April 24, 2024

పూర్తి సంతృప్తినిచ్చే..”పూర్వి” కధా సంపుటి

సమీక్ష – టేకుమళ్ళ వెంకటప్పయ్య.

poorvi600

తొలి కధగా గురజాడ “దిద్దుబాటు” వచ్చి ఒక శతాబ్దకాలం దాటింది. కాలానుగుణంగా నాలుగు తరాలనుండి రచయితలు/రచయిత్రులు ఆధునిక తెలుగు కధను నిలబెట్టి ప్రాణంపోస్తున్నారు. ఇటీవల కధా వస్తువుల్లో వైవిధ్యం పెరిగడంతో బాటూ శిల్ప ప్రాధాన్యతా పెరగడం గమనించవచ్చు. లబ్ధప్రతిష్టులైన ఎందరో రంగమధ్యంలో నిలబడి కధను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే నిరంతర కృషి కొనసాగించడం ప్రశంసనీయం.
నవ్వడంకోసం లాఫింగు క్లబ్బులకి వెళ్లనక్కరలేదు. ఓ మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం,పానుగంటి లక్ష్మీనరసింహం పంతులు గారి సారంగధర నాటక ప్రదర్శన, భమిడిపాటి రాధాకృష్ణ కధలు నాటకాలు, తెనాలి రామకృష్ణుని కధలు లాంటివి తెలుగులో ఎన్నో ఉన్నాయి అంటారు రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి. కధా, నవలా రచయిత్రిగా, కాలమిస్ట్ గా విజయలక్ష్మిగారి పేరు పాఠకలోకానికి ఆమె తొలి కథ ‘స్క్రిప్ట్ సిద్ధంగా వుంది-సినిమా తియ్యండి’(1982) అనే ఒక వ్యంగ్య రచన నుండి మనకు తెలుసు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా కధా రచయిత్రిగా ప్రేక్షకులకు అభిమాన రచయిత్రి గా మారారు. ఆమె ప్రాధాన్యత వ్యంగ్య హాస్య రచనలే అయినా విజయలక్ష్మిగారు బహుముఖీనమైన కధన కౌశలం చూపడం మనం గమనించదగ్గ విషయం. మానవ సంబంధాలు ఆప్యాయతలు, ప్రేమలు అభిమానాలు అచ్చతెలుగు వంటకంలా వండి వార్చి, ఆర్ద్రతతో పోపువేసి చదువరులకి గాఢమైన మధురానుభూతులు కలిగించడం నేను ఇటీవల ఆమె “ఆత్మకధ” అన్న నవలికలో గమనించాను. ఆధునికసాంకేతికత, శాస్త్రవిజ్ఞానం ఎంత శిఖరాగ్రాలనధిరోహించినా కుటుంబ బంధాలు-అనుభందాలు అనిర్వచనీయంగా శాశ్వత స్థానంలో ఉంటాయనే భావోద్వేగం మాత్రం “భారత రసాయన శాస్త్రం” గా కలకాలం విశ్వంలో నిలిచే ఉంటుందని అంటారు ఆవిడ. ఆమె కధలు మనుషులు-మానవత్వపు విలువలు వాటిలోని అనంతపార్శ్వాలు అనుభవవైవిధ్యముతో సాక్షాత్కరిస్తాయి. కొన్ని కధలు సాంస్కృతిక విలువలపట్ల ఆమె పడే ఆరాటానికి గుర్తులు.
ఇటీవల విజయలక్ష్మిగారు ఆవిష్కరించిన కధా గుఛ్చం “పూర్వి”. సలక్షణమైన పదహారణాల, పదహారు కధలు ఈ సంపుటిలో మనకు దర్శనమిస్తాయి. మొదటగా “పూర్వి” అనే కధ గురించి చెప్తాను. ఈ కధ నవ్య వారపత్రికలో జనవరి, 2015 లో వచ్చింది. అల్లరి చిల్లరగా తిరిగే హరి అనే కుర్రవాడు తన అక్క గొలుసు దొంగతనం చేసి, డార్జిలింగుకు పారిపోయి పూర్వి అనే ఓ టీ దుకాణం అమ్మాయితో పరిచయం పెంచుకుని ఆమెను వివాహం చేసుకున్నాక, యాక్సిడెంట్లో చనిపోతాడు. ఆ తర్వాత పూర్వి హరి తల్లిదండ్రులవద్దకు వచ్చి ఆ వృత్తాంతం చెప్పడం, హరికి వచ్చిన ప్రమాద భీమా తాలూకు డబ్బులు వాళ్ళకు ఇవ్వడం. ఇదీ కధ. వస్తు స్వీకరణ, శిల్ప నిర్వహణ కొత్తపంధాలో సాగి, చివరగా పూర్వి తిరిగి వెళ్ళెటప్పుడు “రైలు వచ్చింది. అందరి పాదాలకు నమస్కారం చేసి రైలెక్కింది పూర్వి. సీట్లో కూర్చుంది. కళ్ళవెంట నీళ్ళు కారి బుగ్గలను తడిపేశాయి. హరి మరణంతో మండిపోతున్న మనసుకు స్వాంతన కలిగింది”. ఇది చాలా మంచి ముగింపు. కధావస్తువును కధగా మలిచేటప్పుడు మంచి శ్రద్ధ కనపరచింది రచయిత్రి. సహజ చిత్రణ ద్వారా కావలసిన గాంభీర్యం సాధించిన శిల్పవిశేషం గొప్పది. పాత్రల మధ్య ఉన్న సంబంధాలకు శాశ్వతత్వం కలిగించడం బావుంది. జాయిస్ చెప్పిన చెప్పినట్లు కధ చదివాక కలిగే “ఎపిఫొనీ”( సాక్షాత్కారం) నాకు ఈ కధలో కలిగింది.
“బాలరాజు కధ” లో బాలరాజు ఎలెక్ట్రీషియన్ ఉద్యోగం కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్ళి వంటవాడుగా మారిన విధానం హాస్యం పుట్టించినా, కృతజ్ఞతగా తన గురువును వెదికి వెదికి కలుసుకోవడం, చివరలో గురువు గుర్తుపట్టగానే చిన్న పిల్లాడిలా వలవలా ఏడవడం చదివాక, ప్రస్తుతం మానవ సంబంధాలు పూర్తిగా కమ్మర్షియలైజ్ అయిపోయాయన్న మన ఫీలింగు లో మార్పు వస్తుంది. అనాటి సమిష్టి కుటుంబాలు నేడు కనుమరుగయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అని బ్రతుకులీడుస్తున్న కాలంలో “ఆనాటి ముచ్చట్లు” కధ మనకు స్వాంతననిస్తుంది. బావ మరదలి వివాహం, తదనంతర ముచ్చట్లు చక్కగా పండాయి. “సుఖాంతం” కధలో పాఠకులకు ఆదర్శకుటుంబం అంటే ఏమిటి? అనే విషయం తెలుస్తుంది. కుటుంబ సభ్యులు అంటే ఆస్తులు పంచుకోడం మాత్రమే కాదు..కాస్త ఆప్యాయతలు అనుబంధాలు కూడా పంచుకుంటే కలిగే తృప్తి వర్ణనాతీతమని వేణు కుటుంబం ద్వారా తెలుసుకున్న తర్వాత కలిగిన మారిన మనిషి పాత్రగా శ్రీలక్ష్మి పాఠకులకు గుర్తుండిపోతుంది. వృద్ధాప్యంలో…తమ్ముడి కొడుకింటికి వెళ్ళి భోజనం లేకుండా హోటల్ లో తినడం నేటి మన ఆధునిక జీవనవిధానాలకు అద్దం పడుతుంది. కాలంతో పాటూ మారాలి.. “ఇంకా మారాలి”. మారాల్సింది అందరూ కాదు కొందరు మాత్రమే! మనసుపెట్టి చదివితే ప్రేమ, ఆప్యాయతలకు తిలోదకాలిస్తూ, డబ్బుకు మాత్రమే విలువనిచ్చే నేటి తరానికి కనువిప్పు కాగలదు. అయినవాళ్ళకు అవసరానికి అప్పిచ్చి ఆదుకుని ఆ బాకీ తీర్చకపోగా బంధువులు రాబందులుగా మారి ఓ వృద్ధునికి మనస్తాపం కలిగించడం.

“పుణ్యాత్మురాలు” కధలో చూస్తాం. వృద్ధులైన తల్లిదండ్రులను వంతుల వారీగా లెక్కకట్టి చూసుకుంటున్న ప్రబుద్ధుల చర్యలు, వారి దురవస్త “ఒక ప్రయాణం” లో ఉన్న యువకుడికి మనస్తాపం, కనువిప్పు కలిగిస్తాయి. పెళ్లంటే నూరేళ్ల పంట. నిలువెత్తు ధనం ఉన్నా, ఆదర్శవంతం కాలేని కుటుంబాలు ఎన్నో. బామ్మ మాట విని తన జీవితాన్ని సుగమంగా మార్చుకున్న ఆధునిక యువతి కధ, ఈనాటి ప్రతి కన్నె పిల్ల చదివి తీరాల్సిన కధ “చల్లని దీవెన”. కార్యేషుదాసి గా ఉన్న స్త్రీలు పట్టుదల వస్తే ఎంత కఠినంగా మారతారు అనేది తెలియజేస్తూనే..వారికి కావలసింది కూసింత ప్రేమ అని బోధ కలిగిస్తుంది “ఆడవారికి ఆవేశం వస్తే!” కధ. ఇంటిలో కళాకారులు సాహితీ వేత్తలూ ఉంటే సంతోషం వారికీ.. బాధలు కుటుంబ సభ్యులకూ..శాలువాలు, సన్మాన పత్రాలు, షీల్డులు సర్దలేక పడే ఇబ్బంది చదివి తీరాల్సిందే! “ఎవరో ఒకరు ఎప్పుడో అపుడు” కధలో తెలుస్తుంది. పట్టణాల్లో ఇళ్ళల్లో భీభత్సం సృష్టించే వానరాలను తప్పించుకోవడము కష్టమే! సీతారాములు కోతులపని పట్టడంలో దిట్ట, ఆపని సులువుగా చేయగలడు. దాన్ని ధనార్జన సాధనంగా మార్చుకున్న వైనo నవ్వు తెప్పిస్తుంది “సీతారాములు – కోతులు” కధలో. కొత్తగా ఫేసుబుక్కు, వాట్సప్పు నేర్చుకున్న వృద్ధులు దాంతో వచ్చే అగచాట్లు మనలను కడుపుబ్బ నవ్విస్తాయి “బ్లాగుతో కధ సుఖాంతం” కధలో. కాశీపతి శివుడిని నమ్మి జీవితాన్ని సాగించడం, ఎవరినీ ఋణంకోసం, సహాయం కోసం ఆశించకపోవడం, దేవుడున్నాడు అని నమ్మే వారికి తప్పక సహాయం లభిస్తుందని తెలియజెప్పే కధ “ఈశ్వరానుగ్రహం”. కధలు “కొత్త కోణం” లో రాసి అవార్డు తెచ్చుకోవాలనుకున్న ఓ రచయిత్రి పాట్లు మనలను నవ్విస్తాయి. మతిమరుపు చాదస్తం ఉన్న ఓ బామ్మ చెప్పే తింగరి కధల ద్వారా టీ.వీ ఛానల్స్ లో అవకాశం పొంది గొప్ప రచయిత గా రాణించే ఓ ప్రబుద్ధుడి కధ “శ్రీదేవమ్మగారి మామిడి తోరణం”.
చివరగా “నేను చూసినవి, అనుభవించినవి, హృదయంతో తెలుసుకొన్నవి కధకుడిలో కలిసిపోయి దృక్పధం ద్వారా మార్పుకు గురై, కొత్త స్వరూపంతో కొంతకాలానికి కధగా ఆకృతి తెచ్చుకుంటాయి. రాజకీయ, ఆర్ధిక సిద్ధాంతాలు చెప్పడానికి కధలు రాయనక్కరలేదు. వీటికి అతీతంగా మనిషి మనిషిని ప్రేమించగల ఉన్నత తాత్త్విక స్థితిని తెలియజేసే కధలు కావాలి. లోకంలో తెలిసినదాని వెనుకవున్న తెలియనిదానికీ, తెలిసిన మనిషిలో దాగిఉన్న తెలియనితనమూ నాకు ఆసక్తి కలిగిస్తాయి.” అన్న ప్రముఖ కధకుడు బుచ్చిబాబు మాటలను ఈనాటి పాఠకులకోసం ఉటంకిస్తూ ముగిస్తున్నాను.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *