March 28, 2024

బాలమురళి – స్వర్గప్రస్థానం

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్)

చిత్రం: శివప్రసాద్

sbk

ఆవె-1:
బాలమురళి యనెడు భానుడీ భువియందు
వెలిసి నింపినాడు వెలుగుతోటి
గానకోవిదుండు కన్నుమూయగ నేడు
కారు చీకటిచట కమ్ముకొనెను

ఆవె-2:
రాగమాలపించి రాళ్ళనే కరిగించె
సుస్వరమ్ములందు చూపె పటిమ
పరవశింపజేసె భక్తి తత్వములందు
తిల్లనాలలోన దిట్టయతడు

ఆవె-3:
కొత్తరాగములను కొన్నింటి సృష్టించి
కొత్త నడకలందు కూర్చినట్టి
భాషలారిటందు బహుమూల్యమౌ పాట
లందజేసి యెక్కెనందలమ్ము

ఆవె-4:
బాలమురళి పాట పరదేశములనుండు
రసికులెంతొ మెచ్చి రత్నమనిరి
భరతజాతికూడ భరతరత్నమ్మిచ్చి
సత్కరించవలయు సక్రమముగ

(అక్కడ స్వర్గలోకంలో దేవేంద్రుని సన్నిధిలో)
ఆవె-5:
బాలమురళియున్న బతికి యింకొన్నాళ్ళు
ఉనికి గంధరువులకుండబోదు
వేగ మోక్షమివ్వ వెతలుతప్పేనన్చు
కలహభోజుడెంతొ కలతచెందె

(నారదుడు పెట్టిన చిచ్చుకు స్పందించి ఇంద్రుడు కలవరపాటుకు లోనై భూలోకానికి వచ్చి బాలమురళితో ఇట్లనెను అనెను)

ఆవె-6:
వచ్చినానుచూడు బాలమురళికృష్ణ
బాగ స్వాగతమ్ము పల్కగాను
తెల్లయేన్గునెక్కి తేలియంబరముపై
దేవలోకమునకు నీవురార

ఆవె-7:
గానలహరి మునుగ గంధర్వులప్సరల్
దేవగణములచట దివినియదిగొ
వేచియుండిరయ్య వేయికన్నులతోటి
బాలమురళి కృష్ణ వచ్చుననుచు

ఆవె-8:
గానకళను నేర్వ గంధర్వులందరూ
ఆతురుతనుయుండిరచటచూడు
నీవుపాడుచుండ నింపాదిగానాడి
ఆదమరువ వేచిరప్సరసలు

(అని ఇంద్రుడు అత్యంత ఆత్మీయతతో బాలమురళిని స్వర్గానికి ఆహ్వానించగా)

ఆవె-9:
అలసియుండెనేమొ ఆయువైపోయెనో
అంతరించెనేమొ అతని శక్తి
కాదననక పిలుపు కదలి బాల్మురళిదే
పుడమి వీడి దేవపురముకేగె

ఆవె-10:
దేవతాదులెల్ల తీరిబారులు రెండు
పారిజాతపూల మాలవేసి
మత్తగజముమీద మర్యాదలన్జేసి
ఆవరించిరెంతొ నాదరమున

ఆవె-11:
నారదాంశజుడని నారదుండేయనెన్
దూరబంధువనెను తుంబురుండు
దివికి చెందుననుచు దేవతల్ పోటీలు
పడుచు కలుపుకొనగ పాటుబడిరి

(ఇక స్వర్గము చేరిన బాలమురళి కచేరీ ఏర్పాటు చేసి, గంధర్వులను సహకారగానం చేయమని, అప్సరసలను నాట్యం చేయమని ఆదేశించాడు ఇంద్రుడు. అప్పుడు అందరి మనసులలో కలిగిన భావన )

ఆవె-12:
పాడకున్న సరిగ పరువుపోకుండునే
యనుచు గాత్రశుద్ధి యత్నమందు
గంటలెన్నొ గడిపి గంధర్వులందరూ
చివరిగడియలోన సిద్ధమయిరి

ఆవె-13:
జటిలమైనరీతి జతులనాతడు చెప్ప
నడక తప్పెనంటె నాట్యమపుడు
కోపమున శపించి కూల్చునా యింద్రుండు
అనుచు భయము చెందిరప్సరసలు

ఆవె-14:
పాట మహిమవలన వజ్రాయుధముకూడ
పోయి సాన సోలి పోవునేమొ
దైత్యులపుడు వచ్చి దండెత్తిరంటె నే
నేమిచేతుననెను యింద్రుడపుడు

ఆవె-15:
దేవభాషకానిదేదైనభాషలో
పాటనతడుబాగ పాడెనంటె
అర్థమేమననుచు అడిగితే యెవరైన
తేలిపోవునేమొ దేవగురువు
(ఇక నా అరుతర్పణ)

ఆవె-16:
అవనిలోనివారినానందపరచగా
నీవులేవనేది నిజముగనుక
వినగదలచుకున్న వేలమార్గాలెన్నొ
మాకు కలవు గనుక మరువనెపుడు

1 thought on “బాలమురళి – స్వర్గప్రస్థానం

  1. very nice..భూలోకంలో చేసిన కచేరీలు చాలునని, ఇంద్రసభకి పిలిపించుకున్నట్లున్నారు దేవతలు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *