందుకుంది సుజాత.
“హాయ్ అమ్మా ఏమి చేస్తున్నావు?” అటునుంచి అడిగింది అఖిల.
“చేసేందుకు నాకేమైనా పనాపాడా .బాల్కనీ లో కూర్చొని ఏదో ఆలోచించుకుంటున్నాను.”అంది సుజాత.
“ఏమాలోచిస్తున్నావు? అడిగింది అఖిల.
“పొద్దున్నే మీ డాడీతో గొడవైంది. పాత గొడవలన్నీ గుర్తొచ్చి మూడ్ అంతా పాడైపోతోంది.అసలు నేనంటే ఎవరికీ అభిమానం, ప్రేమ, విలువ లేవు.”దిగులుగా అంది సుజాత.
“అమ్మా అట్లా ఎందుకనుంటావు?పాజిటివ్ గా ఆలోచించమని నీకెన్ని సార్లు చెప్పాను. గొడవలు కాదు , మంచి సంగతులు గుర్తు తెచ్చుకో.”అంది అఖిల.
“మంచి సంగతులా ఏమున్నాయి?” అంది సుజాత.
“ఏమీ ఎందుకుండవు?నీ చిన్నప్పటి సరదాలు, మేము పుట్టిన్నప్పటివి , నీ పెళ్ళైన కొత్తల్లోవి , ఇలా గుర్తు తెచ్చుకోవాలే కాని ఎన్నైనా ఉంటాయి.”నచ్చచెబుతున్నట్లు అంది అఖిల.
ఏమి జవాబివ్వలేదు సుజాత.
“ఒకే అమ్మా పని ఉంది ఉంటాను” కాల్ కట్ చేసింది అఖిల.
ఒక్కసారి అఖిల చిన్నపాపగా వున్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి సుజాతకి.
“మా బంగారు తల్లి ఎక్కడుందీ?”చేతిలొ వెండిగిన్నె పట్టుకొని, అఖిలను వెతుకుతూ పడకగదిలోకి వచ్చింది సుజాత.
మంచం కింద నుంచి “హంతీ దంతీ సాత్ ఆన్ ఏ వాల్” అని పినిపించింది.
మంచం కిందికి తొంగి చూసింది. మంచం కింద, కాలు మీద కాలేసుకొని దర్జాగా పడుకొని రైమ్ పాడుతోంది ఏడాదిన్నర అఖిల.
“అమ్మలూ బయటకు రారా , ఆం తిందువుకాని.”గారంగా పిలిచింది సుజాత.
“ఊమ్హూ హంతీ , దంతీ సాత్ ఆన్ ఏ వాల్.” అంది ముద్దుగా అఖిల.
“బంగారుతల్లీ బయటకు వచ్చి పాడుకోరా.”అని చిన్నగా బయటకు తీసింది.
ఏడాదికే మాటలన్నీ వచ్చేసాయి .దాని వాగుడు చూసి ఎవరూ ఏడాది పిల్ల అని చెబితే నమ్మేవాళ్ళు కాదు. ముద్దు ముద్దుగా వసపోసిన పిట్టలా ఎన్నిమాటలు మాట్లాడేదో బుజ్జిపిట్ట. మురిపెంగా కూతురు గురించి అనుకుంటూ ఉంటే పెదవులమీదికి అలవోకగా చిరునవ్వు వచ్చింది సుజాతకు.
“ఏమిటి మమ్మీ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?”అన్న అఖిల పలకరింపుకు ఈ లోకంలోకి వచ్చింది సుజాత.
“నువ్వెప్పుడొచ్చావు ? నేను చూడలేదు.రా కూర్చో.ఆఫీస్ లేదా?” అడిగింది.
“ఉందమ్మా. ఈ రోజు కొంచం టైం ఉంది అందుకని ఇటొచ్చాను.” కూర్చుంటూ అడిగింది.
“ఏమి లేదు నువ్వేగా చెప్పావు , ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించు. సరదా సంగతులు , మంచి విషయాలు గుర్తు తెచ్చుకో అని. అదే ప్రయత్నం చేస్తున్నాను.”అంది సుజాత.
“గుడ్. ” అంది అఖిల.
“నువ్వెప్పుడొచ్చావురా అమ్మలూ?నాకు మీటింగ్ ఉంది వెళ్ళాలి, ఇప్పుడు నీతో మాట్లాడలేను.”అన్నాడు
అర్జున్ బయటకు వస్తూ .
“పర్లేదు డాడీ నేను కాసేపు కూర్చొని ఆఫీస్ కు వెళ్ళిపోతాను.”అంది అఖిల.
“మనం సాయంకాలం పరమేశ్వరావు ఇంట్లో పెళ్ళికి వెళ్ళాలి గుర్తిందిగా!”అని సుజాతకు చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్.
కాసేపు కూర్చొని అఖిల కూడా వెళ్ళిపోయింది.
సాయంకాలం పరమేశ్వరరావుగారి ఇంటి నుంచి వస్తూ “పెళ్ళి బాగా జరిగింది కదూ ? మనకు బట్టలు కూడా పెట్టారు.”అన్నాడు అర్జున్.
“ఊ” అంది ముక్తసరిగా సుజాత.
“ఏమైంది?అలా ఉన్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా?”
“నన్నెవరేమంటారు? “విసురుగా అంది సుజాత.
“మరి?”ప్రశ్నార్ధకంగా చూసాడు అర్జున్.
“నేను పెద్దదానిగా కనిపిస్తున్నానా?అందరూ ఆంటీ ఆంటీ అనటమే.ఈ ఆంటీ పిలుపు ఏమిటోగాని పూలవాడి దగ్గర నుంచి దగ్గరవాళ్ళు కూడా ఆంటీనే!అంత పెద్దగా ఉన్నారు , వగలుబోతూ ఆంటీ అంటుంటే చిరాకొస్తుంది.”చికాగ్గా అంది సుజాత.
“ఓస్ దానికేనా? నేనింకేమిటో అనుకున్నాను.”అన్నాడు అర్జున్.
“పైగా ఎక్కడికెళ్ళినా పార్వతీపరమేశ్వరుల్లా ఉన్నారు అని ఓ టాగ్ తగిలించేస్తారు.జరీ చీరలు పెడతారు.నేనంత పెద్దపేరమ్మలా ఉన్నానా ?”ఉక్రోషం గా అంది సుజాత.
“అబ్బా దానికీ కోపమేనా ? అది మర్యాద.మనకు గౌరవం ఇస్తున్నారు.నీకిష్టం లేకపోతే ఆ చీరలు కట్టుకోకు.” అన్నాడు అర్జున్.
“పెట్టేవాళ్ళంతా మనవాళ్ళు. కట్టుకోకపోతే బాధపడతారు.వెయ్యిరూపాయలకు తక్కువకాని చీరలు పెడుతారు.అలా అని కట్టుకోలేను, వేరే వాళ్ళకు పెట్టలేను. ఇన్ని కొత్త చీరలుండగా నా కిష్టమైనవి కొనుక్కోలేను.” నిస్పృహగా అంది సుజాత.
ఇదీ సమస్యేనా అన్నట్లు విచిత్రంగా చూసాడు అర్జున్.
పొద్దున్నే సుజాత అరుపులతో మెలుకువ వచ్చింది అర్జున్ కు. లేచి బయటకు వచ్చి ఏమైందా అని చూసాడు.సుజాత పనిమనిషి మీద గట్టిగా అరుస్తోంది. లోపలికి వచ్చిన సుజాతతో “ఏమైంది సుజా అలా అరుస్తున్నావు ?”అని అడిగాడు.
“చూడండి రెండు రోజులుగా రాలేదు. ఏమైంది అంటే పిల్లవాడి కి జ్వరం అంటూ ఏవో కథలు చెబుతోంది”అంది.
“నిజంగానే పిల్లవాడి కి జ్వరమేమో” నచ్చ చెప్పబోయాడు అర్జున్.
“మీరూరుకోండి మీకేమీ తెలియదు. ఐనా పని మనిషి సంగతి మీకెందుకు?”తీవ్రంగా అంది సుజాత.
సుజాత వైపు సాలోచనగా చూసి భుజాలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్.
ఆఫీసుకెళుతూ అఖిలకు కాల్ చేసాడు అర్జున్.
“ఏమిటి డాడీ?”అడిగింది అఖిల.
“నువ్వు సాయంకాలం ఆఫీసు నుంచి వెళుతూ ఓ అరగంట నాకు స్పేర్ చేయగలవా?”అడిగాడు అర్జున్.
“అలాగే డాడీ , ఇంటికి వస్తాను .”అంది అఖిల.
“వద్దు తాజ్ కు రా. నువ్వు బయిలుదేరే ముందు నాకు కాల్ చేయి.”అన్నాడు అర్జున్.
సాయంకాలం తాజ్ లో కలిసారు అర్జున్, అఖిల.కాఫీకి ఆర్డర్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ చేతి మీద చిన్నగా తట్టుతూ “డాడ్ , ఏనీ ప్రాబ్లం?” అని అడిగింది అఖిల.
“ఏమీ లేదమ్మా మీ అమ్మ గురించే.ఈమధ్య విచిత్రంగా మారిపోయింది.కోపం ఎక్కువైంది. ఐనదానికీ కానిదానికీ కోపం తెచ్చుకుంటోంది. గట్టిగా అంటే ఏడుస్తోంది.అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతోంది.ఏమి అయ్యిందో అర్ధం కావటం లేదు .”అన్నాడు అర్జున్.
“ఏమి లేదు డాడీ, నేనుకోవటము దీనిని ఒకరకముగా ‘మిడిల్ ఏజ్ క్రైసిస్ ‘ అనవచ్చు.ఈ వయసులో చాలా మందికి వస్తుంది.దానికి దానికి చాలా కారణాలు ఉంటాయి. అమ్మ విషయములో అకస్మాత్తుగా అమ్మావాళ్ళ నాన్న, తాతయ్య చనిపోవటము, తమ్ముడు వినీల్ అమెరికా వెళ్ళటము, నువ్వు , నేను బిజీ ఐపోయి తనతో గడపకపోవటంతో వంటరిగా ఐపోయిన ఆలోచన వచ్చి డిప్రెషన్ వచ్చినట్లుంది అనిపిస్తోంది. దానితో కొన్ని భయాలు కూడా ఎక్కువయ్యాయి. మనం ఓర్పుతో తనను మామూలుగా చేయాలి.”అంది అఖిల.
“ఎవరైనా సైక్రియాటిస్ట్ కు చూపిద్దామా?”అడిగాడు అర్జున్.
“అవసరం లేదనుకుంటాను. అంత సీరియస్ గా ఏమీలేదు. నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి.కాకపోతే మీరు నా ప్రయత్నంలో సహకరించండి.”అంది అఖిల.
“సరే మరి .”అని వేయిటర్ కు బిల్ పే చేసి లేచాడు అర్జున్.
• * * * * * *
“హాయ్ అమ్మా “అంటూ వచ్చింది అఖిల.
“ఏమిటీ పొద్దున్నే వచ్చావు .ఆఫీస్ లేదా?” అని అడిగింది సుజాత.
“ఉంది కాని పొద్దున పనిలేదు .అందుకని నిన్ను చూసిపోదామని వచ్చాను.ఏమి చేస్తున్నావు? బిజీనా?”అడిగింది అఖిల.
“ఆ నేనేమి బిజీ..డాడీ కూడా ఆఫీస్ కెళ్ళిపోయారు .ఇక నాకేమి పని ఉంది?” అంది సుజాత.
“ఐతే బయటకు వెళదాం రా.”పిలిచింది అఖిల.
“అబ్బ నేను రాను నాకు ఓపిక లేదు.” నిరాసక్తిగా అంది సుజాత.
“ఓపిక లేదు అనకు, లే చీర మార్చుకో.”అని అలమారాలో నుంచి చీర తీసి సుజాత చేతిలో పెట్టింది అఖిల.
ఇక తప్పదా అని గొణుక్కుంటూ తయారైంది సుజాత.
బజారులో ఓ బిల్డింగ్ దగ్గర కార్ ఆపించి దిగింది అఖిల.తలెత్తి ఆ బిల్డింగ్ పేరు “న్యూ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్” అని వ్రాసి ఉన్నది చదివి “ఇదేమిటి ఇక్కడకు తీసుకొచ్చావు?”అడిగింది సుజాత.
“నిన్ను చేర్పిద్దామని”నవ్వుతూ అంది అఖిల.
“ఇదేమిటి? నేను చేరను .”అంటూ కారెక్కబోతున్న సుజాతను చేయిపట్టి ఆపి, పక్కన ఉన్న కాఫీ షాప్ లోకి తీసుకెళ్ళింది అఖిల.రెండు కప్పులు కాఫీ తీసుకొని ఓ టేబుల్ దగ్గర కూర్చొని సుజాతను కూడా కూర్చోబెట్టింది.
“ఊ ఇక చెప్పు. కొత్త కొత్తవి నేర్చుకోవటం నీకు ఆసక్తి కదా మరి కంప్యూటర్ ఎందుకు నేర్చుకోవు?”అడిగింది అఖిల.
“అది ఒకప్పుడు.ఇప్పుడు నాకు దేనిమీదా ఆసక్తి లేదు.”అంది సుజాత.
“ఎందుకు లేదు?”అడిగింది అఖిల.
“ఎందుకు లేదు అంటే ఏమి చెబుతాను ?లేదు అంతే.”ఒక్కసారిగా బరెస్ట్ అయ్యింది సుజాత.”ఈ మధ్య నాకు దేని మీదా ఆసక్తి లేదు. ఏపనీ చేయాలనిపించటం లేదు.చాలా చికాగ్గా ఉంటోంది.సడన్ గా భయమేస్తుంది. రాత్రిళ్ళు నిద్రపట్టదు. నిద్రపట్టినా పిచ్చి పిచ్చి కలలు. డాడీ నన్నొదిలేసి వెళ్ళిపోతున్నారనిపించి లేచి కూర్చొని డాడీ చేయి పట్టుకుంటాను. ఒక్కసారిగా అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారన్న భావన వస్తుంది. గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది. ఏడుపొస్తుంది. ఇలా ఎన్నని చెప్పను ? పిచ్చెక్కుతుందేమో అనిపిస్తోంది.ఇలాగే కొన్ని రోజులు ఉంటే నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పిస్తారేమో అని భయం గా ఉంది.” దిగులుగా అంది సుజాత.
“పిచ్చిలేదు ఏమీ లేదు ఇదంతా నీ మనసు చేస్తున్నగారడి. దాని గారడీకి లోబడకు.దానితో యుద్దం చేసి గెలువు.నీకే కాదు కొన్నిసార్లు అందరికీ ఏదో ఒక స్టేజ్ లో ఇలా శూన్యంగా, గాలి తీసిన బెలూన్ లా అనిపిస్తుంది.నీ మనసును ఏదైనా వ్యాపకం మీదికి మళ్ళించుకో. బుర్రను ఖాళీగా ఉండనీయకు. హాయిగా కంప్యూటర్ నేర్చుకో.”అంది అఖిల.
“కంప్యూటర్ నేర్చుకొని నేనేమి చేయను? ఉద్యోగం చేసే ఓపిక లేదు. కుట్లూ అల్లికలూ మొదలైన వాటి మీద ఇంటెరెస్ట్ తగ్గింది.అసలు పుస్తకాలే చదవాలనిపించటం లేదు .ఎట్లా చదివేదానిని.”అంది సుజాత.
తన లాప్ టాప్ ఓపెన్ చేసి , సుజాత పక్కకు వచ్చి కూర్చొని “కంప్యూటర్ నేర్చుకొని ఉద్యోగమే చేయనవసరం లేదు. వినీల్ కు నువ్వు ఉత్తరం వ్రాసావనుకో అది వాడికి చేరి , వాడు జవాబిచ్చేసరికి నెల పడుతుంది. అదే మెయిల్ ఇచ్చావనుకో నిమిషంలో చేరుతుంది.అంతెందుకు ఇదిగో చూడు , వినీల్ పేరు పక్కన ఆకుపచ్చ చుక్క కనిపిస్తోందా ?అంటే వాడు ఆన్ లైన్ ఉన్నాడన్న మాట . నువ్వు వాడితో ఇప్పుడు ఆన్ లైన్ మాట్లాడవచ్చు. ఇక్కడ ఉన్నప్పుడులాగే వాడు నీ పక్కనే కూర్చొని పని చేసుకుంటున్నాడనుకో! దీనిని మెయిల్, చాట్ అంటారు. ఇంకా నీకు ఏదైనా వంటకం గురించి కావాలి , లేదా నీ ఏదైనా మందు గురించి తెలుసుకోవాలనుకున్నావు ఇక్కడ టైప్ చేయి నీకు కావలసిన సమాచారం క్షణాలల్లో వస్తుంది. ఇక్కడ తెలుగులో వ్రాయవచ్చు. ఇవి బ్లాగ్ లు. నువ్వూ ఓ బ్లాగ్ ఓపెన్ చేసుకొని నీకు కావలసింది వ్రాసుకోవచ్చు. మాకు చిన్నప్పుడు చెప్పిన కథలు , నీ కవితలు అన్నీ ఇక్కడ తెలుగులో వ్రాసుకోవచ్చు. ఏ పత్రికలవాళ్ళో పబ్లిష్ చేయనవసరంలేదు. నువ్వే చేసుకోవచ్చు. పదిమందీ చదువుతారు. వాళ్ళ అభిప్రాయాలు చెపుతారు. చూడు ఇవన్నీ తెలుగు బ్లాగ్ లు. ఇందులో నీ అభిరుచులకు తగ్గవాళ్ళు నీకు స్నేహితులు కావచ్చు.హాయిగా ఇంట్లో నుంచే వాళ్ళ తో నీ అభిప్రాయాలు పంచుకోవచ్చు.ఇది యూట్యూబ్. ఇక్కడ నీకు కావలసిన పాత సినిమాలు చూడవచ్చు.పాటలు వింటూ చూడవచ్చు..అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి గీతాలు అన్నీ ఉంటాయి.ఇక్కడ నవలలు ఉంటాయి .పత్రికలు ఉంటాయి. న్యూస్ పేపర్ లు ఉంటాయి. ఏవైనా చదువుకోవచ్చు.అంతెందుకు ప్రపంచం అంతా ఈ చిన్నిపెట్టలో ఉంది.చక్కగా సమయం గడిచిపోతుంది.” ఒకొక్కటీ చూపిస్తూ వివరించింది అఖిల.
“సరే చూద్దాం.ఇదీ ప్రయత్నిస్తాను”అని అంగీకారం తెలిపింది సుజాత.అఖిలతో పాటు సుజాత ఆ బిల్డింగ్ లోకి నడిచింది.అక్కడ ఆఫీస్ అని వ్రాసి ఉన్న గదిలోకి నడిచింది అఖిల. అక్కడ ప్రిన్సిపాల్ అని వ్రాసి ఉన్న చోట కూర్చొని ఉన్న ఆయనతో, “నమస్కారమండి . నా పేరు అఖిల. ఇందాక మీకు కాల్ చేసాను.”అంది అఖిల.
“అవును కూర్చోండి.మీ అమ్మగారిని తీసుకొస్తానన్నారు , ఈవిడేనా ? “అని అడిగారు ఆయన.
“అవునండి.అమ్మ కంప్యూటర్ నేర్చుకుంటుంది.బేసిక్ నేర్పిస్తే చాలు.”అంది అఖిల.
“చాలా సంతోషమమ్మా. ఈ వయసులో ఆసక్తిగా నేర్చుకుందామని వచ్చారు.”అని పక్కన నిలబడ్డ అబ్బాయిని చూపిస్తూ “ఇతని పేరు సురేంద్ర. మీకు మిగితా విధ్యార్ధులతో కాకుండా విడిగా నేర్పిస్తాడు. “అని పరిచయం చేసాడు.
“రండి మేడం.”అని ముందుకు దారి తీసాడు సురేంద్ర.
“నువ్వెళ్ళమ్మా నేను ఫామ్ నింపి ఫీజ్ కట్టేసి వెళతాను.”అంది అఖిల.
సురేంద్రను అనుసరించింది సుజాత.
సురేంద్ర ఓ కారిడార్ లో నుంచి నడిచాడు. ఆ కారిడార్ మసక చీకటిగా ఉంది. అతనిని అనుసరించింది సుజాత. అతను ఓ గది తలుపులు తీసి లోపలికి వెళ్ళాడు. గది అంతా చీకటిగా ఉంది. అడుగు ముందుకు వేసిన సుజాత చీకటి చూసి “అమ్మో చీకటిలో నేర్చుకోవాలా నేను నేర్చుకోను .”అంది భయంగా.
సురేంద్ర మాట్లాడకుండా తలుపు పక్కన ఉన్న స్విచ్ లు వేసాడు. గదంతా తెల్లని వెలుతురు నింపుతూ నాలుగుపక్కలా ట్యూబ్ లైట్ లు వెలిగాయి. గది చాలా విశాలంగా ఉంది.కుర్చీలు , బల్లలూ విధ్యార్ధులు కూర్చునేందుకు వీలుగా వేసి ఉన్నాయి.ఎదురుగా గోడ మీద పెద్ద తెర కనిపిస్తోంది.సురేంద్ర ఆ తెర దగ్గరకు వెళ్ళి స్విచ్ వేసాడు. తెర మీద “వెల్ కం “అని అక్షరాలు నీలి రంగులో తిరుగుతూ వచ్చాయి.ఆ తరువాత ఆకుపచ్చని పచ్చిక బయిళ్ళు, నీలాకాశం, పచ్చికలో మేస్తున్న జీవాలు తెర మీద ప్రత్యక్షం అయ్యాయి. తెరకు ఎడమ వైపుగా కొన్ని గుర్తులు కనిపించాయి.అందమైన ఆ ప్రకృతి దృశ్యం చూడగానే సుజాత మనసు ఆనందంతో నిండిపోయింది.ఓ విధమైన ఉద్వేగానికి గురైంది.
సురేంద్ర “రండి మేడం .” అని పిలిచాడు.ఆ పిలుపు , ఆ ప్రకృతి,గదిలో పరుచుకున్న తెల్లని వెలుతురు తన మనసు పొరలల్లో ఉన్న చీకటిని పారద్రోలి వెలుతురు నింపేందుకు ఆహ్వానంలా అనిపించింది. తన మనసు చేస్తున్న గారడీ నుంచి బయటపడగలను అన్న ఆత్మ విశ్వాసంతో ఆ కొత్తప్రపంచంలోకి అడుగు వేసింది సుజాత.
క్లాసు తర్వాత ఆటో తీసుకుని ఇంటికెళ్లగానే సుజాత తన కూతురుకు ఫోన్ చేసింది.” అఖిలా! నీకు ఇన్ని విషయారు ఎలా తెలుసు? నా పరిస్థితిని ఎలా అర్ధం చేసుకోగలిగావు. చాలా థాంక్స్ రా. “
“అమ్మా! నేను నీ కూతురుని కాదు.. ఫ్రెండ్ ని కదా. అందుకే నిన్ను అర్ధం చేసుకోగలిగాను. అంతే”అంది నవ్వుతూ..
“థాంక్స్ రా ఫ్రెండ్… మళ్లీ నిన్ను మెయిల్ తో నే మాట్లాడతాను. పోన్ చేయను. “
అఖిల సంతోషంగా ఈ విషయం చెప్పడానికి తండ్రికి కాల్ చేసింది..

***************

విశ్లేషణ: డా.మంథా భానుమతి

పిల్లలు చిన్నతనంలో ఎన్ని గారాలు పోయినా ఎదిగాక తల్లి దండ్రులతో స్నేహితుల్లాగానే మెలగాలి. ముఖ్యంగా తల్లీ కూతురు, తండ్రీ కొడుకులు ఏ అరమరికలూ లేకుండా.. అవసరమైనప్పుడు స్నేహితుల్లాగానే అర్ధం చేసుకుందుకు ప్రయత్నించాలి. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైన స్నేహబంధాన్ని తల్లీ కూతుళ్ళ మధ్య చూపించారు మాలా కుమార్.
సుజాతకి చిరాకు కోపం ఎక్కువయ్యాయి. సాధ్యమయినంతవరకూ అర్జున్ భార్యని అర్ధం చేసుకుందుకే ప్రయత్నిస్తాడు. కానీ ఏం మాట్లాడినా విపరీతార్ధాలు తీస్తూ, నెత్తిన నీళ్ల కుండ పెట్టుకుని సాధిస్తున్న సుజాతని ఏ విధంగా సముదాయించాలో అర్ధం కాక సతమతమైపోతుంటాడు అర్జున్. కూతురు అఖిలతో తన అసహాయతని చెప్పుకుంటాడు.
ఆడవాళ్లకి నడి వయసులో వచ్చె సహజమైన శారీరిక మార్పుల వల్ల, ఇంటా బైటా అందరూ తనని పట్టించుకోవట్లేదనే అభద్రతా భావం తల్లిని మాంద్యానికి లోను చేస్తోందనీ, ఏదైనా కొత్త వ్యాపకం కల్పించుకుంటే ఆ స్థితి నుంచి బయట పడుతుందనీ తండ్రికి ధైర్యం చెప్పి, అమ్మని పలకరించడానికి వెళ్తుంది అఖిల.
ఇక్కడే తల్లీ కూతుళ్ళ మధ్య ఉన్న, ఉండాల్సిన స్నేహ బంధాన్ని చక్కగా చూపిస్తారు రచయిత్రి. భార్యాభర్తల మధ్యనుండాల్సింది కూడా స్నేహ బంధమేనని, అర్జున్ పడిన వేదనలో భార్యని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడంలో సూచనప్రాయంగా తెలియ జేస్తారు.
మాలా పర్చాగారు ఇప్పుడిప్పుడే రచనలు చేపట్టిన ఔత్సాహిక రచయిత్రి. మంచి భావవ్యక్తీకరణ. చెప్పదలచుకున్న దాని మీద స్పష్టత ఉన్న రచయిత్రి. మరిన్ని కథలు వీరి కలం నుంచి రావాలని ఆశిద్దాము.

3 thoughts on “గుండెకీ గుబులెందుకు! ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

  1. బుర్రకు వ్యాపకం కలిపిస్తే ..ఆత్మనూన్యతనుండి బయటపడవచ్చని తల్లి కోసంకూతురి ప్రయత్నం సఫలం! మలి వయస్సులో మంచి వ్యాపకం గుండె గుబులు తీరుస్తుంది..కథ చాలా బావుంది..మాలతిగారికి అభినందనలు

  2. మీ కథ చదివిన తర్వాత గుండెల్లో గూడు కట్టుకున్న గుబులంతా తీరిపోయింది మాలాకుమార్ గారూ.. చక్కటికథ.. అభినందనలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *