June 14, 2024

స్నేహ బంధం ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

రచన: మాలతి దేచిరాజు

మనిషి స్వార్ధ పరుడు., , కానీ నాకెందుకోఅలా అనిపించదు. ఎవడి బ్రతుకు వాడు బ్రతకడానికి ప్రయత్నిస్తాడు ఇందులో స్వార్ధమేముంది., !మనకు అవసరానికి ఉపయోగపడనంత మాత్రాన స్వార్ధపరుడేనా., ? కానీ., మన దగ్గర సహాయం పొంది మనకు అవసరమున్నప్పుడు సహాయపడకపోతె అది స్వార్ధమే కదా., ! కేవలం తమ అవసరాలకి అక్కున చేరే వాళ్ళని స్వార్ధపరులే అనాలి మరి., అని అనుకుంటూ అచేతనమైన చూపుతో ఆకాశం వైపు చూస్తున్న “రవి” కళ్ళకి అప్పుడే ఒక చెట్టు కొమ్మపై వాలిన కాకి కనిపించింది. రవి ఆ కాకి వైపు తదేకంగా చూస్తున్నాడు.,
ఆకాశంలో నీలిమబ్బులు నెమ్మదిగా నల్లరంగు బట్టల్ని ధరిస్తున్నట్టుంది. సూర్యుడు సైతం పడమటింటి ముఖం పట్టాడు. పారాహుషార్ అని ఎవరో నింగి నుంచి భీకరంగా అరిచినట్టు ఒక మెరుపు మెరిసింది. నల్లమబ్బు తెర తెరిచి వాన జాణ నాట్యం ప్రారంభించింది., తొలి అడుగు రవి మణికట్టుపై పడింది చినుకు లాగ., , ,
అరే., రవి బేటా రేపట్నుంచి ఇంకో రెండు క్యాన్లు అదనంగా కావాలి అన్నాడు సేట్ వాటర్ క్యాన్ లోపల పెడుతున్న రవితో., అలాగే సేట్ తప్పకుండా అంటూ భుజం మీద పడ్డ నీటి మరకల్ని తుడుచుకుంటూ సేట్ దగ్గరికొచ్చాడు రవి.,
ఇదిగో ఈ నెల మొత్తం పేమెంట్.,
థ్యాంక్స్ సేట్ అని సేట్ ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని అక్కడనుంచి కదిలాడు., !
అపార్ట్మెంట్ లో అన్ని ప్లాట్స్ కీ వాటర్ క్యాన్స్ డెలివరీ చేసి కలెక్షన్ తీసుకుని ఆఫీసులో ఇచ్చి ఇంటికొచ్చేసరికి రాత్రి 7:00 అయ్యింది., రూమ్ లోకి అడుగు పెడుతూనే ఫోన్ తీసి డైల్ చేశాడు రవి.
” ఏరా., ఎక్కడా., అవునా., నాకు చెప్పనేలేదు మరి., ! అంతేలేరా మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి అయితే అన్నీ షేర్ చేస్తారు మాకెందుకు చెప్తారులే, వద్దులే ఇప్పుడు ఎందుకింకా., హా., ఓకే ఓకే., సరే సండే కలుద్దాం మరి., బై రా., “అని ఫోన్ కట్ చేసాడు.
రైస్ కుక్కర్ లో రైస్ పెడుతుండగా ఫోన్ మోగింది. రవి రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసి కాల్ లిఫ్ట్ చేసాడు. “హాయ్ రా !బావా ఏంటి చాలా రోజులకి గుర్తొచ్చినట్టున్నా., అవునా!హే సూపర్ రా ఓకే రేపు ట్రైన్ దిగగానే కాల్ చెయ్. వచ్చి పిక్ చేస్కుంటా., ”
*********************
“ఇంకా ఎంత దూరంరా., అన్నాడు శివ తన ట్రావెలింగ్ బాగ్ ని భుజం పై ఎగేస్కుంటూ.,
“పక్కనే రా., అదిగో ఆ డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మూడో ఇల్లే మన రూమ్ “అంటూ శివ కన్నా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పాడు రవి.
ఇద్దరూ రూమ్ దగ్గరికొచ్చారు. రవి తాళం తీస్తూ “ఇదివరకు బోరబండలో ఉండేవాడ్ని బావా! కానీ మా ఆఫీసు నుంచి రూమ్ కి రావాలంటే ఒక్కోసారి బస్ దొరకడం కష్టం , ఒకవేళ దొరికినా సీటు దొరకడం కష్టం ,ఒకవేళ అదికూడా దొరికినా రూమ్ కి వెళ్ళే వరకు కూర్చోడం కష్టం., ఇన్ని కష్టాలు పడలేక ఆఫీసుకి దగ్గరగా ఉంటుందని ఇటు షిఫ్ట్ అయ్యా.,
“ఓహ్., అన్నాడు శివ రవి చెప్పిందంతా విని తాపిగా. “వాటర్ క్యాన్స్ డెలివరి అని ఏదో చెప్పావు కదా?మరి ఆఫీస్ ఏంట్రా అనడిగాడు శివ క్వస్చిన్ మార్క్ ఫేస్ పెట్టి.
డెలివరి యే రా., కాని కొంతమంది డైలీ పేమెంట్స్ చేస్తుంటారు., కలెక్షన్., అది హ్యాండ్ ఓవర్ చేయాలి కదా., !అదీ కాక మిగిలిన క్యాన్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఎమ్టీ క్యాన్స్ గోడౌన్ కి పంపాలి., అబ్బో., , మన జాబ్లో ఉండే పత్త్యాపారమే వేరులే గాని !ఇంతకీ ఏం తింటావ్ “అనడిగాడు రవి!
పరుపు మీద నడుం వాల్చి సెల్ ఫోన్లో మెసేజ్ చూసుకుంటూ తను చెప్పిందానికి ఊ కొడుతున్న శివతో., “ఏదోకటి తీస్కురా అన్నాడు శివ.
“హా సరే ఈ లోపు నువ్వు ఫ్రెష్ అవ్వు పేస్టు కావాలంటే ఆ బాగ్ పై జిప్ లో ఉంటుంది తీస్కో” అని బయటకి వెళ్ళిపోయాడు రవి !

“బావా !రూమ్ లో బోర్ కొడుతుంది రా అన్నాడు శివ రవికి కాల్ చేసి.
“ఇంటర్ వ్యూ ఏదో ఉందన్నావ్ కదరా!అయిపొయింది రా., అది జస్ట్ రిటన్ టెస్ట్ అంతే., , అవునా., , సరే మళ్ళి చేస్తా అని కాల్ కట్ చేసాడు రవి.,
శివ రూమ్ లో వెల్లకిలా పడుకుని ఉన్నాడు ఇంతలో ఎవరో డోర్ కొడుతున్నారు. శివ లేచి వెళ్లి చూసేసరికి ఎదురుగా రవి ఉన్నాడు.
“ఏంట్రా అప్పుడే వచ్చేసావ్ అని ఆశ్చర్యంగా అడిగాడు శివ నవ్వుతూ లోపలికొస్తున్న రవిని., “బోర్ కొడుతుందన్నావ్ కదరా !స్టమక్ పెయిన్ అని చెప్పి వచ్చేసా., సరే పద. అలా సినిమాకెళ్ళి అట్నుంచి అటే బావర్చికి వెళ్లి బిర్యానీ తినోద్దాం., “అని బయటకు నడుస్తూ అన్నాడు రవి., !
శివ వచ్చి అప్పటికే నెలపైన అయ్యింది ఇంటర్ వ్యూస్ కి వెళ్తున్నాడు గాని జాబ్ మాత్రం రావట్లేదు. ఈ నెల రోజులు శివ ఖర్చు మొత్తం రవియే భరించాడు. కానీ నెలకు పది వేలు సంపాదన అందులోనే రెంటు ,కరెంటు భోజానం వగైరా వగైరా ఖర్చులన్నీ చూసుకోవాలి., ఇంటికి నెల నెలా కనీసం రెండు మూడు వేలైనా పంపాలి. రవికి కూడా కాస్త కష్టం అనిపించింది., , కానీ రవి అవేవి పట్టించుకోలేదు., స్నేహితులకి కాకపోతే ఇంకెవరికి చేస్తాం అనుకున్నాడు.,
“బావా వీడు శేఖర్. నాతో పాటే బి. టెక్ చదివాడు., ఈడు రవి నా చిన్నప్పటి ఫ్రెండ్ అని ఒకరికొకరిని పరిచయం చేసాడు శివ. ! శేఖర్, రవి ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు., “బావా ! స్మాల్ హెల్ప్ రా వీడు కూడా జాబ్ ట్రైల్స్ లో ఉన్నాడు. మొన్నటి దాకా హాస్టల్ లో ఉన్నాడు. కానీ బర్డెన్ ఎక్కువవుతుంది అని ఎక్కడైనా రూమ్ షేరింగ్ దొరుకుద్దేమో అని చూస్తున్నాడు., నువ్వు ఓకే అంటే మనతో పాటు ఉంటాడు., ప్రోబ్లం ఏం లేదు షేరింగ్ యే లే., ఏమంటావ్?” అనగానే.,
“దాందేముంది బావా ఉండమను లగేజ్ తెచ్చుకున్నావా అనడిగాడు పేలవంగా చూస్తున్న శేఖర్ ని రవి., ఏదో ఏమరుపాటులో ఉన్న శేఖర్ “లేదు బ్రో ఇవినింగ్ తెచ్చుకుంటా., థాంక్స్ బ్రో అన్నాడు మహదానందంగా !
****************************
“మామా., రావాలి త్వరగా.,” అంటూ బాత్ రూమ్ లో ఉన్న శేఖర్ ని పిలిచాడు రవి.,
ఆ వస్తున్నా మామా అంటూ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాడు శేఖర్ అప్పటికే రవి పక్కన స్థిరంగా కూర్చున్నా శివ పక్కన.,
!”రెంట్ ౩౦౦౦/- రా డివైడెడ్ బై 3 సో పర్ హెడ్ 1000 /- ఇంకా కర్రిస్ కి 1880 అయ్యింది డివైడెడ్ బై 3 చేస్తే., మ్., మ్., మ్., , అని నోటి లెక్క వేస్తున్నాడు రవి.,
925 /-రా రౌండ్ ఫిగర్ నేను చుస్కుంటాలే చెరో 925 /- ఇవ్వండి చాలు “అనగానే ” బావా లాస్ట్ వీక్ నేను ఊరెళ్ళా కదా రా !అని అన్నాడు శివ!
వెంటనే రవి ఒక్క క్షణం ఏదో ఆలోచనలో పడ్డాడు వెంటనే తేరుకుని., “ఆ! సరే ఉండు అని మళ్ళీ లెక్క వేసి “నువ్వు 750 /- ఇవ్వరా అనగానే శివ తలూపాడు., రిమైనింగ్ 125 /- మనిద్దరం షేర్ చేస్కోవాలి రా అన్నాడు రవి శేఖర్ తో., !”ఓకే మామా బట్ ఈ మంత్ 500 /-ఇస్తా రా నెక్స్ట్ మంత్ మిగితా అమౌంట్ ఇస్తా., నాన్న ఈ మంత్ తక్కువ వేసారు అకౌంట్ లో కుంచెం టైట్ అంట., “అని అనగానే రవి పెదవి ముడిచి ఓకే ఓకే లైట్ లే తర్వాత చూస్కుందాం అని ఊరుకున్నాడు., !
****************************
అలా మరో రెండు నెలలు గడిచాయి., ఈ మధ్యలో శేఖర్ కుడా తన స్నేహితుడ్ని తీసుకువచ్చి రూమ్ లో షేరింగ్ కి పెట్టాడు., రవి పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వస్తాడు., వీళ్ళు ముగ్గురు ఇంటర్ వ్యూస్ కి వెళ్ళడం లేకపోతే రూమ్ లో ఉండడం., మధ్యాహ్నం ఎవడికి ముందు ఆకలేస్తే వాడు రైస్ పెడతాడు., రాత్రి డ్యూటీ రవికి తప్పదు., అత్యవసరాలకి తప్ప మరే వాటికి ఎవ్వరూ పైసా తియ్యరు. రవి తెచ్చే వాటినే వాడుతారు., కాలం వేగంగా కదిలింది కొన్ని జీవితాల్లో వెలుగును సైతం నింపింది., , , !
“మామా జాబ్ కన్ఫర్మ్ అయ్యింది రా., కాని హైటెక్ సిటి లో., అంటూ సజావుగా చెప్పాడు శేఖర్ బట్టలు జాడిస్తున్న రవితో.,
“హైటెక్ సిటి యే కదా ! మైత్రివనం దగ్గర 10 హెచ్ బస్ ఎక్కితే 45 మినిట్స్ లో వెళ్ళిపోతావ్., ఇంతకీ టైమింగ్స్ ఏంటి అనడిగాడు రవి మాములుగా., శేఖర్ నీళ్ళు నములుతూ “మామా హైటెక్ సిటి షిఫ్ట్ అవుదామనుకుంటున్నా., మా స్కూల్ ఫ్రెండ్స్ అక్కడే ఉంటున్నారు సో వాళ్లతో పాటు షేరింగ్ కి వెళ్దాం అనుకుంటున్నా ఆఫీసుకి కూడా బాగా దగ్గరే., సో బాలన్స్ ఏమైనా ఉంటే లెక్కేసి చెప్పు మరి వెళ్ళేముందు క్లియర్ చేస్తా” అనగానే రవి సగం పెదవి దాటని నవ్వొకటి నవ్వాడు.,
“జాబ్ వస్తే గాని రావద్దన్నారా స్కూల్ ఫ్రెండ్స్’అన్నాడు శ్యాం వెటకారంగా. రవి పక్కకు తిరిగి ఫక్కున నవ్వాడు బట్టలు జాడిస్తూ., “ఆపు బే నా ఫ్రెండ్స్ కనీసం అలా అయినా అన్నారు. నీ ఫ్రెండ్స్ లాగా రూమ్ లో ఉండి కూడా సినిమాకి వెళ్లాం అని చెప్పి తప్పించుకునే బాపతి కాదులే గాని ఎల్లుబే చెప్పావ్ గాని అంటూ శ్యాం ని దెప్పాడు.,
నిజానికి శ్యాం అన్నది కూడా కరక్ట్టే., జాబ్ వచ్చేవరకు రవి రూమ్ లో ఉన్నాడు శేఖర్., ఇప్పుడు జాబ్ రాగానే ఫ్రెండ్స్ దగ్గరకి షిఫ్ట్ అయిపోతున్నాడు., అదేదో ముందే వెళ్లి ఉండచ్చుగా., అవసరాన్ని బట్టి మనిషి ఉంటాడో మనిషిని బట్టి అవసరాలుంటాయో ఆ దేవుడికే ఎరుక.,
అపార్ట్మెంట్ లో వాటర్ క్యాన్స్ డెలివరి చేస్తున్నాడు రవి., ఒక్కొక్క ప్లాట్ కి సప్లై చేసుకుంటూ వస్తున్నాడు. 305 దగ్గరొచ్చి బెల్ కొట్టాడు. డోర్ తీసేసరికి., ఎదురుగా బిల్ బుక్ మీద ఏదో రాసుకుంటున్న శివ
కనిపించాడు రవికి.
“హే ఇక్కడున్నావెంట్రా? సింగపూర్ టౌన్ షిప్ దగ్గర ఆఫీస్ అన్నావ్., అనడిగాడు రవి !మొన్నటి వరకు అక్కడే ఉన్నా బావా రీసెంట్ గా షిఫ్ట్ అయ్యా ఇక్కడికి., సండే నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా నీకు., ” అంటుండగా…
“సార్ మీ కరంట్ బిల్ మొత్తం టూ మంత్స్ ది కలిపి వచ్చింది” అన్నాడు వాచ్మెన్ హడావిడిగా వచ్చి., శివ మొహం వివర్ణమైంది., “వాటర్ క్యాన్ కావాలా అన్నాడు మామూలుగా., కావాలని తల ఉపాడు శివ., , అతని గొంతులో ఒక నిజం గుటక వేసింది.,
ఎందుకిలా ఉన్నారు అసలు మనుషులు. రీసెంట్ గా మొన్ననే వచ్చా అన్నాడు తీరా చూస్తే రెండు నెలల కరెంట్ బిల్ అసలు అబద్ధం చెప్పాల్సిన పనేముంది అని తనలో తను అనుకుంటూ వెళ్తున్నాడు రవి.
********************
క్రమేపి శేఖర్ శ్యాం కూడా వేరే రూమ్స్ కి షిఫ్ట్ అయిపోయారు. రవి యదావిధంగా ఒక్కడే ఉండిపోయాడు., గట్టిగా చెప్పాలంటే ఒక్కడే మిగిలిపోయాడు. “వెళ్ళిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎవ్వదూ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. కనీసం ఒక మెసేజ్ కూడా. కేవలం అవసరం కోసం వాడుకున్నారంతే. ఫ్రెండ్ షిప్ తొక్క ఏం లేదు. ఒక్క నా కొడుకు రూపాయి తీసేవాడు కాదు. నాకు దూలేక్కి బిర్యానీలు, బీర్లు తెచ్చి తాగండ్రా, తినండ్రా అంటూ హడావిడి చేయటం తప్ప ఒక్కటంటే ఒక్క రోజు వాళ్ళు తెచ్చిన పాపాన పోలేదు. ఎప్పటికప్పుడు మనోళ్ళే కదా అని అనుకుంటూ పోయాను. ఇంత కూడా విశ్వాసం లేదు. !స్నేహం అంటే ఇంతేనా., ! అవసరానికి అక్కున చేరటం అవసరం తీరిపోగానే మొహం తిప్పుకుపోవడం. ఛ., జీవితంలో ఎవ్వరిని దగ్గరకి కూడా రానివ్వను. పేరుకే ఫ్రెండ్ షిప్ అదీ ఇదీ ఎవడి స్వార్ధం వాడిది.
వర్షం నెమ్మదిగా వెలిసిపోతోంది., ఆకాశం ఒళ్ళు ఆరబెట్టుకుంటుంది. నేల అప్పుడే స్నానం చేసిన దేహంలా ఉంది. పగటి గట్టుకి,రాత్రి గట్టుకి మధ్య సంధ్య., నదిలా ఉంది. రవి ఆ కాకి వైపు అలా చూస్తున్నాడు. వర్షం పూర్తిగా వెలిసింది వెంటనే ఆ కాకి చెట్టు పై నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. ఒక్క సారిగా రవి చకితుడయ్యాడు. అతని భ్రుకుటి ముడి పడింది. “వర్షం పడినంత సేపు కాకి చెట్టు పైనే ఉంది. తగ్గగానే టక్కున ఎగిరెళ్లి పోయింది. బహుశా ఆహరం కోసమేమో., !వాన తగ్గినా అక్కడే ఉంటే దాని మనుగడ ఎలాగ మరి., !కానీ కాకికి ఆశ్రయం ఇచ్చిన చెట్టు., , కాకి ఎగిరి పోగానే బాధ పడలేదే , విరిగి పడలేదే. మరి నా స్నేహితులు నన్ను వదిలి వెళ్లిపోయారని నేనెందుకు బాధ పడుతున్నాను. ఈ సృష్టిలో అన్నిటికన్నా ప్రధానమైంది మనుగడ., ఎవరి గమనం వాళ్ళది ,ఎవరి గమ్యం వాళ్ళది. ఎవరూ ఎవరితో శాశ్వతంగా ఉండిపోరు. ఒకవేళ అలా ఉండాలని కోరుకోవడం ముర్ఖత్వమవుతుంది. “అని రవి తనలో తాను తర్కించుకుంటూ ఉండగా., , ఫోన్ మోగింది రవి లిఫ్ట్ చేసాడు., , అవతల నుంచి., “బావ హైదరాబాదు కి జాబ్ ట్రైల్స్ కి వస్తున్నా., రా! నీ రూమ్ లో కొన్నాళ్ళు ఉండచ్చా. షేరింగ్ యే బావ “అంటున్న అవతలి వ్యక్తి మాటల్ని వింటున్న రవి., మళ్ళీ ఎందుకో అలా ఆ చెట్టు వైపు చూసాడు. ఆ చెట్టుపై ఒక పావురం వచ్చి వాలింది. దానిని చూడగానే రవి పెదవి విచ్చుకుంది. అచ్చం ఆ పావురమంత తెల్లగా, స్వచ్చంగా ఉంది అతని చిరునవ్వు., !

“నిజానికి చెట్టుకి, పిట్టకి ఏ సంబంధం లేదు. కానీ ఏ సంబంధం లేని బంధమే స్నేహ బంధం.
స్నేహం ఎప్పుడూ ఆదరిస్తుందే గాని ప్రతి ఫలం ఆసించదు., , !”

విశ్లేషణ: డా.మంథా భానుమతి
మనిషి లోని స్వార్ధం, స్నేహాన్ని అవసరానికి వాడుకోమని, వాడుకున్నాక ఆ సహాయాన్ని మర్చిపోయి ఏరు దాటి తెప్పతగలేసిన విధంగా స్నేహితుల్ని మర్చిపొమ్మని ప్రేరేపిస్తే, స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి నిస్వార్ధంగా సహాయపడుతూనే ఉంటాడు. ఈ రెండుకోణాలనీ స్పృశిస్తూ మాలతీ దేచిరాజుగారు రాసిన ఈ కథ మానవులలోని సహజ లక్షణాలని పాఠకుల కనుల ముందుంచుతుంది.
మాలతిగారి కథలో వర్ణనలు మనసుకు హత్తుకునే పోలికలతో మనో రంజకంగా ఉంటాయి. ఉదాహరణకి.,
“నల్ల మబ్బు తెర తెరిచి వాన జాణ నాట్యం ప్రారంభించింది., తొలి అడుగు రవి మణికట్టుపై పడింది చినుకు లాగ., , , ” బాగుంది కదూ?
తను చేసేది చిన్న ఉద్యోగమైనా కూడా మానవత్వంతో వచ్చిన వారిని ఆదరించిన రవిని వాడుకుని, తమకి ఉద్యోగం వచ్చిన వెంటనే కుంటి సాకులతో వదిలేసి, మళ్లీ ఫోన్ కూడా చెయ్యని స్నేహితులని చూసి రవి ఆశ్చర్య పోవడం చాలా సహజంగా ఉంది. డబ్బు ఖర్చు పెట్టించి, పని చేయించుకుని వెనక్కి తిరిగి చూడకుండా పోయేవారు కనిపిస్తూనే ఉంటారు. ఆ స్నేహాన్ని నిలుపుకుంటే పోయేదేం లేదు. అయినా సరే, చిన్న ఉద్యోగి కదా., ఏదైనా సాయం కోసం తమ వెంట పడితే., స్వార్ధం కృతజ్ఞత అనే పదానికి అర్ధం తెలియనియ్యదు.
ఇంత అనుభవం అయినా కూడా తనని చెట్టుతో, స్నేహితులని పక్షులతో పోల్చి, మళ్లీ ఇంకొక మిత్రునికి సహాయపడడానికి తయారయిన రవి వంటి వారి వల్లనే స్నేహం అనే పదం నిలిచిందని చెప్తారు రచయిత్రి.
మాలతీ దేచిరాజు కవితలల్లడంలో, కథలు రాయడంలో కూడా నిష్ణాతులు. సామాజిక సేవలో నిమగ్నమై, ఎక్కుగా రచనల మీద దృష్టి నిలపక పోవడంతో ఆవిడ పేరు తక్కువగా వింటాం మనం.

7 thoughts on “స్నేహ బంధం ప్రమదాక్షరి కథామాలిక – స్నేహం

  1. భావుకతకి అక్షర రూపమే మాలతమ్మ అని నేను భావిస్తాను. తను రాసిన కథలన్నీ ఆణిముత్యాలు… ఈ కథలోని వర్ణనలు మనసును ఆకట్టుకుంటాయి… అంతే కాక, చిన్న ఉద్యోగం చేస్తూ, కొద్దిగా జీతం తెచ్చుకుని, ఒక చిన్న రూమ్ లో ఉంటున్న రవి అనే యువకుడు, తన దగ్గరికి (నగరానికి) వచ్చిన చిన్న నాటి స్నేహితులనూ, వారి వారి స్నేహితులనూ కూడా ఎంతో చక్కగా ఆదరిస్తాడు. అయితే రెక్కలొచ్చిన పక్షి పిల్లలు గూడు వదిలి పోతున్నట్టు ఆ స్నేహితులు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడతాడు రవి. స్నేహం అనేది ఇరువైపులా ఉండాలి కదా, లేదే అన్న క్షోభ…

    కానీ చెట్టుకొమ్మ మీదున్న ఒక కాకి ఎగిరి వెళ్ళిపోతున్నపుడు జ్ఞానోదయం అవుతుంది… అవును.. స్నేహం ఎప్పుడూ చెట్టుకొమ్మయే. ఆశ్రితులైన వారిని ఆదరించటమే స్నేహం యొక్క ధర్మం… *ప్రతిఫలాన్ని ఆశించకుండా…

    ఈ జ్ఞానాన్ని అలవరచుకుంటే స్నేహం ఎప్పుడూ సంతోషాన్నే ఇస్తుంది… ఆరుద్ర గారి మాటల్లో ‘ఇచ్చుటలో ఉన్న హాయి, వేరేచ్చటనూ లేనే లేదు మరి…’

    హృదయపూర్వక అభినందనలు మాలతి అక్కా నీకు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *