June 14, 2024

మూడంతస్తులు ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన:ఆదూరి హైమవతి

 
“ఏరా ! రాఘవ్ ! ఎవడు వాడు? ” ” మా క్లాస్ మేట్ నాన్నా! అన్నిట్లో ఫస్ట్ ! నా బెస్ట్ ఫ్రెండ్ !. వాసయ్య, ” ” ఏంటీ వాసయ్యా! ఏంట్రా ఎవర్నంటే వాళ్ళని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నావ్!” ” డైనింగ్ టేబుల్ మీద కాదు నాన్నా! కుర్చీల మీదేగా మేమిద్దరం కూర్చున్నాం! ” “చాల్లే జోకులు, ఆ డైనింగ్ టేబుల్ ఖరీదెంతో తెల్సా? ” ” ఎంతైతేనేం? మా స్నేహం విలువకంటే తక్కువే నాన్నా!” ” వెధవా! అలగా వారినంతా ఇంట్లోకి తెస్తావా?” ” ఎవరునాన్నా! అలగా కందిపప్పులో కేసరి పప్పూ కల్తీ, మంచి నూనెలో కంపుకల్తీ, కారప్పొడిలో కల్తీ, మిరియాల్లో కల్తీ, చివరకూ పసిపిల్లలు త్రాగే పాలలోనూ కల్తీ ! ఎవరు నాన్నా అలగా ! సంపూర్ణ ప్రేమ హృదయంతో, మనసుకు మన సిచ్చి ఆపదలో, అవసరంలో ఆదుకుని నాకు ఆరోగ్యం బావోలేనపుడు నా నోట్సులన్నీ వ్రాసి పెట్టను నా కోసం తాను నిద్ర మానుకుని సహాయం చేసిన నా ఫ్రండ్ ను ఒక్క మాటంటే ఇహ ఊరుకోను. ” “సమానస్తులతో స్నేహం చేయరా! నేనేమీ అనను. మనది మూడంత స్తుల ఖరీదైన మేడ ! వీళ్లంతా ఉండేది పూరిళ్ళలో. అలాంటి వారిని మన మేడలోకి తెస్తే మన పాలరాతి నేల ఏమై పోతుందిరా!… ” “ఆపు నాన్నా! మూడంతస్తుల మేడ, మూడంతస్తుల షాపూ, నేలలోకి మూడంతస్తుల గోడౌన్ !ఇవన్నీ ఎంత మంది అంతస్తులు కూల్చి సంపాదించినవి నాన్నా! ఇంటి అంతస్తులు కాదు నాన్నా లెక్కించాల్సింది. మనస్సు లోని విలువలను. వీళ్లకున్న అంతస్తులేంటో తెల్సా నాన్నా! అప్యాయత, అనురాగం, అదరణ. ఆ అంతస్తులు మనకు లేనే లేవు. రావు కూడానూ, డబ్బులతో కొలిచేవి మనవి. మనస్సుతో కొలిచేవి వీరివి. ”
” ఏరా ఇదేనా నీవు నేర్చుకునేది, తండ్రికి ఎదురు చెప్తావా! వెధవా!” ” నాన్నా ! మీరూ నేర్చుకోండి !టీనేజ్ లో ఉన్న కొడుకుతో ఎలా ప్రవర్తించాలో. లేదా వీళ్ళ ఇంటికి రండి, వారంతా వాసయ్యతో ఎలా ప్రవర్తిస్తారో! అన్యాయంగా గడ్డి కరిచి సంపాదించే ధనం కాదు నాన్నా కావల్సింది ప్రేమగా పలకరించే పిలుపు. “ ” ఏరా మాటకు మాట చెప్తావ్ ? ” ” అంతే నాన్నా! మీకు తెలీనపుడు చెప్పక తప్పదు కదా!ముందుగా యదార్ధం, మంచితనం నేర్చుకోండి ! రారా !వెళదాం ఇది ఇల్లు కాదురా! వ్యాపార కేంద్రం. “అంటూ విసవిసా స్నేహితునితో కలసి వెళుతున్నపదో క్లాస్ చదువుతున్నకొడుకు రాఘవ్ ను వింతగాచూస్తూ ఉండిపోయాడు ఉమేశ్వర్రావ్. ఆయన పిసినారి తనం చూసి అంతా ఆయన్ని ‘ఉమ్మే శ్వర్రావ్ ‘ అని హస్యంగా పిలుచుకుంటుంటారు. మహా పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని తరమడని, ఉమ్మికూడా ఊయడనీ, చెప్పుకుంటారు.
ఉమేశ్వర్రావు తండ్రి తాతలు చాలా పేదవారుట. వారిని నమ్మినవారి ఆస్థి పాస్థులు కాజేసి సంపాదించి ఇప్పుడు ఇలా మూడంతస్తుల భవనంలో ఉంటున్నారుట. గతం మరచిపోయి పేదవారంటే పడని మనస్తత్వం అలవరచుకున్నారు. తాము చాలా ధనవంతులమని గర్వం తల కెక్కి కిక్కిస్తున్నది ఆయనకు. ఆయన దర్జా, దర్పం ఆయన ఇంట్లో పని చేసేవారి పట్ల చూసే చిన్నచూపూ అందరికీ తెల్సు. ఆయన ఇంట్లో, గోడవున్లలో మూలిగే ధాన్యం, పప్పులూ, నల్ల ధనం వెల కట్ట లేనివని అంతా అనుకుంటారు. కాలం భగవత్ స్వరూపం కనుక ఆ కాల దైవమే ఆయనకు బుధ్ధి చెప్తుందని కూడా జనసామాన్యం భావన. అందరి మాటలూ వింటున్న కొడుకు రాఘవ్ తండ్రి ప్రవృత్తి పట్ల ఏహ్యత చెందాడు, కానీ తానింకా చిన్నవాడు కనుక చేసేదేం లేదని నిట్టూరుస్తూ తన విద్యాభ్యాసంలో మునిగిపోతుంటాడు. ఎక్కువ సమయం తన ప్రాణ మిత్రుడైన వాసయ్య తోనే స్కూల్ లైబ్రరీలోనో, గ్రంధాలయంలోనో గడుపుతుంటాడు. వాసయ్య తండ్రి ఒక కూలీ. తల్లికూడా కూలీనాలీ చేసి ఉన్న ఒకే ఒక్క కొడుకునూ బాగా చదివించి తమలా కాక మంచి స్థాయిలో చూడాలని ఆకాంక్షిస్తుంటుంది. అదే వారి ఏకైక కోరిక. అందు కోసం రాత్రింబవళ్ళూ శ్రమిస్తుంటారు వారిరువురూ. నరసింహస్వామి ఆలయం ఉన్న గుట్టమీది ఒక పేద కాలనీ వారిది. ఒక గుట్టమీద చుట్టూ గుడెసెల్లా, చిన్న చిన్న తాటాకు పాకాలు అన్నీ. వాటిలో నివసించే వారికి ధనం లేకపోవచ్చు కానీ దాన్ని మించిన మంచి మనసుంది. ప్రేమ ఉంది. స్నేహ భావన ఉంది. అంతా తమ బిడ్డల బాగు కోసం శ్రమించే వారే. తమ గుట్టమీది నరసింహస్వామి ఆలయంలో ఉచితంగా సేవలు చేస్తూ స్వామి వారి కృపకు పాత్రులైన మంచి మనసున్న మానవులు వారంతా. నరసింహస్వామి మీది భయమో భక్తోకానీ అంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ కుటుంబాల కోసం శ్రమించేవారే. రాత్రైతే చాలు తమకు వచ్చిన భక్తి పాటలు పాడుకుంటూ శ్రమను మరుస్తుంటారు.
వారిలో కొందరు పక్కనే ఉన్న బాహుదా నదిని పడవల్లో అటూ ఇటూ వెళ్ళేవారిని దాటించే పడవవారూ ఉన్నారు. బజారు షాపుల్లో తోపుడు బండ్లలో షాపుకు గోడవున్ల నుంచీ వస్తువులూ సరంజామా చేరవేసే వారూ ఉన్నారు. రోజంతా శ్రమించి రాత్రులు హాయిగా భజనలూ, పాటలూ పాడుకుంటూ శ్రమ మరుస్తుంటారు. వారిదంతా ఒకే మాట, ఒకేబాట. వారెప్పుడూ తమ స్థితికి చింతించరు, బాధపడరు. తమ సంతానాన్ని మాత్రం తమలా కాక బాగా విద్యావంతులను చేయాలనే ఒకే ఒకే సంకల్పంతో జీవిస్తున్నవారు. నగరంలో చాలా మంది వారి సత్ప్రవర్తనకు కారణం ఆ నరసింహస్వామి మహత్యమే అని భావించే వారు. కాలం గడుస్తున్నది. ఎవరి ఆశయాలు వారు నెరవేర్చుకు నేందుకు వారి శక్తి కొద్ది శ్రమిస్తున్నారు. కాలం అతి చిత్రమైనది. కోరిన వారికి కోరి నది ఇవ్వకపోవచ్చు, ఇవ్వనూ వచ్చు. కాలం కొందరికి కలిసి వస్తుంటుంది, మరి కొందరిని కసిగా కాలనాగులా కాటేసి విసిరి కొడుతుంటుంది. వారి వారి కర్మ వశం కొద్దీ ఫలితాలు జరుగు తుంటాయి, దీనికి ఎవ్వరూ బాధ్యులూ కారు కర్మ వశులు మాత్రమే. అందుకే అంటారు పెద్దలు ‘సత్కర్మలతో, సత్సంగంతో, సద్భావనలతో రానున్న కాలానికి సత్ఫలాన్ని దాచుకోమంటారు. ఐతే ఆ మాటలు పట్టించుకుని పాటించే వారెందరు నేడు ? ‘ కాలమొక్కరీతి గడువదెపుడు ‘- అన్నట్లుగా వర్షాకాలం వచ్చింది. వర్షాలు బాగా కురిస్తేనే కదా!పంటలు, వంటలు. గాదెలు నిండి ఆకలి బాధలూ తీరేదీ! వర్షాలు బాగా కురవసాగాయి. అవి ఎక్కువై వరదలు వచ్చాయి. వీధులు నిండిపోయాయి, జనాలబాధలుఎక్కువయ్యాయి. రాత్రిం బవళ్ళూ వానలే. పేదలు వర్షం వల్ల వచ్చిన చలికి తమ చిన్ని గుడిసెల్లో వణుకుతుంటే, ధనవంతులు తమ భవనాల్లో హాయిగా రగ్గులు, రజాయిలు కప్పుకుని, హీటర్లు వేసుకుని గాఢనిద్రలో ఉన్నారు. పవర్ కట్టైంది. హీటర్లు ఆగిపోయాయి. అంతా చీకటి. లైట్లు లేవు. అలాగే కరెంటు కోసం ఎదురు చూస్తూ వెచ్చగా పడుకునే ఉన్నారు, కొందరు గాఢ నిద్రలో, మరికొందరు మేలుకుని. . ఆ ఘోర కరాళ రాత్రిలో ఉన్నట్లుండి ఆనగరం చుట్టూ ఉన్న 3 చెఱువుల గట్లు తెగి పోయాయి. వరదలు, నీటి ప్రవాహాలు.. ఏం జరుగు తున్న దో తెలీకుండా, తెలుసుకునే లోగానే జలప్రవాహం పెరిగి పోయింది. వీధులన్నీ నీటిమయం. ఆ జల ప్రవాహానికి ఆ వేగానికి పెద్ద ప్రళయం వస్తు న్నట్లు భయంకర మైన శబ్దం, ఆ శబ్దానికి పెద్ద భవంతులలోని వారంతా ఆ కటిక చీకట్లో ఏం జరుగు తున్నదో తెల్సుకునేలోగానే ఇంటి తలుపు లు ఫెళఫెళ మంటూ విరిగి పోయి భవంతులన్నీ నీటితో నిండిపోయి, ఇళ్ళలోని ఖరీదైన వస్తువులన్నీ నీటిలో తేలసాగాయి. రెండో అంతస్తువరకూ నీరు వచ్చి చేరింది. జల ప్రవాహ వేగానికి ఆశబ్దానికి అందరి గుండెలూ గడగడలాడసాగాయి, అంతా ప్రాణ భయంతో ఒణికి పోసాగారు. ఉమేశ్వర్రావ్ చుట్టు పక్కల అన్నీ పెద్ద భవంతులే, అందరి కంటే పెద్ద దైనది మూడంతస్తుల భవనం ఉమేశ్వర్రావ్ ది. ఎంత పెద్దదైతేనేం నీరు రెండో అంతస్థు వరకూ వచ్చేసింది. పడగ్గదులన్నీ నీటితో నిండిపోయి, మంచాలూ పరుపులూ తడిసిపోయాయి. ఇంటిలో వారంతా అసహాయంగా వణికి పోసాగారు. మూడో అంతస్తుకు భార్యా, ముదుసలి తల్లీ తండ్రీలతో, కొడుకు రాఘవ్ సాయంతో వెళ్ళాడు. చలి కంటే ప్రాణభయంతో వణుకుతూ, కనపడని దేవుని మనస్సులో ప్రార్ధిస్తూ సాయంకోసం పెద్దగా అరవసాగారు అంతా ‘ హెల్ప్ హెల్ప్ ‘ అంటూ ఎక్కడ చూసినా కటిక చీకటి, అరుపులు. చేతులు పట్టుకుని ఆ ధనికుడైన ఉమేశ్వర్రావు కుటుంబం సాయంకోసం పెద్దగా అరుస్తూ ఆ రాత్రంతా ఓపెన్ టెర్రేస్ లో గడిపారు. తెలతెలవారుతుండగా చుట్టూచూస్తే అంతా జలమయం. సముద్రం పొంగి వచ్చినట్లూ, తాము సముద్రం మధ్యలో ఉన్నట్లూ వారికి అనిపించింది. అది చూసి ఇంకా భయం ఎక్కువైంది ఉమేశ్వర్రావ్ కు ముఖ్యంగా. తన ‘ధాన్యం దాచిన గోడవున్ ఏమై ఉంటుంది, తన నల్లధనం దాచిన నేల మాళిగ ఏమై ఉంటుందీ ? ‘ అనే ఆవేదన, ప్రాణ భయంకంటే అధికమైంది. క్రింద కెళ్ళి చూడాలనే ఆత్రంతో మెట్లు వెతుక్కుంటూ దిగ బోయాడు. నీటిలో పడి ప్రవాహ వేగానికి కొట్టుకు పోసాగాడు. పైనుంచీ అంతా అరుస్తుండగా, ఇంతలో ఏం చిత్రం జరిగిందో కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి అతడి నడుం పట్టుకుని లాక్కెళ్ళి ఒక బోటులో వేశాడు. ఆతర్వాత ఒక్కొరినీ పట్టుకెళ్ళి బోట్లోకి చేరవేసారు. నరసింహ స్వామి ఆలయం ఉన్న గుట్ట మీదికి అందరినీ చేర్చారు. ఆ అన్ని గుడిసెల్లో నిండా మనుషులే అంతా నిరాశ్రయులే. వాసయ్య రాఘవ్ ని చూసి తన ఇంట్లోకి వారినందరినీ సాదరంగా ఆహ్వానించాడు. విధీ దిక్కూలేక లోపలి కెళ్ళి వారిచ్చిన పొడి బట్టలు కట్టుకుని, వారు అందించిన చాయ్ త్రాగారు అంతా. ఉమేశ్వర్రావ్ అయోమయంగా వారిని చూస్తూ చలికి గజగజా వణక సాగాడు. అది చూసి కొద్ది క్షణాల్లోనే వాసయ్య వారి ముందు భగభగ మండుతున్న నిప్పుల కుంపటి ఉంచాడు. ఆ వేడికి చలి కాచు కుంటూండగా రాఘవ కుటుంబానికంతా పొగలు గక్కుతున్న వేడి వేడి ఇడ్లీలుంచిన పేపర్ ప్లేట్లు అందించాడు వాసయ్య. రాఘవ వాసయ్యను కౌగలించుకుని ” వాసూ! వదరలో కొట్టుకు పోతున్న మా నాన్నప్రాణమే కాక మా అందరినీ కాపాడార్రా! మీ కుటుంబం ఋణం మేము ఎప్పటికీ తీర్చుకోలేమురా! చలికి వణికే వారికి పొడిబట్టా, ఆకలికి అల్లాడేవారికి ఇంత తిండి పెట్టి కాపాడిన మీరంతా దేవుళ్ళురా! మేము ఉత్త స్వార్ధ పరులం రా! మాకు మూడంతుస్తుల భవనం ఉంది కానీ ఇప్పుడు ఆ అంతస్తులన్నీ నీళ్ళోలోనే ఉన్నాయిరా! మా ఖరీదైన డైనింగ్ టేబుల్, పాలరాతి నేల అన్నీ నీళ్ళలోనే ఉన్నాయిరా! మాకు కట్టుకోను ఇప్పుడు బట్టలు కూడా లేవు. మీ మూడంతస్తులు మాత్రం పది లంగా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయిరా! ఇంకా ఇంకా ఎత్తుగా ఎదిగాయిరా!ఏం నాన్నా ! ఎవరి అంతస్తులు ఎత్తైనవి? వారివా? మనవా?” అంటున్న కొడుకును చూస్తూ తలదించుకున్నాడు ఉమ్మేశ్వర్రావు కళ్ళనిండా నీరు కారుతుండగా.
రచన— ఆదూరి. హైమావతి.

విశ్లేషణ: డా.మంథా భానుమతి

మూడంతస్ఠుల మేడలో ఉండే ఉమ్మేశ్వర్రావు కొడుకు రాఘవ, గుడిసెలో ఉండే వాసయ్యతో స్నేహం సహజంగానే తండ్రికి నచ్చదు. వరద ముంచుకొచ్చి, మునిగిపోతుంటే ఉమ్మేశ్వర్రావుని కాపాడి, వారి కుటుంబానికంతకీ ఆశ్రయమిచ్చిన వాసయ్యని, అతని తల్లిదండ్రులనీ అర్ధం చేసుకుని, స్నేహాని ఉండవలసింది డబ్బు కాదనీ, హృదయం అనీ తెలుసుకున్న ఉమ్మేశ్వర్రావు చివర్లో క్షమార్పణ అడగడం సబ్బుగా ఉంది.
ఆదూరు హైమవతిగారు పేరు పొందిన రచయిత్రి. స్పష్టమైన వివరణ ఆవిడ శైలిలో కనిపిస్తుంటుంది పాఠకులకి. పిల్లల కథలు రాయడంలో ఆరి తేరారేమో.. సరళంగా చెప్తారు ఏ కథనైనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *