June 14, 2024

బ్రహ్మలిఖితం – 3

రచన: మన్నెం శారద

కార్తికేయన్ గత మూడు రోజులుగా అవిశ్రాంతంగా తాగుతున్నాడు.
నిజానికతనిదివరకెప్పుడు మందు ముట్టలేదు. సిగరెట్టు కూడా తాగే వ్యసనం లేదు. అసలతనికి అలాంటి దురలవాట్లు చేసుకునేంత తీరిక కూడా లేదు.
జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒకే ధ్యేయంతో, ఒకే లక్ష్యంతో గడిపేడతను. ఎపుడైనా అతని ఆశయాల్ని రెచ్చగొడుతూ నిద్ర కమ్ముకునొస్తే అందులో కూడా అతను మృత్యువు వెంబడించి పరిగెడుతున్నట్లుగానో, మృత్యునివారణకి మందు కనిపెట్టినందుకు తనని యావత్ ప్రప్రంచం కొనియాడుతున్నట్లుగానో కలలొచ్చేవి. ఉలిక్కిపడి లేచిపోయేవాడతను.
అంతులేని ఆస్తి వున్నా వెచ్చని డన్‌లప్ పరుపుల మీద వెల్వెట్టు దుప్పటిలో కూరుకుపోయి రజాయి కపుకుని ఏ.సి గదుల్లో అతనెప్పుడూ కమ్మగా నిద్రపోయెరుగడు. నిద్రలోని హాయి గురించి అతని కసలు తెలీదు.
ప్రయోగశాలలోనే రసాయనాల వాసనలు పీలుస్తూ అవిశ్రాంతంగా ప్రాణాలపై ప్రయోగాలు చేస్తూ తలలో నరాలు చిట్లిపోయేంతగా ఆలోచనల్ని మధిస్తూ ఓడిపోయే కొలది గెలుపుని అందుకోవాలనే పంతంతో ఒక యంత్రంలా పనిచేసేడతను.
కుట్టియమ్మాళ్ మరణంతో ఇప్పుడా యంత్రం స్తంభించినట్లాగిపోయింది. తన మేధస్సు మీద తీరని ఆశయమ్మీద మనసు తిరగబడుతోంది. అపహాస్యం చేస్తోంది. పగలబడి నవ్వుతోంది.
ఇన్నాళ్లూ తనలో అణిగిమణీగి ఒక బానిసలా నోరెత్తకుండా పడివున్న మనసు ఒక్కసారిగా తనలో కలిగిన నిరాశ నిస్పృహల్ని గమనించి ఒక ప్రత్యర్ధిలా తనని గేలి చేస్తూ దాడి చేస్తున్నది.
అదే.. భరించలేకపోతున్నాడు.
తన మనసు నుండి తనే పారిపోవాలన్నంత పిచ్చిగా వుందతనికి. అందుకే అవిరామంగా తాగుతున్నాడు.
నాలుకని చేదు, వెగటుగా మార్చిన విస్కీ గొంతులోంచి గుండెలోకి జారి భగ్గుమంటోంది. అయినా అతను పెగ్ మీద పెగ్ తాగుతూనే వున్నాడు. ఎప్పుడో ఏదో ఒక క్షణం తన హృదయం పోగొట్టుకున్న శాంతిని ఆ మందు తెచ్చివ్వగలదనే వెర్రి ఆశతో తాగుతూనే ఉన్నాడు.
గ్లాసులోని విస్కీలో పోసిన సోడా నురుగులో అయిసు ముక్కలు తేలుతూ సయ్యాటలాడుతున్నాయి. వాటికేసి కాస్సేపు తీక్షణంగా చూస్తూ కూర్చున్నాడతను.
ఇంకాస్సేపటిలో కరిగి తమ ఉనికిని కోల్పోబోతూ కూడా తమ జీవితం శాశ్వతమయినట్లుగా గ్లాసు ఉపరి భాగంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డాయి.
వాటి శరీరాలు క్షణక్షణం క్షీణిస్తూనే వున్నాయి. అయినా ఓటమిని ఏ మాత్రం ఒప్పుకోవడం లేదవి.
తను మాత్రమెందుకింతగా కృంగిపోతున్నాడు.
ఒక శీతోష్ణస్థితిలో గడ్డగా మారిన నీటికున్న స్థయిర్యం, బలమూ తనకి లేదా? తనలోని పట్టుదల, నమ్మకం నీరు కారిపోతున్నాయా?
తనకిక గెలుపే లేదా?
తను పూర్తిగా ఓడిపోయినట్లేనా?
కార్తికేయన్ ఎర్రబడిన కళ్లతో ఆఖరి పెగ్ తాగేసేడు.
“సర్!”
“ఎస్!” అన్నాడతను తలెత్తి చూసి.
ఎదురుగా బెదురుగా నిలబడి వున్నాడు బేరర్.
“బార్ క్లోజ్ చేసే టైమయింది” అన్నాడతను వినయంగా.
ఎంత మనస్తాపంగా వున్నా, ఎంత మందు తాగినా అతనిలోని అంతర్లీనంగా వున్న సంస్కారం అతన్ని లేచి నిలబడేట్లు చేసింది.
“ఇట్సాల్ రైట్!” అంటూ జేబులోంచి చేతికందిన నోట్లు ప్లేట్లో పడేసి గ్లాసు డోరు తీసుకుని బయటకొచ్చేడతను.
కొన్ని వందల రూపాయిలు తగలెట్టి తాగిన మందు శరీరాన్ని మాత్రమే బాలన్సు పోగొట్టి తూలేట్లు చేస్తోంది. మనసు మాత్రం అతన్ని చూసి ఇంకా పరిహసిస్తూనే వుంది.
రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.
నియాన్ లైట్లు చుట్టూ దట్టంగా పేరుకొని వున్న చీకటిని వెలుగు కత్తుల్తో చీల్చి చెండాడే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అత్న్ని చూసి రోడ్డు పక్కన డస్ట్‌బిన్ ఓరగా పడుకున్న ఊరకుక్కలు లేచి నిలబడి భౌభౌమని అరిచేయి.
మనిషి ఎంత మానసిక కాలుష్యానికి గురయినా ఈ కుక్కలు మాత్రం తన నైజ గుణమైన విశ్వాసాన్ని, కాపలా తత్వాన్ని మరచిపోకపోవడం అతనికి ఆశ్చర్యం కల్గించింది.
అతను వెళ్లి తన మారుతి థౌజండ్‌లో కూర్చుని స్టార్ట్ చేసి టర్న్ తీసుకుని పంజగుట్ట నుండి జుబ్లీహిల్స్ వెళ్ళే దారికి మళ్ళించేడు. కారు కూడా తూలుతున్నట్లు వంకర్లు తిరుగుతూ జుబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ అవతలనున్న అతనింటి ముందాగింది.
గూర్ఖా గేటు తెరిచి తన విధి ప్రకారం యాంత్రికంగా సెల్యూట్ చేసేడు. కారు చిన్న జెర్క్‌తో వెళ్ళి పోర్టికోలో ఆగింది.
అతను వెళ్లి యింటి తాళం తీసి లైటు వేసేడు.
వెలుగొక్కసారిగా గదంతా పొగమంచులా కమ్ముకుంది. ఎన్నాళ్లగానో శుభ్రం చేయని వస్తువులన్నీ డిమ్ గా తన మనసులానే కళావిహీనంగా కనిపించేయతని కళ్లకి.
అతను వెళ్లి తూలుతూ మంచానికడ్డంగా పడిపోయేడు. ఏదో చెబుదామని వచ్చిన గూర్ఖా అతని పరిస్థితి గమనించి తలుపు దగ్గరగా వేసి గేటు దగ్గర చతికిలబడ్డాడు బీడీ కాలుస్తూ.

**********

లిఖిత మెల్లిగా తల్లి గదిలోకెళ్లింది.
ఆమె తన గదిలో ఎత్తయిన స్టూలు మీద కూర్చుని డ్రాయింగ్ బోర్డుకి బిగించిన షీటు మీద టీస్క్వేర్ మీద సెట్ స్క్వేర్ పెట్టి ఏదో గీతలు గీస్తోంది.
“అమ్మా” అంటూ మెల్లిగా పిలిచింది లిఖిత.
“ఊ” అందామె తలెత్తి చూడకుండానే..
ఆమె చాలా ఏకాగ్రతగా పని చేస్తున్న విషయం గమనించింది లిఖిత.
గీసిన గడులలో చిత్రమైన బొమ్మలతో నింపుతోంది కేయూరవల్లి
“ఏంటివి?” అనడిగింది తనూ డ్రాయింగ్ బోర్డుని ఆనుకుని నిలబడి చూస్తూ.
“మన శారీస్ మీద ప్రింట్ చేయడానికి కొత్త డిజైన్స్ తయారు చేస్తున్నాను. బాగుందా?” అనడిగింది కేయూర.
“ఊ” అంది లిఖిత.
“మొన్న మనం సింగపూర్ ఎక్స్‌పోర్టు చేసిన స్టాకు పది రోజుల్లోనే అమ్ముడుపోయిందంట., మళ్లీ కావాలని ఆర్డర్సు వచ్చేయి. అక్కడే కాదు యూరప్ దేశాల్లో కూడా మన చీరల మీద క్రేజ్ చూపిస్తున్నారని లెటర్రాసింది మల్హోత్రా. అందుకే నేను శ్రద్ధ తీసుకుని ప్రత్యేకించి ఈ నమూనాలు తయారు చేస్తున్నాను” తల్లి మాటల్లోని ఉత్సాహాన్ని గమనించింది లిఖిత.
“కంగ్రాట్స్, ఇంతకీ నీ ట్రేడ్ సీక్రెట్ ఏంటీ?” అనడిగింది నవ్వుతూ..
“అది చెప్పకూడదు” అంది కేయూర తను కూడా నవ్వుతూ.
“నాక్కూడానా?” అంది లిఖిత మొహం ముడిచి.
కేయూర ఆమె బుగ్గలు సాగదీసి “అసలేం లేదు చెప్పడానికి. క్వాలిటి, నావెల్టీ, మోడరేట్ రేట్సు నా వ్యాపార లాభానికి ముఖ్య సూత్రాలు” అంది.
“అంతేనా?” ఆశ్చర్యం ప్రకటించింది లిఖిత.
“ముమ్మాటికీ అంతే!” కస్టమర్లెప్పుడూ నాణ్యత చూస్తుకుంటారు. రెండోది ప్రతిక్షణం అతి వేగంగా మారుతున్న ఫాషన్స్‌ని దృష్టిలో పెట్టుకుంటే మన సరుకు నిలబడిపోయే సమస్య వుండదు. కంచివారు దాదాపు మన దేవాలయాల మీదున్న చెక్కడాలన్నీ తమ చీరల డిజైన్స్‌గా వాడేసుకున్నారు. అందుకే నేను వాటి జోలికి పోవడం లేదు. అంటే పూర్తిగా కాదు. మొన్న నేను రోమ్ వెళ్లినప్పుడు అక్కడ శిల్పకళ తీరు గమనించి వాటి నమూనాలు తెచ్చేను. అందులో కొంత భారతీయత మేళవించి సరికొత్త డిజైన్స్ తయారు చేసేను. దాంతో వీటికి బాగా క్రేజ్ పెరిగింది. ఇకపోతే అత్యధిక లాభాలు పొంది కస్టమర్‌ని బిచ్చగాణ్ణి చేయడం కాదు నా ఉద్దేశ్యం. నా ఫాక్టరీలో పని చేసేవారికి తగినంత జీతాలివ్వగల స్థాయిలో వుంటే చాలు నా లాభాలు. నువ్వొక్కదానివి. డబ్బు రాసులు చేసి మనీని సర్క్యులేషన్‌కి దూరం చేయడం నా అభిమతం కాదు”. తల్లి ఆలోచనా సరళికి నిజంగానే ఆశ్చర్యపోయింది లిఖిత.
ఆమెలో ఒక అద్భుతమైన వ్యాపారవేత్తే కాకుండా ఒక నిజాయితీ అయిన హృదయం కూడా వుందన్న నిజాన్నామె గ్రహించింది.
“కాని.. అమ్మా?”
“చెప్పు”
“నా ఒక్కదానిక్ కోసమింత కష్టపడటం దేనికి? ఇంత అందమైన చీరలు తయారు చేసి అందులో ఒకటి కూడా కట్టవు. పగలూ రాత్రి కష్టపడి ఆ జుట్టు చూడు. తెల్లబడిపోతున్నది” అంది లిఖిత తల్లి నుదుటి దగ్గర తెల్లబడిన వెంట్రుకలు లాగుతూ.
కేయూర లిఖిత చేతిమీద కొట్టి రేగిన జుట్టు వెనక్కి తోసుకుంటూ “వయసొస్తే వంకరకాళ్లు తిన్నవవుతాయంటారు. వయసు ముదిరితే తిన్నగా వున్న కాళ్ళు వంకర తిరుగుతాయి. దీని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతిక్షణం మనిషికి వద్దన్నా పెరిగేది వయసే. వయసు అందం గురించి కాకుండా మనం మన జీవితకాలంలో ఎవరో సంపాదించి తిండి పెడితే తిని తిన్నదరిగేదాకా నిద్రపోకుండా ఏదైనా సాధించగలమా అని ఆలోచించాలి. ప్రతి మనిషి ఏదైనా సాధించి తీరాలి. అదే మనిషికి నిజమైన అందం.. ఆభరణం” అంది.
“దేర్ యూ ఆర్!” అంది లిఖిత చప్పట్లు చరుస్తూ.
” ఈ మాటలకేం గాని అసలు నువ్వు నా గదిలోకొచ్చిన పనేంటీ?”
” నా బి.ఏ. అయింది. ఇప్పుడేం చేయమంటావో నీ సలహా అడగాలని”.
“ఇందులో నా సలహా ఏముంది. నీ అభిరుచికి తగ్గట్లుగా ఏదైనా ఎంచుకో. లేదా నా మిల్స్‌లో చేరిపో”.
తల్లి మాటలకి ఉలిక్కిపడింది లిఖిత.
“అమ్మో అది నా వల్ల కాదు. ఏదైనా విభిన్నమైన పని చేసి పేరు తెచ్చుకోవాలనుంది”.
ఆ మాట వినగానే కేయూరవల్లి మొహంలో రంగులు మారేయి.
“విభిన్నమంటే?” అనడిగింది సూటిగా.
లిఖిత వెంటనే బుర్ర గోక్కుంటూ “అదే అర్ధం కావడం లేదు. నేనేం చేద్దామన్నా అవన్నీ ఎవరో ముందుగానే చాలా తొందరపడి చేసేసేరు. నేనిప్పుడేం చేయాలి?”
“భోజనం” బయట కాలింగ్ బెల్ మోగడంతో లేచి హాల్లో కెళ్లింది కేయూరవల్లి. లిఖిత కూడా నవ్వుతూ ఆమె వెంట నడిచింది.
కేయూర తలుపు తెరిచి ఎదురుగా నిలబడి వున్న వ్యక్తిని గుర్తుపట్టలేక తికమకగా చూసింది.
“నమస్కారం నా పేరు మీనన్” అన్నాడతను.
“మీనన్ అంటే..” ఆమె గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించింది.
“నేను మీకు తెలియను. నా భార్య కుట్టియమ్మాళ్ మీతో కలిసి చదువుకుంది. ఆవిడ మీకు గుర్తుందో లేదో..!” అన్నాడతను.
కేయూర కుట్టియమ్మాళ్ గురించి ఆలోచిస్తూనే”రండి. కూర్చోండి.లిఖితా అంకుల్‌కి మంచినీళ్లు తెచ్చిపెట్టు” అంది.
లిఖిత లోనికెళ్లింది.
“కుట్టి మీ బెంచ్‌మేటంట. చాలా పెద్ద జడ వుందని మీరు బెంచి కేసి కట్టేవారంట ఒకసారి మీరు..”
“ఇక చెప్పకండి. నాకు గుర్తొచ్చింది. తను క్లాసు ఫస్టు. మంచి హేండ్ రైటింగ్. బెస్టాఫ్ ది బాచ్ అని ప్రిన్సిపాల్ పొగిడేవారు. ఎలా వుందిప్పుడు. తనని కూడా తీసుకురాలేకపోయారా?” అనడిగింది కేయూర ఉత్సాహంగా.
మీనన్ విచారంగా మొహం దించుకుని “ఆ అవకాశం నాకివ్వకుండానే తనెళ్లి పోయింది” అన్నాడతను.
కేయూర మొహం మ్లానమైంది. “సారీ” అంది మెల్లిగా.
“ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమి లేదు. ఆమె పదేళ్ళుగా మంచంలో తీసుకుంటున్నది. పోయి సుఖపడింది” అన్నాడాయన నిర్లిప్తంగా.
అన్ని అనుభూతులకి అతీతమైనట్లుందతని మొహం.
ఇంతలో లిఖిత మంచినీళ్లతో పాటు కొన్ని స్నాక్స్, టీపాట్ కప్పు కూడా ట్రేలో తెచ్చిపెట్టింది.
కేయూరకెలా మాటలు పెంచాలో తెలియలేదు.
అతనది గ్రహించినట్లుగా “నేనొచ్చిన పని నా కుట్టి మరణవార్త చెప్పాలని కాదు మీతో కొద్దిగా కార్తికేయన్ గురించి మాట్లాడాలి!” అన్నాడతను కేయూరవల్లి మొహంలోకి నిశితంగా చూస్తూ.
ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది కేయూరవల్లి.
మొహంలో రకరకాల రంగులు మారడం స్పష్టంగా కనిపించింది.
వెంటనే ఆమె లిఖిత వైపు తిరిగి “వెంకట్ ఎందుకో ఫోను చేసేడు నీ గురించి. నేను చెప్పడం మర్చిపోయేను” అంది.
లిఖితకి తల్లి మనసు బాగా తెలుసు.
వారిద్దరి సంభాషణ వినకూడదనే ఉద్దేశ్యంతోనే తల్లి తనకా మాట చెప్పిందని గ్రహించి గదిలోకెళ్ళి చున్నీ వేసుకుని, స్లిప్పర్స్ తొడుక్కుని “వస్తానంకుల్” అంటూ బయటకెళ్లి పోయింది.
“అమ్మాయచ్చం తండ్రి పోలికే. ఇప్పుడు చూస్తే అతను చాలా సంతోషపడతాడు” అన్నడు మీనన్.
” ఆ సరదాలతనికి లేవు” అంది కేయూర వేళ్ళు విరుచుకుంటూ ఉదాసీనంగా.
చాలా సంవత్సరాలుగా భర్తకి దూరంగా వుంటున్న ఆమె భర్త పేరు వినగానే అతని వివరాలు వినాలనే ఆసక్తి చూపుతుందని అతనాశించేడు. కాని ఆమె ఏ భావాన్ని ప్రదర్శించడం లేదు.
“మీకో సంగతి చెప్పాలని వచ్చేను”
ఆమె ఏమిటన్నట్లుగా చూసింది.
“అతను కేరల వెళ్తున్నాడు”
ఎందుకని ఆమె ప్రశ్నించలేదు.
“అతను టోటల్‌గా ఫెయిలయ్యేడు”
” ఆ సంగతి ఏనాడో ఆయనకి చెప్పేను. అసలా ప్రయత్నమే తప్పని.. ఇప్పటికయినా తెలిసొచ్చిందా దేవుడితో పోరాటం హాస్యాస్పదమని!”
“లేదు. తెలిసొస్తే అతను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవాడు. ఇప్పుడతను తను చదివిన చదువుని, మేధస్సుని తుంగలో తొక్కి ఒక నిరక్షర కుక్షయిన మాత్రికుణ్ణి, క్షుద్రోపాసకుణ్ణి ఆశ్రయించబోతున్నాడు. అతనికి తెలుసట మృత్యుంజయ విద్య” అన్నాడు మీనన్.
“వెళ్లనివ్వండి. ఇపుడు మనం చేయగలిగిందేముంది?” అంది కేయూరవల్లి.
మీనన్ ఆమెవైపు తడబాటుగా చూశాడు.
“అంతలా తీసేయకండి. ఎంతయినా అతను మిమ్మల్ని అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త. ఇప్పుడతను చిక్కుల్లో పడబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల కృషి బూడిదలో పోసిన పన్నీరవడంతో అతను బాగా కృంగిపోయేడు. అయినా దారి లేదని తెలిసి కూడా గోడకేసి తలబాదుకునే తత్వం అతనిది. ఇక లాబరేటరీలో చేయగలిగిందేమీ లేదనే నిర్ణయాన్ని సడలించొచ్చు. కేరళ రాష్ట్రంలో ఎంత విద్యాధికులున్నారో అంత క్షుద్రోపాసకులు కూడా వున్నారు. అక్కడికెళ్తే అసలతను మనిషిగా తిరిగి రాకపోవచ్చు. దయచేసి మీరు తొందరగా బయల్దేరండి” అన్నాడు మీనన్ ప్రాధేయపూర్వకంగా.
కేయూర నిర్లక్ష్యంగా నవ్వింది.
“అగ్నిసాక్షి! పెళ్ళి! ఆ పదాల అర్ధం మీ స్నేహితుడికి తెలుసా? అర్ధం తెలియని మంత్రాలతో ఊదరగొట్టి అసలు నెత్తిన జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో, మంగళసూత్ర ధారణ దేనికో వాటి పరమార్ధమేమితో తెలియకుండా చేసే మన దౌర్భాగ్యపు వివాహ సాంప్రదాయపు విరిగిన శిధిల ఫలకం మా పెళ్లి. నేనాయన్ని ప్రేమించేను. అతనితో జీవితం గడపాలని ఆశించేను. అతని కష్టాల్లో పాలుపంచుకోవాలని అతన్ని సుఖపెట్టాలని, అతనికోసమే బ్రతకాలని వెర్రి కలలు కన్నాను. అతను ఒక్కరోజు కనిపించకపోతే ఎంతగా ఎదురు చూసేదాన్నో, అతని ఆనందం కోసం ఎన్ని త్యాగాలకి సిద్ధపడేదాన్నో నాకింకా బాగా గుర్తున్నాయి. కాని అతను నా చిన్న చిన్న ఆశలు నిర్ధాక్షిణ్యంగా త్రుంచేసేడు.. నావి చాలా చిన్న చిన్న కోరికలు. తీర్చలేనివి కావు. నన్ను కూడా అతను గుర్తించాలని … నేను అతని కోసం చేసే పనుల్ని మెచ్చుకోవాలని .. నాకో బాగోలేకపోతే అతను ఆత్రం చూపాలని. కాని నేను కట్టుకున్నదొక అనుభూతులెరుగని రాయిని. అతనెలా నా కోరికలు తీర్చగలడు. నా మనసు పూర్తిగా విరిగిపోయింది. విశాఖపట్నానికి హైద్రాబాదు రైలు ప్రయాణమైతే ఒకరాత్రి దూరం. విమానమైతే ఒక గంట. కాని మేమిద్దరం విడిపోయేక ఈ ఇరవై సంవత్సరాలలో తిరిగి కలవలేదంటే .. అసలు కలిసే ప్రయత్నమే చెయ్యలేదంటే మా మనసులెంత విరిగిపోయాయో దయచేసి ఆలోచించండి మీనన్‌గారూ!” అంది గంభీరంగా.
ఆమెని చూస్తే అతనికి వింతగా అనిపించింది.
భర్త ఆరడి పెట్టినా, విడాకులు తీసుకుని రెండోపెళ్ళి చేసుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో దూరంగా వుండాల్సొచ్చినా భర్త గురించి తెలియగానే ఆందోళన పడే స్త్రీల శాతమే అతనికి తెలుసు.
కాని… ఈవిడిలా మాట్లాడుతున్నదేమిటి?
కార్తికేయన్ మాత్రం ఏం చేసేడూ?
మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడా?
ఈమెని అగౌరవపరిచేడా?
కేవలం ఒక అకుంఠిత దీక్షతో మాత్రమే ప్రయోగశాలకి అంకితమయ్యేడు.
అతను మాత్రం ఏం సుఖపడ్డాడు.
ఆమెకింకెలా చెప్పాలో అర్ధం కాలేదతనికి.
లేచి నిలబడ్డాడు చేతులు జోడిస్తూ.
“నేను చెప్పవలసింది చెప్పేను. మీకు మీ భర్తను వదిలేసే హక్కుంది. అది కాదనను. కాని అమ్మాయికి తండ్రి కావాలనిపించొచ్చు. ఒక్కసారి అమ్మాయిని పంపితే ఆయన నిర్ణయం మారొచ్చు. ఇప్పుడే నిజంగా ఏ స్త్రీకయినా భర్త నీడలో బ్రతకాల్సిన టైము. అతను కూడా నిష్ప్రయోజనమైన నిర్విరామ శృమ పడిపడి డస్సిపోయేడు. అతనిప్పుడు మీ అనురాగాన్ని ఏమాత్రం వదలుకోలేడు. వస్తాను”
అతను వెళ్తుంటే ఆమె మలచిన రాతి శిల్పంలా నిలబడిపోయింది ఎంతోసేపు భావరహితంగా.

**************

1 thought on “బ్రహ్మలిఖితం – 3

  1. వయసొస్తే వంకరకాళ్లు తిన్నవవుతాయంటారు. వయసు ముదిరితే తిన్నగా వున్న కాళ్ళు వంకర తిరుగుతాయి. దీని గురించి అంత బెంగపడాల్సిన అవసరం లేదు. ప్రతిక్షణం మనిషికి వద్దన్నా పెరిగేది వయసే. వయసు అందం గురించి కాకుండా మనం మన జీవితకాలంలో ఎవరో సంపాదించి తిండి పెడితే తిని తిన్నదరిగేదాకా నిద్రపోకుండా ఏదైనా సాధించగలమా అని ఆలోచించాలి. ప్రతి మనిషి ఏదైనా సాధించి తీరాలి. nice lines (Y)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *